Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 16-3
సంపుటము: 1-97
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు చూడ-
నెవ్వరికి నేమౌనొ యీ జీవుఁడు
॥ఎవ్వరె॥
ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక
కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు
యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-
మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు
॥ఎవ్వరె॥
యెక్కడె[1]క్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-
కెక్కడో తనజన్మ మీజీవుఁడు
యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యెప్పు-
డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు
॥ఎవ్వరె॥
ఎన్నఁడును జేటులే నీజీవుఁడు వెనక-
కెన్ని దనువులు మోవఁ డీజీవుఁడు
యెన్నఁగల తిరువేంకటేశు మాయలఁ దగిలి
యెన్ని పదవులఁ బొందఁ డీజీవుడు
॥ఎవ్వరె॥

[1] ‘క్కడదిరు’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము