| శతకములు | లావణ్య(సీమ)శతకము | పోలిపెద్ది వేంకటరాయకవి |
కవి పరిచయము
- శ్రీ వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
| లావణ్య(సీమ)శతకము - పోలిపెద్ది వేంకటరాయకవి | ||
| సీ. | శ్రీమదఖండలక్ష్మీప్రసన్నుడు మాక- । రాట్కులాంబోధికైరవహితుండు సరసుడౌ వేంకటపెరుమాళ్ల రాజేంద్రు- । డొకనాడు కొలువు కూర్చుండి నన్ను గని పోలిపెద్దివేంకటరాయసుకవీంద్ర । రమ్మని ప్రేమమీరంగ పురుష- విరహంబు శ్రీహరిస్మరణశృంగారంబు- । గను చమత్కృతిశతకం బొనర్పు- | |
| తే. | మనిన శారద నేకదంతుని నుతించి । నే రచించెద పద్యముల్ నేర్చినటుల నీదు కృపలేక కృతి సేయ నెవరికైన । వశమె శ్రీరామరామ లావణ్యసీమ. | 1 |
| సీ. | ముందు సత్కవిబృందములలోకి వాల్మీకి । నఖిలపౌరాణికాఖ్యాసు వ్యాసు- నతిమూఢజనుల కద్భుతనీతి భవభూతి । మహనియ్యకావ్యనిర్మాణు బాణు- నసమానశబ్దశాస్త్రసముద్రు శివభద్రు । కవిరాజితవిలాసు కాళిదాసు భవఘోరతిమిరప్రభారవి భారవి । సురుచిరసద్గుణస్తోము భీము- | |
| తే. | ననుదినంబును భక్తితో నభినుతించి । సకలజనములు విని సంతసమున జెలగ సీసశతకం బొనర్చెద చిత్తగింప । వలయు శ్రీరామరామ లావణ్యసీమ. | 2 |
| సీ. | జనకాత్మజాసుహృద్వనజాతసారంగ । సారంగధరకంఠసన్నిభాంగ యంగజానేకసమంచితసుకుమార । సుకుమారజననిసంస్తుతపదాబ్జ యబ్జబాంధవసత్కులాబ్ధిసంభవచంద్ర । చంద్రశోభితదివ్యచారుగంధ గంధసింధురదశకంఠకంఠీరవ । రవగుణశ్రుతభయక్రాంతకాండ | |
| తే. | కాండవాసిష్ఠశుకశౌనకాదివినుత । వినతసుతవాహనారూఢవిమలకరుణ కరుణ నీ కృతినాథు దీర్ఘాయు జేయ- । వలయు శ్రీరామరామ లావణ్యసీమ. | 3 |
| సీ. | పాకంబునకు తగు ఫణితి గానక కిరీ- । టము బెట్టినట్లు నీమములు లేక తెనుగు పొయ్యెటి జాడ తెలియజాలక పెక్కు । శృంగారరీతులు చేతగాక గ్రామ్యదేశ్యమ్ముల క్రమములెరుంగక । జాతీయములు గూర్చు సరణి రాక పెళుచుమాటల దొంతి బేర్చుచు సాధార- । ణములౌ యతిప్రయోగములు లేక | |
| తే. | నొకరి కయితను గని హేళనోక్తులాడు । కుకవిశుంఠల మూతిపై గొట్టినటుల నేనొనర్చెద పద్యముల్ నీదు కరుణ । వచ్చునటుల రామరామ లావణ్యసీమ. | 4 |
| సీ. | శ్రీకరంబుగ ప్రేమచే నాదు మనసు రా । నడుచుకొన్నట్టి నీ నాగరికము వినయవివేకభావనలొప్ప కందువ । మాటలాడెడు నెరనీటుతనము దర్పకశాస్త్రపద్ధతి మీరి కళలంటి । సొక్కించునట్టి నీ సోయగము సరసత్వమున బంధసరణి గుర్తెరిగి నన్ । రతుల తేలించు నీ రసికతయును | |
| తే. | మదిని తలపోసి యితరరామలను రోసి । నేర్పు వెడజేసి కంటికి నిదురబాసి మమత నిను డాసియుండక మరుని గాసి । వశమటే రామరామ లావణ్యసీమ. | 5 |
| సీ. | ఇసుకదిన్నెలను నీరెండ గాసినయటు- । వలె పిరుందులనంటి వల్వ దనర దంతపుభరిణమూతల రంగు బూసిన । కరణి గుబ్బల కంచుకంబు వెలుగ కొనచెవి పచ్చడాల్ గోడల బీరాకు । పసరు చల్లిన రీతి పరిఢవిల్ల రాజబింబము నపరంజితీగెను గొల్చి । చూచిన గతి తిరుచూర్ణరేఖ | |
| తే. | ముద్దుమొగమున నత్యంతముదము దోప । తొలుత నేస్తంబునకు నన్ను బిలిచినట్టి కులుకుబెళుకును తలపోసి వలపు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 6 |
| సీ. | తరళాక్షి నీ మేనితావి ఘమ్మన నాదు । మనసు ఝుమ్మని రేగి మరులు జెందు చెలి నీదు గిల్కుటందెలు ఘల్లుమని మ్రోయ । తనువు ఝల్లని యేమొ తత్తరించు మగువ నీ సొగసు కల్మా ధళుక్కనినంత । కళ చళుక్కని లోన కలకబారు నొకవేళ కోపగించుక గిరుక్కన మరుం । డట చురుక్కన పూవుటమ్ము వేయు | |
| తే. | వెలది కడుసోలి బతిమాలి వెతల చాలి । భావమటు తూలి తమిదేలి పాలుమాలి యెడతెగని బాళి నీ జోలికింత జాలి । వశమటే రామరామ లావణ్యసీమ. | 7 |
| సీ. | చనువిచ్చి నను మచ్చికను వచ్చి నెనరిచ్చి । మనసిచ్చి పైకొను మధురవాణి వలపింపులను యింపుగలిగింపు బలుసొంపు । పలుగెంపు లొనరింపు భ్రమరవేణి యల జంటి రయికంటినటువంటి మొనచంటి । నెదనాని కళలంటు మిందువదన తమిదీర భ్రమమీర తనివార కొనగోర । తొడల కొక్కెసమించు తోయజాక్షి | |
| తే. | యెపుడు నే గందు నీ వుసురెవరి జెందు । నెటుల మతిబొందు నీ తమికేది మందు జాలినెటునొందు దెవతె నీ సరి పసందు । వచ్చునటె రామరామ లావణ్యసీమ. | 8 |
| సీ. | అత్తరురవ మెరుంగాని దువ్విన జారు । కొప్పుతో పైట మేల్కప్పుతోడ నల జక్కువలను హాస్యము సేయు కుచకుంభ- । యుగముతో చిరునవ్వుమొగముతోడ సౌగంధికముల రచ్చకు దీయు డాల్గన్న । మోవితో కపురంపు తావితోడ మేల్కడాని హొరంగు మించిన నెమ్మేని- । కాంతితో మదనవిభ్రాంతితోడ | |
| తే. | నరనిదుర జెంది పవళించినట్టివేళ । వచ్చి మెల్లనె సైగగా నెచ్చరించి పైకొని యొనర్చునటువంటి పనులు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 9 |
| సీ. | వంకెవంకెల గాజు వైఖరి పొడగన్న । తలపౌను నీదు ముంగురుల ఘనము దాడింబపండ్లు చేదగిలిన తరిని జ్ఞా- । పకమౌను నీదు గుబ్బల పసందు చీమలబారు చూచినవేళ మది కళు- । క్కని గప్తి తగులు నూగారు తీరు జలపూత గల కెడముల డాలు గాంచిన । తోచు నీ నునుపిరుందుల మిజాదు | |
| తే. | తగని మరులాయ మానసోద్భవుని మాయ । గెలువరాదాయ మనసేమొ నిలువదాయ క్షణము యుగమాయ నిపుడింత చలముసేయ- । వలెనటే రామరామ లావణ్యసీమ. | 10 |
| సీ. | అల కుందముల యందముల నిందసేయు నీ । రదనాళి దలుప నెమ్మది చలించు జలజాతముల ఖ్యాతముల రాత నదలించు । చూపులెంచిన మోహమేపు మించు పగడాల జిగిడాల జగడాల గెల్చు కె- । మ్మోవి జూచిన బాళి ముమ్మరించు మగరాల వగతూలన గజాలునగు లీల । దలప నెమ్మేనేమొ పులుకరించు | |
| తే. | వింత నీ చెంతలేని నివ్వెరగు కొంత । వేసటొక్కింత తమి యింత వెగటు కొంత యీదినము నంతకంత నీమీది చింత । వశమటే రామరామ లావణ్యసీమ. | 11 |
| సీ. | సుదతి నీ జిల్గుపయ్యెద జారనియ్యవే । బటుచనుంగవ గానబడును గాని హరిమధ్య నిలచి మాటాడవే యొకసారి । వీనులపండువై విందు గాని మృగనేత్రి ముద్దునెమ్మొగ మెత్తిచూడవే । మది చింత లొకకొంత మాను గాని వలరాజునగరి ముందలనైన నుంచవే । జీతమొల్లని కొల్వు సేతు గాని | |
| తే. | దైవఘటనేమొ గాని నిన్ దలచినపుడు । ఝల్లుమని గుండెలదరె నీ జాలి మాని మరుడు నన్నేచ నీమీద మరులు దాచ । వశమటే రామరామ లావణ్యసీమ. | 12 |
| సీ. | ఘనమైన రవలచెక్కటపు పాపట చేర్చు । బిందీలపైన నందంది పొదల చెలువొంద బాజుబందులక్రింద పికిలి చెం- । డ్లానుగా దుమికి యుయ్యాలలూగ రాగిడి నెలవంక రతనంపు బిళ్లల । జడ పిరుందులతో సరసమాడ సొగసైన లేగౌను బిగిసి యొడ్డాణంపు । ఘంటలొక్కొకసారి ఘల్లురనగ మేలైన చెంపఖల్లీలు గుబ్బల మధ్య । చంద్రహారములతో జత బెనంగ | |
| తే. | తమిని కళలూర నొసట కెంజెమట జార । కదలవలదని యెదనెద నదిమి గదిమి యుపరతి యొనర్చునాటి నీ హొయలు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 13 |
| సీ. | పసుపునిగ్గుల చల్వపావడతో కుసుం- । బా కలాబతు జారుపైటతోడ మొనబంటి కసికాటులను కందు మోవితో । విరులు వాడిన వేణిభరముతోడ నెలవంక గోటిపోటుల చన్నుదోయితో । సొక్కిన నెమ్మోముసొగసుతోడ కొద్దిగా చెదరు కుంకుమతో కరంగిన । కాటుక కనుసోగ నీటుతోడ | |
| తే. | ముడి వదలినట్టి నీవి నిమ్ముగ బిగించి । సురతమున మైచెమర్చిన సురటి బూని విసరుకొనుచున్నవేళ నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 14 |
| సీ. | సమబంధమొనరించు సమయమందున కర- । మ్ములు మధ్యమునకు లంకెలు దనర్చి గుదికాళ్లు పిరుదుల నదిమి వాతెరల నొం- । డొండ పల్మొనలతొ నొరయుకొనుచు రెక్కలన్ గూర్చి కన్రెప్పలల్లార్పుచు । కడుపక్కళించి వెన్కలకు దిరిగి తను చివుక్కునను పైకొను వితంబిది గాదు । డింకిసేయుదము లెండి యని లేచి | |
| తే. | వెనక జిక్కితిరో యని వెన్ను జరచి । నొసటి చెమ్మట పయ్యెదనొత్తికొనుచు నిలిచి నను జూచి పలికిన నీటు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 15 |
| సీ. | చూపుమార్పులను హెచ్చుగ నాస గల్పించి । చేమార్పులను చాల ప్రేమ నించి కౌగిటిమార్పుల కడుమోదమున మించి । మోవిమార్పుల మెచ్చి ముద్దునిచ్చి తమలంపుమార్పుల క్రమముగా దనియించి । తొడసందిమార్పుల దుడుకు గాంచి ప్రక్కమార్పుల ప్రౌఢిపని గాదని మదించి । పడకమార్పుల హాయిబడ రమించి | |
| తే. | బడలికను లేచి నెమ్మోము పారజూచి । మదినొకటి దోచిన నవ్వి యామాట దాచి చేతచెయ్యూచి పలుకు నీ చెలువమెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 16 |
| సీ. | పికిలిపిట్టల రీతి పెదవికాటందుచు । కూర్చుండెదుర్కొని కొంతసేపు చిలుకల గతి ముద్దుపలుకులొప్పుగను పై- । కొని రతి హాయిగా కొంతసేపు కన్నెపావురమన గళమున మణితంబు । గులికించి హొయలుగా కొంతసేపు కళలుప్పతిల్ల ప్రక్కలు గోట జెణకుచు । కోకిలరవముచే కొంతసేపు | |
| తే. | వింతగొరువంకపోరుల గొంతసేపు । గునుపుతో ప్రక్కమార్పుల కొంతసేపు క్రీడ సల్పిననాటి నీ రీతినెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 17 |
| సీ. | తొడనిగ్గు పైకి గన్పడు కీనుఖాబు పా- । వడతో జరీబుటా వల్వతోడ రహిమించు వహిగాంచు రవికెతో ఝల్లని । కౌనుల్కి చెమరించు కళలతోడ సొగసు మించిన చాదుచుక్కతో పిరుదుల । నంటి మెలంగు కీల్గంటుతోడ మొనలు పైపైలకగ్గిన కుచద్వయముతో । మిసిమి జెలంగు నెమ్మేనితోడ | |
| తే. | కులికి దిగ్గున లేచి లోకొంగు జూచి । చెరగు మాసె నటంచును సిగ్గుదోచి పాత్ర గైకొన్న హొయలెంచి బాళి నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 18 |
| సీ. | కరమొప్ప మేల్కీనుఖాబు పావడమీద । సిరిమించు మహతాబి చీర గుల్క సరిగె కంగోరు భస్మావన్నె రవికెపై । పిగిలి కుచ్చెల ధాటు పిక్కటిల్ల పోచీలు కంకణమ్ములు సరుల్పాటిలు । కరము జూపగ ధళుక్కని వెలుంగ గొలుసులు పావడంబులు చిరుగజ్జె లం- । దెలు పదమ్మున ఝళంఝళలు సేయ వలరాయునింట చిల్చిలమంచు కళ కుసుం- । బాపువ్వురసము కైవడిని గురియ | |
| తే. | బోటి మార్నీటిరేయి నీతోటి నెనయు- । నాటి వేడుకలింక నేనాటికైన కోటి యిచ్చిన కల్గ దాపాటి దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 19 |
| సీ. | మైతావి నీవి కమ్మని మోవి గను ఠీవి । దలపోసి పెదవులు దడిపి దడిపి తొడతళ్కు నడుమల్కు నడగుల్కు పొడగాంచి । గొనబైన జాలిచే గుంది గుంది జడబారు నుడితీరు మడిచారు మడిసౌరు । నెంచి చాలగ తమి హెచ్చి హెచ్చి వలపింపు కటిపెంపు వదనంపు జిగిసొంపు । లనుదినంబును గొనియాడి యాడి | |
| తే. | యజుని దూషించి ప్రాకృత మనుసరించి । బాళి కడుమించి యొంటిగా బవ్వళించి మనసు నిర్జించి దినము లీమాడ్కి జరుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 20 |
| సీ. | హాయిగా విన విన ఠాయిగా నీచేత । నెలనాగ వీణె నేనెపుడు విందు సొంపుగా మై జులాయింపుగా నీనోట । రమణి నేనెపుడు పద్యములు విందు కుల్కుగా తేనియ జిల్కగా నెపుడు నే । లలన నీ ముద్దుపల్కులను విందు మెల్లగా నెమ్మది చల్లగా నెపుడు నే । కాంత నీ గాత్రరాగంబు విందు- | |
| తే. | ననుచు నేనుందు నేటికి యబ్బె సందు । కనికరము జెందు మనసుకీ కపటమెందు కొరకు నీ పొందులేనిదే కొదువ యెందు । వశమటే రామరామ లావణ్యసీమ. | 21 |
| సీ. | తొలకరిమెఱప నా వెలలేని జీవర- । త్నమ జున్నుగిన్నె బిత్తరులమేటి రామచిల్క యొయారిరాయంచ ఖండచ- । క్కెరరాశి మేల్మిబంగరుసలాక మదనమంజరి తియ్యమామిడి కుం- । కుమబొమ్మ కల్కికుల్కులకొఠారు కట్టాణిముత్యము కస్తూరివీణె ము- । ద్దులగని సింగారములబిడారు | |
| తే. | నెనరుమాటలదీవి పన్నీటిచెలమ । కన్నె వేడిమిఠారి యంగజునిసొక్కు మందుపొడిడబ్బి జాణ నిన్మది దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 22 |
| సీ. | మైసూరి కుతినీ తమాను వేసుక జరీ- । పాగా తురాయి గన్పడగ జుట్టి భారి శాలువ వల్లెవాటుగా నమరించి । బేషైన రవల సర్పోషు నించి వాణిగా జిగి బర్దవాని తేగా వర- । పై మొఖమల్ గలీబా వదల్చి చిలక విప్పి చాయలు తళుక్కున దూసి । జిగి గల చిల్కతేజీపఠాణి | |
| తే. | యిచ్చటికి చెచ్చెరను బలుమచ్చరమున । చిచ్చు కైవడి విడివడి వచ్చువాని విచ్చుకత్తికి నెద నెదురిచ్చి నిలువ । వశమటే రామరామ లావణ్యసీమ. | 23 |
| సీ. | పదినూరుకన్నులపాదుషా కొల్వులో- । పలనెత్తు ధవళాతపత్రమనగ హరుని నేత్రాగ్నిచే కరిగి నీరైన పూ- । విలుకాని సతి మోముచెలువనంగ వలరాజు వేటాడి వచ్చిన రతి దృష్టి- । పట్టిన రతనాలపళ్లెమనగ ప్రాగ్దిశాంగన కొప్పుపై తళతళమంచు । రహిగాంచు వజ్రాలరాకిడి యన | |
| తే. | విరహు లదరంగ తమ్ములవేడ్క గ్రుంగ । కలువలుప్పొంగ నింగి రిక్కలు చెలంగ క్రౌర్యము వెలుంగ మింట జక్కువలగొంగ । వచ్చె గదె రామరామ లావణ్యసీమ. | 24 |
| సీ. | శయనించియున్న హెచ్చరికకై సకలాతి । తెర తొంగిచూచి యందెలు గదల్చు- నది వినబడక నే నిదురింపుచుండిన । విరుల పంఖా బూని విసరజొచ్చు- నపుడు మేల్కాంచి మాటాడకుండిన యూరు- । లెత్తించి పదముల నొత్తనెంచు- నంతట నేను గిల్గింతలొనర్చుచో । కిలకిల నవ్వి కెంగేలు పట్టి | |
| తే. | చాలు పొమ్మన్న వదన భావాలనెంచు- । నట్టి సద్గుణవతిని నా యాత్మ దలచి వలసి కలయక మరుని కాకలకు తాళ- । వశమటే రామరామ లావణ్యసీమ. | 25 |
| సీ. | తరుణి చన్మొనల నూదారంగుగానున్న- । దేమన మీకేమి దెలుసునందు- వవునంచు మరునిల్లు నివిరిదేమన నిటు- । లడుగవల్దని చిన్నియాన బెట్టు- దలరి ప్రక్కలు చెణ్క గిలిగింత లికనవ్వ- । లేనంచు రివ్వున లేవబోదు- వెనయ కుచ్చిళ్లలోగిన నీవి వదల ని- । గ్గమరి దివ్వెకు చేతులడ్డమిడుదు- | |
| తే. | వపుడు చేబట్టి లాగిన హరి యటంచు । కండ్లు మూతువు చిరునవ్వు గడలుకొనగ- నది దలంచిన మదిని మోహము నడంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 26 |
| సీ. | నూతనకేళి నేనొనరింపబూనిన । చిడిముడిలోజంకు సిగ్గువెరగు వేగుటవేసట వెల్లవాటునుజాలి । మడిమవిదల్పు పెందొడవడంకు బొమముడికనుమూత మోవియార్చుట లల । మైచెమర్చుట తడంబడుట సొలపు పలుమొన బిగియించు పటిమ నధైర్యంబు । కసరు తొందర బాళి గడలుకొనగ | |
| తే. | పొలతి నన్నెంచనపుడు నే బుజ్జగించ । కౌను యసియాడ మన్మథకళలు వీడ రతమొనర్చిననాటి నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 27 |
| సీ. | కలకంఠి యీడునెచ్చెలులెల్ల శృంగార- । వనికి బోదాము రమ్మనుచు బిలువ కడుమోదమున రైక తొడగలేదను గప్తి । మరచి వారలతోడ నరుగుదెంచి పున్నాగసుమగుచ్ఛములకు చెయ్యెత్తిన । కోరకగతి గబ్బిగుబ్బ యుబ్బ- నపుడేను కొనగోట నదిమిన నను గాంచి । సిగ్గుచేతను పైటచెరగు గప్పి | |
| తే. | తీవ్రగతినేగి చెలులతో తేటి యిచట । కొరికెనో గాక చెయ్యెత్తగూడదనుచు చెప్పుకొనునాటి యణుకువ చెలువ దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 28 |
| సీ. | అభ్యంగనస్నానమైన పిమ్మట శికా- । కుళము సెల్లా నొంటికొంగు గట్టి పైటచెరుంగు గుబ్బలచుట్టు తెర యిచ్చి । సాంబ్రాణిధూపవాసనలు నించి నీరెండపొడల పెన్నెరుల చిక్కెడలించు- । చును యామరిక హవుసుగను నిలిచి తడి యార్చుచున్న నప్పుడు వెన్కగాను ద- । గ్గరవచ్చి చెణకిన తిరిగి చూచి | |
| తే. | యౌర బాగాయ నిదియేటి యాగడంబు- । లనుచు కోపించి వెంటనే నెనరు గాంచి స్త్రీల నిటుజూడరాదన్న చెలిమి దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 29 |
| సీ. | తాళి గట్టని చిన్నితనమున నొకనాడు । చేడియలను గూడి యాడుచుండి నను జూచి బావ వచ్చెనటంచు బాజుబం- । దుల క్రిందిచెండ్లంది దుముకులాడ పరగున నాదు పైబడి కౌగిలించిన । యెనలేని కడువేడ్కనెత్తి లేత- మొలకమెరుంగుచన్నులు నాభి చెక్కులు । గళమును పచ్చవిల్కానినగరు | |
| తే. | ముద్దుబెట్టుక నవ్వుచు ముదిత నీవు । నెవరి పెండ్లాడెదవటంచు నేను బలుక నిన్నె యని మీసములు మీటు నీటు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 30 |
| సీ. | సీమపన్నీరు పై జిలుకుచు హొయలుగా । భారీ బురాన్పురీ పాగ జుట్టి తేటచెంగావి సుతీనా తమాను ధ- । రించి వేడుక జమాయించి యగరు యత్తరు కొనవేళ్లనంటి సునాయించి । గీరి జోడైన యంగీలు దొడిగి ఖుజు వహవా జల్దు ఘోడా యనుచు సఫె- । దారంగు తేజి మోదమున నెక్కి | |
| తే. | స్వారి వెడలంగ మహలెక్కి దారి జూచి । యతివచే నంపినట్టి కాకితములోని మాటల పసందు తలచితే మనసు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 31 |
| సీ. | కలహంసలకు జీతముల లెక్కజూచి లో- । బాకి చెల్ల గని జాపాలొసంగి జాతైన మంచిపచ్చలరంగు గల చిల్క- । పంజులెల్లను బరాబరులు జేసి గండుకోకిలమూక కైజీతములవారి- । కందమౌ ననలతో విందొనర్చి గొరువంక యెలగోలు నిరువంకలను గూడి । రమ్మంచు తేంట్లచే కమ్మలిచ్చి | |
| తే. | దండుకు సమీరణుని సరదారు జేసి । వేయుమని చెప్పి పూపొదవెలిగుడారు దర్పకుండను పాదుషా దాడి వెడలి । వచ్చె గదె రామరామ లావణ్యసీమ. | 32 |
| సీ. | జాతిజంగాలి బనాతి కనాతి స- । రాతిలోదటను సూరతువులందు మొఖమల్ ఖురాళ మిమ్ముగ నఖాసీచుట్టు । తగుటుచీనీలి ముత్యముల చేర్లు పగడంపు చేవ కంబాలు ముప్పిరిపట్టు । పగ్గముల్ సరిగెహొంబట్టు కుట్టు నమరుషమేనాకృశములు కమానువా- । కిళ్లు నీలంపు మేకీలు కొణిగె | |
| తే. | తీరు నద్దాలబారు గుడారులోన । చదరు సేయంగ పదాలచాటునుండి వేడ్క నను జూచునాటి నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 33 |
| సీ. | దండుకూచీ జేసి లెండని సరదార్ల । మదిలోన బల్కుషామతున జెంది ఖూబైన బాసు జిలీబుతేజీలు హ- । రోలుతయారి కతారాలు దిర్చి జల్తారు భారిపోషకు వేసి మందట । కటికెముల్ బహుపరాకనుచు బొగడ కేళికాగృహమువాకిట నిల్చి వూరికి । బోయొత్తు మనిన తాంబూలమొసగి | |
| తే. | మొగము వంచుక నరతల్పు సగము మూసి । నిలిచి యేమందునని వ్రేల నేలగీరు- కొనుచు నను బోయిరమ్మని నెనరు దలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 34 |
| సీ. | జాఫల్ రసంబు గుర్షాపూలు ద్రాక్షలు । గంగులుఖందు చొక్కపు జవాజి జాఫరాయగరు పచ్చాకూదుబత్తీలు । పునుగుపన్నీరు గంబురు గులాబి యత్తరు సీమరాయంచలు తెల్లాకు- । మడుపుల్ వళాగ్రముల్ మల్లెపూలు కురువేరు నరగ జాల్ కొత్తకైరావళ్లు । దవనంపు చెండ్లు దంతంపు గుండ్లు | |
| తే. | మా కచేరికి నజరు లీ మాడ్కి బనిచి । నమ్మినానని వ్రాసుకున్నట్టి జాబు నకలు జూచిన మరుని గాసికి సహింప । వశమటే రామరామ లావణ్యసీమ. | 35 |
| సీ. | ఆదికేళికను మై యలసియుండిన తీరు । గని నేస్తమగు జోడుగరితలెల్ల సతి రేయు పతిసేయు రతివింతలేమన । నేలాగొ నదియు నేనెరుగ పాన్పు చేరబోవగను కుచ్చిలిబట్టు తీసిన । వడిని నీవికముడి వదలెనపుడు సిగ్గుచే పయ్యెదచెరగు దివ్వెకు తెర- । చాటు సేయగ హారచయమునందు | |
| తే. | గలుగు రతనాలు దివ్వెలుగా వెలుంగ । యతివ భయమున కనులు మూసితిని యవల- నేమి గనుగొననని పల్కు ప్రేమ దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 36 |
| సీ. | అర్ధోదయంబగు నరుణబింబద్యుతి । యెరుపైన మంచిదామరపురేకు పద్మరాగము పచ్చిపవడంపుతీగె ల- । త్తుక కోపు ముదిరిన దొండపండు కుంకుమవర్ణంబు మంకెనపువుచాయ । సిందూరవన్నె చిగురుటాకు దాడిమకుసుమకాంతి దాసానపుష్పంబు । లేబాకమగు నింగిలీకవరఖు- | |
| తే. | లేవి జూచిన దాని కెమ్మోవిఠీవి । సాటియగు డాలుగాన ముజ్జగములోన పరవశముతోన వలరాజుపనులు మాన । వశమటే రామరామ లావణ్యసీమ. | 37 |
| సీ. | జుంటితేనియపాలు జున్ను శర్కర మంచి- । రసదాడియమృతంబు కుసుమరసము ఖర్జూరములు పానకము ద్రాక్ష మాగిన । కమలాఫలము లిక్షుఖండములును నారికేళజలంబు నవనీతమన్కగు??? । పరమాన్నమును వేరుపనసతొనలు తియ్యమామిడిపండ్ల దీసిన సారంబు । నతిరసంబులు మనోహరచయంబు- | |
| తే. | లెన్ని జూచినగాని యా వన్నెలాడి । యధరబింబసమానమౌ మధురమొకటి గాన నా చానపైని నా కరుణ మాన । వశమటే రామరామ లావణ్యసీమ. | 38 |
| సీ. | నారాయణవనంబు చీరకుచ్చంచులు । మీగాళ్ల కెలమి కైలాగు లెసగ సన్నగీరుల గులాల్ వన్నెరైక మెరుంగు । గుబ్బల పొగరానికుట్లు పిగల కమ్మని దవనంపురెమ్మల జడ పైడి- । కుచ్చులు పిరుదుల గునిసియాడ పొలుపొందు పావడంబులు మొల్కపాంజేలు । గిలగిలమని పదంబులను మొరయ | |
| తే. | నవ్వుకుంచును కార్వేటినగరమునను । వీధినెదురైన సిగ్గున వీపుగప్పి త్రోవ దొలగిననాటి నీ భావమెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 39 |
| సీ. | పసమించు నెమ్మేన పసమాని మెత్తని । పాదంబులకు జొత్తు పట్టెలుంచి తళ్కుచెక్కిళ్ల చేతుల మంచిగంధమ్ము । బూసి కుంకుమ నడ్డబొట్టు వెట్టి జాజిపువ్వుల మంచిజారుకొప్పమరించి । సొగసుకాటుక కనుసోగ దీర్చి చెరగు మాసె నికేమి సేతు నంచని భర్త- । బొంకి నను ప్రేమతో నుపవని | |
| తే. | కలువకొలనికి పడమటిగట్టు పొన్న- । గున్నలకు తోడితెమ్మని గురుతుజెప్పి కన్య నంపించునాటి సౌఖ్యంబు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 40 |
| సీ. | తమ్మిమొగ్గలు పెద్దతలుపు పెన్గుబ్బలు । గజనిమ్మపండ్లు బంగారుగుండ్లు బరిణెకప్పులు పూలబంతులు మేల్రంగు । బూసిన బటువైన బొంగరాలు కరికుంభములు వీణెకాయలు జక్కువ- । పిట్టలు మరుని చేపుట్టచెండ్లు కొండలు యపరంజికుండలు రసగుండ్లు । కంచుగిన్నెలు భూమి గలుగునట్టి- | |
| తే. | వెన్ని చూచిన దాని పాలిండ్లతీరు । గాన త్రిజగాన చాన నీ యాన యెంత- కైన నేమాయ నా మందయానపైన । వలపునిక రామరామ లావణ్యసీమ. | 41 |
| సీ. | కారంజిలో నీతకాయల మోపాని । తేలెడు పచ్చని తెప్పపల్క పైకెంపు రాకోళ్లపట్టెమంచము దోమ- । తెరచుట్టు దివ్వెకందీలబారు తొడిమ తీసిన రెక్క విడిమల్లెపూపాన్పు । పచ్చాకుదిండ్లు కోపైన లోడు దనరు కుంకుమపువ్వు తక్కెంబు కీలుబొ- । మ్మలు వేయు పంఖాల చలువగాడ్పు- | |
| తే. | లెగయ వేసవినెల బవ్వళించియున్న । వచ్చి చెయ్యాని తేనెక్కి వత్తుననుచు బలికి నాతోడ కలసిన వగలనెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 42 |
| సీ. | జాతివజ్రాల బేసరి బులాకీనత్తు । నాసాగ్రమున దుంకి నాట్యమాడ జాజిబందులు నూగుపాటీలు కంకణ- । మ్ములు చేకటుల్ ఘలుఘలుమనంగ జల్తారు పయ్యెద జారి దళుక్కని । బాహుమూలద్యుతుల్ పరిఢవిల్ల తలయంట వక్షోజములు గోర నే జీర । యలగి నే జెల్ల బాగాయనౌర | |
| తే. | సమయమెరుగని పనులివి సరసమగునె । పరులు గనుగొన్న నగరె మీ పనులటంచు కసరి నలుగుడునాటి చక్కన దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 43 |
| సీ. | సిగ దువ్వి సన్నసంపెగలు జుట్టెద తాళు- । డను నయోక్తుల నాదు వెనుకజేరి కూర్చుండి వెన్నున గుబ్బచన్మొనలాన । తెలసి నెమ్మోము నే తిరిగి చూడ నదియేమి యూరక యటుల జూచెదరన । యెరుకలేవనుకొంటివేమొ యనిన కిలకిల నవ్వి చెక్కిలి దువ్వి మిము బోల । ననుమానపరులు లేరనుచు కురులు | |
| తే. | రవమెరుంగాని విరిసరుల్ సవరపరిచి । లెస్సనై యున్నదింక లేలెండనుచు నపుడు బల్కిన సొగసునెంతనుచు నోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. | 44 |
| సీ. | కుటిలాత్మక నన్ను కౌగిట జేర్చవా యన । కుటిలత నీదు ముంగురుల గాదె కఠినమానస నీదు కలిమెంతరా యన । కఠినత నీదు చన్గవల గాదె చపలచిత్త యిదేటి నెపమురా యన చప- । లత నీదు వాల్చూపులందు గాదె మందస్వభావ యేమందుర యిక నన । మందత నీ యానమందు గాదె | |
| తే. | యనుచు నాతోడ కందువ లాడుకొనుచు । నెన్నదగు శయ్య మనమున్న వితము తలచి చూచిన నెమ్మది తాళియుండ । వశమటే రామరామ లావణ్యసీమ. | 45 |
| సీ. | మేఘంబు చేజేత మెరయుచుండగ నిండు- । వృష్టి లేదని మిన్ను వెతుకనేల నమృతప్రవాహంబు కధికారమిచ్చిన । నరుచికై తాంబూల మడుగనేల పస గందమేదిన కసరితంచనువేళ । లోడీలు తెమ్మని వేడనేల పైదుర్గముల ఠాను బందిచేసిన క్రింది- । సీమకోసము మన్వి సేయనేల | |
| తే. | యనుచు సతతము చతురత నెనసి కినిసి । పెనగి జెట్టీల లాగు సొంపొనర దనరు సరణి దలచిన మనసు విస్మయము దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 46 |
| సీ. | మనసెరుంగగ రాదు మాటనిల్కడ లేదు । వావివర్తన నహి వలపు సున్న కనువిచ్చి చూడరు చనువిచ్చి కూడరు । నేస్తంబు పూజ్యము నెనరు నాస్తి మర్యాద లెంచరు మన్నన గాంచరు । గుణముచక్కన లిల్ల గుట్టు కల్ల కపటంబు మానరు కడువేడ్క బూనరు । సత్యమన్నను వట్టు జాలి మట్టు | |
| తే. | సాహసము మెండు మిక్కిలి చలము నిండు । నంగిట విసంబు మున్నాల్కెనందు తియ్య- దనము గదె చేడియల మంచితనమ్ము । వశమటే రామరామ లావణ్యసీమ. | 47 |
| సీ. | మొగమోటమెంచరు నగుబాటు గాంచరు । తరుచు వినయము ధూర్తతలు మెండు కలిమి వరింతురు చలము సాధింతురు । కంటికెంతటివారు గడన గారు హాని నెన్నగ జూడ రపకీర్తి కోడరు । ప్రాణము తృణవత్తు భక్తి వేదు వలపుల నొందింతు రలపు చెందింతురు । తాల్మి తక్కువ బేలతనము పెక్కు | |
| తే. | పాదములు ముట్టి గండదీపంబు తట్టి । చేత చెయి పెట్టి యాకున శిరము గొట్టి బాస చేసిన స్త్రీల భావంబు నమ్మ । వచ్చునటె రామరామ లావణ్యసీమ. | 48 |
| సీ. | కాలమృత్యువునైన కడకు ద్రోయగవచ్చు । పురవైరితోనైన బోరవచ్చు గరళంబు మెక్కి నిగ్రహశక్తి గనవచ్చు । నల దవానలము చేనంటవచ్చు మసకాడు తాచుల విసరి రాళ్లిడవచ్చు । కాలాంతకుని యాజ్ఞ గడవవచ్చు తనువు గోయగ మది తాళి యుండగవచ్చు । పైమాట లొకలక్ష బలుకవచ్చు | |
| తే. | నబ్జభవునకునైన నయాన వారి । వలపు గొలిపెడి బెళుకుచూపులను వేడి తూపులకు వాసి చిత్తంబుతో సహింప । వశమటే రామరామ లావణ్యసీమ. | 49 |
| సీ. | మగవారి మాట బూరగపంటి తేటద్ద- । మున గానబడు పైడిమూట దూర- మగు కొండనున్పు లేనుగదిన్న వెలగకా- । యలు మబ్బులో తళుక్కనెడి మెరుపు మిద్దెపై పరుగులు మీసాలపై తేనె । పొగ ముల్లెగట్టిన పోల్కె తేట- నీటిలో జాబిల్లినీడ లేగిన యెండ- । మావులు రతివేళ మరులు సతుల | |
| తే. | వద్దనున్నంతసేపె యావలనె బోతె- । నెంత కఠినంబు పురుషుల హితము నమ్మ- వచ్చునా యని పల్కు నీ వగ దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 50 |
| సీ. | హరిహరి పగవారికైన నావలెను మి- । క్కటమైన మోహంబు గలుగరాదు కలిగెబో బహుసలక్షణరూపవతులైన । చెలులతో నతిచెల్మి సేయరాదు చేసెబో నొకవేళ చెంగట లేకున్న- । నందుమీదట జాళి జెందరాదు జెందెబో మరుని గాసిక ధైర్యమున క్రింద- । బడి తాళలేనంచు బల్కరాదు | |
| తే. | బల్కినట్లైతె మగవారి పరువు గాదు । పరువు కని యూరకుండిన మరుపు రాదు మరిచెదనటన్న యింక నీ మహిమలెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 51 |
| సీ. | వనజాస్య నీదు పావడనైన గానైతి- । నరసి పెందొడలపై నొరయుచుందు శుకవాణి నీదు కంచుకమైన గానైతి । నుదుట గుబ్బలమీద గదిసియుందు రమణి నీ నత్తుముత్యమునైన గానైతి- । ననుదినంబును మోవి యానుచుందు మదిరాక్షి నీకు పయ్యెదనైన గానైతి । కడువేడ్క మేనెల్ల గప్పియుందు | |
| తే. | పాతకుండగు ధాత యీ పగిది బురుష- । జన్మముగ జేసె వ్యర్థపు చలము బూని వసుధ నిటువలె నే మొగవారికైన । వలదిటులు రామరామ లావణ్యసీమ. | 52 |
| సీ. | కమలారి కృష్ణపాడ్యమిరేయి రాగ తూ- । ర్పున నాకసము బర్వు పోలికనగ నమర వసంతకాలమునందు వికసించు । తీగెపన్నీరుపూదీప్తి యనగ శుకవాహనునకు సేవకులు వేయు నుడాయి । పావడ చెంగావి భాతి యనగ మదనుని రాణి సీమంతవీధిని నంటి । వగగాంచు సిందూరవర్ణమనగ | |
| తే. | కుందనపుపళ్లెమున తోటకూరవిత్తు- । లెండ నెరపిన పై పిల్లలేడి పదము- నిడిన గతి దోచు నీ మరునిల్లు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 53 |
| సీ. | ధనువు చేబూని చివ్వున వంచి లాగి ప- । ట్టిన దోచు మొగ్గ వాలిన విధంబు దండెంబులకు రొమ్ముతట్టి మ్రొగ్గగ దోచు । ధేనుకాబంధంబు పూను కరణి బిరుదుజెట్టీలతో పెనగొను తరి దోచు । నురగబంధము సేయుచున్న పగిది మేలౌ కడాని లోడీలు ద్రిప్పగ దోచు । పడతి నీ యుదుటు పెందొడల సొగసు | |
| తే. | కలికి నీ తీరు కన్నుల గట్టినట్టు । గానబడుచుండు వలరాజుగరడి కెనయ నున్ను మించిన వనిత నేనెందు గందు । వసుధనిక రామరామ లావణ్యసీమ. | 54 |
| సీ. | సన్నపు వల్వతో జతనున్న మరునింట । నికటంబు పొడగన్న నీటుదోచు భుజియించి యమ్మెతాంబూలంబు సేయుచో । నరచూలుగానున్న హౌసు దోచు రతిరాజశాస్త్రసమ్మతి మీర నెనయుచో । నల రంభ యెక్కువేమనుచు దోచు నొకవేళ కోపగించుక నత్తు నటుదీయు- । చో నెలబాలింత సొగసు దోచు | |
| తే. | బోటి శతకోటిలోన నీ సాటియగు వ- । ధూటి యే మేటి వెతుక ముమ్మాటికైన నేటి మోహంబు నొక్కరితోటి దెలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 55 |
| సీ. | పూవిల్తుడొక పచ్చిబోయవానికి తోడు । మలయానిలుడు పరమాతతాయి తొగరేడనే గురుద్రోహి వెన్నెలగాయ । గండుకోవిల చెట్టునుండి కూయ చేజేత నెత్తిపెంచిన చిల్క పగదాయె । గ్రుక్కద్రిప్పదె దాని గొంతుకోయ మొదటనే కొదమతుమ్మెద వేరువిత్తాయె । గోర్వంక కాపురాల్ గుత్తసేయ | |
| తే. | నేరుపడె బ్రహ్మ తగినట్టులేర్పరించి । వసుధ నిర్మించె నావంటివానికొరకు నిన్ను జూడక నాకిక నిమిషమోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. | 56 |
| సీ. | పొలయల్కచే నొత్తిగిలి పవ్వళించిన । చెయిదీసి కుచముల జేర్చుకొందు- వదిసైచకను ప్రక్క కదలి హూహూ యన । కదిసి పైకొన బిగ్గ గౌగిలింతు- వవల పోపోవె పొమ్మని రెమ్మి కసరిన । నవ్వు చేసుక మోవి నానవత్తు- వా తీరు జూచి యేమనకూరకుండిన । పూమొగ్గతో బిగ్గపోటులిడుదు- | |
| తే. | వంతకు చలింపకున్న గిల్గింత సేతు- । వపుడు నే నవ్వ వెండి ప్రొద్ద్దయెనందు- వా దినమురేయిసొగసెన్న నజునకైన । వశమటే రామరామ లావణ్యసీమ. | 57 |
| సీ. | కడనున్నతరి నెరుంగక చేరవచ్చిన । దూరదూరమటంచు తొలగుచొందు- వాయెడ హేలి నేడాడితో యన సిగ్గు- । నవునంచు చిరునవ్వు నవ్వుచుందు- వదియేమి నొసలిచుక్కన నాల్గుదినములు । చాదు స్త్రీలకునుంచ సహజమందు- వతిమోహమున చమత్కృతి బల్క తెలుసుక । కొదువపనుల దీక్షకూడదందు- | |
| తే. | వెంతనిర్మోహివని నెరవంతమనసు । సహనపరుచుడి పిమ్మట సౌఖ్యమందు- వట్టు జిగిబిగి వగ నగవభినుతింప । వశమటే రామరామ లావణ్యసీమ. | 58 |
| సీ. | ఒకవేళ కోపగించుక పవ్వళించుచో । వచ్చి పై ముసుకెత్తి యెచ్చరించు- నా తరి చూచి మాటాడకుండిన నొద్ద । వీణె హాయిగ మీటి వినికిసేయు- నవలిమోమై యున్న నది నిల్పి చందన ।కలపంబు నెమ్మేన నలదవచ్చు- నిది పర్వదినము నేడిటు గూడదన నవ్వి । మదనశాస్త్రము జూడుమనుచు దెచ్చు- | |
| తే. | నేల పొమ్మన్న పురుషులకేల కఠిన- । మెందు గాననటంచు కన్నీరు నించి నతివ నను దూలపలుకు నా హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 59 |
| సీ. | చూచెనా చూడ్కుల సోయగం బా రతీ- । వరుడేయు శరపరంపరల లాగు నవ్వెనా మంచిపున్నమచందమామ యిం- । పలర వెన్నెలగాయునట్టి బాగు నడిచెనా విబుధపున్నాగంబు మత్తుచే । మించి వచ్చుచు జులాయించు పగిది పల్కెనా యమృతంబు జిలుగుతేటగు జుంటి- । తేనెజాలటు కాల్వదీయు పగిది | |
| తే. | దాని మెయితళ్కు మెడకుల్కు దాని బెళ్కు । దాని వగనీటు బిగిదాటు దాని నేటు దాని నీవేళ నా మది దలచి తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. | 60 |
| సీ. | భ్రమరఝంకారంబు పగిది నుపాంగంబు । కోపైన సుతిని ఘుంఘుమ్మురనగ సిరిమించి మదిమించి చిరుతాళముల శబ్ద- । సంగతి ధిత్తతాఝమ్మనంగ పరికింప వీనులపండువై పెద్దమ- । ద్దెళ నాదు తాహతోద్ధిమ్మనంగ నెరనీటుపల్కు కిన్నెరమీటు గజ్జెలల్ । గోజారవంబు బల్మోజు దనర | |
| తే. | సంచుగా మేళమిటు జమాయించువేళ । నతివ మామీది వర్ణముల నభినయించు వేడ్క దలచిన నా మది విరహమడప । వశమటే రామరామ లావణ్యసీమ. | 61 |
| సీ. | జల్తారుపేటు గంజముచీరకుచ్చిళ్లు । గిల్కుమట్టెల తట్టి పల్కరింప రవ కసీదా గోటు రయిక ముస్తీబుగా । కుచకుంభముల నాని గురుతుజూప సికజుట్టు నునుబట్టు చెండ్లునీటు గల స- । దంసయుగంబుపైనంది బొదల తళుకుబెడస తీరు బెళుకుకన్నుల సౌరు । వీనులతో నొగ్గి వియ్యమంద | |
| తే. | చందనము మైనలందిన సమయమునను । కంకణంబులు మొరయ పంఖాలు బూని విసరవచ్చిన వగగన్న విధికినెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 62 |
| సీ. | నీలాంబరౌర పెన్నెరుల సౌరుదనంబు । వీనులు శ్రీరాగవిభవమేలు పొలతి నెమ్మొగము సంపూర్ణచంద్రిక మణి- । తము పరీక్షింప ఘంటారవంబు సారంగ చూడ్కుల చపలత వీక్షింప । మెరుపగు లేగౌను మేఘరంజి చాన రోమావళి శంకరాభరణంబు । తీరైన కెమ్మోవి దీపకళిక ముదిత క్రొంజిగిమేను మోహన సద్గుణ । లావణ్యగరిమ కల్యాణి భళిర | |
| తే. | నడక మెల్లదనంబు పున్నాగ దాని । సురత మానందభైరవి సొంపు నాట నెనయకుండినవేళ నా నెనరు తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. | 63 |
| సీ. | తమ్మిలో నవకందమము తేటలా చంద- । మామ యందముదీసి మోముజేసి పూబంతిలో సౌరు ప్రొద్దులో తళ్కు క- । డాని చాయల గూర్చి మేనొనర్చి మల్లెమొగ్గల చాలు మంచికెంపుల డాలు । వజ్రంపు జిగిని పల్వరుస దీర్చి గాజుగిన్నెల నున్పు గట్టుగట్టిన వీణె- । కాయల తీరు చన్గవనొనర్చి | |
| తే. | నలువ నిర్మించె నీలాగు నాతి బాగు । నెన్నతరమౌనె కన్య నా కన్నులాన దాని మది దల్చి నెమ్మోహతాప మాన । వశమటే రామరామ లావణ్యసీమ. | 64 |
| సీ. | కుటిలకుంతలికి చన్గుదురు లున్నతమైన । వేళ నా మనసేమొ వేడ్క గాంచె జలజాక్షి నునుపిరుందులు మిన్నలైన నా । మదికి చమత్కారమహిమ గల్గె భ్రమరాలక సమర్తపాయమైనంత నా । తనువు బంగారుచాయను వహించె రమణి నూగారు దట్టము మీరి నలుపెక్క । లేకురు మీసంబు లేర్పరించె- | |
| తే. | నింతివయసు నా వయసును నేకమైన । రథము తేజీలు నడిచిన విధమునొప్పె దాని చూడక యింక నీ తమి నడంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 65 |
| సీ. | పసుపు నిగ్గైన దుప్పటితోడ కాటుక । మరకానుదస్తు రుమాలుతోడ చెక్కిట కొనగోటిజీరలతోడ న- । వ్వెలదిచ్చు దొంతర విడెముతోడ నతివ పల్మొనకాటు లారని మోవితో । వెన్నున కీల్జడవేటుతోడ సొగసైన నిద్దురసొలుపుతో రతులను । బడలిన నెమ్మోము బాగుతోడ | |
| తే. | నే నితరకాంతల గూడిరాగానె యున్న । చిన్నె పరికించి మనమున చిడిముడగుచు నపుడు నిను నీవె దూరుకొన్నది దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 66 |
| సీ. | శుకమును ముద్దాడుచో మోవి నొక్క నా । గంటి నే గని నినెరుంగక నిదేమొ నినుజూడ వేరె భావన దోచునన మోము । చిన్నజేసుక శివా శివ యటంచు తలవంచి బొటవ్రేల నిల గీరుకొంచు నే- । త్రముల నశ్రులు కుచాగ్రముల రాల చిలచిల నెమ్మేను చెమ్మర గడగడ । వడకుచు నార్తారవమున నొక్క | |
| తే. | పాపమెరుగను నా యురోభవములాన । యన్ని దెలిసుండి నా బోటి యబల నిటుల ననుట దోసంబు లనునాటి హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 67 |
| సీ. | శుకమా చికాకు సేయకుమా యటన్న శా- । రిక మాట వినుట నాయికము గాదు పికమా భళాన యోపిక మానియున్న నీ- । విక కూయుచుండ భావికము గాదు మదమా శబాసు షట్పదమా సరేనె నీ । రొద మానవైతివే ముదమె నీకు బతిమాలుకొన్న నీ మతి మానలేవు మా- । రుత నీ చలంబు శాశ్వతము గాదు | |
| తే. | యనుచు నేనెంత వేడిన కనరు మాన- । రైరి వీరలు నామీది వైరమునను సుంత దయచేసి కన్నుల చూడ వింత । వాదటే రామరామ లావణ్యసీమ. | 68 |
| సీ. | తలిదండ్రినైన తూపుల నేయజూచు । మరుడు నన్నేరీతి కరుణ జూచు గురుకాంత నిసుమంత కొదువలేక రమించు । జాబిల్లి యెటుల దోసము దలంచు పాములు మ్రింగినప్పటికైన చావని । చలువతెమ్మెరకెట్లు జాలి బుట్టు చిగురాకు దిని కండ్ల పొగరెక్కినది గండు- । కోయిల రొద యేల సేయకుండు | |
| తే. | నొకరిజోలికి బోని పూలకును బొడిచి । రసము గ్రోలెడి తేటి యీరసము నెంత దెలుప నే జాల నీమీది మరులుతోన । వశమగునె రామరామ లావణ్యసీమ. | 69 |
| సీ. | తరుణికెంతట దృష్టి తాకునో యని దాని । సొగసు కన్నులనిండ జూడ వెరతు మిసిమైన నునుమేను కసుగందునని చేతు- । లెత్తి బిగ్గన కౌగిలింప వెరతు నవకమౌ లేతచన్గవ సొక్కునని యెంచి । గట్టిగా చేకొద్ది బట్ట వెరతు చిలచిల నమృతంబు జిలుకగా దాని చ- । క్కెరమోవి మొనపంట గరువ వెరతు | |
| తే. | గోల భయమంది యిక తాళజాలదనుచు । హాయి మీరగ నుపరతి నడుగ వెరతు దాని సుగుణంబు రూపమింతని వచింప । వశమటే రామరామ లావణ్యసీమ. | 70 |
| సీ. | చిలకముక్కున కాటు జెందని బింబంబు । పొగలేక నిల్చు కప్పురపు దివ్వె కోయిల నొక్కుగా కొరకని చిగురాకు । ఘాటింపు పచ్చిమరాటి మొగ్గ తుమ్మెద వ్రాలని కమ్మదామరపువ్వు । నవకమౌ మేల్దవనంపు మొల్క సానపై దీరిన జాతివజ్రపురవ । వాసించు గోవజవాజి భరణి | |
| తే. | వలపుల మిటారి నిత్యము వచ్చు దారి । చూచి వేసారి మనమున సొలపు మీరి మగువ నొకసారి నెనయక మరుని బారి । వశమటే రామరామ లావణ్యసీమ. | 71 |
| సీ. | చాన నీ కెమ్మోవినాన నిదే మొదల్ । విడెమేమొ నోటికి వెగటులగును లేమ నే నిను కౌగిలించ నిదే మొదల్ । కసిదీరదయ్యె నా కరములకును నతివ నీతోడ మాటాడ నిదే మొదల్ । విన సైచదొకపాట వీనులకును చెలియ నీతో పొందు సేయ నిదే మొదల్ । కరువయ్యె నిదుర నా కన్నులకును | |
| తే. | ప్రేమ నెటు దాతు మదికి మందేమి సేతు । నెపుడు నిను జూతు నింక నేనెటుల సైతు బిరుదు నిక తీతు మరునిదే పెద్ద భీతు । వశమటే రామరామ లావణ్యసీమ. | 72 |
| సీ. | హా శారచ్చంద్రనిభాస్య హా హరిమధ్య । హా కలకంఠి బింబామృతోష్ఠి హా నవసరసీరుహాక్షి కోకస్తని । హా గజయాన దయాపయోధి హా హేమవర్ణనిభాంగి బంభరవేణి । హా పద్మరాగకుందాభరదన హా సైకతశ్రోణి హా గుణకల్యాణి । హా రాజరత్నమ కీరవాణి | |
| తే. | హా మరుని నాజిలో గెల్చినపుడె నీదు । కుసుమబాణునినగరెల్ల కొల్లసేయ నెపుడు గల్గును చాన నీ హితము మాన । వశమటే రామరామ లావణ్యసీమ. | 73 |
| సీ. | కల్కి నీ కుల్కుగుబ్బల నీటు దలపోసి । గజనిమ్మపండ్లపై కరుణ దరిగె సఖి నీదు మోవిలో చవి నిరీక్షించిన । పంచదారను కోపగించవలసె తరుణి నీ మంచిమెత్తనిమేను పరికించి- । నపుడె పూచెండ్లపై హవుసు మానె కొమ్మ నీ ముద్దుపల్కుల నాదు మదినెంచి । చిలుకనెత్తను బాళి దగలదయ్యె | |
| తే. | వెలది నినుజేరి మదికేరి వేడ్కమీరి । గోర తొడజీరి మరుబారి కొదువదీరి కడిమి నొకసారి చలపోరి కలయగోరి । వచ్చితినె రామరామ లావణ్యసీమ. | 74 |
| సీ. | వనజాక్షి భువి రూపవతులెందు నిక లేరా । నవురుగా నొకవేళ నవ్వుకోరా యెదటి భావంబు గుర్తెరిగి మన్నించరో । యెంచి యంతట పల్కరించుకోరా యతినయోక్తుల క్షేమమడుగరో వలపించి । సతిపతులని యున్న జగములోన శుకవాణి చెర్లాటలకు కలహించరో । కలహించి పిమ్మట గలుసుకోరా | |
| తే. | నింత నావలె బాళి నీయంత కఠిన । నెందు గానను జాణనయింది మొదలు నతివ దానిల్లు బంగారమైరి యింత । వంచనటె రామరామ లావణ్యసీమ. | 75 |
| సీ. | చివురాకుపై మంచు చెక్కిలి చెమటంచు। తొడగ రుమాలుచే తుడువబోదు ననటుల బిగి గాంచి పెనుదొడలని యెంచి । యొనరుగా నెలవంక లునుపబోదు నునుముత్యముల గాంచి చనుమొన లనిపించి । తెలియజాలక చేత నలుమబోదు పటములో వ్రాసిన ప్రతిమను గాంచి నీ- । వంచు ప్రేమను కౌగిలించబోదు | |
| తే. | వెరవకని మోదమలర నామీద ప్రేమ । నింపగా రాద జాలి యొక్కింత గాద తరుణి యికమీద విరహసాగరము నీద । వశమటే రామరామ లావణ్యసీమ. | 76 |
| సీ. | అతివ నేనొకసారి యీనితే నీదు వా- । తెరతేనె లేమైన తరిగిపోనె పణతి నేనిసుమంత బట్టితే నీ చను- । బంతు లంతటిలోనె వాడిపోనె యలుకలేమిటికంచు పలుకరించంగానె । పలుకులో నమృతంబు లొలికిపోనె కడుప్రేమ నొకసారి కౌగిలించంగానె । కలికి నీ తనువేమి కందిపోనె | |
| తే. | వనిత నాతోడ నొకసారి కెనయగానె । దర్పకుని బొక్కసము కేమి తక్కువగునె చాన నిను మాన నాతోన చలము బూన- । వలెనటె రామరామ లావణ్యసీమ. | 77 |
| సీ. | కోపమేటికి ముద్దుగిల్కు నెమ్మొగమెత్తి । చూడవే నను బాల సుగుణశీల వలచివచ్చితినంచు వంచనేమిటికి నన్ । మన్నించవే భామ మధురసీమ చుల్కసేయక తేనెజిల్క ప్రేమగ నొక్క । మాటాడవే యింతి మదనుదంతి గబ్బిగుబ్బల రొమ్ము గదియించి నా యెద । నానవే యో చాన హంసయాన | |
| తే. | యేలనే గోల చలము నీకేల సైప- । జాల నీ జాలమేల నన్ చాలరతుల దేల దయనేలకున్న నీవేళ తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. | 78 |
| సీ. | చేడె నిన్ కన్నుల జూడకయున్న నా । గడె బ్రహ్మకల్పముగా దలంతు వనిత నీ చెరుగు మాసిన మూడునాళ్లు నే । క్షణమొక్క యుగముగా జరుపుచుందు మదిరాక్షి వ్రతదినంబది గూడదను రేయు । నిమిషమొక్కేడుగా నిదుర గాతు పొలతి పుట్టలు జూడపోవుచో నణుమాత్ర- । మును లెక్కగొని మనువని తలంతు | |
| తే. | రమణి మరులొగ్గి విరహానలమున కగ్గి । మరిమరిని తగ్గి సొగసుపై మనసు నొగ్గి వేడుకల మ్రొగ్గియున్న నన్ వింతసేయ । వలెనటే రామరామ లావణ్యసీమ. | 79 |
| సీ. | కలపంబు నెమ్మేన నలది యొద్దిక జేరి । వినుతించి కప్పురవిడె మొసంగి యరవిరి సంపెందవిరులు సొంపుగ జుట్టి । కడుమోదమున బిగ్గ గౌగలించి పెదవితేనియలిచ్చి మదనదాహము దీర్చి । కెమ్మోవిపై పలుగెంపులుంచి పావురగతి కేరి పలికి చెక్కిలి జీరి । ముద్దిచ్చి లాలించి మోహరించి | |
| తే. | గుబ్బిచనుమొన లెదనాని గురుతులుంచి । తరుణి చౌశీతిబంధపద్ధతు లెరింగి రతుల దేలించు నీ చమత్కృతి దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 80 |
| సీ. | ఏలనే యింత జాగేలనే తమి నిల్ప- । జాలనే కరుణ నన్నేలుకొనవె మానవే చల మెంతదానవే కెమ్మోవి- । నానవే కౌగిట బూని వేడ్క నేరమా పల్కు బంగారమా నాచోట । క్రూరమా మరి కానివారమటవె యెంచవే రతుల దేలించవే చాల మ- । న్నించవే వగలు చాలించి యిపుడు | |
| తే. | చెరుకుసింగిణిదొర బారి తరముగాక । వెరచి మరులను తానయై వేడుకొనిన తెలియవైతివి మనసులో దిగులు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 81 |
| సీ. | కలవి గ్రక్కకురె కోకిలలార మీ కూక । సుదతి నెమ్మొగమెత్తి చూచుదాక చలము సేయకురె వెన్నెలలార మీ కాక । హరిమధ్య సుంత మాటాడుదాక మురిపేల చల్వతెమ్మెరలార మీ రాక । చంచలాక్షిని కౌగిలించుదాక మదనా సరేను మంచిది లేర నీ ఢాక । ననబోణి నాతోడ నెనయుదాక | |
| తే. | ననుచు నుండెడితరి తెలియకను నేను । కాచుకొని యుంటి నిటుల నీ కరుణ నమ్మి దోసమెంచక నన్నింత మోసపుచ్చ । వచ్చునటె రామరామ లావణ్యసీమ. | 82 |
| సీ. | అతివ నీ చనుమొన లంటనిచ్చిన కోటి- । శివలింగపూజల సేయు ఫలము చాన నీ కెమ్మోవి నాననిచ్చిన చాలు । సోమపానము సేయుచున్న ఫలము చెలి నీదు కటిని నా చెయి సోకితే చాలు । నవనిప్రదక్షిణంబైన ఫలము కలకంఠి యొకసారి కలయనిచ్చిన చాలు । నతనుమంత్రము సిద్ధియగు ఫలము | |
| తే. | నెపుడు లోచూపు చూచి తదేకనిష్ఠ । దనరి శృంగారదేవతవని తలంచి మానసిక మొనరించుచో మరుల తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. | 83 |
| సీ. | ధరణిపై హేమకర్దమముతో నీ మేను । సేయుచో నది పల్చనాయెననుచు తరణిబింబము తెచ్చి తరచిన యాక్రింద । రాలిన సన్నపు రజము బోసి మెదపిన బిరుసాయె నది కూడదని రవ- । ఘనసార మమృతంబు గలయనేసి పదును గావించి యా పరమేష్ఠి నిర్మించె । గాబోలునని తోచు కలికి నీదు | |
| తే. | తనువు గెంజాయతళుకు వాసనల బిగివి- । నెంతని వచింతు నిన్ను నేనెపుడు గాంతు- నట్టి నిను దల్ప మనసు మోహంబు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 84 |
| సీ. | మొనపంట కసిదీరగను చురుక్కున నొక్కి । నొచ్చెనో మోవంచు నూరడించు కిలకిల నవ్వి చెక్కిలి నొక్కి నా సామి । కందెరా యంచు చన్గవలనంచు ప్రొద్దాయ లెమ్మని గద్దించి పల్కుచు । కదిసి ప్రేమను వచ్చి కౌగిలించు సురతంబునను చాల సొక్కితివని పైట- । చెరగెత్తి నెమ్మోము చెమటలొత్తు- | |
| తే. | నరసి చూడంగ నీ లోకతరబడైన । నాయికే కామసమరప్రదాయియైన దాని వగలెంచి మనసు నెందాక నిల్ప । వశమటే రామరామ లావణ్యసీమ. | 85 |
| సీ. | నిదురలేపిన కోపమొదవు నంచని మెల్ల- । గా వచ్చి వెన్కపక్కల పరుండు నలతగా తన రాక తెలియకూరక నున్న । నెరగనట్టుగ మీద కరము వైచు తిరిగి నేనపుడు వాతెర చురుక్కని నొక్క । లేచి నా నెమ్మోము చూచి నవ్వు మరిచి నిద్దురబోవు తరిని నన్నితూ భంగ- । పరతురా యనుచు నిష్ఠురతలాడు | |
| తే. | యేమొనర్చితినన్న మీకెరుక లేదా । చేసినటువంటి పనులంచు చెలిమి గాంచు దాని వగ దల్చి ప్రేమనెంతనుచు నోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. | 86 |
| సీ. | చల్లని పన్నీరు జల్లించుకొన్న గా- । నణగదే మది విరహాగ్ని యేమొ మంచిచందనము బుయించుకొన్నను గాని । తాళదే యీ మోహతాపమేమొ కలకంఠపొడి పానకము చేసి ద్రావిన । నాగదె మదనదాహంబదేమొ విరుల వీవనలతో విసరించుకొన్నను । దీరదే మరుని వికారమేమొ | |
| తే. | జాగు చేసిన నిక నోర్వజాల బాల । యేల నను చాల నేలుకోవె కృపాల- వాల కలకాల మేరీతి వలపు దాచ । వశమటే రామరామ లావణ్యసీమ. | 87 |
| సీ. | గంధంబుపై మంచిగంధంబుపూతతో । బొట్టుపై కుంకుమబొట్టుతో పూలపై దురిమిన పూలతో కమ్మని । విడెముపై కపురంపు విడెముతోడ కాటుకపై మిన్కుకాటుకతో కాళ్ల- । పసపుపై నలచిన పసపుతోడ వలపుపై గ్రమ్మినవలపుతో గ్రక్కున । సొలపుపై బూనిన సొలపుతోడ | |
| తే. | నత్తవారింటి కరుదెంచునట్టివేళ । నెలత నను గాంచి చాల కన్నీరు నించి యపుడు తలవంచి పలికిన హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 88 |
| సీ. | కన్నడదస్తురిగా సిగవేసి బా- । గున్నదా యని దువ్వు నొక్కవేళ పాండ్యదేశస్త్రీల బాగుగ గొజ్జంగి- । రెక్కన జడనల్లు నొక్కవేళ నల కళింగాంగనవలె గొప్పకీలుగం- । టొనరించి వగ చూపు నొక్కవేళ చెలగి విదర్భకాంతలరీతి మెడలపై । నునుగొప్పు సవరించు నొక్కవేళ | |
| తే. | రతిహుమాపిట్టనుతి చమత్కృతికి దిట్ట । మగువ యికనెట్ట నణుతు నీ మరుని వెట్ట నెలత దయ బుట్టకున్న నే నెనరు బట్ట । వశమటే రామరామ లావణ్యసీమ. | 89 |
| సీ. | తీపైన బేషక్ మఠా పఠాన్ తురకి క- । చ్చీ మాదువాను తేజీల పాగ దిట్టంపు మేల్ జుల్ఫ తీపిల్ల చిగురుఖాం- । డా కమ్మి యస్సల్ కడానిబొమ్మ తరుణుల మేటి నిద్దాహొంతకారి బి- । త్తరుల మిన్నా తేటకురుచతేనె గరిగె లేతాకు తేగా బాదుషా సాము- । వస్తాదు యెనలేని వన్నెలాడి | |
| తే. | జతను నే గూడి కోరమీసంబు తీటు । పంతముల నాటి వేడ్క నా భామతోటి నెనయకుండిన దిగులు నెంతని వచింప । వశమటే రామరామ లావణ్యసీమ. | 90 |
| సీ. | కలగంటినే రేయి కలహంసగామిని । ప్రేమచే నను చేరబిలిచినటుల బలుకకుండిన చెయ్యి బట్టుక నింత మీ- । కలుకలేమంచు నన్నడిగినటుల- నపుడు నే కసరిన నౌనౌను నిటుల సే- । నా గలదని కేరి నవ్వినటుల- నంతట నే సుంత ననుమతించగనె యొ- । ద్దికను పూశయ్యకు దీసినటుల- | |
| తే. | నా యెడల మోవి మోవిని నాని నడుము । మెడల గదియించి హూ యని మీరినటుల- నైన స్వప్నము వేడుకెంతనుచు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 91 |
| సీ. | లలన నీకుచదుర్గముల బలమ్మున గాని । వలరాజు కెదురించి నిలువలేను తరుణి నీ యధరామృతంబు గ్రోలక గాని । మదనదాహమ వేరె మట్టుపడదు వనిత నీ దయచూపు లను వృష్టిచే గాని । యంగజానలము చల్లారబోదు కలికి నీ నవ్వువెన్నెలలు గాయక గాని । స్మరతాప మొకకొంత శాంతి గాదు | |
| తే. | నెనరు మితిలేదు కంటికి నిదుర రాదు । యితరమతి బోదు యాహార మింపు గాదు మెలత యికమీదు నిజము నా మేను నీదు । వశము శ్రీరామరామ లావణ్యసీమ. | 92 |
| సీ. | వేదండయాన యీ పూదండ గైకొని । నీ దండ కరుణ నన్నేలుకొనవె కోపంబు మాని నీ రూపంబు నా స్మర- । తాపంబు దీరగా చూపరాదె వాదేల విరహంబుచే దూల నణగింప- । రాదా లతాంగి రారాపు లేలె యో యిందుముఖి నీవు నాయందు చలము ని- । ట్లైయుందువని దోచదాయె గదవె | |
| తే. | కనరు మాటలు చెవినాని కరుణమాని । మనసుమోడిని కొదవ నీ మాడ్కి బూని యతివ నేడేమొ కాని యీ యలవిగాని । వలపుగదె రామరామ లావణ్యసీమ. | 93 |
| సీ. | గజనిమ్మపండ్లు నే నజరు చేసెద గాని । బటువుగుబ్బలు సుంత బట్టనియవె వెలలేని భూషణమ్ములు కానుకిత్తు నీ । చక్కెరకెమ్మోవి నొక్కనియవె పడతి నే నీ కాకుమడుపులందిత్తు నన్ । కదసి కౌగిట వేడ్క నదుముకొనవె తరలాక్షి నీదు పాదంబైన పట్టెద । విడెమైన రవ సమర్పింపగదవె | |
| తే. | స్నేహమౌచోట నింత నిర్మోహమౌట । తగవటే లేమ యీలాగు సుగుణధామ తలచితే భామ నీమీద తగని ప్రేమ । వశమటే రామరామ లావణ్యసీమ. | 94 |
| సీ. | స్త్రీలపై నతిబాళి జెందిన పురుషుల । కపకీర్తి దీనత నగుడు దిగులు పరువుతక్కువ మోక్షపదవికి దొలుగుట । నైష్టికహీనంబు నవ్వుపాటు చుట్టపక్కంబుల సుళ్లడగించుట గాసి । విబుధాళి గన్న భవిష్యహాని మానంబు విడి యవమానంబు నొందుట । ధనము గోల్పోవుట తనువు చెడుట | |
| తే. | వసుధలోపల నెటువంటివారికైన । తగని వలపిట్లు గారాదు తరుణి నీదు కృపను గాంచక మన్మథచపల మణప । వశమటే రామరామ లావణ్యసీమ. | 95 |
| సీ. | ప్రణవమాలింప నీ మణితంబుగా నయ్యె । ధ్యానంబు నీ పదధ్యాన మయ్యె లక్ష్యంబు నీ పట్టువక్షోజములు నయ్యె । యోగంబు నీదు సంయోగ మయ్యె సుసమాధి మదనతంత్రసమాధిగా నయ్యె । జపము నీ సద్గుణచయము నయ్యె బింబదృశ్యము నోష్ఠబింబదృశ్యము నయ్యె । స్మరణ యేవేళ నీ శరణ యయ్యె | |
| తే. | తరణికిరణాశనము జేసి తపమొనర్చు । వారలకునైన నిది గెల్వ దీరదయ్యె యజుడు నిర్మించు మాయనేమంచు నెంచ- । వచ్చునే రామరామ లావణ్యసీమ. | 96 |
| సీ. | వనిత నీ చెట్టబట్టినవేళ యెట్టిదో । సకలమనోవాంఛ సఫలమయ్యె నను నీవు నిను నేను గనువేళ యెట్టిదో । నంతకంతకు మోహ మగ్గమయ్యె మనమిద్దరము గూడుకొనువేళ యెట్టిదో । నిను జూడకను బాళి నిలువదయ్యె వనజాక్షి నీవు పల్కినవేళ యెట్టిదో । నొకదానిపై చిత్తమొదుగదయ్యె | |
| తే. | నెటుల సైరింతు నిన్ను నేనెపుడు గాంతు । నేది యుపమెంతు నీ జాలినెటు లడంతు మగువ దయయుంచునని చాల మది దలంతు । వరుసనిటు రామరామ లావణ్యసీమ. | 97 |
| సీ. | నెమ్మేన కళలు ఘూర్ణిలగ గౌ నళికి ఘం- । టల తాబు కొల్కి పఠాలురనగ రంగైన తాపితా రయిక చన్ పొగరున । బిగిసి పక్కున కుట్లు పిక్కటిల్ల రత్నభూషణము లలంకరించంగ యీ । విరహాగ్ని వేడిమి వెళ్లనురక గమగమలాడు గంధపుపూత లొక్కొక- । చోట పై రవరవ పేటులెత్త | |
| తే. | వచ్చి మనసిచ్చి ననుమెచ్చి వలపులెచ్చి । కరుణతో మచ్చికను గ్రుచ్చి కౌగలిచ్చి కలయికకుజొచ్చినట్టి నీ ఘనత దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 98 |
| సీ. | మగవారి నింతులే వగ నెచ్చరించుట- । లని సిగ్గుదోచదో వనజగంధి పైకొన్నవేళ కోపము సేతురో యని । భయమైన కాదటే పల్లవోష్ఠి సరివారు గన్న మోసమటంచు సుంతైన । మదికెగ్గు లేదటే మధురవాణి యెరుక సేయక మోవి నెటు నొక్కనంచు తొం- । దర జెందదె మేను సరసిజాక్షి | |
| తే. | యవల పో పోవె తేపకు నంటరాకు । మొదటికూటివె పదివేలు ముదిత చాలు- నింకమీదట నీ గుణమెల్ల తెలిసి । వచ్చెగదె రామరామ లావణ్యసీమ. | 99 |
| సీ. | భాస్కరవంశదీపకయోగిబృందహృ- । త్కమలమార్తాండ మంగళము నీకు సకలసురాసురసంసేవ్యపాదసా- । గరశాయి సహజమంగళము నీకు కుజనగర్వవిఫాల నిజభక్తపాల । కరుణాపయోధి మంగళము నీకు పార్థివేంద్రలలామఫలదాయకాభీష్ట । గజరాజవరద మంగళము నీకు | |
| తే. | ఘనసుగుణధామ ఘోరసంగ్రామభీమ । బుధజనస్తోమ నవ్యసంపూర్ణకామ పతితపావనకృతినామ భవవిరామ । వరచరిత రామరామ లావణ్యసీమ. | 100 |
| సంపూర్ణము. | ||