| వచన సాహిత్యము | వ్యాసములు | బుఱ్ఱకథ - శ్రీ శ్రీనివాస చక్రవర్తి |
తెలుగువాణి
ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచిక
ఉగాది, 1975
శుద్ధయక్షగాన కళారూప ప్రభేదమే బుర్రకథ. కాలపరిణామములో యక్షగానమే బుర్రకథగా రూపొందింది. ఈ రూపాంతరము ఎప్పుడు ఏప్రాంతములో జరిగిందో కూడ స్పష్టముగా చెప్పలేము. అయితే దీనిని పల్నాటికథ, బొబ్బిలికథ అని కూడ అంటారు. కాబట్టి పల్నాడు ప్రాంతంలోనో, బొబ్బిలి ప్రాంతంలోనో రూపాంతరము జరిగిందని కొంతవరకు ఊహించవచ్చును.
కథకుడు వాయించే తంబురా బుర్రనుబట్టి బుర్రకథ అని పేరు వచ్చింది. ఈకథలో వంత "తందానతాన", కాబట్టి దీనిని "తందానపాట" అనికూడా అంటారు. యక్షగానంలో కథచెప్పేది స్త్రీ. బుర్రకథలో కథ సామాన్యంగా పురుషుడు చెబుతాడు. ఇపుడు స్త్రీలు కూడా బుర్రకథ చెపుతున్నారు.
ఈ కథకుడు తంబూరాగానీ, సితారుగాని పుచ్చుకొని వాయిస్తూంటే ఒకరు హాస్యం చెప్పేవారు, ఒకరు వంతపాడేవారు. అందుకే పూర్వపు కథకులు ఇద్దరు స్త్రీలను వివాహమాడటం రివాజు అయింది. దీనిని వృత్తిగా స్వీకరించి ప్రచారంలోకి తెచ్చినవారు జంగాలు. అందుకే దీనికి "జంగం కథ" అనికూడ పేరు వచ్చింది. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిచ్చేవారు. ఇప్పుడు కులంతో నిమిత్తంలేకుండా స్త్రీ పురుషులు, బాలబాలికలు బుర్రకథ చెపుతూ ప్రజలను రంజింపచేస్తున్నారు.
శ్రీనాథుని కాలమునాటికే బుర్రకథలు బాగా ప్రచారంలో వున్నాయని "క్రీడాభిరామము"లోని క్రింది పద్యంవలన తెలుస్తున్నది.
ద్రుత తాళంబున వీరగుంభి తకధుం ధుం ధుం కిటాత్కార సంమొన్నమొన్నటివరకు ఈకథలను మంజరీ ద్విపదలో వ్రాశేవారు. ఈపూర్వకవుల పేర్లుకూడా గట్టిగా తెలియవు. ద్విపదను "ముదిలంజ" అని కొందరు ఈసడించగా శ్రీనాథుడు పల్నాటివీరచరిత్రను ద్విపదలో బుర్రకథగా వ్రాసి ఒక మహోత్తమ గ్రంథాన్ని ఆంధ్రులకు సమర్పించాడు. ఇపుడును లభ్యమగుచున్న బుర్రకథలలో ప్రాచీనమైనదీ పల్నాటివీరచరిత్ర అని తెలుస్తూ ఉన్నది.
బుర్రకథ దేశిసాహితీ శాఖకు చెందినది. చక్కటి జాను తెనుగులో రచితమై ప్రేక్షకులకు రసానుభూతి కలిగించడంలో ప్రముఖస్థానం అందుకున్నది. వీటిలో ఎక్కువ ప్రాధాన్యం వహించేవి వీరకరుణ రసాలు. నేర్పరి అయిన కథకుడు కథ చెబుతూ ఉంటే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.
కథకుడు సామాన్యంగా నిలుచుని కథ చెప్పడు. ముందుకు వెనుకకు అడుగులు వేస్తూ, నృత్యంచేస్తూ, గిర్రున తిరుగుతూ, మధ్య మధ్య కూర్చొని అభినయిస్తూ కథ చెపుతాడు. దీనితో ప్రేక్షకుల హృదయాలు రసార్ద్రమవుతాయి.
ఈ విధంగా ద్విపదలో రచితములై ఎక్కువ ప్రజాభిమానం చూరగొన్న బుర్రకథలు పల్నాటివీరచరిత్ర, పెద్దబొబ్బిలియుద్ధం, బాలనాగమ్మకథ, ఆఱుమరాటీలకథ, కామమ్మకథ మొదలగునవి. కామమ్మకథలో కరుణరసం పరాకాష్టకు చెందింది. ఈ అర్థశతాబ్దంలో ఈ కథలను చెప్పడంలో పెద్దపేరు పొందింది రెంటపాళ్ళ గుడ్డి జంగం.
దేవరకొండ వెంకయ్యామాత్యుడు ఉత్తరగోగ్రహణం బుర్రకథతో రంగంలో ప్రవేశించడంతో ఈబుర్రకథారూపం ఇంకోదశ అందుకుంది. ఇందులో ద్విపదలేకాక కీర్తనలు, దరువులు, కందార్థాలు మొదలగునవి వాడడం గమనించదగ్గది. ఈ విధమయిన బుర్రకథలను చెప్పడంలో యావదాంధ్ర విఖ్యాతి గాంచింది దొడ్డవరపు వెంకటస్వామి. నిండయిన విగ్రహం, పెద్దజరీఅంచు తలపాగ, నవరసాలు ఆవిష్కరించే ముఖం. ఇతను ఉత్తర గోగ్రహణం చెపుతుంటే ప్రేక్షకులు తన్మయులవుతుండేవారు.
ఇక మూడవదశ నాయకులు సుంకర సత్యనారాయణ. ఇతను బుర్రకథ రచనకు పూనుకొనక ముందు బుర్రకథలన్నీ పౌరాణిక చారిత్రక సంబంధాలే. ఇతను సమకాలీన ప్రజాసమస్యల్నీ, మహాపురుషుల జీవితాలను బుర్రకథలుగా రచించాడు. ఉదాహరణకు కష్టజీవి, కందుకూరి వీరేశలింగం, అల్లూరి సీతారామరాజు బుర్రకథలు. ఇవి ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి.
బుర్రకథలు చెప్పడంలో ఇప్పుడు నాజరు ఎక్కువగా ప్రముఖస్థానం వహిస్తున్నాడు. ఇతడు ఇతరరచనలేగాక సొంతంగా బుర్రకథలు రాసుకొని చెబుతున్నాడు. బుర్రకథకు ప్రత్యేకమయిన దుస్తులు ధరించడం ఇతనితోనే ప్రారంభమయింది. ఇద్దరు వంతలలో ఒకరు రాజకీయాలు చెప్పడానికి కూడ ఇతనే దారితీశాడు. ప్రస్తుతం నాజరు యుగం నడుస్తోంది. ఎంతమంది బుర్రకథలు చెప్పినా కొద్దో, గొప్పో ఇతనిని అనుసరిస్తున్నారు.
ఉదాహరణలు:
కామమ్మ తన భర్త చితిని కౌగిలించుకొని
"ఎంతచల్లగ ఉన్నది నీ జాజివనము మారయ్య"
(కామమ్మ కథ)
--------
| మరాటీల దేశమున్నాదీ | స॥ |
| ఆరే వాండ్లదేశమున్నాదీ | స॥ |
| పడమటొక్కయా దేశమందునా | స॥ |
| ఆ పత్తికొండ తాలూకా అయిన | స॥ |
| అక్కడ పన్నెండు కోటలున్నాదీ | స॥ |
| అక్కడ ఆరే వాండ్ల భూములున్నది | స॥ |
| ఆ కోటలుయేలే దొరలుయున్నారూ | స॥ |
| వాడు భాయి భజేరావున్నాడు | స॥ |
| భజేరావు కొడుకులున్నారూ | స॥ |
| భాయి భజేరావు కొడుకులు | స॥ |
| వారు ముగ్గురు అన్నదమ్ములు | స॥ |
| వారి ముగ్గురికి పేరు ఉన్నదిగా | స॥ |
| పెద్దవాడుగా నారాయణరావు | స॥ |
| చిన్నవాడుగా సిద్ధోజిరావు | స॥ |
| కడగోటివాడు కండేరాయుడు | స॥ |
| వాండ్లు అన్నదమ్ములు భాగాలుబోయిరి | స॥ |
| వాండ్లు దాయాదిబోగాలు బోయిరి | స॥ |
| వాండ్లు భాగాలుబోయిన వెనుకాను | స॥ |
| కుక్కలభాగాలు యివ్వరా | స॥ |
| మీరు కుక్కల పేరు యెత్తితే | స॥ |
| అరవంగ గొంతులు కోసేనూ | స॥ |
| అన్నాయిప్పుడైన భాగమియ్యకపోతేర | స॥ |
| ముందుగయైన భాగము యివ్వరా | స॥ |
| వాండ్లకు దాయాది పగలేగలిగేనా | స॥ |
| దాయాదిపోరు గలిగిన తర్వాత | స॥ |
| అరవై యేండ్ల పగలున్నావీ | స॥ |
| ఇరువైయేండ్ల యీర్ష్యయున్నాదీ | స॥ |
| ఎవరిభూములు వారలు యేలిరి | స॥ |
| ఎవరి కోటలు వాండ్లు యేలిరి | స॥ |
| సిద్ధోజిరావుకు సంతానములేదుగా | స॥ |
| కండేరాయుడికి సంతానములేదుగా | స॥ |
| నారాయణరావుకు సంతానముకలిగెనూ | స॥ |
| వాండ్లముగ్గురికీ పేరువున్నాదీ | స॥ |
| కొడుకులు పుట్టినవేళలు | స॥ |
| వాండ్లకు మరాటీపేరు ఉన్నాదీ | స॥ |
--------
వ॥ యీ ప్రకారంబున సేనలన్నీ -
"పట పటపట పండ్లుగొరుకుచు - పటుతర గతివేగ
కటకట కటకట కోరలొరిపిరిడికి - చిటపటయనెనిప్పుల్
రెట్టలు దట్టుచు అరేరేరేయని - మిట్టపడుచువేగ
పొట్టిమీసములు పట్టిదువ్వి - కనుబొమలు మడియబట్టి
పఠాకత్తులూ కఠారుబాకులు - తటాలునందుకొని
పెఠిల్లుమని కక్కటిల్లుచును - దిక్తటంబుల దరగను
గండ్రగొడ్డండ్లు కత్తులుబాణా - కర్రలు చేబూని
వేండ్రమైన రోకండ్లు గుదపలును - బిండివాలములును
తళతళ నాకసమందు మెరియగా - తలపడె నిరువాగు
కరులు సేనలను నురుమాడుచు - మున్ముందు కేగుచుండు
రణభేరి ధణధణలకు ధరణి - దద్దరిల్లుచుండ
శరవేగంబున శత్రుసేనలో - చొరబడి బాలుండు
ధరణిమీద నరివీరులతలలు - తరుగుచు బాలుండు
విచ్చుకత్తి నరి వీరులరొమ్ముల - కుమ్మిచిమ్ముచుండ
గుండెలు ప్రేవులు వొక్కుమ్మడిగా - తుండెములైజార
కొండలరీతిగ శవములన్నియు - గుట్టలుబడుచుండ
నెత్తురుచిమ్ముచు తలలు మొండెములు - దొర్లాడుచునుండ
శత్రుసేనలు చెదరి జెదరెను - చెట్లకు గుట్టలను"
(పల్నాటి యుద్ధం - నాజర్)
--------
రాజుబేటికి వస్తున్నాడు పాపారాయుడు
రాజుగారి సేవకుడయ్యా చల్లారాముడు
పాపారాయుడు వస్తున్నాడు చల్లారాముడు
చలోయంటు చప్పడియంటు యెదుట వచ్చెను
నీదువంతు వచ్చిందయ్యా మిర్యాలసీతన్న
పచ్చలబాకు నడుమునుంచి భగ్గునతీసెను
వానినోట పొడచినాడయ్య మిర్యాలసీతన్న
పొడిచినంతలో తిరిగి తిరిగి భూమినిపడ్డాడు
రాజుగారు నావంతన్నాడు పాపారాయుడు
వాని రొమ్ముమీదనే కొలువుతీరెను పాపారాయుడు
కాళ్లుయప్పుడు గట్టిగపట్టెను మిర్యాలసీతన్న
అప్పుడేమని చెప్పినాడు పాపారాయుడు
తట్టితట్టిలేపెనయ్యా విజయరామరాజును
మెలకరించి లేచినాడయ్యా విజయరామరాజు
వోరోయీటి యెక్కడ బల్లెమెక్కడ చల్లారాముడా
యోరియీటియెందుకు బల్లెమెందుకు విజయరామరాయ
పక్కలోనే బాకైయున్నాను పాపారాయున్ని
నీతలకు గుండైయున్నాను పాపారాయున్ని
దొంగబాట వస్తివిగదర విజయరామరాజా
బొబ్బిలికోట తీస్తామని ప్రతిజ్ఞ చేసితివి
యెవ్వరిపంతము సాగిందోయి విజయరామరాజు
యిట్లుచెప్పుతూ బాకుతీసెను పాపారాయుండు
రొమ్ముమీద గుమ్మినాడయ్య పాపారాయుండు
గుభల్ గుభళ్లని రక్తమువచ్చి జీవము విడిచెను
భూమిమీదనే తోసినాడయ్య మంచముపైనుంచి
(పెద్ద బొబ్బిలిరాజు కథ)
--------
కీర్తన| గంటందొర: | కూడదయ దీనులయ - ఏడిపించ తగదయ వేడుకొను చుంటినయ - నేడు జూడుమయ | కూడ |
| బాస్టియను: | వేడినను వీడనుర - బూడిదగ చేసెదర బేడలివ్వ చాలదని - వీడిరిదె రోడ్డుపని | వేడి |
| గంటందొర: | క్రూరమగు హింసలట - మీరలట పెట్టిరట ధారలుగ చెమ్మటను - కారిచిన కూలీలను | కూడ |
| బాస్టియను: | ఓరి తెగవాగకుర - గోరీలను కట్టెదర మీరితిర యాజ్ఞలను - వారి మిము నరికెదర | వేడి |
వ.
ఈ తిట్లను సహియించలేక కన్నులెర్రజేసి మల్లుదొర ఏమంటున్నాడు?
| భళా భళానోయ్ తమ్ముడా | సై |
| భాయి భళానోయ్ దాదానా | సై |
| పిచ్చి పిచ్చిగా వాగకు | సై |
| పిలిచి తిట్టుచున్నావుగా | సై |
| పైసకు గడ్డిని మేసెడి | సై |
| పశువు జన్మమేమెత్తం | సై |
| చావుకు వెరువము తెలుసున? | సై |
| జాగ్రత్తగ మాట్లాడాలి | భళా |
| ముఠాదార్ల బెదరించుచూ | సై |
| రైతుల గొంతులు కోయుచు | సై |
| కూలీల పీకలు నొక్కుచు | సై |
| కూడ బెట్టి ధనరాసులు | సై |
| మేడలు గట్టగ దలచావ | భళా |
| అధికారము, కంట్రాక్టులు | సై |
| అన్నీ నీవే చేతువా | సై |
| కూలికి రోడ్లను పోసిన | సై |
| కూలినంత ద్రిగ మింగియు | సై |
| చాలక నాపై కేసులు | సై |
| చంపివేయగా తలచావా | భళా |
| జానెడు పొట్టను నింపగ | సై |
| సత్యము తప్పము తప్పము | సై |
| కూట సాక్ష్యముల నివ్వము | సై |
| మాటలేల పొమ్మన్నారు | భళా |
--------
| భళా భళానోయ్ కూలన్న | |
| మేల్ భళానోయ్ రైతన్నా | సై |
| వింతచూచుటకు నాయన | సై |
| అంతులేని ప్రజ కదిలిరి | సై |
| వచ్చే వారొస్తుండిరి | సై |
| పొయ్యేవాళ్ళు పోతుండిరి | సై |
| బంధువు లందరు వచ్చిరి | సై |
| పంతులు గారిని జుట్టిరి | సై |
| బతిమాలారొక కొందరు | సై |
| బెదరించిరి మరికొందరు | సై |
| అలిగే వారొక కొందరు | సై |
| అదిరిపడిరి మరికొందరు | భళా |
| బందుగులందరు యిట్టుల | సై |
| బాధలు పెట్టుచు నుంటెను | సై |
| పంతులు గారేమంటరు | సై |
| ప్రాణి భయము లేదంటరు | సై |
| నాకు యిట్టి వాడందున | సై |
| నమ్మకము లేదంటరు | సై |
| నమ్మని పని నేనెప్పుడు | సై |
| నరికిన చెయ్యనంటారు | భళా |
--------
వ. నీకోర్కెలన్నింటిని, స్థితి గతులన్నింటికి కట్టుబడి యుండి ఓపికతో మేము తప్పక తీర్చెదమనిన రైతుల మాటలకు ఆ వీరుడు సంతోషించి తన తమ్ముడగు భీమయ్యను దగ్గరకు పిలచి, తమ్ముడా -
"అమల చరితులగు అమ్మను అయ్యను ఆదరముగచూడు
సుమతిని నారాయణు నేతీరున చూతువో భీమయ్యా
మిమ్ముల బెంచెడి భాగ్యము నాకిక తమ్ముడ లేదోయి
అమ్మకు నాన్నకు నాదు వందనము లందించర పోయి."
వ. అని ఏకధారగా కన్నీరు కార్చుచూ చెంతనున్న తమ్మునకు జెప్పి బాధ భరింపలేక డొక్కలో నున్న బాకును తానే లాగివైచు కొనెను. అప్పుడు -
"విలవిల తన్నుక నాగయ జీవుడు - వెళ్ళిపోయె నండి
జల జల కన్నుల జలము కారెనా - జనసమూహమునకు."
--------
"తైతత్తతై - తకదికతకదిక తదిగిణం దోదిక - తళాంకుతకదిక - తత్తతై."
| మనుజులలోన రకములు జూడు మనసులలోన మాయలు జూడు మారేదానికి గోడలు జూడు మార్చేవారికి మాటలలోన మోసము జూడు మాటచేతలకు తేడా జూడు చెప్పి చేయని చేసి చెప్పని చుప్పనాతులను | |
| లోకము నాకము జేయుట కొరకై ఏకధాటిగ ఎదురు నిలిచెడి త్యాగధనులయా తపములు జూడు వారల త్యాగపు ఫలములు జూడు సూర్య బింబముల సొగసును జూడు అగ్ని కణముల నిగ్గును జూడు అహోరాత్రములు మహోపకారులై మెప్పులగట్టి |
--------
వ. అప్పుడు తాంతియా యెలా వున్నాడు?
| కరకర జాబుల చదివెరా | సై |
| కనుగుడ్లెర్రన జేసెరా | సై |
| గిర్రున మీసం దువ్వెరా | సై |
| చర్రున ఖడ్గం దూసెరా | సై |
| కుంఫిణి గుంపుల కిప్పుడే | సై |
| కాలం తీరిన దంటాడు | భ |
| ముందూ గుర్రాల్ దండురా | సై |
| మధ్యన కాల్బాలమ్మురా | సై |
| వెనుకను యేనుగ గుంపుతో | సై |
| వీర మరాఠా తాంతియా | సై |
| వైరి బలగముల పైననూ | సై |
| వెనుక తట్టువచ్చు చున్నాడూ | భ |