| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
177. కూనలమ్మ పదాలు
| కూనలమ్మ పాట ఒకటే నీతికి సంబంధించిన పాట. కూనలమ్మ పార్వతీదేవి కూతుళ్లు, కామేశ్వరీదేవికి తోబుట్టువులూ అయిన అక్కలకు కాపగు పోతురాజునకు భార్య. కూనలమ్మ సంకీర్తనములు, కూనలమ్మ చీర, కూనలమ్మకు వేట, కావ్యాలలోనున్నూ పాటలలోనున్నూ వినబడుతునే ఉంటవి. ఈ 'పదము' తక్కిన పదకావ్యముల వలె జంపె వరుసలో నడుస్తున్నది. చరణములన్నీ దొరికిన బాగుండియుండును. |
|
అన్నమిచ్చిన వాని । నాలినిచ్చిన వాని నపహసించుట, హాని । ఓ కూనలమ్మా! ఆడి తప్పినవాని । నాలినేలని వాని నాదరించుట హాని । ఓ కూనలమ్మా! భీష్ముఁడనుభవ శాలి । భీముఁడే బలశాలి కర్ణుఁడే గుణశాలి । ఓ కూనలమ్మా! దుర్యోధనుఁడు భోగి । ధర్మరాజొక జోగి అర్జునుండే యోగి । ఓ కూనలమ్మా! కవితారసపు జల్లు । ఖడ్గాల గలగల్లు కరణాలకే చెల్లు । ఓ కూనలమ్మా! కాపువాఁడే రెడ్డి । గరికపోచే గడ్డి కానకుంటే గ్రుడ్డి । ఓ కూనలమ్మా! మగని మాటకు, మాటి । కెదురు బల్కెడి బోటి మృత్యుదేవత సాటి । ఓ కూనలమ్మా! జపతపంబుల కన్న । చదువుసాముల కన్న ఉపకారమే మిన్న । ఓ కూనలమ్మా! |