| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 8. గణ ప్రయోగ విచారము | ||
| 8.1. గణోత్పత్తి క్రమము | ||
| ఆ. |
చంద్రసూర్యవహ్ని - చక్షుఁడౌ రుద్రుని మూఁడు కన్నులందు - మూఁడు గురువు లుదయమయ్యె దాన - నొప్పారె మగణమై యందు సప్తగణము - లమరఁబుట్టె. (భీమన ఛందము) |
196 |
| క. |
ఒనరఁగ మయరసతజభన లన నీ యెనిమిది గణముల - నతి సత్కృపతో నెనసిన మతిఁ బింగళునకు మనసిజమథనుండు దాఁగ్ర - మంబునఁ దెల్పెన్. (కవి గజాంకుశము) |
197 |
| క. |
మగణము వలనన్ యగణము యగణము వలనన్ జనించె - నా రగణంబున్ రగణము వలనన్ సగణము సగణంబును తగణమునకు - జనకంబయ్యెన్. (కావ్యచింతామణి) |
198 |
| క. |
తా వలన జగణమయ్యెన్ జా వలనను భగణమయ్యె - సరసంబుగ నా భావలన నగణమయ్యెను భావింపఁగ జన్యజనక - భావముగాఁగన్. (కావ్యచింతామణి) |
199 |
| క. |
అదికానఁ దండ్రి కొడుకుల కొదవదు వైరంబటంచు - నొనరఁగ సుకవుల్ గొదుకక బంధుగణంబులఁ గదియంతురు రసలుదక్కఁ - గావ్యముఖములన్. (కావ్యచింతామణి) |
200 |
| 8.2. అష్టగణ లక్షణములు | ||
| 8.2.1. మగణము | ||
| మ. |
ధర దైవంబు గ్రహంబు సౌమ్యుఁడు హరి - ద్వర్ణంబు సత్కాంతి యా సుర మూహింప గణంబు జాతి తిలకిం - చున్ శౌద్రియౌ యోని దా హరిణం బుజ్జ్వల తార జ్యేష్ఠ రస ము - ద్య ద్రౌద్ర మారాశి తే లురు భద్రంబు ఫలంబునా మగణ మిం - పొందున్ బుధ స్తుత్యమై. (కవిసర్పగారుడము) |
201 |
| 8.2.2. యగణము | ||
| మ. |
అలరన్ దైవము వారి బ్రాహ్మ్యము కులం - బా వన్నె తెల్పర్థ మా ఫలమా యోని ప్లవంగ మా గణము సె - ప్పన్ మానవం బా గ్రహం బల శుక్రుండు రసంబు దాఁ గరుణ - పూర్వాషాఢ నక్షత్ర మి మ్ములఁ గోదండము రాశి యా యగణ మొ - ప్పు న్గోవిద స్తుత్యమై. (కవిసర్పగారుడము) |
202 |
| 8.2.3. రగణము | ||
| మ. |
అనలుం డీశుఁడు రాశి మేషము గ్రహం - బా భౌముఁ డత్తార సం ప్రణతిన్ గృత్తిక దైత్యమాగణము వై - రాజ్యంబు వశంబు మేఁ కనెఱి న్యోని ఫలంబు భీ రసము శృం - గారంబు సత్కాంతి కో కనదా చ్ఛచ్ఛవి మించు నా రగణ మె - క్కాలంబు నొప్పున్ భువిన్. (కవిసర్పగారుడము) |
203 |
| 8.2.4. సగణము | ||
| చ. |
అనిలుఁ డధీశుఁడున్ గువల - యంబుల కాంతి కులంబు హీనమున్ జను గ్రహమా శనైశ్చరుఁడు - చాలఁగ నల్పగు నన్నె తౌళి యౌఁ దనరఁగ రాశి స్వాతి యగుఁ - దార ఫలంబు క్షయంబు దానవం బొనర గణంబు నమ్మహిష - యోని యగున్ సగణాన కీశ్వరా! (వాదాంగ చూడామణి) |
204 |
| 8.2.5. తగణము | ||
| మ. |
అమరు న్మి న్నధిదైవముం గులము బ్రా - హ్మ్యం బా గణ బెన్న దై వము జీవుండు గ్రహంబు నల్పరుచి యై - శ్వర్యంబు లబ్ధంబు మే షము దా యోని రసంబు శాంత మల న - క్షత్రంబు పుష్యంబు రా శి మహిం గర్కటకంబు నా తగణ ము - త్సేకంబగున్ జెల్వమై. (కవిసర్పగారుడము) |
205 |
| 8.2.6. జగణము | ||
| మ. |
అరుణుం డేలిక చాయ రక్తిమ రసం - బవ్వీర మా యన్వయం బురు వైరాజ్యము రాశి సింహము గ్రహం - బుష్ణాంశుఁ డత్తార యు త్తర రోగంబు ఫలంబు యోని యిర వొం - దన్ ధేను వమ్మానవం బరుదారంగ గణంబు నా జగణ మిం - పారున్ జగత్సేవ్యమై. (కవిసర్పగారుడము) |
206 |
| 8.2.7. భగణము | ||
| ఉ. |
చంద్రుఁ డధీశ్వరుం డమృత - సారము కాంతియు విట్కులంబు నా చంద్రుఁడె తద్గ్రహం బతని - చాయయుఁ దెల్పు వృక్షంబు రాశి భో గీంద్రము యోని దేవగుణ - మీప్సిత సౌఖ్యము తత్ఫలం బిలన్ జంద్రుని తారయై తనరు - జంద్రధరా! భగణాన కెన్నఁగన్. (వాదాంగ చూడామణి) |
207 |
| 8.2.8. నగణము | ||
| మ. |
పరమాత్ముం డధినాయకుండు జయ సౌ - భాగ్యైక సామ్రాజ్య పూ జ్వరమాసంతతులీవి లబ్ధము నిజో - పాంతస్థ దుష్టాక్షరో త్కరదోషాఢ్యగణౌఘ ధూర్త గుణముల్ - ఖండించుటల్ శీల మె వ్వరికిం గాదనరాదు నా నగణ మ - వ్యాజస్థితిన్ బొల్పగున్. (కవిసర్పగారుడము) |
208 |
| 8.3. గణాధి దైవములు | ||
| చ. |
భగణము నేలుఁ జందురుఁడు - భానుఁడు దా జగణంబునేలు నా నగణము నేలు నిర్జర గ - ణంబు సమీరణుఁ డేలు నెప్పుడు న్సగణము నుర్వి యేలు మగ - ణంబు నొగిన్ యగణంబుఁ దోయము న్రగణము పావకుండు తగ - ణంబు నభంబును నేలుఁ గేశవా! (అనంతుని ఛందము) |
209 |
| 8.4. గణఫలములు | ||
| ఉ. |
నవ్యసుఖ ప్రదాయి భగ - ణంబు జకారము రుక్ప్రదంబగున్ ద్రవ్యమునేయు నా లయక - రంబు సకారము మా శుభంబు యా దివ్యసువర్ణకారి వెతఁ దెచ్చును - రేఫ విభూతినిచ్చుఁ దాఁ గావ్యములందు నాదినిడఁ - గర్తకు భర్తకు నంబుజోదరా! |
210 |
| క. |
సరసాన్న రుచిరభూషణ పరితాపాస్థానచలన - బహుదుఃఖ రుజా పరమాయు రచలలక్ష్మీ కరములు మయరసతజభన - గణములు వరుసన్. (భీమన ఛందము) |
211 |
| 8.5. గణములకు జాములు | ||
| సీ. |
జయవిజయంబులు - శంఖమహా, శంఖములుననఁ బగటిజా - ల్వెలయుచుండు రాత్రిజాల్రామ వి - రామస్తుప్తప్రసు, ప్తంబులు ననఁగను - దనరుచుండు నీ యెనిమిదిజాలఁ - బాయక మగణాది, గా జనించు గణాష్ట - కంబు వరుస నేజామునను గావ్యు - డెలమితోఁ గబ్బంబు, విరచింపఁ బూనె న - వ్వేళయందు |
|
| తే. |
నుద్భవంబయిన గణప్ర - యోగమునకు శుద్ధిగాఁ గూర్చునదియు; వి - జ్జోడుపడఁగ గణము లూహించి కూర్చు బి - కారికుకవి పద్య మొల్లఁడు బ్రతుకాస - పడఁడువాఁడు. (కవిసర్పగారుడము) |
212 |
| 8.6. గణములకు జాతులు | ||
| క. |
లలిత యతులు విప్రకులం బులు రజలవనీశకులజ - ములు భనలు న్వి ట్కులజులు మగణము నాలవ కులజము సగణంబు హీన - కులజం బమరన్. |
213 |
| క. |
నాయకుఁ డే కులమైనను బాయక తత్కులగణంబు - పద్యము మొదటన్ ధీయుక్తి నిడఁగ మేలగు నేయెడ సంకరము లిడఁగ - నెగ్గగుఁ బతికిన్. (అధర్వణుని ఛందము) |
214 |
| 8.7. గణ లింగములు | ||
| క. |
మగణము వగణము పురుషులు జగణరగణసగణములు ని - జంబుగ నింతుల్ యగణము తగణము భగణ మ్మగు క్లీబము లెసఁగు నుత్త - మాది ఫలంబుల్. (భీమన ఛందము) |
215 |
| క. |
సంగతిగఁ గృతుల స్త్రీ పుం లింగపుశబ్దములు నిల్ప - లెస్సగుఁ బతికిన్ వెంగలిబుద్ధి నపుంసక లింగంబగు శబ్దమిడిన - లేవు సుఖంబుల్. (కవిసర్పగారుడము) |
216 |
| 8.8. గణ యోనులు | ||
| క. |
హరిణ, వలీముఖ, మహిషీ, వర సైరిభ, మేష, ధేను - వాతాశనులున్ వరుసను మయరసతజభల కరయఁగ నక్షత్రయోను - లై విలసిల్లున్. (వాదాంగ చూడామణి) |
217 |
| 8.9. గణముల ఛాయలు | ||
| క. |
రవితురగ, రజత, విద్రుమ, కువలయ, హరి నీల శకల, - కురువింద, సుధా ర్ణవ, కనకనికష రేఖా ప్రవిమల కాంతులఁ దనర్చు - బరువడి గణముల్. |
218 |