అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-2
సంపుటము: 2-363
రేకు: 174-2
సంపుటము: 2-363
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| దిక్కు నీవే జీవులకు దేవసింహమా తెక్కుల గద్దియమీఁది దేవసింహమా | ॥పల్లవి॥ |
| సురలెల్లాఁ గొలువఁగ సూర్యచంద్రులకన్నుల తిరమైన మహిమల దేవసింహమా నిరతిఁ బ్రహ్లాదుఁడు నీయెదుట నిలిచితే తెరదీసితి మాయకు దేవసింహమా | ॥దిక్కు॥ |
| భుజము లుప్పొంగఁగాను పూఁచిన శంఖుఁజక్రాల త్రిజగముల నేలేటి దేవసింహమా గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి- ద్విజమునిసంఘముల దేవసింహమా | ॥దిక్కు॥ |
| ముప్పిరిదాసులకెల్లా ముందు ముందే యొసగేటి- తిప్పరాని వరముల దేవసింహమా చిప్పల నహోబలాన శ్రీవేంకటాద్రిమీఁద తెప్పల దేలేటియట్టి దేవసింహమా | ॥దిక్కు॥ |


