Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 171-2
సంపుటము: 2-345
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
విష్ణుఁడొక్కఁడే విశ్వాత్మకుఁడు
వైష్ణవమే సర్వంబును
॥పల్లవి॥
పరమేష్టి సేయు బ్రహ్మాండసృష్టియు
హరునిలోని సంహారశక్తి
పరగఁగ నింద్రుని పరిపాలనమును
అరసిచూడ శ్రీహరి మహిమ
॥విష్ణుఁ॥
యిలఁ బంచభూతములలో గుణములు
అల నవగ్రహ విహారములు
తలకొను కాలత్రయ ధర్మంబును
అలరఁగ నారాయణుని మహిమలే
॥విష్ణుఁ॥
అంతటఁగల మాయా విలాసములు
పొంతఁ బరమపద భోగములు
మంతుకు నెక్కిన మరి సమస్తమును
యింతయు శ్రీవేంకటేశు మహిమలే
॥విష్ణుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము