Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 15-4
సంపుటము: 1-92
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
ఇటు గరుడని నీవెక్కినను
పటపట దిక్కులు బగ్గనఁ బగిలె
॥ఇటు॥
ఎగసిన గరుడని యేపున ‘ధా’ యని
జిగి దొలఁక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడగడ వడఁకె
॥ఇటు॥
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిరదిరఁ దిరిగె
॥ఇటు॥
పల్లించిన నీ పసిఁడి గరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీ మహిమ
వెల్లి మునుఁగుదురు వేంకటరమణా
॥ఇటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము