అధ్యాత్మ సంకీర్తన
రేకు: 177-5
సంపుటము: 2-385
రేకు: 177-5
సంపుటము: 2-385
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన | ॥పల్లవి॥ |
| బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే | ॥తంద॥ |
| కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ | ॥తంద॥ |
| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్రదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే ఛండాలుడుండేటి సరిభూమి యొకటే | ॥తంద॥ |
| అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే ఘనకీటపశువులకు కామసుఖ మొకటే దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు | ॥తంద॥ |
| కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే పరగ దుర్గంధములపై వయువు నొకటే వరుసఁ బరిమళముపై వాయువు నొకటే | ॥తంద॥ |
| కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే | ॥తంద॥ |


