| ఇతిహాసములు | అచ్చతెలుఁగు రామాయణము | సుందరకాండము |
| క. | సిరులఁ బరగించి బత్తుల నిరవగు కనికరముతోడ నేలుచు నెపుడున్ దొర మీఱిన దొరయనఁ దగి విరివిగ జగ మేదు మెట్టువిలు బలుదిట్టా! | 1 |
| తే. | ఆలకింపుము గూర్మిఁ గయ్యంపుఁ దిండి తపసి కన్నాకు కత విను తపసిఁ జూచి యిట్టులను గాడ్పు చూలి యిట్లివము సూడు గ్రుంకునంతకు నొదిగి యక్కొండనున్న | 2 |
| క. | అంతటఁ గడలందెల్లఁ గొ ఱంత యొకింతయును లేక ఱంపిల్లె నిరుల్ పంతపు రక్కసి మూఁకల ఱంతు లుడిగె నెలమిఁ గనిరి ఱంకు వెలందుల్ | 3 |
| ఆ. | అపుడు కోఁతిమిన్న యసదురూపునఁ జని ప్రోలి చాగ కాని మూలగవను దూఱి యచటఁ గాంచె మాఱట మిత్తియో యనఁగఁ బరఁగు లంకిణిని జెలంగి | 4 |
| ఆ. | కాంచి దీని నిపుడు ద్రుంచినఁ బ్రోలి వా రెఱిఁగి చేరవచ్చి రేనిఁ గర్జ మెల్లఁ దప్పు మరల నేఁగుచోఁ దునిమెద నని తలంచి సరగ నవలి కరిగె | 5 |
| క. | అరిగెడుచో నీతఁడు నెఱి నరయు నెడ న్వెలుఁగు వలయునని జేజే ల్వా విరిఁ బట్టు దివ్విటీయనఁ దిరముగ రేఱేఁడు తూర్పు దెసఁ గన్పట్టెన్ | 6 |
| తే. | అట్లు జాబిల్లి తనకు జోడై చెలంగఁ బొలుపు తళుకొత్త మెల్లనఁ బ్రోలు సొచ్చి యొరులు తన్నెవ్వ రెఱుఁగక యుండునటులఁ గలయ నెల్లెడఁ బరికింపఁగాఁ దొడంగి | 7 |
| సీ. | ఇరవులు రోసి దేవరగుళ్ళు నెమకి యు ప్పరిగలు వెదకి చప్పరము లరసి మోసల ల్దడవి లోముంగిళ్ళు గనుఁగొని గొందులు పరికించి కొల్ల గాంచి మందసంబులు దేవి మాడువు ల్పొడఁగని కొత్తడంబులు చూచి కోట గవఁను లారసి బలితంపు తేరులు గాలించి కొలఁకులు తోఁటలు గలియఁ బెట్టి | |
| తే. | యాటపట్టులు చొరరాని చోటు లెల్లఁ దేటతెల్లముగాఁ గని తెఱవ నెందుఁ బొడగనఁగ లేక కడు డెందమునఁ గలంక నిగుడఁ బొలదిండి యెకిమీని నగరు సేరి | 8 |
| సీ. | పసిఁడి గోడలు పుల్గుపచ్చ తోరనములు గొప్ప క్రొన్నెలఱాల యుప్పరిగలు మగఱాలు దాపిన పగడంపుఁ గంబముల్ తెఱగంటి రాచరాతిన్నియలును బిల్లికన్ రతనంపు పెద్ద మందసములు ప్రొద్దుగల్నాడెంపు మిద్దియలును జెలువంపు ముత్తెంపు చలువ చప్పరములు వలుద నెత్తమ్మి కెంపుల తలుపులు | |
| తే. | మఱియు వెలలేని ముత్తిగ మానికముల యందలంబులు నుయ్యెల లరదములను గవని కట్టులుఁ బెండియల్ గద్దియలును బాఱఁ జూచుచు సరిగ లోపలికిఁ దూఱె | 9 |
| తే. | తూఱి యెనలేని సొగసుల మీఱుచున్న జాళువా మేడఁ గన్గొని సంతసమున డాయఁజని యందు మేలికడాని చీని పనుల నలరొందు నొక పూలపాన్పునందు | 10 |
| సీ. | చెఱగొన్న ముగుద జేజే పొలంతు లలంతి నిదురలతో నజ్జ లొదిగి యొత్త మొనసి యీరైదు క్రొమ్ముడులఁ జాగపు చెట్ల పూవుటెత్తులు క్రొత్త తావులీన నొడలి మేల్రవణంపు టొరపు మానికములు మలయు దివ్వెలలతో మాఱ్వెలుంగఁ దివిరి వేల్పుల మీఁది రవరవ ల్నిగుడించు వడువున నూర్పులు గడలుకొనఁగఁ | |
| తే. | బుడమి పుట్టువు నెదలోన నిడి మరల్ప రాని వలవంత సెకలఁ గరంగి బయల మఱచి నిదురించు రక్కెస మన్నెగానిఁ జూచి తనలోన నిట్లనుచుం దలంచె | 11 |
| ఉ. | అద్దిఱ! వీని టీవియు నొయారము దిట్టతనంబు చేవయున్ దద్దయు నబ్బురం బెదకు దార్కొనఁ జేయఁ దొడంగె నిట్టి బ ల్గద్దఱికాఁడు వాఁడిని జగంబులు గెల్చుట యేమివింత? మే ల్బుద్ది యొకింత లేక చెడిపోవు తలంపిడెఁగాక యిత్తఱిన్ | 12 |
| క. | ఈ టీవికి నీ పేర్మికి మేటితనమునకుఁ జాల మేలి గొనంబే నాటుకొనియున్న నీతఁడు సేటెన్నడు లేని సిరులఁ జెన్నారుఁగదా! | 13 |
| క. | తెఱఁగెఱుఁగక రామునితో గుఱుతుగఁ బగఁ గూడఁబెట్టుకొని కొలమెల్లం జెఱచుకొనెఁగాక యాతం డుఱఁడుగదా! పూని వేల్పుటొడయని నైనన్ | 14 |
| క. | అని యెదలో నెన్నుచు మె ల్లన నాతని సెజ్జ పజ్జలకుఁ జని యొక మా టున నిలిచి కోఁతిదొర తన కనుదోయికి నబ్బురంబు గడలుకొనంగన్ | 15 |
| సీ. | ఎడసిన జిలుఁగు పయ్యెదతోడ ముడివీడి నేల జీరాడు పెన్నెఱులతోడఁ గరఁగి నెమ్మొగమెల్లఁ బెరయఁ గస్తురితోడఁ దొలఁగిన చెవియాకు దోయితోడ నుడుగక నినుచు నిట్టూర్పు గాడ్పులతోడ జాఱిన నెఱి బన్న సరముతోడఁ జెదరిన పాపట చేర్చుక్క బొట్టుతోఁ బొడిపొడియైన మే పూఁతతోడ | |
| తే. | మగని పిమ్మట నెమ్మేను మఱచి నిదురఁ జెందు మందోదరిని జూచి చెలువ కిపుడు చెడు తెఱంగులు గడుగనఁబడఁ దొడంగె నంచుఁ దలయూచి చయ్యన నచటు దరలి | 16 |
| తే. | పొలసు మేపరి ఱేని తోబుట్టువులును గొడుకులును నెమ్మినుండు టెంకులకుఁబోయి వెలఁది నచ్చోటు లందెల్ల వెదకి వాండ్ర పెంపు గన్గొని యెదలోన బిట్టు సోలి | 17 |
| క. | మఱియుఁ బేరగు రక్కసి నెఱజోదుల కాపురంపు నెలవుల యందుం జెఱసాలలందుఁ జెలిఁ బ ల్మఱు నారసి కనఁగలేక మదిఁ దలఁ కెలయన్ | 18 |
| చ. | కటకట! రాచ రేవెలుఁగు కర్జము పూని కడింది చేవతో నిట కరుదెంచి బోఁటి నిపు డెందును గానక కోఁతి ఱేని చెం గటి కిఁక నూరకే మరలగాఁ బఱతెంచిన నెల్లవారుఁ బి మ్మట నగరే? మగంటిమియు మాట నిజంబును గోలుపోవదే? | 19 |
| తే. | లెక్క కెక్కువయగు కోతి లెంకలెల్ల గనుఁగొనఁగ నేలఱేఁడు నన్గదియఁ బిలిచి పడఁతి కిమ్మని యుంగరం బిడుట కెటులఁ బని యొనర్పక క్రమ్మఱఁ జనఁగఁ బోలు? | 20 |
| ఆ. | తులువ రక్కసుండు దొంగిలి తెచ్చుచో మడఁతి బీతు గుడిచి మడిసె నొక్కొ? కానఁ గానరాని కడ దాఁచె నొక్కొ యి చ్చెనఁటి? యింకనేమి సేయువాఁడ? | 21 |
| చ. | వెలఁదినిఁ జూపుమంచుఁ దొలివేలుపు రాయని యెమ్ము లొక్కటం గులగులఁగా నడంతునొ? రగుల్కొన జేతునొ ముజ్జగమ్ములన్? మిలమిలలాడుచున్ దవిలి మింట వెలింగెడు రిక్కలన్నియుం జలజల రాలఁ దన్నుదునొ? సంద్రము లుమ్మడి నింకఁ జేతునో? | 22 |
| క. | కొండలు పిండి యొనర్తునొ? గండెసఁగఁగ నలువగ్రుడ్డు గాలింతునొ? వే చెండుదునొ గుదియ తాలుపు కండలు గుండియలు వేల్పుగమి నొంపుదునో? | 23 |
| క. | అని యిత్తెఱఁగున డెందం బునఁ దలఁపుచుఁ గొమ్మ మెకపు పోటరి యత్తా పునఁ దరలి మెల్లమెల్లనఁ జని యొకచో మిగుల సంతసము దైవారన్ | 24 |
| సీ. | మారేళ్ళు నేరేళ్ళు మావులు రావులు పనసలు గొజ్జంగు లనఁటు లిప్ప లీడెలు సంపంగు లిరువుడు ల్పొగడలు దబ్బలు ప్రబ్బలు త్రాళ్ళు మేళ్ళు గోఁగులు రేఁగులు క్రోవులు మోవులు మద్దులు నిమ్మలు లొద్దుగులును గలుగొట్లు పొన్నలు కడుములు వెలగలు గోరంటలు సిరిక ల్నారికెడము | |
| తే. | లందుగులు గేదఁగులు మఱ్ఱు లిందుగులును మోదుగులు దాసనంబులు మొదలు గలుగు మ్రాఁకులకు నిక్క యగుచు వేమఱుఁ జెలంగు చున్న నాడెంపు పూఁ దోట యొకటిఁ గనియె | 25 |
| క. | కని తప్పటడుగు లిడుచుం జని మెల్లనె యందు దూఱి జతనంబున నిం తిని నెమకుచు మ్రోలం జ క్కని బంగరు మేడ యొకటి గనుఁగొని సరగన్ | 26 |
| క. | అమ్మేడ చివర కెంతయు నెమ్మదితో నెక్కి కడలు నెమకుచుఁ జెట్టుం ద్రిమ్మరి తెలిడాలు మెకం బిమ్ముగ నొక మ్రానినీడ నెనసిన కడఁకన్ | 27 |
| సీ. | కట్టిన నెఱ మాపు గడితంపు పుట్టంబు సెన్ను మీఱెడు నార చీరగాఁగఁ గలయంగ నంటలు గట్టి మూఁపున వ్రేలు నిడుద పెన్నెఱులు కెంజడలుగాఁగఁ బుడమిపై నిచ్చలుఁ బొరలుచో నొదవిన బూడిద మైపూత బూది కాఁగ నిదురయుఁ గుడుపును వదలి యుండుటయెల్లఁ దరలక యొనరించు తబముగాఁగఁ | |
| తే. | వానలకు నెండలకు గరువలికి నలికి సైఁచి డెందంబు తన పాలి సామియందె నిలుపుకొని కేరు జోగి జాబిలి తెఱఁగునఁ బొనరు నొక రాచ తలిరాకుఁబోఁడిఁ జూచె | 28 |
| తే. | పెల్లు గిఱిగొన్న బావురు పిల్లిగముల చేతఁ జిక్కిన యాట రాచిలుక వోలెఁ జెడుగు పొలదిండి పడఁతుల నడుమనున్న యన్నెలంతుక నటఁ జూచి మిన్ను ముట్టి | 29 |
| ఆ. | పడఁతి చందమెల్లఁ బరికింపఁ బంట పై దలి యనుంగుపట్టి వలెనె తోఁచు చున్న దనుచు మేడఁ గ్రన్నన దిగి యాపె గూరుచున్న మాని కొనకుఁ బ్రాఁకె | 30 |
| తే. | ప్రాఁకి యమ్మేటి యిరుగుడు మాఁకు చివురు జొంపములలోన నిఱికి యజ్జోటి సారె సారెకును రామ రామ యన్పేరు నుడువ నొనర నాలించి సీతయంచును దలంచి | 31 |
| క. | ఈ పున్నియంపు జెలికే రూపునఁ దన నిక్కువంపు రూపేరుపడన్ జూపుదుఁ? బైదలితో నిఁక నీ పట్టున మాటలాడ నెట్లొనగూడున్? | 32 |
| తే. | అని తలంచుచునున్నచో నంతలోనె మన్ను కానుపు సొగసెల్ల మదిని నిల్పి రక్కసుల ఱేఁడు మిగుల విరాళి దేలి తాల్మి యెల్లను వ్రీలి తత్తరము తోడ | 33 |
| సీ. | చలువు గొజ్జఁగినీట జలకంబులాడి జి ల్గు మణుంగు గొనబు పుట్టములు గట్టి వినుమ్రాని పరువంపు విరిదండ లెదనించి కలయ నెమ్మెయిఁ గమ్మ కలపమలఁది వెలమించు రతనంపు గిలుకు పావలు మెట్టి కేల జాబిలి పువ్వు వాలువట్టి మొసలివాపోఁగు లింపెసఁగ వీనులఁ బెట్టి తలల హొంబొమిడికల్ తనర నిల్పి | |
| తే. | గొలుసు లుంగరములు మురుంగులును బతక ములును దాళీలు నేవళంబులును గండ పెండెరంబులు మొదలగు పెద్ద తొడవు లెల్ల బలితంపు సింగార మెలయఁ బూని | 34 |
| సీ. | అచ్చర విరిఁబోఁడు లాలవట్టము లూన వినుటెంకి చెలులు వీవనలు వైవఁ బాఁప చానలు దమ్మపడగలు సేకొనఁ బక్కి కొమ్మలు బరాబరు లొనర్పఁ తెఱగంటి గాణల తెఱవ లెల్లను బాడఁ దొలివేల్పు బోండ్లు కైదువలు దాల్ప జక్కుల పొలఁతు లిచ్చల దివ్విటీ ల్వట్టఁ దత్తడి మోర పైదలులు వొగడ | |
| తే. | మఱియుఁ దక్కిన వేలుపు మచ్చెకంటు లూడిఁగపు చెయ్వు లొనరింప నీడు లేని ఠీవిఁ బొదలుచుఁ జెలువంపు పూవుఁదోట కేపు దళుకొత్త గొబ్బున నేఁగు దెంచె | 35 |
| ఆ. | ఏఁగుదెంచి సొగసులేర్పడ నమ్మన్ను చూలి మ్రోల నిలిచి సొరిదిఁ బలికె వాలుఁగంటి వట్టి బేలవై నీ విట్లు వెతలఁ గుందఁ దగునె వెఱవుమాలి? | 36 |
| క. | ఇమ్మేటి సోయగంబున కి మ్మేలిమి గారవమున కిప్పగిది నయో! నెమ్మది బెరయక ముద్దుల గుమ్మా! బలితంపు దెసలఁ గుందుట మేలే? | 37 |
| క. | క్రొన్ననబోఁడిరొ! దిటమగు జన్నియఁ గైకొని మెఱుంగు జవ్వనమెల్లన్ మిన్నక కోనం గాచిన వెన్నెలగాఁ జేయఁ దగునె వేఱిడివగుచున్? | 38 |
| క. | అలములు దుంపలు నమలుచుఁ బొలములఁ బడి తిరుగు రాచపురువులపై ని చ్చలముగఁ దలఁపిడి యకటా! చలమున నిటులుంట ప్రోడ జాడయె నీకున్? | 39 |
| క. | తెఱవా! నాడెపు టచ్చఱ తెఱవలకున్ లేని మేల్గదియ వచ్చు నెడం జెఱుచుకొనఁ గూడ దిపుడీ కఱటితనం బుడిగి నెమ్మిఁ గైకొను నన్నున్ | 40 |
| సీ. | మలగొంగ యలరు టెత్తులు గట్టియిడుచుండు దంటమోముల సామి వంటసేయు గవని వాకిలి నిచ్చఁ గాచుచుండు జముండు వాలు మోచుక యుండు మూలఱేఁడు త్రాడు దాలుపు మేలి రతనముల్ గొనితెచ్చు గందవొళ్ళొసఁగు నాకసపుఁ గుఱ్ఱ బచ్చయి వెచ్చంబు లిచ్చు రొక్కపు దొర దళవాయియై కొల్చు చిలువతాల్పు | |
| తే. | తమ్మి పూఁజూలి మ్రోల పొత్తమ్ము విప్పి చదువుచుండుఁ గరంబు హెచ్చరికతోడ నిట్టి నా దొడ్డతన మెద నెన్నికొనక గోల! యూరక చెడిపోవనేల చెపుమ? | 41 |
| సీ. | అడవుల నిడుమలు గుడుచుచుఁ దిరుగు రా గవుఁ డింక నిచటి కేకరణి వచ్చు? వచ్చి అచ్చెరువుగా విచ్చలవిడిఁ బొంగి పాఱెడు కడలి నేపగిది దాఁటు? దాఁటి గాటపు నల్లద్రావుడు పౌఁజుల గొఱలు నిద్దీవి యే నెఱినిఁ జొచ్చుఁ? జొచ్చి యొచ్చెము లేక హెచ్చున నడరు నా తోడఁ గడంగి యేజాడ నెదురు? | |
| తే. | నెదిరి పఱవక దురమున నెట్లు నిలుచు? నిలిచి యే చందమున నన్ను నెమ్మి గెలుచు? గెలువగాఁ బోలదిఁకఁ బెఱ తలఁపు లుడిగి తీవబోఁడిరొ! కోరికల్ దీర్చు మిపుడు | 42 |
| తే. | కోఁతులను గొండమ్రుచ్చులఁ గూడఁ బెట్టు కొని పుడమిఱేఁడు మాతోడ మొనయఁ గలఁడె? వట్టి యడియాస లన్నియుఁ గట్టిపెట్టి పైదలిరొ! యింక మేల్పట్టుఁ బట్టుకొనుము | 43 |
| తే. | కొదమ బెబ్బులి నేడిక లెదురఁ గలవె? దొడ్డ సింగంబు నేనుఁగు ల్దొడరఁ గలవె? పిల్లితో నింటి యెలుకలు పెనఁగఁ గలవె? కలన నా మ్రోల మానుసు ల్నిలువఁ గలరె? | 44 |
| క. | ప్రన్నని జాణఁడు లేఁడిక వెన్నవలెం గరఁగి మదికి వేడుక లొదవన్ సన్నకసన్నం గదియక మున్నరకలఁ బోవఁ దగునె ముగుదల కెందున్ | 45 |
| ఆ. | అనిన మోమువంచి యవ్వెలందుక యొక్క పూరిపుడక కేలఁ బూని వానిఁ గూర్చి పలికె ‘నోరి! కూళ రక్కసుఁడ! యి క్కొఱఁత కఱద లేటికొఱకు వినుర! | 46 |
| క. | ఉక్కేది నేలఱేఁడులఁ డక్కునఁ గను బ్రామి నన్నిటకుఁ దెచ్చిన బ ల్తెక్కలికాడవు నీ కీ చిక్కని మగతనము దెల్ప సిబ్బితి గాదే? | 47 |
| క. | ఎల్ల జగంబుల లోపల బల్లిదుఁడగు రాగవుండు పరికింపంగాఁ జెల్లంబో నీకెంతయు నెల్లిదమై తోఁచె నింక నేమియనఁ జనున్ | 48 |
| క. | అల నేలఱేని బెడిదపు టలుగులు నీ లంక ముంచి యరుదుగ నీ చే తులు దలలు దునుముచో ని మ్ముల నాతని లావు నీవు పొడఁగనెదు గదా! | 49 |
| క. | కుఱకుఱ వేలుపు తెఱవలఁ జెఱ వట్టిన యటులె తెలివి చెడి రామునితో నుఱక పగఁ దెచ్చుకొంటివి కొఱవిం దలఁగోకు కొనఁగఁ గోరెడు కరణిన్ | 50 |
| తే. | పొట్ట క్రొవ్వున నిప్పుడ ప్పుడమిఱేని కడిమి యెఱిఁగియు నెఱుఁగవు గాక నీవు పాలివాండ్రొక పదునాల్గు వేల కూళ పొలసు మేపరు లతనిచేఁ బొలిసి చనరె? | 51 |
| క. | గరితలఁ బలుమరుఁ గలఁచుచు గరువము మెఱయంగ నీ మగంటిమి నీవే కరమరుదుగఁ గొనియాడెదు సిరియుం బ్రదుకెల్ల సరగఁ జెడుఁగద చెనటీ! | 52 |
| తే. | మిడుత గడితంపు టెరగలి మీఁద నుఱికి పొలయు తెఱఁగున నా ఱేని చిలుకు టగ్గి కగ్గమై నీవు దిగ్గన మ్రగ్గె దుఱకఁ దులువతనమున నిపుడింత త్రుళ్ళనేల? | 53 |
| క. | సిరి మగఁడు జడల సిక దే వరయున్ రాయంచ వారువపు జోదును జె చ్చెర నడ్డగింపఁ బూనిన దురమున రాగవుఁడు నిన్నుఁ దునిమెడుఁ జుమ్మీ! | 54 |
| తే. | అనుచు నింతయు సరకుసేయక నెలంత దూలఁ బలికిన రక్కసి దొర కడంగి కినుక నిగుడంగ నొడుపు దప్పిన పిసాళి నాగుఁబామును బోలుచు నవుడు గఱచి | 55 |
| క. | అద్దిఱ! ఆడుదిగా యని తద్దయుఁ గనికరము సేయఁ దలఁచిన నెంతో గద్దఱియై ప్రేలెడు ని మ్ముద్దియ యిఁకఁ దేర్పకున్న మోసము కాదే? | 56 |
| సీ. | నిడుద వెన్ను గయాళి తొడవుల దొరయుండు గుండు గండెసఁగఁగఁ బెండు సేసి తెలిగూడు కానుపు తేజీ వజీరు చే విప్పుగాఁ గొదలేని మెప్పులంది మగమానికపు వాలు జగబంటు నగరునఁ గొఱలేని సిరియెల్లఁ గొల్లవెట్టి రూడి నెన్నికఁగన్న నాడెంపు తెఱగంటి చిగురాకు బోఁడులఁ జెఱలు దెచ్చి | |
| తే. | యెపుడు నిరుసత జగముల నెదురు లేక మిక్కుటంబైన తేజున మెఱయు నన్నుఁ జులకఁ బలుకుచు నున్న దిక్కలికి యిపుడు చెండుబెండాడి రూపఱఁ జేతు ననుచు | 57 |
| క. | తివిరి కరవాలు సేకొని ఱవఱవ లెసఁగంగ నత్తెఱవ పైఁ జనుచోఁ దివ జడల రేయి ద్రిమ్మరి పువుబోఁడి యొకర్తు నెయ్యమున నడ్డంబై | 58 |
| క. | దేవఱ! నీ విపు డలుగఁగ నీ వెలఁదుక బేసికంటి యెకిమీఁడొ? జముం డో? వేల్పుఱేఁడొ? నెత్తురు ద్రావుడు గమికాఁడొ? నీళ్ళరాయఁడొ? చెపుమా! | 59 |
| తే. | బమ్మ కొలమునఁ బుట్టిన బల్లిదుఁడవు చదువు లెల్లను నెఱిఁగిన జాణ వెల్ల కడలు గెలిచిన నెఱ మొనగాఁడ విట్లు తెఱవపై నీవు కైదువు వెఱుకఁ జనునె? | 60 |
| క. | తాలిమి పూనుము కొఱకొఱ చాలింపుము కొఱఁత గొనము సడలింపుము వే వేలింటను జేజే నవ లా లుండఁగ నీకు నివ్వెలందుక గొఱయే? | 61 |
| తరలము | అనుచు నెచ్చెలి యోర్పు పుట్టఁగ నాడుచోఁ దనుఁ జాల న చ్చెనఁటి రక్కసి ఱేఁడు పల్కిన చిన్న మాటల కెడ్దలోఁ గనలి పంటవలంతి గాదిలి కాన్పు పెద్ద యెలుంగుతో మొనసి యామని గండుకోయిల మ్రోఁగు చాడ్పున నేడిచెన్ | 62 |
| తే. | ఏడ్చుటలు చూచి తెరగంటి యిగురుబోండ్లు చిలువ బోటులు జక్కుల చెలులుఁ బులుఁగు చేడియలు నేడ్చి రప్పు డచ్చెట్టు మీఁద నుండి రిక్కల త్రోవ మన్మండు గినిసి | 63 |
| ఆ. | తొడరి వీని నిపుడె తునుముదునో కాక మన్ను కాన్పుఁ జూచి మాటలాడి మరలి పోవునపుడు మడియింతునో యంచుఁ దత్తరమున మదినిఁ దలఁచు చుండె | 64 |
| క. | మసలక నా కిప్పొలఁతిం బొసఁగింపుఁడు కాకయున్నఁ బొరిగొనుఁడని ర క్కసి చెలుల నునిచి రావణుఁ డు సనియెఁ దన నగరునకుఁ గడున్ సిబ్బితితోన్ | 65 |
| తే. | అంత నారేయి ద్రిమ్మరి యలరుబోఁడు లలసి యందంద నిదురించునపుడు త్రిజట చెడుగుఁ గలఁ గాంచి రావణు చేటు వారి కెల్ల నెఱిఁగించి మక్కువ యెదఁ దలిర్ప | 66 |
| తే. | పొలఁతి గములార! యింక యిప్పుడమి కాన్పు నేఁప వలదంచుఁ గనుమూయు నెడ యెఱింగి చెట్టులో నుండి కరువలి పట్టి మిగుల నెలమి నా రాచ వాల్గంటి కిట్టులనియె | 67 |
| తే. | పడఁతి! నీ ఱేని కూరిమిబంట నతఁడు దమ్ముఁడును దాను మాల్యవంతమ్ము నందుఁ దమ్ము వలఁగొని కోఁతి మొత్తమ్ము లెల్ల నోలిఁ గొలువంగ నెమ్మది నున్నవాఁడు | 68 |
| క. | ఓ చాన! యానవాలుగ నాచే నీ యుంగరంబు నలువుగ నీ కా రాచూలి పనిచె నిదిగోఁ జూచుకొనుమటంచు నెలమిఁ జూపించుటయున్ | 69 |
| తే. | డెంద మిగురొత్త నమ్మేలి కుందనంపు టుంగరము దన మగని చేయుంగరంబు గా నెఱింగియు నమ్మక వానిఁ జూచి యన్ను తలమానికం బిట్టులనుచుఁ బలికె | 70 |
| తే. | అన్న! యే ప్రొద్దుఁ డక్కరులగు కడింది పొలసుదిండుల చేతి చెట్టలఁ గలంగు చున్న కతమున నెకిమీని యుంగరంబు గన్గొనియు లోన నమ్మిక గలుగ దిపుడు | 71 |
| తే. | ఎవ్వఁడవు నీవు? నీకుఁ బేరెద్ది? యెట్లు పుడమి ఱేనికి నీకును బొందు బెరసె? నద్దొరల రూపు లెట్టి? విం దనుచు నపుడు సామి నను గూర్చి నీతోడ నేమి పలికె? | 72 |
| క. | ఏ కరణిఁ గడలి దాఁటితి? వీ కడ కేపగిదిఁ ద్రోవ యెఱిఁగితి? వెట్లీ రాకాసుల మొఱఁగితి? విఁక నీ కల తెఱఁగెల్ల మాకు నిక్కము చెపుమా! | 73 |
| క. | అనవుడు నతఁడ ప్పొలతిం గనుఁగొని యిట్లనుచుఁ దెల్పఁగడఁగెం దల్లీ! విను మేఁ జలినట్టు కతం బున నంజన యనెడు చెలికిఁ బుట్టిన వాఁడన్ | 74 |
| క. | హనుమంతుఁ డనెడు పేరం దనరారెడువాఁడఁ దొవల దాయ యనుఁగు బి డ్డనికిం గడు నెయ్యుఁడ నీ పెనిమిటికిం గూర్చునట్టి బిరుదుమగండన్ | 75 |
| సీ. | అమ్మ! నిన్నీ రేయి ద్రిమ్మరి యెకిమీఁడు గొనివచ్చు నెడ నిర్లగొంగ కొమరుఁ డిమ్ముగా ఋష్యమూకమ్మను గట్టుపై మముఁ గూడి మెలఁగుచో నమర నీవు రవణము ల్దివిచి చీర చెఱంగుతోఁ గట్టి వైచిన నవి దాఁచి వగపుమీఱ రాముఁడుఁ దమ్ముఁడు రమణ నిన్వెదకుచు నచటి కేతెంచిన నతఁడు వారి | |
| తే. | తోడ నెయ్యం బొనర్చి యత్తొడవులిడిన మిగుల నలరొంది దొర వాని పగతుఁడైన వాలిఁ దెగటార్చి వాఁడేలు నేల కెల్ల యొడయనిగఁ జేసి నెమ్మదియొదవ నునిచె | 76 |
| క. | ఆ కోఁతుల దొర దనుఁ బలు మూఁకలతోఁ గొలువనుండి ముద్దియరో! యీ రాకొమరుఁడు నిన్వెదుకుట కై కొందఱ బంట్ల నేర్చి యనిపెడు నెడలన్ | 77 |
| క. | రంగుగ నా చేతికి ని య్యుంగర మిడి సెలవు వెట్ట నుప్పొంగుచు ను ప్పుం గడలి దాఁటి వచ్చి ని నుం గాంచితి నిచట వేడ్క నూల్కొనఁ బడఁతీ! | 78 |
| క. | బల్లిదపుఁ గోఁతి మూఁకలు పెల్లుగఁ దనుఁ గొల్వ నీదు పెనిమిటి యిదిగో! నెల్లిట నేఁటనొ యిచటికిఁ దల్లీ! యరుదెంచు నింకఁ దలఁకకు మదిలో | 79 |
| తే. | ఎఱచి యెరదిండి మన్నియ యిపుడు వచ్చి నిన్నుఁ గఱకులు పలుకుచునున్న యెడలఁ జాన! యిచ్చెట్టుపైనుండి వానిఁ దునమఁ దలఁచి మరలితి నీకుఁ గీడెలయు ననుచు | 80 |
| ఉ. | కల్లరి రక్కసుండు నినుఁ గైకొని వచ్చిన గోలె బల్లిదం బెల్లను దూలి పూఁట యొక యేడుగఁ ద్రోయుచు నబ్బురంపు బల్ తల్లడమూని తిండియును దప్పియు నిద్దురయుం దొరంగి ఱేఁ డుల్లము దద్ద నీ పయినె యుంచి కలంగుఁ జుమీ! పొలంతుకా! | 81 |
| తే. | తడవు లేనిదె దండుతోఁ దరలి వచ్చి కడలి వడి దాఁటి రక్కసు నడఁచి నిన్ను మరలఁ గైకొందు నుమ్మలింపకు మటంచుఁ తెలుపుమని పల్కె నతఁడు గ్రొందలిరుబోఁడి! | 82 |
| సీ. | మొలక నవ్వులవాఁడు తలుకారు తొలుకారు బలు కార్మొగులు గేరు పొలుపువాఁడు నిడుద చేతులవాఁడు నిద్దంపు టద్దంపు సుద్దంపు నెఱి చెక్కు జోటివాఁడు వెడఁద కన్నులవాఁడు విప్పారి యొప్పారు గొప్ప నెన్నుదురుచే నొప్పువాఁడు పఱపు పేఱెదవాఁడు పరువంపు గరువంపు నెలవోని నెమ్మోము గలుగువాఁడు | |
| తే. | కేల సింగాణి విల్లొగిఁ గ్రాలువాఁడు కుఱుచ మెడవాఁడు సోగ పెన్నెఱులవాఁడు వలఁతియగువాఁడు ముజ్జగంబులును వలచు సోయగమువాఁడు సువ్వె! నీ రాయఁడింతి! | 83 |
| తే. | అరయ నిన్ని తెఱంగుల నలరువాఁడు సూవె! నీ ముద్దుల మఱంది తీవబోఁడి! యనిన నెద నమ్మి సంతసం బెనయ నతని గారవించుచుఁ బడఁతి యుంగరముఁ గొనియె | 84 |
| క. | కొని కన్నుల నద్దుచు న క్కునఁ జేర్చుచుఁ దలను మోపుకొనుచు న్మదిలోఁ బెనిమిటిఁ జూచిన కంటెం దనరారి యొకింత వడి కతని కిట్లనియెన్ | 85 |
| తే. | అన్న! గాదిలి చుట్టమ వగుచు ఱేని నెమ్మి యెఱిఁగించి యుసురులు నిలిపినట్టి నిన్నొకింతయు నగ్గింప నేర నింకఁ బుడమి నెదురెందులను లేక తడవు మనుము | 86 |
| క. | గుబ్బలి ద్రిమ్మరి సింగమ! దబ్బర రక్కసుఁడు నన్గొదవ పల్కుటయున్ దబ్బున వింటివిగద! యిది గొబ్బున నీ వరిగి దొరకు గుఱుతుగఁ జెపుమా! | 87 |
| తే. | వలదనంగను వెంటఁ గానలకు వచ్చి యింత పుట్టించెనని కిన్క యిడకు మనుము తన వెలందుక నొరుల కప్పనము సేసి యూరకుండిన మగఁటిమి యొదవదనుము | 88 |
| తే. | అరుదు మీఱిన బల్లిదుండనుచుఁ దనకుఁ దవిలి మా తండ్రి యిడుట లోఁ దలఁపు మనుము కోరి పెండిలి యాడిన కొలము చెలిని విడువఁ జనదని తగ విన్నవింపవయ్య! | 89 |
| చ. | కడు ననుఁ గన్నతల్లి కెనఁగా నల రామునిఁ దండ్రి మాఱుగా నుడుగని బత్తితోఁ గొలుచుచుండెడి తన్ను వెడంగుఁ బూని కా ఱడవుల లోపలం గఱకులాడిన దోసపుఁ బంట యంతయున్ గుడిచితి నంచు నా మఱఁదిగుఱ్ఱకు నిక్క మెఱుంగఁ బల్కుమా! | 90 |
| క. | ఆ మాటలు మదిఁ బెట్టక నామీఁదం గనికరంబు నాటు కొలుపుచున్ వే మొనలు దెచ్చి రక్కసి గామిడి నడపుమని యతనికడఁ గడుఁ జెపుమా! | 91 |
| తే. | అనిన నతఁ డట్లు చేసెదనమ్మ! యింక రిత్తచేతుల దొర కడ కెత్తెఱఁగున మరలి చనఁ జను? నీ తలమానికంబు నెమ్మి యలరార నానవాలిమ్ము నాకు | 92 |
| ఆ. | అనిన నన్నెలంత యన్న! నీ నిక్కపు రూపుఁ జూచిగాని రూఢి నిక్క డింది మానికంబు డెందంబులో నిన్ను నచ్చి గారవమున నిచ్చి పనుప | 93 |
| తే. | అనిన నతఁ డట్లె యొనరింప నలరి యలరు బోఁడి తలమానికంబు గొబ్బున నొసంగి వీడుకొల్పిన మ్రొక్కి యవ్విన్నుచూలి కొమరుఁ డచ్చోటు వెలువడి కొమరు మెఱయ | 94 |
| సీ. | బావులు గలఁచి చప్పరములు వడిఁ ద్రోచి పేరైన మ్రాఁకులు పెల్లగించి పూవుగుత్తులు ద్రెంచి పులుఁగుల బెదరించి పండ్లు రాలిచి పొదరిండ్లు సదిపి తేనె తెఱల్ రేఁచి తీవియల్ నుగ్గాడి మేడలు గోడలుఁ బాడు సేసి యాటతిప్పలు వ్రచ్చి పాటబండులు గూల్చి కట్టువలన్నియు గాసి సేసి | |
| తే. | తోటకావలి రక్కసి దాఁటు నొక్క మాటె యెనిమిది వేలను మడియఁ జేసి యడరుచున్నఁ గనుంగొని పుడమి కాన్పు చెంతఁ గాపున్న పొలదిండి చెలులు పఱచి | 95 |
| తే. | రక్కసుల ఱేనిఁ బొడఁగని మ్రొక్కు లొసఁగి వెఱఁగు కన్పట్ట నిట్లని విన్నవించి రేమి చెప్పుదు మెకిమీడ! యిప్పు డొక్క క్రోఁతి యెందుండియో రాచగోతిఁ జేరి | 96 |
| తే. | మంతనంబున నేమేమొ మాటలాడి కడిమిఁ బూఁదోట నెల్లను గాకు సేసి యచటఁ గావలియున్న గయాళి ప్రాఁత వేల్పుమూఁకల నెనిమిది వేలఁ దునిమె | 97 |
| క. | తునిమి యెనలేని కడిమిం దనరారుచునున్నవాఁ డతనిఁ దేఱి కనుం గొన నలవి గాదు వేల్పుల కును రక్కసి వంగడంపు క్రొన్నెలఁ! యనుడున్ | 98 |
| తే. | మండిపడి యాతఁ డా కోఁతి గం డడంచి వేగ రండని యెనిమిది వేల పొలసు దిండి బంటులఁ బనిచినఁ దివిరి వార లీఁద కొమరుని పయి నని కేఁగుటయును | 99 |
| క. | ఆ రక్కసి మూఁకలఁ గని పేరిమి మెయి వెంచి గాడ్పుబిడ్డఁ డనికిఁ బొం గారు నెడఁ బచ్చమావుల తేరి వజీరుండు తూర్పుదెసఁ గనుపట్టెన్ | 100 |
| సీ. | అప్పు డా జగజెట్టి యా రేయి ద్రిమ్మరి దండుపై నెవ్వఁడి దాఁకి యార్చి తోఁకతో జుట్టి పదువుర నూఱువురను బట్టి తోరనపుఁ గంబమునఁ గొట్టి మూఁపులు వీఁపులు మోరలు బోరలు కాళ్ళు చేతులు కుత్తుకలును దలలు పిక్కలు డొక్కలు జక్కుగాఁ జెండాడి యందఱ జము ప్రోలి కనిచివైచి | |
| తే. | మొసలి తోరన మెక్కి యామునఁ జెలంగు చున్నఁ బొలియక చిక్కిన యుఱియ బంట్లు పఱచి తొలివేల్పు ఱేని కత్తెఱఁగుఁ దెలుప నదరిపడి వాఁడు కొఱకొఱ యొదవికొనఁగ | 101 |
| తే. | మున్నరక నొప్పు శార్దూలముఖుని నశ్మ వక్షు మఱి పింగళాక్షుని వక్రనాసు దీర్ఘజిహ్వునిఁ బిలిచి యా దిట్టకోఁతిఁ దునియలుగఁ జేసి సరగ రండనుచుఁ బనిచె | 102 |
| క. | పనిచిన యమ్మేటి మగ ల్సని బిట్టుగఁ బొదవి యంప జడివాన యొన ర్చిన నతఁ డయ్యంపఱ యె ల్లను దోఁకం బాయఁ ద్రోచి లావెలయంగన్ | 103 |
| సీ. | పోనీక తఱిమి ఱాబోర రక్కసు ఱొమ్ము బెడిదంపుఁ బిడికిటఁ బొడిచి చంపి వాత ముక్కున నల్ల వరద లుబ్బఁగఁ దాఁచి వెస వంకముక్కు తొల్వేల్పుఁ జెండి మొగిఁ దోరనపుఁ గంబమునఁ గొట్టి బెబ్బులి మోము రే ద్రిమ్మరి ముఱి యడంచి తోఁకతోఁ జుట్టి వే వీఁక మింటికి వైచి నిడునాల్క పొలదిండిఁ బుడమిఁ గెడపి | |
| తే. | వ్రేలిమిడిఁ బచ్చకన్నుల వేల్పుసూడుఁ జిదిమివైచిన మ్రగ్గక చిక్కియున్న బిరుదు లొక కొంద ఱేతెంచి వరుస మెడల నల్ల ద్రావుడు దొరకు విన్నప మొనర్ప | 104 |
| ఆ. | కనలి ప్రగడ కొమరులను శతజిహ్వుని స్తనితహస్తు శూలదంష్ట్రు రక్త రోము వ్యాఘ్రకబళు రుధిరాక్షు నతనిపై నని యొనర్పుఁడనుచుఁ బనుచుటయును | 105 |
| క. | మా ఱెందు లేని కడిమిన్ మీఱుచు నరదంబు లెక్కి నెఱ మొనగాండ్ర య్యాఱుగురుఁ బొదలి తాఁకినఁ బాఱి సనక కొమ్మ మెకపు బంటు కడంకన్ | 106 |
| తే. | తోఁక నల్లార్చి కేవునఁ గూఁకఁ బెట్టి తోరనము డిగ్గి పోరికిఁ దొడరు నెడల గఱకుటమ్ములవాండ్రు మేఁ గాటనేసి బిట్టు నొప్పింపఁ గినిసి యా జెట్టి బిరుదు | 107 |
| సీ. | అరదంబు లన్నియు నఱవఱల్గా మోఁది మావుపిండుల సదమదము చేసి చేగల మెకములఁ జెండు బెండొనరించి కాలరి పౌజుల నేలఁ జమిరి గొడుగులు పడగలఁ బొడిపొడి గావించి దొనలును దూపులుఁ దునిమివైచి కైదువుల్ విండ్లును కత్తళంబులు పేల్చి బూరలుఁ దుడుములు బుగ్గిఁ గలిపి | |
| తే. | చివ్వ పట్టెల్ల నల్లయుఁ గ్రొవ్వు మెదడుఁ బొలసుఁ బ్రేవులు నెముకలుఁ బుఱియ గములు నిండుకొల్పిన ఱవఱవల్ నిగుడ నగ్గ రాసు రాకాసు లతనిఁ జేరంగ డాసి | 108 |
| తే. | కొండపైఁ బెల్లు జడివాన కురియు కరణి బెట్టిదపు తూపు లేసిన బెగడ కతఁడు పేర్మి నొక్కొక్కరినిఁ బట్టి పిడుగులట్లు నడరు పిడికిటి పోటులఁ బుడమిఁ గూల్చె | 109 |
| తే. | అత్తెఱంగెల్లఁ గని పరువెత్తి కొంద ఱెఱచి దిండులు రావణు నెదుటఁ జేరి అనిరి ‘దేవర! విను క్రోఁతి అబ్బురముగ రక్కసుల బూచియై యిందు వ్రాలినదిగ | 110 |
| క. | అఱిముఱి నెఱి మొనగాండ్రే డ్తెఱ దురమున కరిగి కడు కడిందిగ నిపు డం దఱు నొక్క యుమ్మడిం బొ ల్పఱి రబ్బలు కోఁతి బారి కగ్గంబగుచున్ | 111 |
| తే. | అనిన విని నెయ్యి సోఁకిన అగ్గివోలె మండిపడి వాఁడపుడు జంబుమాలి ననుప నక్కడిఁది జోదు వడిఁ జని యుక్కు మెఱయ గట్టు ద్రిమ్మరి తలకట్టుఁ జుట్టుముట్టి | 112 |
| క. | కఱకు మొన వాఁడి ములుకులు వఱపిన నగ్గాలి యనుఁగుఁ బాపడు మదిలో వెఱచఱువక యొక పెను మ్రా న్వెఱికి వెస న్వాని తేరు నేలం గూల్చెన్ | 113 |
| ఆ. | కూల్చి యాముటేనుఁగుల గుఱ్ఱముల మూఁక నెల్లఁ బొలియఁజేసి యెసఁగుచున్న నలిగి వాఁడుఁ గేల నడిదంబు గొని గాడ్పు పట్టిఁ బట్టి నొసలు బిట్టు నరికె | 114 |
| చ. | నఱికిన సోలి యయ్యడవి నట్టు జగా మొనగాండ్ర మిన్న యు క్కఱక యొకింతసేపునకుఁ గ్రమ్మరఁ దెప్పిరి యప్పిసాళిపై నుఱికి చలంబు మీఱఁ దలయూడఁగ మొత్తెను వాని కత్తియే వెఱఁగు దలిర్పఁ బుచ్చుకొని వేల్పులు నింగిఁ జెలంగి యార్వఁగన్ | 115 |
| ఆ. | అటుల జంబుమాలి దిటమంతయును దూలి సరగఁ బోరఁ గూలి జముని ప్రోలి కేగినట్టి జోలి యెరచి మేపరు లోలిఁ దెలుప నవుడు గఱచి దీవి ఱేఁడు | 116 |
| తే. | అక్షుఁ డనుపేరుగల తన యనుఁగుఁ గొడుకుఁ బిలిచి ఆ కోఁతి తలఁ గోసి బీరమొదవఁ దోరనపు గంబమునఁ గట్టి పేరువాడి మరలి రమ్మని సెలవిడ్డఁ గరము చెలఁగి | 117 |
| క. | వాఁడొక తేరెక్కి కడున్ వాఁడి మెయిం జని మెఱుంగు వాల్నారసముల్ పోఁడిమితోఁ గోఁతిపయిన్ మూఁడు పదుల్ వెక్కసముగ నో వేయుటయున్ | 118 |
| సీ. | మబ్బు త్రోపరికూన గొబ్బున వాని సిం గాణి ముత్తునియలుగా నడంప వేఱొండు విల్గొని తూఱి ప్రా జేజేల ఱేని ప్రేముడి పట్టి రేఁచి బల్క డంక నచ్చెట్టు బిడారు బొబ్బ మెకంబు పై నగ్గలంబుగఁ బాఱ వాఁడి యమ్ములు వనుప నయ్యనుమఁడు తోఁకచే నవి యెల్ల నుగ్గాడి యార్చి యొక్క | |
| తే. | తాడి మ్రానుక్కు మీఱంగ నూడఁ బెఱికి య క్కువాళంపు రక్కసుఁ డెక్కుకొన్న యరద మఱవఱ లొనరింప నలిగి వాఁడు వాని నెన్నొస లుఱక నొవ్వంగ నేసె | 119 |
| తే. | ఏయుటయు బిట్టు సోలి యయ్యివము సూడు కొలఁపు రారిక్క దొర బంటు గొంతవడికిఁ దెలిసి బిగియొప్ప నప్పొలదిండి మిన్న ఱొమ్ము పిడికిటఁ బొడిచిన సొమ్మసిల్లె | 120 |
| క. | సొమ్మసిలి సరగఁ దెప్పిఱి యమ్మేటి మగండు గుదియ నా యనుమని పెన్ ఱొమ్ము నగలింప నాతఁడు గ్రమ్మఱ నగ్గుదియ నతనిఁ గడు వడి మోఁదెన్ | 121 |
| తే. | మోఁదుటయు వాఁడు వాల్గొని మొనసి కోఁతి తొడలు నొవ్వఁగ నడచినఁ దోన యెగసి పట్టుకొని నేలపైఁ బడఁగొట్టి గాలి పట్టి యా రక్కసుని జము పట్టుఁ జేర్చె | 122 |
| తే. | అంత మడియక మిగిలియున్నట్టి సోఁకు బంట్లు పదికుత్తుకల ఱేని పాలి కేఁగి మిక్కుటంబుగఁ బాముల మేఁత బుడుత మగతనంబెల్లఁ బలుమఱుఁ బొగడి యనిరి | 123 |
| సీ. | శార్దూలముఖుఁ డీల్గె స్తనితహస్తుడు సెల్లె దీర్ఘజిహ్వుడు గడతేరిపోయె శూలదంష్ట్రుఁడు మ్రగ్గెఁ గూలెఁ బింగళనేత్రుఁ డశ్మవక్షుఁడు దెగటారె రక్త - రోముఁడు మెయి వీడె రుధిరాక్షుఁడును వ్యాఘ్ర కబళుండు నక్షుండుఁ గంతుఁగొనిరి జంబుమాలి యడంగె శతజిహ్వుఁడును వక్ర నాసుండు సుసురులఁ బాసి చనిరి | |
| తే. | మఱియు నెనిమిది వేలు గద్దఱి వజీర్లు వడిరి పూఁదోఁట కావలి బానసీండ్రు సాలఁ జచ్చిరి నేఁడు నీ మ్రోల నేమి దెలుపుదుము సామి! యా కోఁతి తెఱఁగు మేము | 124 |
| చ. | అన విని సోఁకురాయఁ డెద నల్కయు నుమ్మలికంబు నబ్బురం బును గదురంగ నక్షుఁ దలపోసి కడుం బలవించి యద్దిఱా! మును నెపుడు న్వినంగనని ముచ్చట పుట్టెనుగాక కోఁతు లెం దును పొలదిండి పోటరుల దున్ముటఁ గంటిమె? తప్పిజాఱియున్ | 125 |
| ఆ. | తలఁపఁ దఱియు నిపుడు తారుమాఱయ్యెఁగాఁ బోలు నేమి సేయఁబోలు దీని కనుచు నుత్తలంబు పెనఁగొన దురపిల్లు నెడల నింద్రజితుఁడు నేఁగు దెంచి | 126 |
| క. | అప్పా! జగములు మూఁడును విప్పారెడు కడిమి గెలిచి వెలసిన నీ వీ చొప్పున నొక కోఁతికినై తప్పక పలుమఱుఁ గలంగఁ దగవే? చెపుమా! | 127 |
| క. | ఉమ్మలిక యుడిగి తద్దయు నెమ్మదితో నుండు మిపుడు నీ చెంతకు బీ ర మ్మొదవఁగ నగ్గట్టుం ద్రిమ్మరి మొనగానిఁ బట్టి తెచ్చెద నెలమిన్ | 128 |
| క. | అని యరద మెక్కి యుక్కునఁ జని తెమ్మెర కూన నంప జడివానల ముం చిన నవి యాతఁడు దోఁకం దునిమి మలలు చెట్టులేసెఁ దొడరి యతనిపైన్ | 129 |
| ఆ. | దాని కలిగి నల్లద్రావుడు మేల్బంతి తోన మరలి వాలుఁ దూపు లేసె నవియుఁ దునిమి వాని యరదంబు మావుల గాలి బుడత నుగ్గుగా నొనర్చె | 130 |
| తే. | అట్లొనర్చిన రక్కసుం డతని కడిమి కబ్రపడి కొన్ని నెఱతూపు లడరి యేయ నవి యొకింతయు గాఁడక యవల జనియె అప్పు డమ్మబ్బు రొదసోఁకుఁ డలుక నిగుడ | 131 |
| తే. | బమ్మ యమ్మేర్చి యజ్జగబంటు మీఁద వైవ నది సంపఁజాలక వానిఁ గుదియఁ గట్టివైచిన మేనల్లఁ బట్టి వైచి తండ్రి కడ నిల్పె నగ్గట్టు దాయ సూడు | 132 |
| క. | నిలిపిన నమ్మల ద్రిమ్మరి తలకట్టుం జూచి నల్లద్రావుడు కన్నా కలుకయు నులుకును మదిలో నెలయఁగఁ గన్బొమలు ముడిచి యిట్లని పలికెన్ | 133 |
| ఆ. | ఓరి! కోఁతి కూళ యొక్కింతయును మది గొంకు లేక నీరు కుప్ప దాఁటి గడుసు పొలసు దిండి గములుండు నిద్దీవి కెట్లు చేరినాఁడ వెఱుకమాలి? | 134 |
| తే. | అరయ జగముల రావణుఁ డనెడు పేరు విన్న గుండియ లవియుఁ బో వేలుపులకు నహహ! నీ డెందమున నించుకైన జంకు దవులకున్న దిదేమి చందంబొ గాని? | 135 |
| క. | ఎవ్వని పంపున వచ్చితి? వెవ్వఁడు నీ పేరు? కర్జ మెయ్యది నీ కి ట్లివ్వీడు సొరఁగ నిమ్మెయిఁ? గ్రొవ్వెల్ల నడంతు నింక గొబ్బునఁ జెపుమా! | 136 |
| తే. | అనిన విని గాలిపట్టి యచ్చెనఁటి సోఁకు కొలము దేవరఁ గనుఁగొని పలికె మరల నోరి! టక్కరికాఁడ! యియ్యోజలేని కఱద లేటికి? వినుర! నిక్కముగ నిపుడు | 137 |
| క. | మానుగ జగముల యావడి మానుపగాఁ గోరి పుడమి మడఁతుకకై వి న్మానికపు వంగడంబున రా నెలయై పొడమినట్టి రాముని బంటన్ | 138 |
| క. | విను సుగ్రీవుఁ డనం బరఁ గిన కోఁతుల మన్నెకానికి న్నెయ్యుఁడ గా డ్పునకుం గాదిలి కొమరుడ హనుమంతుం డనఁగ బేర్మి నలరినవాఁడన్ | 139 |
| క. | కావరమున నా రాముని దేవేరి న్నీవు పట్టి తెచ్చిన వెదుకం గా వలసి కడలి దాఁటి ద్దీవికి గండెసఁగ నరుగుదెంచినవాఁడన్ | 140 |
| క. | ఇమ్ముగ నీ ప్రోలంతయుఁ ద్రిమ్మరి పూఁదోటఁలోనఁ దెల్లంబుగ రా కొమ్మగని మాటలాడి క ర మ్మెలమిన్ ఱేని కడకుఁ గ్రమ్మఱి చనుచున్ | 141 |
| తే. | కెరలి నా రాక నీ కెఱిఁగింపఁగోరి మేలి పూఁదోఁట యెల్లను గూలఁద్రోచి మొనసి యనిలోన యక్షుఁడు మొదలుగలుగు రక్కసుల నెల్ల పెక్కండ్ర నుక్కడించి | 142 |
| ఆ. | నిన్నుఁ జూచి కూర్మి నివ్వటిల్లఁగఁ గొన్ని బుద్దు లెఱుఁగఁ జెప్పి బుజ్జగింపఁ దలఁచి పట్టువడితిఁ దప్పక నా మాట దిటము చేసి బ్రతుకుతెరవు కనుము | 143 |
| చ. | జగముల తల్లియై పుడమి జవ్వని గాదిలి పట్టియైన యి మ్ముగుదల మిన్నఁ దెచ్చితివి మోస మెఱుంగక నీకు నెవ్వరుం దగదిది యంచుఁ దెల్పఁగల దంటలు గల్గమిఁ జేసి యిట్టి గీ డగపడె నింకనైన విడనాడక రాముని ప్రాపుఁ జేరుమీ! | 144 |
| క. | చెన్నగు రతనఁపుఁ దొడవులు మున్నుగ మన్నుం బడంతి ముద్దుల పట్టిన్ మిన్నక యుడుగర యిడుమీ! చెన్నటితన ముడిగి రాచసింగంబునకున్ | 145 |
| క. | అక్కటికపు గనియగు న య్యెక్కటి రా చందమామ నెలమిఁ గొలిచి యీ రక్కసి వంగడమంతయుఁ దక్కించుకొనంగఁ జూడు టక్కుడిగి యిఁకన్ | 146 |
| తే. | చుట్ట లనుఁగులు బంట్లు తోఁబుట్టువులును గొడుకు లేనుఁగు లరదముల్ గుఱ్ఱములును నలరు నా ఱేని తూపు టింగలమునందు మ్రగ్గిపోవక మున్నె వేమలఁపు కొనుము | 147 |
| క. | ఇప్పని సేయక మసలినఁ గప్పుమెడ వలంతి వచ్చి కాచిన నిన్నుం గుప్పునఁ బొరిగొను రాముడు దప్పదు నామాట వినుము తఱచు లికేలా? | 148 |
| క. | నలువ కొలంబునఁ బుట్టిన బలియుండవు తొలిపలుకులు పరికించిన మే ల్వలఁతివి నీ కిటు పెఱ చెలిఁ దెలివి యొకింతయును లేక తేఁ దగవగునే? | 149 |
| ఆ. | అనినఁ గినిసి వాఁడు హనుమంతుతోడ ని ట్లనియె నోరి! వెడఁగ! వినుర! యిట్లు వెఱపుమాలి యొక్క చిఱుత మానిసిని నా యెదుటఁ గొండఁ జేసి యెన్నె దిపుడు | 150 |
| మ. | జముఁడో! వేల్పుల ఱేఁడొ! నీళ్ళ దొరయో! చాగంపు రాయండొ! వి న్కొమరుండో! విసదారి తాల్పరియొ! సోఁకుం బెద్దయో! గాడ్పు చు ట్టమొ! మున్నీటి యనుంగు పట్టి మగఁడో! డంబార నాతోడ నా లము గావింపఁ దొడంగి యుక్కఱక నిల్వన్ దుల్వ మ్రాన్ద్రిమ్మరీ! | 151 |
| తే. | తొడరి యెడలేని మూఁకలతోడఁ గూడ గట్టు విలుకాఁడు గొలువున్న మెట్టు నెత్తి నట్టి నాతోడఁ బోరాడు టెట్టు పొసఁగుఁ? బేద మానుసులకుఁ గోఁతి పిండులకును | 152 |
| క. | కొండలయందుం జేరుక పండులు గాయలును నమలి బ్రతికెడు మీకున్ దండులు గూడుక మానిసి దిండులపై నడువ నెట్టి తెంపొదవెనొకో! | 153 |
| తే. | అడవి దుంపలె కాని సంబడము లొసఁగఁ గాసు వీసంబు చేత నెక్కడను లేక మగువఁ గోల్పోయి కడు నిడుమలఁ గలంగు నలఁతి దొరఁ గొల్వఁ గడఁగు వెంగలులుఁ గలరె? | 154 |
| క. | కడ యొడయలఁ దఱిమెడు నం జుడు దిండులు మిమ్ము మనుపఁ జూతురె పోరం గుడి మ్రింగెడు వానికి లో నడరెడు వేల్పుట్రవడియ మగుఁగద తలఁపన్ | 155 |
| తే. | అనిన విని తొలివేల్పు రాయనికిఁ జెట్టు నట్టు మొనగాఁడు వెండియు నిట్టులనియె నహహ! చెడు కోరుకొనువాని కరయ నొరుల పలుకు సెవులకుఁ గొరవియై పరఁగకున్నె! | 156 |
| సీ. | నినుఁ దోఁకఁ జుట్టి మున్నీటఁ బల్మఱు ముంచి విడిచిన వాలి నుక్కడఁగఁ జేసె నీ వొకింతయుఁ గేల నెగయ నెత్తఁగ లేని విను సిక యెకిమీని విల్లుఁ దునిమె నిను గెల్చుకొని వాఁడి నొనరెడు వేయి చే తుల ఱేని గెడపిన బలియు గెలిచె నీ చుట్టలగు ఖరునిన్ దూషణుని దిగ తలల రాకాసిని బిలుకు మార్చె | |
| తే. | నీదు పంపున నిఱ్ఱియై నెఱిని జన్న కూళ తొలివేల్పు నొక కోలఁ గూలనేసె నట్టి రామునియందు నీయందుఁ గలుగు దొడ్డు కొంచెము లెంచుమా! త్రుళ్ళు సడలి | 157 |
| తే. | మిత్తి తలదన్ని గుదెతాల్పు మీసలూడఁ బెఱికి విసదారి రాయని బెదరఁదోలి గట్లు వెకలించి సంద్రము ల్గలఁపఁజాలు కోఁతి బిందము లారాముఁ గొలుచుఁ జుమ్మి | 158 |
| క. | నీ పేరు సెప్పినప్పుడె యా పోటరులెల్ల నలుక లఱిముఱిఁ బెరయం జూపోపక బల్గ్రద్దఱు లై పలికెడు తెఱఁగుఁ జెప్ప నచ్చెరువు గదా! | 159 |
| తే. | అనిన రాకాసి దొర బొమ లదరఁ బండ్లు గొఱుకుకొంచును గన్నుల నెఱుపు మీఱ వీని నిటు డాయఁ బిల్చినఁ బూని వేయి చందములఁ బ్రేలుచున్నాఁడు జంకుమాలి | 160 |
| క. | కావున నింకం గొంకక నీ వెడఁగుం గొమ్మ మెకము నిపు డడలొదవం దావిమల చక్కిరాయని తావున కనుపుఁడని బంట్లఁ దగఁ బని కొలిపెన్ | 161 |
| తే. | అత్తఱి విభీషణుఁడు డాసి యన్న! యిట్లు తెగువతో రాచపనులూని తిరుగు బంటు లేమి యాడిన నాడుదు రింతెగాని తప్పుగాఁ గొని చంపింప దగదుసుమ్ము | 162 |
| తే. | కాక యించుక కినుక లోఁ గలిగెనేనిఁ గొంత వెత వెట్టి విడుచుట కూడు ననిన నట్ల కా కని యొప్పు నగ్గట్లసూడు పగతుఁ డబ్బంట్లఁ గనుఁగొని నగుచుఁ బలికె | 163 |
| క. | ఈ దుడుకుఁ గోతిఁ గొని చని మీ దిట్టతనంబు లెల్ల మెఱయఁగ నిపు డౌ గాదనక తోఁకఁ గాలిచి వీదీవీదులను ద్రిప్పి విడువుడు కడకన్ | 164 |
| తే. | అనుడు రక్కసు లతనిఁ దోడ్కొని తొలంగ నేఁగి మోకులు పగ్గము లెన్నియేని గూర్చి బిగఁగట్టి తద్దయు నార్చుకొనుచుఁ దప్పెటలు మ్రోయఁ బ్రోలెల్లఁ ద్రిప్పి మఱియు | 165 |
| తే. | పుట్టములు దిట్టలుగఁ గూడఁబెట్టి నేయి నూనియల ముంచి యవి తోఁకపైనిఁ జుట్టి నిప్పుకలు వెట్టి రవులింపఁ గప్పు తెరవు జాణ మంటలు వెదచల్లఁ జాగె మిగుల | 166 |
| తే. | అపుడు కొందఱు సోఁకు దొయ్యలులు దుక్కి చాలు పేరింటి రాచ ప్రోయాలి కడకు నేఁగి యత్తెఱఁ గంతయు నెఱుఁగఁ జెప్ప నమ్మెలంతుక తద్దయు నుమ్మలించి | 167 |
| క. | అక్కట! యుసురుల విందగు నిక్కోతుల మిన్న కిప్పు డిట్టి దొసంగుల్ దెక్కలి దయ్యం బింతయు నక్కటికము లేక యిట్లు హత్తించెనొకో? | 168 |
| తే. | అనుచుఁ జేదోయి మోడ్చి యో అంటరాని వేల్ప! నీ సంగడీఁడగు విన్నుచూలి కనుఁగుఁ గొడుకగు కోఁతి కన్నాకునందు నుడుకుఁ జూపక చల్లనై యుండుమయ్య! | 169 |
| ఆ. | అనుచు వేడుకొనిన హనుమంతునకుఁ గడు నగ్గి చల్లనయ్యె నాతఁడంతఁ గడఁకఁ బ్రాఁతమినుకు నొడువులు గొడఁగినఁ గడిఁది మీఱ బమ్మకట్లు వీడె | 170 |
| క. | వీడినఁ దద్దయు నేడ్తెఱ తోడన్మెయి వెంచి తులువ తొలివేలుపులం గాడుపడఁ దఱిమి యార్చుడు గాడుపుచూల్వీడు సొచ్చె గాటపు కినుకన్ | 171 |
| సీ. | మేడలు రవులించి మాడువుల్ గాల్చి పెన్ రచ్చ కొట్టంబులఁ జిచ్చు నించి చప్పరంబులు సూఁడి చవికెలు మసిచేసి తత్తడి నెలవులు తగులవైచి విడిముడి పట్టులు వ్రేలిమి గావించి మల్లసాలలు బిట్టు మండఁజేసి లో నగళ్ళెల్లఁ బెల్లుగ నగ్గి కెరసేసి నెఱి మించు సరకులన్నియును మాడ్చి | |
| తే. | గట్టువిలుకాడు తిగప్రోళ్ళ గాల్చుతెఱఁగు దోఁప రాకాసి వీడెల్ల దుమ్ము చేసి కడలిఁ జిచ్చార్చుకొని నేలకాన్పు కడకు మరలి తన చందమంతయు నరయఁ జెప్పి | 172 |
| క. | ఇదె నీ రాయనిఁ దెచ్చెద నెద నుమ్మలికంబు మాని యెలనాగరొ! నె మ్మది నుండు మింకనని చే యిదొయిన్ మొకిడిఁచి జొహారులిడి చనునెడలన్ | 173 |
| తే. | వేగ లంకిణి యనెడు తొల్వేల్పు పడఁతి త్రోవ కడ్డంబుగా వచ్చి తొడర దాని నొక్క గ్రుద్దునఁ గెడపి లావొప్పఁ గడలి మగుడఁ జంగున దాటి యజ్జగమగండు | 174 |
| తే. | అచట నెలుఁగుల యెకిమీఁడు నంగదుండు మొదలు గలిగిన తనవార లెదురు వచ్చి కౌఁగిళులఁ గూర్పఁ దాఁ జన్న కర్జమెల్లఁ దెల్లముగ వారి కెలమితోఁ దెలియఁ జెప్పె | 175 |
| తే. | వారుఁ దానును సతవారువముల జోదు కొడుకు నిల్పిన పెనుతేనె కాన కరిగి పండ్లుఁ గాయ లిగుళ్ళు దుంపలును దేని యలుఁ దనివిదీరఁ జూఱగా నారగించి | 176 |
| క. | అచ్చోటఁ దరలి యందఱు విచ్చలవిడి నరిగి రాచవెన్నెలఱేనిన్ మచ్చికఁ బొడఁగని యడుగుల కొచ్చెము గనరాని బత్తి నొరగిన పిదపన్ | 177 |
| ఆ. | మొగిలి విప్పు సురటి ముద్దులపట్టి తా నరిగి నేలకాన్పు నరసి వచ్చు టెలమిఁ దెలిపి యాపె తలమానికము రాగ వున కొసంగుటయు మివులఁ జెలఁగి | 178 |
| తే. | అతనిఁ గౌఁగిటఁ గదియించి వెతలు డించి పుడమి ఱేఁ డుల్లమున దద్దఁ బొంగుచుండె ననుచు నారదుఁ డెఱిఁగింప నవలి కతయుఁ దెలుపుమని పుట్టఁ బుట్టువు పలుకుటయును | 179 |
| చ. | నలువయు వెన్నుఁ డగ్గి చలినట్టును గట్టులసూడుఁ బ్రొద్దు రే వెలుఁగును నీళ్ళదేవరయు విన్నును నేలయుఁ బైఁడిరాయఁడు న్మలలును సంద్రము ల్మొద లనందగు నిజ్జగ మెల్ల నీవయై వెలుఁగుచునుండు వేలుపుల వేలుప! ముమ్మొనవాలు దాలుపా! | 180 |
| క. | ఎనలేని గొనబుకాఁడా! పెను మినుకుం దెగలు వొగడు పేరిమివాఁడా! చెనఁటి పొలదిండ్ల సూడా! కను వినుకల రాచసూడిగంబుల ఱేఁడా! | 181 |
| తోటకవృత్తము | పెను బాముల పున్కల పేరులు ఱొ మ్మున వ్రేలఁగఁ గేలను ముమ్మొనవాల్ గొనబారఁగ నౌదల గ్రొన్నెలయున్ మినువాఁకయుఁ గలిగిన మేల్బిరుదా! | 182 |
| గద్యము | ఇది శ్రీమదుమారమణ కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర పవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబయిన యచ్చతెలుఁగురామాయణ మహాకావ్యమందు సందరకాండము సర్వ మేకాశ్వాసము. |