Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 16-5
సంపుటము: 1-99
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారణి
ఏణనయనల చూపులెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు
॥ఏణ॥
ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు
అడియాస కోరికలు నటువలెనె యుండు
కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు
అడరు సంసారంబు నట్లనే వుండు
॥ఏణ॥
చింతాపరంపరలఁ జిత్తమిది యెట్లుండు
వంతఁ దొలఁగని మోహవశము నట్లుండు
మంతనపుఁ బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గముల గతి యట్లనుండు
॥ఏణ॥
దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు
శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణతది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు
॥ఏణ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము