| ఇతిహాసములు | అచ్చతెలుఁగు రామాయణము | అయోధ్యాకాండము |
| క. | సిరి పెనిమిటియుం బలుకుల విరిఁబోడి మగండుఁ గడల వేలుపు దొరలున్ దిరముగ డాకొని కొలువన్ సరిమీఱినవేల్ప! పూప జాబిలి తాల్పా! | 1 |
| తే. | వినుము కరువలి మేపరి మనికిపట్టు కాన్పు జడదారి కత్తెఱగంటి తపసి యవలి కత తెల్పఁబూని నెయ్యంబుతోడ నింపు తళుకొత్త మెల్లన నిట్టులనియె | 2 |
| క. | గొనముల సంద్రమ! యిత్తెఱఁ గునఁ జాలుపు తేర్ల ఱేఁడు గొద యొదవని పెం పున నడరొందుచు నొకనాఁ డెన మీఱిన వేడ్క నుల్ల మిగురొత్తంగన్ | 3 |
| సీ. | తెఱగంటి రాచ ఱా తెగల నుంజిగి వెల్గు కొమరారు మగమానికముల మెట్లు పిల్లికన్ రతనంపు బిగి యోడు బిళ్ళలు పులుఁగు ఱాపచ్చ మేల్బోదియలును గొఱమించు పగడంపు గుండ్ర గంబంబులు వలుద తామర కెంపు తలుపు గములు కలువ యనుంగుఁ గల్బలితంపు గోడలు జా నొప్పు ముత్యాల చందువాలు | |
| తే. | గలిగి మఱియును మెఱుఁగు బంగరపు హరువు పనుల నలరొందు గొనబు టుప్పరిగ యందుఁ బురుడు గనరాని ఠీవులఁ బొదలి తద్ద వేల్పు టెకిమీని చాడ్పునఁ బొల్పు మీఱి | 4 |
| తే. | దొరలు ప్రెగడలు మన్నీలు బిరుదు లొజ్జ లూడిగీలును బోగము చేడియలును బట్లు జెట్లును నెఱిజన్నిగట్లు బలసి కొలువఁ గొలువుండి పెద్దల గూర్చి పలికె | 5 |
| ఆ. | మంచివారి నెల్ల మనిచి చెనంటుల నడఁచి మేటి పున్నియంబు గాంచి నేల యెల్లఁ బేర్మి నేలితిఁ బెక్కేఁడు లింక రాచ నెమ్మి యిచ్చ యుడిగె | 6 |
| తే. | పుడమిచెలి యల్లువానిని బుడమి కిప్పు డొడయనిగఁ జేసి కొలువున నునిచి యెలమిఁ గనుఁగొనెడు గోర్కి తలఁపున గాటమగుచుఁ బొడమెనని వారి యానతి వడసి యంత | 7 |
| క. | తగువారిఁ బిలిచి యిదిగో లగనము దాకొనియె నెల్లి లలిఁ బుడమికి ఱే నిఁగఁ జేయవలయు రక్కసి మగువం బొరిగొన్న వాఁడి మగనిఁ గడంకన్ | 8 |
| క. | వీడెల్ల నలరఁ జేయుఁడు వేడుకతో మీర లనుచు వీడుకొలిపినం జేడియలును మగవాండ్రును నీడొదవని గోర్కు లెడల నివురొత్తంగన్ | 9 |
| సీ. | తిన్నియ లలికి ముత్తియపు మ్రుగ్గులు వెట్టి పసిఁడి గోడల రంగు పనులు సేసి పగడంపు మెఱుఁగుఁ గంబములఁ బందిరులిడి నలువారఁ దొగ తోరనములు గట్టి తల దువారంపుఁ బొంతల నంటి బోదియ లును నిండుఁ గుండలు నొనర నిలిపి యంగళ్ళ మేల్కట్టు లమరించి లోపలి నగరులఁ గపురంపుఁ బొగలు వైచి | |
| తే. | మేలి గొజ్జంగి పూనీట మెకపు టాము గలిపి బలు రాచ తెఱువులఁ గ్రంతలందుఁ జిలికి మచ్చుల మేడల నెలవు లెల్లఁ గ్రొత్త సింగారములఁ దళుకొత్తఁ జేసి | 10 |
| క. | తారును రతనపుఁ దొడవులఁ జీరలఁ క్రొవ్విరి సరముల సిరిగందమునన్ నేరుపు లలరారఁగ సిం గారం బొనరించుకొని తగన్ జెలఁగు నెడన్ | 11 |
| తే. | రిక్కరాయఁడు దమిమీఱ రేవెలందిఁ బెండ్లి యగునని కడయను పేరఁటాలు మొనసి యైరేని నీటికై ముంచు పసిఁడి కుండయనఁ బ్రొద్దు మున్నీటఁ గ్రుంకె నంత | 12 |
| సీ. | పగలింటి కడ నాడు తిగకంటి యెకిమీని గడితంపు నిడువాలు జడలనంగ విను ద్రిమ్మరులు కఱివేల్పు హజ్జను పూజ సలిపిన క్రొత్త చెంగలువ లనఁగఁ జెడిపె చానల నేఁచ వెడలుచు మరుఁడిమ్ము కొలిపిన హొంబట్టు గొల్లె ననఁగ గ్రుంకు గుబ్బలిఁ బుట్టి కొఱలుచుఁ గడల వెం బడిఁ బ్రాకు నెరగలి మంట లనఁగఁ | |
| తే. | ద్రాడు దాలుపు చెలి పైఁడి మేడ మీద గొండ్లి సలుపుచు ననుఁగులఁ గూడి చల్లు లాడు బగ్గుండి పొడులన నలరి యపుడు చదలఁ గొదలేక సంజ కెంజాయ లమరె | 13 |
| తే. | పగలు సేయుచు వేఁడిమి మిగుల జగముఁ గ్రాఁచు జమునబ్బ మున్నీటఁ గలిసె ననియొ తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపుఁ గని సయింపక తమ్మి మొగంబు మొగిచె | 14 |
| తే. | చలివెలుఁగు రాకఁ గని తమ సామియైన వేఁడి వేలుపు నీట బల్విడినిఁ ద్రోచెఁ గడయను గయాళి యనియొ జక్కవలు వెన్ను నడుగు పట్టుక మొఱసేయఁ దొడఁగె నపుడు | 15 |
| తే. | నెలయు రే జవరాలి బెండిలికి నెదురు నెడలఁ దఱియను కమ్మరి కడ యనంగఁ గ్రాలు బిరుసులు నెఱపినఁ బూలుఁ బొగయు నెగసెనన మింట రిక్కలు నిరులుఁ బర్వె | 16 |
| క. | పుడుఁకుల కొఱ కప్పుడు గడు విడిముడి యుడుకొని కడింది వేడబములతో వడివడి వెలవెలఁదుల వెం బడి నడతెంచిరి పొరిఁబొరిఁ బ్రాయపు బొజుఁగుల్ | 17 |
| తే. | పొసఁగ రే యింతి వెన్నెల పులుఁగు గములఁ బెనుపుటకు మేఁత నించి యుంచిన వెడంద కుందనపుఁ బళ్ళెరంబన గొఱలి యపుడు కలువల యనుంగు దూర్పు గుబ్బలిని బొడమె | 18 |
| తే. | కన్ను దలమానికము బండికల్లు జగిలు గాఁడునై యొప్పి మిక్కిలి కంటివేల్పు నలరఁజేయు వలంతి యగ్గలఁపుఁ జల్లఁ దనము నెఱపుచు నంతకంతకు వెలింగె | 19 |
| సీ. | వేల్పుటేనికలయ్యెఁ బోల్ప నేనుఁగు లెల్లఁ గొండలన్నియు వెండికొండ లయ్యెఁ బలుకు చేడియ లైరి పొలఁతుక లందఱుఁ జెట్టు లన్నియుఁ బెట్టు చెట్టు లయ్యెఁ బాల సంద్రము లయ్యె నోలి నేఱ్లన్నియు నలువ బాబాలయ్యెఁ బులుఁగు లెల్లఁ బుడమి దాలుపు లయ్యెఁ బడగ దార్లన్నియు మేటి సింగము లయ్యెఁ మెకము లెల్లఁ | |
| తే. | బండు రేయెండ కన్నుల పండు వగుచుఁ బిండి చల్లిన తెఱఁగున మెండు మీఱి యొండు కడనైన నెడలేక యుండి యప్పు డండ గొనక జగంబెల్ల నిండుటయును | 20 |
| సీ. | అత్తఱిఁ గైక కచ్చఱ నీరుతిట్ట బ త్తళిక వజీరు బల్విలు దునిమిన వెరువరి నొసల బంగరు రేకు గట్టు తె ఱంగు మంధర యను ఱాఁగ పొలఁతి వలన నెఱింగి పేరలుకతో నొడయనిఁ బిలిపించి మాకు ముందెలమి తోడ నీ వొసంగెదనన్న నెఱ మెప్పు లిప్పుడు మఱచినాఁడవొ? లోన నెఱుకమాలి | |
| తే. | యకట! యిఁకనైన సరగ నా యనుఁగుఁ గొడుకు నొడయనిగఁ జేసి నీ పెద్ద కొడుకు నడవి కనుపు మనుటయు గుండియ లవిసి యాతఁ డ మ్మెలంతుకఁ జూచి యిట్లనుచుఁ బలికె | 21 |
| క. | పిఱు తివియక నా ముందఱ దెఱవా! యిప్పగిది నాడఁదెఱవా? మేల్ మేల్ కొఱమాలిన యివ్వీఱిఁడి కఱదలు నీ కెవ్వరిపుడు గఱపిరి చెపుమా? | 22 |
| క. | పలు చెట్టల గాసిలి మును గల వేల్పుల నెల్లఁగొలిచి కాంచిన కొడుకున్ బలు కానలఁ జేఱుపుమని పలికెదు నీ డెందమెంత పడుకాయె నొకో! | 23 |
| తే. | పేరుగల యింటి నెఱ రాచబిడ్డవనుచుఁ దలఁచుచుండుదు నెదఁ జాల వలపు మీఱ వాలుగంటిరో! యిపు డింత బేలవగుట కయ్యయో! యింక నిన్నేమి యనఁగఁ గలదు! | 24 |
| క. | ఆఱడిఁ బెట్టెదనని మది నాఱని చలమూని కఱకు లాడెద వకటా! నూఱిడుములు వొదవిన నిఁక గాఱడవుల కనుపఁజాలగద యిక్కొడుకున్ | 25 |
| తే. | చాన! నీ పట్టిఁ బుడమికి ఱేనిఁ జేయఁ గోరె దా రాగవుఁడును నీ కొడుకు గాఁడె? నేర్పెఱుంగక కటకటా! నేతి కొఱకు వెన్నపై నగ్గి సందెడు వ్రేయఁ జనునె? | 26 |
| క. | కోరుకొను మింక నీకుం గోరిన మెప్పులకు నిడుదుఁ గోరగ మేల్బం గారును రతనపుఁ దొడవులు వారువములు మొదలుగాఁగ వలసిన వెల్లన్ | 27 |
| చ. | పొసఁగని మాట వల్కి మదిఁబూనిన కర్జము కాకయున్నచోఁ గసరుచుఁ దొంటి కూరుములు గైకొన నొల్లక సారెసారెకున్ దొసఁగులఁ బెట్టుచున్ జలముతో మగలం దెగనాడి యద్దిఱా! యుసురులు గొందు రాగడపు టోజ గయాళులుగా వెలందుకల్ | 28 |
| ఆ. | అనిన నులికి కలికి యహహ! లోఁ గన రింత చిలుక నలుకఁ జులుకఁ బలుకఁ దగునె నేలఱేఁడ! తప్ప నేల యాడిన మాట నిలుపుకొనుము మదిని నిక్కమూని | 29 |
| ఆ. | ఇవము సూడు కొలపు టేలిక ల్మున్నెందుఁ గాఱు లాడిరనిన కత యెఱుంగ మకట! నీ కతమున నరుదుగా నిపుడేమొ వినని కనని దొడ్డ వింత పుట్టె | 30 |
| తే. | ఆడి తప్పక కొమరుని నాలి నమ్మి మాలనికి లెంకయై కొల్చి మాట నిల్పు కొన్న మీ వంగడపుఁ బెద్ద యున్నవాఁడె! యతని పేరెన్నఁటికిఁ బోవదయ్యెఁ గాక | 31 |
| క. | కొఱఁతవడుఁ దొంటి నోములు దఱుగు న్మఱి బ్రతుకు నేండ్లు తలఁగును సిరి ద బ్బరకాండ్ర కట్లగుట నె త్తఱినైన హుళక్కి పలుకఁ దలఁపరు ప్రోడల్ | 32 |
| క. | పొలఁతుకలు ఱాఁగ లనుచుం బలికెదు దబ్బఱల కెల్లఁ బట్టగు నెకిమీ డుల నెద నమ్మఁగ వచ్చునె? కలలోపలనైన నెఱుకగల వలఁతులకున్ | 33 |
| ఉ. | చల్లని బెల్లి మాటల పస న్మస కొల్పుచు నెల్లవారలన్ మెల్లనఁ జేరఁదీసి తుదిమేర యొకింతయు లేక యూరకే కొల్లగ రొక్క మెల్లఁ గయికొందురు నిక్కము డించి చెల్లఁబో! కల్లల కెల్ల నిల్కడలు గారె కనుంగొన నేల ప్రోపరుల్ | 34 |
| తే. | వినుము రాయఁడ! పలుకులు వేయునేల? జాగు సేయక కోరికల్ సాఁగఁజేయు మట్లు గాదేనిఁ గ్రన్నన నరుగు మవలఁ జేయు పని యింక నీవె చూచెదవు గాక | 35 |
| ఆ. | అనుచు నప్పొలంతి యాగడంబున నాడ నాలకించి యొడయఁ డలుకఁ బూని యిట్టు లట్టు లనుచు నేమియు మాఱాడ నోడి వంత నూఱకుండె నంత | 36 |
| క. | చలి వెలుఁగు గలియుచో రే వెలఁదుక నెఱి గొప్పువలన వెస జాఱిన చెం గలువ విరినాఁగఁ దగి చు క్కల తెఱువున వేగుచుక్క కనుగొన నయ్యెన్ | 37 |
| ఉ. | మాటి మాటికిం జలము మానక జక్కవ పెంట్లఁదమ్మిలే జోటుల నేఁప దా జగము చుట్టము డాయఁగ వచ్చె నింక నీ యాటలు డించి వే జరుగుమంచును వెన్నెల ఱేని కేర్పడం జాటె ననంగఁ గూఁత లిడఁ జాఁగెఁ దుటారపు టజ్జవాల్గముల్ | 38 |
| తే. | ప్రొద్దు నరదంబు గడపు బల్పులుఁగు ఱేఁడు దమ్మి పూబోఁడి కేలిక దరలి వచ్చు తెఱఁ గెఱింగింపఁ దనవారిఁ దివిరి పనిచె ననఁగ బులుఁగులు గడలఁ గూయంగఁ దొడఁగె | 39 |
| తే. | చివురు చెలికాని చెయ్వుల సేదగొన్న యన్ను మిన్నల సిబ్బెంపుఁ జన్నుఁగవల నలముకొనియున్న చెమ్మట లార్చుకొనుచుఁ బొలిచె వలినాలి పయ్యెర బోద లపుడు | 40 |
| ఆ. | తొగల యెదురు చుక్క ముగురు వేల్పుల యిక్క జగము విందు తమ్మి ముగుద పొందు కాఁడు వేఁడివేల్పు గాముల యెకిమీఁడు దూర్పు కొండమీదఁ దోఁచె నంత | 41 |
| తే. | నిడుద త్రాళ్ళూని బయల నెప్పుడు దిరుగుచుఁ బొసఁగ ముప్పొద్దు మువ్వేసములఁ జెలఁగుచు వెలుఁగు లెల్లెడఁ గాంచుచు నలరు నిర్ల వేఁటకాఁ డప్పు డెంతయుఁ దేట మీఱె | 42 |
| మ. | తొగసూఁ డల్గినఁ దమ్మి ముద్దియకుఁ జేతుల్సాఁచి నిద్దంపు మే ల్జిగి గన్పట్టు మడుంగు దువ్వలువ లిచ్చెన్ గూర్మి నా నంచ జా ల్దిగియె న్నిండు గొలంకు క్రేవలకు బత్తిం బొంగి యచ్చాన యా జగవేల్పుం గొనియాడె నా మొఱసె నిచ్చం దేంట్లు నెత్తమ్ములన్ | 43 |
| ఆ. | అప్పు డదను చెయ్వు లలరించి సత్తి య బ్బయు సుమంత్రుఁ డనఁగఁ బరఁగు ప్రెగ్గ డయును మేల్పనికిఁ గడంగి కూరుపఁదగు సరకు లెల్ల సంతసమునఁ గూర్చి | 44 |
| క. | పుడమి చెలి పట్టి నల్లునిఁ గడు వేడుక తోడఁ గ్రొత్తగా సింగారం బడరించి యెల్లఁ బెద్దలఁ దడయక రావించి వాయిదములు సెలంగన్ | 45 |
| తే. | అలరఁ బుట్టువు లేనివాఁ డనెడు పేరఁ గ్రాలు నొడయని కొడుకు చెంగటికిఁ బోయి ఱేఁడ! వేంచేయు మిపుడు నెఱిని జెలంగి నీ యనుఁగుఁ బట్టి దొరనుగాఁ జేయవలయు | 46 |
| క. | మూరుతము డాసె నిదిగో! బారులు కట్టుకొని మేలిపని కన్గొనఁగా గోరి పజ లెల్ల నున్నా రో రాయఁడ! జాగుసేయు టొప్పునె యిటులన్? | 47 |
| తే. | అనిన నేమియు నన నోడి యాతఁ డూర కున్నచోఁ గైక వారల నోలిఁ జూచి పలికె వినుఁడిది మీ రాయఁ డెలమిఁ దొంటి మెప్పునకు నేల యెల్ల మా కిప్పు డొసఁగె | 48 |
| క. | మోమోటమిచే మీతో నేమియు నన నోపఁడీతఁ డిప్పుడు మీ రా రామునిఁ గానల కనుపుఁడు సేమంబునఁ బుడమి ఱేనిఁ జేయుఁడు భరతున్ | 49 |
| చ. | అనుటయు వారు దల్లడిలి యద్దిఱ! కర్జము దప్పె నిప్పు డి చ్చెనఁటి పొలంతి పల్కు లఱసేయక కైకొని ఱేఁడు బేలయై పనిఁ జెఱుపం దలంచెఁ జెలి పట్టిన పట్టు మరల్ప నింక నె ట్లనువగు నంచు గాసిలుచు నాపెఁ గనుంగొని పల్కి రిమ్ముగన్ | 50 |
| క. | కటకట! యో ముద్దియ! నీ కిటువలెఁ బెఱతలఁపు పూని యెకిమీని గలం చుట దగునె? గరితలకుఁ బెని మిటి పలు కరయంగఁ బ్రాఁత మినుకండ్రుఁ గదా! | 51 |
| క. | పున్నియపుఁ జేడియల కత లెన్నఁడుఁ బొత్తములఁ బెద్ద లెఱిఁగింపఁగ మున్ విన్నావొ లేదొ? పెనిమిటి కన్నం దెఱవలకు వేఱె కలరే వేల్పుల్! | 52 |
| క. | వగవఁ బనిలేదు లేమికి మొగి నైదువత్రాడు పదిలముగ నెపుడు మెడం దగులుకొని యున్నఁజాలు న్మగఁడే కద తొడవులెల్ల మగువల కెందున్ | 53 |
| తే. | వలవ దెన్నఁడు నీళ్ళలోపల మునుంగఁ బలు తెఱంగుల నుప్పిళుల్ సలుపవలదు పున్నియపు నేలలకు నిచ్చఁ బోవ వలవ దెపుడుఁ బెనిమిటిపై బత్తి యెసఁగు చెలికి | 54 |
| క. | కావున నొడయని కంగదఁ గావింపక తలఁచుకొన్న కర్జం బెల్లన్ ఠీవిన్ గొనసాగింపుము పూవుంబోఁడిరొ! చలంబుఁ బూనక యెలమిన్ | 55 |
| క. | ఆ పొల మేపరి సూ డిపు డీ పుడమికి రాయఁడగుచు నెసఁగిన యెడలన్ నీ పట్టియు దొరగాఁడే? చూపోపక కీడుఁ దలఁపఁ జొప్పడునె మదిన్? | 56 |
| ఆ. | అనిన నలికి కలికి యహహ! మేల్మీమాట లీఁటె లగుచుఁ జెవుల నాటుకొనియె నింకఁ గాని కఱద లేమియుఁ దెల్పక చనుఁ డటన్న బిగువు సడలి వారు | 57 |
| తే. | వెల్లనైయున్న నత్తెఱంగెల్ల నెఱిఁగి రాచచిన్నెలు సడలించి రఘువు కొలపు సామి వెలినారచీరలు జడలు దాల్చి తపసి రూపూని యచటికిఁ దరలి వచ్చి | 58 |
| క. | పినతల్లిం బొడఁగని క మ్మని పలుకుల నిట్టులనియె మము నేదఁగ నో పినతల్లీ! నీ డెందం బున నటువలె లాఁతితనము బూఁనఁగ జనునే? | 59 |
| క. | ఓ యమ్మ! యిట్టు లఱమఱ సేయంగా నేల? నీవు సెప్పిన చెయ్వు ల్ద్రోయంగా నేర్తుమె? యిఁక నీ యానతిఁ గడవఁ బోము నీ యాన సుమీ! | 60 |
| తే. | ఒనరఁ దలిదండ్రు లెలమితోఁ బనుపుదురఁట తోడఁబుట్టువు పుడమికి దొరయగునఁట పున్నియఁపు నేల లొగిఁ గాంచఁ బోవుటయఁట మెలఁత! మఱి యింతకంటెను మేలు గలదె? | 61 |
| క. | తలఁపఁగ జగమునఁ గల వే ల్పులు సంగడికాండ్రుఁ జుట్టములు మఱి సెప్పం గలవార లెందఱేనియుఁ దలిదండ్రుల కెన యొనర్పఁ దగుదురె యెందున్ | 62 |
| తే. | అట్లు గావున యిపుడు మీ యాన బత్తి దవిలి యొనరింతునని యటఁదరలి తనదు తల్లి కడకేఁగి యత్తెఱంగెల్లఁ దెలిపి యడుగులకు మ్రొక్కుటయు నాతి యతనిఁ జూచి | 63 |
| క. | కటకట! బిడ్డఁడ! కోరిక లటమటలై చనియె నిప్పు డద్దిఱ తా నొ క్కటిఁ దలఁచిన దయ్యం బొ క్కటిఁ దలఁచు నఁటన్నమాట కడు బెడఁగగుచున్ | 64 |
| క. | పుడమిఁ దన కన్న కొడుకున కడుగుకొనియెఁ గాక కైక యహహ! నినుం గా ఱడవులకుఁ బనుపు మనుచున్ నుడువఁగ నెప్పగిదిఁ దనకు నోరాడెనొకో! | 65 |
| తే. | సవతితన మూని యిట్టు లయ్యువిద పలుక నటులె తానును డెందంబు దిటము పఱచు కొని యయో! నినుఁ గానల కనుపు కొనఁగ దండ్రి యేచందమున నఱఁ దలఁచెఁ జెపుమ! | 66 |
| క. | అజ్జోటియు నొడయఁడు నీ పజ్జం గనికరము మాలి పనిగొల్పినచో నిజ్జాడ మీకుఁ దగదని యొజ్జయుఁ బ్రగ్గడలు నాడకుండిరె వారిన్? | 67 |
| క. | గడియయ యేఁడగు మును నినుఁ బొడఁగానక యున్న యెడలఁ బొలుపరి నీ వి ట్లెడబాసి దవ్వు చనుచోఁ గొడుకా! యిఁకనెట్లు తాళుకొనఁగలఁ జెపుమా? | 68 |
| తే. | అనుచు నడలెడు తల్లి నూరార్చి యంప దొనలు విల్లును గైకొని చనఁదలంచు నెడల నడ్డంబుగా వచ్చి పుడమి కాన్పు వలపు గులుకంగ మెల్లనఁ బలికె నపుడు | 69 |
| ఆ. | ఎమ్మెకాఁడ! యగ్గి యెలగాఁగఁ బెండిలి యైన చెలిని డించి యకట యొంటి నేఁగఁదగునె? మీర లెఱుఁగని నడవడు లింకఁ బుడమిఁ గలవె యేర్పరింప? | 70 |
| తే. | మేలుగలనాఁడు మురియుచు మెసవ నేర్చి గొడవ లొదవెడు తఱిఁ బోవ విడువఁ దగునె? తలఁప నుసురుల యొడయఁడై తనరు మగని వెర వెఱింగిన నాడెంపు వెలఁదుకలకు | 71 |
| ఉ. | ఉడుగక బుత్తి, ముత్తులిడ నోపి యొడళ్ళఱలేక యుండఁగాఁ గడు నెదలోఁ దలంచుకొని గాటపు మక్కువఁ బ్రోదిసేయు న య్యొడయనిఁ బాసి యాగడపు టోజలఁ ద్రిమ్మరునట్టి గట్టి వా పడఁతుక యెయ్యడం దలకుఁబాసిన వెండ్రుకగాదె యెన్నఁగన్ | 72 |
| ఆ. | మగనితోడ నెలమిఁ దగిలి ముత్తయిదువ పోణిమిని గరంబు రాణఁ బొసగు చున్న నాఁడె కాక యన్నుల కటమీఁద నెన్నఁడైన నెమ్మి యింత కలదె? | 73 |
| ఆ. | అట్టులగుటఁజేసి యరగడియయుఁ దాళఁ జాల నిన్నుఁ బాసి నేలఱేఁడ! మాఱుమాట లుడిగి కాఱియఁ బెట్టక తోడుకొని కడంకతోడఁ జనుము | 74 |
| క. | అనవుడు నబ్బల్లిదుఁ డా ననబోఁడుల మిన్నఁ జూచి నగి యిట్లనియెన్ బెను గానలఁబడి చెలులకుఁ జనఁ జనునే వెఱపుమాలి చక్కెరబొమ్మా? | 75 |
| క. | నగువారి నెల్లఁ దలఁపక మగువా! మగవారి వెంట మచ్చికతో రాఁ దగవా? పగవాఁడనె నినుఁ దిగనాడి చనంగా లాఁతి తెఱఁగెన్నుదురే? | 76 |
| సీ. | చెలిమితో నాడంగ జింక కూనలు గావు గద్దఱి కొదమ సింగములు గాని కులుకుచుఁ బలికింపఁ జిలుక బారులు గావు దుగ మొగంబుల పుల్గు తెగలు గాని వలపుతోఁ బెనుప జవాది పిల్లులు గావు బలితంపుఁ బొగరు బెబ్బులులు గాని కయిసేయఁ బువ్వు దీవియ పందిరులు గావు పొదలు జొంపపుఁ గాఱుపొగలు గాని | |
| తే. | గొండ్లి సలుపంగ ననుఁగుఁ బూబోండ్లు గారు తులువ పొలయోగిరపు పొలంతుకలు కాని గోల లెచ్చట? గాటంపుఁ గోన లెచట? వలవ దుడుగుము పయనంబుఁ దలిరుబోడి! | 77 |
| క. | వల నొదవని పని యగుటం బలికితి రావలవదనుచుఁ బరికింపఁగ నో యెలదీవఁబోఁడి! నిన్నుం గలలోపలనైనఁ బాయఁగలనే? చెపుమా! | 78 |
| క. | అని యిట్టు లెన్ని సెప్పిన విన నొల్లక కలువకంటి వెగటొదవఁగఁ బ ల్కినఁ దలఁకుచు వెంటం దో డ్కొని చనుటకు నాతఁ డియ్యకొని యుండుటయున్ | 79 |
| తే. | అత్తలకు మ్రొక్కి వారల యనుమతిఁ గొని జానొదవఁ జెల్మిబోఁటులఁ జాలఁ గూర్మి తోడఁ గవుఁగిటఁ బెనఁచి యా తొడవు తొడవు నెమ్మిఁ బెనిమిటి దరిఁ జేరి నిలుచు నెడను | 80 |
| క. | లక్కుమనుఁడు సింగాణియు నక్కజపుం దొనలు బూని యరుదెంచి కడున్ మ్రొక్కులిడియున్న నాతని మక్కువ కెదలోన నలరి మఱి యప్పిదపన్ | 81 |
| తే. | తమ్ముఁడును గేస్తురాలును దాను నగరు వెడలి యమ్మేటి దమ వీటి నడిమిత్రోవఁ జనుచు నుండెడిచోఁ గనుంగొనుచునుండి యెల్లవారలు దమలోన నిట్టు లనిరి | 82 |
| క. | ఇట్టి నిగారపు గొనముల తిట్టలఁ గనికరము మాని తెంపొదవంగాఁ గట్టడవులకుం బనుపఁగఁ గట్టా! యిమ్ముదుకఁ డెంత కట్టిఁడి చెపుమా? | 83 |
| క. | తడవేఁడు లయ్యెఁ దనకుం గొడుకులు లేరనుచు ముందుఁ గుందుచు నెన్నో పడరాని పాట్లు పడి యిపు డడవులకుం ద్రోచుకొనుట యరుదై తోఁచున్ | 84 |
| క. | తప్పక యాడుది గోరిన మెప్పులకై వెడఁగుదనము మీఱఁగ నిటు లీ యొప్పుల కుప్పల విడుచుట ముప్పందఱి నితనికేమొ ముది మది తప్పెన్ | 85 |
| ఆ. | ఆలి మాటకొఱకు బేలయై కోడలిఁ గొడుకుఁ బోవఁ ద్రోచుకొనియె నితని కేటి మగతనం బిసీ! కడుఁగొదలేని ఱట్టు వొందె నింక ఱంతు లేల? | 86 |
| తే. | అనుచుఁ గలగుచు నెల్లరు నాడుకొనఁగ బ్రోల్వెడలి వార లొయ్యనఁ బోవుచుండి రా తెఱంగెల్ల నాలించి యపుడు చాల్పు టరదములదొర దద్దయు నడలుకొనుచు | 87 |
| శా. | ఏఁడీ? నా బలుమానికంబుల కొటారేఁడీ? జగా వన్నెకాఁ డేఁడీ? రక్కసి నీరుదాలుపుల గాడ్పేఁడీ? జగంబేలు ఱే డేఁడీ? పేదలపాలి వేలుపుల చెట్టేఁడీ? నిరాబార్ల మే లేఁడీ? వేఁడి వెలుంగు వంగడపు రేవెల్గంచు బిట్టేడ్చుచున్ | 88 |
| ఉ. | రా! యనుఁగా యనున్ దొగలరాయనిఁ గేరు నిగారపుం గుడా రా! యను మేటి నాడెపు దొరా! యనుఁ గిన్క యొనర్చెదేమి మే రా! యను నింద నీకుఁ గనరా! యను దయ్యము పాడిఁదప్పె నౌ రా! యను గన్నవారు నగరా! యను నిప్పని మానురా! యనున్ | 89 |
| ఉ. | కా! యను మేటి తప్పు కొడుకా! యను నిద్దపుఁ బూతమావి మో కా! యనుఁ బంజరంపుఁ జిలుకా! యను నబ్రపు సోయగంపుఁ బ్రో కా! యనుఁ బల్కవేమి యలుకా! యనుఁ బంతము దీఱె నోటు కై కా! యను నేర యిట్లు దుడుకా యనుఁ బాయఁగఁ గోరికా యనున్ | 90 |
| క. | అప్పా! విప్పారెడు నగ వొప్పారఁగఁ జూచి పలుకకున్నాఁడ వదే చొప్పా! తప్పా! బంగరు కుప్పా! యిప్పాటి నింత కొఱకొఱ మెప్పా! | 91 |
| క. | ఉడుకా విడకున్నది మది పడుకా మిడుకంగ నుఱక పఱవం జనునే? కొడుకా! నడు కానల కిటు దుడుకా? నాపాలి పుడుకుఁ దొడుకా! నీకున్ | 92 |
| తే. | తండ్రి నైనట్టి నా యాన దాఁటలేక కడిఁది కాణాచి రాసిరి యెడలఁజేసి హాళిఁ గానల కరిగిన యందగాఁడ! తలర నిన్గాంచకేఁ దాళఁగలనె యింక? | 93 |
| క. | కైకా! నీపూనిన పని కై కా కై కందినట్టి యనుఁగుం గొడు కి ట్లై కానల కేఁగెడు నిఁక నే కడ నీవంటి తులువ లేరీ పుడమిన్? | 94 |
| క. | నెయ్యపుఁ గొడుకుల నిటు లెడ సెయ్యంగా మిగులఁ జలముఁ సేకొనియెను నేఁ డయ్యయొ! యా కట్టిఁడి బ ల్దయ్యంబున కేమి యెగ్గుఁ దలఁచితినొ సుమీ! | 95 |
| తే. | అంగదలకోర్చి సిరులపై నాస వదలి గరితతనమెల్ల జగములఁ గనఁబడంగ మగని వెనువెంట నడవికిఁ దగిలి చనితె తొడరి మముఁ జూడ రోసి యో పుడమికాన్ప! | 96 |
| తే. | కోడలా! యింక బంగరు కోట లేల? మేడ లేఁటికి? రతనంపు వాడ లేల? మాడ లేఁటికి? పలు రాచజాడ లేల? వాడలో నీవు ద్రిమ్మర నోడి చనిన | 97 |
| తే. | మక్కువల యిమ్మ! వలఱేని మానికమ్మ! పసిఁడి కీల్బొమ్మ! జగముల పట్టుఁగొమ్మ! పొగడ పూరెమ్మ! వలపుఁ గప్పురపు దిమ్మ! కాన వేలమ్మ! యో నేలకాన్పుఁ గొమ్మ! | 98 |
| తే. | అనుచుఁ గడలేని మక్కువ నఱచి యఱచి సైఁపఁ జాలక యా రాచ చలివెలుంగు నేలఁబడి సొమ్మవోయి జేజేల ప్రోలి కేఁగె నట రాముడును ద్రోవ నేఁగి యేఁగి | 99 |
| క. | సుడివాలు దాల్పు నడుగునఁ బొడమిన పెన్ వెల్లి దరిసి పొందఁగ న క్కడ గుహుఁడనియెడు చెంచుల యొడయనిఁ బొడఁగాంచి వాని యొద్దికవలనన్ | 100 |
| ఆ. | ఓడ యెక్కి వైళ మొప్పార నయ్యేటి ఱేవు దాఁటి చెంచు ఱేని నచట మిక్కుటంపు నెనరు నెక్కొన వీడ్కొని మువురుఁ గడఁకతోడ నవలఁ జనుచు | 101 |
| క. | పనిమీఱ భరద్వాజుం డను దపసులమిన్న యున్న యండకుఁ జని యా యన యొసఁగెడు పూజలఁ గై కొని చయ్యనఁ జనిరి చిత్రకూటంబునకున్ | 102 |
| తే. | మలల తలకట్టు తపసుల మనికి పట్టు నాడెముల గట్టు బలు రతనముల కొట్టు రమణఁ గన్పట్టు నయ్యబ్బురంపుఁ గట్టు బిట్టెలమిఁ గూర్చె నా రాచపుట్టువులకు | 103 |
| సీ. | బలితంపు గండు రాచిలుక పల్కులఁ బిల్చి కడిఁది జక్కర నీళ్ళఁ గాళ్ళు గడిగి నిద్దంపు నెత్తంపు గద్దియల్ సవరించి వలినాలి గాడ్పు వీవనలు వైచి కపురంపు వెలిబూది గంద వొడుల్సల్లి కొమరుఁ బూఁబొద చప్పరముల నునిచి నలిమావి పండ్ల పానకముల దగమాన్చి నాడెంపు దుంప బోనములు వెట్టి | |
| తే. | క్రొత్త తలిరాకు జొంపఁపు మెత్త లొసఁగి మఱియుఁ బెక్కు తెఱంగుల నెఱి నొసంగి తెరవు బడలిక లన్నియుఁ దీర్చి వారిఁ దనిపె నెదనెన్న నమ్మన్ను తాల్పు మిన్న | 104 |
| తే. | అట్టు లమ్మెట్టుపై విడి పట్టు చేసి యుండి రంతకు మున్న యయోధ్యలోన దనరు ప్రగ్గడ లందఱుఁ దాత యింట నున్న భరతుని రప్పించి యొప్పు మీఱ | 105 |
| క. | మొదలి తెఱఁగెల్లఁ దెలిపిన నదిరిపడి యతండు మిగుల నడలొందుచు బ ల్లిదుఁడగు తన తండ్రికిఁ బెం పొదవఁగఁ బెఱ జగము చెయ్వు లొనరించి వెసన్ | 106 |
| ఆ. | మూఁక లెల్లఁ దన్ను డాకొని కొలువంగ నన్న యున్న తిప్ప కరిగి యతని యడుగుఁ దామరలకుఁ గడువడి నెరఁగి యిం పెసఁగ నవ్వలంతి యిట్టు లనియె | 107 |
| తే. | ఱేండ్లరాయడ! మిగుల గాఱియలఁ గుంది తండ్రి వేలుపుఁ బ్రోలికిఁ దరలి చనియె మీర లిటు కైక మాటకై యూరు వదలి సొరిది నడవుల కిపుడు వచ్చుటను జేసి | 108 |
| ఆ. | ముసలివాని మాట ముద్దియ మాటయు నేటు చేసి యేలు నేల వదలి కటకటా! కడింది కార్మెకంబులు గల పొలము సొరఁగఁ దగునె పొలఁతిఁ గూడి | 109 |
| క. | అన్నాతియు నొడయఁడు లటు లన్నారని నీవు కోన కరుదెంచినచో నన్నా! యన్నాడిక య న్నన్నా! యాఁగుకొనఁజాలు నట్టిదె చెపుమా? | 110 |
| క. | ఏ నినుఁ గొలుచుచు నుండెదఁ గాని యికం బుడమి యేలఁగా నొల్లను నీ యాన యని మ్రొక్కుటయు న మ్మానిసి ఱేఁడపుడు దండ్రి మడియుట కెదలోన్ | 111 |
| ఆ. | కలఁక మీఱ మిగులఁ గన్నీరు నించుచుఁ గొంత దడవు నొగిలి యంతఁ జతన మొనర నువులు నీళ్ళు నోరెంపుఁ గళ్ళును మొదలు గలుగు చెయ్వు లదనఁ జేసి | 112 |
| క. | అక్కైక కొడుకుఁ గనుఁగొని మక్కువతోఁ బలికె నీవు మగుడన్ మూఁకల్ క్రిక్కిరిసి రాఁగ బ్రోలికిఁ గ్రక్కునఁ జని నేలయేలు కనికర మెసగన్ | 113 |
| తే. | తండ్రి యానతి యింతయు దాఁటఁబోల దడవిఁ బదునాలుఁగేఁడులుఁ గడిపి వత్తుఁ బదిలముగ నుండుమని తన పావ లొసఁగి సెలవుఁ బెట్టిన నతఁ డెద నలరి యపుడు | 114 |
| ఆ. | దండుతోడఁ గూడి తరలి గొబ్బునఁ దమ నేల కరిగి మొదలి ప్రోలు సొరక మిత్తి వేటకాని తత్తడి యూర నిం పెసఁగ నిలిచి పజల నేలుచుండె | 115 |
| క. | అని నెనరొదవఁగ నిటుల య్యని యోరెపు దిండి దాసరయ్య దెలిపినన్ విని బొఱియచూలి యెదలోఁ దనివి సనక యవలి కతయుఁ దమి నడుగుటయున్ | 116 |
| చ. | కదలని తేరు తేఱుఁ గడ కానక పూనెడు నారి నారి పైఁ బొదలెడు తూపు తూపు నెఱిఁ బ్రోచిన మావులు మావు తిట్టకుం గుదురగు తేరు పూన్పరియు గోమునఁ గ్రాలఁగ గట్టి దీటుచే యెదిరిచి మూఁడు ప్రోళ్ళఁ దెగ నేసిన గద్దఱి వేల్పురాయడా! | 117 |
| క. | తల యేఱుఁ జిలువ పేరును బొలుపారు కడింది సౌరు బూచులబారున్ మలయూరుఁ బుడమి తేరును గలిగిన నెఱవేల్ప! మొనల కైదువతాల్పా! | 118 |
| మణిగణనికరము | కలువలదొర కొఱగల తలవిరిగా వలిమల లలి నిలువఁ గడఁగు బసగాఁ గలుముల చెలువ మగఁడు గడుఁ జెలిగా మలయుచు జగముల మనుచు నొడయఁడా! | 119 |
| గద్యము | ఇది శ్రీమదుమారమణ కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర పవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబయిన యచ్చతెలుఁగురామాయణ మనుమహాకావ్యమం దయోధ్యాకాండము సర్వ మేకాశ్వాసము. |