అధ్యాత్మ సంకీర్తన
రేకు: 192-3
సంపుటము: 2-470
రేకు: 192-3
సంపుటము: 2-470
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| కంటిరా వింటిరా కమలనాభుని శక్తి వొంటి నితని శరణ మొకటే వుపాయము | ॥పల్లవి॥ |
| యీతని నాభిఁ బొడమె యెక్కువైన బ్రహ్మయు యీతఁడే రక్షించినాఁడు యింద్రాదుల యీతఁడాకుమీఁదఁ దేలె నేకార్ణవమునాఁడు యీతఁడే పో హరి మనకిందరికి దైవము | ॥కంటి॥ |
| యీతఁడే యసురబాధ లిన్నియుఁ బరిహరించె- నీతని మూఁడడుగులే యీ లోకాలు యీతఁడే మూలమంటే నేతెంచి కరిఁ గాచె నీతనికంటే వేల్పు లిఁక మరి కలరా | ॥కంటి॥ |
| యీతఁడే వైకుంఠనాథుఁ దీతఁడే రమానాథుఁ- డీతఁడే వేదోక్తదైవ మిన్నిటాఁ దానె యీతఁడే అంతర్యామి యీ చరాచరములకు నీతఁడే శ్రీవేంకటేశుఁ డిహపరధనము | ॥కంటి॥ |


