| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 2. సంజ్ఞా ప్రకరణము | ||
| 2.1. మాత్రాలక్షణము | ||
| క. |
మాత్రయన నొక్క లఘువగు మాత్రలు రెండైన గురువు - మఱియెన్నఁ బడున్ ధాత్రిని నఱువది నాలుగు మాత్రలుగా గందమునకు మాత్రలు వెలసెన్. |
7 |
| 2.2. గురు లఘువుల స్వరూపము | ||
| క. |
వివిధముగఁ జాఁపి పలికెడు నవియును మఱి యూఁదిపలుకు - నవియును గురువుల్ భువి నిలిపి పలుకు వర్ణము లవియెల్లను లఘువులయ్యె - నంబుధి శయనా! (అనంతుని ఛందము) |
8 |
| క. |
గురువులు నిడుదలు జడ్డ క్కరముల బొట్టుల పిఱుంద - కడ నూఁదిన య క్కరములు, పెఱయవి లఘువులు గురులఘువులు మూఁడు గూడి - కొన గణములగున్. (భీమన ఛందము) |
9 |
| 2.3. గురు లఘువులకు గుఱుతులు | ||
| క. |
గురువులకు సంజ్ఞ యొక్క ట్ల రయం దలక్రిందు వ్రాయు - నటులం జెలఁగున్ ధరపై లఘువులు వెలయున్ గరిమన్ నిడుగీటు వ్రాయు - కరణి ముకుందా! |
10 |
| 2.4. గణస్వరూప నిరూపణము | ||
| క. |
గగణంబగు నేక గురువు లగణంబగు నేక లఘువు - లాలిత్యముగా వగణమగు లఘువు గురువును హగణంబగు గురువు లఘు వ - హర్పతి తేజా! (భీమన ఛందము) |
11 |
| క. |
లలమునకు రెండు లఘువులు వలనొప్పఁగ లఘువు గురువు - వఱలును లగమై గలమయ్యె గురువు లఘువును జలజాక్షా! గగమనంగఁ - జను గురు యుగమున్. |
12 |
| క. |
'శౌరి' యనిన హగణంబగుఁ జేరి 'హరీ' యనిన మల్ల - సిల్లును వగణం బారయఁ 'గృష్ణా' యనినను ధారుణి గగమండ్రు లలము - దా 'హరి' యన్నన్. (అనంతుని ఛందము) |
13 |
| 2.5. సమ (ప్రధాన) గణములు | ||
| క. |
గురువులు మూఁడిడ మగణము పరఁగంగా నాదిగురువు - భగణం బయ్యెన్ ధరమధ్య గురువు జగణము సరసగుణా! యంత్యగురువు - సగణం బయ్యెన్. (భీమన ఛందము) |
14 |
| క. |
నగణంబు మూఁడు లఘువులు యగణంబున కాదిలఘువు - యమతనయ నిభా! రగణంబు మధ్యలఘువగు తగణంబున కంత్యలఘువు - దాక్షిణ్యనిధీ! (భీమన ఛందము) |
15 |
| 2.6. ప్రధాన గణముల కుదాహరణములు | ||
| క. |
మగణము 'శ్రీనాథా' యన భగణము 'కేశవ' యనంగఁ - బరికింపగా జగణము 'ముకుంద' యనఁగా సగణము 'వరదా' యనంగ - సర్వజ్ఞనిధీ! |
16 |
| క. |
నగణము 'వరద' యనంగా జగతి 'మురారీ' యనంగఁ - జను యగణంబున్ రగణంబు 'మాధవా' యన తగణము 'దైత్యారి' యనఁగఁ - దామరసాక్షా! |
17 |
| క. |
నగణముపయి గురువున్నన్ నగమగు, లఘువున్న యెడల - నలమగు వరుసన్ సగణము పయి లఘువున్నన్ దగ సలమగుఁ గంజహిత సు - ధాకరనయనా! |
18 |
| 2.7. ఉపగణములు - సూర్యేద్ర చంద్ర గణములు | ||
| క. |
నల నగ సల భ ర తలు నా నెలమిని నీయాఱు గణము - లింద్రగణంబుల్ గల నగణము లీ రెండును జలజాప్త గణంబు లయ్యె - జగదాధారా! |
19 |
| క. |
గల సగణము లినుఁ డింద్రుఁడు సల నగ సల భ ర త లింక - నగగ నహ సలా భల భగురు మలఘు సవ సహ తల రల నవ నలల రగురు - తగ లిందుఁ డజా! (అనంతుని ఛందము) |
20 |
| 2.8. వృత్తగణ ప్రస్తారము | ||
| క. |
చాలుగను సర్వగురులిడి లాలితముగ గురువు క్రింద - లఘువు వలపటన్ ఓలి సమంబులు దావలి వ్రాలకు గురువులను నిల్పఁ - బ్రస్తారమగున్. (అనంతుని ఛందము) |
21 |
| క. |
ఎన్నవ ఛందం బడగిన నన్నియ గురులిడుచు మఱి గ - ణాష్టకమును దాఁ బన్నుచు లఘువులె తుదగా నెన్నిక నిడ వృత్తసంఖ్య - యేర్పడవచ్చున్. |
22 |
| 2.9. సూర్యేద్ర చంద్ర గణోత్పత్తి | ||
| క. |
ద్విత్రిచతుర్గురు భవములు ధాత్రీధర రెండు నుడుపఁ - దక్కినగణముల్ మిత్రేంద్ర చంద్రు లనఁ దగు మాత్రాది గణంబు మొదల - మాత్ర లిడంగన్. (అనంతుని ఛందము) |
23 |