అధ్యాత్మ సంకీర్తన
రేకు: 193-3
సంపుటము: 2-476
రేకు: 193-3
సంపుటము: 2-476
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| మగఁడు విడిచినా మామ విడువనియట్టు నెగడిన వేమిసేయు నేనే రోయఁ గాని | ॥పల్లవి॥ |
| నరకము నను రోసి సురలోకాన విడిచె నిరయముతోవ రోసి నేనే విడువఁ గాని పరగి యోనులు రోసి బట్టబాయిట వేసే సొరిది యోనుల రోసి చొరక నే మానఁ గాని | ॥మగఁ॥ |
| పాపము రోసి నన్ను ప్రపంచాన విడిచె పాపము సేయక రోసి పట్టకుండఁ గాని నేను యేపున దేహము రోసి యింద్రలోకాన విడిచె కైపువేసి రోయక నేఁగాయము మోచితిఁ గాని | ॥మగఁ॥ |
| మాయలెల్ల నన్ను రోసి మనసులోన విడిచె మాయల నే విడువక మగుడఁ దగిలేఁ గాని నాయల(?) నేమి విడిచినాను శ్రీవేంకటేశ పాయక నన్నేలితి నీభాగ్యము విడువఁ గాని | ॥మగఁ॥ |


