కీర్తనలు తూము నరసింహ దాసు పరిచయము

బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచించిన
"ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్రము" నుంచి

తూము నరసింహ దాసు

రామదాసును గురించి చెప్పుకొన్న అధ్యాయంలో గుంటూరు నుంచి దేశయాత్ర చేసుకొంటూ భద్రాచలం వెళ్లి అక్కడ శ్రీరామచంద్రమూర్తికి కైంకర్యాలు చేయించిన రాజా తూము నరసింహదాసు అనే వాగ్గేయకారుని గురించి కొద్దిగా చెప్పుకొన్నాము. అచ్చయ మంత్రి, వెంకమ్మ అనేవారు ఈయన తల్లిదండ్రులు. గుంటూరు వాస్తవ్యులు. ఈయన త్యాగరాజస్వామికి సమకాలీనుడు. ఆంధ్ర సంస్కృత సాహిత్యాలలోను, సంగీతంలోను పాండిత్యం సంపాదించిన ఈయన గుంటూరులో డివిజన్‌ కొలువులో లౌకికోద్యోగియై ఉన్నా, పారమార్థిక చింతతో భద్రాచలం సీతారాములయెడ భక్తి కలిగి, భక్తి ప్రబోధకాలైన భజన కీర్తన లెన్నో రచించాడు. ఈ కీర్తనలలో రామభక్తి, పరమార్థ చింతా, వేదాంత తత్త్వమూ కలవి మాత్రమేగాక, సీతారాములకు భక్తితో, సంకీర్తన కైంకర్యానికి ఉపయోగించే ఉత్సవ సంప్రదాయ కృతులైన మేలు కొలుపులు, హెచ్చరికలు, లాలి పాటలు, మంగళహారతులు కూడా ఉన్నవి. ఈ కీర్తనలు ఆంధ్రదేశమంతటా భజనకూటముల వారి నోళ్లలోను, ఆ సంప్రదాయముగల యిళ్లలోను, చిరకాలం నుంచి వినబడుతూ ఉన్నవే.

1.సౌరాష్ట్రంభజనచేసే విధము తెలియండి జనులారా మీరు
నిజము గనుగొని మోదమందండి
2.మధ్యమావతిరామనామామృతమే నీకు రక్షకం బనుకోవే మనసా
3.యదుకులకాంభోజిఎందుకే యీ వట్టి బాధలు నీకెందుకే
ఎందుకే బాధలజెందుచు నుండెద వందముగా
ముకుంద వరదయనవు
4.యదుకులకాంభోజిసెలవా మాకిక సెలవా రామయ్య
సెలవా మాకిక శరణాగతవరభరణా
భవతరణా రామయ్య
5.యమునాకల్యాణికావేటిరంగా నను గావవేరా
కావేటిరంగ నను గావుమనుచు వేడ
రా వేమి సేతురా రాకుమారా
6.తోడివందన మిదె శ్రీరంగా
7.యదుకులకాంభోజికరుణ యేదిరా రంగయ్య
8.రేగుప్తిరంగని సేవింపగలిగె నమ్మా
9.శహనవరదుని గంటినీ - కంచి వరదుని గంటినీ
10.రీతిగౌళరామసహాయ మెన్నటికో
11.కానడచెలియా శ్రీరామచంద్రుని సేవజేతమా

నరసింహదాసు సకుటుంబంగా భక్తులైన మిత్ర బృందంతో సహా దక్షిణ దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ యాత్రచేస్తూ, శ్రీరంగమూ, కంచీ దర్శించి, అక్కడి దేవుళ్లపై కీర్తనలు పాడాడు. చెన్నపట్నం వచ్చి పార్థసారథిస్వామిని దర్శించి, అప్పుడు తిరువొత్తియూరులో వీణ కుప్పయ్యగా రింటిలో బసచేసిన త్యాగరాజస్వామిని దర్శించి ఆయన సంకీర్తనలను విని, అద్భుతానంద పరవశుడై తాను ఆయన ఘనతను ప్రశంసిస్తూ పద్యాలు చదివాడట. అక్కడ నుంచి నెల్లూరు వెళ్లి రంగనాథుని సేవించి ఆ తర్వాత వరద రామదాసనే మరొక భక్త వాగ్గేయకారుని తోడుచేసుకొని భద్రాచలం వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు స్థిరనివాసం ఏర్పరచుకొని సీతారాములపైన నిత్యోత్సవ సంకీర్తనలు రచించి పాడుతూండేవారు. అప్పటి నైజామును కలసికొని, అదివరకు గోపన్నగారు తానీషావారి సమ్మతిపైని భద్రాచల రాముల నిత్యకైంకర్యానికై యిచ్చిన దాన శాసనం దుష్టులెవరో చెక్కి వేసినదానిని తిరిగి వ్రాయించి, నైజాము చేత తిరిగి రాములవారికి కైంకర్యాలకూ, నిత్యోత్సవాలకూ గాను వార్షికాలు ఏర్పాటు చేయించారు. నరసింహదాసుగారూ, వరద రామదాసుగారూ చాలాకాలం భద్రాచలంలో ఉండి నిత్య సంకీర్తనలతో రాములవారిని సేవించుకొని, అక్కడే రాములవారిలో ఐక్యం పొందారని, తూము నరసింహదాసు చరిత్ర అనే హరికథ వల్ల మనకు తెలుస్తోంది. ఇందులో చాలా సంకీర్తనలు నరసింహదాసుల రచనలే. 'తూము నరసింహదాస' అనే ముద్ర, ఆ కీర్తనలలో కనిపిస్తూంది. నరసింహదాసుగారి సహచరులైన వరద రామదాసుగారు కంచి వాస్తవ్యులు. రామాంకితంగాను వరదరాజాంకితంగాను భక్తి కీర్తనలు వ్రాసినారు. రామదాసును గురించిన అధ్యాయంలోను, త్యాగరాజును గురించిన అధ్యాయంలోను నరసింహదాసు గారి గురించి యిదివరకే ప్రస్తావించుకొన్నాము.

AndhraBharati AMdhra bhArati - tUmu narasiMha dAsu kIrtanalu - akArAdi kIrtana sUchika - tUmu narasiMhadAsu - Tumu Narasimha Dasu - Lyrics of Tumu Narasimhadasu kIrtanalu bhajanalu Toomu Narasimha dasu ( telugu andhra )