| కీర్తనలు | త్యాగరాజు | కన్నతల్లి నీవు నా పాలఁగలుగ |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| కన్నతల్లి నీవు నా పాలఁగలుగ గాసి చెంద నేలనమ్మ క.. |
| అను పల్లవి: |
| వెన్నయుండ నేతి కెవరైన వెసనబడుదురా త్రిపురసుందరి క.. |
| చరణము(లు): |
| ఎల్లవారి ధనములశ్వములు మఱి ఎక్కువైన గట్టి మిద్దెలన్నియు కల్లగాని కన్నవారలు గాంచు సుఖము సున్న యనుచును ఉల్లమునను బాగ తెలిసికొంటిని ఊరకే ధనికల సంభాషణము నే నొల్ల మాయలని దెలిసి రజ్జుపై యురగబుద్ధి చెందనేల నమ్మానను క.. |
| పలుకు మంచిగాని బాంధవులు మఱి బావమరదులక్కలన్నదమ్ములు కలిమిఁజూచువారు లేమిని గనులఁగానరారు అనుచును దలఁచుకొన్నవెనుక వారి మాయల తగులఁజాలనమ్మా మరుమరీచి కలను జూచి నీరని భ్రమసి కందురా ఆదిపురవిహారిణీ నను క.. |
| కనక భూషణములఁ బెట్టి మఱియు సొగసుఁజేసి పాలుబోసి పెంచిన తనువు సతము గాదు నిర్మల తన మించుకలేదు అనుచును అనుదిన మొనరించు సత్క్రియల నీ కని పల్కిన త్యాగరాజరక్షకి విను మన్నిట నీవనెఱిఁగి వేల్పుల వేఱని యెంచుదురా త్రిపురసుందరి నను క.. |