| శతకములు | సర్వేశ్వరశతకము | యథావాక్కుల అన్నమయ్య |
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
పీఠిక - నిడదవోలు వెంకటరావు
(శతకసంపుటము ప్రథమభాగము - ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, 1966)
| సర్వేశ్వరశతకము - యథావాక్కుల అన్నమయ్య | ||
| శా. | శ్రీకంఠుం బరమేశు నవ్యయు నిజశ్రీపాదదివ్యప్రభా- నీకోత్సారితదేవతానిటలదుర్నీత్యక్షరధ్వాంతుఁ జి- త్ప్రాకామ్యాంగు నపాంగమాత్రరచితబ్రహ్మాండసంఘాతు జం- ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా! | 1 |
| మ. | ఒకమా టీసకలంబు నీ మయముగా నూహించుచు న్వెండి యొ- క్కొకమాటింతయు నీవు గావనుచు నేయుక్తిం బ్రశంసింపనే- రక వేదంబులు చిక్కుపడ్డవనినం బ్రవ్యక్తమై యుండు భా- వకుఁడై నీ నిజరూప మిట్టిదన నెవ్వండోపు సర్వేశ్వరా! | 2 |
| శా. | జ్ఞానాతీతుఁడవైన నీ మహిమఁ బ్రజ్ఞం బూని తర్కించు ట- జ్ఞానాంగంబగు నైననుం దమ యథాశక్తిం బ్రశంసించి ది- వ్యానందస్థితిఁ బొందువారిఁ గని భక్త్యావృత్తి నిన్నెట్టివాఁ- డైనం బ్రస్తుతి సేయుచుండుఁ దనచే నైనంత సర్వేశ్వరా! | 3 |
| మ. | అమితాంభోజభవాండభాండనిలయంబైయుండు నీ యంతరం- గము పట్టెంతయొ దానికింక బహిరంగం బెట్టిదో సూక్ష్మత- త్త్వము దానంతకుమీఁద నేమివిధమో తానిట్టి నీ పెంపుమా- ర్గము నీకైన నచింత్య మెట్లొరుఁ డెఱుంగం జాలు సర్వేశ్వరా! | 4 |
| మ. | ఇన విఘ్నేశ్వర మాతృకాద్రుహిణ బ్రాహ్మీ స్కంద దుర్గా రమా వనితాధీశ్వర భైరవుల్ బలిసి భాస్వద్భక్తిసంయుక్తి నీ- కనిశంబుం బరివారభృత్యనికరంబైరన్న నిన్నింకం గొ- ల్వనివారెవ్వ రజాండభాండములలో వర్ణింప సర్వేశ్వరా! | 5 |
| శా. | ఏపారంగ నజాండభాండనికరం బేరూపులో బుట్టి యు- ద్దీపించు న్మఱి రూపులెల్ల సమసుప్తిం బొంది యేరూపులో లోపించుం గలయంగ నంతటికిఁ దా లోనై విజృంభించి యే రూపం బవ్యయమై వెలుంగు నది నీ రూపంబు సర్వేశ్వరా! | 6 |
| మ. | జలజాతప్రభవాండబుద్బుదము లశ్రాంతంబునుం బుట్టుచుం గలయం గ్రాఁగుచునుండు నీ పృథులలింగస్ఫారగర్భాబ్ధిలో- పలఁ దద్బుద్బుదగర్భవాసులు హరిబ్రహ్మాది దేవాళియుం గలదే వారికి నీ మహత్త్వ మెఱుఁగంగా శక్తి సర్వేశ్వరా! | 7 |
| మ. | భవదున్మేషవిజృంభణంబు పరికింపంగా సరోజాతసం- భవు జన్మంబు భవన్నిమేష మమితబ్రహ్మాండకల్పాంత భై- రవసంక్షోభిత మన్నఁ దక్కిన భవత్ప్రారంభభూరిక్రియా- నివహం బెవ్వరు నేర్తు రిట్టిదని వర్ణింపంగ సర్వేశ్వరా! | 8 |
| మ. | పవనుండై హిమధాముఁడై యనలుఁడై పానీయమై యాత్మయై రవియై యంబరమై మహీవలయమై రమ్యాష్టమూర్తిక్రియన్ భువనాండంబులు లక్షణాంగములుగాఁ బుట్టించు నత్యద్భుతో- త్సవలీలావిభవంబుతోడ భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా! | 9 |
| మ. | జలజాతప్రభవాండభాండములు దుశ్చారిత్రులం బాత్రులం జెలువై యుండ యథాప్రమాణములుగా శిక్షింప రక్షింప ని- శ్చలలీలం బ్రభవించు రాజు భవదాజ్ఞాశక్తిఁ గాకింత వ- ట్టెలమిం జేకొని నిర్వహింప మఱి రాజెవ్వండు సర్వేశ్వరా! | 10 |
| శా. | జ్ఞానజ్యోతి విజృంభమాణముగ నోజన్ విష్ణువిధ్యాది దే- వానీకాత్మదశావళిం దవిలి నీవారంగ వారిం గళా- జ్ఞానప్రౌఢులఁ జేయుటన్ వెలయఁగా సర్వజ్ఞశబ్దంబు దా నీ నామాంకముగా విధించు నిగమానీకంబు సర్వేశ్వరా! | 11 |
| మ. | సురల న్మర్త్యసమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకో- త్కరముంగా ఘను నల్పు నల్పుని ఘనుంగాఁ బుణ్యపాపాలిచేఁ దిరుగ న్వైచుచు నీ మహామహిమ ప్రీతిం బద్మజుండంబునం దరయన్ జీవుల నింద్రజాలములుగా నాడించు సర్వేశ్వరా! | 12 |
| మ. | ఘనుఁడై యేచి దశాననుండు బలిమిం గైలాసశైలేంద్ర మె- త్తినఁ దద్దానవనాథుఁ ద్రొక్క నతఁ డర్థి న్మ్రొక్కినం గాచి ప్రా- క్తనశౌర్యాధికుఁ జేసె దుష్టు నణఁపంగా శిష్టు రక్షింప రం- జనతో నెప్పుడు వేచియుండు భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా! | 13 |
| మ. | తమకం బెత్తిన నాత్మజం గడు మదాంధవ్యాప్తి నేకాంతప- క్షమునం దెవ్వరుఁ గానకుండఁ గవయంగాఁ బోయి నీ బాణఘా- తమునం బద్మభవుండు ద్రెళ్లెననినం దాఁ దప్ప వర్తించి లో- కమునం దెవ్వరికింక నిన్ను నెఱుఁగంగా వచ్చు సర్వేశ్వరా! | 14 |
| మ. | పలుజన్మంబులఁ గూడఁబడ్డ భవశుంభద్ఘోరదుష్కర్మరా- సులు పైఁ గూలి సమస్తజీవులు వెసన్ శోషించుచు న్బెద్దదు- ర్బలురై చిక్కిన దద్భవాపహరణార్థం బొప్పఁ బద్మోద్భవ- ప్రళయం బొక్కొకమాటు సేయుదు తుదిన్ భావింప సర్వేశ్వరా! | 15 |
| మ. | సుమహత్పద్మభవాండపంక్తుల లయక్షోభప్రతాపంబుతో నిమిషార్థంబునఁ గ్రాఁచి పెంపెసఁగు నీ నేత్రానలజ్యోతి య- య్యమమీనాంకజలంధరత్రిపురదైత్యాలి న్విజృంభించి భ- స్మముగాఁ జేయుట నిశ్చయింప నిది దా శౌర్యంబె సర్వేశ్వరా! | 16 |
| మ. | అతిదక్షుండగు దక్షుఁ డీజగములో యాగంబు సల్లక్షణ- స్థితిగాఁ జేయుచునుండి మిము మది నుద్దేశింపమిం జేసి తా హతుఁడయ్యెం దుది నట్టికార్యములుఁ బొందై యుండునే కర్తస- మ్మతితో జేయని దుర్మదుండు మనునే భావింప సర్వేశ్వరా! | 17 |
| మ. | జగతీచక్రము పాదఘట్టనసదృశ్యంబై ప్రవర్తింపఁగా గగనంబంతయు బాహుమండలసమగ్రవ్యాప్తులం దద్భుతం- బుగ ఘూర్ణిల్ల నజాంత్యవేళల సముద్భూతాంగహారావళుల్ నిగుడం బొంగి నటింతు తాండవమహానృత్యంబు సర్వేశ్వరా! | 18 |
| మ. | అమరేంద్రాబ్జభవాళి కెన్నఁ దుది నీ వాదిం బ్రసాదింప న- ర్థము సిద్ధించుచునుండుఁగాని సురమాత్రుం గోరిన న్వీరి కా- ర్యము సిద్ధింప దనేకమార్గములఁ బ్రారంభించిరే నిశ్చయా- ర్థముగా నీవ సమస్తకర్త వగుటం దర్కింప సర్వేశ్వరా! | 19 |
| మ. | అమరంగా స్ఫుటభక్తినాటకము భాషాంగక్రియాంగాభిర- మ్యముగాఁ జూపిన మెచ్చి మీరిల బలే యన్నంతకున్ యోనిగే- హములన్ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం- గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా! | 20 |
| శా. | శ్రీవత్సాంకు రమావిశేషతయు వాక్ఛ్రీనాథు చాతుర్యమున్ దేవాధీశ్వరు వైభవోన్నతియు నా తిగ్మాంశు తేజంబు శ్రీ- దేవీనందను రూపవిభ్రమము చింతింపంగ నీ భక్తిస- ద్భావాత్ముండగు పుణ్యమూర్తికి దృణప్రాయంబు సర్వేశ్వరా! | 21 |
| మ. | ఇల సద్భక్తుల పాదధూళిపటలం బేమర్త్యుఫాలంబునం జిలుకు న్వాఁ డపవర్గనాథుఁ డనినన్ సిద్ధంబుగా వారి ని- ర్మలహస్తార్పితభూతిఁ బ్రీతి నొసలారం బూయు విశ్వాసికిన్ ఫలమూహించి విధించి యెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా! | 22 |
| మ. | పలుతీర్థంబులఁ గ్రుంకుకంటె మహిలో భక్తాంఘ్రిపానీయముల్ తలమీఁదం జిలికించుకొన్న శుచితీర్థం బాడ భారంబు త- త్ఫల మత్యల్పము భక్తపాదయుగళాంభఃస్పర్శ నిర్భారమై యలరున్ శాశ్వతభుక్తిముక్తిఫలదంబై యుండు సర్వేశ్వరా! | 23 |
| మ. | రమణన్ భక్తసమగ్రదర్శనము తీర్థశ్రేణి తద్గోష్ఠి తీ- ర్థము తద్దివ్యదయావలోకనము తీర్థంబెన్నఁగా నిట్టి జం- గమతీర్థాంబుధి నోలలాడక వివేకభ్రష్టులై పోయి లో- కములోఁ దీర్థములంచు నేఱులు సొజంగానేల సర్వేశ్వరా! | 24 |
| మ. | కమనీయంబగు సర్వతీర్థములు లింగంబున్నచో మూర్తిమం- తములై యొప్పుచునుండు లింగమును దాత్పర్యంబుతో భక్తగా- త్రములం దెప్పుడు నుండుఁ గాన మహిలోఁ దత్త్వార్థ మూహింపఁ దీ- ర్థములందెల్లను దివ్యతీర్థము భవద్భక్తుండు సర్వేశ్వరా! | 25 |
| మ. | ధరణిం దీర్థములాడుకంటె నతిమోదం బొప్ప యజ్ఞంబులం బరగం జేయుటకంటె సువ్రతములొప్ప వేదశాస్త్రార్థత- త్పరుఁడై యాదటఁ జల్పుకంటె మది నుత్సాహించి నీ భక్తిమ- త్పురుషశ్రేష్ఠులఁ బూజసేయుట మహాపుణ్యంబు సర్వేశ్వరా! | 26 |
| మ. | భవదీయామలతత్త్వనిర్ణయకళాప్రఖ్యాతసద్భక్తపుం- గవగోష్ఠీసుఖవార్ధిలోనఁ గడువేడ్కం దేలినం గాక యీ భువిలోఁ దీర్థజలంబులం గడగినం బోనేర్చునే ఘోరదు- ర్భవసంఘాకలితాత్మతామసమహాపంకంబు సర్వేశ్వరా! | 27 |
| మ. | ధరణిం బ్రాక్తనభక్తనిర్మితమహాస్థానంబులై యొప్పు శ్రీ- గిరిముఖ్యంబగు దివ్యతీర్థములు భక్తిం జూచిరే వారి దు- స్తరదోషంబులు వాయునన్న మఱి సాక్షాద్భక్తులం జూచినం బరమార్థంబుగఁ బాయదే నరుల పాపంబెల్ల సర్వేశ్వరా! | 28 |
| మ. | కని సద్భక్తుల కంత నంతఁ గడువేడ్కన్ హృత్ప్రణామంబు సే- సినమాత్రం జెడు సర్వదోషములు తచ్ఛ్రీపాదము ల్ముట్టి మ్రొ- క్కిన సర్వాంగసమగ్రశుద్ధియగు భక్తిన్ వారికిం బ్రీతిచే- సినఁ ద్వద్దివ్యదయావలోకనఘనశ్రీ లొందు సర్వేశ్వరా! | 29 |
| మ. | జలజాతప్రభవాచ్యుతాదులు మదిం జర్చించి చర్చించి నీ కల రూపారయలేక చిక్కులఁ బడంగా నిన్ను హస్తార్పితా- మలకవ్యాప్తికిఁ దెచ్చి యేర్పఱచి సంబంధించి చేకొన్న భ- క్తుల శౌర్యం బుపమింప నెవ్వఁడు సమర్థుం డింక సర్వేశ్వరా! | 30 |
| మ. | అమరన్ భక్తగణాత్మమధ్యమము లింగావాస మీ లింగ మ- ధ్యమముం బద్మభవాండభాండనిలయంబై యుండుట భక్తతృ- ప్తిమహాలింగము తృప్తియై మహిమ నుద్దీపించుఁ దల్లింగతృ- ప్తిమహత్త్వంబున నీ సమస్తమును దృప్తిం బొందు సర్వేశ్వరా! | 31 |
| మ. | అనురాగంబున నిన్నుఁ జూచుఁ దలపోయన్ జొక్కుఁ గాంక్షించు వ- ర్ణన సేయం దమకించు సిగ్గు విరియన్ బ్రార్థించు శోషించు నం- త నెదన్ ధ్యానము దాల్చుఁ దన్ను మఱచుం దానీ దశావస్థలం దనరంగా మది నిన్ను డక్కఁ గొను సద్భక్తుండు సర్వేశ్వరా! | 32 |
| మ. | ఎలమిన్ భక్తుఁడు వక్రుఁడై నడిచెనే నేపారఁగా దానికిం గలుషింపం గలహింపఁ గింకిరిపడం గాదెట్టిచోనైన ని- ర్మలగంగాపృథులప్రవాహ మరయం బ్రస్ఫూర్తిఁ దానెన్ని వం- కలుగాఁ బాఱిన దాని నొండు వలుకంగాఁ జన్నె సర్వేశ్వరా! | 33 |
| మ. | సికతాధామము నీకుఁ జేసి మదిలోఁ జెన్నొంది క్రీడించు బా- లకు లింద్రాధికులన్న నీ గుడు లతిశ్లాఘ్యేష్టకాష్ఠాదులన్ సుకుమారంబుగ నెత్తి భూతలములో శోభిల్లు వంశప్రదీ- పకు సౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా! | 34 |
| మ. | భవదభ్యర్చనవేళలన్ భవుల సంపద్భ్రాంతులన్ దీనమా- నవులన్ విద్విషులన్ భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యము- ఖ్యవిహారేచ్ఛలు నీ మహత్త్వములు నిత్యానంద మూహించుచో భువి నీ భక్తుల కాత్మలో విరసము ల్వుట్టించు సర్వేశ్వరా! | 35 |
