| ౨-వ స్థలము. రామప్పంతులు యింట్లో కొట్టుగది. |
| (భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుచుందురు. పూజారి గవరయ్య ఆట చూచుచుండును.) |
| పోలిశెట్టి |
యేంభష్టాకారి ముక్కలు యేశావయ్యా! యెప్పుడూనువ్వింతేను. |
| భుక్త |
చూసివేశానా యేవిఁటి? నీ దరిద్రదేవతని తిట్టు. |
| పోలి |
గవరయ్యా, నీముణుకు నాదగ్గిర యిలా యెట్టకు. లేచిపో, నీపుణ్యవుఁంటుంది. |
| గవ |
నేను మా మధురవాణిదగ్గిర కూచుంటాను. |
| భక్త |
చూడూ, ముక్కతప్పు పడ్డట్టుంది. |
| పోలి |
ఆఁ! బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తుమీద కుదేలెట్టిస్తాను. |
| భుక్త |
ముక్కలు బాగా పడలేదన్నావే? |
| పోలి |
రెండో యేత నాలుగాసులడకూడదా? |
| భుక్త |
(పోలిశెట్టికి ముక్కలువేస్తూ,) యిదుగో నాలుగాసులేస్తున్నాను. జుఱ్ఱు. |
| పోలి |
నీయిషపచేత్తో యేస్తే, పొల్లుముక్కలే పడతాయి; మంచి ముక్కలడతాయా? |
| భుక్త |
తథాస్తు! |
| పోలి |
అలా అనకు. యెంతశెడ్డా బాపనాడి శాపనాకారం మాశెడ్డది. (చూచుకొని) శీ! భష్టాకారి ముక్కలు! |
| సిద్ధాం |
ఒకటి, రెండు. |
| పోలి |
అదుగో, అలాశెప్పితే నే వొప్పను, ఒక్కొకటి శెప్పాలి. |
| సిద్ధాం |
అయితేవకటి. |
| పోలి |
ఒక్కటీ. |
| మధురవాణి |
ఒకటి. |
| భుక్త |
వకటి. |
| (సిద్ధాంతి ఆలోచించును.) |
| పోలి |
యే టాలోసిస్తావు చే తరస! యెత్తవయ్యా. |
| సిద్ధాం |
నీదేంపోయింది! రెండు. |
| పోలి |
లాంతరేశావు. యేటెత్తను? రొండు. |
| మధు |
రెండు. |
| భుక్త |
రొండు. |
| (సిద్ధాంతి ఆలోచించును.) |
| పోలి |
యే టాలోసిస్తావు? చే తరస; యెత్తి బేస్తుగెలుసుకో. |
| సిద్ధాం |
నువు చెప్పా`వుగనక యెత్తుతాను. |
| పోలి |
ఆఁ! డబ్బక్కడెట్టి మరీయెత్తు. మూడో యెత్తడపుబేస్తు; గా`పకవుఁందా? బేస్తుమీద కుదేలెట్టిఁ బాకీ లెట్టి, యగెయడానికా? |
| సిద్ధాం |
(తనముక్కలు యెత్తుముక్కలమీదవేసి) కోవఁటాడి పిలక నిగుడుతూంది! |
| పోలి |
తంతావాయేటి? |
| సిద్ధాం |
తన్నడవఁంటే, ఒహలాగనా? |
| పోలి |
నా ఆట శెడగొట్టేశినావు, బాపనయ్యా! |
| భుక్త |
ముక్కలు పడలేదని యేడుస్తూ, మళ్లీ యేవిఁటి, ఆట చెడగొట్టా`డని యేడుస్తావు? |
| పోలి |
యీ ఆట బేస్తుచేయించకపోతే నా పేరు- |
| సిద్ధాం |
కోవఁటాడా, నోరు మూసుకుంటావా మూసుకోవా? |
| పోలి |
తెల్లాడిబావుటా యెగురుతుండగా, నీ జులువేఁటి? ముక్కల్తియ్యడం యింతసేపైతే, మరాటేటి? |
| సిద్ధాం |
నువ్వుగానీ మళ్లీ మాట్లా`డావంటే, ముక్కలు కలిపెస్తాను. |
| (పోలిశెట్టి "నేను మాటాడను; నువ్వు ఆడు" అని సౌజ్ఞచేయును. సిద్ధాంతి ఆడును.) |
| పోలి |
మూడే తురుపులుపడ్డాయి బాపనాడా; "తమాషాదేఖో, లంకకేరాజా!" |
| సిద్ధాం |
ఆటపారెయనా? |
| పోలి |
బుద్ధొచ్చింది; బుద్ధొచ్చింది. లెంపలోయించుకుంటాను. మరి మాటాడితొట్టు. |
| పూజారి |
మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను.
