| ఇతిహాసములు | అచ్చతెలుఁగు రామాయణము | పీఠిక |
| చ. | సిరులకు మన్కి యై హొయలు చెన్నలరారెడువెండికొండపై నరుదుగ వేల్పుఱేఁడు మరునయ్యయు నల్వయుఁ గొల్వఁ జల్వడా ల్దొరరతనంపుటుప్పరిగలో వలిగుబ్బలిరాచకూఁతుఁ దా నిరవుగఁ గూడి ముజ్జగము లేలెడు లేనెలదాల్పుఁ గొల్చెదన్. | 1 |
| తే. | కొండవీ డేలువేలుపుఁ గూడి పాల కడలినడుచక్కి బలుమానికములదీవిఁ బుడుకు మ్రాఁకులు మారేళ్లువొదలి పొదలు కడిమిపూఁదోఁటలో నాడుగరితఁ దలఁతు. | 2 |
| సీ. | గ్రుడ్డుకానుపుఱేఁడు గ్రుడ్డుకానుపుఱేఁడు గుఱ్ఱంబు పాన్పు నై కొమరు మిగుల జింకతాలుపరియు జింకతాలుపరియు మఱఁదియు ననుఁగు నై మెఱపుఁ జూప నీరుపుట్టువయును నీరుపుట్టువయును బూరయుఁ దొడవు నై పొలుపు నెఱపఁ బచ్చవార్వపుజోదు పచ్చవార్వపుజోదు వలకన్ను కొడుకు నై వలపు గులుకఁ | |
| తే. | జుట్టువాలును నెవ్వ పోఁగొట్టునాలు బిట్టు గ్రాలుపసిండి క్రొంబట్టునేలు మెట్ట జాలు మొగిల్పస మెట్టఁ జాలు నట్టిడాలును గలజగజెట్టిఁ దలఁతు. | 3 |
| చ. | పులుఁగుహుమాయిజోదు నెదఁ బూనిననిద్దపుఁదమ్మికెంపు సొం పలరెడుదొండపం డనుచు నక్కఱ ముక్కున నొక్కఁ బోవుకై చిలుక నదల్ప వైళ మది చేరి తమిం దనమోవిఁ జీఱ రాఁ బొలుపుగ నవ్వునయ్యసలుఁబుట్టువనట్టువెలందిఁ గొల్చెదన్. | 4 |
| క. | తెల్లనితామరగద్దియ తెల్లనియిల్లాలు మిగులఁ దెల్లనికొడుకున్ దెల్లనితోఁబుట్టువయును దెల్లనితత్తడియుఁ గలుగుదేవర నెంతున్. | 5 |
| సీ. | వెలిదమ్మి క్రొంబువ్వు కొలువుసింగపుఁబీఁట చెలువారురాచిల్క చెలిమిబోటి విన్ను ద్రిమ్మరిరాచకన్నియ ల్వరవుళ్లు పులుఁగుల మేల్బంతి వలఁతిమావు తెఱగంటిదొర లెల్ల దినుసు మీఱినలెంక లలరువిల్దాల్పు ముద్దులమఱంది పోరోగిరపునిరాబారి కూరిమిపట్టి మామమామ యనుంగుమామగారు | |
| తే. | తమ్మిపూఁజూలినాలుగునెమ్మొగమ్ము లాటగీములు గాఁగఁ జెన్నలరునట్టి పల్కుననఁబోడి జానగుపల్కులిడుచుఁ గనికరం బెచ్చ మము నిచ్చఁ గాచుఁగాత. | 6 |
| సీ. | నేలతాలుపురాచచూలిగాదిలికందు దొసఁగుచీఁకటిచాల్పుతొగలవిందు దుగతిగమొగములజగజెట్టితోఁబుట్టు పొగడువారలనట్టుపుడుకుఁజెట్టు పెనుబొజ్జ నిడ్డెన ల్దినెడునేరుపువాఁడు మేలికడానిడాల్మేనివాడు గోడదొల్చెడుఱాఁగగుఱ్ఱంపునెఱజోదు గాటంపుటక్కటికములపాదు | |
| తే. | నగుచు జిగిచెక్కుగవ జాఱునామునీరుఁ గ్రోలుటకుఁ జేరుజమిలిముక్కాలిబారు గొనబుపాటల కెదఁ గేరుకొనుచు సౌరు నెరపునెఱవేల్పు నామది నిలచుఁగాత. | 7 |
| సీ. | లాఁగడాఁగుడుఱాఁగ ప్రోఁగు లిడెడు ప్రోడ కొలలు దొసంగులు దొలఁచుమేటి జక్కులరాయిక్కఁ జొక్కు నెక్కటియుద్ది కడిఁదిముక్కొటికసోఁకుడులదిగులు వలపు మోపరిజియ్యవలమూలదయ్యంబు గుండులతలకట్టుపండుదండి తొలుకడరాఱాపసలు గెబ్బునర్తిఱేఁ డెద్దడిగుబురుకాఱిర్ల ప్రొద్దు | |
| తే. | బారకైనీటికానుపుపాపయప్ప పుడుకుఁ గల్గలజెట్టికై పొడమినట్టి మెట్టవాల్పిట్టరామేనిదిట్టవేల్పు క్రచ్చు లొడగూర్చి మము నిచ్చఁ గాచుఁగాత. | 8 |
| క. | ఎదఁ గుదు రగువేడుకఁ బొగ, డుదుఁ బదియరదములదొరకొడుకుకత కడు నిం పొదవఁ గదియించి యసమునఁ బొదలినబల్లిదునిఁ బుట్టఁబుట్టువుతపసిన్. | 9 |
| తే. | రంగు మీఱంగ మున్ను దెలుంగుబాసఁ గబ్బములు గూర్చి పొగడికఁ గన్నవారి భీము నన్నయఁ దిక్కయ సోము నెఱ్ఱ ప్రగ్గడను బాచయను గూర్మి నుగ్గడింతు. | 10 |
| సీ. | ఏమేటియడగుఁగెందామర బల్గాఁపు రపుటేఱ్లఱేని కబ్రంపుఁదెప్ప యేబల్లిదుఁడు చెవి నిడునక్కరములు చె ల్వపుముత్తిమేడకు వరుసమెట్టు లేపున్నెములగని యెఱిఁగించుమేల్తెల్వి కల్లజగంబుచీఁకటికి దివ్వె యేదంట యొసఁగునున్బూది దోసపుఁదుల్వ గాడ్పుదిండులకు వాకట్టుమందు | |
| తే. | తనర నేపెద్దపుట్టువు లనుకడింది తెవులునకు వెజ్జుఱేఁ డట్టిదెందులూరి కొలపుపాలేటినిండుజాబిలి యనంగఁ దనరులింగనగురుని డెందమునఁ దలఁతు. | 11 |
| క. | అని యెల్ల వేల్పులం బే ర్కొని కబ్బము కూరుపరుల గురునిఁ గడంకన్ గొనియాడి యచ్చతెలుఁగునఁ బనివడి కబ్బంబుఁ గూరుపం గడఁగునెడన్ | 12 |
| సీ. | కప్పుకుత్తుకవాఁడు గాలి మేఁతరి యందె జోటివాఁ డరమేయి జోటివాఁడు విన్ను క్రొమ్ముడివాఁడు వెండిగుబ్బలి గూడె మేలువాఁ డుడివోని మేలువాఁడు గిత్త తత్తడివాఁడు బుత్తి ముత్తు లిడంగఁ జాలువాఁ డౌదల జాలువాఁడు మొనల కైదువవాఁడు మినుకు కైవారము ల్మెచ్చువాఁ డని బీర మెచ్చువాఁడు | |
| తే. | సంకు జిగివాఁడు వలకేల జింకవాఁడు ప్రాఁత మగవాఁడు వెలిబూది పూఁతవాఁడు మిక్కుటంబగు మక్కువ నొక్కనాఁడు దనరఁ గలలోన మ్రోలఁ గన్గొనఁగ నయ్యె | 13 |
| క. | కనఁబడి యబ్బలు జేజే కనికరపుం గొనబుఁ జూపు గనుఁగవకొన నె క్కొనఁ గన్గొని నాతో ని ట్లనియెన్నునుదియ్యపల్కు లలరఁగఁ జాలన్ | 14 |
| సీ. | నీ తండ్రి గంగన్న నిచ్చనిచ్చలు మమ్ముఁ బూజించు నపరంజి పూలచేత నీ తల్లి లచ్చమ్మ నే సంతసిల నోరె ములు వెట్టుఁ బుడమి వేల్పులకు నెల్ల నీ పిన్నతండ్రు లెన్నికలు గాంచిరి జగ్గ నయు సింగరాజును నరసనయును నీ తమ్ము లెలమి నొందించిరి మమ్ము సిం గనయు జగ్గనయు సూరనయుఁ జెలఁగి | |
| తే. | నీ యనుగురాణి బుచ్చమ నెలఁత లెల్ల మేలనఁ దనర్చె గట్టురాచూలిఁ గొలిచి మానికంబవుగద కూచిమంచి కొలము నందరయఁ దిమ్మకవిరాయ యలర నీవు | 15 |
| తే. | మునుపు మాకీవె భల్లాణుఁడనెడి ఱేని కతయు రుక్మిణి పెండిలికతయు బొబ్బ మెకపు గుబ్బలి కతయు మేల్మీఱ నీల పెండ్లికతయును గబ్బము ల్పేర్మిఁ గూర్చి | 16 |
| క. | కావున మా కప్పనముగఁ గావింపుము చాల్పు కుత్తుకల తొలి జేజేఁ జేవ దలిర్ప నడంచిన యా వెరవరికతయుఁ బూని యచ్చతెనుఁగునన్ | 17 |
| తే. | ఒనరఁ బేరులు బిరుదులు తెలుఁగు సేయఁ బోలదని మున్ను పెద్దలు పూని త్రోవ యిడిరి గావునఁ గూరుపు మిదియు నట్లు తెనుఁగు తెఱఁగెల్ల నేర్పడఁ దిమ్మ ప్రగడ | 18 |
| క. | నన్నయ మొదలుగఁ గల్గిన మున్నటి బల్లిదులు గబ్బములు గూర్చిన జా డన్నుడువుల తెఱఁ గెల్లను బన్నుగ గుఱియెఱిఁగి కూర్పు పద్దెంబులలోన్ | 19 |
| తే. | అనుచు నానతి యొసఁగి యగ్గొనముల గని కను మొఱంగిన నపుడ మేల్కాంచి యబ్బు రమును వేడ్కయు మిగుల డెందమునఁ బెనఁగొ నంగ నవ్వేలుపునకు దండము లొసంగి | 20 |
| క. | జక్కులదొర చెలికానికిఁ గొక్కుహుమాజోదు నయ్యకుం జొక్కపు లేఁ జుక్కల ఱేనిని వేలుపు జక్కర నౌదలను దాల్చు జగవేల్పునకున్ | 21 |
| క. | మల విల్లుఁ జిలువ నారియు బులుగు సిడముజోదు ముల్కి పుడమి యరదముం దొలుపలుకు వారువంబులు జెలఁగఁగఁ దిగ ప్రోళ్ళుఁ గూలిచిన బలియునకున్ | 22 |
| క. | వెండిమలం బండి మొలం దండి సెలఁగ వెలుఁగు తోలుదాల్పు వలఁతికిన్ మెండుగఁ బెనుపండుగుగను గొండ యనుఁగుఁ గూతుఁ గలిసి కులికెడు దొరకున్ | 23 |
| క. | త్రొక్కటఁ జని యక్కట! యని మ్రొక్కుటఁ గని తపసినిసుఁగుఁ బ్రోచు తలఁపునన్ మిక్కుటమై యక్కటికము పిక్కటిల న్వెఱపు మానిపినయెక్కటికిన్ | 24 |
| క. | మలఁ బ్రోలు న్మొలఁ దోలుం దల జాలు న్మొనల వాలుఁ దరలనిమేలుం దెలిడాలు న్మెక మెలసిన వలకేలుం గలిగి చెలఁగువన్నెలగనికిన్ | 25 |
| క. | జేజేరాఱాబాజుజ గాజిగి నొగిఁ దెగడి నెగడఁగాఁ జాలెడు మే ల్తే జూనెడుకుత్తుక నిల జేజేకు న్మొగిలుదారిసిగ జేజేకున్ | 26 |