| కీర్తనలు | దాసు శ్రీరాములు | అంత గీర్వాణము - నేనేరరా స్వామి |
| అసావేరి -త్రిపుట | |
| పల్లవి: | |
| అంత గీర్వాణము - నేనేరరా స్వామి అచ్చతెనుగు జెప్పరా | ॥అంత॥ |
| అనుపల్లవి: | |
| వింతగా ననుజూచి - "విరిబోణియవి పూవు బంతులా యేమని" - పకపక నగియెదవు | ॥అంత॥ |
| చరణ: | |
| చాలగా మదన ప్ర - చారములను నే జాణగాను గదరా "మేలు వేలుపుప్రోడ - మిద్దెటింటికి జేర వీలు దెలుపు" మని - వేవేగ ననియెదవు | ॥అంత॥ |
| వీరాసనము వైచి - పెదవి పంటను గరచి తీరుగా కన్నుగీటుచు "వారిజ ముఖి మంచి - పగడము ముత్యాల చేరులోనికి దయ - సేయుమీ" అనియెదవు | ॥అంత॥ |
| వాలాయముగ తోట్ల - వల్లూరి వేణుగో పాల నిన్నే నమ్మితి శీల మొప్పగ "దాసు - శ్రీరామ కవి కృతి లీలాం శ్రుణు మహిళే" - అని పల్కెదవు | ॥అంత॥ |