| శతకములు | చక్కట్లదండ | దాసు శ్రీరాములు |
పీఠిక
డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి
ఈ చిన్నపుస్తకము పేరు "చక్కట్లదండ." ఈ పేరు అచ్చతెలుగు మాటలతో గూర్చబడినది. ఈ గ్రంథము సంస్కృతసమములు అనగా తత్సమపదములు చేరకుండ వ్రాయబడినది. కావున దీనిపేరు అట్లుగానె యుండుట యుక్తమని యేర్పరుపబడినది. చక్కట్లు = లౌకికనీతులు; దండ = మాలిక; కావున "లౌకికనీతిమాలిక" యను నర్థ మిచ్చుచున్నది. ఇది నూరు సీసపద్యములు కలదయి యున్నది. ప్రతి పద్యముయొక్క తుదను గీతచరణములు రెండుమాత్రము అన్ని పద్యములకు సమానము. అవి యేవనగా "అని పలుకు దాసురాముడిట్లచ్చ తెనుఁగు - కబ్బ మందమునిండ జక్కట్లదండ" ఈ గ్రంథమును సులభశైలిలో వ్రాయుటయేకాక లోకానుభవమువలన మనకు దెలియుచున్న వస్తువులు వాని గుణములు క్రియలు మాత్రమే దృష్టాంతములుగా గయికొనబడినవే కాని దేవతలు పిశాచములు రాక్షసులు స్వభావవిరుద్ధములై గ్రాంథికములయి కనుపట్టినవి దృష్టాంతములుగా జేకొనబడలేదు. కాని మొదటిపద్యమునందు దేవతాస్మరణము నుద్దేశించియు పదునొకండవ పద్యము యొక్క 1-3-4 పాదములయందు హిందూదేశవాసులు సుప్రసిద్ధముగా నెరిగియున్నట్టి దేవతలు పేర్కొనబడిరి.
"డకినీ" భాషలోనుండి తెలుగులో వాడుకగానుండు పదములును, ప్రకృత దేశాధీశులగు నాంగ్లేయుల భాషలోని పదములును అచ్చటచ్చట సందర్భానుకూలముగా బ్రయోగింపబడినవి. వక్రగతులు ప్రక్రమభంగములును సాధ్యమయినవట్టు లేకుండునట్టు జాగరూకతతో వ్రాయబడినది. ఇది జయసంవత్సర శ్రావణ శుద్ధ ప్రతిపత్తు నాడారంభింపబడి శ్రావణ బహుళ పంచమీ జయవాసరమునాటి రెండుజాముల పగలింట ముగింపబడినది. హూణశకము 1894వ సంవత్సరము ఆగష్టునెల యగుచున్నది. మొదటిపద్యములో బ్రహ్మదేవునకు బెమ్మయని పలుకబడినది. గ్రాంథికమగు తద్భవము బమ్మయయినను బెమ్మయని వాడుట గ్రామ్యములయందు బ్రసిద్ధమయి యున్నందునను తద్భవములకు లోకప్రసిద్ధి ముఖ్యప్రమాణమయి యున్నందునను తద్విరుద్ధమగు శబ్దజ్ఞసమయము లేదుగావునను సందర్భమునందు శ్రావ్యముగా జూపట్టినందునను అట్లు ప్రయోగింపబడియె. రేఫ, శకటరేఫల వైధర్మ్యము లేదనువారి మతమే చేకొనంబడియె. సందర్భానుకూలమగు క్రొత్తపోలికలు దొరకనిపట్టులమాత్రము పూర్వమునుండి ప్రసిద్ధిగావచ్చు పోలికలు పుచ్చుకొనబడియె. ఇవి గ్రంథమందంతటను పదిపండ్రెండుండును.
సుజనులు దోషములనుఁ బోవిడిచి గుణములున్నయెడల వానికిమాత్రము సంతసించి నన్నుం ధన్యుఁ జేయగోరెద.
| చక్కట్లదండ (లౌకికనీతిమాలిక) | ||
| సీ. | సిరికిఱొమ్మిచ్చి మచ్చికసేయు నిచ్చలు - వెన్నుండు దా వేల్పువేలుపయిన మిన్నేటిచెలి నెత్తిమీద బెట్టుక మ్రోచు - ముక్కంటి జేజేల ముదుకయయిన పలుకువెలది నోటబట్టి ముచ్చటలాడు - బెమ్మ దాదెరగంటి పెద్దయయిన కలువకంటులగద్దె గదలనీ కాడింత్రు - దెసరేండ్లు బాసవాల్దిట్టలయిన | |
| గీ. | కస్తి రానీక నిల్లాండ్ర గాచువారి - యింట సేమంబు దరుగక యుంట నిజము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 1 |
| సీ. | బంగారుబొమ్మకు రంగు బూయగనేల - పేడబొమ్మకు బూయ గూడుగాక పాసెంబునకు నూరుఁబద్ద నంజగనేల - చోడంబలిని నంజ గూడుగాక పెద్దమఱ్ఱికి గాలిబెట్టు బెట్టగనేల - మేడిమ్రోకకు బెట్ట గూడుగాక వెండిగిన్నెకు జింతపండు పుల్కాపేల - వాడ నిత్తడి కిడ గూడుగాక | |
| గీ. | వాసిగలవారి కింకొక్క వాసితోడు - వల దలంతికి నెపుడు గావలయుగాక అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 2 |
| సీ. | కోతి దాఁజెట్టెక్కి కూసినంతనె క్రింది - కొదమసింగము వాసి కొరతవడునె లంజ రాయని మెప్పురా మరుల్కొల్పిన - నిల్లాలి మరియాద చెల్లకున్నె పుల్లేరు దానెంత పొరలివచ్చిన బెద్ద - కొల్లేటి కడుపు దా గొదవయగునె ప్రాఁచితీగెలు చాల పయిబారి పెరిగిన - మద్దిమ్రానికి లావు కొద్దియగునె | |
| గీ. | క్రించుమానిసి తానెంత గింజుకొన్న - మంచివాని పొగడ్తలు మాన్పలేడు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 3 |
| సీ. | కాన్పుఁగత్తె యెరుంగుగాక యెన్నటికైన - గొడ్డురా లెరుఁగునా బిడ్డకుట్టు గండుదేటి యెరుంగుగాక యెన్నటికైన - చిరుకప్ప యెరుఁగునా విరులతావి కలమానిసి యెరుంగుగాక యెన్నటికైన - పట్టుపుర్వెరుఁగునా బట్టసొంపు కాపుబిడ్డ యెరుంగుగాక యెన్నటికైన - పిడుకెరుంగునె పాలతొడుకుపాడి | |
| గీ. | ఎరుకగలవా రెరుంగుదు రెద్దియేని - యెరుకమాలినవారి కెట్లెరుకపడును అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 4 |
| సీ. | తాటిబెల్లము వెన్నతోటి గల్పినమాత్ర - పారుబంతులకు ణ్ణేరమగునె గులకరాతికిఁ బైడి కుప్పె బెట్టిన మాత్ర - కాసులదండ మేల్పూస యగునె చెట్టగాడ్దెకు జీను గట్టితీర్చినమాత్ర - రౌతెక్క ననిలో నరబ్బి యగునె కారుదున్నకు గొల్సుఁ గట్టినమాత్ర - అంబారిగట్ట రాహుత్తి యగునె | |
| గీ. | కొంచెగానికి బొంకము ల్కూర్చినంత - గొప్పవారలతో సరిగొల్పవశమె అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 5 |
| సీ. | ఉసిరికాయనుఁ దేనె నూరఁబెట్టుదురు గా - కుల్లిపాయనుఁ బెట్టనొల్ల డొకడు కమ్మనూనెనుఁ గచోరమ్మిడి కాతురు - పేరాముదము లోనబెట్ట డొకడు క్రొత్తచీరెల గేదగులు సేర్తురేగాని - గోచిప్రాఁతలఁ జేర్చకోర డొకడు తగుతలాటము స్వారిదండె బెట్టునుగాని - దంపనాగఁటి కిడఁదలచఁ డొకడు | |
| గీ. | మేటులగు వారికేగాక మేల్మిపొత్తు - కొలదివారికి రాదెంత కొట్టుకొన్న అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 6 |
| సీ. | ముత్యాలసరిఫణీ ముసలమ్మతలకేల - కలికిమిఠారి వేనలికి గాక అద్దాలకిటికి తాటాకు గుడ్సెకునేల - బెడఁగైన రచ్చచావడికిఁ గాక బలుసీమశాలు వుప్పరి నెత్తిపయినేల - మేటినేర్పరి మేనిమీదఁ గాక తాటిపట్టెకును ముతాకి జెక్కగనేల - గణితంపుఁ టేకు చెక్కలకె గాక | |
| గీ. | విలువమాలిన వానికి విలువలేల - విలువగల మేటివలఁతుల కలరుఁ గాక అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 7 |
| సీ. | పడిసెంబు బట్టిన పాదుషా మీఁగడ - చీదునా చీమిడిఁ జీదుగాక జవరాలికిని యుబ్బ దవిలినా పన్నీరు - బుట్టునా చెమ్మట బుట్టుగాక చెరుకుతోటకుఁ బుప్పి పెరిగెనా కలకండ - రాలునా నులుపిప్పి రాలుగాక బూతపిల్లికి ముడ్డిపుచ్చెనా జవ్వాజి - కట్టునా చెడుచీము కట్టుగాక | |
| గీ. | ఎట్టివానికినైనను జెట్టదొడమి - చెట్టబుట్టించుఁగాని మేల్చేయ దెన్న అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 8 |
| సీ. | ఇసుక దాసరికాఁడ యిడకఁ యెల్లెడఁ బ్రాకు - మంచినేలను మల్లె బెంచవలయు గువ్వ రాళ్ళూర కడ్గులనంటుఁ బొలముల - గని బాటువడి రవ గాంచవలయు పిల్లికూనలు తామె యిల్లిల్లు గ్రుమ్మరు - వేమంది పులికూన వెదుకవలయు కొరమాలి నాళువల్ కొలఁకు లన్నిటనుండు - కళకు ముత్తెపుజిప్ప కడలి దొరకు | |
| గీ. | కొంచెగాండ్రెల్ల తావుల గొదువపడరు - గొప్పవారుందు రరుదుగాఁ గొన్నియెడల అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 9 |
| సీ. | గుడిసెఁ గట్టిన లంజెకొడుకెంత జదివిన - తండ్రిపేరునుఁ జెప్ప దడివికొనఁడె సాహెబుమెడ రెండు జందెప్రోవులు వైవ - సందెముక్కను నయిజాన్త యనడె పిల్లకుక్కను దెచ్చి పల్లకిపై బెట్ట - ఆరతిచ్చిన దివ్వె లార్పబోదె ఊబవానికి నొక్క యువిదను ముడి బెట్ట - నగరు పెండిలినాడు నగవుగాదె | |
| గీ. | తగనివానికి నొక దొడ్డతనముగూర్ప - నగడు పడుటయెకాని పోదలతిదనము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 10 |
| సీ. | ఆలి లోపలి యింట నడచిపెట్టంగానె - కూళగండడు రాచకొమరుడగునె దుడ్డుగోలను బట్టి దున్ననెక్కంగానె - మాలండు పెతరులవేలుపగునె గొల్ల గుడ్డల దోచి కొమ్మపైకూర్చున్న - కాటితెక్కలి తమ్మికంటి యగునె తగ వేదిగండని తలమీద నెక్కిన గ - య్యాలి మిన్నేటికన్నె యగునె | |
| గీ. | చేతనయినట్టి యొక చెట్టచేత జేసి - చవుకమానిసి బలునకు సాటియగునె అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 11 |
| సీ. | గొరియమందల గాచు గొల్లనమ్మిన కుక్క - వలికి గాచుకయుండు వదురు నక్క యేటనీళ్ళకు నాస యిడు రాచయేనుగు - మురిగిన జలదారి కరుగు బంది పెనిమిటిమాట చొప్పున బోవునిల్లాలు - తుంటరీండ్రను గొల్చు తులువ లంజె రాచకోటల మెప్పురా గాచు జెగజెట్టి - సందుగొందుల రేయిజరుగు దొంగ | |
| గీ. | మంచివారల నడవడు ల్మంచిచోట - చెడ్డవారల నడవడు ల్చెడ్డచోట అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 12 |
| సీ. | గుర్రంబుడెక్కెను గోసి రెండొనరింప - పుర్రెపై గొమ్ములు పుట్టబోవు కందమ్రోకను దలకిందుగా బ్రాతిన - కాడమీదను గాయ గాయబోదు కొండమ్రుచ్చును దోకగోసి - యింటనె పెంప ఆనువెఱిన మాటలాడబోదు పటికరాతిని సానబట్టించి తెచ్చిన - నుక్కుపోగర దెబ్బ కోర్వలేదు | |
| గీ. | పుట్టుసారయ యెట్టిఱ కట్టెనిలచు - పెట్టుసారలు వారల చెట్టకొరకె అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 13 |
| సీ. | గంజికూటికి నుప్పుగల్లు సంగాతంబు - పాలపొంగలికిని బంచదార తంబాకు సారాయితడువుచే గాటెక్కు - కమ్మవీడ్యమునకు గప్పురంబు నిప్పట్టునకు మంచినీళ్ళతో నేస్తంబు - బూందిమిఠాయి కింపొందు నేయి వరిగకూటికి లేతగురుగాకు బొరికూర - వరిబువ్వకును మంచివరుగు లిగురు | |
| గీ. | నీటు నీటునుఁ గూడియే మేటి యగును - నీచు నీచునుఁ గూడియే నిచ్చ బొలయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 14 |
| సీ. | తేనె గూర్చిన యీగ తిని చచ్చునోలేదొ - తెగదావి జుమ్మంచు దేటి తిరుగు నిట్టబారిన మున్గ నిలుచునో నిలువదో - గుజ్జుమామిడిమ్రాను గొమలు సాగు సాగుచేయని నేల చవుడెక్కి చెడిపోవు - పెడగట్ట దున్నిన మడియ పండు బలిసివీగిన మావు పారునో పారదో - పయిగోవటంగనా పారు గాక | |
| గీ. | పిసినిగొట్టుతనంబును బేరజంబు - సోమరితనంబు మేనివేరాము దగవు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 15 |
| సీ. | గున్నమామిడి లేజిగురు మేయు గోయెల - గొప్పరక్కెస పండ్లుగొరకు గాకి ఏనుంగు తలనెత్తురే క్రోలు సింగంబు - పీతబొక్కల మూతిబెట్టు నక్క నును దమ్మితూడులం దిని రాయంచ - చేపజెల్లల మట్టుసేయు మనుగొంగ పడగలెత్తిన నాగుబాముల దిను నెమ్మి - చచ్చిన పసుల కాసవడు బందు | |
| గీ. | చాలినాతడు మేటికర్జంబు సేయు - పంద నిచ్చలును మెతక పనులు సేయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 16 |
| సీ. | దూబరదిండి పొత్తున వేయిమాడలు - పొదుపరి చేతి డబ్బునకు లోటు వదురుబోతాడెడి పదివేలమాటలు - చదువరి యొకమాట సాటిగావు గుడిసెవేటిడిన పెట్టెడు సొమ్ముబంగార - మిల్లాలి మెడతాళి కీడుగాదు చండిపోతొక హరుసాలు చేసినపని - పనివాని యరజాము పనికి లొంగు | |
| గీ. | చెడుగు దానెంత పొడుగైన నడిగియుండు - మంచి కొంచెంబె యైనను మించియుండు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 17 |
| సీ. | కన్నపుగత్తి దొంగల యక్కరకె కాక - పనికివచ్చునె మేటి బవరములకు తాటాకురేక కల్ద్రాగుటకే కాక - పాటింతురే జారుపాసె మాన ఇనపమేకులు గొయ్య నెనయించుటకె గాక - కదియగొట్టుదురె బంగార మదుక పోతువేటలు మారిజాతరలకె కాక - జరుగునే తిరునాళ్ళసామి మ్రోల | |
| గీ. | క్రించు గ్రించులకే కాక మించు మెపుడు - మేడి పనులకుఁ గొఱగాడు సూడి దనరి అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 18 |
| సీ. | ములుదోటకూఱకాడలు మాడ్చి కయికొండ్రు - పెరుగుతోటాకిడి పెంచి తింద్రు నత్తగుల్లలను సున్నముజేసి యిడుకొండ్రు - ఆణిముత్యము దాల్తురఱ్ఱుదండ పులిజంపి గోళ్ళుత్రోళులు వాడుకొందురు - ఏనుగు వాదర ... కేర్పరింత్రు కాకిరెక్కలు గడగట్టి బీతార్తురు - చిలుక బంజరమున నిలిపికొండ్రు | |
| గీ. | చెడుగుమంచుల కొక్కచో విడిదియైన - పనుల బొసగించునెడ జేయు పనులు వేరు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 19 |
| సీ. | బంగారుపుల్లతో బండ్లు దోము నెవండు - వేపపుల్లను దోమి విడుచు గాక కమ్మనినేతితో గాళ్ళు గడ్గు నెవండు - కడవలో నీటితో గడుగు గాక కురివేరితో జుట్టకుదురు గట్టు నెవండు - వరిగడ్డితో గట్టి వాడు గాక రతనాలతో మూస లతికించు నెవ్వాడు - సుద్దగడ్డల జేయ జూచు గాక | |
| గీ. | కొంచెపాటుల నగునట్టి కొరలు విలువ - మంచియున్నట్టి వానిచే మెలపబడవు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 20 |
| సీ. | కాడుగాచుక యుండు తోడేలునకు గాలు - కుంటైన దోమంగగోరు నెవడు సిగ్గుమాలిన గాలిచెడిపెకు గీల్గంటు - వీడిపోయిన ముడ్చువా డెవండు చెట్లజుట్టెడు కొండచిలువ నోటను బెద్ద - యెమ్ము జిక్కిన బోవరెమ్ము నెవడు గచ్చరుప్పలకు బై పెచ్చూడి పోయిన - పేడ బూయగబోవువా డెవండు | |
| గీ. | కొరకుమాలినవారల గొడవ యడప - గనికరము మీరగా సమకట్ట డొకడు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 21 |
| సీ. | కురియక కురియక కురిసెనా మొయివారి - యెడవాన పొలమెల్ల యెద్దుకన్ను కాయక కాయక కాచెనా తగబూచి - గున్నమామిడికొమ్మ కోటివేలు ఇవ్వక ఇవ్వక ఇచ్చెనా తెగబారి - నిలువ జేసినవాడు నిలువు దోపు దాటక దాటక దాటెనా దరిమీరి - పెరిగిన మున్నీరు ఫీరుఫారు | |
| గీ. | కాకకాక యొకప్పుడు గలిగినట్టి - కర్జములు వింతలయి పొడకట్టుచుండు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 22 |