రాణా, డైమనురాణీ? ।
రాణా, యిస్పేటురాణి? రాణి కళావ ।
ఱ్ఱాణా, ఆఠీన్రాణీ? ।
రాణి యనన్మధురవాణె, రాజులరాణీ ॥ |
| సిద్ధాం |
గవరయ్యా! యేంవిలవైన పద్యం చెప్పా`వోయి! నీమీద నేను పద్యంచెబుతాను - విను.
"గవరయ్యా! నీసరి మరి ।
యెవరయ్యా?" |
| పూజారి |
"యెవరు లేరు, యిచ్చోనయ్యా!" |
| సిద్ధాం |
యిదిగో రాజు. |
| పోలి |
యిదుగో పాల్తు. |
| (మధురవాణి తురుఫురాణీ వేయును.) |
| పోలి |
అదుగో, అదుగో, యీ బాపనాడు కపీశంశెప్పి, మధురవోణిదగ్గిర రాణీ వుందని శెప్పేశాడు. గోరం, గోరం. గవరయగానీ మాటాడితే నే ఆటాణ్ణు. |
| పూజారి |
పోలిశెట్టిమీద కవిత్వంచెప్పి చాలారోజులైంది. (పొడుంపీల్చి)
"పోలిశెట్టి ముఖము - పోలిరొట్టెను బోలు!
పోలిశెట్టిముక్కు పొడుముడొక్కు॥" |
| పోలి |
వొద్దు! వొద్దు! వొద్దు! నామాటిను. పా`సంపెట్టి సంపేస్తావాయేటి! ఊరుకుంటి వొట్టాయినా, యిన్నావా? యీ ఆట సిద్ధాంతి బేస్తెట్టి, నేను గెలిస్తే, నీక్కాండబ్బిస్తాను. మరూరుకో. |
| సిద్ధాం |
నీసొదతగలడా - తురుఫు మిగిలిపోయింది; బేస్తు. (ముక్కలు చూపించి పారవేయును.) |
| పోలి |
ఆఁ! మూడో యెత్తడబ్బేస్తు. గా`పకాలుంచుకొం డయ్యా, చేతివొరస, మంచిముక్కలెయి, బాపనాడా అంతసేపు కలపడవాఁ? గోరం, గోరం. |
| సిద్ధాం |
బులబులాగ్గాకలిపి, బేస్తు నీకిస్తాననుకున్నావా? |
| పోలి |
తోలుసేత్తో, ముక్కలేసినావు! "నరిసింవ్వ, నీదివ్వె నామమంతరముశాత! నరసింవ్వ నీదివ్వె-" |
| సిద్ధాం |
దివ్వేలేదు, దీపంలేదు ముక్కల్తియ్యి. |
| పోలి |
గవరయ్య ముక్కలమీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడు. నరిశింవ్వ నీదివ్వె- (ముక్కలు యెత్తిచూసి) సీ! భష్టాకారి ముక్కలేశావు. |
| సిద్ధాం |
(పంపకంముగించి తనముక్కలు తీసి చూచుకొని) మృత్తికాచమే! |
| పూజారి |
పోలిశెట్టికి అంత అలకైతే, నే నింటికిపోయి పరుంటాను. |
| (గవరయ్య నిష్క్రమించును. మధురవాణి వెంటవెళ్లి తిరిగివచ్చును.) |
| పోలి |
శని విరగడైపోయిందిరా, దేవుఁడా! - ఒట్టి భష్టాకారిముక్కలు. ఒహటీ. |
| మధు |
ఒకటి. |
| భుక్త |
ఒహటి. |
| సిద్ధాం |
ఒహటి. |
| పోలి |
రొండు. |
| మధు |
రెండు. |
| భుక్త |
రొండు. |
| (సిద్ధాంతి ఆలోచించును.) |
| పోలి |
యెందుకాయెఱ్ఱాలోశన? నామాటిను. మూడోబేస్తెట్టకు. |
| (వీధి తలుపు తట్టబడును.) |
| మధు |
పంతులు! |
| పోలి |
యీవాళరాడని సెప్పితివే? |
| మధు |
రారనుకున్నాను వొచ్చారు. యేంచేదాం? |
| సిద్ధాం |
ఆటతీసెయ్యండి. (ముక్కలుపడవేయును.) |
| పోలి |
బేస్తెగెయడానికా? నే నొప్పను. మధురోణి, ఆటాడి మరీ తలుపు తియ్యి. |
| మధు |
(ముక్కలుకిందబెట్టి, లేచి, సన్నని గొంతుకతో) గోడగెంతి పారిపోండి. |
| భుక్త |
దిడ్డితోవంట వెళ్లిపోతాం. |
| పోలి |
నేను పట్టనే? యేటి సాధనం? |
| భుక్త |
మేం దిడ్డితోవంట పోతాం. నువ్వు అటకెక్కు. |
| పోలి |
నన్నెక్కించి మరీ యెళ్లండి. కాలుజారితే యేటిసాధనం? |
| సిద్ధాం |
నీకొడుకుది, అదృష్టం. |
| (పెరటిలోకి వెళ్లును.) |
| పోలి |
గోరం! గోరం! గోరం! యవడిముక్కలు ఆడిదగ్గిరే! ఆట కలపకండి. |
| (తలుపు తిరిగీ తట్టబడును.) |
| పోలి |
నరిశింవ్వ, నీ దివ్వె- |
| (మధురవాణి ఊరుకొమ్మని కోపరసంగా సౌజ్ఞ చేయును.) |
| (సిద్ధాంతి ప్ర`వేశించును.) |
| సిద్ధాం |
దిడ్డీతలుపు కప్పతాళం వేశుంది. మన్నిపట్టుగుందావఁనే, పంతులు దిడ్డీతలుపు తాళవేఁశాడు. |
| పోలి |
నరిశింవ్వ, నీదివ్వె- |
| మధు |
(పోలిశెట్టి ఉద్దేశించి) చప్! (సన్నని గొంతుకతో) ఉలక్కుండా, పలక్కుండా యీగదిలో కూచోండి; ఆయన పరున్నతరవాత వచ్చి తలుపుతీసి వొదిలేస్తాను. |
| (మధురవాణి దీపములుఆర్పి, పైకివెళ్లి, గదితలుపువేసి గొళ్లెము బిగించును.) |
| (తలుపు తిరిగీ తట్టబడును.) |
| మధు |
యేవీఁ గవరయ్య చాదస్తం! అదే తట్టడవాఁ? (వీధితలుపుదగ్గిరకు వెళ్లి,) యెవరు! |
| తలుపవతల మనిషి |
యింతసేపేం? |
| మధు |
నిద్దరబోతున్నాను. |
| మనిషి |
పేక! పేక! పేక! నిన్నొదిలేస్తాను. నీ సంగతి నాకు తెలిసింది. |
| మధు |
మరి, మీ మానాన్న మీరు పోయి, నిశిరాత్రివేళ వొక్కర్తెనీ నన్ను వొదిలేస్తే యీ అడివి వూళ్లో నాకు భయంకాదా? అంచేత పబ్లిగ్గా నలుగుర్నీ పిలిచి పేకాడుతున్నాను. తప్పేవుఁందీ? మంచు పడుతూంది లోపలికిరండి. (తలుపు గడియతీసి) రండి. నా ఆట మీరాడండి, నేను పరుంటాను. |
| మనిషి |
సాందాన్ని యవడు నమ్మమన్నాడు? నీకిద్దావఁని సంతోషంతో వక సరుకు తెచ్చాను. నీచర్య చూసేటప్పటికి నామనస్సు చివుక్కుమని పోయింది. |
| మధు |
యెంత న్యాయంగా సంచరించినా, మీ హృదయంలో కాసింత కనికరం లేదుగదా? యీ నాటినుంచి మీరు యెక్కడికి కమాను వెళుతూవుంటే, అక్కడకల్లా నేనుకూడా మీతో వొస్తూవుంటాను. |
| మనిషి |
మెడపైకివుంచు (మధురవాణి అటులచేయును. ఆమనిషి మధురవాణి మెడలో కంటె వుంచును.) |
| మధు |
ఔరా! యింద్రజాలి! పంతులు గొంతుక యెలా పట్టా`వు? నన్నే మోసపుచ్చితివే? (రెక్కపట్టుకొని) గదులోకిరా (గదులోనికి తీసుకువెళ్లును) యీచిల్లంగి కళ్లు నీకే దేవుఁడిచ్చాడు? (ముద్దెట్టుకొనును) వాళ్లింట యేవేఁవిఁచిత్రాలు చేశావో చెప్పు. |
| శిష్యు |
ముద్దెట్టుకోనంటే చెబుతాను. |
| మధు |
నీకు తగనో? |
| శిష్యు |
ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది. |
| మధు |
నిజం. నీకున్నబుద్ధి నీ పెద్దలికిలేదు. నన్ను నిష్కారణంగా భయపెట్టా`వు. అందుకు నీ కేవిఁటిసిక్ష? బుగ్గకొరికేతునా? |
| శిష్యు |
పాలూ పంచదారావుంటే ఇయ్యి. |
| మధు |
తరవాత మేపుతాను. ముందు నీకు దాసరివేషం వేస్తాను. కొత్త అగ్రహారంపోయి నీగురువును చేరుకుందుగాని. |
| (తెరదించవలెను.) |
| (చీకటిగదిలో పోలిశెట్టి, భుక్త, సిద్ధాంతి వుందురు - తెర అవతలనుంచి రామప్పంతులు గొంతుకతో, శిష్యుడు "ఈగదులో యవణ్ణో దాచావు.") |
| మధు |
రామ ! రామ! యవ్వడూలేడు. |
| (పోలిశెట్టి నిచ్చెనయెక్కును. భుక్తకూడా యెక్కబోవును. నాలుగు మెట్లెక్కి యిద్దరూ కింద బడుదురు.) |
| పోలి |
సంపేశినావు, బాపనాడా! |
| భుక్త |
నామీద నువ్వుపడి, నేను వుక్కిరిబిక్కిరి ఔతూంటే నువ్వు సచ్చానంటావేవిఁటి? లేస్తావా కరిచేదా? |
| శిష్యు |
(రామప్పంతులు గొంతుకతో) అదుగో లోపల యెవళ్లోమాట్లాడుతున్నారు లంజా! అదికోవఁటాడి గొంతుకలావుంది. కప్పతాళంవేసి వూరందరినీ లేవదీసుకొస్తాను. |
| మధు |
కప్పతాళవెఁందుకు? లోపల యెవళ్లూలేరు దెయ్యాలకొంప - దెయ్యాలు దెబ్బలాడుతున్నాయి. |
| (మధురవాణి తలుపుతీసి గదిలో ప్రవేశించి అగ్గిపుల్ల వెలిగించును. శిష్యుడు పక్కకి తొలగిపోవును.) |
| మధు |
పోలిశెట్టియేమి, పడుకునిలేవడు - మేలుకొలుపులు పాడనా? |
| భుక్త |
రామప్పంతులేడీ? |
| మధు |
రామప్పంతులూలేరు, గీమప్పంతులూలేరు. యింట్లో పనిచేసేవాడు తలుపుకొట్టా`డు. బెంగెట్టుకోకండి. |
| భుక్త |
అతగాడిమాటలు వింటేనే? |
| మధు |
నేనే ఆయనగొంతుకు పెట్టిమాట్లాడాను. యేమిధైర్యం! యేమి మగతనం! |
| పోలి |
"నరశింవ్వ, నీ దివ్వె" (లేచి) "నామమంతరముసేత" - యవడిముక్కలాడి దగ్గిరున్నాయా? |
| (అంతా మళ్లీ ఆటకు కూచుందురు.) |
| సిద్ధాం |
ఆటకలిపేశాను. |
| పోలి |
గోరం! గోరం! నాకు యిసిపేటు ఆసు దాడదొచ్చిందిగదా, బేస్తులు గెలుసుకుపోదునే! గోరం! గోరం! మధురోణి, ఒట్టినే బెంబేరు పెట్టేశింది. అటకమీంచిపడి నడుంవిరిగిపోయిందిరా దేవుఁడా. |
