అధ్యాత్మ సంకీర్తన
రేకు: 192-4
సంపుటము: 2-471
రేకు: 192-4
సంపుటము: 2-471
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| సింగారమూరితివి చిత్తజగురుడఁవు సంగతిఁ జూచేరు మిమ్ము సాసముఖా | ॥పల్లవి॥ |
| పూవులతెప్పలమీఁద పొలఁతులు నీవు నెక్కి పూవులాకసము మోవఁ బూచి చల్లుచు దేవదుందుభులు మ్రోయ దేవతలు గొలువఁగా సావధానమగు నీకు సాసముఖా | ॥సింగా॥ |
| అంగరంగవైభవాల నమరకామినులాడ నింగినుండి దేవతలు నిన్నుఁ జూడఁగా సంగీతతాళవాద్య చతురతలు మెరయ సంగడిఁ దేలేటి మీకు సాసముఖా | ॥సింగా॥ |
| పరగఁ గోనేటిలోన పసిడి మేడనుండి అరిది నిందిరయు నీవారగించి గరిమ శ్రీవేంకటేశ కనులపండువ గాఁగ సరవి నోలాడు మీకు సాసముఖా | ॥సింగా॥ |


