Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-3
సంపుటము: 2-364
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
కన్నులపండుగలాయ కమ్మి సేవించేవారికి
సన్నల నీదాసులము సంతసించేము
॥పల్లవి॥
పడఁతు లిద్దరు నీపాదములు వొత్తఁగాను
కొడుకు బ్రహ్మదేవుఁడు కొలువఁగాను
కడుపులో లోకములు కడు జయవెట్టఁగాను
గుడిగొనె నీబ్రదుకు గోవిందరాజా
॥కన్ను॥
మెత్తఁగా శేషుఁడు నీకు మించుఁబరపై వుండగా
జొత్తు మధుకైటభులు సుక్కి వోడఁగా
హత్తి దేవతలు నిన్ను నందరుఁ బూజించఁగాను
కొత్తలాయ నీబ్రదుకు గోవిందరాజా
॥కన్ను॥
పరగి నీముందరను పంచబేరము లుండఁగా
గరిమఁ జక్రము నీకుఁ గాపై వుండఁగా
తిరమై శ్రీవేంకటాద్రి తిరుపతిలోపలను
గొరబాయ నీబ్రదుకు గోవిందరాజా
॥కన్ను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము