అధ్యాత్మ సంకీర్తన
రేకు: 175-3
సంపుటము: 2-371
రేకు: 175-3
సంపుటము: 2-371
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా చేతనే వరాలిచ్చీ శేషాచలేశుఁడు | ॥పల్లవి॥ |
| విశ్వరూపబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము ఐశ్వర్యస్వరా ట్టాసామ్రాట్టయిన బ్రహ్మము శాశ్వతబ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము యీశ్వరుఁడై మహరాట్టై యిందరిలో బ్రహ్మము | ॥ఈతఁ॥ |
| సూర్యునిలో తేజము సోమునిలో తేజము శౌర్యపు టనలుని భాస్వత్తేజము కార్యపు టవతారాలఁ గనుఁగొనే తేజము వీర్యపుటెజ్ఞభాగాల విష్ణునామ తేజము | ॥ఈతఁ॥ |
| పరమపురుషమూర్తి ప్రకృతియైన మూర్తి గరిమతో మహదహంకార మూరితి ధరఁ బంచతన్మాత్రలు తత్త్వములైన మూరితి గరుడానంత సేనేశకర్తయైన మూరితి | ॥ఈతఁ॥ |
| భాగవతపు దైవము భారతములో దైవము సాగిన పురాణవేదశాస్త్ర దైవము పోగులైన బ్రహ్మలను బొడ్డునఁ గన్న దైవము శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము | ॥ఈతఁ॥ |


