| కీర్తనలు | త్యాగరాజు | స్వరరాగసుధారసయుత భక్తి |
| శంకరాభరణము - ఆది |
| పల్లవి: |
| స్వరరాగసుధారసయుత భక్తి స్వర్గాపవర్గముగా ఓ మనసా ॥స్వ॥ |
| అను పల్లవి: |
| పరమానందమనే కమలముపై బకభేకము చెలఁగేమి మనసా ॥స్వ॥ |
| చరణము(లు): |
| మూలాధారజనాద మెఱుఁగుటే ముదమగు మోక్షమురా కోలాహల సప్తస్వర గృహముల గుఱుతే మోక్షమురా ఓ మనసా ॥స్వ॥ |
| మద్దలతాళగతులు తెలియకనె మర్దించుట సుఖమా శుద్ధమనసులేక భజనచేయుట సూకరవృత్తిరా ఓ మనసా ॥స్వ॥ |
| బహుజన్మములకుపైని జ్ఞానియై బరగుట మోక్షమురా సహజభక్తితో రాగజ్ఞాన సహితుఁడు ముక్తుఁడురా ఓ మనసా ॥స్వ॥ |
| రజత గిరీశుఁడు నగజకు దెల్పు స్వ రార్ణవ మర్మములు విజయముగల త్యాగరాజుఁడెఱుఁగే విశ్వసించి దెలుసుకో మనసా ॥స్వ॥ |