| శతకములు | శివముకుంద శతకము | పరమానంద యతీంద్ర కృతము |
|
శ్రీవరగిరిజానాయక గోవింద లలాటనేత్ర గోకులతిలకా భావజసంహార హరిహర భావాత్మక శివముకుంద పరమానందా. |
1 |
|
దైవము లిద్దఱు నేకో దేవాది శ్రుతులవల్ల, దెలియఁగ నొకటే భావించెద మిము నేకీ భావంబుగ శివముకుంద పరమానందా. |
2 |
|
భక్తుల పరిపక్వములకు వ్యక్తులు రెండౌటగాక వర్ణింపఁగ న వ్యక్తం బని తెలియుట నిజ భక్తికదా శివముకుంద పరమానందా. |
3 |
|
పరమానందయతీంద్రుఁడ సురుచిరముగ మిమ్ము వాక్ప్రసూనంబులచేఁ గరమర్థిఁ బూజచేసెద పరమాత్మా శివముకుంద పరమానందా. |
4 |
|
ఒకటై రెండై మూఁడై సకలంబై యేమిగాని సహజము బయలై యకలంకమతికిఁ దోఁచును ప్రకటముగా శివముకుంద పరమానందా. |
5 |
|
తనమహిమ తనకుఁ దెలిసిన దనయందేతోఁచి యణఁగుఁ దత్త్వములెల్ల\న్ దనమహిమ తెలియఁ దనకే పనుపడవలె శివముకుంద పరమానందా. |
6 |
|
తనుఁ దాఁ దెలిసెడి మార్గం బనువుగ సద్గురులవలన నతిసులభంబౌ తనయుక్తుల శాస్త్రంబుల బనిగొన దది శివముకుంద పరమానందా. |
7 |
|
గురువాక్యము శాస్త్రార్థము గురుతుగఁ దనయనుభవంబుఁ గుదురుగ నొకటై మది నిల్చునేని యదిగా పరమార్థము శివముకుంద పరమానందా. |
8 |
|
మితిమేరలేని జన్మము లతికష్టము లనుచు నెంచి యంతటఁ దత్త్వం బతివిశదముగాఁ దెలియని బ్రతు కేటికి శివముకుంద పరమానందా. |
9 |
|
అలతత్త్వము గురుకృపచే నలవడు నని నమ్మి మిగుల నాసక్తుం డై తలపడవలె గురుభజనకుఁ బలుమాఱును శివముకుంద పరమానందా. |
10 |
|
అల సద్గురుకృప లేకయె తలపడి చదివితి మటంచుఁ దటవటసుద్దుల్ పలుకుచు తిరిగినఁ దెలివికి ఫలమౌనా శివముకుంద పరమానందా. |
11 |
|
కంటెసఁగఁ గర్మజాలము లుంటే బంధంబు దీఱదో గురుపదముల్ కంటే మోక్షము చేరువ పంటగదా శివముకుంద పరమానందా. |
12 |
|
కొందఱు తత్త్వపుమాటల సందడిఁ బడి తెలిసినట్ల సద్గురుకృప లే కుందు రనుభూతిఁ గానని పందలవలె శివముకుంద పరమానందా. |
13 |
|
తాఁటాకులు ద్రిప్పుచు పది కోటులు చదువంగ నేమి గురువాక్యంబుల్ పాటించి తెలియ కది యే ర్పా టౌనా శివముకుంద పరమానందా. |
14 |
|
నిజమైన ముక్తికొఱకై సుజనుఁడు సద్గురుని వెదకి సుస్థిరమతి యై భజియింపక గలదే గతి ప్రజలకు నిఁక శివముకుంద పరమానందా. |
15 |
|
గురుభజనఁ బాపములు చెడు గురుభజనను గర్మ ముడుగుఁ గోరిక లుడుగుం గురుభజన ముక్తికర మగు పరమాత్మా శివముకుంద పరమానందా. |
16 |
|
నాటిన యామిక విడిచి ప టాటోపము లేక నమ్రుఁడై గురుభజం బాటించక ననుభవ మే ర్పా టౌనా శివముకుంద పరమానందా. |
17 |
|
ఆదట గురుమతమున దే హాదులఁ దొలఁగంగ నేర్చునాతని మదిలో పో దిఁక సహజానందము పాదుకొను\న్ శివముకుంద పరమానందా. |
18 |
|
వినినప్పుడె కనవచ్చును యనుభవి యౌ యోగివాక్య మాదరమునఁ దా వినఁగూడని యహమికఁచే బనుపడ దది శివముకుంద పరమానందా. |
19 |
|
మాటల వినుకులఁ దగులదు సూటిగ సద్గురుఁడు చూపఁ జూచినఁ గా కే ర్పాటును గా దది కుజనులు పాటింపరు శివముకుంద పరమానందా. |
20 |
|
అతి చంచల మై తిరిగెడి మతి మీదయవల్ల నిపుడు మట్టుకు వచ్చె\న్ గతిచెడి ఱెక్కలు విఱిగిన పతగమువలె శివముకుంద పరమానందా. |
21 |
|
ఇలు వెడలి బయలుదేరక గెలిచే దేలాగు మాయఁ గినియుచు రాఁగా నిలు సొచ్చి తలుపు మూసిన బలిమేదీ శివముకుంద పరమానందా. |
22 |
|
బైలుగ మాయాభూతము హేలాగతి నొప్పుఁ గాక యేలా తొలఁగు\న్ జాల వివేకపుఁ జబుకుల పాలాడక శివముకుంద పరమానందా. |
23 |
|
ఏయెడఁ బెద్దలసంగతి సేయంగా నిత్యసుఖము చేకొనవచ్చు\న్ మాయాభూతము తొలఁగు ను పాయం బిది శివముకుంద పరమానందా. |
24 |
|
చాలం గర్మపుఁ దొట్ల\న్ సోలంగా నుంచి మాయ జోలలు వాడు\న్ లాలీయని జీవులనే బాలురఁ గని శివముకుంద పరమానందా. |
25 |
|
తానే పరదైవంబని కానక తనకన్న వేఱు గాఁదలఁచేదే యూనిన మాయారూపము భానునుతా శివముకుంద పరమానందా. |
26 |
|
తను నే నెఱుఁగనిమునుపే తనయాటలు చెల్లెఁగాక తా మా యనఁగా నను నే నెఱిఁగిన పిమ్మట పనిగలదా శివముకుంద పరమానందా. |
27 |
|
అంతా నే నై యుండగ నింతైన\న్ మాయ కునికి యెక్కడి దయ్యా యంతటఁ దొలఁగక నాతోఁ బంతంబా శివముకుంద పరమానందా. |
28 |
|
కట్టిడిమాయ యనంగా రట్టుకు లోనాయెఁగాక భ్రమ యదికాదా పట్టఁ బసలేని దది యే పట్టున నిఁక శివముకుంద పరమానందా. |
29 |
|
ఔరౌర మాయ కంటెను యేరీతిని తనగుణంబు లెఱుఁగ రటం చా నేరమి జీవులపై నిడి పాఱెడి నిఁక శివముకుంద పరమానందా. |
30 |
|
నలుదిశల నిక్కడక్కడఁ దలచూపఁగ లేక మాయ దాగెను కంటే యలపూర్ణుఁడ నేఁ గాఁగాఁ బల ముడిగెను శివముకుంద పరమానందా. |
31 |
|
కడుదబ్బఱలకు నెల్లను నొడిగట్టిన మాయగుట్టు లొగి నేఁ గనఁగాఁ బొడచూప వెఱచి తానే వడిపోయెను శివముకుంద పరమానందా. |
32 |
|
ఇది కల్లర ఛీయన్నా! వదలక యీమాయ కదియవచ్చిన నేమో ముదిలంజెవలపు చాలును పదివే లిఁక శివముకుంద పరమానందా. |
33 |
|
అవిరళతత్త్వం బెఱిఁగెడు సువిచారం బొకనిపాలిసొమ్మా మనుజుం డెవఁడైన నేమి తెలివికి భవమోచన శివముకుంద పరమానందా. |
34 |
|
ఏపాటు లేక తనలోఁ జూపట్టుచు వెలుఁగుచుండు సూక్ష్మబ్రహ్మం బేపారఁగఁ దెలియ రయో పాపాత్ములు శివముకుంద పరమానందా. |
35 |
|
శాంతంబై పూర్ణంబై యెంతయు బ్రహ్మంబు తెలివి కేర్పడ మాయా క్రాంతముగా మదిఁ దలఁచుట భ్రాంతిగదా శివముకుంద పరమానందా. |
36 |
|
పోషించి తత్త్వరచనల భాషించినఁ దెలియ లేక పామరమతు లై దూషణ చేతురు కొందఱు పాషండులు శివముకుంద పరమానందా. |
37 |
|
మెండుకొనుతత్త్వవాసన లుండదు పరిపక్వహృదయమొగిఁ గాకుంటే యెండిన కసుగా యైనది పండౌనా శివముకుంద పరమానందా. |
38 |
|
పుట్టించని సుద్దులు చెవిఁ బెట్టిన నది లెస్సగాక పిమ్మట ధరలోఁ బుట్టించెడు సుద్దులఁ జెవిఁ బట్టుదురా శివముకుంద పరమానందా. |
39 |
|
వారక సంసారంబునఁ బోరాడిన నేమి విరతిఁబొందిన నేమీ యారూఢ యోగి కది వ్యా పారంబో శివముకుంద పరమానందా. |
40 |
|
ఘోరతర కర్మవాసన లేరీతిని జుట్టి పట్టి హీనులఁ జేయ\న్ మీఱిన యజ్ఞానుల కది భారంబో శివముకుంద పరమానందా. |
41 |
|
వేషములవలన జనులఁ బ్ర మోషించి మనీషివరుల మోదము జెఱిచే దూషకులఁ గూడి పెద్దలు భాషింపరు శివముకుంద పరమానందా. |
42 |
|
అచ్చట నచ్చట నేర్చిన తచ్చన లొక కొన్ని యఱచి తత్త్వం బని తా మెచ్చిన నేమగు మాటల పచ్చ ళ్లది శివముకుంద పరమానందా. |
43 |
|
అలయంగ భూమి నుదధి స్థలి కృష్ణనివాసమైన ద్వారక నడుమ\న్ లలిఁ దను గను శివయోగియె బలవంతుఁడు శివముకుంద పరమానందా. |
44 |
|
నెల ప్రొద్దులోన గట్టిగ నెలకొని చూడంగ వలయు నీలజ్యోతి\న్ వెలి లోను గానిచూపున బలిబంధన శివముకుంద పరమానందా. |
45 |
|
పరకార్యపరులు లోకులు పరమజ్ఞానులు స్వకార్యపరు లై ధరలో నిరతిశయసుఖముఁ గాంతురు పరమాత్మా శివముకుంద పరమానందా. |
46 |
|
మేటైన బ్రహ్మవిద్యకు సూటై తగు రాజయోగసుస్థిరు లెచట\న్ బూటకపు మంత్రవిద్యలఁ బాటింపరు శివముకుంద పరమానందా. |
47 |
|
నలుగురి నొక్కటిఁ జేసిన నలుగురిలో బ్రతుకవచ్చు నాణెముగాఁ దా నలుగురిపనులకుఁ దిరిగిన ఫల మంటదు శివముకుంద పరమానందా. |
48 |
|
నలుగురిలోఁ దలవంచుక నలుగురిలోఁ గూడి మాడి నడువక వేఱై పలుపోకలఁ దిరుగును ఛీ! బలహీనుఁడు శివముకుంద పరమానందా. |
49 |
|
నలుగురికిం దా గుఱియై మెలఁగిన నది ముక్తిగతికి మేలై రాదే నలుగురితో గూడనిదే పలుచనయా శివముకుంద పరమానందా. |
50 |
|
తనయింటం దా నుండినఁ దనయిల్లే తనకుఁ జేటు దాఁ దెచ్చునయా తనయిల్లు కాలవేసిన పనిమే లది శివముకుంద పరమానందా. |
51 |
|
అద్దిర యనుభవ మెఱుఁగక వద్దనువా రెవరు లేక వదరుచుఁ దిరిగే పెద్దలసుద్దులు గిద్దులు బద్దలునా శివముకుంద పరమానందా. |
52 |
|
తలఁపు చెడఁ గర్మములు చెడుఁ దలఁపు చెడ\న్ మాయ చెడును దా ననుట చెడు\న్ తలఁపు చెడినతఁడె ముక్తికి బలవంతుఁడు శివముకుంద పరమానందా. |
53 |
|
భావంబుఁ దలఁచుటెల్ల న భావము తలఁపుడుగు టెల్లఁ బన్నుగ భావా భావాతీతము సహజము పావన మది శివముకుంద పరమానందా. |
54 |
|
అసమానరాజయోగా భ్యసనంబునఁ బడమటింటఁ బదిలుం డైతే దొసఁ గేమిలేనిముక్తికిఁ బస వట్టిది శివముకుంద పరమానందా. |
55 |
|
కలపండ్రెండు పదాఱును నలువదిరెండైనచోట నయముగ నొకటై తెలివొందు వెరవుఁ గూడిన ఫలసిద్ధౌ శివముకుంద పరమానందా. |
56 |
|
ఇల బొమ్మరిండ్లలోపల నలువున మఱి చిన్ని పాప లాడుచు నుండే సులు వెఱిఁగి యచటఁ దనుఁగన ఫలసిద్ధౌ శివముకుంద పరమానందా. |
57 |
|
మీఱిన దుర్వాసనలను గూరిన మతి నణఁపనేర్చుఁ గుశలుఁడు ధరలో నారూఢియోగవిద్యా పారీణుఁడు శివముకుంద పరమానందా. |
58 |
|
లో వెలి చూపులు రెండును బో విడువఁ దదంతరమున బొలుపగుతత్త్వం బావిధ మెఱుఁగును నిర్గుణ భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా. |
59 |
|
తలఁచినయది జడిమం బగు తలఁ పుడిగిన శూన్యమగును దలఁచిన తలఁపే సలలిత మగు చిద్బ్రహ్మము బలిబంధన శివముకుంద పరమానందా. |
60 |
|
కన్నుల ముందఱఁ దెలివై కన్నది యదికాన్పటంచుఁ గన్న యతండే పన్నుగ నిజవిద్యాసం పన్నుఁడగు\న్ శివముకుంద పరమానందా. |
61 |
|
కను వెలుఁగుననే చూచినఁ గనవచ్చును జీఁకటైనఁ గానఁగ వశమా గను గంటనె తనుఁ గనవలెఁ బనివడి తా శివముకుంద పరమానందా. |
62 |
|
లో వెలిఁ జూచిన నొకటే లో వెలిఁ గాకుండఁ జూడ లోనగు నొకటే లో వెలిఁ దానై కనుఁబో భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా. |
63 |
|
ఒకటే రెండై తోఁపఁగ నొకటిని జెప్పంగ వలసె యొకటై యున్న\న్ యొకటి నొక టేల సేయను బ్రకటముగా శివముకుంద పరమానందా. |
64 |
|
త న్నెఱుఁగనిదియు ఒకటే త న్నెఱిఁగినయదియు నొకటె తా నన రెండై యున్నది యొకటే సత్యము పన్నుగ నిఁక శివముకుంద పరమానందా. |
65 |
|
మఱచినయదియును నొకటే మఱపున నెఱిఁగెడిది యొకటె మఱువని దొకటే మఱ పెఱుక కాని దొకటే పరమాత్మా శివముకుంద పరమానందా. |
66 |
|
చూడఁగఁబడినది యొకటే వేడుకఁ జూచెడిది యొకటె వీనికి వెలియై చూడఁగవలసిన దొకటే పాడి యిదే శివముకుంద పరమానందా. |
67 |
|
కానఁగఁబడినది కాన్పును మానుగఁ గనుఁగొన్నవాఁడు మఱివీనికి లోఁ గానియతండును దానే భానునుతా శివముకుంద పరమానందా. |
68 |
|
ఇలఁ బసిఁడి లేక యేసొ మ్ములు గలుగునె తాను లేక మునుకొని జగముల్ పొలుచునె యది తాఁ గాదా బలిబంధన శివముకుంద పరమానందా. |
69 |
|
జీవునకుఁ గాక దేవుఁడు దేవునికి న్వేఱె యొక్క దేవుఁడు గలడే దేవుఁడు తానే యనఁ గను భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా. |
70 |
|
మొదటను విత్తే జగమై యదియే లేనట్టు దాని కగునాధారం బది దీనియందె నిలుచును పదిలముగా శివముకుంద పరమానందా. |
71 |
|
అతులిత సుజ్ఞానముచే క్షితిలోపల జీవముక్తిఁ జెందకయుంటే వెతగాదె తాను బ్రతికిన బ్రతుకెల్లను శివముకుంద పరమానందా. |
72 |
|
తనువెత్తఁ జేటు కింకా తను వెత్తఁగఁజూతు రేమొ తామసులు భువి\న్ దనువు చెడి ముక్తి దొరకే పని బూనరు శివముకుంద పరమానందా. |
73 |
|
తలఁపునఁ గలిగినబంధము తలఁపున నూడంగఁగొట్టి తా మించవలె\న్ ములు ముంటఁ బుచ్చువిధమున బలిబంధన శివముకుంద పరమానందా. |
74 |
|
యాగంబులు మంత్రంబులు యోగంబులు మగుడజన్మ మొసఁగును నకటా యోగులకర్మము లుడుగఁగ బాగాయెను శివముకుంద పరమానందా. |
75 |
|
దానంబులు సత్క్రియలును బూని మఱెన్నైనఁ జేయఁ బుట్టుక చెడునే దానికి వైరి వివేకము భానునుతా శివముకుంద పరమానందా. |
76 |
|
చేయఁగవలసినపని విధి సేయుటగా కనుచు నెంచి సేయుచుఁ జేసీ జేయని యాపని యదియును బాయరయా శివముకుంద పరమానందా. |
77 |
|
సృష్టికిఁ గలిగినతను విది నష్టం బని తొలఁగి తన్ను నయముగ నంత ర్దృష్టిఁ గనలేని మనుజుఁడు భ్రష్టుఁ డయా శివముకుంద పరమానందా. |
78 |
|
ఊనము జడమును విత్తును గానిది చైతన్య మెట్లు గానేర్చునయా తానే దానికి మూలము భానునుతా శివముకుంద పరమానందా. |
79 |
|
తానెఱుఁగనిపని యైన\న్ బూనఁగ మది కెట్టు లింపు పుట్టును జెపుమా దానికి నేరం బే దిఁక భానునుతా శివముకుంద పరమానందా. |
80 |
|
అన్నియుఁ దానై యుండగ నన్నియుఁ దాఁగాక తోఁచె నణఁగక వేఱా యన్నియుఁ దనలో నైక్యము పన్నుగ నిఁక శివముకుంద పరమానందా. |
81 |
|
ఎఱిఁగెడి యెఱుకను గొని తా నెఱుఁగుదుననువాఁడు జడుఁడు యెఱిఁగెడు నెఱుక\న్ మఱచిన యెఱుకే తా నగుఁ బరమాత్మా! శివముకుంద పరమానందా. |
82 |
|
ఒండెఱుఁగక తనుగంటే పండినకాన్పగుచు సర్వపరిపూర్ణం బై యుండును నదియే కన్నుల పండు వయా శివముకుంద పరమానందా. |
83 |
|
యెఱిఁగినయది జడిమంబగు యెఱుకవిడ\న్ శూన్యమగును యెఱుకే యెఱుకై నిరతిశయానందం బగు పరమాత్మా! శివముకుంద పరమానందా. |
84 |
|
కన్నది కన్నట్టే చనె విన్నది విన్నట్టె యణఁగె వినకే కనకే యున్నది యే నై యుంటిని బన్నుగ నిఁక శివముకుంద పరమానందా. |
85 |
|
కన్నది విన్నది గాకే యున్నది తుదముట్టఁ గంటి నోహో! యిది నే నెన్నఁడు నెఱుఁగనిదే సం పన్నత యో శివముకుంద పరమానందా. |
86 |
|
మాటల సందెడు నిడఁగను తాటోటులు గాక దానఁ దత్త్వంబగునే మాటల తత్త్వము లవి పరి పాటిగదా! శివముకుంద పరమానందా. |
87 |
|
మేదినిఁ గుజనులు ఘనులతొ వాదింతురు నిజముఁ గన్నవారింబలెనే యేదైనను దూషణ సం పాదింతురు శివముకుంద పరమానందా. |
88 |
|
కోటివగవిద్య లెల్లను కూటికిఁ గా కాత్మవిద్యకును సరియగునే బూటకము లనక కుజనులు పాటింపరు శివముకుంద పరమానందా. |
89 |
|
యోగంబందురు కొందఱు యోగముగా జ్ఞానమందు రొగిఁ గొంద ఱిల\న్ యోగజ్ఞానంబులు సమ భాగంబులు శివముకుంద పరమానందా. |
90 |
|
జ్ఞానం బన యోగం బనఁ గానఁగవలె నొకటికొకటి కావడికుండల్ పూనిక నొక్కట నిలువదు భానునుతా శివముకుంద పరమానందా. |
91 |
|
ఈకంటఁ జూడ లేఁడట యేకంటను జూచుటింక నెఱుఁగుట యేలా గాకన్నే యీకన్నౌ ప్రాకటముగ శివముకుంద పరమానందా. |
92 |
|
ఈకనుచూ పాకనుచూ పేకంబై నిండి నిండి హెచ్చిన సుఖమౌ వాకునఁ జెప్పఁగ వశమా ప్రాకటముగ శివముకుంద పరమానందా. |
93 |
|
దృశ్యము కూడిన తెలివి య వశ్యము బంధంబుసుమ్ము వర్ణింపంగా దృశ్యముఁ బాసినతెలివి యు పాస్యం బది శివముకుంద పరమానందా. |
94 |
|
బంధములగు కర్మంబులు సంధింపక దృశ్యములను జ్ఞానాగ్నికిఁ దా నింధనములు సేయఁగవలె బంధురగతి శివముకుంద పరమానందా. |
95 |
|
చెన్నుగ దీపముఁ జూడఁగ నెన్నగఁ వేఱొక్కదీప మేఁటికిఁ జెపుమా తన్నుండే తనుఁ గనవలెఁ బన్నుగ నిఁక శివముకుంద పరమానందా. |
96 |
|
అజ్ఞాని యొకఁడు గల్గఁగ సుజ్ఞానిఁగఁ జేయవలసె సుజ్ఞానైతే సుజ్ఞాని నేల చేయను ప్రాజ్ఞుఁడనా శివముకుంద పరమానందా. |
97 |
|
ధరలో విధియు నిషేధము నెఱుఁగడు తద్జ్ఞుండు మింటి కెగిరెడు తురగం బెఱుఁగునె మిట్టయుఁ బల్లముఁ బరమాత్మా శివముకుంద పరమానందా. |
98 |
|
దూషణ యసూయకొఱకే భాషాంతరరచన లెల్ల బ్రతుకులకొఱకే వేషము వంచనకొఱకే పాషండము శివముకుంద పరమానందా. |
99 |
|
మెండుగ లోకులవలెఁ దా నుండఁగవలెఁ గూడకున్న నొక్కెఁడ మౌనై యుండఁగవలె నేర్పరియగు పండితునకు శివముకుంద పరమానందా. |
100 |
|
ఇద్ధర నయ్యష్టమహా సిద్ధులు వలె ననుచు భ్రాంతిఁ జెందుదురేమో? సిద్ధం బగుముక్తికిఁ బ్రతి బద్ధంబులు శివముకుంద పరమానందా. |
101 |
|
అణిమాదిసిద్ధపురుషులు గుణవంతులుగాఁగ జనులు కొనియాడుదు రా గుణహీనులఁ బొగడుదురే ఫణిశాయీ శివముకుంద పరమానందా. |
102 |
|
ఒకతుచ్ఛసిద్ధిఁ జూపిన సకలజనుల్ వానిఁ జూచి సన్మానముగా సకలంకజ్ఞా నందురు ప్రకటముగా శివముకుంద పరమానందా. |
103 |
|
అణిమాదిసిద్ధు లెల్లను గణుతింపఁగ మోక్షవిధము గా దెట్లంటే నణిమాదులు సగుణంబులు ఫణిశాయీ శివముకుంద పరమానందా. |
104 |
|
సిద్ధులు జ్ఞానం బగునా సిద్ధియు దృశ్యంబు లవియుఁ జేపట్టుదురా శుద్ధములు గానిసిద్ధు ల బద్ధంబులు శివముకుంద పరమానందా. |
105 |
|
మహిమఁ గనలేరు లోకులు మహిలో బోధం బపారమహిమ యదెగదా మహిమవలె నందురజ్ఞులు బహుళముగా శివముకుంద పరమానందా. |
106 |
|
ఇహమందలి మంత్రౌషధ విహితము లీవిధులలో వివేకములేకే మహి మని చూతురు మూఢులు బహుమతిగా శివముకుంద పరమానందా. |
107 |
|
సుజ్ఞాన మహిమ యెప్పుడు సుజ్ఞానియె యెఱుఁగనేర్చు సుస్థిరమతి యై యజ్ఞాని తెలియనేర్చునె ప్రాజ్ఞునిగతి శివముకుంద పరమానందా. |
108 |
|
పరమానందయతీశ్వర విరచిత మీశతక మిలను విఖ్యాతముగా కరుణింపు త్రిజగధీశ్వర పరమాత్మా శివముకుంద పరమానందా. |
109 |
|
పరతత్త్వం బిది శతకము పరమరహస్యంబు ముక్తిభాజన మిలలో వరయోగివిలాసం బిది పరమాత్మా శివముకుంద పరమానందా. |
110 |
|
హరిహర గిరిధర పురహర గరుడధ్వజ నీలకంఠ కనకాంబర శం కర మాధవ గౌరీధవ పరమాత్మా శివముకుంద పరమానందా. |
111 |