అధ్యాత్మ సంకీర్తన
రేకు: 193-6
సంపుటము: 2-479
రేకు: 193-6
సంపుటము: 2-479
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| హితవే సేసుఁ గాకాతఁడేల మానును మితి నాతని దూరక మెచ్చవలెఁ గాక | ॥పల్లవి॥ |
| ఆగమభోగములకు హరి నాలో నున్నవాఁడు చేగదేర నాకు మేలే చింతించుఁ గాక సాగిన ప్రపంచములో సంసారిఁ జేసినవాఁడు యే గతి రక్షించఁ దానే ఇన్నిటికౌఁ గాక | ॥హిత॥ |
| భూమిమీఁద దేహమిచ్చి పుట్టించినట్టివాఁడు ప్రేమతో నన్నపానాలు పెట్టుఁ గాక ఆమని పంచేంద్రియాల నటు పెడరేఁచేవాఁడు నేమపు బుత్రదారలై నిండుకుండు గాక | ॥హిత॥ |
| ఇహపరములకుఁ దా నిరవైనట్టివాఁడు సహజాన నన్నియును జరపుఁ గాక వహి శ్రీవేంకటాద్రిపై వరములిచ్చేటివాఁడు మహిమతో మమ్మునేలి మన్నించుఁ గాక | ॥హిత॥ |