| మ. | కరుణం జేకొనిరేని రౌరవపదగ్రస్తాత్తు దేవేంద్రుఁగాఁ బరగం జేయుదు రాత్మలో నలిగిరేఁ బర్జన్యు నా రౌరవో- త్కరపంకప్రవిలీనకీటకముఁగాఁ గల్పింతు రన్నట్టిచో నరయన్ భక్తుల శక్తి యెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా! | 36 |
| మ. | రమణీయక్షితిపాలుఁ డింద్రుని చతుర్మాసక్రమాయుష్యుఁ డా యమరేంద్రుం డజునాడికాద్వయమువాఁ డా బ్రహ్మ యుష్మన్నిమే- షమువాఁ డంచును వీరినెల్ల నగు నీ సాలోక్యసామీప్యస- త్తమరాజ్యస్థితిపట్టభద్రుఁ డగు సద్భక్తుండు సర్వేశ్వరా! | 37 |
| మ. | ప్రకటింపంగ సమస్తపాతకములం బాపంగ నీ పూజయం- దొక పుష్పాంశము చాలునన్న మహిలో నూహింపఁగా నీ పదా- ర్చకు లేమార్గమునందు శుద్ధులు మదిం జర్చింపఁ దద్దుర్గుణ- ప్రకరం బెన్నెడివాఁడు లోకములలోఁ బాపిష్ఠి సర్వేశ్వరా! | 38 |
| మ. | తమ తేజంబుఁ దృణీకరించుచు సముద్యత్తేజులై మీఁదిలో- కములందున్ జరియించు నీ యచలభక్తశ్రేష్ఠులం జూచి నె- య్యమునం దారును దద్విధంబునను నిన్నర్చింప నూహించి మ- ర్త్యమునం బుట్టఁగ వాంఛసేయుదు రమర్త్యశ్రేణి సర్వేశ్వరా! | 39 |
| మ. | అమరన్ భక్తులకెల్ల నీవ హృదయంబై యుండుట న్వారి సౌ- ఖ్యము నీ సౌఖ్యము వారి కూర్మియు సమగ్రంబైన నీ కూర్మిత- త్త్వము భావింపఁగ వారి కోపము భవత్ప్రఖ్యాతరౌద్రప్రభా- వము దా వారల వాక్యనిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా! | 40 |
| మ. | అవనిం బెన్నిధి భాగ్యహీనునకుఁ బ్రత్యక్షంబు గాకప్పు డొం- డవ భాండాకృతిఁ దాల్చి మాఁటువడి మాయావృత్తి నున్నట్లు దా భవదీయప్రతిబింబమూర్తియగు సద్భక్తుండు సంసారదు- ర్వ్యవయసాయాత్ముల కెల్లఁ గేవలనరుండై తోఁచు సర్వేశ్వరా! | 41 |
| మ. | క్షితిపై శ్వేతమునీంద్రుఁ జంప నలుకం గీనాశుఁ డేతెంచి నీ యతికోపోజ్జ్వలనాహుతి న్మడిసెఁ దథ్యం బేకనిష్ఠాసమ- న్వితులం జేకొని భక్తవత్సలుఁడవై నీవెప్పుడు న్గావఁగాఁ బ్రతిపక్షావలి కెట్లు వారి దెసఁ జేరన్వచ్చు సర్వేశ్వరా! | 42 |
| శా. | కింకం దన్ను నదల్చి చక్రమునఁ దాఁ గృష్ణుండని న్వైచినం బొంకంబొప్పఁగ దానిఁ దుత్తుఱుముగాఁ బోఁదట్టి యుప్పొంగె ని- శ్శంకాత్ముండు దధీచి శాశ్వతులు నీ సద్భక్తు లూహింపఁగా సంకల్పప్రభవప్రతాపవనభాస్వద్దావ సర్వేశ్వరా! | 43 |
| మ. | ఘటదుగ్ధంబులు పేరుఁగాక వెలయంగా నెంత తోడంటి న- న్నట దుర్గాంబుధి పేరునే జగములో నల్పుండు దుస్సంగతిం జటులాత్ముండగుఁ గాక యెయ్యెడల నీ సద్భక్తుఁ డేకార్య ము- త్కటమై తాఁకిన నన్యచిత్తుఁడగునే తర్కింప సర్వేశ్వరా! | 44 |
| మ. | సతి వేడ్కం దన ప్రాణవల్లభునితో సంయోగ మర్థించుఁ గా- కతనిం బ్రార్థనసేసి సొమ్ముగొనిపో నఱ్ఱాడునే భక్తుఁ డీ- క్షితి నీ భక్తియ వేఁడుఁ గాక మఱి నీ శ్రీపాదము ల్గొల్చి కు- త్సితకామ్యార్థము లొండు వేఁడుకొనునే చింతింప సర్వేశ్వరా! | 45 |
| మ. | భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాదిసంయుక్తిఁ దా భ్రమరంబై ఖగవీథి నాడునని నన్బాటించి నిన్నాత్మ నె- య్యముతో ధ్యానము సేయు మర్త్యుఁడును నీయట్లే పరవ్యో- మతత్త్వమునం దవ్యయలీల నుండు టరుదే భావింప సర్వేశ్వరా! | 46 |
| మ. | అమరశ్రేణులకు న్సుధామయకళౌఘాత్మీయసారంబు ర- గ్యముగాఁ గ్రోలఁగ నిచ్చి తానొక కళామాత్రాంగుఁడై యున్న చం- ద్రమునిం జూచి జగమ్ము మ్రొక్కుగతినారన్ భక్తపూజానిధి- క్రమభారాకృశుఁ జూచి మ్రొక్కుదురు లోకంబెల్ల సర్వేశ్వరా! | 47 |
| మ. | చెదరం బాఱు దశప్రభంజనములన్ శిక్షన్ సుషుమ్నంబునం గుదియం బట్టి చలింపకుండ శశినర్కుం గట్టి భాస్వన్మన- స్సదనస్థానమునందు నిన్నెలమి సంస్థాప్యంబుగాఁ జేసి తా హృదయానందరసాబ్ధిఁ దేలు శివయోగీంద్రుండు సర్వేశ్వరా! | 48 |
| మ. | వెలి వీక్షించిన నీ స్వరూపమె మహావిస్పష్టమై యాత్మలో- పల భావించిన నీ స్వరూపమె మహాప్రవ్యక్తమై దృష్టులం దలఁపం జేకొని యున్న నీ యచలితధ్యానంబునం జేసి తాఁ గలనైన న్శివయోగి తన్ను జగముం గానండు సర్వేశ్వరా! | 49 |
| మ. | భవదాకారమె కాంచు నీ స్తవకదంబశ్రేష్ఠసద్వాక్యముల్ చెవులార న్విను నిన్నె చెప్పు మది దుశ్శీలేంద్రియాటోపదు- ర్వ్యవసాయాత్ములఁ గాంచుచో వినెడిచో వర్ణించుచోఁ జీఁకునుం జెవిటి న్మూగయునై చరించు మహి నీ శీలుండు సర్వేశ్వరా! | 50 |
| మ. | అతిలాలిత్యముగా నహర్నిశము నిన్నర్చింపగా వచ్చు సు- వ్రతుఁడై యుండఁగవచ్చు నెల్లకళలం బ్రౌఢుఁడు గావచ్చు వా- క్పతి గానైనను వచ్చుఁ గాని మఱి నీ భక్తుండు గారాదు సు- స్థితిగా నీ దయ లేని మానవునకుం జింతింప సర్వేశ్వరా! | 51 |
| మ. | భవికిన్ భక్తి మహత్త్వ మంకురితమై పాటిల్‌ల భక్తుండు బాం- ధవమాత్రుండగు భక్తి పుష్పితముగాఁ దద్భక్తుఁ డాత్మేశుఁడై సవిశేషస్థితిఁ దోఁచు భక్తి సఫలోత్సాహంబునుం బొందఁగా నవికల్పస్థితి నంత భక్తుఁడును నీవై యుండు సర్వేశ్వరా! | 52 |
| మ. | సుముఖుండై శివయోగి మోదము మదిన్ శోభిల్లఁ జేకొన్న భి- క్షము విప్రోత్తమకోటిభోజనసదృక్షంబన్న సౌభాగ్యయో- గమునం దారయ నమ్మహామహుఁడు వేడ్కం గోరి యారోగిణం- బమరం జేసిన పుణ్యమెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా! | 53 |
| శా. | ఎచ్చో నీ పదభక్తుఁ డుండు మది నింపెక్కం బ్రయత్నంబుతో నచ్చో నీ వనిశంబు నుండుదు త్వదీయధ్యానచిన్మూర్తులై యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరాయుక్తులై యచ్చోఁ దీర్థములెల్ల నుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా! | 54 |
| శా. | సత్యం బెప్పుడుఁ దప్పఁడేనియు దురాచారుండు గాఁడేని యౌ- చిత్యం బేమఱఁడేని దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్తసాం- గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ భృత్యుం డాతఁడు మూఁడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా! | 55 |
| శా. | పెంపన్ దల్లి యగున్ రుజాపటలదుష్పీడావిధి క్షోభ వా- రింపన్ వైద్యుఁ డగుం గుమార్గవిధులం గ్రీడింపఁబోకుండ శి- క్షింపన్ బల్లిదుఁడైన తండ్రి యగుచున్ శ్రీమంతుఁగా నెంతయున్ సంపద్వృద్ధి యొనర్ప దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా! | 56 |
| మ. | ఉరుసంసారగజేంద్రదర్పదళన వ్యూఢప్రతాపోగ్రకే- సరి దుష్ప్రాపశరీధబంధవిపులక్ష్మాజవ్రజచ్ఛేదవి- స్ఫురితక్రూర కుఠారధార దురితప్రోద్భూతజీమూతదు- స్తరసంఘాతవిఘాత మారుతము నీ సద్భక్తి సర్వేశ్వరా! | 57 |
| మ. | అరివీరప్రకరంబు భీకరతరంబై తాఁకుచో సింహసిం- ధురశార్దూలమృగోరగాది భయము ల్దోతెంచుచో ఘోరదు- స్తరసంసారవికారవేదనలు మీఁదం బర్వుచో వజ్రపం- జరమై చేకొని తన్ను నెత్తుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా! | 58 |
| మ. | కమలాప్తుం డుదయింపఁగా ననలనక్షత్రక్షపాధీశతే- జములెల్లం బెడఁబాసిపోవు గతి నీ సద్భక్తిభావంబు చి- త్తములోనం బ్రభవింపఁగా నితరమంత్రధ్యాన తద్దేవతా- క్రమమాయాపటలంబు లన్నియును వీఁకం గ్రాఁగు సర్వేశ్వరా! | 59 |
| మ. | చటులప్రాయగుణేంద్రియాత్ములకు వాంఛావృత్తి నీ భక్తి సం- స్ఫుటమై యుండదు భక్తితత్పరులకుం బొల్పొందఁగాఁ జిత్త ము- త్కటదుష్టేంద్రియవర్గతామసపరిగ్రస్తంబు గాదెట్లు చీ- కటికిం దిగ్మమరీచికిం గలదె సాంగత్యంబు సర్వేశ్వరా! | 60 |
| మ. | బలవంతుండును దుర్బలుండును మహాప్రౌఢుండు మూఢుండునుం గులజుండుం గులహీనజాతుఁడు ఘనక్రూరుండు శాంతాతిని- శ్చలచిత్తుండును నొక్కరూప మది నీ సద్భక్తి చిత్తంబులో- పల వర్ధిల్లిన మీఁద నేవిధమునన్ భావింప సర్వేశ్వరా! | 61 |
| శా. | కామోద్రేకవిజృంభణంబును సమగ్రక్రోధమున్ లోభమున్ వ్యామోహంబు మదంబు మచ్చరము దీవ్రంబైన పంచేంద్రియో- ద్దామాటోపము గ్రాఁచి పెంపెసఁగు తత్త్వజ్ఞానికిం గాక తా సామాన్యాత్ముల కేల నూలుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా! | 62 |
| మ. | ఉరుపక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబున న్వృక్షకో- టరమధ్యంబుననుండు పక్షిగతి నిష్ఠం గోరి నీ భక్తి వి- స్తర మాత్మం బ్రభవించు నంతకును నీ సంసారకారాగృహాం- తరగేహంబున నుండి జీవుఁ డతివంతన్ బొందు సర్వేశ్వరా! | 63 |
| శా. | లింగారాధన జంగమార్చనము లోలిన్ భక్తి కంగంబు ప్రా- ణాంగవ్యాప్తియునై స్ఫురించు నిది తత్త్వార్థంబగుం గాన నా యంగాభ్యర్చన జంగమాహితకరుండై చేసినం దా శవ- శృంగారంబగు వాని భక్తి మదిఁ జర్చింపంగ సర్వేశ్వరా! | 64 |
| మ. | అరయన్ గర్మవిధావధానవిధివద్ధ్యానోత్తమజ్ఞానముల్ వరుసన్ బేర్కొన నాల్గుయోగములు తత్త్వంబెందు నీ భక్తి వి- స్తరబాహ్యక్రియలెల్లఁ బొల్లులగుటం దద్భక్తియోగంబు తాఁ బరగం దక్కిన మూఁడుయోగములకుం బ్రాణంబు సర్వేశ్వరా! | 65 |
| మ. | అమరంగా ధనమిచ్చి కాతురు మహీయఃప్రీతిఁ బ్రాణంబుఁ బ్రా- ణము నర్థంబును నిచ్చి కాతు రభిమానంబు న్విశేషించి మా- నము బ్రాణంబు ధనంబునిచ్చి కడుసన్మానంబుగా నుత్తమో- త్తమచారిత్రులు భక్తిఁ గాతురు ప్రమోదంబంది సర్వేశ్వరా! | 66 |
| మ. | అనుబంధేంద్రియభూతవర్గము యమాద్యష్టాంగమంత్రోరుసా- ధన నుచ్చాటన సేసి పాపి గురుసద్వాక్యప్రకాశోత్తమాం- జనదృష్టిం బరికించి యేర్పఱిచి వాంఛం గోరి సాధించి చే- కొను చిన్మూర్తికి గాని భక్తివిధి గీల్కోదెందు సర్వేశ్వరా! | 67 |
| మ. | కనకంబందు ఘనీభవించిన కళంకంబెల్ల సువ్యక్తిగా ననలాస్యంబునఁ దెఁగిపోవు గతి జీవాత్మం బ్రవేశించి చే- కొని వర్తించిన దుర్మలత్రయపరిక్షోభంబు నీ భక్తిచే- తను బాపంబడుఁ గాని యొండొకటి చేతం బోదు సర్వేశ్వరా! | 68 |
| మ. | అమరంగా గురుమంత్రకార్ముకమునం దాత్మాస్త్రమష్టాంగయో- గమహాముష్టి వివేకి యేయుటయుఁ దత్కాండం బజాండాది త- త్త్వములెల్ల న్వడి నుచ్చిపాఱి భవదుద్యత్సూక్ష్మకైవల్యల- క్ష్యమునం దద్భుతశక్తితోడఁ గమియంగా నాఁటు సర్వేశ్వరా! | 69 |
| మ. | తనరం గాయవహిత్రమందు హృదయస్తంభాభిసంస్థానమై చను నీ ధ్యానపటంబు నూల్కొలిపి భాస్వద్భక్తివాతాహతి- న్వినుతజ్ఞానపథంబు చేకొని సముద్వేగంబుమై జీవుఁ డీ ఘనసంసారమహార్ణవంబుఁ గడుపంగాఁ బాఱు సర్వేశ్వరా! | 70 |
| మ. | అకలంకస్థిరభక్తి మున్సొగయ నిన్నశ్రాంతముం జూచి పా- యక పూజించు మహామహుండు భవదభ్యర్చ్యుం డగుంగాక దా సకలేచ్ఛావిషయంబులం బొగయుచుం జాపల్యతం జేయు నా బకవేషార్చనలేల నిన్ను సొగయింపం జాలు సర్వేశ్వరా! | 71 |
| మ. | సమదోత్సాహసుఖాభిలాషలును నీ సంసారమాయావినో- దములు న్స్వర్గఫలాపవర్గఫలచిత్తభ్రాంతులుం బూజ్యరా- జ్యమహాకాంక్షలు నెన్ని చూడ నివి నీ సద్భక్తి కత్యంతరా- యములై మాటికిమాటి కడ్డుపడుఁ గార్యశ్రేణి సర్వేశ్వరా! | 72 |
| శా. | మోహధ్వాంతములో మునింగిన మహామూఢుం డతిభ్రష్టుఁడై సోహంబంచుఁ దొడంగి నీకుఁ గడు దూరాత్ముం డగుంగాని దు- ష్టాహంకారగుణంబు మాని మది సొంపారంగ సద్భక్తి దా- సోహంబన్న భవత్పదార్చకుఁడు నీవై యుండు సర్వేశ్వరా! | 73 |
| శా. | చావంబుట్టుచుఁ బుట్టఁజచ్చుచు మహాచండాలసంసారపా- రావారంబునఁ గూలి తాఁ జెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో- నేవం బొందక యేను నీవనుట తా నేజ్ఞానమో శ్రీమహా- దేవా యిట్టి కుతర్కముం గలదే చింతింపంగ సర్వేశ్వరా! | 74 |
| మ. | రసికుండై భవదంఘ్రిపద్మయుగ మారాధించుచో దుర్మద- వ్యసనాటోపము చిక్కులం బొరలుచు న్వర్తించుచున్నట్టి పా- లసు పూజావిభవం బదొప్పునె భువిన్ లక్షింప నారంభముం గసవుం బెంచిన చేనుఁ బోలుఁ దలఁపంగా మీఁద సర్వేశ్వరా! | 75 |
| మ. | అమితోత్సాహమునంది నీకుఁ దన సర్వార్థంబులుం గూర్చి నే- మముతో నిచ్చుటకంటె శౌర్యగుణసామర్థ్యంబునం జేసి ప్రా- ణము నీ కిచ్చుటకంటె దుస్తరభవోన్మాదంబు మర్దించి చి- త్తము నీ కిచ్చుట పెక్కుభంగుల మహౌదార్యంబు సర్వేశ్వరా! | 76 |
| మ. | ఘనవైరిప్రకరంబు ధాటి ననిలో ఖండించు కంటెన్ మృగేం- ద్రుని జేపట్టుటకంటె వారినిధిలోఁ దోగాడుకంటెన్ మహా- శనిఁ దా వ్రేయుటకంటె ఘోరభవదుశ్చారిత్ర వారించి రం- జనతోఁ జిత్తము శిక్షసేయుట మహాశౌర్యంబు సర్వేశ్వరా! | 77 |
| మ. | అమితామోదనవప్రసూనముల నిన్నర్చించుచో గద్యప- ద్యము లూహించి నుతించుచో వివిధగీతవ్రాతము ల్పాడుచో నమృతాహారము లిచ్చుచో నిపుణుఁడై యాటాడుచో నందుఁ జి- త్తము సద్భక్తియె నీవు చేకొను పదార్థంబెల్ల సర్వేశ్వరా! | 78 |
| మ. | కడుఁ జిత్రంబుగఁ జేయఁగా నొఱ సురంగంబయ్యెనే ఖడ్గమం- దిడకున్నం జెడురూపదేమి గొఱ? దానిం బెక్కు పాటింపఁగా నొడ లెబ్భంగుల నోపునే నియతితో నూహించి నిన్నాత్మలో నిడకున్నం జనురూపు నేమికొఱ తా నీక్షింప సర్వేశ్వరా! | 79 |
| మ. | జ్వరసంతాపవిశోషితాంగుఁడు సుధాసంకాశదివ్యాన్నపా- నరసశ్రేణి భుజింప రోయుగతి నున్మాదేంద్రియధ్వాంతదు- స్తరసంసారమదప్రమత్తుఁడు మహాసౌఖ్యోత్సవంబైన మీ చరణారాధనయందు బుద్ధిఁ జొనుపం జాలండు సర్వేశ్వరా! | 80 |
| మ. | కలయం గాష్ఠయుగంబుఁ గూర్చి తరువంగా బుట్టి తత్సాధనం- బుల రెంటిన్ దహియించు వహ్నిగతిఁ దాఁ బొల్పొందఁ గాయంబు సం- ధిల సత్కర్మముతో మథింపఁగ భవచ్చిద్భక్తి సద్వహ్ని యు- జ్జ్వలమై కాయముఁ గర్మముం జెఱుచుఁ దత్త్వంబెన్న సర్వేశ్వరా! | 81 |
| మ. | స్థిరబుద్ధిం దన సొమ్ము భక్తవరసుక్షేత్రంబులన్ బీజమై పరగంగా వెదపెట్టి మీఁద నతిసంపన్నుండగుం గాక దా- నరిషడ్వర్గము పాలుసేసి భవమాయాగ్రస్తుఁడై యిచ్చ నె- వ్వరి వేఁడం జనువాఁడొకో విషయదుర్వ్యాపారి సర్వేశ్వరా! | 82 |
| శా. | కాయంబన్నది వారిబుద్బుదసదృక్షం బందు రూపింప లేఁ- బ్రాయంబన్నది శారదాంబుదతటిత్ప్రఖ్యంబగుం దత్సుఖ- శ్రేయంబన్నది మాయ యిట్లెఱిఁగియు శీఘ్రంబ నీ ధ్యానసం- స్థాయీభావనఁ బొందఁ డేమిటి కయో సంసారి సర్వేశ్వరా! | 83 |
| మ. | భవదీయస్థిరభక్తి లబ్ధియు భవద్భక్తైకగోష్ఠీమహో- త్సవలీలావిభవంబు నీ యనుదినధ్యానానుమోదంబులౌ- నివి నిత్యస్థితు లారయంగ విధిదేవేంద్రాది భూతాఖిలో- త్సవభోగస్థితులెల్ల మిథ్యలవి తత్త్వంబెన్న సర్వేశ్వరా! | 84 |
| మ. | తన యుక్తి న్భవదంఘ్రిసేవగల సద్భక్తుండు పాపంబు చే- సినఁ బుణ్యంబగు భక్తిహీనుఁడు శ్రుతు ల్చేపట్టి పుణ్యంబు చే- సినఁ బాపంబగు దీనికంతటికిఁ జర్చింపంగఁ జండేశ్వరుం డును దక్షుండును సాక్షులెన్న నగరాట్కోదండ సర్వేశ్వరా! | 85 |
| శా. | ప్రారంభించి చకోరపోతము మహీయజ్యోత్స్నయం దుత్సవ- శ్రీ రంజిల్లుచు వేడ్కనుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం- గారధ్యానమునం దహర్నిశముఁ జొక్కంజేయవే దేవ శ్రీ- గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా! | 86 |
| మ. | తరులం బువ్వులు పిందెలై యొదవి తత్తజ్జాతితోఁ బండ్లగున్ హర మీ పాదపయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్ కరులౌ నశ్వములౌ ననర్హమణులౌఁ గర్పూరమౌ హారమౌఁ దరుణీరత్నములౌఁ బటీరతరులౌఁ దథ్యంబు సర్వేశ్వరా! | 87 |
| మ. | ఒకపుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం- జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ బునర్జన్మంబు లేదన్నఁ బా- యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచో బెద్దనై- ష్ఠికుఁడై యుండెడువాఁడు నీవగుట దాఁ జిత్రంబె సర్వేశ్వరా! | 88 |
| శా. | ఆనందంబును బొందునప్పుడును నత్యాశ్చర్యకార్యార్థభా- వానీకంబులు దోఁచునప్పుడును రోగాపాయదుఃఖాతుర- గ్లానిం బొంది చరించునప్పుడును సత్కార్యంబున న్నీవు నా ధ్యానంబం దుదయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా! | 89 |
| శా. | నానాశాస్త్రసముచ్చయాగమపురాణప్రౌఢులై తత్త్వవి- జ్ఞానధ్యానసమాధివిద్య లతివిస్పష్టంబుగా నేర్చి రే దాన న్నేర్పరులెల్ల నేరరు భవత్సద్భక్తివిద్యాసమా- ధానప్రస్ఫుటశక్తి నీ కరుణచేతం గాని సర్వేశ్వరా! | 90 |
| మ. | ప్రకటింపంగ మదీయచిత్త మది దాఁ బంచేంద్రియోద్వృత్తమై ప్రకటప్రాప్తిని సోలుఁగాని మఱి నీ పాదాబ్జసంసేవనం- బొకవేళ భజియింప నొల్లదు నిజం బూహింపఁగా నట్ల యీఁ- గకు దుర్గంధము గాక సహ్యమగునే కస్తూరి సర్వేశ్వరా! | 91 |
| మ. | మలినాంగుం డగుటేమి కష్టము మనోమార్గంబు నీ భక్తిని- ర్మలసౌభాగ్యనిధానదీపశిఖయై రంజిల్లదే భూషణో- జ్జ్వలదేహుం డగుటేమి తేజము మనోవ్యావృత్తి దుర్మోహసం- చలదుష్పంకముఁ బొంది పీడఁ బడఁగాఁ జర్చింప సర్వేశ్వరా! | 92 |
| మ. | ఇల నా చిత్తము యోగసాధనలయం దీదాడఁగాఁ గొంతని- శ్చలతం జేరఁగవచ్చు లేక తన వాంఛావృత్తిఁ బోనిచ్చినం బొలుపై నీ దెసఁ జేర దట్టి దకటా భావించినం గాక కే- వలసంబోధననేల నిల్చు ఋజువై వర్తింప సర్వేశ్వరా! | 93 |
| మ. | ఉదకం బింకిన లావు మాలి కడుమై యష్ణింపఁగా రొంపిలోఁ గదలం జాలని మీను వాన గురియం గ్రమ్మెక్కి పెన్నీటిలోఁ బొదలం గన్న విధంబునన్ భవముతోఁ బోరాడు మర్త్యుండు దా హృదయాబ్జంబున నిన్నుఁ గొల్వఁగనునే యింపొంద సర్వేశ్వరా! | 94 |
| మ. | భవదీయార్చన సేయుచోఁ బ్రథమపుష్పంబెన్న సత్యంబు రెం- డవ పుష్పంబు దయాగుణంబును విశిష్టం బేకనిష్ఠాసమో- త్సవసంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తిసంయుక్తియో- గవిధానం బవిలేని పూజలు మదిం గైకోవు సర్వేశ్వరా! | 95 |
| మ. | అమరేంద్రాద్రి శరాసనంబు హరి దివ్యాస్త్రంబు భూమండలం- బమరంగా రథ మర్కచంద్రులు తదీయాంగంబులై యొప్పుఁ జి- త్రము నీకుం బురలక్ష్య మేయునెడ నుద్యద్భాతి నత్యల్పకా- ర్యములందైనను దా మహాఘనము నీ యత్నంబు సర్వేశ్వరా! | 96 |
| మ. | దివిజేంద్రత్వముఁ బద్మజత్వము జగత్సేవ్యస్థిరానర్గళో- త్సవరూపంబగు కేశవత్వమును నీ సద్భక్తి సంవృద్ధిలో లవమాత్రస్థితు లెన్న భక్తిజనితోల్లాసావనోద్యత్సుఖా- ర్జవసౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్ప న్వచ్చు సర్వేశ్వరా! | 97 |
| మ. | పరమార్థంబుగ నా మనంబున భవద్భక్తిప్రభావంబు వి- స్తరమై పుట్టదు పుట్టినం బ్రబల దంతం గొంత వర్ధిల్లెనే విరసంబై యటమీఁదఁ జిక్కువడుఁ భావింపంగ నెట్లన్న న- స్థిరుఁడం గాన జడుండఁ గాన బకవేషిం గాన సర్వేశ్వరా! | 98 |
| శా. | శ్రీకంఠాయ నమోనమో నతసురజ్యేష్ఠాయ రుద్రాయ లిం- గాకారాయ నమోనమో విగతసంసారాయ శాంతాయ చం- ద్రాకల్పాయ నమోనమో దురితసంహారాయ తే యంచు ని- న్నాకాంక్షం బ్రణుతించు మానవుఁడు నీవై యుండు సర్వేశ్వరా! | 99 |
| మ. | భువనోత్పత్తి విధించుచో భవుఁడవై పొల్పొందఁగా దాని ను- త్సవలీలం బ్రభవించుచో మృడుఁడవై సర్వంబుఁ గల్పాంతభై- రవసంక్షోభ నటించుచో హరుఁడవై త్రైగుణ్యశక్తిం దుదిన్ శివనామాంకముఁ దాల్చు నీ మహిమ దాఁ జిత్రంబు సర్వేశ్వరా! | 100 |
| మ. | కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం జలజాతప్రియశీతభానులు యథాసంచారము ల్దప్పినం జలధు ల్మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ దలఁకం డుబ్బఁడు చొప్పుఁ దప్పఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా! | 101 |
| శా. | శూలస్థాపితుఁడైన మానవునకున్ శూలంబు దుర్వారవా- త్యాలిం గంపము నొందకుండుట సుఖంబై తోఁచు మాడ్కిన్ భవా- భీలజ్వాలలఁ గ్రాఁగు మానవునకున్ బింబాధరల్ హారవ- స్త్రాలంకారము లించుకించుక సుఖంబై తోఁచు సర్వేశ్వరా! | 102 |
| శా. | ఆకాశానలచంద్రసూర్యపవమానాత్మాంబువిశ్వంభరా- ప్రాకామ్యాంచితమూర్తి భేదముల నీ బ్రహ్మాండనానాఘటా- నీకప్రాకట జీవభావవిలసన్నిర్మాణకర్మాద్భుతా- స్తోకశ్రీకరమూర్తియై వెలుఁగు నీ స్థూలంబు సర్వేశ్వరా! | 103 |
| మ. | అతివాగ్జాలమునై యజాండనిలయంబై యాదిమధ్యాంతవ- ర్జితమై నిర్గుణనిష్కలంకపదమై సిద్ధాంతమధ్యాత్మసం- యుతమై కోటిరవిప్రకాశయుతమై యోంకారమంత్రాదిసం- స్తుతమై యెంచ నచింత్యమై వెలుఁగు నీ సూక్ష్మంబు సర్వేశ్వరా! | 104 |
| మ. | అజుఁడై సృష్టి యొనర్చు రాజసముచే నందంబుగాఁ దా నధో- క్షజుఁడై వర్ధిలఁజేయు సాత్త్వికము సంప్రవ్యక్తిగా గోపతి- ధ్వజుఁడై సంహృతిసేయుఁ దామసమునం దత్సర్వముం గూడఁగా నిజవిస్ఫూర్తి వెలుంగుఁ దుర్యమగుచున్ నీ యాజ్ఞ సర్వేశ్వరా! | 105 |
| మ. | సకలాధీశ్వరపట్టభద్రుఁడవు భిక్షాగామి వత్యంతశాం- తకళాత్ముండవు రౌద్రమూర్తి వతిసౌందర్యాంబికాసంగమా- ధికలోలుండవు దివ్యయోగివి మదిం దెల్లంబుగా నెట్టివా- రికిఁ దా శక్యమే నీ నిజం బరసి వర్ణింపంగ సర్వేశ్వరా! | 106 |
| మ. | భవదుఃఖార్ణవయానపాత్రము పరబ్రహ్మంబు యోగీంద్రహృ- ద్భవనప్రస్ఫురితప్రదీపము నఘధ్వాంతార్కబింబం బతి- శ్రవణానందకరంబు సన్మునిగణస్వాధ్యాయపాఠంబు మీ శివనామాంకము భక్తపుంగవ సదా సేవ్యంబు సర్వేశ్వరా! | 107 |
| మ. | అణిమాద్యష్టగుణప్రసిద్ధులు త్రిలోకారాధ్యు లుద్యద్వచో- మణికోటిప్రతిమప్రభాపటలు లున్మాదేంద్రియధ్వాంతభీ- షణదైత్యేంద్రవినాశకారణమహాశౌర్యోన్నతు ల్లోకర- క్షణదక్తుల్ వినుతింప నీ ప్రమథసంఘాతంబు సర్వేశ్వరా! | 108 |
| మ. | సకలాధీశ్వరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై యకలంకాత్మకులై మహామహిములై యంభోజగర్భాండర- క్షకులై యుండుదు రెల్లవారును భవత్సద్భక్తి నానాగణా- ధికలీలావిధి నంతరంగముల వర్తింపంగ సర్వేశ్వరా! | 109 |
| మ. | అమరేంద్రాబ్జభవాచ్యుతాదులకు నీ యాజ్ఞాప్రభావం బలం- ఘ్యము నీకు భవదీయభక్తమహదాజ్ఞాపంబు నుద్యత్ప్రభా- వము లోకంబులలో నలంఘ్యమగుట న్వర్ణింపఁగా నీ మహ- త్త్వముకంటెం గడుఁ జెల్లు భక్తుల మహత్త్వంబెన్న సర్వేశ్వరా! | 110 |
| మ. | శివసాహిత్యుల సత్కరస్థలము కాశీక్షేత్రమా హస్తదే- శవిశాలోన్నతశాఖ లారయఁగఁ బంచక్రోశమా పాణిసం- భవశోభాన్వితచిత్రరేఖలు మహాభాగీరథీతీర్థముల్ శివలింగం బల విశ్వనాథుఁ డరయన్ సిద్ధంబు సర్వేశ్వరా! | 111 |
| మ. | వరుసం బైకొనివచ్చు కర్మములు మున్వారించి మాయామల- జ్వరము ల్గూల్చి యపారఘోరతరసంసారాబ్ధి లంఘించి భీ- కరసూక్ష్మాంగవిచిత్రకంచుకము వీఁకం బుచ్చి పోవైచి తాఁ బరమవ్యోమము సొచ్చు నీ యచలసద్భక్తుండు సర్వేశ్వరా! | 112 |
| మ. | పరమార్థంబగు తత్త్వమార్గమున నీ పాదాబబ్జసద్భక్తుఁ డొ- క్కరుఁడుం దక్క సరోజజాద్యమరసంఘాతంబులోనెల్లఁ దా నెరయం గాచికొనంగఁ జాలరు మహానిర్భీతుఁడున్ లేఁ డతి- స్ఫురణం గాలుఁడు దన్ను వేచి వడిఁ గొంపోనుండ సర్వేశ్వరా! | 113 |
| మ. | తన చారిత్రమె సన్నుతించు గురుభక్తశ్రేణి వర్ణింపఁగాఁ దన చిత్తంబు భవత్పదస్మరణచేత న్నిన్ను మెప్పింపఁగా ననుకూలస్ఫుటనిశ్చలత్వమున రా నభ్యంతరాంగస్థితి- న్వినుతిం బొందిన తజ్ఞుఁ డీజగములో నీ మెచ్చు సర్వేశ్వరా! | 114 |
| మ. | క్షితి నత్యుగ్రతపంబునందు జఠరాగ్నిం గాలఁగానేల మి- మ్మతిభక్తిస్థితిఁ బూజసేయు మహనీయ త్వంబు తాఁ జాలదే ప్రతిపక్షాలి నడంప రోగభయదుర్భారంబు వారింప న- ద్భుతసౌఖ్యంబులుఁ బెంప దివ్యసుఖముం బొందింస సర్వేశ్వరా! | 115 |
| మ. | శివవాక్యస్ఫురితాక్షరద్వయ సకృజ్జిహ్వాప్రదేశాత్ముఁడై భవదుఃఖాంబుధి దాఁటజూచు తఱిఁ దత్పంచాక్షరీమంత్ర ము- త్సవలీలం గడుశుద్ధుఁడై జపము వాంఛం జేయు భాస్వద్గుణా- ర్ణవసౌభాగ్యము మానమెవ్వరికిఁ గాన న్వచ్చు సర్వేశ్వరా! | 116 |
| శా. | ఏదేశంబున నేదిశాముఖమునం దేయూర నేవాడ మీ పాదాభ్యర్చన సేయు నిర్మలుఁడు సద్భక్తుం డొకండుండె నా- యాదేశంబును నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం- గాదిస్నాన నదీప్రవాహఫలదంబై యొప్పు సర్వేశ్వరా! | 117 |
| మ. | ఒనరం జిత్తము శుద్ధిలేని నరుఁ డుద్యోగంబునం గోరి చే- సిన పూజావిభవంబు సువ్రతములున్ శీలంబులు న్మంత్రసా- ధనముల్ తీర్థంబులుం దపంబులును మీఁదం జెట్టవాఁ డభ్యసిం- చిన శస్త్రాస్త్రకళానిభంబులగుఁ జర్చింపంగ సర్వేశ్వరా! | 118 |
| మ. | క్రమసంయుక్తి మనంబు బుద్ధియు నహంకారంబుఁ జిత్తంబు నా యమలాంతఃకరణంబు నక్షరచతుష్కావాప్తిఁ గావించి పం- చమవర్ణంబుగ నాత్మఁ గూర్చి కడువాంఛన్ యోగి పంచాక్షరీ- సుమహామంత్రముతోడ నైక్యపదవిన్ శోభిల్లు సర్వేశ్వరా! | 119 |
| మ. | భవదీయాననపంచకంబువలనం బంచాక్షరీమంత్ర ము- ద్భవమై తత్పదవర్ణపద్ధతుల శుంభత్పంచభూతంబు లు- ద్భవనంబై యఖిలంబుఁ బుట్టెను లసత్పంచాక్షరీమంత్ర మీ భువనాండంబులం దల్లియై సఫలతం బొందించు సర్వేశ్వరా! | 120 |
| మ. | పటుశాస్త్రాగమదృష్టి నివ్విధమునన్ భావించి వీక్షించి యు- ద్భటవృత్తిన్ భవదీయభక్తినికరబ్రహ్మాండకుండైన నా- దట లోఁ గాచుకొనంగవచ్చు విదితోద్దండప్రతాపోత్కట- స్ఫుటకోపానలమూర్తియై యముఁడు గొంపోకుండ సర్వేశ్వరా! | 121 |
| మ. | కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై లలనామన్మథులై సముజ్జ్వలవచోలాలిత్యులై నిత్యులై బలవిభ్రాజితులై యశోభరితులై భాసిల్లు భాగ్యోదయుల్ తొలిజన్మంబుల మిముఁ గొల్చిన మహాత్ముల్ వారు సర్వేశ్వరా! | 122 |
| మ. | ఖలులై యాచకులై విరుద్ధవికటాకారాంగులై పంగులై బలహీనాతురులై రుజాపటలతాపచ్ఛన్నులై ఖిన్నులై చలనాందోళితచిత్తులై మలినులై జాత్యంధులై మందులై తొలిజన్మంబున మిమ్ముఁ గొల్వని దురాత్ముల్ వారు సర్వేశ్వరా! | 123 |
| శా. | ఏయేవేళల నేవయస్సున నరుం డేభూమి నేయూరిలో నేయేకర్మము నాచరించు నశుభంబేని న్శుభంబేని దా నాయావేళల నావయస్సున నరుం డాభూమి నాయూరిలో నాయాకర్మములెల్లఁ దాఁ గుడుచుఁ దథ్యంబింత సర్వేశ్వరా! | 124 |
| శా. | ఆడంబోయినచోట బాలురు వినోదార్థంబు పాషాణముల్ గూడంబెట్టి శివాలయంబనుచుఁ బేర్కొన్నంతటం జేసి వా- రాడంబోయి సురాంగనాకలితదివ్యారామచింతామణి క్రీడాశైలవిహారులౌదురు మిముం గీర్తింప సర్వేశ్వరా! | 125 |
| మ. | సమయోద్దిష్టసహస్రపంకరుహపూజాపూరణార్థంబు నే- త్రము విష్ణుండు సుభక్తి యేర్పడ భవత్పాదంబు లర్చించి చ- క్రముఁ దాఁ గైకొని దైత్యకోటి ననిలో ఖండించెఁ దా నీ పద- క్షమతాసేవ సమస్తదేవతలకు న్సత్త్వంబు సర్వేశ్వరా! | 126 |
| మ. | అమర న్వేదపురాణశాస్త్రములు మున్నాకాంక్షఁ దత్త్వప్రభే- దము రూపింపఁగ నేరవన్న మఱి యా తత్త్వంబులెట్లన్న ను- త్తమసంతోషమె కోరునన్న నరుఁ డుత్సాహించి నీ భక్తస- త్తమపూజారతి నేర్చునే నతఁడు తత్త్వజ్ఞుండు సర్వేశ్వరా! | 127 |
| మ. | అమితోద్యద్భవదీయతత్త్వము మహీయస్తోత్రవాణీవిలా- సములై యొప్పు సమస్తవేదములు శాస్త్రశ్రేణియున్ దివ్యవి- భ్రమనాదంబులు నెన్ని చూడ నివి నీ పంచాక్షరీమంత్రభా- వములైయుండు సమస్తలక్షణముల న్వర్ణింప సర్వేశ్వరా! | 128 |
| శా. | సంకీర్ణాకలితాక్షరత్రయము భాస్వన్నాదబిందుక్రమా- లంకారద్వితయంబుతోఁ గలిసి లీలన్ దివ్యయోగీంద్రహృ- త్పంకోద్భూతములందు రూఢమగుచుం బంచాక్షరీమంత్ర మ- య్యోంకారాత్మకమౌ లసన్మునిగణం బూహింప సర్వేశ్వరా! | 129 |
| మ. | అమలజ్ఞానవిభాసభాసురత నయ్యష్టాంగపూజావిధి క్రమయోగంబుల నిన్ను నెల్లపుడు జోకం గొల్వగానేల ని- క్కము నీ భక్తులగోష్ఠి చాలుఁ గడువీఁకన్ ఘోరసంసారదుః- ఖములెల్లం బెడవాప నిన్ను వెలయంగాఁ జూప సర్వేశ్వరా! | 130 |
| మ. | పరమార్థంబుగఁ దత్త్వము న్నెఱుఁగ నొప్పందీర్చి డెందంబు నీ కరుణాస్థానముఁ జేర్పలేక తన వంకం బోవఁగానిచ్చిరే నరకాబ్ధిం బడవైచుఁ దత్క్షణములోనం గానఁ దత్త్వక్షమం- బరయం జిత్తము శూకలాశ్వము విభంబై యుండు సర్వేశ్వరా! | 131 |
| మ. | భవదంఘ్రిద్వితయార్చనంబును బవత్ప్రఖ్యాతసద్భక్తపుం- గవగోష్ఠీవిభవంబులు న్విమలసూక్ష్మధ్యానయోగంబు నా నివి సంపూర్ణసుఖంబులెన్న మఱి దేవేంద్రాది భోగంబు లు- త్సవసంబంధములెల్ల దుఃస్థితులు తథ్యంబెన్న సర్వేశ్వరా! | 132 |
| మ. | తమ లింగార్చనకంటె జంగమము సౌందర్యంబుగాఁ గొల్చు టు- త్తమభక్తిస్థితి లింగజంగమల సత్సామ్యంబుగాఁ జేఁత మ- ధ్యమభక్తిస్థితి లింగపూజ నధికుండై జంగమోపాసనా- క్షముఁడై యుండుట భక్తియం దది కనిష్ఠత్వంబు సర్వేశ్వరా! | 133 |
| మ. | కరఢక్కారవవాద్య మింపొదవ గంగాతుంగరంగత్తరం- గరవప్రస్ఫుటతాళసమ్మిళిత తత్కంజాతపుంజస్ఫుర- ద్వరపుష్పంధయ మందరధ్వనులు గీతంబొప్ప తౌర్యత్రికం- బిరవై యుండఁగ నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా! | 134 |
| మ. | అజరుద్రాదులు మిమ్మెఱింగి నుతిసేయన్లేరు నేనెంతవాఁ- డ జగద్రక్షణదక్ష నిన్నుఁ గొనియాడ న్నీస్వభావంబు దా- సజనానుగ్రహనిశ్చితంబగుట నా జన్మంబు సాఫల్యమం- ద జడుండంచు నిరాకరింపకఁ బ్రసన్నంబౌట సర్వేశ్వరా! | 135 |
| శా. | బాలుం డాడెడు మాటలెల్ల నుపమింపం దండ్రికి బ్రౌఢభా- వాలాపంబులకంటె మించుగతి నే నజ్ఞానభావంబునం- దాలోచించి రచించినట్టి కృతి యింపారంగ నీకు న్మహా- లాలిత్యస్తుతికంటెఁ గైకొనుఁగదా శ్లాఘ్యంబు సర్వేశ్వరా! | 136 |
| మ. | అభిరమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వర- ప్రభు కారుణ్యవసంతసంజనిత మద్వాక్యప్రసూనావళి- న్విభవం బొప్పఁగఁ గూర్చి యెంతయు లసద్విఖ్యాతి సంపత్సుఖ- ప్రభవంబైన భవత్పదద్వయము నారాధింతు సర్వేశ్వరా! | 137 |
| శా. | ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ జిత్రార్థాంచితశబ్దబంధురముగా సేవ్యంబుగా సజ్జన- శ్రోత్రానందముగా శుభాంచితముగా శోధించి సర్వేశ్వర- స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా! | 138 |
| శా. | శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు- శ్లోకానందకరంబుగా మహిమతో శోభిల్ల సర్వేశ్వర- ప్రాకామ్యస్తవ మొప్పఁ జెప్పె శుభకృత్ప్రవ్యక్తవర్షంబునన్ శ్రీకంఠార్పితమై వసుంధరపయిం జెన్నొంద సర్వేశ్వరా! | 139 |
| వావిళ్ల భక్తిరసశతకసంపుటము-3 లో అధికపద్యములు | ||
| మ. | అరిషడ్వర్గబలంబులో మలసి మాయావృత్తి నాయం దతి- స్ఫురణం జేసినవాఁడు మోహుఁ డతనిన్ బోఁద్రోచి నీ భక్తితో బరగం గూర్చి వివేకిఁ జేసి నెరయం బాటించి నాయం దధీ- శ్వరుఁడై యుండఁగదయ్య రౌప్యకుధరవ్యాపార సర్వేశ్వరా! | 1 |
| మ. | అమలామ్నాయవిధిప్రబోధము లసంఖ్యాతంబులై యుండు నా- గమమార్గోత్తమమంత్రతంత్రము లసంఖ్యాతంబులై యుండుఁ ద- త్క్రమము ల్నాకవియేల నీవు మెఱయంగా నిన్ను సద్భక్తియో- గమునం గొల్చి జయింపఁ జేయు మిదె మత్కామ్యంబు సర్వేశ్వరా! | 2 |
| శా. | కానీ దారసమన్వితుండు మిగులం గానీఁడు కందర్పునిన్ గోనీ మానవకోటిలో మరులు పైకోనీఁడు మోహంబునున్ రానీ రాజితరాజ్యవైభవము పైరానీఁడు గర్వంబునున్ లో నీవైన మహాత్ముఁ డన్యమునకున్ బోనీఁడు సర్వేశ్వరా! | 3 |
| శా. | ఏ నిన్నే శరణందు బాంధవులు గానీ యెల్లవారుం బగే కానీ మృత్యువు తలక్రిందువడనీ కాలుండు గీవెట్టనీ నానాకర్మచయంబు గింజుకొననీ నాకేమి నేరాజ నిం- తే నీ చాటున దాఁగియున్నపుడు బీతే యింక సర్వేశ్వరా! | 4 |
| మ. | జయశక్తిన్ రవిచంద్రతారకముగాఁ జల్పెన్ యథావాక్కులా- న్వయసంజాతుఁడు నన్నమార్యుఁ డవని న్వర్ణించి నీ సత్కథా- క్రియసంబోధన నీదు భక్తిని మహానిర్ణీతవిశ్రాంతిగా భయవిభ్రాంతులు లేక యీ శతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా! | 5 |
| సర్వేశ్వరశతకము సంపూర్ణము. | ||