| ౫-వ స్థలము. విశాఖపట్టణంలో. |
| (మధురవాణి యింటి యదటివీధికొసను కరటకశాస్త్రి, శిష్యుడూ ప్రవేశింతురు.) |
| కరట |
నువ్వు ఆకంటె వాళ్లనెత్తిని కొట్టకుండా లేచిరావడంనుంచి, యీ ముప్పంతా వొచ్చినట్టు కనపడుతుంది. |
| శిష్యుడు |
మధురవాణికంటె మధురవాణికి యివ్వడం తప్పాఅండి? |
| కరట |
తప్పుకాదా? నువ్వు యిచ్చావని, మరి అదివొప్పుకుందా? "తే, ధగిడీకే కంటెతెస్తావా, చస్తావా?" అని రావఁప్పంతుల్ని పీకిపిండెట్టింది. దానిబాధపడలేక, ఆరావఁప్పంతులు కూనీకేసని యెత్తు యెత్తా`డు. ఆముసలాడికి సిక్ష అయిపోయిందంటే, బ్రహ్మహత్య నామెడకి చుట్టుకుంటుంది. నువ్వు అంటూ ఆకంటె వాళ్లయింట వొదిలేస్తే, నాకు యీ చిక్కు లేకపోవునుగదా? |
| శిష్యుడు |
వెధవముండ గూబగదలేస్తూంటే కంటె గింటె యవడికి జ్ఞాపకం వొస్తుందండి? చెయికరిచి, పెట్టెతీసి, మొహురు అంకించుకుని, చెంగున గోడగెంతా`ను. పజ్యండువొందలు మీరుపట్రాగా, నాకు పెళ్లిలోపెట్టిన కంటె నేను తెచ్చాననా`, తప్పుపట్టుతున్నారు? ఆకంటె అయినా దక్కిందా? చూస్తూనే మధురవాణి లాక్కుంది. |
| కరట |
నేను హాస్యగాణ్ణేగాని, యీకూనీ గడబిడతో నాహాస్యం అంతా అణిగిపోయింది. గనక యిక హాస్యంమాను - నేను తీసుకున్న రూపాయలు, లుబ్ధావధాన్లుకి యప్పటికైనా పంపించడానికే తలచాను! అంతేగాని అపహరిద్దామని అనుకోలేదు -మధురవాణిని యలాగైనా లయలేసి, కంటె యరువుపుచ్చుకుని, ఆకంటా, యీ రూపాయలూ, బంగీకట్టి అవుధాన్లుకి పంపించేస్తే, కూనీ నిజం కాదని పోల్చుకుంటారు. నాకు యీ బ్రహ్మహత్య తప్పిపోతుంది. |
| శిష్యుడు |
మీనా`స్తులు సౌజన్యారావు పంతులుగారితో నిజంచెప్పెయ్యరాదా అండి? |
| కరట |
వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకి చుట్టమనన్నాట్ట! వెనకటికి యవరో పోలీసు, తల్లి కూరగాయలు పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట; సౌజన్యారావు పంతులు అలాటివాడు. ఆయనతో మనం వున్నమాట చెప్పావఁంటే, ఆయన నిజం కోర్టులో చెప్పేస్తాడు. ఆపైని లుబ్ధావధాన్లు పీకవురి, మన పీకకి తగులుకుంటుంది. |
| శిష్యుడు |
"మన" అంటున్నారేవిఁటి? |
| కరట |
మాట పొరపాటురా. రావఁప్పంతులు వూరికి వెళ్లినమాట నిజవేఁనా? |
| శిష్యుడు |
నిజవేఁ. |
| కరట |
వాడికంట పడ్డావఁంటే- |
| శిష్యుడు |
పడితే? |
| కరట |
మరేంలేదు. మధురవాణిగాని కంటె మనకి యెరువుయివ్వడానికి వొప్పుకుంటే ఆంజనేయస్వామికి పదిశేర్లునెయ్యి దీపారాధనచేస్తాను. |
| శిష్యుడు |
కడుపులోకి వెళ్లవలసిననెయ్యి కాల్చెయ్యడం నాకేవీఁ యిష్టంలేదు. అమృతగుండీ మొక్కుకొండి. |
| కరట |
హాస్యంచాలించు బెడిసిగొడుతుంది. |
| (నిష్క్రమింతురు.) |