Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 16-2
సంపుటము: 1-96
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి
చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు
॥చూడ॥
[1]ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపు
కడలేని యాస చీఁకటి దవ్వుకొనుట
నిడివైన కనుచూపు నీడనుండిన [2]యెండ
వడిచెడని తమకంబు వట్టి తాపంబు
॥చూడ॥
బుద్ధిమానిన చింత పోని యూరికిఁ దెరువు
పొద్దువోవని వలపు పొట్ట పొంకంబు
యెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము
[3]లొద్దిక విహారంబు లుబ్బుఁ గవణంబు
॥చూడ॥
తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని
చూపు, దనుఁ బొడగనని చూపు లోచూపు,
ఆపదలు వాయు నెయ్యపుఁ దలఁపు లీ(లో?)తలఁపు
రూపైన రుచిలోని రుచి వివేకంబు
॥చూడ॥

[1] ‘ఎడ’ను ‘యడ’గ భావించిరేమో? కాకున్న యతిభంగము.

[2] ‘యండ’ అని రేకు.

[3] ‘ఒద్దిక’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము