| శతకములు | కుమారీ శతకము | ఫక్కి వేంకట నరసింహ కవి |
| క. |
శ్రీ భూ నీళా హైమవ తీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు స త్సౌభాగ్యము నీ కొసఁగఁగ లో భావించెదరు ధర్మలోల కుమారీ! |
1 |
| క. |
చెప్పెడి బుద్ధులలోపలఁ దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్ మెప్పొంది యిహపరంబులఁ దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ! |
2 |
| క. |
ఆటలఁ బాటలలో నే మాటయు రాకుండఁ దండ్రి మందిరమందున్ బాటిల్లుఁ గాపురములో వాట మెఱిఁగి బాల! తిరుగ వలయుఁ గుమారీ! |
3 |
| క. |
మగనికి నత్తకు మామకుఁ దగ సేవ యొనర్చుఁచోటఁ దత్పరిచర్యన్ మిగుల నుతిఁ బొందుచుండుట మగువలకుం బాడి తెలిసి మసలు కుమారీ! |
4 |
| క. |
పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నఁడుఁ జేయరాదు బావల కెదుటన్ కనఁబడఁగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ! |
5 |
| క. |
పరపురుషు లన్న దమ్ములు, వరుఁడే దైవంబు, తోడి పడుచులు వదినల్ మఱదండ్రు నత్తమామలు ధరఁ దల్లియుఁ దండ్రి యనియుఁ దలఁపు కుమారీ! |
6 |
| క. |
పదములపైఁ జెయివేయక మదవతి పతిచెంత నిద్ర మరగినఁ జేతుల్ గదలంగనీక కట్టుచు గదఁ గొని శిక్షించు యముఁడు కాంక్షఁ గుమారీ! |
7 |
| క. |
తెచ్చినఁ దేకుండిన నీ కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకుమీ యొచ్చెము నీపైఁ దేలును రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ! |
8 |
| క. |
మఱదండ్రు వదినె లత్తలు మఱఁదులు బావల కొమాళ్లు మఱి పెద్దలు రా నురవడిఁ బీటలు మంచము లరుఁగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ! |
9 |
| క. |
నోరెత్తి మాటలాడకు మాఱాడకు కోపపడిన మర్యాదలలో గోరంత తప్పి తిరుగక మీఱకుమీ యత్తపనుల మెలఁగు కుమారీ! |
10 |
| క. |
పతి పరకాంతలతో సం గతిఁ జేసిన నాదుపుణ్యగతి యిట్లనుచున్ మతిఁ దలఁపవలయు లేదా బతిమాలఁగవలయుఁ గలహ పడక కుమారీ! |
11 |
| క. |
పతి పాపపుఁ బనిఁజెప్పినఁ బతిమాలి మరల్పవలయుఁ బతి వినకున్నన్ హిత మనుచు నాచరింపుము మతిలోపల సంశయంబు మాని కుమారీ! |
12 |
| క. |
తిట్టిన దిట్టక, కొట్టిన గొట్టక, కోపించెనేనిఁ గోపింపక, నీ పుట్టినయింటికిఁ, బాదము పెట్టినయింటికిని వన్నె పెట్టు కుమారీ! |
13 |
| క. |
దబ్బరలాడకు కదిమిన బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధిగలిగి యెం దెబ్బెఱికముఁ బూనక కడుఁ గొబ్బునఁ జిత్తమున వానిఁ గూర్పు కుమారీ! |
14 |
| క. |
పతి భుజియించిన పాత్రను మెతు కొక్కటియైన భార్య మెసఁగుటకై తా హిత మూనకున్న నది యొక సతియే? కడుఁ బాపజాతి జగతి కుమారీ! |
15 |
| క. |
జపములు, గంగాయాత్రలు, దపములు, నోములును, దాన ధర్మంబులు, పు ణ్యపురాణము పతిభక్తికి నుపమింపను సాటి రాక యుండు కుమారీ! |
16 |
| క. |
ఇరుగు పొరుగిండ్ల కైనను వరుఁడో, కాక అత్తగారో, వదినెయొ, మామో మఱఁదియో సెల విడకుండఁగఁ దరుణి స్వతంత్రించి పోవఁ దగదు కుమారీ! |
17 |
| క. |
కూతురు చెడుగై యుండిన మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా నీతల్లిదండ్రులకు నప ఖ్యాతులు రానీయఁ గూడదమ్మ! కుమారీ! |
18 |
| క. |
అమ్మకు రెం డబ్బకు రెం డిమ్మహిఁ దిట్టించు కూఁతురెందుకు ధర నా ద్రిమ్మరి పుట్టక పోయిన నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ! |
19 |
| క. |
తన బావల పిల్లల యెడఁ దన మఱఁదుల పిల్లలందుఁ దనపిల్లల కం టెను మక్కువ యుండవలెన్ వనితల కటులైన వన్నె వచ్చుఁ గుమారీ! |
20 |
| క. |
ధనహీనుఁడైనఁ గడు దు ర్జనుఁడైనఁ గురూపియైన జారుండైనన్ విను పాపియైన నెప్పుడుఁ దనపతియే తనకు దైవతంబు కుమారీ! |
21 |
| క. |
ధనవంతు డైనఁ యప్పుడుఁ పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం గును లేమి మెలఁగ నేర్చిన వనితకు లోకమున వన్నె వచ్చుఁ గుమారీ! |
22 |
| క. |
తలిదండ్రు లన్నదమ్ములు తులఁ దూగఁగ నిమ్ము పసిడిఁ తోనైనను వా రలయింట సతత ముండుట వెలఁదికి మర్యాదగాదు వినవె కుమారీ! |
23 |
| క. |
కడుపారఁ గూడుఁ గూరలు దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా వడితనమునఁ బెనిమిటితో నెడఁ బాసి చరింపఁ గూడదెపుడు కుమారీ! |
24 |
| క. |
పిల్లలఁ గనుగొనఁ దలఁచిన యిల్లాలు గతాగతంబు లెఱుఁగక ఱాఁగై యల్లరిఁ బెట్టినఁ జెడుఁ దా నుల్లసములఁ బడును, గీడు నొందుఁ గుమారీ! |
25 |
| క. |
పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానఁగవలయున్ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరఁగు గుమారీ! |
26 |
| క. |
పోకిళ్ళు పోక పొందిక నాకులలోఁ బిందెరీతి నడఁకువగా నెం తో కలిసిమెలసి యుండిన లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ! |
27 |
| క. |
అత్తపయిన్ మఱఁదలిపయి నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై మొత్తినఁ దనకే కీడగుఁ జిత్తములో దీనిఁ జింత సేయు కుమారీ! |
28 |
| క. |
మృతియైనను బ్రతుకైనం బతితోడనె సతికిఁ జెల్లుఁ బతిబాసిన యా బ్రతు కొక బ్రతుకా! జీవ న్మృతి గాక వధూటి కెన్న నిదియుఁ గుమారీ! |
29 |
| క. |
మగని ప్రియ మబ్బె ననుచును దెగ నీలిగి యింటివారి దిగఁద్రొక్కుచు దుం డగురాలై తిరిగిన సరి మగువలలో నిదియె తప్పు మాట కుమారీ! |
30 |
| క. |
జీవములు భర్తపద రా జీవములని చిత్తమందు జింతించిన ల క్ష్మీవల్లభు చరణంబుల సేవ లతాంగులకు నెమ్మిఁ జేయుఁ గుమారీ! |
31 |
| క. |
కడు బుద్ధిగలిగి మెలఁగినఁ బడఁతుక పుట్టింటివారు పదివేలవరా లిడుకంటెఁ గీర్తియగు ద మ్మిడి లేకుండినను నేర్చి మెలఁగు కుమారీ! |
32 |
| క. |
కడుఁ బెద్దమూటఁ దెచ్చినఁ జెడుగై వర్తించు నేనిఁ జిరతర చింతం బడుదురు తల్లిదండ్రులు తోఁ బడుచులు సోదరులు నిందఁ బడుదురుఁ గుమారీ! |
33 |
| క. |
పుట్టింటివారి నీచతఁ బెట్టకు మత్తింటివారు పెట్టెడి బాధల్ పుట్టింటఁ దెలియనీకు రట్టడి చెలియందు రదియె రవ్వ కుమారీ! |
34 |
| క. |
తనకెంత మేలు చేసిన మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ వనితల కెన్నటికైనం జనవిచ్చి మెలంగరాదు జగతిఁ గుమారీ! |
35 |
| క. |
కులదేవతలకుఁ బెట్టిన పొలుపునఁ దనయింటయాఁడు బొట్టెల కెల్లం గలమాత్ర మొసఁగకుండినఁ గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ! |
36 |
| క. |
బద్ధకము సంజనిద్దుర వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్ గద్దింతు రింటివారలు మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ! |
37 |
| క. |
ఇంటఁ గల గుట్టు నీ పొరు గింట రవంతైనఁ దెలుప నేఁగకు దానం గంటనపడి నీవారలు గెంటించెద రిల్లు వెడలఁ గినుకఁ గుమారీ! |
38 |
| క. |
వేకువజామున మేల్కని పైకి వెడలి వచ్చి ప్రాచి పనిఁ దీర్పవలెన్ లేకున్నఁ దెల్లవాఱిన లోకులు నవ్వుదురు సభల లోనఁ గుమారీ! |
39 |
| క. |
ఇక్కడి దక్కడఁ నక్కడి దిక్కడఁ జెప్పినను వారి కిద్దఱికిఁ బగల్ పొక్కినఁ గల చేడియ ల మ్మక్కా! యిడుముళ్ళమారి యండ్రు కుమారీ! |
40 |
| క. |
తలవాకిట నెల్లప్పుడు నిలువఁగ రా దెప్పు డెంత నిద్దురయైనన్ మెలఁకువ విడరాదు సుమీ తల నడుచుచు విప్పికొనుట తగదు కుమారీ! |
41 |
| క. |
వారికి వీరికిఁ గలిగెను గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం చూరక గుటకలు మ్రింగుట నేరముగాఁ దలఁపవలయు నెలఁత కుమారీ! |
42 |
| క. |
కొన్నాళ్లు సుఖము కష్టము కొన్నాళ్లు భుజింపకున్నఁ గొఱగాదు సుమీ! పున్నమ దినముల వెన్నెల యెన్నంగ నమాసలందు నిరులు కుమారీ! |
43 |
| క. |
పొంతఁ బని సేయ కెన్నఁడు పంతంబులు పలుకఁబోకు ప్రాఙ్ముఖముగ నీ దంతంబులు దోమకు మే కాంతంబులు బయలుపఱుప కమ్మ! కుమారీ! |
44 |
| క. |
నడకలలో నడుగుల చ ప్పుడు వినఁబడకుండవలయు భువి గుంటలు క న్పడరాదు మడమనొక్కులఁ బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ! |
45 |
| క. |
నవ్వంగ రాదు పలుమఱు నవ్వినఁ జిఱునవ్వు గాని నగరా దెపుడున్ గవ్వలవలె దంతంబులు జవ్వునఁ గానంగ బడెడి జాడఁ గుమారీ! |
46 |
| క. |
తొడవులు మిక్కిలి గలిగినఁ గడుఁ ప్రేమన్ మగఁడు మిగుల గారామిడినన్ పడఁతుక పసుపుం గుంకుమ గడియైనను విడువ రాదు గాదె కుమారీ! |
47 |
| క. |
చెడుఁగులతో లంజెలతో గుడిసేటులతోడఁ బొత్తుఁ కూడదు మది నె ప్పుడు నిల నుత్తమ కాంతల యడుగులకు న్మడుగులొత్తు మమ్మ కుమారీ! |
48 |
| క. |
విసువకు పని తగిలినయెడఁ గసరకు సేవకుల మిగులఁ గాంతునితోడన్ రొసరొస పూనకు మాడకు మసత్యవచనంబు లెన్నఁ డైనఁ గుమారీ! |
49 |
| క. |
వేళాకోళంబులు గ య్యాళితనంబులును జగడ మాడుటలును గం గాళీపోకలుఁ గొండెము లాలోచించుటయుఁ గూడ దమ్మ కుమారీ! |
50 |
| క. |
బంతులను బక్షపాత మొ కింతైనను జేయరాదు హీనదశుల సా మతుల నొక భంగి నిరీ క్షింతురు బుధులెల్ల సంతసిల్లం గుమారీ! |
51 |
| క. |
మాసినతల మాసినయిలు మాసిన వలువలు దరిద్ర మార్గంబులు నెం తేసి ధనవంతులైనను గాసిల్లుదు రల్పదశల గ్రాఁగి కుమారీ! |
52 |
| క. |
సన్నెకలుం బొత్రమ్మును తన్నుకబోరాదు కాలఁ దగిలిన యెడలన్ గన్నుల నద్దుకొన న్వలెఁ గ్రన్నన సిరి యందు నిలుచుఁ గాదె కుమారీ! |
53 |
| క. |
దీపము వెలిగిం చెడిచోఁ జీపురుపుడ కుంచవలయుఁ జేతుల నేతం బాపము పాలౌదువు మది లోపల నిది తలఁపవలయు రూఢిం గుమారీ! |
54 |
| క. |
సరకులయెడ జాగ్రత్తయుఁ జుఱుకు పనులయందు భక్తి సుజనులయందున్ గరుణ యనాథుల యెడలం దరుణికి జెలువారవలయు ధరణిఁ గుమారీ! |
55 |
| క. |
చెప్పినఁ జెప్పక యుండినఁ దప్పక సేయంగవలయుఁ దనపనులెల్లన్ మెప్పొదవఁగాను లేదా ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ! |
56 |
| క. |
ఎంగిలి పరులకుఁ బెట్టకు క్రంగున మ్రోయంగనీకు కాల్మెట్టియలన్ బంగారు లాభ ముండిన దొంగతనము సేయుబుద్ధి దొలఁచు కుమారీ! |
57 |
| క. |
ఆపదల కోర్చి సంపద లాపయి భోగించు ననెడి హర్షోక్తుల నీ లోపలఁ దలఁచుచు లాంతరు దీపముచందమున వెలుఁగఁ దివురు కుమారీ! |
58 |
| క. |
తనకడుపు కట్టుకొని యై నను జుట్టమ్మునకు బెట్టి నను గీర్తి వహిం చును భుక్తి ముక్తు లబ్బును దన కెవ్వరు సాటిరారు ధరణిఁ గుమారీ! |
59 |
| క. |
వడి దనిపించుకొనుటకున్ గడి యైననుఁ బట్టకుండుఁ గాంతలలో నె క్కుడు గుణవతి యనిపించెడి నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ! |
60 |
| క. |
చెప్పకు చేసినమేలు నొ కప్పుడయినఁ గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందుఁ దలఁపు కుమారీ! |
61 |
| క. |
ఎంతటి యాఁకలి కలిగిన బంతిని గూర్చుండి ముందు భక్షింపకు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్ల దందు రమ్మ కుమారీ! |
62 |
| క. |
అధికారము లేనిపనుల కధికారము సేయఁబోకు మందునఁ గోపం బధికం బగు నీవారికి బుధు లది విని హర్ష మొందఁ బోరు కుమారీ! |
63 |
| క. |
తా నమ్ముడు వడియైనం దీనుండగు ధవునియార్తిఁ దీర్చగ సతికిన్ మానము చంద్రమతీ జల జాననఁ దలపోయవలయు నాత్మఁ గుమారీ! |
64 |
| క. |
తనకంటెఁ బేదరాండ్రం గని యంతకుఁ దనకు మేలు గా యనవలయున్ దనకంటె భాగ్యవంతులఁ గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ! |
65 |
| క. |
విఱుగఁబడి నడువఁ గూడదు పరుల నడక లెన్ని తప్పు బట్టఁజనదు ని ష్ఠురములు వచింపఁగూడదు కఱపఁగవలె మేలు మేలు గలదు కుమారీ! |
66 |
| క. |
కోపమున నప్పు డాడ ని రూపించినమాటఁ గొన్ని రోజులు చనినం జూపెట్టుదు నని శాంతము లోపలఁ గొనవలయు ధర్మలోల! కుమారీ! |
67 |
| క. |
కలహపడునింట నిలువదు కలుముల జవరాలు కానఁ గలకాలం బే కలహములు లేక సమ్మతి మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ! |
68 |
| క. |
గురుశుక్రవారముల మం దిర గేహళులందు లక్ష్మి తిరముగ నిలుచుం గరగరిక నలకి మ్రు గ్గిడి గురుభక్తి మెలంగఁ బాయు గొదువ కుమారీ! |
69 |
| క. |
అపకీర్తి బొందుట క ష్టపుఁబని గా దొక్క గడియ చాలును గీర్తిన్ నిపుణత వహింపవలయును జపలగుణములెల్లఁ బాసి చనఁగఁ గుమారీ! |
70 |
| క. |
సరకులు బట్టలు వన్నెల కెరవులు తేఁదగదు తెచ్చెనేని సరకు ల క్కఱఁ దీర్చుకొనుచు వెంటనె మరలింపకయున్నఁ దప్పు మాట కుమారీ! |
71 |
| క. |
గొప్పదశ వచ్చెననుచు నొ కప్పుడయిన గర్వపడకు మదిఁ దొలఁగినచో జప్పట్లు చరతు రందఱుఁ దప్పని దండించు దండధరుఁడు కుమారీ! |
72 |
| క. |
సుమతియును జంద్రమతియును దమయంతియు జానకియును ద్రౌపదియును బ న్నములం బడి పతిభక్తిం గ్రమమున నడుపుటలు తలఁప గాదె? కుమారీ! |
73 |
| క. |
సుమతి యను రమణి పతికై శ్రమనొందుట నీచసేవ సలుపుటయు వియ ద్గమననిరోధము భానున కమరించుటయుం దలంపు మాత్మఁ గుమారీ! |
74 |
| క. |
వాణియు శర్వాణియు హరి రాణియు వాక్కునను మైనురంబున నుంటల్ రాణఁ దిలకించి మదిలో బాణిగ్రాహియెడ నిల్పు భక్తిఁ గుమారీ! |
75 |
| క. |
వడ్డించునపుడు తాఁ గను బిడ్డనికిం దల్లిభంగిం బ్రేమ దలిర్పన్ వడ్డింపవలయు భర్తకు నెడ్డెతనము మానవలయు నెందుఁ గుమారీ! |
76 |
| క. |
పవళించునపుడు రంభా కువలయదళనేత్రభంగి గోరినరీతిన్ ధవుని కొనఁగూర్పవలయును దివి భువి నుతిఁ బొందునట్టి తెఱవ కుమారీ! |
77 |
| క. |
ఆలోచన యొనరించెడి వేళలలో మంత్రిభంగి వివరింపవలెన్ కాలోచిత కృత్యంబుల భూలోకమునందుఁ గీర్తి బొందుఁ గుమారీ! |
78 |
| క. |
పనిసేయునపుడు దాసీ వనితవిధంబునను మేను పంపఁగవలయున్ ధనవంతుల సుత యైనను ఘనత గలుగు దానివలనఁ గాదె కుమారీ! |
79 |
| క. |
దానములు ధర్మకార్యము లూనంగాఁ గలిగినంత యుక్తక్రియలన్ మానవతుల కిది ధర్మము గా నెఱిఁగి యొనర్పవలయుఁ గాదె కుమారీ! |
80 |
| క. |
శ్రమ యెంత సంభవించిన క్షమ మఱువఁగ రాదు ధరణి చందంబున స త్యమునఁ బ్రవర్తించిన యా రమణియె లోకంబునందు రమణి కుమారీ! |
81 |
| క. |
ఈ రీతిఁ దిరుగ నేర్చిన నారీమణి కీర్తిఁ బొందు నరలోకమునన్ దూఱులు తొలంగి పోవును ఘోరదురితసంఘ మెల్ల గుందుఁ గుమారీ! |
82 |
| క. |
కామము సంకల్పంబున బామొందెడుఁ దొలగుఁ దేహ భావము దెలియన్ వేమఱు నిది పరికించుట క్షేమం బగు ముక్తిఁ గని సుఖింపు కుమారీ! |
83 |
| క. |
పరజనము లాచరించెడి దురితంబునఁ గ్రోధగుణము దోఁచెడి నధిక స్ఫురణన్ క్షమఁ గైకొనినం దఱుఁగు నది యెఱింగి మెలఁగ దగును కుమారీ! |
84 |
| క. |
దృశ్యపదార్థము లెల్లను నశ్యము లని తలపఁ కుండినను లోపంబౌ దృశ్యంబున నస్థిరత న వశ్యము చిత్తమునఁ దలఁప వలదె కుమారీ! |
85 |
| క. |
జనియించెడు నజ్ఞానం బున మోహగుణంబు, ధర్మమునఁ బరికింపం దునుమాడఁ బడును దీనిం గనుఁగొని మెలఁగంగ వలయుఁ గాదె కుమారీ! |
86 |
| క. |
కులమున విత్తంబున వి ద్యలను మదం బుద్భవించు నాయా పెంపుల్ తలపోయ మరలు నిది హృ జ్జలజంబునఁ దలఁపవలయు సతముఁ గుమారీ! |
87 |
| క. |
మాత్సర్య మొదవు సత్యము హృత్సరసీజమున లేమి నెల్లప్పుడుఁ దా సత్సేవయందుఁ దిరిగిన మాత్సర్య మణంగుఁ దెలిసి మనుము కుమారీ! |
88 |
| క. |
బహుకష్టములం బొందక మహిలో సమకూడఁబోదు మానవజన్మం బహహా! యీ జన్మంబున నిహపరములఁ గొనెడుజాడ లెఱుఁగు కుమారీ! |
89 |
| క. |
ఎన్నాళ్లు బ్రతుకఁ బోదురు కొన్నాళ్లకు మరణదశలఁ గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ! |
90 |
| క. |
పెనిమిటికన్నఁ బతివ్రత మునుపే మృతిఁ బొందెనేనిఁ బురుషాగమనం బున కెదురుచూచు వచ్చినఁ గనుగొని యనురాగ మెనయఁ గలయుఁ గుమారీ! |
91 |
| క. |
మును నాథుఁడు దరలినచో వెనువెంటనె పోయి యెల్ల వేల్పులు పొగడం గని యెందు నిందు నందును ఘనకీర్తులఁ బొందుచుండుఁ గాదె కుమారీ! |
92 |
| క. |
మఱవవలెఁ గీడు నెన్నఁడు మఱవంగారాదు మేలు మర్యాదలలోఁ దిరుగవలె సర్వజనములు దరిఁ బ్రేమ మెలంగవలయుఁ దరుణి కుమారీ! |
93 |
| క. |
ఆకు లొకిన్నియుఁ జేకొని పోఁక నమిలి సున్న మడుగఁ బోయినఁ గని యీ లోకులు నవ్వుదురు సుమీ! కైకొనవలె మంచినడత ఘనతఁ గుమారీ! |
94 |
| క. |
నేలన్ వ్రాలిన పత్రము లోలిం జోడించి, మడచు చుండిన యవియున్ బోలఁగ సున్నపుటాకులు దూలించు దరిద్రదశల దోఁచఁ గుమారీ! |
95 |
| క. |
ఇద్దఱు గూడుక యొక చో నొద్దిక మాటాడుచుండ నొదిఁగి యొదిఁగి యా యొద్దకుఁ జనఁగూడదు తన పెద్దతనంబెల్ల నణఁగ బెట్టుఁ గుమారీ! |
96 |
| క. |
తుడుపుదుమారమ్మును జెరు గుడుధూళియు మేషరజముఁ గూడ దెపుడు మైఁ బడ నెఱిఁగి తిరుగ నేర్చిన బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ! |
97 |
| క. |
దీపములనీడ మానవ రూపంబులనీడ శనితరులనీడను ఖ ట్వాపాదిత మగు నీడ నేపట్టున నిలువఁగూడ దెపుడుఁ గుమారీ! |
98 |
| క. |
కొనగోళ్ళ వ్రేలువెండ్రుక లను జాఱెడునీళ్ళు, కుండలన్ ముంతల వా డిన వెన్క మిగులునీళ్ళును జన దండ్రు దరిద్ర మొందు జగతిఁ గుమారీ! |
99 |
| క. |
ధర బక్కికులుఁడు వేంకట నరసింహకవీంద్రుఁ డిట్టి నడతలు ధరపైఁ దెఱవల తెరువు లటంచును జిరతర సత్కీర్తి వెలయఁ జెప్పెఁ గుమారీ! |
100 |