Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 15-6
సంపుటము: 1-94
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
తాపలేక మేడ లెక్కఁ దలఁచేము
యేపులేని చిత్తముతో యీహీహీ నేము
॥తాప॥
ఎఱుకమాలిన బుద్ధి యె(నె?)వ్వరైనాఁ బతులంటా
తెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేము
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా
వొఱపు నిలిపిన ట్లోహోహో నేము
॥తాప॥
యిందరును హితులంటా యెందైనా సుఖమంటా
పొందలేని బాధఁ బొరలేము
మందమతివాఁడు యెండమావులు చెరువులంటా
అందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము
॥తాప॥
మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటా
నాటకపు తెరువుల నడిచేము
గూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటా
యేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము
॥తాప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము