| కీర్తనలు | త్యాగరాజు | ఎందు దాగినాఁడో ఈడకు రా |
| తోడి - త్రిపుట |
| పల్లవి: |
| ఎందు దాగినాఁడో ఈడకు రా నెన్నడు దయవచ్చునో ఓ మనసా ఎం.. |
| అను పల్లవి: |
| ఎందుకు చపలము వినవే నా మనవిని ముందటివలె భక్తుల పోషించుట కెం.. |
| చరణము(లు): |
| అలనాడు కనక కశిపు నిండారు చలముఁజేసి సుతుని సకల బా ధలఁ బెట్టగా మదిని దాళక ని శ్చలుఁడైన ప్రహ్లాదుకొఱకు కంబములో పల నుండఁగలేదా ఆ రీతిని నే డెం.. |
| మును వారివాహ వాహన తనయుఁడు మద మున రవిజుని చాలఁ గొట్టుటఁ జూచి మనసు తాళఁజాలలేక ప్రేమ మున పాలనముసేయ తాళతరువు మరు గున నిల్వఁగలేదా రీతిని నే డెం.. |
| తొలి జన్మముల నాఁడు జేసిన దుష్కర్మ ముల నణఁగను సేయ ఆరుశ త్రులఁబట్టి పొడిసేయ అదియుఁగాక ఇలలో చంచలము రహిత నిజభక్త జ నులను త్యాగరాజుని రక్షింప నే డెం.. |