| కీర్తనలు | త్యాగరాజు | రారా మా యింటిదాఁక రఘు |
| అసావేరి - ఆది |
| పల్లవి: |
| రారా మా యింటిదాఁక రఘు వీర సుకుమార మ్రొక్కేరా ॥రా॥ |
| అను పల్లవి: |
| రారా దశరథకుమార నన్నేలు కోరా తాళలేరా రామ ॥రా॥ |
| చరణము(లు): |
| ప్రొద్దునలేచి పుణ్యముతోడి బుద్ధులుచెప్పి బ్రోతువుగాని ముద్దుగారు నీ మోమును జూచుచు వద్దనిలిచి వారము పూజించెద ॥రా॥ |
| కోరిన కోర్కులు కొనసాగకనే నీరజనయన నీ దారినిగని వే సారితిగాని సాధుజనావన స్వారివెడలి సామినేఁడైన ॥రా॥ |
| దిక్కులేదనుచుఁ దెలిసి ననుఁ బ్రోవఁ గ్రక్కునరావు కరుణను నీచేఁ జిక్కియున్నదేల మఱతురా శ్రీ త్యాగరాజుని భాగ్యమా ॥రా॥ |