| శతకములు | మంచి మాట వినర మానవుండ! | శ్రీమతి భమిడి కామేశ్వరమ్మ |
| గురుస్తుతి | |
|
వందన మిదె గురు పాదపద్మములకు నతులొనర్తును పరమగురు పదద్వంద్వములకు భక్తి కొలతును పరమేష్ఠిగురు పాదపంకజములకు తలతు నేవేళనూ గురుత్రయము నెపుడు. |
1 |
|
నాదు చేయిబట్టి తనదరికి నడపించి భక్తిరీతులనెన్నొ బోధ చేసి నా గురుండు సఖుడు నాదైన దైవంబు నా ప్రాణ పతికిదె నమస్కారశతము. |
2 |
| ఇష్టదేవతా ప్రార్థన | |
|
ముందుగ నిను పూజించెద సురవందిత విఘ్నరాజ విఘ్నములుడుపన్; గిరిరాజతనయ నందన కారుణ్యము తోడ నన్ను గావుము తండ్రీ! |
3 |
|
నలువరాణి నిన్ను, నా హృదయమందున కొలుతు భక్తి తోడ, కొర్కెలొసగ అల్లిబిల్లి నాదు పలుకులను మన్నించు; ఉల్లసము గాదె, తొక్కు పల్కులు తల్లి కెంతొ! |
4 |
|
ఎరుగను నే గణ విభజన లెరుగను యతి ప్రాసలనగ నేవియొ తల్లి! ఎరుగుదు నీ పదముల నొరుగుట ఎరుకపడంగచెప్పు, విద్యలెల్లను నాకున్! |
5 |
|
తల్లి భారతి నిన్ను నా యుల్లమందు స్మరణజేసెద, వాక్కున సుధనొసంగ సకల విద్యాప్రదాత, నీ కరుణ లేక పలుకనేర్తురే, ఎంతటి వారలైన? |
6 |
|
కాళిదాసుని కవిశ్రేష్ఠుని గంటమున నిలచి తేనెవానలు కురిపించినావు భువిని తడవిననె జాలు మేఘసందేశ, శాకుంతలముల మరతురె బుధవరేణ్యులు పృథ్వి యున్నంత దనుక! |
7 |
| మంచి మాట వినర మానవుండ | |
|
శివుని పూజలేని చిత్తంబు అదిఏల? పితృ పూజలేని విత్తంబులవి ఏల? మాతృపూజలేని మనుగడ ఏలరా? మంచి మాట వినర మానవుండ! |
1 |
|
మాయలోనపుట్టి, మాయలోనపెరిగి, మాయతెలియలేడు మానవుండు మాయతెలిసెనేని, మాధవున్ గనుగొను మంచి మాట వినర మానవుండ! |
2 |
|
నిన్ను కడుపున మోసి, ప్రసవ బాధలకోర్చి, హేయమైన ఊడిగములుచేసి, నీదు ఉన్నతి గోరు తల్లిని మరువకు, మంచి మాట వినర మానవుండ! |
3 |
|
నీకు జన్మంబిచ్చి, నిన్ను తీర్చిదిద్ది, కంటికి రెప్పవలె నిన్ను గాచి, నీవె తాననుకొను, తండ్రిని పూజింపు మంచి మాట వినర మానవుండ! |
4 |
|
నుదుట వ్రాసియున్న వ్రాతకన్నను మించి నువ్వుగింజయంత నీకు రాదు, ఎండమావుల వెంట ఎందుకురా పరుగు? మంచి మాట వినర మానవుండ! |
5 |
|
ఎన్నివిధముల బెంచి పోషించినను, మనుజ కాయంబు నిలుచుట కల్ల గాదె, మాయ కాయమందు మోహంబు ఏలరా? మంచి మాట వినర మానవుండ! |
6 |
|
చిత్తంబునున్నట్టి శివుని గాంచగలేక గుడిగోపురములంచు దిరుగనేల? వెఱ్ఱివగుచు నీవు వెతల జెందగనేల? మంచి మాట వినర మానవుండ! |
7 |
|
ఊరి ముందరనున్న నదికెన్నడును పోడు తీర్థయాత్రలంచు తిరుగుచుండు మందుచెట్టు మనకు ముందున్న గనబోము మంచి మాట వినర మానవుండ! |
8 |
|
తన్ను తాను ముందు తెలుసుకొని పిమ్మట పరులకుపదేశించుటెల్ల లెస్స తాను గ్రుడ్డియైన దారెట్లు జూపును? మంచి మాట వినర మానవుండ! |
9 |
|
ఎక్కువ ధనమున్న, ఎట్లుగాతునను ఏడ్పు, లేకయున్న, ధనము లేదనేడ్పు ఏడ్పులేని మనుజులెందును లేరురా మంచి మాట వినర మానవుండ! |
10 |
|
మనసు నిల్ప నీకు మరి చేతగాకున్న జపతపంబులేల, జన్నమేల? మనసు నిల్పు నాడు మరి పూజలేలరా? మంచి మాట వినర మానవుండ! |
11 |
|
ఎంచి చూడ, జనులకొక రెండు దారులు మంచి చెడ్డలనగ మహిని గలవు మంచి దారిబోవ, మాధవుండెదురగును మంచి మాట వినర మానవుండ! |
12 |
|
తాను చేయు తప్పు తను తెలిసికొనలేక, ఒరుల తప్పు లెన్నుటొప్పు గాదు తనదు తప్పు తెలుసుకొనువాడె ధన్యుండు మంచి మాట వినర మానవుండ! |
13 |
|
నీకుచేతనైన ఒరులకుపకరించు చేతగాకున్న, ఊరక చూచుచుండు చెడ్డవానికైన చెడు చేయకెన్నడు మంచి మాట వినర మానవుండ! |
14 |
|
ఆశయుండవచ్చు, అది సహజమెల్లరకు, ఆశలేని మనుజుడవని లేడు ఆశ దురాశయైన దుఃఖంబు తప్పదు మంచి మాట వినర మానవుండ! |
15 |
|
ఇల్లు నాది యనుచు, ఇల్లాలు నాదనుచు ప్రాకులాట ఏల పామరుండ? వెళ్ళిపోవునాడు వెంటెవరు రారురా మంచి మాట వినర మానవుండ! |
16 |
|
ఆకలైనవానికన్నమిడుట లెస్స పాత్రతెరిగి దానమిడుట లెస్స మనకు విలువయున్న మాటాడుట లెస్స మంచి మాట వినర మానవుండ! |
17 |
|
రాము రహీమంచు క్రీస్తుదేవుండనుచు వాదమేల వట్టి మూఢజనుడ స్వర్ణ మొక్కటే గాని, భూషణంబులు వేరు మంచి మాట వినర మానవుండ! |
18 |
|
హస్తద్వయము కలుప చప్పట్టుల్ మ్రోగును మాటకు మాట పోట్లాట యగును మాట పెరుగుచోట మౌనివై యుండుము మంచి మాట వినర మానవుండ! |
19 |
|
చెడ్డవాని చెలిమి చేయబోకెన్నడు ముప్పుతప్పదెన్నడైన నీకు ఇనుము సమ్మెట సామెతెరిగినదె కదర మంచి మాట వినర మానవుండ! |
20 |
|
ముసలితనమునందు జపము చేసెదనంచు కాలమంత వృథగ గడపబోకు మతిలేని ముదిమిని మనసెటుల నిలచును మంచి మాట వినర మానవుండ! |
21 |
|
మంచి కార్యము జేయ మదిని దలచునపుడు రేపు రేపటంచు నాపబోకు క్షణ భంగురంబైన దేహమ్ము నమ్మకు మంచి మాట వినర మానవుండ! |
22 |
|
నీటిబుగ్గకు క్షణము నిలకడ యున్నది అంతకన్న దేహమశ్వరంబు దీపముండగానె దిద్దుకొను నీ ఇల్లు మంచి మాట వినర మానవుండ! |
23 |
|
పుట్టుటెంతనిజమొ, పోవుటంత నిజము, నడుమ నాటకంబు నరుని బ్రతుకు తెరపడుటెప్పుడో ఎరుగువాడెవ్వడు? మంచి మాట వినర మానవుండ! |
24 |
|
తోలు క్రింది వ్రాత తొలగజేయగ లేడు విద్యలెన్నియున్న, విత్తమున్న అనుభవించవలసినదె ఎంతవారలైన మంచి మాట వినర మానవుండ! |
25 |
|
అన్ని నాకు తెలుసునని విర్రవీగకు క్షణములోనవచ్చు దెరుగవీవు నుదుటి వ్రాతనెరుగు ఘనత నీకున్నదా? మంచి మాట వినర మానవుండ! |
26 |
|
ఒకని సంపద జూచి ఓర్వలేనివారు సుఖము, శాంతి లేక కుములుచుంద్రు ఇంట నగ్నిబుట్ట ఇల్లు దహియింపదా? మంచి మాట వినర మానవుండ! |
27 |
|
బంగారు పూల భగవంతు పూజించినన్ , భక్తి లేక పూజ ముట్టబోడు హృదయ కుసుమమొకటి అర్పింప తృప్తుడౌ మంచి మాట వినర మానవుండ! |
28 |
|
మాయ నాటకమందు మనసును నిలుపక మాయ దాటు మార్గమరయు మీవు మానవ జన్మంబు మరిమరి రాదురా మంచి మాట వినర మానవుండ! |
29 |
|
అమ్మల, బాబాల నమ్మకు మదిలోన గారడీ విద్యల ఘనులు వారు నమ్ము నీహృదయమున జగదంబ పాదముల్ మంచి మాట వినర మానవుండ! |
30 |
|
హస్తమున జపమాల అలవాటునను తిరుగు చిత్తంబు తిరుగు తన ఇచ్ఛరీతి చిత్తంబు పట్టుము, శ్రీహరిన్ గట్టుము మంచి మాట వినర మానవుండ! |
31 |
|
ధర్మంబు తప్పక సంచరించెదవేని, అర్థ కామములు నీ వెంటనంటు మోక్షంబు సిద్ధించు, జన్మంబు తరియించు మంచి మాట వినర మానవుండ! |
32 |
|
అర్థ మర్థమనుచు అర్రులు చాచక బ్రతుకునకర్థంబు వెదకు మీవు వ్యర్థంబు గానీక, దిద్దుకొనుమీజన్మ మంచి మాట వినర మానవుండ! |
33 |
|
విగత జీవికొరకు వగచుట ఎందులకు స్థిరముగా నీవుండగలవె, ఇచట? పుట్టుట, గిట్టుట సృష్టి ధర్మంబులు మంచి మాట వినర మానవుండ! |
34 |
|
పరమాత్మ చూపునందున చూపు నిలుపు అతని నామమె నీ వీనులందు నింపు పట్టు మాతని పదము గట్టిగా నీ మదిని మంచి మాట వినర మానవుండ! |
35 |
|
మైల పడితిమనుచు మరి మరి స్నానముల్ జేయ మైల వదలబోదు వినుము మనసు మూలల నున్న మైలను వదలించు మంచి మాట వినర మానవుండ! |
36 |
|
మత్తెక్కి పరుగిడు మత్త గజంబును కొంత శ్రమ జేత పట్టి బంధించ వచ్చు పరుగిడు చిత్తంబు పట్ట నెవ్వరి వశము? మంచి మాట వినర మానవుండ! |
37 |
|
ఎంత చదువు చదివి, ఎన్నెన్ని నేర్చినన్ కోపముడుగకున్న, అన్ని సున్న ఫణిరాజు శిరమున మణియున్న ఫలమేమి? మంచి మాట వినర మానవుండ! |
38 |
|
మలినమంటకుండ మనసునుంచితివేని ఆత్మసాక్షాత్కార మందగలవు మసిబారు అద్దమున మనిషి కనిపించునా? మంచి మాట వినర మానవుండ! |
39 |
|
చెడ్డ తలపు పెద్ద మనసునందు మొలకెత్తిన పెరిగి పెరిగి పెద్ద వృక్ష మగును వ్రేళ్ళూనుటకు మున్నె వెడలగొట్టుము దాని మంచి మాట వినర మానవుండ! |
40 |
|
ఎన్నెన్ని జన్మల నెత్తితివో తొల్లి భాగ్య వశమున కలిగెనీ మనుజ జన్మ మరు జన్మ లేకుండ మాధవుని సేవించు మంచిమాట వినర మానవుండ! |
41 |
|
చిక్కవలదు విషయ వాంఛల నెల్లపుడు చిక్కకు సంసార జలధియందు చిక్కుపడు ఎల్లపుడు శ్రీహరి పదభక్తి మంచిమాట వినర మానవుండ! |
42 |
|
జరయను రాకాసి తగిలిన వెనుక నీవేమి చేయగలేవు, సర్వ శక్తులుడుగు త్వరపడుమిప్పుడే హరి పూజ చేయంగ, మంచిమాట వినర మానవుండ! |
43 |
|
తాను లేకయున్న, తలక్రిందులవునని మోరవిరచి విర్ర వీగువాడు తన్ను గాచువాని నెన్నడు గనలేడు మంచిమాట వినర మానవుండ! |
44 |
|
తన్ను బిలువకుండ దగ దెచటికిబోవ సుతులు, హితులు, ప్రాణ బంధులైన దక్షునింట నాడు దాక్షాయణేమాయె మంచిమాట వినర మానవుండ! |
45 |
|
సంపదున్ననాడు, చనుదెంతురెల్లరు తేనె కొరకు చీమలేగినట్లు నిర్ధనుండవైన, నిన్ను జేరరెవ్వరు మంచిమాట వినర మానవుండ! |
46 |
|
నీదు స్థితిని మించి నెయ్యంబు నెరపిన, బాధ తప్పదు బ్రతికియున్నదాక కాసుకున్న విలువ మానిసికేదిరా? మంచిమాట వినర మానవుండ! |
47 |
|
అడ్డాలనాటి యా బిడ్డలు బిడ్డలు గడ్డాలనాడు నీ సుద్దు వినునె? ఇట్టి నిజము తెలిసి దుఃఖించుటేలరా? మంచిమాట వినర మానవుండ! |
48 |
|
సుతులవల్ల కాని గతులు కలుగ వటంచు ఆడబిడ్డల నపహసించు నొకడు ఆడువారు లేక అవనెట్లు నిలచును? మంచిమాట వినర మానవుండ! |
49 |
|
నీదిగాని దానికెన్నడాశించకు, నీదియైన దాని వదలబోకు నీకు సాటి రారు నిలలోన నెవ్వరు మంచిమాట వినర మానవుండ! |
50 |
|
సంసార రథమున చక్రాలు సతి పతుల్ రెండు సరిగ నుండ బండి నడచు మాట భేదమైన మరి బండి నడువదు మంచిమాట వినర మానవుండ! |
51 |
|
ఇంట తన సతి యుండ, తుంటరి తనమున పరభామినుల కొరకు పర్వులెత్తు ఆడువారలందరవని ఒక్కటి గాదె? మంచిమాట వినర మానవుండ! |
52 |
|
కాసులున్నవాడె ఈశుండు భువిలోను నతడేమి చెప్పిన నదియె ఘనత నిర్ధనుండు చెప్పు నిజమును నమ్మరు మంచిమాట వినర మానవుండ! |
53 |
|
పోరులేని ఇంట పొసగును సౌఖ్యంబు పోరు కల్గ, బ్రతుకు భారమగును చింతలేనిచోట శ్రీలక్ష్మి నిలచును మంచిమాట వినర మానవుండ! |
54 |
|
మాటలందు నీకు మన్నన తెలిసిన ఏదేశమేగిన నెదురు లేదు మాటచేతగాక, మరి బ్రతుకు లేదురా మంచిమాట వినర మానవుండ! |
55 |
|
పట్టువదలక పతికి ప్రాణముల్ దెచ్చె సావిత్రి సుధను సాధించిరి, సురలు నాడు పట్టు వదలకున్న, పనిని సాధింతువు మంచిమాట వినర మానవుండ! |
56 |
|
అలవికాని ఆలి, అధముడౌ పుత్రుండు కులము చెరచునట్టి కూతురున్న వానికా గేహంబె, వసుధలో నరకంబు మంచిమాట వినర మానవుండ! |
57 |
|
ఏడ్చుచు పుట్టెదౌ, ఏడ్పించి పోయెదౌ ఎచటినుండి వస్తివిచటికీవు? నడుమనున్న నాల్గు రోజులైన నవ్వు మంచిమాట వినర మానవుండ! |
58 |
|
తల్లి దండ్రుల బ్రోచు తనయుడొక్కడు చాలు పెక్కు సంతతేల, పుడమి బరువు సుత శతంబు కల్గు ధృతరాష్ట్రుగతి వినమె? మంచిమాట వినర మానవుండ! |
59 |
|
మేఘుండు వర్షించు, పుడమి సస్యములిచ్చు, తరులు పుష్పములనిచ్చు, నుపకార బుద్ధి పరుల హితము గోరు, పరమేశ్వరుడు మెచ్చు మంచిమాట వినర మానవుండ! |
60 |
|
అందమైన దేవళములు, భవనముల్ పగులగొట్టిన, మరల గట్టవచ్చు హృదయంబు పగులగొట్టకు, అతుకనేరవు మంచిమాట వినర మానవుండ! |
61 |
|
ఇతరులకు చెప్పుటకెన్నెన్నో నీతులు ఆచరణలో శూన్యమవియె నీకు చేయగలవారలే, చెప్పుటకర్హులు మంచిమాట వినర మానవుండ! |
62 |
|
పెంచకు వైరంబు, ద్రుంచకు స్నేహంబు మంచి స్నేహంబు ఇంటి పాడి నీకు పడగ విప్పిన పాము, పెంచిన వైరంబు మంచిమాట వినర మానవుండ! |
63 |
|
ఎంతటి మహనీయునకు ఉద్భవించిన తలవ్రాత మార్చంగ తరముగాదు సూర్యుని పుత్రుండు సూత పుత్రుడు గాదె? మంచిమాట వినర మానవుండ! |
64 |
|
ముదుసలి తలిదండ్రులను కసరి కొట్టకు చావు, చావు మనుచు నీడ్వబోకు నిత్య యవ్వనంబు నిలవదెవ్వరి కిలను మంచిమాట వినర మానవుండ! |
65 |
|
ఎదలోని నీ వ్యధను పదిలముగ దాచుము పదుగురికి పంచుము సంతసంబు పెద్దల సుద్దులివి బుద్ధిగలవారికి మంచిమాట వినర మానవుండ! |
66 |
|
దుష్ట బుద్ధులున్న దుర్జనులెల్లపుడు, సజ్జనుల బాధించి తనియుచుంద్రు దుర్జనుల కెల్లపుడు దూరముగ తొలగుము మంచిమాట వినర మానవుండ! |
67 |
|
పరులను బాధించి, తాను సుఖపడువాడు దానవుండు గాక, మానవుండె? మానవత్వము లేని మనుగడ ఏలరా? మంచిమాట వినర మానవుండ! |
68 |
|
నీకున్న దానితో, నిత్య తృప్తిని బొందు ఒరుల సంపద జూచి వగక బోకు నీ ఇంట నిలచును నిఖిల సౌఖ్యంబులు మంచిమాట వినర మానవుండ! |
69 |
|
తాను తినగలేడు, ఒరులకీయగబోడు సిరుల మూటగట్టు, పరమ లోభి లోభివాని సిరులు, లోకంబు పాలురా మంచిమాట వినర మానవుండ! |
70 |
|
పెద్ద పెద్ద యనగ, పెద్ద కాబోరెవరు పెద్ద గుణములున్నవారె పెద్ద వయసుతో పనిలేదు, మంచి మనసది చాలు మంచిమాట వినర మానవుండ! |
71 |
|
గద్దె నెక్కెడుదాక సుద్దులు జెప్పెదరు గద్దెనెక్కిన వెనుక బుద్ధి మారు గద్దెనెక్కినవాని సుద్దులను నమ్మకు మంచిమాట వినర మానవుండ! |
72 |
|
మంచిగా చెప్పిన, మాట వినరెవ్వరు కస్సు బుస్సుమన్న, గౌరవింత్రు నోరుగలవానికి ఊరంత వెరతురు మంచిమాట వినర మానవుండ! |
73 |
|
ధనికుడేది పల్కిన, ధరను జెల్లు కాసులేనివాని నీతి వినము కాసులు ధరనేల, నీతికి విలువేడ? మంచిమాట వినర మానవుండ! |
74 |
|
రాజులెల్లరో తొల్లి రాజ్యాల నేలిరి, ప్రాణాల నొసగిరి, ప్రజల కొరకు పదవి తప్ప, ప్రజల సుఖమరయరీనాడు మంచిమాట వినర మానవుండ! |
75 |
|
కట్నాల చావుల కథల విన్నప్పుడు సిగ్గు గాదె, ప్రగతికెగ్గు గాదె? ఇటుల జరిగెనేని, ఇంకేది మన ప్రగతి? మంచిమాట వినర మానవుండ! |
76 |
|
నిన్నెంతో అలరించి, నీదు వంశము నిల్పి, కష్ట సుఖముల కడదాక తోడునిలచు, ఆ స్త్రీని పెండ్లియాడ సిరి మూటలేలరా? మంచిమాట వినర మానవుండ! |
77 |
|
తల్లియై పెంచి, చెల్లియై మమతల పంచి ఇచ్చి సగము దేహమై, నీకెంతో సౌఖ్యమొసగు స్త్రీని గౌరవించు, సిరులింట పండించు మంచిమాట వినర మానవుండ! |
78 |
|
అగ్ని పడ ద్రోసిరి, డబ్బునకమ్మిరి, వలువలీడ్చిరి, కాల్చిరి సతి వటంచు సిగ్గుపడుమికనైన, స్త్రీలకెగ్గులు సలుప, మంచిమాట వినర మానవుండ! |
79 |
|
ఆడవారలనుచు, అలుసుగాచూడకు, ఆడదికాదొక ఆదిశక్తి సృష్టి నిలచిపోవు, స్త్రీ శక్తి లేకున్న మంచిమాట వినర మానవుండ! |
80 |
|
తాను కరుగుచుగూడ, తగదనక కొవ్వొత్తి కాంతినొసగు, ఎంతో కరుణతోడ లోకాన సజ్జనుని పోకడ ఇట్టిది మంచిమాట వినర మానవుండ! |
81 |
|
గుడిలోన కొలువైన దొడ్డ దేవరలైన రాజ్యాలనేలెడు రాజులైన పరుల సాయము లేక, పనులేమి జరుగవు మంచిమాట వినర మానవుండ! |
82 |
|
మనిషి అందముకన్న, మంచి మనసది మిన్న సంపదలకన్న, చలనములేని విద్య మిన్న ఈర్ష్యపడు బంధువునికన్న, హితుడెంతో మిన్నరా మంచిమాట వినర మానవుండ! |
83 |
|
నీదు సంతతియందు నీకెంత మమతయో నిన్ను నీ తలిదండ్రులటులె పెంచిరని మదిని ఎంచి వృద్ధులైనవారిని శ్రద్ధగా చూడుము మంచిమాట వినర మానవుండ! |
84 |
|
సానిపాపతోడ సరసాల నాడిన, కాసులూడ్చి, కానుకిచ్చు వ్యాధి తగులుకొని వదలదు, తరతరంబులదాక మంచిమాట వినర మానవుండ! |
85 |
|
నీదు రాబడి మించి ఖర్చు చేయబోకు, అప్పు చేయగబోకు గొప్ప కొరకు అప్పులిచ్చువారు నెత్తెక్కి తొక్కుదురు మంచిమాట వినర మానవుండ! |
86 |
|
చక్కనివారమని సంబరంబది ఏల, మనసు చక్కదనము మరుగుపడిన, మనసు చక్కగనున్న మనుజులే చక్కన మంచిమాట వినర మానవుండ! |
87 |
|
దానమిమ్మొకింత, నీకున్న దానిలో ధనము తరుగబోదు, దానివలన దానమిచ్చిన ధనమె, దాచిన ధనమగున్ మంచిమాట వినర మానవుండ! |
88 |
|
పరసతి పొందగోరుట ఘోర పాపంబు కష్ట నష్టములెన్నొ కల్గు దాన ఎంతటి రావణున కాగతి పట్టెను మంచిమాట వినర మానవుండ! |
89 |
|
ఇంటిలోన ఎన్ని ఇక్కట్లు నీకున్న పెదవి కదుప జనదు, పరుల ముందు ఎదుటనయ్యో యనుచు, నీవెనుక నవ్వెదరు మంచిమాట వినర మానవుండ! |
90 |
|
కనుల ముందర భార్య కడగండ్లు గాంచియు జూదమాడె మరల ధర్మజుండు లోకాన వ్యసనపరు పోకడ ఇట్టిది మంచిమాట వినర మానవుండ! |
91 |
|
చిన్నవారినైన మన్నించుటెరుగుము నేనె పెద్దటంచు నీల్గబోకు వానరంబులు నాడు వారధి గట్టవా? మంచిమాట వినర మానవుండ! |
92 |
|
అన్నదమ్ముల మధ్య ఆస్థికై కొట్లాట పదవికై కొట్లాట ప్రభువులందు తల్లికన్నము బెట్ట, తనయుల కొట్లాట మంచిమాట వినర మానవుండ! |
93 |
|
మనసు నెరుగు మగువ, మంచి సంతానంబు, ప్రాణమొసగునట్టి పరమ హితుడు కలిగిన వానికీ ధరణియే స్వర్గము మంచిమాట వినర మానవుండ! |
94 |
|
నీవు తలచిన కార్యమెల్ల నెరవేరంగ గర్వపడుదువు నీదు ఘనత జెప్పి లేని నాడెల్ల, పైవాని దూరగ నేల? మంచిమాట వినర మానవుండ! |
95 |
|
మెడనిండ రుద్రాక్ష మాలలు ధరియించి ఒడలెంత తెల్లని బూది పూసి డాంబికంబులు పల్కు వారల దరిబోకు మంచిమాట వినర మానవుండ! |
96 |
|
బ్రతికియుండగ, పట్టెడన్నంబు పెట్టరు శ్రాద్ధ కర్మలు చేతురు గొప్ప కొరకు ఎవరు తిందురు భువిని, ఎవరు మెత్తురు దివిని? మంచిమాట వినర మానవుండ! |
97 |
|
పదవి యుండగ పాదముల నంటి మ్రొక్కుదురు పదవి పోయిన వెనుక పలుకరెవరు ఇది మారదెన్నడు, ఇంతె లోకపు తీరు మంచిమాట వినర మానవుండ! |
98 |
|
చక్కనైన రాజ మార్గమది యుండంగ సందుగొందుల వెంట బోవనేల? వెఱ్ఱివగుచు నీవు వెతల చెందగనేల? మంచిమాట వినర మానవుండ! |
99 |
|
ఎల్ల జీవుల బ్రోచు తల్లి తానుండంగ మనుగడకై మథన పడుట ఏల? ఇహ సుఖంబుల నీకు ఇంత మమతేలరా? మంచిమాట వినర మానవుండ! |
100 |
|
మంగళం తల్లి లలితాదేవి పదములకు మంగళం శ్రీ శ్రీనివాసునకును మంగళం ననుగన్న నాతల్లిదండ్రులకు మంగళంబు మంచివారికెల్ల. |
101 |
శ్రీ భమిడి ఆంజనేయులు గారి కోర్కెపై వారి తల్లి శ్రీమతి కామేశ్వరమ్మగారి 'మంచిమాట వినర మానవుండ' శతకరచనను ఆంధ్రభారతిలో పొందుపరిచాము. దీని transliterated textను మాకు పంపిన ఆంజనేయులు గార్కి మా అభినందనలు. దీనిపై చదువరుల అభిప్రాయాలను, ఆలోచనలను వారికి తెలియజేయగలరు.