| కీర్తనలు | త్యాగరాజు | చేతులార శృంగారము జేసి చూతును శ్రీరామ |
| ఖరహర ప్రియ - ఆది |
| పల్లవి: |
| చేతులార శృంగారము జేసి చూతును, శ్రీరామ! ॥చేతులార॥ |
| అను పల్లవి: |
| సేతుబంధన సురపతి సర సీరుహ భవాదులు బొగడ, నా ॥చేతులార॥ |
| చరణము(లు): |
| మెరగు బంగారందెలు బెట్టి మేటియై సరిగ వల్వలు గట్టి సురతరు సుమములు సిగనిండఁజుట్టి సుందరమగు మోమున ముద్దుబెట్టి ॥చేతులార॥ |
| మొలను కుందనపు గజ్జలు గూర్చి ముద్దుగ నుదుటఁ దిలకముఁ దీర్చి యలకలపై రావిరేకయుఁ జార్చి యందమైన నిన్నురమున జేర్చి ॥చేతులార॥ |
| ఆణిముత్యాల కొండె వేసి హవుసుగా పరిమళ గంధముఁ బూసి వాణి సురటిచే విసరగ వాసి వాసియనుచు త్యాగరాజనుతయని రోసి ॥చేతులార॥ |