| ౩-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటిపెరడు. |
| [కరటకశాస్తుల్లు, మీనాక్షీ ప్రవేశింతురు.] |
| మీనాక్షి |
మీపిల్లని నాకడుపులో పెట్టుకోనా తాతయ్యా? |
| కరట |
కడుపుగదా అమ్మా? అంచేత పదేపదే చెబుతున్నాను. దానికి తల్లివైనానువ్వే, తండ్రివైనానువ్వే. (దుఃఖమును అభినయించును.) |
| మీనాక్షి |
విచారించకండి, తాతయ్యా, దానికి యేలోపం రానియ్యను. |
| కరట |
అమ్మా, నీకిమ్మని మా అమ్మిచేతికి ఓ పులిమొహురు యిచ్చాను. పుచ్చుకో. |
| మీనాక్షి |
యిస్తుంది. తొందరేవిఁటి, తాతయ్యా? దాందగ్గిరవుంటేనేం? నాదగ్గిరవుంటేనేం? |
| (సిద్ధాంతి ప్రవేశించును.) |
| సిద్ధాంతి |
యెంతసేపూ కూరలుతరగడం, భోజనాల సరంజాం జాగ్రతచెయ్యడం సందడేగాని, లగ్నానికి కావలసిన సరంజాం జాగ్రత చెయ్యడపు తొందరేవీఁ కానరాదు. నాశిష్యుడు ముంగి పోతులాగ పడున్నాడు. |
| మీనా |
నాలుగ్గడియల పొద్దుకిలగ్గవైతే, యిప్పట్నించీ సరంజాం తొందరేవిఁటి అచ్చన్న మావాఁ? |
| సిద్ధాంతి |
చదవేస్తేవున్న మతీ పోయిందన్నాట్ట. నాలుగ్గడియల రాత్రుందనగా శుభమూర్తం. |
| మీనా |
మానాన్న యెప్పుడూ యిదేమచ్చు. యేమాటా నిజం యింట్లో ముండలతో చెప్పకపోతే యెలా యేడుస్తారు? నాన్నా? నాన్నా! |
| (లుబ్ధావధాన్లు ప్రవేశించును.) |
| లుబ్ధా |
యెందుకాగావు కేకలు? |
| మీనా |
నాలుగ్ఘడియల రాత్రుందనగానట మూర్తం. అచ్చన్న మావఁ అంటున్నారు. |
| లుబ్ధా |
యిదేవిఁటండోయి, నాలుగ్గడియలపొద్దు కనుకున్నానే ముహూర్తం? |
| సిద్ధాంతి |
ముప్పైమూడు ఘడియలపొద్దు కనుకున్నారుకారో? మీ వెఱ్ఱులు చాలించి చప్పునకానియ్యండి మంగళాస్నానాలు. ఊళ్లో బ్రాహ్మలినందర్నీ పిలిచేశాను. |
| లుబ్ధా |
చంపారే! చలి!- అయితే, రావఁప్పంతులుకూడా నాలుగ్ఘడియలపొద్దుకి అనుకున్నాడే ముహర్తం? ఆయనే వొచ్చి, పెద్దిపాలెంలో లౌక్యుల్ని నాలుగ్ఘడియలపొద్దుకి రమ్మని పిలుస్తారేమో? |
| సిద్ధాంతి |
శతాంధాః కూపం ప్రవిశంతి. అమ్మీ, పిల్లకి స్నానం చేయించూ. |
| మీనా |
యిదుగో, నిమిషంలో చేయిస్తాను. |
| సిద్ధాంతి |
ఆడవాళ్లునయం. పెళ్లిపందిట్లో సరంజాం చూసుకుంటాను. |
| లుబ్ధా |
పంతులులేకుండా లగ్నం అయితే- |
| సిద్ధాంతి |
పంతులుకా, మీకాపెళ్లి? జంకవోడక స్నానంకానీండి. |
| (నిష్క్రమింతురు.) |