| కీర్తనలు | దాసు శ్రీరాములు | నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం, నా |
| సురటి - ఆది | |
| పల్లవి: | |
| నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం, నా సామికిదే శుభమంగళం - ముద్దు సామికిదే జయమంగళం | ॥నా మనో॥ |
| అనుపల్లవి: | |
| ప్రేమతో నా కౌగిట జిక్కి కులుకు - పిసాళి గుబ్బల పోటుల నలసి పిరివిరిగా ననగి పెనగి మేను - మరపించుచు నేర్పున | ॥నా మనో॥ |
| చరణ: | |
| క్రొవ్విన కోవెలలే మావిచిగురు - కొరికిన క్రియ నా వాతెరనొక్కి నవ్వు మొగంబు నలంకరింపగా - నన విల్తుని బారికి మదిసొక్కి దవ్వు దవ్వులనె యురికి - మెలమెల్ల దరికి దరికి, డగ్గరి చివ్వున నను బట్టిన మై ఝల్లని చిటుకున వీడిన నీవితో నిక్కిన - చిన్ని చన్నుగవ ఠీవితో మొవ్వపుటరగను మూతతో - మోహపు చెమటల పూతతో పువ్వుల పాన్పున పొందుగ ననువిడి - పొరిపొరి కాముని పోరున తీరున | ॥నా మనో॥ |
| పదరిమదపు టేనుగు తనకరమున - బంగరు టనటుల బట్టిన లీల వదలక నా పెందొడల వలిప పా - వడ పై కెత్తి సరిగ తనకేల పొదవి పట్టి కులికి, పొక్కిలి - వెదకి వెదకి కులికి, వెలికి కదలి సిగ్గుచే కనుమూసుక బెదరింపున నొక యోరగ నొత్తిల - పదపడి కోరికలూరగా మదనుడు ములుకుల నూరగా - మదిని వలపు మితిమీరగా కుదురుగ నా యొడి కుచ్చెల పైనిడి - చెదరక బట్టిన చేతికి మ్రొక్కుచు | ॥నా మనో॥ |
| మరిమరి సరసపు మాటలనను బ్రతి - మాలి యెట్టకేలకు జయమంది తరచుగ రతి కూజితముల చేతన - తమ్మరసము పయ్యెదపై జింది ద్విరదేంద్రపాలుడు తోట్ల వల్లురి - పురవాసుడు వేణుగోపాలుడు కరుణను దాసు శ్రీరాముని బ్రోచిన ఘనుడు కళలు మైదేరగా, నన్ను - గలసి మెలసి తమిదీరగా, నఖ విరచిత రేఖలు మీరగా, సుఖ - వీచులు పై పై బారగా సురసుర సొక్కుచు సోలుచు లేచిన - తరి బయ్యర నిలువురమును నిలువగ | ॥నా మనో॥ |