అధ్యాత్మ సంకీర్తన
రేకు: 192-5
సంపుటము: 2-472
రేకు: 192-5
సంపుటము: 2-472
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| పట్టలేని మన భ్రమగాక నెట్టనఁ దాఁ గరుణించనివాఁడా | ॥పల్లవి॥ |
| హితప్రవర్తకుఁ డీశ్వరుఁడు తతి నంతరాత్మ తాఁ గాన రతి నాతని దూరఁగనేలా గతియని తలఁచిన కావనివాఁడా | ॥పట్ట॥ |
| తెగని బంధువుఁడు దేవుఁడు బగివాయఁ డిహముఁ బరమునను అగపడి సందేహములేలా తగ నమ్మిన దయదలఁచనివాఁడా | ॥పట్ట॥ |
| హృదయము శ్రీవేంకటేశ్వరుఁడు మెదలనే ఆనందమూర్తిగన కదిసి వెలిని వెదకఁగనేలా యెదురఁ గనిన వరమియ్యనివాఁడా | ॥పట్ట॥ |


