Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 16-4
సంపుటము: 1-98
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎంత చేసిన తనకేది తుద
చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు
॥ఎంత॥
ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ
గడమే కాకిఁకఁ గడ యేది
తడఁబడ హరియే దైవమనుచును మది
విడువక వుండిన వెరవే చాలు
॥ఎంత॥
యెన్ని తపము లివి యెట్లఁ జేసినా
అన్నువ కధికము కలవేది[1]
వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై
[2]వున్న చిత్తమది వొక్కటే చాలు
॥ఎంత॥
యిందరి వాదము లెట్ల గెలిచినా
కందే గాకిఁక గరిమేది
ఇందరినేలిన యీ వేంకటపతి
పొందగు మహిమల పొడవే చాలు
॥ఎంత॥

[1] ‘అలవి + ఏది’

[2] ‘నున్న’ అని పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము