| కీర్తనలు | త్యాగరాజు | ఎందరో మహానుభావు లందరికి వందనము |
| శ్రీ - ఆది |
| పల్లవి: |
| ఎందరో మహానుభావు లందరికి వందనము ఎం.. |
| అను పల్లవి: |
| చందురు వర్ణుని యంద చందమును హృదయార విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా రెం.. |
| చరణము(లు): |
| సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం.. |
| మానస వనచరవర సంచారము సలిపి మూర్తి బాగుగఁ బొడగనెడు వా రెం.. |
| సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము జేయు వా రెం.. |
| పతితపావనుఁడగు పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమా ర్గముతోను బాడుచును సల్లాపముతో స్వరలయాది రాగములఁ దెలియు వా రెం.. |
| హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం.. |
| హొయలుమీర నడలు గల్గు సరసుని సదాకనులఁ జూచుచును పులక శ రీరులై యానందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గల వా రెం.. |
| పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన దిగిశ సుర కింపురుష కనకకశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదానుభవులు గాక ఎం.. |
| నీ మేని నామ వైభవంబులను నీ పరాక్రమ ధై ర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమున రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెఱింగి సంతతంబునను గుణ భజనా నంద కీర్తనము జేయు వా రెం.. |
| భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మముల\న్ శివాది షణ్మతముల గూఢముల\న్ ముప్పదిముక్కో టి సురాంతరంగముల భావంబుల నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వా రెం.. |
| ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచువారు రామభక్తుఁడైన త్యాగ రాజనుతుని నిజదాసులైన వా రెం.. |