Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 191-4
సంపుటము: 2-465
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు
మఱి తెలివికంటే మఱుపే శుభము
॥పల్లవి॥
లంపటా లెఱఁగము లవలవ లెఱఁగము
పంపుల బాల్యమే పరిణామము
యింపులు నెఱఁగము యెగ్గులు నెఱఁగము
జంపుల నిదురే సకలసౌఖ్యము
॥ఎఱుఁ॥
ఆస లివెఱఁగము అలమట లెఱఁగము
మూసిన గర్భమే మును సుఖము
వాసులు నెఱఁగము వంతులు నెఱఁగము
వేసట పుట్టని విధమే సుఖము
॥ఎఱుఁ॥
పాపము లెఱఁగము బంధము లెఱఁగము
శ్రీపతి దాస్యమే శేఖరము
యేపున శ్రీవేంకటేశ్వరు శరణమే
తీపులు మఱపేటి దివ్యానందము
॥ఎఱుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము