| ఇతిహాసములు | అచ్చతెలుఁగు రామాయణము | యుద్ధకాండము |
| క. | సిరిగొఱలు వరుస తేరుల దొరబిడ్డని పాలఁ గలిగి దురమున గెలుపుల్ బెరయించి యతనిచే వా విరిఁ బూజలు గొన్న మేటి! వేల్పుల మిన్నా! | 1 |
| సీ. | విను మబ్బొఱియ కానుపునకుఁ గయ్యపుఁ దిండి జడదారి యిట్లని నుడివె నట్టు గాడుపు చూలి లంకకు నేఁగి గ్రమ్మఱఁ బఱతెంచి తాఁ బంటపడఁతి నిసువుఁ జూచుటయును రక్కసులరాయఁడున్న చం దంబును మఱి వాని తమ్ముదోయి తెఱఁగును బంట్ల యేడ్తెఱయును మూఁకల పెల్లును బ్రెగ్గడ పిండు పెంపు | |
| తే. | ప్రోలి ఠీవియు నా రాచ బొబ్బమెకము తోడ నెఱిఁగింపఁ గడఁక నా ప్రోడ ఱేఁడు కొలఁది మీఱిన పోటరి కొమ్మ మెకపు వెల్లువలఁ గూడి యప్పుడె వేగఁ దరలి | 2 |
| తే. | మీలు గప్పలుఁ దాఁబేళ్ళు గాలిదిండ్లు మొసలు లెండ్రలు నెగడులు మొదలు గలుగు నీరు ద్రిమ్మరి పదువులు నెఱయఁ బెఱయుఁ బొనరు మున్నీటి సేరి యబ్బురము మీఱ | 3 |
| తే. | అద్దరిని దండు విడియించి తద్దఁ జెలఁగు చున్నచో నంత లంకలో నెన్నరాని ఠీవిఁ బేరోలగంబుండి రావణుండు గడఁక దైవార ననుఁగుఁ బ్రెగ్గడలఁ బలికె | 4 |
| ఉ. | ప్రెగ్గడలార! నా పలుకుఁ బ్రేముడితోడ వినుండు వేల్పులన్ బెగ్గిలఁ ద్రోలి యక్కజపుఁ బేర్మి దలిర్పఁగ ముజ్జగంబులన్ మ్రగ్గఁగ ఠీవి నేలుచుఁ గరంబుఁ జెలంగుచునుంటిఁ గాని ము న్నెగ్గొడవల్ గనుంగొన నొకించుక చేటొనఁగూడె నియ్యెడన్ | 5 |
| ఆ. | ఒక్క కోఁతి సేరి స్రుక్కక పెక్కండ్ర రక్కసులను బట్టి యుక్కడంచి చనియె నింకనేమి యనఁబోలు? దఱి తాఱు మాఱుగాఁ దొడంగె మదిఁ దలప | 6 |
| తే. | కడలి కోఁతుల కొక తోఁట కాల్వయయ్యెఁ బెం పలరు లంక యొక పేద కొంపయయ్యెఁ బొలసు మేపరు లొక చిరు పురువులైరి యహహ! దయ్యంబు నిఁకనేమి యనఁగఁబోలు? | 7 |
| తే. | అక్కజంబైన తపసున కలరి మున్ను నలువ కోరిక లొసఁగెడు నాఁడు మేయి తాలుపుల నెల్ల గెల్చున ట్లోలి నడిగి కోఁతులను మానుసుల గెల్వఁ గోరనైతి | 8 |
| క. | అటు లగుటఁ జేసి యిపుడొ క్కటఁ గోఁతులు మానుసులును గయ్యమునకు నె క్కటి మగఁటిమితో వచ్చిరి కటకట! యిఁక నెద్ది వెరవు క్రన్ననఁ జెపుఁడా! | 9 |
| మ. | అనినన్ రక్కసి పెద్ద లిట్టులని రాహా! వేల్పురాసూడ! యెం దును మున్నాడని బీదపల్కు లిపు డెంతో నెవ్వగం బల్కఁగాఁ జనునే? పూని జగంబునెల్ల నెఱి హెచ్చం గెల్చి గాటంపు టు క్కునఁ జెన్నారెడు నీకు మానుసు లెలుంగుల్ గోఁతులుం బెద్దయే? | 10 |
| తే. | చెల్లఁబో ఱేఁడ! నీ కిట్టి బల్లిదునకుఁ గడిమి దిగఁద్రోచి తద్దయుఁ గన్న విన్న వార లెల్లరు నగఁగ నివ్వరుసఁ గొఱఁత మాట వాక్రువ్వఁదగునె యుమ్మలికఁ బూని? | 11 |
| తే. | జముని కంటెను జేజేల సామికంటె జంటమోముల వేలుపుకంటె నీళ్ళ ఱేనికంటెను లిబ్బుల ఱేనికంటె మేటియే రాగవుఁడు నిన్ను మీఱి పోర? | 12 |
| ఉ. | అంచ హుమాయి జోదు నలరారఁగఁ జేసి కడింది కోరిక ల్గాంచి వెడంద రక్కసి కొలంబున కెల్లను మేలుబంతియై మంచపుకోడు తాలుపరి మన్కి బిడారపు మెట్టు నెంతయున్ గొంచక యెత్తినట్టి నినుఁ గోఁతులు గీతులు గెల్వఁ జాలునే? | 13 |
| ఆ. | అదియుఁగాక మమ్ము నెదిరించి పోర జే జేలకైన బలిమి సాలకుండు మానుసులును జెట్టు మనికి వజీరులు నెంతవారు కలన నెదిరి నిలువ? | 14 |
| ఉ. | కొండలు పిండి సేతుమొ? మొగుల్తెరు వొక్కట మ్రింగివైతుమో? గండలరారఁ జిల్వ గమికానిఁ గలంతుమొ? యెల్ల వేలుపుం బిండులఁ బట్టి కాఱియలఁ బెట్టుదుమో? వెస మిత్తి గుండియల్ సెండుదుమో? జగంబులకుఁ జేటొదవింతుమొ? దీవిరాయడా! | 15 |
| క. | పంతమునఁ బొద్దు పస యుడి గింతుమొ? సత మొసలిపట్లఁ గినుక నిగుడ నిం కింతుమొ? జముని నడంతుమొ? కొంతయుఁ గాదనక మాకుఁ గొబ్బునఁ జెపుమా! | 16 |
| క. | అనునెడ విభీషణుఁడు మె ల్లన నిరు చౌ వంచ యౌదలల రక్కసి రా యనిఁ జూచి యిట్టులనియెం దన పలుకుల వలఁతిదనము దనరారంగన్ | 17 |
| తే. | అన్న! యా పోటరుల మాట లాలకించి వీటి కెల్లను జేటుఁ గావింపఁ బోకు రాచ జేజేల ఱేఁడగు రాగవునకు నెలఁత నొప్పించి సిరులెల్ల నిలుపుకొనుము | 18 |
| తే. | మొదలి వెన్నుఁడు పంటల ముగుద గొడవ లుడుపు కొఱ కిర్ల గొంగ వంగడమునందు రాముఁడై పుట్టె లిబ్బుల చామ సీత యై పొడమె వేలుపులు గోఁతులైరి సుమ్ము | 19 |
| క. | మలసూ డగ్గియు జముఁడును బొలదిండియుఁ ద్రాడుదాలుపుం గాడ్పును జ క్కుల యెకిమీడును లే గ్రొ న్నెల తాల్పును గారు పోర నీ వెదిరింపన్ | 20 |
| క. | కలికపు మానిసియని నీ తలఁపున నిపు డల్ల నేలతాలుపు మిన్నన్ జులకఁగఁ జూచెద వతనిన్ గెలువఁగ నీవంటి వారికిం దరమగునే? | 21 |
| సీ. | జడదారి వెనువెంటఁ జనుచుఁ డక్కరి సోఁకు టెలనాగ నొక కోల బిలుకు మార్చె నే బల్లిదులుఁ గేల నెత్త నోపని గట్టు విలుకాని సింగాణి విఱిచి వైచె బలురాచమిన్న పౌఁజుల బిట్టు సెలవిన గండ్రగొడ్డలి తాల్పు గండడంచెఁ బెను గానలో నేల బిత్తరి కానుపుఁ గొని యేఁగు చెడు వేల్పుగొంగఁ జిదిమెఁ | |
| తే. | బూని చౌవంచ మఱ్ఱుల కోనలోన ఖరుఁడు మొదలగు మేటి రక్కసులఁ గెడపె నొడలి చూపుల యొడయని కొడుకుఁ గూల్చె నహహ! రాముని మగతనం బరుదుగాదె? | 22 |
| తే. | తగరు బలితపు గొండతోఁ దాఁకునట్టు దోమ బలుహజ్జ మెకముతోఁ దొడరునట్లు నీవు రా రిక్క ఱేనిపైఁ బోవు టెల్ల వలదు జతగాని సూడు నా పలుకు వినుము | 23 |
| ఆ. | ఒక్క కోఁతి సేరి యుక్కున నీదు ప్రో లెల్లఁ గాల్చి మేటి యెఱచి దిండి బంట్లఁ దునిమివైచుపట్ల నీ టాటోటు తనపుఁ బెద్ద లెందుఁ జనిరి చెపుమ? | 24 |
| క. | అనిన విని యతని నేమియు నన నొల్లక సోఁకుటొడయఁ డలుకమెయిం గు ప్పున లేచి కొలువు వీడ్కొని తన లోనగరునకుఁ జనియెఁ దత్తరమెసఁగన్ | 25 |
| తే. | అంత నమ్మఱునాఁ డెద సంతసంబు గదుర నన్న కడకుఁ గుంభకర్ణుఁ డెమ్మెఁ జనిన తోడనఁ జని విభీషణుఁడు బత్తి నన్నలకు నిర్వురకు మ్రొక్కియున్న యెడల | 26 |
| తే. | వారిఁ దద్దయు నర్మిలి గారవించి బంతి మోములదొర తన బంతిఁ గుడువఁ బెట్టి వీడెంబులిడి యొక నట్టునందు నెమ్మిఁ గూర్చున్నచోఁ బిన్న తమ్ముఁ డనియె | 27 |
| క. | పెద్దవు నీ వెఱుగఁని పని యెద్దియు లే దైన నొక్కఁ డేఁ దెల్పెద నీ విద్దెసఁ గినుక యొనర్పక గ్రద్దన రా వేల్పు ఱేని కలికిన్ విడుమా! | 28 |
| క. | పంతము మెఱయఁగ రాచ ప డంతి న్విడలేక యక్కటా! యొకటఁ గొలం బంతయుఁ జెఱుపఁగఁ జూచెద వెంతయు మేల్గొనము పూన కేమియనఁ జనున్ | 29 |
| ఆ. | తూడు దిండి మావు దొర వంగడంబునఁ బుట్టి ప్రాఁత మిన్కు తిట్ట లరసి పొలసుదిండి కొలపుఁ దలకట్టవై పెఱ తెఱవఁ గొనుట నీకు నెఱతనంబె? | 30 |
| క. | ఈడొదవని కయ్య మిటుల్ గూడదు నా విన్నపంబు గురుతుగ వినుమా! కీడు తెఱంగులు మిగులం జూడంబడుచున్న విపుడు సోఁకుడురాయా! | 31 |
| తే. | కడల యెకిమీండ్ర గెలిచిన గరువమూని యిపుడు జన్నంపుఁ గాపరి నెదురఁ దివిరె దహహ! ఆతని లావు గోరంతయైనఁ దెలియరాదుగదా! నీకుఁ దలఁపునందు | 32 |
| ఆ. | పుడమి ఱేనితోడఁ దొడర నీ లావేమి? ఖరునికంటె నల్ల గట్ల సూడు కొడుకుకంటె గండ్ర గొడ్డలి తాలుపు నేలవేల్పుకంటె నెఱయె చెపుమ? | 33 |
| ఆ. | వేయునేల? వినుము వేగ నేల పొలంతి పట్టిఁ గాన్కఁ బెట్టి బత్తి మీఱ మ్రొక్కులొసఁగి రాచరిక్కల యెకిమీని మఱుఁగుఁ జేరి చెడక మనుట మేలు | 34 |
| తే. | అనినఁ దద్దయుఁ గిన్కతో నవుడు గఱచి యెఱచి మేపరి దొర కన్ను లెఱ్ఱఁ జేసి కొలువు లోపలి వారెల్ల నలఁకుఁ బూని జలదరింపంగ న వ్విభీషణునిఁ జూచి | 35 |
| సీ. | ఓరి! తమ్ముఁడవయ్యు నోడక దొంగచే తికిఁ ద్రాళ్ళొసంగి నెట్టుకొని యింటి వారల మేల్కొల్పు వడువునఁ బగవారిఁ గూడుక నా మ్రోలఁ గొంకులేక మాటికి నొక పేద మానిసి నెన్నుచుఁ జీఁకున కెంతయుఁ జేవ యిడుచుఁ గాని యోజలు దెల్పఁ గడిగితి విపుడు నీ యెదలోని టక్కెల్ల నెఱుఁగఁబడియె | |
| తే. | అహహ! నీవంటి కూళను నుక్కడఁచి యింక వంగడం బెల్లఁ బాగొనర్పంగఁ జను న టంచు నడిదంబు వెఱికి వ్రేయంగఁ జనిన నడ్డుకొని సోఁకు దొరకుఁ బ్రహస్తుఁ డనియె | 36 |
| క. | ఒడయఁడ! తోఁబుట్టువు నిటు లడిదముఁ గొని వ్రేయఁ బోయె దకటా! మది నె క్కుడు కినుకఁ బూనుకొని యా ఱడిఁ జెందుట నీకు మేల్తెఱంగె? తలంపన్ | 37 |
| తే. | ఇతని పలుకులు నీ చెవి కింపుగాక యుండుఁ గాకేమి విననియట్లుండుటొప్పుఁ గాక తెగఁజూడఁ దగునె? యిక్కడిఁది మగఁడు లేని సిరులేల? మురువేల? లిబ్బులేల? | 38 |
| క. | అని మరలించిన రక్కసి మొనగాఁ డొక యింత డెందమున దాలిమిఁ గై కొని యుండెఁ గుంభకర్ణుఁడు దన మనికికిఁ జనియె నిదుర తమి మీఱంగన్ | 39 |
| తే. | అపుడు సరమ మగం డెద నలుక నిగుడ గట్ల మారుతు పగతునిఁ గాంచి పలికె నహహ! యిపు డన్న! మదిలోన నడలు పూని నీకు మేల్బుద్ధిఁ గఱపుట నేర మొదవె | 40 |
| తే. | కనికరంబున నీ చేటు గాంచ నోడి తొడరి మేల్బుద్ధిఁ జెప్పినఁ ద్రుంపఁ జూచె దగ్గిఁ బడఁ బోవు పొట్టియ నమరఁ బట్టి మనుపఁ బూన్వానిఁ గుట్టక మానఁ గలదె? | 41 |
| క. | మల ద్రిమ్మరి గమితో రా నెల సంద్రము దాఁటివచ్చి నీ కుత్తుక చా ల్నెలపు నపుడైన నెదలోఁ దలఁపుము నామాట నల్లద్రావుడు ఱేఁడా! | 42 |
| క. | గట్టులవలె నీ కొడుకులుఁ జుట్టలు మొనగాండ్రు రాచచుక్కల దొర పె న్దట్టపు టలుగులఁ బెనకువ పట్టునఁ బడునప్పుడైనఁ బరికింపు మెదన్ | 43 |
| తే. | మేర మీఱిన బల్కొమ్మ మెకపు బంట్లు మూఁగి నీ పూవుఁబోండ్ల క్రొమ్ముడులు వట్టి యక్కజంబుగ నీడ్చు చున్నప్పుడైన నీవు నా బుద్ధిఁ దలఁపున నిలుపుకొమ్ము | 44 |
| తే. | పుడమి పుట్టువుఁ గ్రమ్మర విడువలేక మసలెదవుగాని యాపె రక్కసి కొలంబు మ్రింగవచ్చిన మాఱట మిత్తియనుచు నరయనేరవు నిన్నేమి యందునింక? | 45 |
| సీ. | అనుటయు నేయి సోఁకిన గాడ్పు చెలికాని మాడ్కి నెంతేనియు మండిపడుచు లేచి జేజేల సూ డేచిన క్రొవ్వునఁ గెరలుచు నతని నుంకించి తాఁచు టయు సొమ్మసిలి యబ్బలియుఁడు వే తెప్పిఱి వినరాని నుడువులు వేనవేలు గొదుగక యాడినఁ గొఱకొఱతోఁ గుండ వీనుల బల్తొలి వేల్పు మిన్న | |
| తే. | యన్న దన మన్కిపట్టున కరిగె న వ్వి భీషణుఁడు తల్లికడకేగి బిట్టు వగచి యన్న చేసిన పనియెల్ల విన్నవించి యాపె యానతిఁ గైకొని యపుడె కదలి | 46 |
| క. | నలువురు బంట్లును దానును వలనుగఁ జని వేఁడి వెలుఁగు వంగడపుం జా బిలిఁ గాంచి దవ్వులనె సా గిలఁబడి యిట్లనియె మోడ్పుఁ గేల్గవతోడన్ | 47 |
| సీ. | జగముల యెకిమీఁడ! జతలేని మొనగాఁడ! కఱకు సోఁకుల సూడ! కావు కావు జోగుల వెలియావ! సోయగంబుల ప్రోవ! కనికరంబుల తావ! కావు కావు మేటి వేల్పుల వేల్ప! మేల్గొనంబుల చాల్ప! కడిఁది సింగిణి తాల్ప! కావు కావు ప్రోడల తలకట్ట! పున్నియంబుల కొట్ట! కయ్యంపుఁ బెను దిట్ట! కావు కావు | |
| తే. | వరుస తేరుల మన్నీని వంగడంబుఁ గరము వెలయింపఁదగు నయ్య! కావు కావు గట్టు ద్రిమ్మరి ఱేనిఁ జేపట్టి గొడవ గములు వాపిన బలియుడ! కావు కావు | 48 |
| క. | కావరపు రక్కసుఁడు చెడు ద్రోవం బడఁ దన్ని వెడలఁ ద్రోయించుటచే నీవే దరియని వచ్చితిఁ గావుము నన్నిపుడు రాచ కలువల ఱేఁడా! | 49 |
| ఆ. | అనుచు వేడుకొనిన విని రాగవుఁడు ప్రొద్దు చూలి నెమ్మొగంబు చూచి పలికెఁ గావు కావుమంచు నేవురు రక్కసు లుఱక చేరవచ్చు చున్నవారు | 50 |
| ఆ. | వారి చందమెల్ల నారసి రాఁదగు వారిఁ బనుపు మిపుడె కోరి మఱువు సేరుకొనెడి వారిఁ జేపట్టఁజనుగదా! వెర వెఱుంగు మేటి దొరల కెల్ల | 51 |
| క. | అనవుడు కోఁతుల దొర చ య్యన కొందఱు బంట్ల నటులె యనిపిన వారల్ చని రక్కసి రాయని త మ్మునిఁ బొడఁగని మాటలాడి మురువు దలిర్పన్ | 52 |
| ఉ. | క్రమ్మఱ వచ్చి యత్తెఱఁగుఁ గల్వల దాయ యనుంగుఁ బట్టితో నిమ్ముగ విన్నవింప నతఁడెత్తుక ముందట నిల్చి కేలుఁ గెం దమ్ముల దోయిలించుకొని తద్దయు నేర్పునఁ బల్కె రాచ మొ త్తమ్ముల మిన్న! నీ విపుడు దప్పక నా నుడు లాలకింపుమా! | 53 |
| తే. | చాల్పు మోముల చెడుగు తొల్వేల్పు ఱేని తమ్ముఁడు విభీషణుండనఁ దనరు నాతఁ డన్నచే నొప్పివడి యిందు నిన్నుఁ గొలువఁ గోరి యరుదెంచి నాఁడఁట గొంకులేక | 54 |
| తే. | దాయ తోఁబుట్టువఁట వేల్పు దాయ కొలపుఁ బెద్దయఁట మెయిదాలుపు పిండువులను మెక్కు టక్కరియఁట వాఁడు మిమ్ముఁ గొలువ వచ్చు తెఱఁగేమొ పరికింప వలయుజుండి! | 55 |
| ఉ. | అనునెడఁ గోన ద్రిమ్మరి గయాళులు గొందఱు డాసి పల్కి రో గొనముల ప్రోకలార! యదిగోఁ! బగ చేతికి వచ్చినప్పుడే పని సవరింపఁ జెల్లుఁ బెఱ పల్కు లిఁకేటికిఁ? బంపు వెట్టుఁ డ చ్చెనటులఁ బట్టి కీటడచి చెచ్చెర వచ్చెద ముక్కు మీఱఁగన్ | 56 |
| ఉ. | కల్లల కెల్ల నిక్క లనఁగాఁదగు నంజుడు దిండి కూళ లి ట్లెల్లఁ దెఱంగులం దవిలి యేడ్తెరఁ ద్రిమ్మరుచుండు వాండ్రు మీ రుల్లమునందు నమ్ముకొని యూరక చెల్మి యొనర్పఁ జూచుటల్ సెల్లదటన్న రా కొదమ సింగము వారలఁ జూచి యిట్లనున్ | 57 |
| ఆ. | వినుఁడు కొమ్మ మెకపు మొనగాఁడులార! లో నళుకుఁ బూని కావు మనుచు మఱువు దూఱినట్టి వారిఁ ద్రోచిపుచ్చుట నేల తాల్పు జాబిలులకుఁ దగదు సుండి | 58 |
| తే. | వేలుపుల గొంగ సైదోఁడు వెనుక దూఱ కావుమని వేడు కొనెడిచోఁ గడఁక నితని మనుపు టక్కూళ పొలదిండి మన్నెగాని పెనుపుఁ జేవయుఁ దేజుఁ గైకొనుట సుండి! | 59 |
| క. | కావున మీరా నెత్తురు ద్రావుడు వంగడపుఁ గడలి తామరదాయన్ వేవేగఁ దెండు నేఁడ ద్దీవికి దొరఁ జేసియునుతుఁ దిర మొప్పారన్ | 60 |
| క. | అనుటయు మలద్రిమ్మరి రా యని పంపున బంట్లు కొందఱర్మిలిఁ జని గొ బ్బున రక్కసి మిన్నం దో డ్కొని తెచ్చిన వచ్చి యాతఁడు గడుం బత్తిన్ | 61 |
| తే. | రాచ ముక్కంటి యడుగుల వ్రాలి పెక్కు చందములఁ గొనియాడి యా సామి కిట్టు లనియె నో వేల్ప! నలువ లోనైన వేల్పు దొరలు గనలేని నీ హజ్జదోయిఁ గంటి | 62 |
| క. | తులువలు కొందఱు ని న్మది దలఁపరు నెఱ దంట లెల్లఁ దమి నీ యడుగుం గలమునఁ బుట్టువు మున్నీ రలరఁగ దరి ముట్టఁ గడతు రన్నిటి ఱేఁడా! | 63 |
| వృషభగతి రగడ | సిరియుఁ బంటవలంతియుం దమిఁ జేరి చేరిక నడుగు లొత్తఁగఁ బొరిఁ బొరి న్వలి ముద్దుమోమునఁ బూప నవ్వులు మొలక లెత్తఁగఁ జెలువెసంగఁ బయిం గడాని పసిండి దుప్పటి తళుకు లీనఁగఁ దలను రతనపు బొమిడికము తొగదాయతో బలువాదుఁ బూనఁగ వెడఁద తామర కెంపు ఱొమ్మున వేమఱుం గొనబారి వ్రేలఁగ గుడుసు వాలును జిందము న్బెను గుదియ దమ్మియుఁ గ్రేలఁ గ్రాలఁగఁ దొలు మొగు ల్తెగ దెగడు నెమ్మెయి తోరపుం జిగి కడలఁ గప్పఁగ వలపు గులుకుచు నొసలిపై నిడువాలుఁ గస్తురి రేక యొప్పఁగ మొసలివానును బోఁగు రంగులు మురువుఁ జెక్కులపై మెలంగఁగఁ బొసఁగఁ జేతులఁ బాఁప మేపుడు పులుగుక ల్మురువు ల్సెలంగఁగఁ బాలసంద్రములోన నిద్దపు పడగఁ దాలుపు రాచ సెజ్జను వేలుపుం జడదారి పాటలు వించుఁ బండుకయుండి బొజ్జను జగములన్నియు నినిచి నెమ్మిని సాఁకుచుండు కడింది వేలుప! చిగురుఁగైదువు జోదుతో నెనఁ జేయఁ బోల్నెఱి మేని తాలుప! | 64 |
| వృషభగతి రగడ | పంట పైదలి కొఱకు జేజే ల్బలసి వేడినఁ జాల్పు తేరుల దంటగీమునఁ బుట్టి సోకుఁడు తలిరుబోఁడి నడంచి పోరుల హెచ్చు మీఱిన మంచి జబ్బల యెఱచి బోనపు బంటు దేఱిచి మెచ్చుగా జడదారి యౌదలమిన్న జన్నము నిండఁ గూరిచి చట్టుఁ దొయ్యలిఁ జేసి బూచుల సామి విల్దునుమాడి సౌరుల తిట్టయగు చాల్పేరి నాడెపుఁ దెఱవఁ గైకొని రాచబారులఁ గడిమిఁ దిగసతమాఱు లడఁచిన గండ్రగొడ్డలి తాల్పుఁ బైకొని కడిఁది లా విదియంచు నెల్లరుఁ గాంచి మెచ్చఁగఁ గెల్పు సేకొని యప్ప యానతిఁ బూని కానల కరిగి తపసుల వెఱపు దీఱిచి సుప్పనాతిని ముక్కు సెవులును సొరిదిఁ గోసి గొఱంతఁ జేరిచి ఖరుని పీఁచమడంచి కల్ల మెకంబు నొక్క వెడంద తూపున మురియ లొనరిచి పక్కి ఱేనికి ముత్తి సతముగ నొసఁగి యేపున వాలిఁ ద్రెళ్ళఁగ నేసి సతవార్వముల దేవరపట్టిఁ గూరిమి నేలి దాటుల నరుగు మెకముల నేర్చి కూర్చుక వచ్చి పేరిమిఁ బొలసు మేపఱి ఱేని నడఁపగఁ బూని చెలఁగెడు రాచయేనుఁగ! | 64 |
| వృషభగతి రగడ | ఎలసి నీ నెఱగొనము లన్నియు నెన్న నేరి తరంబు జానుగ మీను తాఁబే ల్పంది మానిసిమెకము, గిడ్డయు నేలవేల్పును గోనద్రిమ్మరి మూఁకఁగూరుచుకొన్న నీవును దాడితాల్పును మ్రానిలోఁ బొడకట్టు దిట్టయు మావునెక్కు జగా మగండును లోనుగాఁ బలు రూపులూని వెలుంగు దయ్యమ! వేల్పు పిండును నిక్కువంబుగ నిన్నుఁ బేర్కొన నేరరని పెను మిన్కు లాడఁగఁ జక్కఁగా మముబోటు లెట్టుగఁ జాలుదు ర్కొనియాడి చూడఁగఁ | 64 |
| వృషభగతి రగడ | ప్రాఁతమిన్కుకొన ల్గనుంగొని బల్మిఁ బుట్టువు కట్టు లూడిచి రోఁత కాపురమునకు వేసరి రొక్క మెత్తి కడంక లూడిచి చెలఁగి గాటపు తెలివి చిచ్చుఱఁ జెయ్వు కూటువులెల్ల వ్రేలిచి యలరి లోపలి దాయలను వెస నాఱువుర మొదలంటఁ గూలిచి కనుఁగొనంబడు నెల్ల జగమును గల్లయని డెందమున నెంచుచు నెనసి దిటమగు లోని చూపున నెప్పుడుం దనుఁ దానె కాంచుచుఁ దివిరి యెద్దియుఁ గోరఁబోవక తివ గొనమ్ములు సెందనీయక తవిలి యెన్నడునేని నిమ్మెయి తాలుపులకును గీడు సేయక | 64 |
| వృషభగతి రగడ | పుడమిపైఁ దనయందు నెల్లెడఁ బున్నియపు చందములె వామిగ నడర నడరెడు జోగి చేరువ నండఁబాయక యుండు సామిగ కడలి పుడమియు నాకసంబును గట్లుఁ జెట్లును నీరు వాములు గడలి వెన్నయు వేఁడి వేలుపు గాడ్పు నగ్గియు నెల్ల గామలుఁ జిలువరాయఁడు ప్రొద్దుచూలియు జింకతాల్పును వేల్పుఁ బెద్దయు వెలి హుమాయి వజీరుడుం గరివేల్పు నీవె యటంచుఁ దద్దయు నెలమిఁ దలఁపున నిల్పి సారెకు నెంతు నర్మిలి నన్నుఁ బ్రోవుము పలు దొసంగులఁ బాపి కూళల పాలఁ జిక్కఁగ నీక కావుము | 64 |
| తే. | అనుచుఁ బొగడినఁ దద్దయు నలరి రాచ యంచ మున్నీటి నీరు దెప్పించి యపుడె పైనిఁ జిలికించి దీవికి ఱేనిఁ జేసి నతని నఱలేని నెయ్య మొప్పారఁ జూచి | 65 |
| క. | పొలమేపరి వంగడపుం దెలిడాలు మెకంబ! నెమ్మది న్మీ దీవిం గల పెద్దల తెఱఁగును మూఁ కల కొలఁదియు నేర్పరించి క్రన్ననఁ జెపుమా! | 66 |
| తే. | అనిన రాచూలి కతఁ డిట్టులనియెఁ దండ్రి! తెలియ నాలింపు మిపుడు మా దీవిలోని వేల్పుగొంగల తెఱఁగును జాల్పుతలల రక్కసుని దిట మెఱిఁగింతు నిక్కువముగ | 67 |
| తే. | నలువ నలరించి కొలఁది యొనర్పరాని మెప్పు లెన్నేనిఁ జేకొని మేటి యగుచు జగము లన్నియు గెలిచిన జగమగండు రావణుం డొప్పు నెనలేని ఠీవితోడ | 68 |
| క. | జన్నంపుఁ దిండి దొరలన్ మున్నఱకం బాఱఁద్రోలి ముజ్జగములు చే కొన్న నెఱ బిరుదు రావణు కన్నం బలియుండు కుంభకర్ణుఁడు దనరున్ | 69 |
| చ. | తునుమఁగ రాని జోళ్ళు నొక తూరియు వమ్మయిపోని తూపులున్ మినునిసువున్ వడిం దెగడి మీఱెడి మావులు లొజ్జుగాని బ ల్దొనలును దొడ్డ సింగిణులు దూకొని వెన్కకురాని బీరమున్ బొనరఁగ వేల్పుగొంగ తొలిబొట్టియ యింద్రజితుండు ఱంపిలున్ | 70 |
| సీ. | రాయండ! విను మతికాయుండు మొదలగు వాలు మగ ల్పెక్కు వేలు రక్క సుల ఱేని కొడుకు లజ్జోదు లొక్కొక్కఁడు వేన వేల్నూరేసి వేల బంట్లఁ గూడుక వ్రాలి బల్కోట లేడును గాచు కొని యేమఱక వేఁడిమినిఁ జెలంగు చుందు రాతనికి నెయ్యుఁడు దళవాయియు నై ప్రహస్తుండను నట్టి జెట్టి | |
| తే. | బిరుదు రాణించు మఱియుఁ బెన్ దురములందు వాసి మీఱిన ప్రోడ రాకాసి బంటు లక్కజంబుగ లెక్కల కెక్కువగుచుఁ గ్రిక్కిఱిసియుందు రెనలేని యుక్కు మెఱయ | 71 |
| తే. | అట్టి బల్మిని సోకురాయండు నీ ప డంతిఁ జెఱఁ గొని యునిచె నేనెంత మంచి బుద్ధిఁ జెప్పిన వినక యబ్బరపుఁ గినుకఁ గెరలి వడిఁ దన్ని వెడల నూకించె నిందు | 72 |
| ఆ. | అనుడుఁ గినుక నిగుడ నప్పుడె యెకిమీఁడు దండుతోడఁ గడలి దరియ నరిగి కట్టఁగట్టఁ దివురు పట్టునఁ జెలఁగి య న్నీరు కుప్ప వొంగి నింగి ముట్టె | 73 |
| క. | అటు లుప్పొంగినఁ గని నాఁ గటిచా ల్పేరింటి వాలుఁగంటి మగఁడు మి క్కుటమగు కొఱకొఱతోడన్ దటుకున విల్గొని లకోరిఁ దగఁ బూనుటయున్ | 74 |
| క. | గడగడ వడకుచు మున్నీ రడరెడు నెమ్మేను దాల్చి యన్నెఱ జేజే యడుగులపై నొరగెం దన యడు గసలును జిప్ప ప్రోవునై కనఁబడఁగన్ | 75 |
| ఆ. | అట్టు లొరగి లేచి అ మ్మగరతనంబు మ్రోల నిల్చి కేలు మోడ్చి పలికె నప్ప! యింత కినుక యొప్పునే? మముబోఁటి పలుచదనపు వారిపట్ల మీకు | 76 |
| క. | సుడివడి యడలుచు బన్నము లెడ సూపక పొడము వంత లెలయఁగఁ గడు లో నుడుకుచు నుండెడివారల యెడ దొరలకుఁ గినియఁ బోలునే యెకిమీడా? | 77 |
| క. | మల ద్రిమ్మరి మూఁకలతో వలనుగ మీరిందు దరలి వచ్చుటఁ గని లో నలరి చెలంగితిఁ గా కెదఁ దలఁతునె మీ కొక్క కీడు తపసులవిందా! | 78 |
| సీ. | కల్లరి జింక రక్కసి యుసురుల గొంగ! కలువలదాయ వంగడపుఁ దొడవ! చాల్పుబండుల మన్నుతాల్పు తొల్బిడ్డఁడ! చెట్టు ద్రిమ్మరి ఱేండ్ల పట్టుగొమ్మ! పొలదిండి పిండు చిల్వల పుల్గురాయఁడ! చాలు పేరింటి ప్రోయాలి మగఁడ! నేలక్రొన్ననబోఁడి నెయ్యంపు టల్లుఁడ! చుట్టు చట్టలు మెట్టు మెట్టువాఁడ! | |
| తే. | కడిఁది జడదారి జన్నంపు కాపుకాఁడ! యింక నెనరొప్ప మా తప్పు లెల్లఁ సైచి గట్లు చెట్లును దెప్పించి కట్టగట్టి వేగిరము దాఁటి చెడు తొలివేల్పుఁ బొదువు | 79 |
| క. | అని చెప్పి యేళ్ళ రాయఁడు మునుపటి రూపూనియుండె మురియుచు దొరయున్ దన ములికి దృశ్య గుల్మం బను మడువుపయి న్నిగుడ్చి యట నింకించెన్ | 80 |
| ఆ. | అంత ప్రొద్దుచూలి యానతిఁ గడలకుఁ దఱుల మోర మెకపు దాఁటు లేఁగి గట్లు చెట్లు దెచ్చి కడలిపై వైచిన నవి మునింగిపోయె నబ్బురముగ | 81 |
| తే. | మునిఁగిపోవుటఁ గని డెందమున నొకింత సందియంబూనుచో రాచ చందమామ కడకుఁ గ్రమ్మర వచ్చి జక్కరల ఱేఁడు వెరవు దైవార నిట్లని విన్నవించె | 82 |
| క. | ఎకిమీడా! విను రావణు నకుఁ జెల్మి యొసంగ మేలొనర్చుచుఁ దనలో నొక రెండు మేటి మీ లే రికిఁ జిక్కక నిచ్చనిచ్చఁ దిమ్మరుచుండున్ | 83 |
| క. | ఆ చేప లిపుడు మీరలు వైచిన మల లెల్ల మ్రింగివైచెఁ జుమీ! యో రాచల్వ ఱేఁడ! పదిలుఁడ వై చెచ్చెర నడవఁ గట్టఁ బంపుము నలునిన్ | 84 |
| చ. | అనవుడు నేలఱేఁడు వెఱఁగందుచు నప్పుడె కట్టఁగట్టఁ బె ల్లున నలుఁ బూన్చి కోఁతుల నెలుంగులఁ గొండలు దెండటంచుఁ బం పిన నొగి వార లందఱును బెల్లు గనంబడఁ గ్రేళ్ళు దాటుచున్ జని కడ లెల్లఁ గ్రమ్ముకొని చట్టులు బిట్టు పెకల్చి వ్రేల్మిడిన్ | 85 |
| తే. | ప్రొద్దు నిసువును గాడుపు బొట్టియఁడును వేల్పురాయని మనుమఁడు వెనుక చూపు మెకపుఱేఁడును మొదలగు మేటి మగలు గ్రొత్త లా గొప్ప పెనుగట్టు లెత్తుకొనిరి | 86 |
| తే. | మఱియుఁ దక్కిన మ్రాను ద్రిమ్మరి కడింది మగలు తమతమ పేర్మికిఁ దగిన కొలఁది గట్టు చెట్టును గొనివచ్చి కడలియందు వైచుచుండిరి యెకిమీఁడు చూచి మెచ్చ | 87 |
| తే. | అత్తెఱంగున మలమన్కి మొత్తములు గ డంక దైవారఁ జెట్లుఁ గొండలును దెచ్చి వైవ నాలుగు నాళ్ళ కవ్వలఁతియైన నలుఁడు గడలికి నిండార నడవఁ గట్టె | 88 |
| ఉ. | కట్టుట కుబ్బి రాచనెల గాములరాయని పట్టిఁ జూచి మీ చెట్టు బిడారపుం దొరలఁ జెచ్చెర మూఁకల తోడఁ గూడి యి క్కట్టపయి న్నెఱి న్నడువఁగాఁ బనికొల్పుము పేర్మినా నతం డట్టులె పౌజులం బిలిచి యానతి యిచ్చినఁ బొంగి వ్రేల్మిడిన్ | 89 |
| సీ. | కోయని యార్చుచుఁ గుప్పించి దాటుచు నేలలు వాడుచు నీల లిడుచు మెఱములు వైచుచు మింటికి నెగయుచుఁ జప్పటల్ సఱచుచు గుప్ప నడుచు నొండొరుఁ గడచుచు నుఱువులు సూపుచుఁ బాతర లాడుచుఁ బఱువు గొనుచు నీటిపై నుఱుకుచు నేటుగా నీఁదుచుఁ గ్రమ్మఱ నడవకు దొమ్మిఁ జనుచు | |
| తే. | పుడమి యీనిన వడువున నెడ యొకింత లేక యేకడఁ జూచిన లెక్కసేయ రాక తేఁకువ నక్కోఁతి మూఁక యెలమి నడిచి బడిబడి మున్నీరు గడచు చుండె | 90 |
| తే. | అంతఁ గోతుల దొర తన చెంత రాఁగ అంగదుని మీఁదఁ దమ్ముఁడు నాకసంబు కూర్మి మనుమనిపైఁ దానుఁ బేర్మి నెక్కి పుడమి కాపరి మేల్బంతి గడలి దాటె | 91 |
| ఆ. | దాటి మున్నె పోయి దరి డిగ్గియున్న మూఁ కలు విభీషణుండుఁ గలిసి కొలువ వేగఁ దరలి దొర సువేలంబు చేరువ పుడమిఁ జుట్టుముట్టి కడఁకనుండె | 92 |
| సీ. | అటువలెనుండుట దిటముగ వేగుల వారలవలన రావణుఁ డెఱింగి కోటలు కొమ్మలు క్రొత్తడమ్ములు పెద్ద గవకులు నరవళ్ళు గట్టి పఱిచి కొడుకుల దొరలఁ బ్రెగ్గడల బందుగుల నొం టరులఁ దీర్పరుల దట్టముగఁ గూర్చి లెక్క కెక్కువలగు రక్కసి మూఁకల బరవసం బొనరించి పల్తెఱఁగుల | |
| తే. | హెచ్చరికఁ జేసి వీట నెల్లెడలఁ గాపు లిడి దురంబున కేడ్తెఱఁ గడఁగుచుండె నంత మూఁకలతో రాముఁ డచటఁ దరలి లంకపైఁ బోరి కరిగె జలంబు మెఱయ | 93 |
| ఆ. | అరిగి బంట్ల కెల్ల నానతి యిడ వారు గట్లుఁ జెట్లుఁ బూని కడఁగి రనికి విండ్లు కైదువులును వెసఁ బూని రాకాసి దొరలు వారితోడఁ దొడరి రడరి | 94 |
| తే. | అపుడు కనికరముల గనియైన రాముఁ డంగదుని డాయఁ బిల్చి నీ వగ్గరాసు రక్కసుల ఱేని కడ కేఁగి యొక్కమాట గట్టిగాఁ దెల్పి రమ్మని యిట్టులనియె | 95 |
| క. | మ్రుచ్చుఁదనంబున సీతం దెచ్చితి విఁకనైన మేలు తెఱఁగూనుక నీ వ చ్చిగురుబోఁడిఁ గ్రమ్మర నిచ్చి కొలంబెల్లఁ బ్రోది యిడుకొను మనుమీ! | 96 |
| క. | మూఁకలు చుట్టలు కొడుకులుఁ జాకుండు తెఱంగు గనుము సరగ నటంచున్ డాకొని యెఱిఁగింపు మటుల్ గాకుండిన దుర మొనర్పఁగా రమ్మనుమీ! | 97 |
| ఆ. | అనిన వేల్పు ఱేని మనుమఁడుల్లములోనఁ బొంగి యపుడె తరలి నింగి నరిగి పొలసుదిండి మిన్న కొలువున్న బలు హజా రంబులోన నిలిచె డంబుమీఱ | 98 |
| చ. | నిలిచినఁ జూచి రక్కసులు నివ్వెఱ యూనుచు బొబ్బరించుచు న్వెలవెలఁ బోవుచుం గడలు నింగియుఁ జూచుచు నౌర! మున్ను లా వెలయఁగ లంకఁ గాల్చి తము నేఁచిన కోఁతియె నేఁడు గ్రమ్మఱం గలనికి వచ్చెనంచును బికాపికలై పఱతెంచి రందఱున్ | 99 |
| ఆ. | అట్లు పఱచు వారిఁ బొట్లముగా మర లించి సోఁకు ఱేఁడు గొంచుగాని కినుకతోడ నతనిఁ గనుగొని బొమముడు లదర నిట్టు లనుచు నుదరి పలికె | 100 |
| ఉ. | ఓరి వెడంగు మ్రాన్మనికి యొంటరికాన! తలంకమాలి యి ట్లూరక బల్లిదంపు పొలయోరెపు మూఁకలలోని కెట్టుగాఁ జేరితి? వెవ్వడంపె నినుఁ జేడ్పడఁ జేయఁ దలంచి? యింక నీ యూరును బేరుఁ జెప్పుకొను మున్నటులన్నియు నంతనయ్యెడిన్ | 101 |
| క. | మొన్న నొక కోఁతి యెక్కటి మున్నరక న్వచ్చి తోఁక మొదలికి ముట్టన్ మిన్నక కాల్పించుక మఱి సన్నక సన్నం దొలంగి చనియెం జుమ్మీ! | 102 |
| క. | అమ్మాట నీవు సెవులఁ ది రమ్ముగ విన్నావొ? లేదొ? రక్కసి బంటుల్ గ్రమ్ముకొని వానిఁ జేసిన య మ్ములుచ పను ల్దలంప నచ్చెరువుగదా! | 103 |
| ఆ. | అనిన వానిఁ జూచి యంగదుఁ డిట్లని పలికె నించుకైన నలుకు లేక యోరి! బెరసు పొలసుటోరెంపు ఱేఁడ! నా పలుకు వినుర! వింత తలఁపు మాని | 104 |
| క. | నిను బెక్కేడులు చెఱ నుని చిన నయ్యర్జునుని వేయి చేతులు వరుసం దునిమిన బలియునిఁ గడు ను క్కున గెలిచిన నేలఱేని కూరిమి బంటున్ | 105 |
| ఆ. | నిన్నుఁ దోఁకఁ జుట్టి మున్నీటఁ బలుమఱు ముంచి కనికరంబు మించి మరల విడిచినట్టి వాలి కొడుక నంగదుఁడను వాఁడ ఱేఁడు వనుప వచ్చినాఁడ | 106 |
| క. | మా రాయఁడు నను నీపైఁ గూరిమిచే బుద్ధిఁ దెలుపుకొఱకై పనిచెన్ నేరుపరివగుచుఁ దద్దయుఁ జేరిక వెలయంగ నతనిఁ జేరి బ్రదుకుమీ! | 107 |
| చ. | మొఱకుఁదనంబు పూని జగము ల్వలు చందంములం గలంచి యే డ్తెఱఁ దెరగంటి ముద్దియలఁ దెచ్చి కడిందిగఁ బ్రోల నందఱన్ జెఱ నిడినట్లకాఁ దలఁచి చేటొనఁ గూడునటన్నమాట లో నెఱుఁగక నేలకాన్పు నిటు లేటికిఁ దెచ్చితి వీవు వెంగలీ! | 108 |
| తే. | జగములకు నెల్లఁ దల్లియై పొగడు గన్న మన్ను కాన్పును నీవును గన్న తల్లి కైవడిని జూచుకొనవలెఁగాక యిట్లు తమినిఁ జెఱపట్టి యునుచుట తగవె చెపుమ? | 109 |
| క. | ఏనుఁగులున్ గుఱ్ఱములున్ మానికములు మేలి కుందనపుఁ దొడవులు నా ఱేనికిఁ బన్నుగ సీతం గానుక యిడి బ్రతుకు మట్లు కాకున్న యెడన్ | 110 |
| క. | నాడెంపుం బోటరివై పేడెత్తక మొగిసి రాచబెబ్బులితోఁ బో రాడుము వేలుపు లందఱుఁ జూడఁగ నాలమున నిలిచి స్రుక్కని కడిమిన్ | 111 |
| తే. | ఇసుక ప్రోవులుఁ జుక్కలు నెన్నవచ్చుఁ గాని మా ఱేని కడనున్న కోనమన్కి బంట్ల లెక్కింపఁ బొసఁగ దబ్బలియు రింక నిన్నుఁ గనుఁగొన్న బొందితో నిల్వనీరు | 112 |
| తే. | మొన్న నీ లంకఁ గాలిచి చన్న కోఁతి మిన్నయును నేను వారిలో సన్నగాండ్ర మనుచు నిటువంటి కొఱగాని పనుల కనుపు జుమ్ము మము నిర్వురను ఱేఁడు సోఁకు ఱేఁడ! | 113 |
| క. | వెంగలివై రా పొలఁతిం దొంగిలి తెచ్చితివి చేటుత్రోవ నయో! నీ వంగడ మద్దొర ములుకుల యింగలమునఁ బడక మున్నె యిడుమిఁకనైనన్ | 114 |
| క. | చెడుగుదనంబునఁ బలుమఱుఁ గడయొడయలఁ దఱిమినట్లుగా దా ఱేనిం దొడరి కడతేర వాతని కడిమి యొకింతైన నీకుఁ గనరాదుగదా! | 115 |
| ఆ. | పునుక తాల్పు విల్లుఁ దునిమెఁ దాటకఁ జంపె ఖరుని దేర్చె వాలిఁ గడవఁ బనిచెఁ గల్ల జింకఁ జిదిమె గండ్రగొడ్డలి తాల్పు గరువ మడఁచె నతని కడిమి యసదె? | 116 |
| తే. | అనుడు నంజుడుదిండి రాయండు వాని కిట్టులని పల్కె వినరోరి! చెట్టు మట్టు మెకపు ముడికాఁడ! రాముని మేటితనము సెప్పెదవు వేనవేలు నా చెంత నిలిచి | 117 |
| ఆ. | రాముఁడేమి వేల్పురాయని కంటెను జముని కంటె నీళ్ళసామి కంటె మఱియుఁ బేరుగలుగు నుఱియ రేద్రిమ్మరి దొరలకంటె బల్లిదుండె చెపుమ? | 118 |
| చ. | చివికిన విల్లు ద్రుంచుటయుఁ జేడియ నొంచుటయున్ నెసుళ్ళ నె క్కువ చలమారఁ జంపుటయుఁ గోఁతిని జింకను గీటడంచుటల్ తవిలి వెడంగు ప్రాఁబుడమి దయ్యము గెల్చుటయుం దిటంబుగా నివి యొక బంటు చెయ్వులని యెన్నెద వేమనియందు నిన్నిఁకన్? | 119 |
| ఆ. | ఓరి కోఁచబంట! యొక్కించు కేనియు మగతనంబు లేని పగతుఁ జేరి కొలుచుచుండి వాలి కొడుకునంచిటువలెఁ జెప్పుకొనఁగ నీకు సిగ్గుగాదె? | 120 |
| తే. | కొలఁది మీఱిన మగఁటిమి గొఱలు వాలి యెదుటఁ గొరలేక వడిఁ బొంచి యేసినట్టి కూళ నొక బంటుగా నెన్ని కొలిచె దింకఁ దొలఁగి చను కొల్వ మఱియెందు దొరలు లేరె? | 121 |
| క. | జగములు వొగడఁగ నెగడిన జగబంటని కొమరుఁడయ్యు జతనమునఁ గటా! పగ దీరుపనోపవు నీ మగతన మేమిటికి? దులువ మ్రాన్ ద్రిమ్మరిగా! | 122 |
| సీ. | అన్నయన్ గనికరం బెన్నక మీ తండ్రి నడఁగించి యతఁడేలు పుడమి యెల్లఁ దలఁగక కైకొన్న తులువను చినతండ్రి యని డెందమున నమ్మి యతని చెంత మగరాచతనమూని తగుదునంచు మెలింగె దకట! యించుకయైన నఱ దలఁపక పడుచువాఁడవు నిన్నుఁ బొడఁగన్న నా మది గడితంపు టక్కటికంబు వొడమె | |
| తే. | నహహ! యిఁకనైనఁ జెడిపోక యదనెఱింగి మమ్ము గొలువుము సుగ్రీవుని మడపి నీకుఁ గొండ ద్రిమ్మరి నాడొనఁగూడఁ జేతు నిపుడు వలసిన సొమ్మెల్ల నెలమి నిడుదు | 123 |
| ఆ. | అనినఁ జుక్క పేరి ననబోఁడి గూరిమి కొమరుఁ డలిగి యోరి కూళకాన! కాని కఱద లింక మానుర! నీ పాలి దయ్య ముఱక చెఱుపఁ దలఁచినాఁడు | 124 |
| సీ. | అని పల్కి క్రమ్మఱఁ జనఁ జూచుచో దీవి ఱేఁడు జోదులఁ గన్గిఱపి యదల్చు టయు వార లక్కోఁతి పయిరుల యెకిమీనిఁ బొదవి పల్దెఱఁగులఁ బోర నాతఁ డందఱ చిందఱ వందఱగా మోది కొందఱఁ జిదిమి సోఁకుడుల సామి గొలువున్న బలుమేడఁ గూలఁ దన్ని కడింది నింగి నరిగి రాముని నెఱి యడుగు | |
| తే. | దామరలఁ జేరి చాలుపు తలల తులువ తెఱఁ గెఱిఁగింప నీరైదు తేర్ల ఱేని కొమరుఁ డెద నల్గి లంకపైఁ గొమ్మ మెకము పౌఁజు నప్పుడె వడి లగ్గఁ బట్టఁబనిచె | 125 |
| క. | పనిచినఁ జని యొక్కుమ్మడిఁ బెనఁకువ తమిఁ గోన మనికి బిందంబులు కే వున నార్చి కోట లెక్కినఁ గనుఁగొని రక్కసులు వారిఁ గదిసిరి కడఁకన్ | 126 |
| చ. | కదిసి వెడంద బల్లెములఁ గైదువలన్ జముదాళ్ళ వంకులన్ గుదియల నీఁటెలన్ సురెలఁ గోలల గొడ్డళులం బొరింబొరిన్ మెదడును బున్క లెమ్ములును నెత్తురు నంజుడు క్రొవ్వు ప్రేవులున్ బ్రిదిలి కడిందిగాఁ బుడమిఁ బేర్కొన మోఁదిరి కోఁతి బంటులన్ | 127 |
| ఉ. | వారును గట్లుఁ జెట్లుఁ గొని వార్వము లేనుఁగు లందలంబులుం దేరులు బొక్కసంబులును తేటగు కైదువులున్ సిడంబులున్ బేరగు కాళె లెల్లలును బిట్టుగఁ దుత్తుమురై పడం గడున్ బోరొనరించి రక్కజఁపు బెంపునఁ గూల్చిరి ప్రాఁతవేల్పులన్ | 128 |
| సీ. | అపు డింద్రజిత్తుతో నంగదుండును బ్రహ స్తునితోడ సుగ్రీవుఁడును నికుంభు తో నీలుఁడును గుంభుతో ధూమ్రుఁడును నంత కునితోఁ బనసుఁడుఁ దపనునితోడ నలుఁడును జంభుతో లలి వేగదర్శియు సారణుతోడ వృషభుఁడు జంబు మాలితో గాడుపుఁజూలియు మకరాక్షు తోడుత జాంబవంతుఁడును ద్రిశిరు | |
| తే. | తోడ శరభుఁ డకంపను తోడఁ గుముదుఁ డును మహోదరుతోడ నేటుగ సుషేణుఁ డును విరూపాక్షు తోడ రాముని యనుంగు తోడఁబుట్టువు నేడ్తెఱఁ దొడర మఱియు | 129 |
| తే. | పేరుగల జోదు లొండొరుల్ దారసిల్లి మిక్కుటంబగు నార్పులు మిన్ను ముట్ట బిట్టు గనలుచుఁ దరలక పెనఁగఁ దొడఁగి రయ్యెడలఁ గోఁతి దొరలు గయ్యంబునందు | 130 |
| చ. | కఱచియుఁ గాళ్ళఁ దాఁచియును గట్టులు చెట్టులు బిట్టు వైచుచున్ జఱచియు గ్రుద్దియుం బిగువు సళ్ళక తోఁకలఁ జుట్టి కొట్టియున్ మఱిమఱి యాముటేనుఁగుల మావుల లొట్టియలం గడిందిగా నుఱుమొనరించి హెచ్చరిక నూల్కొనఁ దేరులు పిండిసేయుచున్ | 131 |
| క. | క్రమ్ముకొని సోఁకు జోదుల నెమ్మేనులు పగిలి మెదడు నెత్తురు క్రొవ్వున్ దుమ్మునఁ గండలు దొరుగఁగ నిమ్ములఁ జెలరేఁగి మోఁది రేచిన కడిమిన్ | 132 |
| క. | మోఁదిన నప్పొలబోనపు జోదులు వెండియును వాఁడి సురియల గుదెలం గైదువుల నారసంబుల బాదుకొని కలంచి యోటుపఱచిరి వారిన్ | 133 |
| తే. | అత్తెఱంగున నిరువాగులందుఁ గలుగు జోదులును బంట్లు దార్కొని స్రుక్కులేని బలిమిఁ బోరొనరింపుచు గెలుపు తలఁపు లంతకంతకు నగ్గలంబగుచు నిగుడ | 134 |
| సీ. | మోరలు బోరలు మూఁపులు వీఁపులు గౌనులు వీనులు కాళ్ళు వ్రేళ్ళు చేతులు వాతులు చెక్కులు ముక్కులు ప్రక్కలు పిక్కలు బరులు దరులు పొట్టలు చట్టలు బొమ్మలు దుమ్ములు మోవులు ప్రేవులు మొలలు దలలు గుండెలు గండలు గోళ్ళును కీళ్ళును దొడలును మెడలుఁ దుత్తుమురుగాఁగ | |
| తే. | హత్తుకొని మొత్తులాడి పెన్నెత్తు రొలుకఁ జూచువారల కెంతయు సొబగుమీఱ బూరుగుల పోల్కిఁ బొలిచి రప్పోరునేల బూచిగములును బందులుఁ బొదలియాడ | 135 |
| తే. | అంతఁ బడమటి కడలి నీరాఱుమేను లుండు దేవర క్రుంకిన నుబ్బి రేయి ద్రిమ్మరులు సెట్టు ద్రిమ్మరి తెగలఁ బొదివి పలు తెఱంగుల నొంప నబ్బలియు రలిగి | 136 |
| ఉ. | కొందఱ నేలతోఁ జదియఁగొట్టుచుఁ గొందఱఁ గూల మట్టియుం గొందఱ బొండుగల్ వగుల గ్రుద్దియుఁ గొందఱ నోళ్ళు వ్రచ్చియున్ గొందఱఁ దోఁక త్రాళ్ళిరియఁ గుత్తుకలం దగిలించి లాగియుం జిందఱ వందరై పడఁగఁ జివ్వ కడన్మడియించి రంతటన్ | 137 |
| తే. | అందుఁ బొలియక చిక్కియున్నట్టి సోఁకు దొరలతోఁ గూడి యింద్రజితుండు దీవి కరిగి గాడుపు సంగడీఁ డలర నొక్క దండ వ్రేలిమి యొనరింప దానివలన | 138 |
| క. | అక్కజపు విండ్లుఁ గైదువు లెక్కుడు మెకములును దేరు లెల్లులు ములుకుల్ టెక్కెములు దొనలు బేరులు జక్కి తెగలుఁ బొడముటయు వెసం గొని యనికిన్ | 139 |
| తే. | మరల నరుదెంచి మిన్నంటి మబ్బుతెగల నడుమ నెవ్వారికినిఁ గనఁబడక యుండి రాగవుని దండుపయి వాఁడు రవళి నంప వాన గురియింప వారలోర్వక కలంగి | 140 |
| ఆ. | పొదలఁ దూఱువారుఁ బుట్టల మాటున నీఁగువారుఁ బరువులెత్తువారుఁ ద్రెళ్ళువారు బొబ్బరించువారును నేలఁ బొరలువారు నైరి సొంపు దరిగి | 141 |
| తే. | అట్టు లెడరులఁ గుందెడు చెట్టునట్టు మెకపు బంటులఁ గని యడల్మీఱ రాచ పచ్చగన్నుల మెకము రావణునితోడ బుట్టువును డాయఁ బిల్చి తా నిట్టులనియె | 142 |
| క. | జగములు సెడిపోవు తఱిన్ మొగులు తెగల్ మింట దట్టముగఁ గ్రమ్ముక వా న గురియు చందమునం జి ల్కు గముల్ గురిసెడి నిదేమి గోరము చెపుమా? | 143 |
| ఉత్సాహ | అనిన నాతఁ డిట్టులనియె నయ్య! వినుము సోఁకు రా యని యనుంగుఁ గొమరుఁ డగ్గి నలరఁ జేసి మేటి తే ర్లను గడింది యేనుఁగులును, లొట్టియలును, మావులం దొనలు విండ్లు నతని కతన దొరికినం జెలంగుచున్ | 144 |
| మత్తకోకిల | నీరు తాలుపు చాల్పులోపల నెమ్మిఁ దూఱి మెఱుంగువాల్ నారసంబులు దండుపై జతనంబుగాఁ బఱగించు చే వారికిం గనరాక యుక్కున వ్రాలి క్రాలుచునున్న వాఁ డారయం గడు బల్లిదుం డితఁ డన్ని నేలల రాయఁడా! | 145 |
| పంచచామరము | అనం గొఱంత లేని కిన్క నక్కడింది జోదు గ్ర న్ననం బెడంగు వింట వాలు నారసంబు లూని యే పునం జెలంగి నింగి యెల్లఁ బొల్పరం గడంగి యే సినన్ లకోరి యొక్కటైనఁ జెందదయ్యె వానిపైన్ | 146 |
| తే. | అందులకుఁ జాల సందియం బంది ఱేడు వీనిఁ దెగటార్చి రండని వేగ గజుఁడు వృషభుఁ డంగదుఁ డీఁద యర్మిలి నిసుంగు నలుఁడు మొదలుగ బలియురఁ బిలిచి పనిచె | 147 |
| క. | పనిచిన నబ్బిరుదు మగ ల్విను తెరువున నెగసి యుద్దవిడిఁ జనుచో న చ్చెనఁటి తొలివేల్పు గడుఁ బె ల్లునఁ బైపైఁ జికిలి వాల్ములుకులు నిగిడ్చెన్ | 148 |
| భుజంగప్రయాతము | నిగుడ్పం జొరన్లేక నేర్పేది యవ్వా ల్మగల్ గ్రమ్మఱ న్వాలి మన్ఱేని మెట్టున్ జిగుళ్ళూఁతఁగా నిల్చి చేడ్పాటుల న్బి ట్టుగాఁ గుందుచో సోఁకుడున్దుల్వ యాలోన్ | 149 |
| తోటకము | కొంచక నాల్కలు గోఁడుచు మంటల్ నించుచు నింగియు నేలయు నెల్లన్ ముంచుక బుస్సున మ్రోఁగుచు వాఁడిన్ మించిన పాముల మేల్చిలు కేసెన్ | 150 |
| తే. | ఏయుటయుఁ బాఁపగములు పెక్కేసియగుచుఁ గ్రమ్మి రాముని నాతని తమ్ము గుఱ్ఱ నెల్ల మూఁకల బిగఁబట్టి యిడినఁ బుడమి త్రెళ్ళి యందఱు నొగి సొమ్మసిల్లి రపుడు | 151 |
| ఆ. | పగ యడంగునంచు మిగుల డెందములోన నలరి వేల్పురాచ గెలుపుకాఁడు ఠీవి నేఁగి గెలుపుఁ దెఱఁగెల్లఁ దండ్రికిఁ దెలియఁజెప్పి యెలమి నెలయఁ జేసె | 152 |
| తే. | అంత నచ్చట రాముఁడు కొంతవడికిఁ గన్నుఁగవ విచ్చి తోఁబుట్టువున్న తెఱఁగుఁ జూచి తద్దయు వనటల స్రుక్కుచున్న యెడల నా ఱేని చెంతకుఁ గడిఁది మీఱ | 153 |
| సీ. | విన్ను గేళాకూళి వెలఁది నీర్నినిచిన పసిఁడి జారీ చెంబు పస పొసంగ మే పూఁత వెలిబూది మిసిమియంటి వెలుంగు నిద్దంపు టలఁతి జన్నిదము లమర నునుగోళ్ళ తెలిచాయ నెనసి తళ్కులు గుల్కు పటికంపు సరముల బాళి మీఱఁ బూప తామర విందుఁ బోల్ప నీడై తగు గడితంపు నిడుద కెంజడలు వఱల | |
| తే. | వాన కొన తఱి మబ్బు చేర్వలను దెగడు మేన నాడెంపు టిఱ్ఱి తోల్జా నెసంగ నోర జగముల యెకిమీని పేరు సారె గొణగుచును వచ్చె జగడంపుఁ గూటి తపసి | 154 |
| తే. | వచ్చి యవ్వేడి వేలుపు వంగడంపు నేల మొలత్రాటి నిండు కుందేటి తాల్పు మ్రోల నిల్చి కరంబు ప్రేముడి తలిర్ప వెరవుతోఁ బల్కెఁ గేలు దామరలు మొగిచి | 155 |
| కమలవిలసిత | జగములు యొడయఁడ! చదువులు మూఁడున్ దగిలిన కడఁకవొదల నిను జేజేల్ ముగురకు మొదలగు ముదుకఁడవంచున్ బొగడెడుఁగద గొనబుగఁ బలుమాఱున్ | 156 |
| స్వాగతము | మేరలేని పలు మేనులుఁ బేరుల్ సారెఁ బూను నెఱజాణల మిన్నం గోరి నిచ్చలును గొల్తురు నిన్నుం దోరమైన మదితో జడదారుల్ | 157 |
| స్రగ్విణి | చీమలుం దోమలుం జెట్టులుం గట్టులుం బాములుం బుల్గులుం బందులుం జేఁపలున్ గాములున్ వేల్పులుం గల్గు మే తాల్పులున్ వేమఱున్ బల్లిదా! నీవెకా నెన్నుదున్ | 158 |
| తే. | వాసి దయ్యము నీవె వెయ్యేసియైన తలలు జేతులుం గన్ను లజ్జలును గలిగి యలర లొడితెడు మగవాఁడ వగుచు నేల యెల్ల నాఁగుదువని మిన్కు లెన్నుఁ గదవె | 159 |
| తే. | తలఁప నివ్వరి ముంటి చందమున మిగులఁ గొంచెమై కప్పు మొగులులో మించుఁదీవ పోల్కి మెఱయుచుఁ బచ్చనై పొలుచు తేజు నీవకద! నిక్కముగ మేటి నేలఱేఁడ! | 160 |
| దండకము | అరిది బిరుదా! నీవు రాయంచ తేజీ వజీరుండవై చుట్టు వాల్దాల్పవై మెట్టు విల్వేల్పువై ఠీవితో ముజ్జగంబెల్లఁ బుట్టించుచుం బ్రోచుచున్ ద్రుంచుచున్ నీవె జాబిల్లివై ప్రొద్దువై యుద్దిగా రేపగళ్ళ న్నెఱిం జేయుచుం దుంత టెక్కెంబు రాయండవై పున్నియంబుల్ గొలల్ నిచ్చలుం బంచి మెక్కింపుచుం దూర్పునాడేలు మన్నీఁడవై వానచేఁ బంట లొందింపుచున్ జంట నెమ్మోములన్ దంటవై వంట కర్జంబు సాగించుచున్ వెండియున్ జేయఁగాఁగల్గు కర్జంబు లెన్నైనఁ బల్రూపులం బూని కావించుచున్ మాటికిన్ బూటకంబారఁ బేరాటలం బొల్తువంచోలి నీమాట ప్రాబాస వాల్మేటు లేర్పాటుగాఁ జాటఁగాఁ దేటగా వీనుల న్నాఁటి యేనాటికిం బాయదో సామి! నీ కీఁద లా వగ్గి నెమ్మోము రేరాయఁడుం బ్రొద్దుఁ గన్నుల్ మొగుల్త్రోవ నాడెంపు మే న్వేల్పుప్రో లఱ్ఱు క్రొందమ్మిపూనట్టు కుఱ్ఱండు డెందంబు జేజే ల్బుజంబుల్ నిరాబారులు న్వెండ్రుకల్ నల్వయా ల్నాల్క ప్రాఁబల్కుచాల్తల్లి కీల్గంటు ప్రాఁబల్కు లూర్పుంగముల్ సంద్రముల్ బొజ్జ మన్నజ్జకెందామర ల్వేల్పువెజ్జు ల్పిఱుందు ల్కడల్ వీనులైయొప్పు నీ చొప్పు గావింపఁగా నన్నియు న్నీవయైయుందు వొండెద్దియున్ నీవుగాకున్న దెచ్చోటులన్ లేదుగా పాదుగా బమ్మ గ్రుడ్డుంగముల్ నీమెయిన్ మేడిపండ్లంబలెన్ బ్రోవులైయుండుఁ బో తండ్రీ! నీ వెప్పుడుం దుల్వలం గాల్పఁగా సాదులం బ్రోదిగావింపఁగాఁ గోరి వేవేల వేసంబు లెంతేనియు న్వేడబం బొప్పఁగా బూని రాణింతు వెట్లన్న మున్మీను మేనూని మున్నీరు సొత్తెంచి పెన్మిన్కుచా ల్తెక్కలిం జక్కజక్కాడి నెత్తమ్మిపూఁజూలి నుబ్బింపవా? ప్రాఁత జేజేలు జేజేలు దేజారఁగాఁ జేరి వేజాడలం జిడ్డు నీర్వామి వేత్రచ్చుచో మేటి తాఁబేటి మే యెత్తి మవ్వంపుఁ గవ్వంపు గట్టూని వేల్పుంగమిన్ గావవా? దేవరా! క్రొవ్వి మన్నంతయుం గొంచు బల్పాఁప రాయిక్కకుం బ్రాకు బంగారపుంగంటి రేద్రిమ్మరిం జన్నపుం బందివై చెంది వైళంబ వాల్గొమ్ములం గ్రుమ్మవా? గట్టిగా గన్న తొ ల్బొట్టెనిం బట్టి యిట్టట్టుగా బిట్టు దట్టింపుచుం జెట్టలం బెట్టు బల్గట్టు వారక్కసు న్వెక్కసంబైన పేరుక్కుతో నుక్కు గంబంబునం బుట్టి గిట్టింపవా? పొట్టివై నేల మూఁడజ్జలే వేఁడి వేగన్ జగంబాఁగి చాగంపు తొల్వేలుపుం గ్రిందికి న్మెట్టవా? మెండు నిండారఁగా జామదగ్న్యుండవై గండ్రగొడ్డంట ముయ్యేడు మార్లేచి గయ్యాళి రాపిండులం జెండుబెండాడవా? దేవరా! యిప్పు డిచ్చాలుపుంగుత్తుకల్గల్గు ప్రావేలుపుం గూలుపంగోరి యీరైదుబండ్లెక్కు రా కల్వసంగాతికిన్ గూనవై పుట్టియున్నాఁడ వీవెట్టులోఁ దెల్వి యొక్కింతయు న్లేక స్రుక్కంగ నింకేల? నీ జక్కియై యుక్కునం గేరు న ప్పక్కిరారిక్కఱేనిం దలంపంగఁ గర్జంబు లెన్నేనియుం జక్కనై సాగుఁ బొమ్మంచు నెయ్యంబుతోఁ దెల్పి జేజే నిరాబారి యెందేనియుం బోవ రాచూలి తా నప్పు డా గూఁడుకాన్పుం దొరం గూర్మి డెందంబున న్నిల్పుడున్ | 161 |
| చ. | గడితపు ఱెక్కగాడ్పుల జగంబు లగడ్పడి తాఱుమాఱుగాఁ గడలిగముల్ గడుం దొనఁకి కట్టడి కట్టలు దాఁటి పాఱఁగాఁ బుడమి గలంగ వే దలల పూనెడు పాము దలంకి పాఱఁగాఁ దడయక వచ్చె వేలుపుల దారికి పాములు వేఁటకాఁ డొగిన్ | 162 |
| క. | వచ్చినఁ బొడగాంచి పెనల్ విచ్చుకొని కడుం దలంకి విసదారి గముల్ విచ్చు న్మొగ్గయి కడలకు విచ్చలవిడిఁ బఱచెఁ గట్లు వీడెం బజకున్ | 163 |
| ఆ. | అపుడు పుల్గురాయఁ డర్మిలి పుడమికి డిగ్గి నేలఱేని డెంద మలరఁ జేసి మరల వింటఁ జెచ్చెరఁ బఱతెంచె నెలమితోడ మూఁకలెల్లఁ బొదలె | 164 |
| ఆ. | అంతఁ బొడుపుతిప్ప నెంతయుఁ గడకతోఁ జక్కిదాయ పడగసామి యబ్బ బొడముటయును బొంగి యడవి ద్రిమ్మరిజోదు లార్పు లెసఁగ లంక కరిగి రనికి | 165 |
| క. | అరిగినఁ గని వేగులవా రరుదారఁగ దీవిఱేని యండకుఁ జని వా విరి నత్తెఱఁ గెఱిగించిన గరము వగం బొందె నతఁడు కళవళమొదవన్ | 166 |
| ఆ. | ప్రెగడ పిండు నెల్లఁ బిలిపించి వింటిరే? యిట్టి కడిఁది మీర లింద్రజిత్తు చేతి చిలువత్రాళ్ళఁ జెయువేది పొలిసిన కోఁతి బంట్లు మరలఁ గూడి రనికి | 167 |
| సీ. | అని పల్కి ధూమ్రాక్షుఁడను వాని దురమున కనిచిన నతఁడు లావడర మూఁక లేనుఁగుల్ గుఱ్ఱము లెడపక తోడరా నక్కజంబుగఁ బైఁడి యరదమెక్కి అడవి ద్రిమ్మరులపై నడచిన నిరువాగు వారును దార్కొని వాఁడి మీఱఁ బోరాడు నెడ నేచి పొలదిండి బంటులు కొండ ద్రిమ్మరి బంట్ల నండగొనక | |
| తే. | బల్లెములఁ గుమ్మి మావులఁ బఱపి నఱికి యేనుఁగులఁ దోలి మట్టించి యినుప గుదెల మోఁది నెఱకులు వాలుటమ్ములఁ బగిల్చి బిట్టు నొప్పింప నజ్జగ జెట్టు లలిగి | 168 |
| లయగ్రాహి | గట్టులును జట్టులును జెట్టులును బట్టుకొని నెట్టుకొని రక్కసులఁ జుట్టుకొని ఱొమ్ముల్ మట్టియును దోఁకలను గట్టియును మార్మెడలు పెట్టియును దట్టమగు గట్టి పగమీఱన్ బొట్టలును జట్టలును బిట్టు వగిలించి పలు చెట్టలను నొంచి జముపట్టునకుఁ బోవన్ బెట్టి కడు నేనుఁగుల లొట్టియల దట్టువల తెట్టువలఁ గొట్టుటయుఁ గట్టలుకతోడన్ | 169 |
| క. | నలుపుగల తొవరు కన్నుల పొలమేపరి కొమ్మ మెకపు పోటరుల పయిన్ జెలఁగి యరదంబు వఱపుచుఁ జలముగ నెదిరించి యంపజడి నొనరించెన్ | 170 |
| క. | ఒనరింపఁ బిచ్చలింపక మునుకొని యయ్యడవి మనికి మొనగాం డ్రతనిన్ జెనసి పెను గట్లుఁ జెట్లును బెనుపొదవఁగ రువ్వుటయును బెగడక వాఁడున్ | 171 |
| తే. | తేరు వడిఁ జొన్పి యిఁకఁ గడతేరు డనుచు వాఁడి తూపులు తఱచుగా వారిమీఁద వేయుటయు స్రుక్కి కోల్తల సేయలేక పఱవఁ జూచిన గని గాడ్పుపట్టి గినిసి | 172 |
| తే. | ఉఱువు మీఱఁగ మావి మ్రానొకటి వెఱికి రక్కసుని వైవ బెదరక యుక్కుతునియ బలిమిమైనది యొక దొడ్డ పాఱవాతి తూపునఁ గడంగి నడుమనె తునియవైచె | 173 |
| ఆ. | వైచుటయును జింకవార్వపు జోదు బి డ్డండు వెండియును గడంగి వాని తేరు గడపువాఁడుఁ దేరును గుఱ్ఱముల్ చదియ నొక్క పెద్ద చట్టు వయిచె | 174 |
| క. | అటుల నరదంబు వోయిన దిటము సెడక పుడమి కుఱికి దిగ్గన న య్యె క్కటి జోదొక పెను బడియం దటుకున నక్కోఁతి మిన్న తల నోయడిచెన్ | 175 |
| తే. | అందులకుఁ జాల నెదలోన నలుకఁబూని జబ్బలుబ్బంగ నక్కోఁతి బెబ్బమెకము కొండకొనతున్క వేగ నొక్కటి వగిల్చి వాని తలమీఁద జదియంగ వైచి చంపె | 176 |
| తే. | అట్లు ధూమ్రాక్షుఁ డని నీల్గినట్టి తెఱఁగు సోఁకురాయఁడు విని తద్ద సోలి తెలిసి వడి నకంపనుఁ డనియెడు వానిఁ బిలిచి యచ్చెనంటులఁ దునిమి రమ్మనుచుఁ బలికె | 177 |
| క. | పనిచిన నతఁ డెన్నిక మీ ఱిన పౌజులఁగూడుకొని నెఱిన్ దురమునకున్ జన నచ్చెట్టున్ ద్రిమ్మరి మొనగాఁడులు ఱాలవాన మొగిఁ గురియుటయున్ | 178 |
| క. | మిక్కుటమగు కొఱకొఱ న య్యుక్కివుఁ డరదంబు వఱపి యురువడిఁ దూపు ల్పెక్కు నిగుడ్చుచు మూఁకల నొక్కటఁ బురికొల్ప వార లుక్కుదలిర్పన్ | 179 |
| సీ. | తేరులు వఱపి యేడ్తెఱఁ దూపు లడరించి వడిగల మావుల వయిచి నఱికి యాముటేనుఁగులఁ బాయక డీకొలిపి మ్రగ్గఁ ద్రొక్కించి యినుప పెన్ దుడ్ల నడిచి వంకుల జముద్రాళ్ళ వాల్బల్లెములఁ గ్రుమ్మి పయికొని పెద్ద యీటియలఁ బొడిచి గండ్రగొడ్డండ్ల నుక్కఱ జెండు బెండాడి మొనల కైదువల ఱొమ్ములు వగిల్చి | |
| తే. | మిగుల నొప్పింపఁ గనలి మ్రాన్మెకపు బిరుదు లొక్కమొగి వాండ్రఁ బోనీక చిక్కఁబట్టి పొడిచి యడచియుఁ దాఁచియుఁ బుడమివయిచి మట్టి గ్రుద్దియుఁ గఱచియు మడపి రపుడు | 180 |
| ఆ. | గండు మీఱ నయ్యకంపనుఁ డఱిముