| ఇతిహాసములు | అచ్చతెలుఁగు రామాయణము | బాలకాండము |
| తే. | అప్పనంబుగ నా నేర్చున ట్లొనర్పఁ గడఁగు నిప్పున్నియపు బలు కబ్బమునకుఁ గత తెఱంగెట్టులన్న ము న్గలను దిండి తపసిఁ గని కల్గు కానుపు తపసి పలికె | 1 |
| సీ. | జడదారిరాయ! యిజ్జగమున నాడెంపు గొనమును వాఁడియుఁ గనికరమును నిక్కువపుం బల్కుఁ జక్కఁదనంబును దెలివియుఁ జాగంబుఁ దేజుఁ బెంపు గలిమియు బలిమియుఁ గడిఁది నిచ్చలమును గొలమును దిటమును వలఁతితనము మేలిమియును నెల్ల మెయిదాల్పు పిండుల యెడ నెయ్యమును జాల నేడ్తెఱయును | |
| తే. | గలుగు మానిసి యెవ్వఁడు గలఁడు వాని కత వెడం దగ నా కెఱుఁగంగఁ బల్క వలయునని వేఁడుకొనిన నన్నలువ పట్టి చిలువ పట్టునఁ బుట్టిన బలియుఁ గాంచి | 2 |
| తే. | పెను తపసిఱేఁడ! నీ వడిగిన తెఱఁగునఁ దనరు మానిసిఱేని చందంబు నీకు దెలియ నెఱిఁగింతు నిఁకఁ బెఱతలఁపు మాని వినుము మేల్బంతినని యిట్టులనుచుఁ బలికె | 3 |
| క. | ఉడివోని సిరుల కిరవై యడరుచు నిరునాల్గు కడల నరుదుగ నెల్ల ప్పుడుఁ గడుఁ బొగడంగాఁ దగి పుడమిపయి నయోధ్య యనఁగ బ్రోల్వెలుఁగొందున్ | 4 |
| తే. | లలి నిరాబారులే యుండు నలువ ప్రోలు బలిసి విసదారులుండు పెంజిలువ ప్రోలు కూడు నిదురయు నెపుడుఁ జేకూఱకుండు వేలుపుల ప్రోలు నమ్మేటి వీటి కెనయె? | 5 |
| తే. | పుడమి నెన్నికగా ముత్తి నిడఁగ జాలి పొదలు సతప్రోళ్ళయందును మొదలి దగుచు నొరుల కేరికి గెలువ రాకుండినట్టి కడిఁది పేర్మోచి యా ప్రోలు కరము మెఱయు | 6 |
| సీ. | పెనురాచ ముంగిళ్ళఁ బెంపుడు తోఁటల మావులు మావులు ప్రోవు మీఱ నాడెంపుఁ గోటల నాగవాసమ్ముల గొమ్మలుఁ గొమ్మలు గొనబుఁ జూప గరితల ఱొమ్ముల గడితంపు గోడలఁ బట్లును బట్లును బసఁ బొసంగ దొడ్డి పట్టుల దొడ్డ దొరసానుల యొడళ్ళ సొమ్ములు సొమ్ములు సొంపు నెఱప | |
| తే. | నంగడులఁ జేలఁ దద్దయు రంగెసంగి ముత్తెసరులును బరువంపు ముత్తెసరులు వరలఁ దరలని సిరులఁ బల్మఱును మొఱసి వీఁడలరు వేల్పురానెల వీడు గాఁగ | 7 |
| సీ. | మేడలా రతనంపు గోడలా యపరంజి బేడలా యే వాడఁ బెంపెసంగు మావులా బలితంపు టావులా చెంగల్వ బావులా యే క్రేవఁ బసఁ దనర్చుఁ గోటలా తుదిలేని పేటలా నెఱి యాట పాటలా యెచ్చోట నీటుఁ జూపు నట్టులా మగఱాల గట్టులా పచ్చ ఱా కట్టులా యే పట్ల బిట్టు మెఱయుఁ | |
| తే. | దేరులా కొమ్ముటేనుఁగు బారులా ప సారులా చొక్కటపు రాచదారులా కొ టారులా పైరులా గొనబారు నౌర! ప్రోలి యొయ్యార మేరికిఁ బొగడ నరిది | 8 |
| మ. | అలరుం బున్నమ రేలు మేల్హొయలుచే నవ్వీటి గాటంపు క్రొ న్నెల ఱా మేడల నాడు చేడియలు పూన్కిం జెంతఁ గన్పట్టు వే ల్పుల బువ్వం దెలి నిల్వుటద్దమని కేలుందమ్ములం బట్ట ని మ్ములఁ గందందెనుగాక యందుఁ గలదే మున్నిఱ్ఱియు న్మఱ్ఱియున్ | 9 |
| తే. | పూని యా ప్రోలి మేలి కడాని కోట వాసియు నగడ్త లోతును వలను మీఱఁ జూడఁ జెప్పఁగ నరిదియౌఁ జుమ్ము వేయు కన్నులును నోళ్ళుగల నేర్పుకాండ్రకైన | 10 |
| ఉ. | అందలి కత్తలాని గమి నందఁగ గాడుపు తట్టువాలు వే పందెము వైచి పర్వులిడు పట్టున నోడియ కాదె లేళ్ళు బ ల్గొందలమంది పూరిఁ దినుకొంచును రిత్తయ జంకి చూచుచుం బందతనంబు మీరఁ గడుఁ బాఱఁ దొడంగెను నాఁటనుండియున్ | 11 |
| క. | కడలేని వ్రేగు మోచుచుఁ గడగండ్లం బడియెఁగాక కడ యేనుఁగు లి ట్లొడయల బ్రతికించునె యె య్యెడలనునని కేరుఁ బ్రోలి యేనుఁగు గున్నల్ | 12 |
| చ. | పలుకు వెలందికిన్ మనికిపట్టగు చాలుపు మోము దామర ల్గలిగియుఁ బ్రాఁత పల్కులు చొకాటముగా నుడువంగ నేరకే తల దెగ వ్రేటులం బడియెఁ దానొక నేరుపుకాడె యంచు న న్నలువను మాటిమాటికిని నవ్వుదు రచ్చటి నేలవేలుపుల్ | 13 |
| తే. | కఱకుఁ జూపక వ్రంతలు గనక నెత్త ములఁ బొరలు పెనుబాముల మొగి నలుగక వేల్పుదొరకైన వెఱవక వెలయు నచటి పుడమి దాలుపు గమి హెచ్చు పొగడ నరిది | 14 |
| తే. | ముత్తియంబులు బగడముల్ మొదలు గలుగు మానికములకు సిరికిని మనికి యగుచుఁ గొలుచు రొక్కంబుఁ గలుములుఁ జెలఁగ నుండుఁ గడిఁది కోమటి రతనంపు గనులు వీట | 15 |
| క. | నిలుతురు నిక్కము తోడుగఁ గొలుతురు తగ జన్నిగట్లఁ గొంకక పగఱం గెలుతురు బలితపుఁ గలుములఁ బొలుతురు నెఱి నచటి యడుగుపుట్టువు పెద్దల్ | 16 |
| తే. | తేజు గలవారి నెందును దినుసు లేని ఠీవి గలవారిఁ గూడియుండియు నొకింత వంకయును మచ్చయును గలవారిఁ దెగడి యాటవెలఁదుల గమి వొల్చు వీట నెపుడు | 17 |
| తే. | అట్టి ప్రోలికి నేలికయగుచు నెల్ల నేలఱేఁడులు తను మేలు మేలటంచుఁ బొగడ మగుడని కలుముల నెగడి ప్రజలఁ దద్దయును సాఁకుకొనుచుండు దశరథుండు | 18 |
| సీ. | పిఱికితనంబును గుఱిదప్పి చనుటయు వెఱపును మఱుపును గొఱకొఱయును గఱకును బేదల నఱముటయును బెఱ తెఱవలపయిఁ జూడ్కి వఱపుటయును ముఱిచెడి దురమున విఱుగుటయును వీఁగి పిఱుఁదఁ జేరినవారిఁ జెఱచుటయును దెఱపి చూపక మ్రోల గిఱికొని విద్దెలఁ గొఱలు వారల రిత్త మొఱఁగుటయును | |
| తే. | తఱిపనుల్ నెఱిఁ జేయక యిఱుకుటయును మఱియుఁ గొఱమాలి పెద్దల తెఱఁగరయక యఱమఱల్ చేసి యామున వఱలుటయును గొఱఁత వడుటయు నెయ్యెడ నెఱుఁగ డతఁడు | 19 |
| సీ. | తలఁజూప లేక చిప్పలు పూని వ్రంతల మెలఁగెడు తామేటి మేటి నవ్వి కుండలు దాల్చి కన్గొనల నీరొలుకఁ జే తులఁ జాపు కడ యేనుఁగులను రోసి నిలువెల్ల వెంట్రుకల్ బలసి నేలయుఁ ద్రవ్వు కొని మను తొల్బంది గున్న నెన్ని కాళ్ళుఁ జేతులు వోయి గాలిద్రావుచు మంటఁ బొరలు చిల్వల సామిఁ బోవనాడి | |
| తే. | తిండి యెన్నండు నెఱుఁగక యుండి యడుగు దరలఁగా లేని గుబ్బలి దొరలఁ దెగడి పుడమి చెలి సేరె సిరులఁ బెంపడరి యరిది తేజుఁ గాంచిన యా చాల్పు తేర్ల దొరను | 20 |
| సీ. | కఱవు గేస్తుల యిండ్లఁ గప్పు నేఁతలయంద సుడివడి కలఁగుట ల్మడుగులంద కొట్లు బేహారుల గొనబు టంగడులంద తఱచుగాఁ గొండెము ల్తలుపులంద పలు గాకి చెయువు లబ్రంపుఁ గోనలయంద పొసఁగు జివ్వలు కాఱుపోతులంద బలిమిమై నరివెట్టుటలు సింగిణులయంద వాలాయపుం గాఁక పాలయంద | |
| తే. | కాని మఱియెందు నేనియుఁ గల్గనీక నేల యేలెను దద్దయు నేర్పుమీఱ వెలుఁగురా వంగడపు పాలవెల్లి నిండు చలివెలుంగైన ఆ రాచ జడలమెకము | 21 |
| క. | ఆ కడిఁది మేలి గొనముల రా కొమరుం డాండ్రుగాఁగ రహిఁ గౌసల్యం గైకను సుమిత్రనుం దగఁ జేకొని యెనలేని నెమ్మిఁ జెలఁగుచు నుండెన్ | 22 |
| క. | అటులుండి యొక్కట న్మి క్కుటముగ నమ్మువ్వురకును గొమరులు లేకుం డుటకున్ డెందము లోపలఁ గటకటపడి ప్రెగ్గడలను గన్గొని పలికెన్ | 23 |
| క. | కొడుకులు పుట్టని మానిసి తొడుకులు బల్మియును నిండ్లుఁ దొడవులు మావుల్ పుడమియు నెక్కుడు మెకములు విడిముడియుం జుట్టములును వితగద తలఁపన్ | 24 |
| తే. | ఎన్నఁ గొమరులు కల్గక యున్నవారి నిందు నందును నెమ్మది వొంద దనుచుఁ బుడమి వేలుపుఁ బెద్దలు నుడువుచుందు రట్లగుటఁ గుఱ్ఱలిఁక నాకు నబ్బవలయు | 25 |
| ఆ. | అనుచుఁ బల్కి యొజ్జయైన వశిష్టుని బిలువఁ బనిచి యెలమిఁ దలఁపు నందు గలుగు తెఱఁగుఁ జెప్పి కర్జ మెయ్యది దీని కనిన నాతఁ డిట్టు లానతిచ్చె | 26 |
| క. | విను ఱేఁడ! నీకు బొట్టియ లొనగూడు తెఱంగు నిక్క మొదవఁ దెలిపెదన్ మును రోమపాదుఁ డనగాఁ దనరు నొడయఁ డొకఁడు పుడమిఁ దగనేలు తఱిన్ | 27 |
| సీ. | వానలు లేక నెవ్వడిఁ బైరు లన్నియు వాడఁదొడంగిన నోడి పజలు మిడుక నవ్వెండ్రుక యడుగుల దొర యెల్ల నాడెంపుఁ బాఱులఁ గూడబెట్టి నాల్గుకన్నుల వేల్పునకు వ్రేల్ము లెన్నేనిఁ జేసి మేలేమియుఁ జెందకున్న వేసరు నెడఁ బాఱు లాసామిఁ గన్గొని యొడయఁడ! విను మొక యడవిలోన | |
| తే. | దగులు కొని ఋష్యశృంగుఁడన్ ముగుద తపసి యుండు నిచ్చటి కాతని నోర్మిఁ దోడి తెచ్చి నప్పుడు వానలు దివిరి కురియు మేయిదాలుపు గమికెల్ల మేల్దనర్చు | 28 |
| క. | అని తెల్పిన నతఁ డప్పుడ పనివడి వెలయాండ్ర నేర్చి పనిచి సరగ న మ్మనుఁబోతు కొమ్ము తపసిం గొనితెచ్చి కడంకఁ దనదు కూఁతు నొసంగెన్ | 29 |
| తే. | అంత వానలు పుడమిఁ బెల్లడరఁ గురిసె వంత లెడఁబాసెఁ బజయెల్ల సంతసిల్లె దొరయుఁ బలువురు కొడుకులు బిరుదు మగలఁ గాంచి సరిలేని బల్వేడుకలఁ జెలంగె | 30 |
| క. | కావున నీవిపు డద్దొర క్రేవకుఁ జని యతనిఁ జేరి కెంజడదారిన్ దేవలయు నిచటి కాయన వే వచ్చినఁ గోర్కు లెల్ల వెస నొనగూడున్ | 31 |
| తే. | అనుచు నిటు లొజ్జ చెప్పిన యట్ల యతనిఁ దోడుకొని వచ్చి వేల్పుల దొరను దనియ బారులుగఁ బాఱులను గూర్చి వారువంపు జన్న మొనరించి యా రాచమిన్న మఱియు | 32 |
| క. | కొమరులు గలిగెడు వ్రేలిమి దమి మీఱ నొనర్చుచున్న తఱి జేజే ల్మొ త్తములై తామరచూలిం దమ ముందఱ నిల్పికొని పెనంగొను వేడ్కన్ | 33 |
| తే. | లచ్చి వొడమిన చోటికిఁ బచ్చవిల్తు నయ్య నెయ్యంపు వీటి కింపారు నేల జోటి మగమానికపు మొలత్రాటి కెన్న మేటియై మించు పాలమున్నీటి కరిగి | 34 |
| క. | అవ్వేల్పు లెల్ల మెల్లన నెవ్వగలన్నియును ద్రోచి నెమ్మది యెదల న్నివ్వటిలం గేలుగవ ల్దవ్వులనె మొగుడ్చుకొనుచుఁ దారసిలి మొగిన్ | 35 |
| సీ. | చెలువంపుఁ జిలువ రా సెజ్జఁ బండినవాని నక్కున సిరినిడి చొక్కువాని సుడివాలు, చిందంబు నడరఁ బూనినవాని జిలుఁగు పసిండి దువ్వలువవానిఁ దొలుమబ్బు చెలువంబు దొరయు నెమ్మెయివాని జగమెల్ల వలచు సోయగమువాని మొసలి వాపోఁగు లింపెసఁగఁ దాల్చినవానిఁ దొగవిందు నగు ముద్దు మొగమువాని | |
| తే. | మేలి వెలిదమ్మి రేకుల నేలఁజాలు కన్నుగవవాని వలఱేని గన్నవాని వన్నియల కెల్ల మిన్నయై యున్నవానిఁ గాంచి యిట్లని యగ్గింపఁ గడఁగిరపుడు | 36 |
| సీ. | జడదారి తలమిన్న చాలుపు నెమ్మోము విరి దామరల పూప వేఁడి వెలుఁగ! కూళ తొల్వేలుపు కూటువ గాటంపు టడవుల మేటి పయ్యర యనుంగ! కలుముల నవలా చొకాటంపు తళ్కు పి సాళి కన్గలువల చందమామ! బలితంపుఁ జేట్పాటు తొలకరి యదను క్రొ క్కార్నీరు దాలుపుగముల యీఁద! | |
| తే. | సడలువడని కడింది దొసఁగు గయాళి బోర ప్రాఁకుడు కొలముల పులుఁగు ఱేఁడ! వెక్కసపుఁ బుట్టువు తెవుళ్ళ వెజ్జురాయ! తిరముగా నిన్నుఁ గొండాడఁ దరమె మాకు? | 37 |
| క. | జగముల యెకిమీడ! నినున్ బొగడఁగ బదినూఱ్ల నోళ్ళప్రోడయుఁ బలుకుం దొగకంటియుఁ జాలనిచోఁ దగునే పెఱవార లెన్నఁదగు వారనఁగన్? | 38 |
| క. | పెను మినుకు కొనలు తెలివిం గనుగొను బల్లిదునకైనఁ గనరాని నినున్ గనుగొంటిమి మే మిప్పుడు పెను రొక్కపుఁ గుప్పఁ గన్న పేదలపగిదిన్ | 39 |
| క. | విను దేవర! మున్నెన్నడుఁ గన విననివి యబ్బురంపుఁ గడగం డ్లొదవెన్ మునుకొని నీ యడుగుంగవఁ గనుగొన వచ్చితిమి వేడ్క గడలు కొనంగన్ | 40 |
| క. | చదువుల ముదుకఁడు మొదలం బొదలించిన బలిమివలనఁ బోటరి యగుచున్ బది తలల రక్కసుల ఱేఁ డొదుగక యిమ్ముజ్జగంబు నొక్కట గెలిచెన్ | 41 |
| సీ. | కొఱయయ్యె నిదురయుఁ గూడు వేల్పులఱేని కగ్గి యాఁకట నెద్దియైన మెసవు గుదియఁ జేకొని తద్దఁ గుంటి పాఱు జముండు గుదిరె రక్కసుఁడు సోఁకుడుతనమున వలగొని నీళ్ళ క్రేవల నుండు నీళ్ళ ఱేఁ డరయ బయల్వట్టి తిరుగు గాడ్పు జక్కుల కొలములోఁ జిక్కె రొక్కపు దొర బికిరముల్గొను మినుసిక వలంతి | |
| తే. | మఱియుఁ దక్కిన వేల్పు లందఱును తమకు నెందు దెసలేక చనిరి కడింది చేవ నెసఁగు నబ్బంతి తలల రక్కసుని కతన నేమి తెల్పుదుమయ్య! నీ యెదుర నింక? | 42 |
| తే. | వేలుపుల వేల్ప! మా మొఱ లాలకించి కనికరపుఁ జూడ్కిఁ గనుఁగొని గాటమగుచు నెదలఁ బొదలెడు యళుకెల్లఁ బ్రిదిల పఱిచి సాఁకవే! కోర్కు లిఁకఁ గొనసాఁగఁ జేసి | 43 |
| క. | అని మొఱలిడు జేజేలం గనుఁగొని యగ్గడుసు గుడుసు కైదువ జో ది ట్లనియె న్మీకిఁక వగవం జన దేమియు వేల్పులార! చను డిక్కలకున్ | 44 |
| క. | అక్కూళ రక్కసుల దొరఁ జక్కాడెద నెదిరి పెక్కు చందమ్ముల న మ్ముక్కంటి వచ్చి కాచినఁ జిక్కంగా నీక మానిసితనం బెసఁగన్ | 45 |
| క. | ఇమ్ముగఁ బది తేరుల దొర కొమ్మల కే నల్దెఱఁగులఁ గూర్మిఁ బొడమెదం గ్రమ్ముకొని మీరు చెట్టుం ద్రిమ్మరులై పుట్టుఁ డరిది తేజు లెలర్పన్ | 46 |
| తే. | అనుచు ననిచిన ప్రేముడినాడ నచటు గదలి వదలని వేడ్కలఁ బొదలి వార లరిగి రిమ్ముల కిమ్ముల నంత బంతి తేర్ల దొర వ్రేల్మి నెఱిఁ గడ తేర్చియున్న | 47 |
| క. | సతనాల్కల జేజే యపు డతనికిఁ బొడకట్టి పసిఁడి హరివాణముతో డుతఁ దెచ్చి పాల యోరెం బతివలు మువ్వురకుఁ బెట్టుమని యిడి చనుడున్ | 48 |
| క. | తడయక ఱేఁ డది గొని తన పడఁతుకలకుఁ బంచి యిడిన బాగొప్పఁ బసా పడి యమ్మెఱుఁగుంబోడులు కడుపులతో నుండి రెలమి గడలు కొనంగన్ | 49 |
| క. | చిట్టుములు నోకిలింతలు దట్టంబై బొడమెఁ జవులు దప్పెం గోర్కుల్ బిట్టొదవెఁ బిఱుఁదులుం జను కట్టులుఁ గడు బలిసె నపుడు క్రాల్గంటులకున్ | 50 |
| తే. | వేలుపుల లేవడులు కడు వేగఁ దొలఁగఁ బడఁతుకల నెన్నడుముల లేవడులు దొలఁగె నెఱి నిరాబార్ల స్రుక్కులన్నియును దీఱఁ గలికిమిన్నల తఱుల స్రుక్కులును దీఱె | 51 |
| క. | తొలివేల్పుల మొగములు తెల తెలవాఱఁగఁ దెల్లఁబాఱె దెఱవల మోముల్ తులువల నడకలు దడఁబడ దలిరాకుంబోండ్ల నడలు దడబడఁ దొడఁగెన్ | 52 |
| క. | పుడమి ననబోఁడి వారల కడుపులలో వెన్నునకుఁ దగం దనలాగే ర్పడఁ దెల్ప నేఁగెనో యనఁ బడఁతుకలకు మట్టి చొరవ బలితంబయ్యెన్ | 53 |
| తే. | బొజ్జలో ముజ్జగంబులు వూను మేటి పేర్మితోఁ దమ బొజ్జలోఁ బెరుగుచున్న కతనఁ దద్దయు వ్రేఁగులై కనఁగనయ్యె మేను దీవియ లా రాచ మెలఁతుకలకు | 54 |
| తే. | కుందనపు బొంగరములపైఁ గందుమీఱి వెలుఁగు నిద్దంపు వేల్పు ఱా ములుకులనఁగఁ దమ్మి మొగ్గలపైఁ బొల్చు తుమ్మెదలన నలరెఁ జెలువల చనుమొనల్ నలుపు మీఱి | 55 |
| క. | తెఱవల కడుపులలో నే డ్తెఱఁ బెరిగెడు ప్రోడ రేయి ద్రిమ్మరిదొరపైఁ గొఱకొఱ నూర్పులు నిగుడుచు తెఱఁగున గాటంపుటూర్పు తెమ్మెర లడరెన్ | 56 |
| క. | లలిఁ జూలింతతనంబులఁ దలరెడు నమ్ముద్దు నేలదాలుపు నవలా తలమానికముల కటులన్ నెల లేర్పడఁ దొమ్మిదియును నిండారుటయున్ | 57 |
| సీ. | తొలినెల తెలిఱెక్క తొమ్మిదియవనాట నాఱు నొండవ రిక్క నలరు నాలు గవ లగనంబున నన్ని గాములును మే ల్చూడ్కులఁ దనరార వేడ్కఁ బొదలి మొదలి వెలంది రామునిఁ గాంచె రెండవ పడఁతుక రతనంబు భరతుఁ గాంచె మూఁడవ చిగురాకుబోఁడి లక్ష్మణుని శ త్రుఘ్నునిఁ గాంచెఁ గోర్కులు దలిర్ప | |
| తే. | నప్పు డెకిమీఁడు తఱి చెయ్వు లమరఁదీర్చి పేదలకు నేలవేలుపుఁ బెద్దలకును బొసఁగ రొక్కంబుఁ దొడవులుఁ బుట్టములును దొడుకులు నొసంగి పదిరేలు గడిపి యంత | 58 |
| తే. | పదునొకండవ ప్రొద్దునఁ బట్లు నల్వు రకును బేరులు వెట్టి యా రాచ పెద్ద విందులకుఁ బేదలకుఁ నేలవేలుపులకు నామెతలు వెట్టి దీవనలంది మఱియు | 59 |
| ఆ. | ముద్దు కొమరు లెలమిఁ బ్రొద్దు ప్రొద్దున కొక్క వన్నె యలరఁ బెరుగుచున్న వడుగు లదను మెఱయఁజేసి చదువు సాములు మొదల్ గలుగు విద్దె లెల్లఁ గఱిపి యంత | 60 |
| సీ. | చిన్ని క్రొన్నెల నెన్ను నెన్నొసళ్ళ నొయారి యలఁతి కస్తురి రేక లనువు మీఱఁ గేలు దామరల మేల్జాళువా మురుగులు కెంపు లుంగరములు సొంపు నెఱప మొలల హొంబట్టు క్రొందలుకు దట్టీలపై రతనంపు మొలత్రాళ్ళు రంగులీన నెదల నున్బులిగోళ్ళు పొదివిన పతకముల్ తెలి ముత్తియంపుఁ బేరులు సెలంగఁ | |
| తే. | జెవులఁ గఱి మానికపుఁ బోఁగు గవలు మెఱయ మొలక నగవులు మురిపంపు జిలుఁగు నడలు ముద్దుఁ బలుకులుఁ గులుకంగ మ్రోల నాడు కొమరులను జూచి మది నుబ్బుకొనుచునుండె | 61 |
| క. | ఈ చందంబునఁ దద్దయు నేచిన వేడుకల నుండు నెడ నొకనాడా రాచూలి కడకు వచ్చెం బూచులదొరఁ బోలు తపసిపులి యొకఁ డెలమిన్ | 62 |
| క. | వచ్చిన యక్కౌశికునకు మెచ్చగఁ బూజలిడి బత్తి మీఱఁగ మగఱాల్ గ్రుచ్చిన సింగపు పీఁటన్ నిచ్చలముగ నిల్పి పల్కె నేర్పు దలిర్పన్ | 63 |
| ఆ. | రాచజోగి రిక్కరాయడ! నీవు మా నగరు సేరుటెల్ల మిగుల మేలు సేకుఱుటకుఁ గాదె చెప్పెడి దేమిఁక? నహహ! దొంటి పున్నియంపుఁ బెంపు | 64 |
| తే. | ఇంచుకేనియు మిముఁ బరికించి కొలువ నేర నేమియు నాయెడ నేర మిడక చెలిమి మెఱయంగ మెల్లనఁ దెలుపు మిటులు దారి రా యని యో జడదారిరాయ! | 65 |
| క. | వారువము లందలంబులు దేరులు పల్లియలు పసిఁడి తెలె లేనుఁగులున్ జీరలు తొడవులు మాకున్ మీ రొసఁగిన యవియకావె నిక్కంబరయన్ | 66 |
| క. | కావున మా యెడ మీకుం గావలసిన కర్జమెద్ది గల దది మాతో వేవేగఁ దెల్పు డిమ్ముగఁ గావించెదఁ గొంకు లేక కనికరపుగనీ! | 67 |
| తే. | అనినఁ దద్దయుఁ బొంగి యయ్యడవి మన్కి పట్టు బల్దిట్ట యమ్మేటి పచ్చవారు వపు వజీరు కొలంపు కల్వల యనుంగుఁ గాంచి నును దియ్యఁ బల్కులు గదురఁ బల్కె | 68 |
| క. | ఒడయఁడ! యే నొక జన్నముఁ గడు వేడుకతో నొనర్పఁ గడఁగిన నెపుడున్ గడుసరి రక్కసు లిరువురు దొడరి వడిం జెఱుపుచుండుదురు చలమొదవన్ | 69 |
| క. | అబ్బెరసు పొలసు దిండుల నుబ్బణఁపగఁ జాలఁ డెన్న నొక్కించుకయున్ గుబ్బలి విల్గల జోదును గొబ్బున నిఁక నీదు పెద్దకొమరుని నిమ్మా ! | 70 |
| క. | కడ కడ యొడయని ముంగై కడియపు నున్మెత్తఁ బండు గామిడి మన్నుం బడఁతుకకై యిమ్మానిసి యొడలూనిన వాఁడుసువ్వె యుక్కు దలిర్పన్ | 71 |
| క. | ఈతని బాసటగాఁ గొని యా తులువల నడఁచి జన్న మలర నొనర్తున్ నీ తలఁపున నిపు డేమియు బీ తునుపక యనుపు మనిన బెగ్గిలి యతఁడున్ | 72 |
| తే. | అయ్యయో! గుండియ ల్జల్లురనుడునట్టి బెట్టిదపు మాట మీ నోటఁ బుట్టదగునె? యెట్టి పనియైన నొనరింతు నేనె సెలవు పెట్టుదురు గాక మీకేల పెఱ తెఱంగు? | 73 |
| క. | ఏ పని సెప్పిన నొనరుప నోపని దేమైనఁ గలదె? యో పెనుదపసీ! పూప నిగారపు ముద్దుల పాపని నెడఁబాప నీకుఁ బాడియె చెపుమా? | 74 |
| క. | అకటా! పసి నిసుఁగుల గొం కక కాఱడవులకుఁ బనుపఁగావలెనని కో రికతోఁ బలికెద వెద నిం చుకయుం గనికరము నీకుఁ జొప్పడదుకదా! | 75 |
| క. | మానక పూని కడంకన్ వే నోములు నోచి గీము వేల్పుల కెన్నో కానుకలు నించి కాంచిన కూనలఁ గానలకుఁ బనుపుకొన నేరుతునే? | 76 |
| క. | కటకట! మును జడదార్లె ప్పటికిఁ గనికరపు నునికి పట్టందురు నేఁ డిటువలె మీ రోడక పలు కుట లరయఁగ మిగుల వెఱఁగు గొలిపెన్మదికిన్ | 77 |
| ఉ. | బల్లిదులై జగంబు మనుపం జెఱుపం గలయట్టి మీర లి ట్లుల్లమునందు సోఁకుడుల నొండుక కొండగఁజూచి చెల్లఁబో యిల్లొక పట్టునం గడచి యేఁగఁగ నేరని చుంచు కుఱ్ఱలన్ మొల్లపుఁ గాఱు కోనలకు మున్నరకం గొనిపోవఁ జూతురే? | 78 |
| చ. | అన నెద నుల్కి యబ్బలియుఁ డాతని కిట్లను మున్ను మీరు గో రిన పని యెద్దియైన నొనరించెద నంచుఁ గడంక నాడి చ య్యన నిపు డూరకే కడపి యంపఁ దలంచెదు మేలు మేల్బళా! కనుగొన నయ్యె నీ చెడుగు గారడపుం బనులెల్ల నియ్యెడన్ | 79 |
| సీ. | పలుమఱుఁ జలువతావులఁ జేరి పొరలుచు వంకర నడలచే వఱలి యరిది తేజునఁ బడగలెత్తియు నిరుఁ బుట్టువు దొరలఁ గన్గొని మూలఁ దూఱుకొనుచుఁ బొరయూని మే తాలుపులఁ జిఱ్ఱుమని వెఱ కొలుపుచు రెండు నాల్కలు దనర్పఁ బుడమిపై నెయ్యెడ నడుగిడ నేరక బిట్టూరకయ బుసకొట్టుకొనుచు | |
| తే. | సన్నగాండ్రను బోఁద్రోలి సరగ వారి నెలవు లెల్లను గైకొని చెలఁగుచుండుఁ దులువ విసదారి రా కూటువలకు నెందుఁ దలఁప నొక్కించుకయు మంచితనము కలదె? | 80 |
| క. | కల్లల కెల్లను బుట్టిన యిల్లనఁ బెల్లున జెలంగు నెకిమీఁడులకే బల్లిదులుం గొఱ యగుదురె? తెల్లంబుగ నొకటి నీకుఁ దెల్పెద వినుమా! | 81 |
| తే. | రక్కసు లదెంత పలుమఱు స్రుక్కి కన్న పున్నియం బెల్ల జెడునని యెన్నిగాక కినిసి తిట్టినఁ బఱియలై చనకయున్నె! పసిఁడి పెన్బొజ్జ రా గ్రుడ్డు పనఁటిగములు | 82 |
| ఆ. | అనిన వెఱచి యొడయఁ డయ్య! మీ యెద నింత కినుక యేల? తోడుకొని చనుండు కూర్మి మీఱఁ బెద్దకొడుకును గడపటి ల్లాలి పెద్దకొడుకు నప్పగించె | 83 |
| క. | తివిరి యిటు దపసి జన్నపు నెవమున నమ్ముద్దు రాచ నిసువుల నెకిమీఁ డు వనుపఁ దోడ్కొని యటు వెడ లి వడిం బఱతెంచె నెద లలిం జను కడఁకన్ | 84 |
| తే. | అత్తెఱంగున వేవేగ నరుగుచుండఁ ద్రోవ నొక చెంత నబ్రంబు దోఁప బెద్ద కొండవలె వచ్చు తొలివేల్పుఁ గొమ్మఁ జూపి బాస వాల్మిన్న యా రాచపట్టి కనియె | 85 |
| క. | అల్లదె తాటక యనియెడు కల్లరి రాకాసి పొగరు గదురఁగ వచ్చెన్ విల్లెక్కిడి యొక చిల్కునఁ ద్రెళ్ళింపుము పొలఁతి యనుచుఁ దెగడక దానిన్ | 86 |
| క. | చలమే లగ్గలముగ న చ్చలమే పెంచుకొని తులువజాడ నడరు న ప్పొలమేఁతరి చెలి ద్రిమ్మరు పొల మేతఱినైన వేలుపులు సొరరు సుమీ! | 87 |
| క. | అని పెక్కు దొడ్డ తూపులు నెనరొదవఁగ నిడిన వేడ్క నివ్వటిలం గై కొని రాచపట్టి సింగిణి గొనయం బెక్కించి ముల్కిఁ గూరిచి కడిమిన్ | 88 |
| క. | తెగ నిండఁదీసి రక్కసి చిగురాకుంబోఁడి మీఁదఁ జిమ్మిన బెడిదం బుగ మింట మంట లెగయఁగ నొగిఁ జని యమ్ములికి దాని యుసురులు గొనియెన్ | 89 |
| క. | అపుడు జడదారి ఱేఁ డు ల్లపుఁ దామర నలరి వారలం దోడ్కొని వై ళపు నడకలతోఁ దన జ న్నపు టిల్లుగల యలరుఁ దోపునకుఁ బఱతెంచెన్ | 90 |
| సీ. | గుజ్జు లేమావి మ్రాఁకుల నంటఁ బ్రాఁకిన పరువంపుఁ దలిరాకు పందిరులును వలపుఁ జెంగల్వ బావుల క్రేవ జాల్గొన్న చలువ గొజ్జఁగి నీటి జక్కరలును బ్రోది కప్రపుటంటి బోదియ చాల్మ్రోల జడగొన్న నునుగున్న సంపఁగులును బలితంపు నెత్తమ్మి కొలఁకుల కెలఁకులఁ బొదలు మొల్లపు మొల్ల పూఁబొదలును | |
| తే. | గలిగి మఱియును బండ్లు గాయలు చిగుళ్ళు విందియలు పూలు ముత్తఱులం దనర్చు నెల్ల చెట్టులు నలర నబ్బల్లిదంపు రా నిరాబారి నెల మన్కి గోన మెఱయు | 91 |
| క. | అనయంబు నచటి వెలి ది య్యని పండులు మెక్కి చొక్కి యక్కజపు జిగిన్ బెను మినుకులు నక్కొనలుం గొనగొని యెలుఁగించు మరుని గుఱ్ఱపుఁ దుటుముల్ | 92 |
| తే. | తగిలి నెగడెడు వ్రేలిమి పొగలు మొగుల తెగలనియు మిన్కు టులివులు తివిరి మొఱయు నుఱుము లనియును బురివిచ్చి యుబ్బి యాడుఁ గప్పు మెడ పుల్గుగము లాము గవిసి యందు | 93 |
| ఉ. | వెన్నెల రాచఱాచలువ విప్పు టరంగులఁ జేరి జాళువా కిన్నర లూని జాను దిలకింపఁగఁ బాటలు వాడు బాసవా ల్కన్నియ మిన్న గాణలకు గాటముగా సుతు లిచ్చు నచ్చటన్ గ్రొన్ననఁ గమ్మతేనియలు గ్రోలుచుఁ దుమ్మెదబోఁటి కూటువల్ | 94 |
| తే. | తమ్మి కొలఁకుల నోలాడి కమ్మపూవుఁ గొమ్మలు గదల్చి కపురంపు దిమ్మ లెక్కి నెమ్మిఁ గ్రొమ్మావి నీడల నిలిచి పొలిచి మెలఁగు వలినాలి చిఱుగాడ్పు లెలమినందు | 95 |
| సీ. | పసిదిండి మెకపు లే బాలెంత లాకొన్న జింక కూనలకుఁ బాల్సేపి యొసఁగ బడగ లడ్డుగఁ బట్టి పాఁప చేడియ పిండు లెలుక బోదల కెండఁ దొలఁగఁ జేయ సింగపుఁ జెలులు మచ్చిక మీఱ నెక్కుడు మెకము పిల్లల దువ్వి మేఁత లిడఁగ బిత్తరంపు జవాది పిల్లి వెలందుక ల్చిలుక ముద్దియలతోఁ జెలిమి నెఱపఁ | |
| తే. | గొదమ తోఁడేటి జోటి చాల్గొండ గొఱియ కన్నియలఁ జేరి తద్దయు గారవింప నబ్రముల కెల్ల నాటపట్టనఁగఁ జాలి వెలుఁగు నమ్మేటి తపసి రేవెలుఁగు నెలవు | 96 |
| తే. | అట్టి తనయున్కి పట్టున కత్తెఱఁగున బుజము పుట్టువు కుఱ్ఱ బెబ్బులులఁ దెచ్చి తనియఁ బూజ లొసంగి యత్తపసి రాయ డంతఁ దా జన్న మొనరించు నదను నందు | 97 |
| క. | తులువ తొలివేల్పు లిరువురు బలితఁపు టామెసఁగఁ జదల బలుమూఁకలతో నిలిచి చలమార నల్లయు బొలసును గురియించుచున్నఁ బొడఁగాంచి వెసన్ | 98 |
| క. | రాకొమరుఁ డపుడు వింటన్ జోకగ రెండమ్ము లూని జుఱుకలరఁగ న య్యాకసమునఁ ద్రిమ్మరు బ ల్రాకాసుల నేల నిర్వురం బడ నేసెన్ | 99 |
| ఉ. | అత్తఱి జోగివేల్పు టొడయం డెద నాతని మెచ్చి కూర్మితో నెత్తి కవుంగలించుకొని హెచ్చుగ వేలుపు లెల్ల సొంపు ద ళ్కొత్తఁగ చేరి వ్రేలుముల నోరెపు పాళ్ళు గొనంగ గిత్త రా తత్తడి ఱేఁ డెదం దనియఁ దప్పక జన్న మొనర్చి యంతటన్ | 100 |
| క. | ఇరుచక్క మేనులూన్ బలు దొరకొలపుం బాలవాఁగు తొగల యనుంగై పరఁగెడు నప్పది తేరుల దొరపట్టికిఁ బొలము మన్కి దొర యిట్లనియెన్ | 101 |
| క. | విను రాచపట్టి! జనకుం డను నొడయఁ డొకండు మిథిల యనియెడు వీటన్ బని మీఱ సీత యనియెడు తన బిడ్డకుఁ బెండ్లిసేయఁ దలఁచి కడంకన్ | 102 |
| తే. | నలువు మెఱయంగఁ బెద్దల నాటనుండి మున్ను దమయింట డాకొనియున్న విన్ను మూల దేవర విల్లెత్తఁ జాలు మేటి కిత్తుఁ దన కన్నెనంచు నొట్టిడుక యతఁడు | 103 |
| ఆ. | పుడమిలోనఁ గల్గు పుడమిఱేఁడుల కెల్లఁ దేటపడఁగఁ గడలఁ జాటఁ బనిచె నయ్య! ముజ్జగముల నల రాచకన్నియ యుద్దిఁ బోల రెట్టి ముద్దియలును | 104 |
| క. | మీలుం దామర పూలున్ మేలగు నమ్ముద్దరాలి మినుకుఁ గనుఁగవన్ బోలక నీట మునింగెన్ మూలకు దొరగాక యిర్లు మూలకుఁ జేరెన్ | 105 |
| క. | ఒడలున్ దొడలు న్నడలున్ మెడయుం జడయుం దనర్చు మెలఁతకు మేల్పు త్తడి నంట్ల నంచబోదల నడరెడు చిందములఁ దేంట్ల నల్లన నగుచున్ | 106 |
| క. | తొవలా కన్నులు, వలిజ క్కవలా పాలిండ్లు, తేఁటి గములా కురు, లా నవలాతో నెనఁ బోలుప నవలా నిక నొక పొలంతి యబ్బదు సుమ్మీ! | 107 |
| సీ. | తుమ్మెద ల్సెలవిండ్లు తొగలు సంపఁగి మొగ్గ మగరాలు తేనియ ల్మంకెన విరి యద్దము ల్తొమ్మిదు లలఁతి వెన్నెల సంకు తూండ్లు కెందామర ల్చెండ్లు చిలువ తరఁగలు సుడి మొగిల్దారి యరుంగులు మల యనంటులు దొనల్ మఱ్ఱిపండ్లు తలిరులు రిక్కలు తాఁబేళ్ళు రాయంచ కొదమలు గపురంబు కుందనంబు | |
| తే. | ననలు చిలుకయు నొనఁగూర్చి నలుమొగముల ప్రోడ తన ప్రోడతనమెల్లఁ బుడమియందు నెఱఁపగాఁ గోరి యమ్ముద్దు నెలఁత నట్లు పొలుపు మెఱయంగ నొనరింపఁబోలుఁ జుమ్మి! | 108 |
| క. | రే దొర మొగమున కెన చివు రే దొర పల్వరుసతోడ నిఱి గుబ్బలయా రే! దొరయుం జక్కవ కవఁ బైదలి నలువెన్న నలువ పడఁతికిఁ దరమే! | 109 |
| సీ. | తలిరు లేమావి క్రొత్త జవాది బలుక్రోవి వలపుల దీవి చెంగలువ బావి ముగుదల మేల్బంతి సొగసుల దొంతి క్రొం బొగడ పూబంతి యబ్బురపు టింతి మానికమ్ముల మూట మరుని గెల్పుల కోట పండు వెన్నెల తేట పసిఁడి వేఁట కపురంపు దిమ్మ చొక్కపుఁ దళ్కు కీల్బొమ్మ మొల్లంపు దానిమ్మ ముద్దుగుమ్మ | |
| తే. | తేజుల కొటారు వలుద ముత్తియపుఁ బేరు కడిఁది జగరంగు తొలకరి కాఱ్మెఱుంగు నును పికిలి చెండు పరువంపు పనసపండు నాఁగఁ దగు నెన్న నన్న! యన్నాతి మిన్న | 110 |
| క. | తలతలమను నపరంజిం దలదలమనుఁ జెలువ బల్లిదపు డాల్బలు విం తలఁ దలరారెడు నమ్మెలఁ తల తలమానికము నెన్నఁ దరమే మాకున్? | 111 |
| క. | నగు నగు వెన్నెల నిగనిగ జిగి మిగిలిన కెంపు సొంపుఁ జెఱచుఁ బెదవి యె న్నఁగనగు నమ్ముగుద సొగసు దుగ తిగ తీపారు తూపుదొర దీవి సుమా! | 112 |
| మ. | తఱచు ల్వేయు నిఁకేల? యా తెఱవ యా దానిమ్మ పూరెమ్మ యా నెఱి గప్రంపు టనంటి క్రొమ్మొలక యా నిద్దంపు లేమావి యా మెఱుఁగుం బంగరు తీవ యా నన జిరా మేల్జోదు వాలారునున్ గఱకుం గైదువ యా కడింది నవలా కన్నాకు నీకే తగున్ | 113 |
| తే. | మోవి చిగురును వలిగుబ్బ పూవుగుత్తు లక్కజపుఁ బల్కు తేనియ లరిది కీలు గంటు తుమ్మెద దిమ్మును గలిగి యొప్పు పుడమి కానుపు లేఁగొమ్మఁ బొగడఁ దరమె | 114 |
| క. | అని తెల్పుచు వారలఁ దో డ్కొని యప్పుడె కదలి తపసి గొలఁకులు నేఱు ల్పెను గోనలు బల్లియలుం బొనరారఁగ గడచి వైళమునఁ జను నెడలన్ | 115 |
| క. | కడు నరుదుగఁ దెరువున నొక పడు కా నాడెంపు రాచపాపని యడుగుం గడ యొక్కించుక సోఁకిన నడరెడు తలిరాకుబోఁడియై తగ నిలిచెన్ | 116 |
| తే. | నిలుచుటయు నబ్బురం బెద నివ్వటిలఁగ ఱెప్ప వ్రేయక యన్నేల ఱేఁడు దాని సోయగం బెల్లఁ గాంచి పెన్ ఱాయి ముద్దు తెఱవయై నిల్చు టిదియేమి తెఱఁగు నేఁడు? | 117 |
| ఉ. | వీనులకంటి తొయ్యలియొ? వేల్పు వెలందియొ? జక్కి మోర లేఁ జానయొ? పక్కి రా చెలియొ? జక్కుల వంగడపుం బడంతియో? కాని జగమ్మునం దరయఁగా బెఱ కొమ్మల కీ మిటారపుం జానొక యింతయుం గలుగఁ జాలునె? యంచుఁ తలంచుచుండగన్ | 118 |
| క. | రాకొమరుఁ జూచి యచ్చిగు రాకుంబోడిఁయు వలంతియై యిట్లను నో సోఁకుడుల సూడ! వినుమా! నీకుం దన మొదలి తెఱఁగు నెఱి నెఱిఁగింతున్ | 119 |
| సీ. | మును గౌతముఁడు నాఁగ నొనరు పంటవలంతి జేజే నిరాబారి సింగమునకు గారాబు టిల్లాలఁ బే రహల్య యటందు రొకనాడు వేలుపు టొడయఁ డెమ్మె ననుఁ గోరి పుంజురూపునఁ జేరి నడురేయి తఱి నింటి దరిఁ బొంచి యఱచుటయును దెల్లవాఱె నటంచుఁ దివిరి యజ్జన్నిగ ట్టేటి పొంతకుఁ గ్రుంకులిడఁగ జన్న | |
| తే. | నపుడె జన్నపు దిండి రాయండు సెలఁగి పెక్కు దెఱఁగుల రాచిల్క జక్కిఁ జోదు పనులకై వేడుకొన నియ్యకొని యతండు నేను నెనలేని నెమ్మది నెనయు నెడల | 120 |
| క. | వేగుట గని రాకుండిన వేగ మరలి వచ్చి తపసి వెన్నెల ఱేఁ డ ట్లాగడమున మెలఁగెడు మము బాగుగఁ బొడఁగాంచి యెదను బాయని కినుకన్ | 121 |
| క. | వేండ్రముగఁ దిట్టుటయు జవ రాండ్రెవ్వరు మున్నెఱుఁగని యంగద యొదవన్ గుండ్రాతి రూపు గైకొని తండ్రీ! పెక్కేడు లిందుఁ దరలక యుంటిన్ | 122 |
| క. | కడు నరుదుగ నీయెడ నీ యడుఁగుం గొన యింత సోఁకినంతనె చెడుగుం గొడిమెలు విడి చని క్రమ్మఱ మడఁతితనం బొదవె నన్ను మానిసిమిన్నా! | 123 |
| క. | ఓ వలఁతి! యిజ్జగంబు ల్వావిరి నేదుకొనఁ గావలసి నీ వెపుడుం గావింపుచుండు కర్జము లేవారితరం బెఱింగి యెన్నికసేయన్ | 124 |
| క. | అదనొదవ మీను మేనం బొదలుచు మున్నీరు సొచ్చి పూనికతోడన్ జదువుల తెక్కలికానిం జిదిమి నలువ కలఁక దీఱిచితి వీవె కదా! | 125 |
| తే. | తివిరి జేజేలు మానిసి దిండికాండ్ర దండులును గూడి ప్రాలేఱు ద్రచ్చు తఱిని మేటి తామేటి మేనెత్తి మెట్టుక్రింద నిలిచి యుండిన ప్రోడవు నీవెకానె? | 126 |
| తే. | జాళువా కంటి తొలివేల్పు నేలయెల్ల గొంచు విసదారి టెంకి కేతెంచుచున్న బూని తొల్పంది గున్నవై వానిఁ జీరి కోఱకొన మన్ను దాల్పవే కోరి నీవు? | 127 |
| ఉ. | వెన్నునిఁ జూపుమంచు బదివేల వితంబులఁ గన్నబిడ్డని న్మిన్నక స్రుక్కఁజేయు మిడిమేలపు నంజుడు దిండి రాచ బ ల్మన్నియఁ జెండవే? బిరుసు మానిసి సింగపు మేనుపూని యో యన్న! పసిండి బొజ్జదొరకైన నినుం గొనియాడఁ బోలునే? | 128 |
| క. | గుజ్జు వడుగవయి మును దన యొజ్జ పలుకు వినక చాగ మొసఁగెడుచో మూఁ డజ్జల ముజ్జగములు గొని య జ్జేజేగొంగఁ గ్రింది కనిచితివి గదా! | 129 |
| క. | ముయ్యేడుమాఱు లెక్కటి కయ్యంబుల నేలదాల్పు కన్నాకుల బ ల్వ్రయ్యలుగ గండ్ర గొడ్డట నొయ్యనఁ జక్కాడి కడల నునుపవె యసముల్ | 130 |
| క. | ఈరైదు కుత్తుకల పొల యోరెపు మన్నీని దాడి కోర్వక జేజే బారులు మొఱవెట్టినఁ బది తేరుల దొర కిపుడు గల్గితివిగద జియ్యా! | 131 |
| క. | కొనరిక్క పేరి పొలఁతుక పెనిమిటివై నాఁగలియును బెనుదాటి సిడం బును బూని ఠవళి కాండ్రం దునిమి పుడమి పడఁతి వ్రేఁగు ద్రోయుదువు గదా! | 132 |
| తే. | పొలసు మేఁతరి క్రొన్ననబోఁడి తెగల యీలువులు మొక్కవఱచియు మేలి కత్త లానిపై నెక్కి మొనసి పొలసుల నెల్లఁ జిదుమఁగల బల్లిదుఁడ వీవెగదవె తండ్రి! | 133 |
| సీ. | చదలు కానుపు దిండి చలువ పాన్పునఁ బండి జోగంపు నిదురలఁ జొక్కు ఱేఁడ! మాటల తొగకంటి మగని గ్రుడ్డు పనంటి ప్రోవులు బొజ్జలోఁ బూను మేటి! జగడంపు టోరెంపు జడదారి నాడెంపుఁ బాటల కెద నుబ్బు బల్లిదుండ! తళుకులీను కడాని వలిపె దుప్పటి మేని కనువు మీఱఁగఁ గప్పుకొను నొయారి! | |
| తే. | కడిఁది విలుకాడ! పలువ రక్కసుల సూడ! నుడువఁదగు బంట! తపసుల నోముపంట! అందముల గీమ! నెఱ రాచ చందమామ! తెలిసి యగ్గింప మా బోంట్ల తలమె నిన్ను? | 134 |
| క. | అని యిటు లెద నెత్తిన బ త్తిని వేమఱుఁ బొగడి పొలము తెంకి ముగుద క్రొ న్ననబోఁడి సనిన వారుం జని రొయ్యన మిథిల కపుడు సంతస మెసగన్ | 135 |
| క. | అత్తఱి నబ్బలు వీటికి మొత్తములై నేలఱేండ్రు మురిపము లొదవ న్బిత్తరిఁ గైకొనియెదమను తత్తరమునఁ జేరి రెలమి దలుకొత్తంగన్ | 136 |
| క. | ఎక్కుడు మెకములుఁ దేరులు జక్కి పదువు లందలములుఁ జాలుపు లగుచున్ గ్రిక్కిఱిసి లెక్కలకుఁ గడు మిక్కుటమై యెల్ల కడల మెఱసెం బ్రోలన్ | 137 |
| సీ. | కొమ్ముటేనుఁగు మబ్బుకూటువ ల్చిల్కు మ వ్వపు టాము నీర్బొట్లు వాన గాఁగఁ బలు దెఱంగుల బోరు కలుగు వాయిదములు గడితంపు టుఱుము చప్పుడులు గాఁగ రవళిఁ బాతర లాడు పువుబోండ్ల మేను దీ వియలు మెఱంగు దీవియలు గాఁగ ముత్తైదువలు దట్టముగఁ జల్లు బలు సోయ గపు ముత్తెములు వడగండ్లు గాఁగ | |
| తే. | మేలు టెక్కపు రతనంపు మిన్కుగములు వేల్పు పాలెంపు టెకిమీని విండ్లు గాఁగఁ దెలి గొడుగు లెల్ల నురువుల తెరలు గాఁగ వఱలె వీడప్డు తొలకరి తఱిని బోలి | 138 |
| తే. | పుడమి యీనిన వడువున నెడ యొకింత లేక మూఁకల చేతఁ బ్రోల్వెలుఁగుచుండె నిట్లు గూడిన యెకిమీండ్ర కెల్లఁ జెలిమి మెఱయ విడిపట్టు లొసఁగె నమ్మిథిల ఱేఁడు | 139 |
| సీ. | పగడంపుఁ గంబము ల్పన్ని పన్నుగనిడ్డ తెలిముత్తియంపుఁ బందిరుల వలనఁ దళుకు పసిండి గోడలఁ గీలుకొల్పిన పలు వన్నియల వ్రాత పనులవలన దలిరులు దొగలు చెంగలువలు గూర్చి యం దముగ నించిన తోరనములవలన వెలలేని తగటు దువ్వలువలు చుట్టి య గ్గలికఁ గట్టిన మేలుకట్లవలన | |
| తే. | దట్టముగ మ్రోయు నెఱ వాయిదములవలన బుగులు కొనియెడు కపురంపుఁ బొగలవలన మేలు తెఱగెల్లఁ గనఁబడి మెఱయుచున్న తన నగరిలోని కెలమి నందఱను దెచ్చి | 140 |
| తే. | ఓలిఁ దగుచోట్ల వారిఁ గూర్చుండఁబెట్టి తమ్ములమ్ములు మంచి గందములు జింక పొక్కిలియుఁ గప్పురము గందవొడి మొదలగు మంచి సరకులచే నామతించి యంత | 141 |
| క. | వలనుగ నతఁ డెంతేనియు బలియురఁ బెక్కండ్ర నేర్చి పనిఁబూనిచి గు బ్బలియుంబలెఁ దన యింటన్ దలరెడు సింగాణిఁ గ్రన్ననం దెప్పించెన్ | 142 |
| క. | తెప్పించి వారి ముందఱ నొప్పారఁగ నునిచి మిగుల నుల్లపుఁ దమ్మిన్ ముప్పిరి గొనియెడు వేడ్కల నప్పంట వలంతిరాయఁ డర్మిలి ననియెన్ | 143 |
| క. | రాకొమరులార! గుబ్బలి రాకన్నియ మగని యబ్బురపు విల్లిది ముం దా కఱి మెడ దొర దీనిం డాకొని బలు టక్కరుల నడంచెం గడిమిన్ | 144 |
| క. | పెద్దల తరమున నుండియుఁ దద్దయు నిది యలరుచుండుఁ దమ నెలవున వే సుద్దు లిఁకేటికి వినుడా! సద్దేమియుఁ జల్పబోక జతనం బొదవన్ | 145 |
| ఉ. | మూఁగిన రాచసింగముల మూఁక గనుంగొని మేలు మేలన న్వీఁగక నిల్చి యిక్కడిఁది విల్లరివోసిన ప్రోడ కేను మే ల్గాఁగ నొసంగుదు న్వలపుఁ గప్రపుఁగుప్ప యనం దనర్చు ని న్నాఁగటి చాలు పేరి యెలనాగల మిన్న నటంచుఁ బల్కినన్ | 146 |
| తే. | విని పుడమిఱేఁడు లెంతయు వెఱఁగు పడుచు నద్దిఱా! కొండ కుద్దియై కొద్దిగాక యున్న విలు దెచ్చి యందఱ బన్నమొంద జేసెఁబో! వీఁడు దబ్బఱ చేసి నేడు | 147 |
| తే. | అనుచు నెమ్మొగముల విన్నఁదనము దోఁప జరిగి రూరక సన్నక సన్నఁగొంద ఱొక్క కొందఱు దొరలు విల్లెక్కిడంగఁ బూని కదలింప నోడియు మ్రానువడిరి | 148 |
| తే. | మున్నరకతోడఁ గొందఱు మన్నుఱేండ్లు గోరి సింగాణి గొనయంబు గూర్పఁబూని పొదవి చేతులఁ బొరలించి పుడమి పైని నెగయ నెత్తఁగ నింతయు నేరరైరి | 149 |
| చ. | అటువలె రాచవేల్పు దొరలందఱు నుక్కఱి స్రుక్కి వీఁగి యే గుటఁ గని ప్రొద్దు వంగడపుఁ గ్రొన్నెల రా జడదారి పంపునం దటుకున విల్లు పుచ్చుకొని తప్పక యెక్కిడి నారి లాగుచోఁ బెటబెట లాడుచున్ విఱిఁగె బెల్లుగఁ జప్పుడు వింట నంటగన్ | 150 |
| ఆ. | ఏపుతోడ నాము టేనుఁగు గున్న లేఁ జెఱకుకోల విఱుచు తెఱఁగు దోఁప దోలు దాల్పు విల్లు దునిమిన యజ్జాణఁ జూచి యబ్బ పేరి రాచగిబ్బ | 151 |
| క. | నానయు వెఱఁగును వేడ్కయు లో నెరయఁగ నతని మెచ్చి లొజ్జించుకయుం బూనని నెయ్యంబున న క్కాన బిడారంపు సామిఁ గన్గొని పలికెన్ | 152 |
| ఆ. | జోగిబొబ్బమెకమ! యీ గడుసరి కుఱ్ఱ లెవ్వ? రెందునుండి యేఁగుదెంచి? రిట్టి బలిమికాండ్రు రెవ్వరి కొమరులు? తేటపడఁగ మాకుఁ దెలుపవయ్య! | 153 |
| క. | మిముఁ బోని బల్లిదులు మే ల్సమకూర్చుట కొఱకుఁగాదె చనుదెంతురు ని క్కముగ నిపు డెల్ల కోర్కులు నమరెంగద మిమ్ముఁ జూచినంతనె మాకున్ | 154 |
| చ. | అనవుడు నాతఁడిట్టులను నయ్యెకిమీని మొగంబుఁ జూచి యో గొనముల యిక్క! యిక్కొమఱుఁ గుఱ్ఱలు పొద్దు కొలంపుఁ బెద్దయై తనరుచునుండు చాల్పు టరదంబుల ఱేని యనుంగు బోద లే పున నిట వచ్చి రీ విడిన బూచుల రాయని విల్లు గన్గొనన్ | 155 |
| సీ. | మన్ను క్రొన్ననబోఁడి మున్న టక్కరి రక్క సుల మోవ నోపక తలఁకుచున్నఁ జదువుల దేవర మొదలగు వేల్పులు జిడ్డు నీర్వామికిఁ జేరి యందుఁ బెనుబాఁప నును బానుపున దమ్మి యింటి తొ య్యలి యజ్జ లొత్తంగ నత్తమిలిన వెన్నున కప్పని విన్నవించిన నతం డఱిముఱి వారి యక్కఱలు దీర్పఁ | |
| తే. | గోరి మువ్వేలుపుల యిక్క కొలమునందు జమిలి చౌవంచ తేర్ల రా చలివెలుఁగున కేపుతోఁ బుట్టె నెడరులు వాపి పజలఁ బ్రోవ నరుదుగ నిరు దుగ రూపులూని | 156 |
| ఉ. | అమ్మగ మానికంబు దిటమారఁగ నొక్క లకోరిఁ జెడ్డ రే ద్రిమ్మరి కొమ్మ నుక్కడఁచి తేటగ జన్నము గాచి చట్టు చం దమ్మున నున్న పెందపసి తామరకంటిని బ్రోచి యిందు వ చ్చెమ్మొగి నీదు జన్న మఱసేయక చూచు కడంక మీఱఁగన్ | 157 |
| తే. | అరయఁ దీవంచ వార్వంపు టగ్గిపట్ల నడుమ నడరొందు నాడెంపుఁ బుడమిఱేఁడు లెల్లఁ గదలింప లేని యవ్విల్లు దునిమె నిప్పుఁ డీతని మగతనం బెన్నఁదరమె? | 158 |
| క. | చుక్కల రాయఁడు మరుడుం జక్కుల యెకిమీని కొడుకు జతవోలని యీ చక్కని పాపఁడు నీకున్ దక్కెంబో! అల్లుడై దిటం బలరారన్ | 159 |
| తే. | అనిన నుప్పొంగి రా చూచి యయ్య! యింక జాగుఁ గావింపనేల? యిచ్చటి కయోధ్య యేలు యొడయనిఁ బెండిలి కిపుడు పిలువఁ బనుప వలెనని నెయ్య మేర్పడఁగఁ బలికె | 160 |
| తే. | వలఁతి బంటుల నిరువురఁ బిలిచి మేలి కమ్మ యొసఁగిన వారొక యుమ్మడిఁ జని యోలగంబున నెమ్మదిఁ గ్రాలుచున్న బంతి తేరుల రాచ మేల్బంతిఁ గాంచి | 161 |
| క. | కేలెత్తి మ్రొక్కి వెసఁ దము నేలినవాఁ డిడిన కమ్మ యిడుటయు నాతం డోలి నది చదువుకొని కడు నా లెంకల నీగివలన నలరించి తగన్ | 162 |
| క. | వేడుకయు వెఱఁగుఁ గడఁకయు నై డెందము చిగురు లెత్త నపుడె ప్రగడలన్ నాడెపుఁ బాఱుల విందులఁ దోడి దొరలఁ గూర్చి సొంపుతోఁ బయనంబై | 163 |
| సీ. | ఎడలేక నడచు తత్తడులు నేనుంగులు తేరులు తరగల తెరలు గాఁగఁ జద లెల్ల నద్రువ విచ్చలవిడి మొఱయు వా యిదములు బెడిదంపు రొదలు గాఁగఁ పెంపారు తెలి ముత్తియంపు జంపపు టెల్లి తెగలు నిద్దంపు నురుగులు గాఁగఁ బలితంపు హొయలు చెన్నలరు రాకొమరులు కొమరొందు నెఱ మానికములు గాఁగ | |
| తే. | హరువు మెఱయంగఁ బాతర లాడు గడణ వెలఁదుకలు పవడంపుఁ దీవియలు గాఁగ నుబ్బి పొదలెడు మున్నీటి యుద్ది వోలెఁ దద్ద వేడ్కల మిథిలకుఁ దలరి చనియె | 164 |
| క. | చనుటయు నబ్బలియు నెదు ర్కొని తన నగరునకుఁ దోడుకొని చని పూజల్ పొనరించి మిథిల ఱేఁడా తని నొక విడిపట్టు నందుఁ దనరఁగ నునిచెన్ | 165 |
| ఆ. | అంతఁ బెద్ద బాపనయ్యల యానతి వడసి యొక్క మంచి గడియ దోయి యందు రాగవునకుఁ బొందుఁగా దన పట్టిఁ బెండ్లి సేసె మఱియుఁ బేర్మితోడ | 166 |
| క. | తన తమ్ముని బిడ్డల నా తని తమ్ములు మువ్వురకును దద్దయు వేడ్కన్ బెను మినుకు త్రోవఁ బెండ్లిం డ్లొనరించి కరంబుఁ గూర్మియుప్పతిలంగన్ | 167 |
| తే. | తగటు చీరలు రతనంపుఁ దళుకుఁ దొడవు లందలంబులుఁ జందువా ల్గుందనంపు టెల్లిగములును దూఁగుటుయ్యెలలు మంద సలును నయ్యల్లువారి కొసంగి మఱియు | 168 |
| క. | చెయ్యిగల మెకపు బారులఁ బయ్యర వడిగల్గు జక్కి పదువుల నిడి తా నెయ్యంబున వియ్యంబుల కయ్యెడఁ గడలేని సొమ్ము లప్పన సేసెన్ | 169 |
| ఉ. | ఆరని తేజు గల్గి యలరారెడు నయ్యెకిమీఁడు వేయి నూ ఱారుల ఱొక్కముల్ దొడవు లందలము ల్వలిపంపుఁ జీరలుం జూఱలు గాఁగ నింటఁగల సొమ్ములు నెమ్మి నొసంగి యత్తఱిన్ బాఱుల బీద సాదులను బందుగులం దనియించె నెంతయున్ | 170 |
| ఆ. | అటు లొసంగి యనుప నందఱుఁ దమతమ నెలవుపట్ల కరిగి రెలమితోడఁ బుడమి కాన్పు మగనిఁ బొగడుచు నపు డాకు టింటి ప్రోడ యెందునేనిఁ జనియె | 171 |
| తే. | అంతఁ గొడుకులఁ గోడండ్ర నందలముల నునిచికొని వీరకాని వీడ్కొని చెలఁగుచు బంతి తేరుల దొర త్రోవపట్టి యరుగు చున్నచో నబ్బురం బొప్ప నొక్క యెడను | 172 |
| క. | వెఱఁగుగఁ దన పేరిటి దొర మఱియొక్కఁడు గలిగె నిపుడు మంచిది మేల్మేల్ తఱిమి నెఱిఁ జెఱుతునని మది నఱమఱతోఁ బరశురాముఁ డడ్డము దాఁకెన్ | 173 |
| తే. | తాఁకి యగ్గండ్రగొడ్డలి దాల్పు రేయి ద్రిమ్మరుల దాయ నలుకతోఁ దేఱి చూచి యోరి ముడికాఁడ! ప్రాఁత విల్లొకటిఁ ద్రుంచి యుబ్బె దింకను నా దాడి కోర్వఁగలవె? | 174 |
| సీ. | కొఱఁత గానీక చిచ్చఱ కంటి చెంగట గుఱుతుగా విలువిద్దె గఱచినాఁడ దూరి పేరిమి నైదు నూఱు కేల్గవలను గల బల్లిదుని యాము మలపినాఁడ జెలఁగి ముయ్యేడుమాఱులు గండ్రగొడ్డంటఁ దులువ రా పౌజులఁ జెలవినాడఁ దెఱగంటి ప్రోలి కేడ్తెఱ నేఁగు తెరవుగా గడితంపు మెట్టులు గట్టినాఁడ | |
| తే. | వెలయ నిరుదచ్చి రాచ జాబిలులలోన మిక్కుటంబగు తేజున మెఱసినాడ నట్టి నాతోడ నీ తరమా? పెనంగ నహహ! పనిదప్పె నింకేమి యనఁగఁ గలదు? | 175 |
| క. | ఎట్టి మొనగాండ్రు రేనియు గట్టిగ నా యెదుట దిటము గలఁగఁగ బఱతు ర్నెట్టుకొని నేఁడు మిగులన్ బొట్టెఁడ వీ వెట్లు నిలిచి పోరెదు చెపుమా? | 176 |
| తరల | అనుడు నబ్బలుజోదుఁ గన్గొని యాతఁ డిట్లని పల్కె నౌఁ దన మగంటిమిఁ దానె యుబ్బుచుఁ దద్దయుం గొనియాడు తు ల్వను మదిం గొర సేయఁబోరు వలంతు లెల్లను నీ కిటు ల్చనునె? యెన్నుకొనంగ వీఱిఁడి జాడ నీవ నినుం గడున్ | 177 |
| క. | బవరమున కీవు రమ్మని తవిలిన మీవంటి పుడమి దయ్యంబులతోఁ దివిరి యెదుర్కొనగాఁ దగ వవునే? నెఱ రాచ మన్నియల కెందైనన్ | 178 |
| చ. | పలుకులు వేయు నేమిటికి? బల్లిదులై తనరారు మీర లె ట్లలిగినఁ జెల్లుఁగాని తగునా మముబోంట్లకు మిమ్ము మార్కొనన్? వలనుగ మిన్ను మానికపు వంగడపుం దొర లెన్నడేనిఁ బా ఱుల యెడ నల్గఁ బోదురె? యెఱుంగమినైన బెడంగు డాల్గనీ! | 179 |
| ఆ. | అనిన సంతసిల్లి యచ్చివ్వ పోటరి బాపనయ్య రాజపట్టిఁ జూచి మేలు మేలు నిన్ను మెచ్చితి నిఁక బెక్కు మాటలేల? వినుము తేట మీఱ | 180 |
| తే. | తొలిపలుకు వారువంబుల వలఁతి చివుకు విల్లు దురిమితినని చాల విఱ్ఱ వీఁగు చున్నవాఁడవు నాచేతి యుదుటు విల్లు గొనయ మెక్కింపుమని యొసంగిన నతండు | 181 |
| క. | ఆ వింటితోన యాతని లావును నెఱతనము తేజు లాగుకొని కడున్ జేవ దలిర్పగ నెక్కిడి వేవేగ లకోరిఁ బూని వ్రేయఁ దొడఁగినన్ | 182 |
| తే. | తలఁకి యో యన్న! యిప్పు డిమ్ములికి యేను వేల్పు ప్రోలికిఁ గట్టిన చాల్పు మెట్టు లేయుమని వేడుకొన నట్లేసి యతని వీడుకొని యెల్ల మూఁకలఁ గూడి మరలి | 183 |
| తే. | ఎలమిఁ దలప్రోలు సొత్తెంచి యెల్ల పజలు కోరికలు నివ్వటిల నెదుర్కొని కరంబు బత్తి నెఱపంగ వారలఁ బల్దెఱఁగుల గారవించుచు నేడ్తెఱ గడలు కొనఁగ | 184 |
| చ. | పలుమఱు నాట చేడియలు పాతర లాడఁగ నేల వేలుపుం జెలువలు గ్రొత్త ముత్తియపు సేసలు చల్లుచు మేల్నివాళు ల గ్గలముగ నీగఁ బాఱు లొగిఁ గ్రమ్ముచు దీవన లీయ బట్లు వే డ్కలఁ బొగడంగ లోనగరుఁ గ్రన్ననఁ జొచ్చి కడంక మీఱఁగన్ | 185 |
| తే. | తల్లులకు మ్రొక్కి వారలెంతయు నొసంగు దీవనలు గాంచి యెనలేని ఠీవి మెఱయ నంత జన్నంపుఁ గాపరి సంతసమునఁ బుడమి కానుపుఁ జెలిఁగూడి పొదలుచుండె | 186 |
| క. | అని పుట్టఁబుట్టువునకుం గొనకొని వేలుపుల పెద్ద కొమరుఁ డెఱింగిం చిన నాలకించి యతఁడా యన నవ్వలి కతయుఁ దెల్పుమని వేడుటయున్ | 187 |
| ఉ. | వేలుపుటేఱు గప్పురము వెన్నెల లంచలు ముత్తియంబులుం బాలును మంచు నద్దములుఁ బయ్యరమేపుడుఱేఁడు గల్వరా ఱాలును రేవెలుంగు మగఱాలును రిక్కలుఁ దమ్మిచూలియి ల్లాలును జోడుగాఁగ దనరారు నసంబునఁ గేరు దయ్యమా! | 188 |
| క. | కలువలదాయయు నగ్గియు నెలయును గేస్తుండుఁ జదలు నేలయు నీరున్ జలినట్టును రూపులుగాఁ బొలుపొందెడు వన్నెకాఁడ! బూచుల ఱేఁడా! | 189 |
| లయవిభాతి | మొలను బులితోలు వెలిమలను బలుప్రోలు వలిఁ జిలుకు తలజాలు మెయిఁ గులుకు జవరాలున్ జిలువ మెడ నూలు పని మలపు తొలిచూలు మొల నలరు నునువాలు మెక మెలయు వలకేలున్ గెలుపు గొనఁజాలు పసికొలపు దొర డాలు చలి వెలుఁగు నెనవోలు వగఁ బొలుచు నెఱడాలున్ గలిగి కడు మేలు పజ కెలమి నిడి మేలు గని చెలఁగి జగమేలుచును వెలుఁగు నెఱవేల్పా! | 190 |
| గద్యము | ఇది శ్రీమదుమారమణ కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర పవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబయిన యచ్చతెలుఁగురామాయణ మను మహాకావ్యమందు బాలకాండము సర్వ మేకాశ్వాసము. |