శతకములు ఆంధ్రనాయక శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
సీ. ఉక్కునఁ బసిఁడికన్‌ రక్కసుఁ డొకఁడు ప- ల్దిక్కు లోరిచి బొల్లిపక్కి మావు
నెక్కు రౌ తెక్కడఁ జిక్కెడు నంచు నీ- యిక్కువ లరయంగఁ గిక్కురించి
నక్కితి విలక్రిందఁ జొక్కపుఁ బంది వై- కొక్కరింపుచు నాతఁ డక్కడికిని
మొక్కరింపఁగఁ జొరఁ బొక్కతే కట వాని- డొక్కగఱుక్కునఁ జెక్కిపట్టి
 
తే. నొక్కి పుడ మింత నీటిపై కెక్కఁదీయ-మక్కువ దనర్ప నది యేమి రక్కరింపు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
61
సీ. అయవారు చదివించినట్లుగాఁ జదువక- మఱి కొట్టి తిట్టక వెఱపుఁ గొనక
తనయుఁ డెంతో పరధ్యానంబుగా నున్నఁ- దండ్రి వల్దని చెప్పఁ దగఁడె ధాత్రి
నీకుఁ గోపం బేమి నృహరిరూపంబున- స్తంభంబులోఁ బుట్టి చటులనేత్ర
దంష్ట్రానఖప్రభ దహనకీలలఁ బోలి- భగ్గు రనంగఁ బైఁబడి హిరణ్య
 
తే. కశిపుఁ దునుమాడి ప్రహ్లాదుఁ గరుణ నేలి-తందఱి కసహ్య మయ్యె ని న్నపుడె కనఁగ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
62
సీ. కశ్యపుఁ డదితి ని న్గన్నవారలు గారె- పెంచిరే మరుగుజ్జుబిడ్డ వనుచుఁ
గుండిక దండంబు గోఁచితో వచ్చిన- కపటవటుండు నిక్కముగ భూమి
సురుఁడు గాఁడని యాత్మగురుఁడీయవల దనఁ- గరుణించి బలిదాత కామితార్థ
మొసగంగ నభివృద్ధి నొంది మే లొర్వక- ధర్మంబు నాల్గుపాదముల జరుపు
 
తే. నట్టిదాతను దిగఁద్రొక్కి యతనిసిరులు-దెచ్చి కులగోత్రభేది కీ నిచ్చకంబో
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
63
సీ. జపతపోనిష్ఠుఁడౌ జమదగ్ని కుదయించి- కరము దారుణవృత్తిఁ గత్తి కట్టి
కినుక రాజద్రోహమునకు శంకింపక- సకలభూపతుల గొంతుకలు గోసి
కార్తవీర్యార్జును కరసహస్రం బొండు- తఱి గండ్రగొడ్డంట నఱికివైచి
వసుధపై రక్తప్రవాహంబు లొనరించి- తజ్జలంబులఁ బితృతర్పణములు
 
తే. సేసి యిల విప్రులకు ధారఁ బోసినట్టి-కీర్తియే కాని బ్రహ్మణ్యకృత్య మగునె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
64
సీ. తా వచ్చెద నటంచు ధైర్యలక్ష్మి మహీజ- వెంట రా నడవికి వెడలినావు
సుగ్రీవుఁ డున్నచో సొమ్ము దా నిడ సీత- యాజాడ నతనిపొం దతికినావు
ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చి నిన్‌- దెచ్చినరిపుల సాధించినావు
వైదేహి భవదంకవసతిఁ గూర్చున్నచో- భువనసామ్రాజ్యముల్‌ పొందినావు
 
తే. గట్టిగా మైథిలినిఁ జెట్టఁ బట్టినట్టి-పౌరుషము లబ్బె నేనాఁటి పూరుషుఁడవొ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
65
సీ. ధర్మవిఘాత మిద్ధర నీ వొనర్చిన- మూఁడులోకంబులు మ్రోసె నపుడె
జనకునికూఁతు నిచ్చను బెండ్లి యాడంగ- నరనాథకోటులు నవ్వి రపుడె
పుణ్యజనంబులఁ బోరి బాధింపంగ- సుర లద్భుతము నొంది చూచి రపుడె
సంతతాశ్రిత విభీషణు రాజుఁ జేయంగ- నల రవీంద్రులు సాక్షి నిలిచి రపుడె
 
తే. మంచినడవడి నడిచినా పెంచి చూడఁ-గీర్తి గల మూర్తివే యిట్టి వార్త లరయ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
66
సీ. నన్ముని నధ్వరసాఫల్యుఁ గావింప- జానకీపరిణయోత్సవము గలిగె
రవినందనునిఁ గీశరాజ్యాధిపతిఁ జేయ- సేతుబంధనకీర్తిఁ జెందఁ గలిగె
బహుదేవతాస్త్రీల బందిగంబులఁ బాపఁ- జెఱ నున్న వైదేహిఁ జెందఁ గలిగె
నలవిభీషణుని లంకాధినాథునిఁ జేయ- నెలమి నయోధ్య నీ వేలఁ గలిగె
 
తే. నబ్బె నీకుఁ బరోపకారైన ఫలము-లంతియే కాక నీచేత నైన దేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
67
సీ. ఒకపినతల్లి మే లోర్వలే కనిచిన- విపినంబులకుఁ బోవు వెఱ్ఱి గలఁడె?
తండ్రి మృతుండైనఁ దనరాజ్య మత్తఱి- నేల రాకుండిన బేల గలఁడె?
యనుజుండు వల దన నాలిమాటలు విని- చెడుగిఱ్ఱిఁ బట్టఁ బో వెడఁగు గలఁడె?
పరదేశమున నుండి బలవద్విరోధంబు- బలిపించుకొన్న వెంగలియు గలఁడె?
 
తే. నీవు సేసినపను లిట్టి నేరుపరివె-జగదుపద్రవ మెట్లు పోఁ జఱచినావొ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
68
సీ. నినుఁ గోరి కన్నతండ్రిని నీనిమిత్త మై- చింతించి మృతిఁ బొందఁ జేసినావు
నిను వని న్సేవింప ననుజు నాఁకటి కేమి- యొసఁగ కీవే పండ్లు మెసఁగినావు
నినుఁ గపు ల్గొల్చి తల్చినకార్య మీడేర్పఁ- బిదపవారలఁ జెట్లఁ బెట్టినావు
నిన్నుఁ బాయ కడవికిఁ జనుదేర నిల్లాలి- నొరుపంచఁ గొన్నాళు లుంచినావు
 
తే. రాజకళఁ జూచి ని న్నొక రాజు వనిన-మానుషం బేది? యిది యంత మాయ గాని
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
69
సీ. కులగురుద్వేషి నొజ్జలుగ పెన్కొని కాచి- నిష్ఠురమంత్రము ల్నేర్చినావు
పూర్వదేవతలు కాపుర మున్నపురియందు- వంచించి యగ్గిఁ బెట్టించినావు
తాతలతరమునఁ ద్రవ్వించినపయోధి- పేరుగాఁ గొంత పూడ్పించినావు
మోస మౌ టెఱుఁగక మోహించి వచ్చిన- యెలనాగముక్కుఁ గోయించినావు
 
తే. బళిర! నీవంటిధార్మికుఁ బ్రస్తుతింపఁ-గొదువ లింకేమి కైవల్య మెదుట వచ్చు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - AMdhranAyaka shatakamu ( telugu andhra )