| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
117. నారాయణమ్మ
| రంగము వెళ్ళే కూలివారు నేటికీ చాలామంది ఉంటారు. రంగములో కూలి ఎక్కువ. కాబట్టి కూలీలు తరచుగా పోతుంటారు. వారి భార్యలకిది కష్టకాలము; చెలిమికత్తెల కింకా ఎక్కువ. ఇది ఒక జంట సంభాషణ. |
|
నేరంగమెల్లి పోతానే నారాయణమ్మ నేను నబ్బరెల్లి పోతానే నారాయణమ్మ నువు నబ్బరెల్లిపోతేనూ నాయుడుబావ నీ యబ్బ నాకు తోడెవరూ నాయుడుబావ రంగమెల్లి పోతేనూ నారాయణమ్మ నీకు రంగు సీరలంపుతానే నారాయణమ్మ బల్ సిలుకు సీరలంపుతానే సీరలు సారెలు గట్టి నాయుడుబావ నే నోరితోను కులుకుతాను నాయుడుబావ పదిరాళ్ళు తెస్తాను నారాయణమ్మ మనమిద్దరము కులుకుదాము నారాయణమ్మ నన్నిడిసి పోకోయి నాయుడుబావ మన కిద్దరికి జోడోయి నాయుడుబావ |
| ఇది సాగని మొర. సొమ్ము చాలకనో, నారాయణమ్మ పై మోజు చాలకనో నాయుడుబావ రంగము వెళ్ళి పోతున్నాడు. ఆఖరి క్షణములో ప్రయాణము ఆగబోతుందా? |