అధ్యాత్మ సంకీర్తన
రేకు: 178-2
సంపుటము: 2-387
రేకు: 178-2
సంపుటము: 2-387
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నందగోపనందనుడే నాఁటి బాలుడు ఇందు నేఁడే రేపల్లె నేచి పెరిగెను | ॥పల్లవి॥ |
| పువ్వువంటి మఱ్ఱియాకుపొత్తిఁ బవళించనేర్చె యెవ్వఁడోకాని తొల్లె యీబాలుఁడు మువ్వంకవేదములను ముద్దుమాఁట లాడనేర్చె యెవ్వరూఁ గొంత నేర్పనేఁటికే వీనికి | ॥నంద॥ |
| తప్పుటడుగు లిడఁగనేర్చె ధరణియందు నాకసమున- నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియే రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁ జెంద్రునందు పగలు గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేఁటికే | ॥నంద॥ |
| మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె- నంచితముగ శ్రీవేంకటాద్రిమీఁదను యెంచి యప్పలప్పలనుచు యెనసి కాఁగిలించనేర్చె దించరాని వురముమీఁద దివ్యకాంతను | ॥నంద॥ |