| సీ. | బాపనయ్యల జుట్టుబట్టి యీడ్చిన కాపు - వెన్నుమీదను దన్ను వెట్టి మాల అత్తగారినిఁ గాఱులాడి కొట్టిన రాఁగ - గొంతు బట్టి పిసుకుఁ గొడుకు నాలు లొజ్జు నౌకర్లఁ గాల్చుక తిన్న పయివాడు - సరదారు చేతిలోఁ జచ్చువాఁడె జాలి లేకనుఁ గప్పఁ జంపఁ జూచిన యెల్క - పడుఁ గాక యొక్కప్డు పామునోట | |
| గీ. | గడిమిఁ జూచుక సాదుల నడఁచు వారి - గడిమి యెక్కువ గలవార లడఁచుచుంద్రు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 23 |
| సీ. | గంతఁ దీసిననైన గంగిరెద్దు పొలాన - మెడద్రిప్పు డోలు చవ్వడులు విన్న విసము బిండిననైన బెనుబాము బుస్సని - కాటందు నెద్దేని గంట బడిన ఆటనేర్చిన సాని పీటపై గూర్చున్న - నడుగార్చు మద్దెల సడిని విన్న వేట బాఱిన కుక్క రాట గట్టినగాని - వఱవ జూచును గాటి పంది గన్న | |
| గీ. | బాగుగా నొక్క డలవాటు పడిన పనిని - మఱువ డాపనిమానిన తఱులనయిన అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 24 |
| సీ. | ఓరుపింతయులేక యుడుకు పీరయి మండు - లుచ్ఛాకు సాదుపల్కులు ములుకులు పున్నెంబు గానక పొరుగు మిండల కేడ్చు - లమిడికి మగని చల్లాట తీట బుద్ధిలే కాటల బ్రొద్దు బుచ్చెడు కుఱ్ఱ - బడవాకు వఱపడి వ్రాత కోత చేటుపోటెరుగక చెరలాడు బోకిరీ - బేహాకు బెద్దల పేళ్ళు తేళ్ళు | |
| గీ. | దారి మంచిది కాని పింజారులకును - తిన్నదన మబ్బునది కలగన్న వితము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 25 |
| సీ. | వెఱ్ఱిగొల్లల మ్రోల వీణె బాడిన బంబ - నాదు తోడను సాటి రాదటండ్రు కాటి రెడ్లకు హోళిగలు బెట్ట జిట్టారి - కల యట్లతో సరి గావటండ్రు వెట్టిమాలకు సన్నబట్ట గప్పగ నిడ్డ - ముతక కంబడి కంటె మెతక యనును ఒడ్డె యెడ్డెకు నత్తరుడికలో నిచ్చిన - చేపనూనియ పాటి సేయ దనును | |
| గీ. | కొంచెగా డెప్డు గొప్పను గొలది సేయు - కొలదియగుదాని గొప్పగా దలచుచుండు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 26 |
| సీ. | తగువులో నాయంబు దప్పకున్నే చాటు - లంచాల కాసించు లత్తుకోరు పెండ్లాము బలువెతల్ పెట్టకున్నే లంజె - మంచాల కాసించు మంకుబడవ కాపు పేదరికంబు గనకీడ్వడే పుట్ట - కుంచాల కాసించు గుండగొయ్యి గేస్తు లోగిటిమేలు కీళ్ళారయునె తేర - కంచాల సాసించు గాలిగ్రుడ్డు | |
| గీ. | తగవు పున్నెంబు దలచునే తప్పు పనుల - కెప్పుడును ఱెప్పదప్పని మొప్పెకూళ అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 27 |
| సీ. | తుమ్మెద జేరెనా కమ్మతావుల నాను - చీడపురుగు చేరి చెరచు దమ్మి చిట్టూద మొలచెనా చెలువు దప్పదు నేల - బిట్టల్లి మొలచి పోగొట్టు బైరు చక్కెర గలసెనా మిక్కిలి చవిగొల్పు - చవుడు గలసి చేదు సలుపు నీటి పచ్చకప్రము చొఱబారెనా కాకార్చు - గండ్రయిసుము సొచ్చి కలచు గన్ను | |
| గీ. | మంచి పొత్తైన నెందేని మంచిగాంచు - చెడుగు దలపడి కొరగాని చెయ్వు సేయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 28 |
| సీ. | చీమ కానుపు ప్రొద్దు జెప్ప నేర్చు నెవండు - చామ కానుపు జెప్ప జాలు గాక పిణుజు కాల్బందంబు బెట్ట నేర్చు నెవండు - కణుజు కాళ్ళకు బెట్ట గలుగు గాక నత్తచే గుగ్గిళ్ళు నమలించు నెవ్వాడు - గిత్తచే నమలింప నెత్తు గాక మేడిచెట్టున నుయ్యెలాడించు నెవ్వాడు - తాడి చెట్టున నిల్పువాడు గాక | |
| గీ. | క్రించువారల కెప్పుడు మించువారి - చెలిమి గలుగదు మించువారలకె గాక అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 29 |
| సీ. | అల్లారు ముద్దుగా నాడించు పసిబిడ్డ - మెడమీద గూర్చుండి యొడలు చెఱచు నేయి ముద్దయు బెట్టి నెయ్య మిచ్చిన పిల్లి - ఉట్లపై కెగసి పాలొలక బోయు పంచదారను మేపి పలుకనేర్చిన చిల్క - ముద్దు బెట్టగబోవ మూతి గఱచు కమ్మని గుగ్గిళ్ళు గంపనిండగ బెట్టి - గట్ల మేపెడి యెద్దు కర్ర గొఱుకు | |
| గీ. | ఎరుక మాలిన వారల కెంత మేలు - గూరిచిన దాని దెలియంగ లేరు సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 30 |
| సీ. | వేదురెత్తిన కుక్క వేటకై కొని పోవ - కట్టి పెంచిన వాని కాలు గఱచు కుళ్ళు గుమ్మడికాయ కూర వండుక తిన - నింటివాని కడుపుమంట బుట్టు తిట్టుబోతగు నాలి దీండ్రంబు గొని పోవ - కట్టుకొన్నాతని బెట్టు జెఱచు కారుబారని సీతు కవులు దీసిన పంట - కాపు దీరువ దండుగలనె ముంచు | |
| గీ. | చెడ్డ సాదన గయికోలు చేసినట్టి - వాని కెప్పుడు బెడదలే వచ్చుచుండు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 31 |
| సీ. | సరదారులకు లంజె బొరి దార్చు బేషరమ్ - ధగిడీలు తగుదురే తగవుదీర్ప కల్లుసారా మస్తుగా ద్రావునట్టి పుం - డాకోరు దొరయె బడా కచేరి తెన్ను గానక గడ్డిదిని పాడి దప్పు జ - టాకోరు సర్కారు నౌకరగునె చేరు గొండల నొద్ద జేర్చి పాటించు జు - వ్వాకోరు మంచి హోదాకు దగునె | |
| గీ. | ప్రజల సేమంబు నరసిన పబువులెల్ల - జబ్బువారల గొప్ప దర్జాల నిడరు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 32 |
| సీ. | కొట్టిలేపిన కోడిగూసిన మాత్రాన - నద్దమరేయెట్లు పొద్దుబొడుచు బిడ్డలాటలకు గొబ్బిళ్ళిడ్డ మాత్ర వే - సవినెట్లువచ్చును సంకురాత్రి చీకటింటను దివ్వెజేర్చినంతనె పట్ట - పగలింట నెట్లు జొప్పడును సందె పెరటిలో చెట్లెల్ల పురుగుచే మోడైన - రహివానకారాకు రాలుపగునె | |
| గీ. | ఎద్దియెప్పుడు గాదగు నద్దియప్పు - డొదవు మనమెంత జేసిన నొండుకాదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 33 |
| సీ. | పెద్దలందరుగూడి పెండ్లిసేయగబూన - జోగిసన్నాసికి జుట్టె యెరుపు మున్నీట దోరణమ్ములుకట్ట సమకట్ట - వెదురుగుంజలు బ్రాత గుదురె కరవు మినపగారెలు వండగను బెట్టజిల్లికి - కేలులేనమ్మకు వ్రేలె కొదువ సాతాని రామానుజయ్య జంగముసేయ - బిలువబోవంగొనె పేరె తప్పు | |
| గీ. | క్రొత్తపని యొక్కటొనరింప గోరెదేని - క్రొత్తలొక మరికొన్నిటి గూర్పవలయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 34 |
| సీ. | ఇచ్చలేనల్లున కెంతయొడ్డించిన - నీలకూరకు నుప్పు చాలదనును ఈసుబట్టిన యత్తనేలాగు బొగడిన - ఎగతాళి మాటలకేమి యనును తనివిదీరని గూళ తలయెత్తు బోసిన - జుట్టుమిగిలెనేని కొట్టుకొనును తగవు మాలిన మొప్పె దప్పుపై బెట్టిన - తప్పుజూచినవాని దన్నుమనును | |
| గీ. | తగినవారికి మేల్చేయదగును గాని - తగనివారద్ది చేతురు తారుమారు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 35 |
| సీ. | కలుద్రావి పాలన్న కల్లరీని బడాయి - కట్టలేమే యొక్కగడియలోన పెరిగిన కడుపులో బిల్లయో బల్లయో - తెలియలేమే రెండునెలలలోన ఏటినీళ్ళుగ దోచు నెండమావుల జాడ - యగుపడదే నాల్గడుగులలోన తెరగ్రుడ్డి పెండ్లికూతురి మేనిపొంకంబు - పట్టలేమే తలఁబ్రాలతరిని | |
| గీ. | మంచికానిది కొన్నాళ్ళు మరగియున్న - తుదకు నొక్కప్డు నిక్కంబు దోచకున్నె అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 36 |
| సీ. | తరితప్పి పెట్టు విత్తనమెంత మంచిదై - నను బాగుపడునని నమ్మరాదు ముదుసలి కట్టుకొన్నది పైడిబొమ్మయై - నను వలపిడునని నమ్మరాదు పడుచుసన్నాసెంత వడిగల నేర్పరై - నను బాళిబడడని నమ్మరాదు కడుపూప యెంతటి కాపుదీర్చినదియై - నను దియ్యనగునని నమ్మరాదు | |
| గీ. | ఎప్పుడెయ్యది చేసిన నెసగునప్డు - తగును గావింపగాదేని తప్పినడుచు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 37 |
| సీ. | ఈడిగాతని సారె యాడింప బూన్చిన - గల్లుబుడ్లను వాని కడను విడుచు ఱంకులాడికిని బేఱంటంబు సెప్పిన - గోరచూపుల మగవారి దనుపు కొంటె బాతాఖాని గొప్ప కొల్వున నుంప - ఏలినవాని సొమ్మింట జేర్చు గొఱ్ఱెకాపరి గొల్ల గొడ్డుకాపరి జేయ - పాలు పిండుచు గాలు పట్టి యెత్తు | |
| గీ. | ఎద్ది యెవ్వడు పనుపడు నద్దిసేయ - నొద్దికగు నొండు సేయంగ నోర్వడెందు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 38 |
| సీ. | కన్నముల్వైచు దొంగలకు బక్కా దగా - కోరు పంచాయతీదారు సుమ్ము తెగమండిపడు నగ్గిదేవరకును మంట - గాలిదేవర చెలికాడు సుమ్ము మాల మాదిగ తందనాల జాత్రకు బంబ - దాసరి మేటిసర్దారు సుమ్ము మగువ నేడ్పించెడి మగనికి గయ్యాళి - గట్టువాయగు తల్లిపట్టు సుమ్ము | |
| గీ. | కీడు సలిపెడి వారికి గీడు సలుపు - వారలే తోడు మరి లాతివారు కారు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 39 |
| సీ. | ప్రాతి పెట్టిన సొమ్ము పయికి లాగినగాని - మారదు బంగారు మాడలయిన కడుపులో దెవులు నేర్పడగ జాటినగాని - కుదరనేరదు రాచ కొమరుడయిన గాదెలో సరకు లంగడిని బెట్టినగాని - మనవారు కొనరెంత మంచివయిన మొదవు చంటను బాలు ప్రిదికి దీసినగాని - పనిజేయదది యెట్టి పాడిదైన | |
| గీ. | నలుగుఱెఱిగిన వానికే చెలువమెందు - జాటుగా నున్నవానికి దీటులేదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 40 |
| సీ. | మొఱయ లేనంతనె మెఱుగైన బంగారు - కంచుకంటెను గ్రించుగాదు సుమ్ము మెదుకు లేనంతనే మేలైన బాపండు - కాపు కంటెను లోపుగాడు సుమ్ము కైపు లేనంతనే కడుతావి జవ్వాజి - కాచుకంటెను నీచుగాదు సుమ్ము కడు వీగనంతనే కమ్మని కొతిమెర - గాదకంటెను బీదగాదు సుమ్ము | |
| గీ. | విలువ వంగడమునుబట్టి కలుగుగాని - అందముల చందములబట్టి పొందబోదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 41 |
| సీ. | తేలు కుట్టినవాని మేలైన పల్లకీ - మీద నెక్కించిన బాదలేదె సంచి బోయినవాని నంచఱెక్కల పాన్పు - పై బండబెట్టిన బాదలేదె ముక్కు గత్తిని గోసి ముద్దరాల్చెక్కిళ్ళు - మీద ముద్దిడుచున్న బాదలేదె పదిమడుంగుల బర్వు పైనెత్తి పైమేడ - మీద నెక్కించిన బాదలేదె | |
| గీ. | కస్తి లేనప్పుడింపగు కుస్తరింపు - కస్తికల తఱి మదికింపుగాదు సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 42 |
| సీ. | దవనంపు మొలక నెత్తావి గూర్పనె కాని - తగునే తరిగివండ నిగుఱుగూర కమ్మనావుల పాలు కాఁచి త్రాగనె కాని - తగునే కడవ దొల్పి తానమాడ చదువరి మాట ఱచ్చల జెల్లునే కాని - తగునె గామి ఖసాయి తగవు దీర్ప ఇల్లాలు జాణైన నిలు దీర్పనగుగాని - తగునే ఫిరంగీల జగడమాడ | |
| గీ. | ఎవరినే యక్కరను గూర్తురెల్ల వారు - వారినా యక్కరను గూర్పవలయు సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 43 |
| సీ. | కుందేటికిని లేడి కొమ్ములు రెండిడ్డ - మోర యోరగ జేసి పొడువగలదె బోసికి దుప్పికొమ్మున బండ్లమర్చిన - గట్టి సెన్గలు కఱకఱ నమలునె గొడ్డురాలికి జంక బిడ్డ నొక్కనిబిడ్డ - గొనగొన పాల్చేపి కుడుపగలదె మఱుగుజ్జువానికి మఱ్ఱుగాళ్ళు కట్టిన - నొప్పుగా మడచి కూర్చుండగలడె | |
| గీ. | తనకు లేనట్టి యందంబు దాల్చుకొన్న - దాన గలిగెడి కర్జమింతయును లేదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 44 |
| సీ. | ఏనుగు నెక్కగానే కాడు బలురేడు - పజల కస్తుల నెడబాప వలయు మేకను జంపగానే గాడు సోమాసి - బాపలతనివి దీర్పంగ వలయు ఎగసి తఖ్తెక్కగానే కాడు తీర్పరి - అందఱి నొకటిగా నరయ వలయు ఈటె చేపట్టగానే కాడు పోటరి - పులిమీద మార్కొని పొడువ వలయు | |
| గీ. | జాణనని పూనినంతనే జాణగాడు - ఏర్పడిన పని నెరవేర్చి నేర్పరియగు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 45 |
| సీ. | తల్లి పొట్టిదియైన బిల్లదా బొడుగైన - ఆ తల్లి కాపిల్ల యమ్మ గాదు బాపండు బడుగైన గాపందగాడైన - కాపు బాపని మ్రొక్కు గాంచలేడు కత్తి చిన్నదియైన గాయ పెద్దదియైన- కాయ కత్తిని బట్టి కోయలేదు పుత్తడి సేరైన నిత్తడి మణుగైన - పుత్తడిత్తడి గుత్త కెత్త నగునె | |
| గీ. | తక్కువొక్క వితాన దానెక్కుడైన - నిక్కమున కెప్డు దక్కువ తక్కువయగు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 46 |
| సీ. | సానితో నిచ్చ ముచ్చటలాడు విటగాడు - గుడిసెవేటును కూడు కోడె దూరు గొడ్డునంజుడు నెత్తికొనిపోయెడి గొడారి - పనికిమాలిన దెత్తు పాకిఁ దిట్టు తగునంచు గంజాయిదమ్ముగొట్టు పిసాసి - కల్లు ద్రావెడి దోసకారి దెప్పు ఏటేటి దివసాలకేగు బాపడు పాడె - దాల్చు బాపని నెగతాళిసేయు | |
| గీ. | తప్పుగలవారు తమతప్పులొప్పనుచు - తలచి యొగ్గింత్రు దమకంటె దప్పులాండ్ర అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 47 |
| సీ. | వానమిక్కిలియైన వరదంగలారవు - వరపు మిక్కిలియైన కరవు బెడద పొడవువానికి నెత్తిబొప్పుల పెనుబాద - పొట్టివానికి నీళ్ళపట్టు గొడవ ఉప్పెక్కువగు దోసెపప్పచ్చిఁ దిన గోడు - చప్పిడి దినగ వాచవికి నిడుమ బడబడ వాగిన వదురుబోతను దూరు - అరుదు బల్కిన మూగయనెడి కొదువ | |
| గీ. | ఎప్పటికినేని మిక్కిలి మెప్పుపొందు - తప్పదందున నొకకీడు దాపరించు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 48 |
| సీ. | తేలఁబండిన పండు తియ్యగానే యుండు - వగరెక్కదే కోయ బచ్చికాయ ముఱగ దున్నిన దమ్ము విరుగబండును సుమ్ము - కలయగట్టదు చాలగట్టినేల మెదిగిన బియ్యము మెదుకు గమ్మదనమ్ము - చేబియ్యపోరెమ్ము సేగిసుమ్ము ముదిరిన చింతమ్రానది చేవయెక్కును - లేతమొలక వ్రాలుఁ జేత ద్రుంప | |
| గీ. | పనులగడిదేరినట్టి నేర్పరునె కాక - కొరవడినవారు పూనిరా చెరుపు గల్గు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 49 |
| సీ. | కుక్కనెక్కి సవారుగొట్టచేర్చిన కోతి - గుఱ్ఱమెక్కి సవారు గొట్టగలదె ఈళ్ళజిక్కగ బట్టివెళ్ళించు నీర్పెన - లేళ్ళమందల నప్పళించగలదె చేరునుఁ గట్టగూర్చిన చిన్నదారంబు - తేరునుఁబట్టి రాదీయగలదె ఎద్దుమీదను కట్ట నేర్పరించిన గలత - ఏనుగువీపు తట్టెనయగలదె | |
| గీ. | ఏదియెంతటి కొనగూడు నెప్పుడేని - దానినంతటి కొనగూర్పదగును సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 50 |
| సీ. | ప్రొద్దుబొడవంగానె పోవు జుక్కలదీటు - ప్రొద్దుగ్రుంకినవెన్క దద్దమెరయు బడిపంతులెదుట గుర్రఁడు కాల్గదల్పడు - పంతులు చాటైన బంతులాడు కడలిపోటైన వెన్కకు బట్టి చనునేరు - పాటైనచో జొచ్చి పారుచుండు అత్తగారున్ననాళ్ళరవనేరదు కోడ - లాదటజూపు గయ్యాళితనము | |
| గీ. | తనకుహెచ్చిన వారలెందాక నుందు - రంతదనుకఁ దనమెప్పు లడగియుండు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 51 |
| సీ. | నెలదప్పినంతనె నిసువు పుట్టగబోదు - నిండ దొమ్మిదినెల లుండవలయు వరినాటినంతనె వడ్లురాలవు పంట - కళ్ళాల దనుకనుఁ గాయవలయు ప్రోయి నిప్పిడగానె బోనంబు రాలేదు - వార్చి డించినదాక నోర్చవలయు మ్రానుగొట్టంగానె మద్దెలకాలేదు - తొలచి మూసినదాక నిలువవలయు | |
| గీ. | ఎప్పుడెయ్యది కాదగు నప్పుడగును - గాని పూనినతోడనే కాదుసుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 52 |
| సీ. | క్రొవ్విన జెల్ల నిక్కుచు నీళ్ళమిడిసిన - గట్టుపైఁ బడుఁ బెద్దగ్రద్దనోట పోతరించిన పాము పుట్టెక్కి తలయెత్త - గ్రక్కున గడదేరు గరుడినోట పొగరుకొన్న పొటేలు తెగి మందబాసిన - వీలు జిక్కు దోడేలుబారి గుంజబట్టిన నల్లి కోడెక్కి నిలిచిన - గాసిచెందును సొంతగాని చేత | |
| గీ. | కన్నుగానక నెళవులు గదలి మిట్టి - పడినవారికి నిక్కంబు గొడవ వచ్చు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 53 |
| సీ. | బోనకత్తెకు దిస్టిబూది బెట్టిన నెంత - వచ్చు నంతియ రాణివాసమునకు కడలికిఁ దియ్యనీర్కట్టి పెట్టిన నెంత - వచ్చు నంతియ మిన్నువాక కెన్న ఆస హెచ్చినవాని కరువదిచ్చిన నెంత - వచ్చు నంతియ రాయబారికెన్న మరుగుదొడ్డికి నెర్రమన్ను బూసిన నెంత - వచ్చు నంతియ పాలగచ్చుగదికి | |
| గీ. | మొద్దునెప్పుడు తప్పులు దిద్దలేము - తప్పులెరుగనివాని దిద్దంగనేల అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 54 |
| సీ. | వేసాలపేఁడికి మీసాలమర్చిన - మూతి బిగియబట్టి మొత్తుకొనును గమిడిబర్రెకు గుడ్డ గంగడోల్కట్టిన - చీదరించుక పట్టి చించివైచు కోడితోకకు నొక్క కుంచెగట్టించిన - నెగయనేరక నేల బొగిలిపడును తుట్టెపుర్వున కొక్క త్రోలుపడగ బెట్ట - దలయెత్తనేరక దన్నుకొనును | |
| గీ. | ఒకరివలె నుండవలెనని యొకటిసేయ - నకట నదియొక్క పెనుబాదయగును సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 55 |
| సీ. | వరివెన్నువిడిచి కొబ్బరికాయ కాసించు - చిలుకేమి దిను ముక్కుచెడుట గాక గాద బోవిడిచి దిగ్గన నగ్గిపై బడు - మిడుతేమి దిను మంటబడుట కాక బుట్ల గింజలుమాని బోనులో బడు పంది - కొక్కేమి దిను లోనజిక్కు గాక చిఱిచేపలను మాని యెరపుర్వునకు బోవు - మీనేమి దిను వ్రయ్యలౌను గాక | |
| గీ. | తినుచునున్నది విడిచి యింకనొక పెద్ద - తిండి కాసించు పోవునతండు చెడును అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 56 |
| సీ. | బోసికుక్కకు దొడ్డ ముడుసెమ్ము దొరికిన - గొరుకనేరదు పాసి యుఱకలేదు ముసలాతనికి నొక్క ముద్దరాల్దొరికిన - కూడనేరడు పొత్తు వీడలేడు తిమ్మన చేనొక్క తెంకాయ దొరికిన - కొట్టలేదు విడిచి పెట్టలేదు కచ్చసానికి బాట కచ్చెరి దొరికిన - పాడనులేదు మాటాడలేదు | |
| గీ. | తినఁగలిగిఁనట్టివారికి దియ్యగూర - లేనివారికి విడువంగలేని యేడ్పు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 57 |
| సీ. | తన యింటి దివ్వె చేతను బట్ట గాలదే - తన యాలు పడచిన దప్పుగాదె తాను దీర్పరియైన దగపేద వచ్చునే - తాను ద్రావిన కల్లు పానకంబె తన కోడి వెన్కదీసిన గెల్పు గల్గునే - తన మేనికంపు నెత్తావి యగునె తన వెండ్రుకలు గట్ట దంబుర మ్రోగునే - తా బెట్టుకొను పట్టు తప్పనగునె | |
| గీ. | ఎన్నటికినైన పెరల యందేది యెగ్గు - తనకు దానిన యెగ్గుగా దలపవలయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 58 |
| సీ. | పొరుగువారికి మేలు పొందరాదంటివా - ఇరుగువారికి నీవ పొరుగువాడు ఇరుగువారికి మేలు హెచ్చరాదంటివా - పొరుగువారికి నీవ యిరుగువాడు ఇరుగుబొరుగును మేలెనయరాదంటివా - యిరుగుబొర్గున కీవ యిరుగుబొరుగు ఇరుగుబొరుగు నీవు నెనయరాదంటివా - ఇంక నెవ్వరికి మేలెనయవచ్చు | |
| గీ. | ఎల్లరకు మేలుగోరుట చెల్లు గాని - తనకు మేల్పెరలకు గీడు దలపరాదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 59 |
| సీ. | తాత గట్టిన నూయి తప్పదెన్నటికని- యుప్పునీళ్ళను ద్రావు మొప్పె గలడె పెద్దలందరు గూడి పెండ్లి చేసిరటంచు - జెడిపె బెండ్లామును జెంద గలడె కట్టుబోతులు వాడ గలరు పెక్కండ్రని - వలికి బెండిలిసేయువాడు గలడె బాపల దీవనల్ బమ్మ దీవనలని - తన యాలి నెరవిచ్చు చెనటి గలడె | |
| గీ. | కానరానట్టి యొక బల్మి కలదటంచు - కనులకును దోచు గీడెదుర్కొన గలండె అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 60 |
| సీ. | ఎలుక లల్లరిచేసి చెలఱేగినంతనే - పెణకచూరున నిప్పుబెట్టు నెవడు పంటకాలువ లోతుబారె దాటుటకంచు - కట్టల్కతో నెండగట్టు నెవడు జలుబు చేసిన జీదజాలనటంచును - ముక్కు గోసికొనెడి మొప్పె యెవడు పసిపాపలకు జంటిపాలు చాలవటంచు - మేలైన యాలి బోద్రోలు నెవడు | |
| గీ. | కొద్ది జబ్బొండు గలదని గొప్పదాని - మొదలు చెడగొట్టుకొనువాడు మొదలె చెడును అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 61 |
| సీ. | పాలు మంచివియైన బాసెంబు మంచిది - గాలి మంచిదియైన గాఱు మంచి పోగు మంచిదియైన బుట్టంబు మంచిది - పొదుగు మంచిదియైన మొదవు మంచి బసిడి మంచిదియైన బట్టెడ మంచిది - నీరు మంచిదియైన నేరు మంచి మాట మంచిదియైన మరియాద మంచిది - యీటె మంచిదియైన బోటు మంచి | |
| గీ. | మంచిగోరిన వాడెప్డు మంచిదైన - పని యొనర్పక యూఱ కేర్పడదు మంచి అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 62 |
| సీ. | తన కొంప దక్కనందరి కొంపలురలంగ - చెడుగు మానిసికోరు జిల్లిపిడుగు తన పైరు తడిసి యందరి పైరులెండంగ - చెనటి వా డాసించు జెదురుమబ్బు తన యింటనుండి యందరి యింటలేకుండ - తుంటరి తలపెట్టు గుంటిలచ్చి తన మేలె చూచి యందరి మేల్కనక యుండ - కొంటె యారయు మెల్లకంటివేల్పు | |
| గీ. | ఎల్లరకు మేలుగోరుట చెల్లుగాని - తనకె కావలెననుకొన్న దరమె పడయ అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 63 |
| సీ. | కప్పగంబము చేరి కౌగలించిన గూట - ములు లేనిదే బిడ్డ కలుగబోదు గాముగంగకు మీదు గట్టినంతనె తిండి - తినకున్న నాకలి తీరబోదు పడమటి దెసనుండి బల్లి పల్కంగానె - దొర జూడనిదె కొల్వు దొరకబోదు చందురుండును బ్రొద్దు చాలి యుండంగానె - పడుచునాడక పెండ్లి నడవబోదు | |
| గీ. | సామిగొల్చిన సగినము ల్చక్కనైన - తనదు పూనిక లేనిదే పనులు గావు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 64 |
| సీ. | పాలు పిండెడి గొల్లవాని జూడంగానె - పంచడిల్లదె మంచి పాడి మొదవు కాసు విడుచు నీటుకాని జూడంగానె - కన్నులార్పదె వెలవన్నెకత్తె మేసి వచ్చిన తల్లిమేక జూడంగానె - చిట్టడికూయవే చిరుత బొదులు మదికి నింపగు చందమామ చూడంగానె - పొంగాఱదే మిన్నుముట్టి కడలి | |
| గీ. | తనకు మేల్చేయు వారల గనిన - నొక్క డుబ్బి చెలరేగనట్లుగా కున్నలేదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 65 |
| సీ. | మొలక పాటున నడ్డి మలచికట్టిన గాని - తడబొంగు పల్లకీదండె గాదు లేత పాటున జివ్వి పాత్రగట్టిన గాని - మండ చక్కని యంటుమావి కాదు దూడ పాటున ద్రిప్పి యాడనేర్పిన గాని - ఎద్దు పన్నిన గంగిరెద్దు కాదు నారు పాటున దీసి నాటిపెంచిన గాని - దుక్కి మూసిన వరిదుబ్బు గాదు | |
| గీ. | పాటుపడి నేర్వవలె జిన్ననాటనుండి - కాని యెడ నెందునను జాణగాడు సుమ్మి అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 66 |
| సీ. | కాళ్ళు బోయినవాడు కాళ్ళకై తిరుపతి - గట్టెక్కబోయిన గదలుటెట్లు కనులు బోయినవాడు కనులకై తా గండ - జోతి జూడగబోవ జూచుటెట్లు చెవులు బోయినవాడు చెవులకై సుద్దులు - వినగబోయిన జేరి వినుటయెట్లు మాట బోయినవాడు మాటకై మంతరాల్ - చదువబోయిన బట్టి చదువుటెట్లు | |
| గీ. | కానరానట్టి మేలొండు కలదటంచు - కాని పనిసేయగా సమకట్ట దగదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 67 |
| సీ. | పట్టజాలము నీళ్ళు పాలలో గలసిన - తెలియమే పెరుగులో గలసినపుడు కనలేము కపురంబు గాలితో గలసిన - నెరుగమే దివ్వెతో బెరసినపుడు పొడకట్టలేము పుప్పొడి నేల గలసిన - కానమే పూవుతో గలసినపుడు ఎరుగలేము కనాడ దరబారు గలసిన - చీలదే పూరితో జేరినపుడు | |
| గీ. | ఒక్కడొక్కని గలసిన జక్కనదుకు - నతడె వేరొండు గలసిన నదుకడెపుడు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 68 |
| సీ. | పొట్లకాయకు రాయి గట్టుట తిన్నగా - బెరుగుటకే కాని విరుగ గాదు పసిడిరేకుల కుప్పు ముసరి కాల్చుట వన్నె - పెరుగుటకే కాని తరుగ గాదు చదివెడి వానికి జబుకుదెబ్బలు బుద్ధి - వచ్చుటకేకాని నొచ్చ గాదు జక్కిపిల్లకు గాళ్ళు నొక్కుట జక్కగా - జరుగుటకే కాని విరుగ గాదు | |
| గీ. | తొలుత నొక్కింత బాదగా దోచియున్న - మంచికై చేయు పనిని మన్నించవలయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 69 |
| సీ. | జొన్నకూటిని దిన్నయన్న కంటెను లావె - సన్న బియ్యము దిన్నయన్న బలిమి దస్తు మస్తగు జమీదారాస కెక్కుడే - నాటి బువ్వడగు సన్నాసియాస నడుము గట్టిన బోయి నడకకు మిక్కిలే - యందలం బెక్కిన యతని పరుగు పుట్టువడుగు సేయునట్టి పాటున కంటె - పలువురాండ్రగు గేస్తు సలుపు పాటు | |
| గీ. | మంచి చెడ్డల కానవాళ్ళెంచి చూడ - కలిమి పేదరికంబులు గావు సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 70 |
| సీ. | చేదస్తమున నేళ్ళు చెల్లిన బాపండు - పెద్ద చెర్వున జల్లు బేడనీళ్ళు కలవాడనని కన్ను గానని మతకరి - నెదురైన బాపని జదియగొట్టు కడుపు గట్టుక మూట గట్టు పిసినిగొట్టు - గవ్వబోయిన పూట బువ్వమాను మరులెక్కి యొడలు తిమ్మిరిగొన్న తుంటరి - వరుసవావుల బెద్దవాక గలుపు | |
| గీ. | మంచి చెడ్డల నరయక మదికి దోచి - నట్టి యొకపట్టు బట్టుట చెట్ట సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 71 |
| సీ. | నారు బోసినవాడు నీరు దా జల్లడే - బఱ్ఱె దెచ్చినవాడు పలుపు దేడె చెలమ ద్రవ్వినవాడు చేదు ద్రాడుంచడే - యెడ్లను గొన్నవాడేరు కొనడె గుడిసె గట్టినవాడు తడక దా గట్టడే - పిల్ల బెంచినవాడు పెట్టె గొనడె ఊరుగాయిడెడివా డుప్పు దా బడయడె - జిగిజక్కి కొనువాడు జీను గొనడె | |
| గీ. | గొప్పలగు నట్టివాని గైకోలు సేసి - కొదువ సేయునె వలసిన కొంచెములను అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 72 |
| సీ. | గచ్చాకు పుచ్చాకు కలిపి నూరినయుండ - మంచిమందై తెగు ల్మాన్పజాలు చెడుచెట్టు పడుచెట్టు చేరి క్రమ్మిన పట్టు - లడవిమై కలప లేవడుల దీర్చు చిరుగవ్వ మరుగవ్వ చేర్చిపెట్టిన ప్రోగు - కూరాకు లేనట్టి కొఱత దీర్చు తడచువ్వ మడచువ్వ తడకగా గట్టిన - గుక్క గుడిసెదూరు కొదువ దీర్చు | |
| గీ. | పలు దినుసులందు నది కొంచెపాటిదైన - నక్కఱకురాని దొక్కటియైన లేదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 73 |
| సీ. | నెఱసిన ముసలమ్మ నెఱులు జవ్వనమున - దుమ్మెద ఱెక్కలతోటి సాటి ఉడికి ముద్దైన గుమ్మడిపండు మున్ను పా - దుననున్నపుడు కుండతోటి సాటి చిలికి గుల్లై వంటచెఱకు జేసిన చేవ - తొలుత మ్రాకున నుక్కుతోటి సాటి పగిలి పెంకై నేలబడిన చిళ్ళప నంటి - పాటున జట్రాతితోటి సాటి | |
| గీ. | కలిమి బలుములు సతములు కావుసుమ్ము - కాఱుమాఱిన కొలదిని మాఱుచుండు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 74 |
| సీ. | పెద్దకెంపొక్కటి పెంటలో దొరికిన - విలువ తగ్గదు దానివెలుగు పోదు కమ్మ గుమ్మడిపండు కంచెలో కాసిన - చక్కదనము బోదు చవియు బోదు మల్లెపూవులు మాలపల్లెలో పూసిన - ఠీవి తగ్గదు కమ్మతావి బోదు గొప్ప నెమలిగ్రుడ్డు కోడి దా పొదిగిన - చిన్నె మాఱదు కుంచెవన్నె పోదు | |
| గీ. | వాసిగల వంగసము గలవాని కెపుడు - చోటు మాఱిన మాఱునే సొంపు బెంపు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 75 |
| సీ. | అచ్చి ఱచ్చలకెక్కునని బుచ్చి పెండ్లాడ - బుచ్చి మిండలవెంట బోవ మరుగు తోటాకు పసరంచు దోసకాయను తిన్న - దోసకాయది జల్బుచేసి విడుచు కోడూరు బురదని మేడూరు బోయిన - మేడూరులో జాస్తి మెట్ట శిస్తు జక్కిదాణా కోడి స్వారెక్క పూనిన - బోయి బత్తెములకే పోవు గడన | |
| గీ. | కొంచెమిబ్బంది కలదని క్రొత్త బూని - ప్రాత విడిచిననది దాని తాతయగును అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 76 |
| సీ. | మాఱ్చజాలక నేల మంటిలో బ్రాతిన - రూక కంటెను బుచ్చుపోక హెచ్చు కట్టజాలక మూలబెట్టెలో దాచిన - చీరకంటెను గోగునార బాగు అన్నెంబు పున్నెంబు నరయజాలక పెంచు - మేనుకంటెను ద్రోలుజీను మేలు మోహరించిన జోదుమూక జూచిన బారు - రౌతు కంటెను దున్నపోతు మిన్న | |
| గీ. | కలిగి యున్నది నలుగురు గాంచి మెచ్చ - నక్కఱకురాని దున్న లేనట్టె సుమ్ము అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 77 |
| సీ. | కఱచిన వేసి కాల్గఱచు వాడుండునే - కాక ఱాకును డబ్బు గట్టుగాక దోచిన దొంగ యిల్దోచు వాడుండునే - ఱచ్చలో ఫిర్యాదు దెచ్చుగాక కుట్టిన తేల్కొండి కుట్టు వాడుండునే - గచ్చగందము రాచి కాచుగాక పట్టిన దెయ్యంబు బట్టు వాడుండునే - గాలి బూదిడి యాన గట్టుగాక | |
| గీ. | చెడుగుచేసిన పని జేయ జెరుపుబోదు - చేయవలసిన పని జేయ జెందుమేలు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 78 |
| సీ. | కొమ్ముకోతిని నెరుంగుదునన్నవాడు రెం - డన్న నేమవి పదాఱన్న నేమి తనతల్లి గొడ్డురాలని వాడది పెద్ద - దన్ననే మైదేండ్లదన్న నేమి పనస పూచెనని చెప్పినవాడు వేరున - నన్ననే మాకులనన్న నేమి యినుము బంగరు జేతుననిన వా డఱగాంచి - యన్న నేమది కాచకన్న నేమి | |
| గీ. | దబ్బరల బన్నుగడసేయు ధగిడి కొడుకు - దొక్కదబ్బర చాలదే తక్కు విడువ అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 79 |
| సీ. | ఏగాని సొఱబుఱ్ఱ కాగానె రచ్చల - గాణ బాడగ వీణెకాయ గాదె అడవిలో బెరిగినదైనంతనే మద్ది - కొయ్య రాగద్దియకోళ్ళు గాదె యడుసులో బెరిగిన యంతనే నెత్తమ్మి - దేవేరికెంగేల దివియ రాదె పులిమేయు మెకముతోకలనున్న సీవిరి - రాయల వింజామరమ్ము గాదె | |
| గీ. | మొదల దానెంత కొలదియై యొదవి యున్న - నక్కరకువచ్చు పనిబట్టి యెక్కుడగును అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 80 |
| సీ. | తోడుపాటున కెద్దు దున్నుకోనిచ్చిన - మొగముమాడుపు కాపు ముట్టెజూచు పున్నెంబునకు గాపు పుట్టెడాళ్ళిచ్చిన - ఆసదీరని బాప డడ్డజూచు కనికరానకు నత్త గారెబూరెలు బెట్ట - కొంటెకోడలు పుట్టినింటికంపు పరువుకై కోడలు పడి యూడిగముసేయ - గట్టువాయత్త కాళ్గడుగుమనును | |
| గీ. | తనివిగల వారికిని జేయుపనులు సెల్లు - తనివి లేనట్టివారికి దగదు సేయ అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 81 |
| సీ. | రాని కన్నడబాస పూని మాటాడబో - భేకు జెప్పగబోయి సాకు జెప్పు తెలియని వాని మద్దెలగొట్ట బెట్టిన - నంటుబోనము కుడినదికి మొత్తు అలవాటులేని సాములు సేయజన గత్తి - మొనచేత బట్టుక మొదల బొడుచు ఎరుగనివాడు తానేరు బన్నగబోయి - దుంపకాడిని వైచి తుదను దున్ను | |
| గీ. | అబ్బెసములేని పనులు సేయంగరాదు - చేసెనేనియు దప్పులు సేయకున్నె అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 82 |
| సీ. | పనస వంకరయైన దొనలు పుల్లనగావు - చెరుకు వంకరయైన జేదుగాదు యేళ్ళు వంకరయైన నీళ్ళు కారెక్కవు - మెరుపు వంకరయైన మెరుగు బోదు మడి వంకరైన జామలు పొల్లుగాబోవు - పూవు వంకరయైన దావిబోదు కుడుము వంకరయైన గడుపులో నొచ్చదు - వెండి వంకరయైన విలువజెడదు | |
| గీ. | వంకరలకేమి గొనమె కావలయుగాక - యెంచి చూచిన వంకర యెందులేదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 83 |
| సీ. | కాపులందరు గూడి గంగజాతర జేయ - దొలగునే సివమాడు తొత్తుకొలువు పదుగు రూరను లంచపంచాలు బెట్టంగ - తప్పునే చాటుచందాల పోటు సాటివారలు వెట్టిచాకిరీ కొడబడ్డ - దీరునే వినక సర్కారుహుకుము వాడలో వారెల్ల వలస బోయిననెట్టు - లెత్తుపోవున బుట్ట నెత్తిబెట్ట | |
| గీ. | నలుగురేగిన దారినే నడువుమంద్రు - మంచిదో కాదొయది యేరు నెంచలేరు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 84 |
| సీ. | కల్లందరికి నొక్కకంపె కొట్టునుగాని - కంపు త్రావెడివాని కింపుసుమ్ము నల్లమందెన్న నందరికి జేదెకాని - మందు మ్రింగెడివాడు మానలేడు గంజాయి యేరికి గైపొక్కటియె కాని - కయిపు గొట్టెడువాని గలచలేదు చెడిపె పొందేరికి జెరుపు తెచ్చును గాని - చెడిపె నుంచినవాడు విడువలేడు | |
| గీ. | చెడ్డచెడ్డయె మంచిమంచియె దలంప - వాని యందిచ్చ యలవాటువలన బెరుగు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 85 |
| సీ. | నల్లికోసరము మంచంబు దెబ్బలుపడు - కురుపుకోసరము త్రోలు గోయబడును పగవానికయి కోట బగులగొట్టబడు - బలుమీలకయి చెర్వు కలచబడును పొడపామునకు బెద్దపొదలు గొట్టంబడు - కడ్డిజీరకు బైడి కరుగబడును చెదలపుట్టకు గోడ జదియగొట్టబడు - మురికికై బుట్టంబు మొత్తబడును | |
| గీ. | చెడుగుతో బొత్తు తప్పక చెరుపె తెచ్చు - మంచితనమున దామెంత మించియున్న అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 86 |
| సీ. | చినుకుగారని మబ్బు చెరగులన్నియు గ్రమ్ము - పూతబూయని మావి పొలము నిండు దారబిండని బర్రె తవుడు తట్టెడు మేయు - కొండ్ర దున్నని దున్న కొమ్ము పొడుగు వలపులేని వెలంది వగలు వడ్డికి బారు - ఏలలేని మగని బాళి మెండు తెగులుదాకిన లంజె మొగము మిసిమి హెచ్చు - కొలముతక్కువ రాయి తళుకు లెస్స | |
| గీ. | చెట్టవారికి గలయట్టి మిట్టిపాటు - మంచివారికి గానరా దెంచిచూడ అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 87 |
| సీ. | స్వారెక్కు సన్నాసి సాని నుంచిననేమి - తొడగు లంగీలను దొడిగెనేమి జందెమూడ్చిన గేస్తు సార ద్రాగిననేమి - తెల్లుల్లి నీరుల్లి దిన్ననేమి చెడిన బమ్మాసారి సిగను బెంచిననేమి - మొల్లలు మల్లెలు ముడిచెనేమి తనివిలేని తపసి దారి గొట్టిననేమి - పులుల నెలుంగుల బొడిచెనేమి | |
| గీ. | చెడ్డపని యొక్కటేచాలు జెరుపునకును - గడమపనులెల్ల దానికెక్కుడులు గావు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 88 |
| సీ. | కొంచెగానికి లచ్చి కూడివచ్చినదేని - గొడుగు దేతెమ్మను నడిమిరేయి కొంటెమ్రుక్కళి గొప్ప కొలువులో బెట్టిన - అందలంబున మేను గందుననును పనికిమాలిన కూళ బడిపెద్ద జేసిన - బసివాండ్ర దనకాళ్ళ బిసుకుమనును చెలువెరుంగని మోట సింగారమబ్బిన - నరకాళ్ళజమురు నత్తరువునగరు | |
| గీ. | అలతికిని గొప్పతన మొక్కటబ్బెనేని - అదరిపా టక్కరకుమాలినంత జూపు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 89 |
| సీ. | గుడి బట్టి దిగమ్రింగు గొప్పదెయ్యానకు - గుడి తలుపెన్న నప్పడము గాదె కడలి దోయిట బట్టు గండ్రదేవరకెల్ల - చెరువులు నెగయ తుంపురులు గావె పెద్దకొండల బట్టి పెకలించు దిట్టకు - చరియలందరి రాలు మొరము గాదె గొప్పయోడలను లోగొని కొట్టు మీలకు - చలపతెప్పలు జంతికలును గావె | |
| గీ. | అలవికానట్టిపని సేయు వలతులకును - కొలదిపని యొకపని యని తలచరాదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 90 |
| సీ. | నోట నాల్గింగిలీష్ముక్కలు నేర్చి ఫూల్ - గూసు నాన్సెన్సు యూగోవె యనును అలతి యైదారూళ్ళు కమలుదారీ చేసి - ఖబరుదార్ బాత్నకొ కాన్పక డనును మొద్దొక పల్లెకు మున్సఫీ సేయుచు - గాడ్దెకొడుక పన్నుకట్టు మనును చండి యొక్కముఠాకు సముతుదారాయెనా - కొంటెబడవ రయితు గొట్టు మనును | |
| గీ. | చదువు చదివిన హోదాలు చక్కబడిన - నోటిపట్టము గలవారి కేటిపాటి అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 91 |
| సీ. | ముషిణికాయను గాకి ముట్టకుండగ గుడ్డ - కట్టకట్టిన నేమి కలుగునందు పిల్లకాకిని గూట బెట్టి యోరెము బెట్టి - యక్కక్కయన నేమి యబ్బునందు పొట్టేలునకు వాగె బెట్టి గట్టిగ బట్టి - కదనునేర్పిన నేమి యొదవునందు పడుపు బానిసతొత్తు మెడను బంగరుతాలి - బొట్టుగట్టిన నేమి పొసగునందు | |
| గీ. | తగనివారల నొక మంచిదారి బెట్ట - గలుగు కర్జం బొకింతైన గానరాదు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 92 |
| సీ. | వ్రాతకరణమెప్డు వ్రాయుచు గూర్చుండ - మేతకర్ణము దిను రైతుసొమ్ము మంతరాల్చెప్పుచు మల్లుబొట్లుండగ - నేగాని దిగమ్రింగు నెల్లుబొట్లు కూచమ్మ కుండలో గూర్చిబెట్టుచునుండ - మాచమ్మ తాజేరి మాయజేయు కంపునోరగు మామ గడియించుచుండగా - మంచినోరల్లుడు మట్టపరచు | |
| గీ. | పాటుపడువారలొక్క రప్పాటువలన - కడుపు నిండించుకొనుచుండ్రు కడమవారు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 93 |
| సీ. | తాడిక్రిందను బాలు ద్రావినప్పటికేని - కల్లు ద్రావినవానిగ దలంత్రు వలికి లోసున్నంపు బట్టి బెట్టిననేమి - పీనుంగుకాడుగా బేరుకొండ్రు మరుగుదొడ్డికి జాటు మాటాడబోయిన - రెండువ్రేళ్ళకునయి యుండు నండ్రు సానియింటికి సందెజాము పోచిళ్ళకు - బోయిన దగులాటమాయె నండ్రు | |
| గీ. | కానిచోట సలుపు మంచి కర్జమేని - కానిపనిగా దలంపక మానరెందు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 94 |
| సీ. | అలిగెజాండరు చాల బలిమి వాడంటిమా - గుజినిమామూదెంత గొప్పవాడు గుజినిమామూదెంత గొప్పవాడంటిమా - ఔరంగజీబెంత పేరివాడు ఔరంగజీబెంత పేరివాడంటిమా - ఫ్రాంసుబుస్సీ యెంతపని యొనర్చె ఫ్రాంసుబుస్సీ యెంతపనివాడటంటిమా - యింగిరీజలను క్లయివెంతవాడు | |
| గీ. | కలిమిగలవారు పెక్కండ్రు కలరు పుడమి - నొకరనిన వారికంటె మరొకరు గలరు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 95 |
| సీ. | తెలియునే యీనేల తిరుగునం చైరోపి - యనుల గొబర్నికసునకు మున్ను ఒకదానినొకటి యీడ్చుకొను పోడిమియున్న - దని చదివిరె న్యూటనునకు మున్ను ఎరుగుదురే తపాల్ మెరుగు వేగిరమున - నడచునంచును హూకునకును మున్ను కనుగొనిరే త్రెడ్డుగాలి లేకనె యోడ - చనునంచు జేమ్సువాటునకు మున్ను | |
| గీ. | తెలిసినది తక్కలేదని తలఁచరాదు - క్రొత్తలింకను దెలియగాఁ గోరవలయు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 96 |
| సీ. | నిండియున్న పనంటి నిలిచి తాలిమి యుండ - వెలితికుండ తొళుక్కు తొళుకు మనదె అన్ని బెట్టిన విస్త రణగిమణగి యుండ - నేమిబెట్టని విస్త రెగిరిపడును తెలివి నిండినవారు థీస్టులై యొప్పంగ - మిడిమిడి చదువరుల్సుడి యెథీస్ట్లు గవరనర్ జనరలు కరుచిచ్చి పనిగొన్న - విల్లేజి మునసఫు వెట్టిగొనును | |
| గీ. | ఎక్కుడగు గొంచెగాండ్రకే యెగిరిపాటు - అణగియుందురు నెరజాణలైనవారు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 97 |
| సీ. | గెలుపుసాలిది మంచిగెలుపు నిచ్చుచునుండ - వానకారది యడ్డువచ్చునొక్కొ మింటినెల కడింది మేలె సేయుచునుండ - వన్నెతగ్గెడినాళ్ళ వాసిచెడునె పడగదాల్చెడి రోజు పట్టి మేల్సేయగా - పుడమిబుట్టిన యొక్కడడచగలడె జేజేలవెజ్జులు చేరి ప్రోచుచునుండ - చెలగిన తేలేమి సేయగలదు | |
| గీ. | మొత్తమున మంచి దా దలయెత్తి యుండ - చిన్ని దొసగులు పడియేమి సేయగలవు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 98 |
| సీ. | విక్టోరియారాణి వెలసి యేలుటబట్టి - యిండియా పొగడిక యెక్కువాయె పండ్లతోటలు దొడ్డపంటపైరుల బట్టి - మద్రాసు ప్రెసిడెన్సి మంచిదాయె తియ్యజక్కెర వంటి తెలుగునుబట్టి గో - దావరి డిస్ట్రిక్టు ఠీవిగాంచె మేలైన పనితివాచీల నేతనుబట్టి - యేలూరు పెద్దపేరెక్కనాయె | |
| గీ. | యేదయిన నొక్కవిన్నాణ మెనయకున్న - నెవ్వడేనియు నెన్నికకెక్కలేడు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 99 |
| సీ. | గెలు పిండియానాడ గెలు పింగిలీష్మాట - గెలుపు వేలుపుబాస గెలుపు తెలుగు గెలుపు స్టీమరులార గెలుపు రైల్రోడ్లార - గెలుపు హైస్కూళ్ళార గెలుపు సైన్స గెలుపు కాలువలార గెలుపు సోద్దెపుటాన - కట్టలారా టెలిగ్రాఫులార గెలుపు డార్విన్థీరి గెలుపు థియాసఫి - గెలుపు నేషనలుకాంగ్రెస్స నీకు | |
| గీ. | గెలుపు విక్టోరియారాణి గెలుపు గెలుపు - గెలుపు గెలుపని పలుకుటె గెలుపు మనకు అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ | 100 |
| చక్కట్లదండ ముగిసెను. | ||
ఈ గ్రంథమునందు 98వ సీసమువలన కవి గ్రంథసమాప్తి నొందించిన కాలము తెలియును. 99వ సీసము వలన గ్రామము తెలియును. 98వ సీసము రెండర్థములుకలదిగా నున్నది. మొదటి యర్థము వలన నీతియు, రెండవ యర్థము వలన గ్రంథసమాప్తిజేసిన కాలమును దెలియును.
కావున నిట్టి రెండర్థములు నందరికి సులభముగా తెలియుకొఱకు ఈ దిగువ నా యర్థములు వివరింపబడినవి.
| నీతినిఁ దెలుపు నర్థము | కవి గ్రంథసమాప్తిజేసిన కాలమును దెలుపు నర్థము | |
| గెలుపు సాలు | జయకరమగు సంవత్సరం | జయసంవత్సరము |
| వానకారు | వానలు గురియు కాలము | వర్షాకాలము |
| మింటి నెల | ఆకాశమునందలి చంద్రుడు | నభోమాసము అనగా శ్రావణమాసము |
| వెన్నెలతగ్గెడినాళ్ల | కళలు క్షీణించు దినములయందు | బహుళపక్షమందు |
| పడగ తాల్చెడి రోజు | ధ్వజమెత్తు దినము, మంగళకరదినము | సర్పతిథి అనగా పంచమి |
| పుడమిబుట్టిన యొక్కడు | భూమియందు బుట్టిన యొకానొకడు | భూమియందు బుట్టిన కుజుడు అనగా మంగళవారము |
| జేజేల వెజ్జులు | దేవతావైద్యులు | అశ్వనీ నక్షత్రము |
| చెలగిన తేలు | చెలరేగిన వృశ్చికము | వృశ్చికరాశి అనగా ఆనాడు మూడుగంటలకు |