| భుక్త |
నీకిందపడి నేను నలిగిపోయినాను. నీకేం తీపు దిగదీసింది? |
| పోలి |
కలిపియెయ్యెయ్యి - ముక్కలు. |
| సిద్ధాం |
నేను కలపను - నావొంతు అయిపోయింది - నువుకలుపు. |
| పోలి |
యేటైపోయింది? |
| (రామప్పంతులు వీధి తలుపుతట్టును.) |
| రామ |
లక్ష్మీ, లక్ష్మీ, తలుపు. |
| మధు |
యీ మాటు పంతులే. |
| పోలి |
యేటిసాధనం? |
| మధు |
గోడగెంతి వెళ్లిపోండి. |
| పోలిం |
నేను గెంతలేనే? |
| మధు |
నిన్ను యీగదిలో పెట్టి తాళవేఁస్తాను. |
| పోలి |
దీపం ఆరిపెయ్కు. నాకు బయవేఁస్తుంది. |
| సిద్ధాం |
గాజుపెంకులు గుచ్చుకుంటాయి; గోడదాటడం యెలాగ? |
| భుక్త |
నాకు కాళ్లు మేహవాతం నొప్పులు. నేనుగెంతలేనే? |
| మధు |
(దీపవాఁర్పి) యిలాగే వుండండి. |
| పోలి |
నరిశింవ్వ,- |
| మధు |
చప్! |
| పోలి |
సచ్చాను. |
| మధురవాణి |
(గది గొళ్లెంవేసి, వీధితలుపు గడియతీసి తలుపు ఓరగావుంచి) మాయగుంటని యెక్కడదాచారు? |
| రామ |
మాయగుంటయేమిటి? |
| మధు |
యేం నంగనాచే? లుబ్ధావధాన్లు మాయపెళ్లాన్ని వాళ్లయింట్లోంచి లేవదీసుకుపోయి యెక్కడపెట్టా`రు? యిదేకదూ, రాత్రల్లా మీరు చేస్తూవున్న లౌక్య వ్యవహారం? |
| రామ |
నీమాట నాకేవీఁ అర్థం కాకుండావుంది. యింట్లోంచి లేవదీసుకు పోవడవేఁవిఁటి? నేను దాచడవేఁవిఁటి? |
| మధు |
దాస్తే దాచారు. దాచకపోతే మానా`రు. నాకంటెయేదీ? |
| రామ |
నీకంటా`? మరిచిపోయినానుసుమా! |
| మధు |
యేమిచిత్రం! నన్ను మరిచారు - నావస్తువని మరిచారు. మరిచి, ఆగుంటకిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి యెక్కడోదాచి, నిశిరాత్రివేళ పెద్దమనిషిలా, యింటికివొచ్చారు! |
| రామ |
ఆగుంట కనపడ్డదా యేవిఁటి? |
| మధు |
యేవిఁనాటకం! మీకు కనపడకేం? మీరు పెట్టినచోటేవుంది. |
| రామ |
మీనాక్షి తన్నితగిలేశిందా యేవిఁటి? కంటెతో తగిలేస్తేచచ్చానే? |
| మధు |
యేమినాటకం! చావండి; బతకండి; ఆకంటెతాం`దీ, గడపలో కాలుపెట్టనివ్వను. (తలుపు వేయును.) |
| రామ |
నాలుగుకోసులు గుఱ్ఱపసవారీ అయి, యీదురోమని యిల్లుచేరుకుని, గుమ్మంలో అడుగుపెట్టేసరికి, మబ్బులేని పిడుగుపడ్డది. మీనాక్షి ఆగుంటని మన్ననిస్తుందని, నేను యెన్నడయినా అనుకున్నానా యేవిఁటి? ఆగుంట పోతేపోయింది, వుంటేవుంది; నాకంటె పోకుండావుంటే అదృష్టవంతుణ్ణి. కంటెఅడగడానికి వెళితే, "నువ్వే యీ పెళ్లి కుదిర్చావు" అని కఱ్ఱుచ్చు కుంటాడేమో! |
| (నిష్క్రమించును.) |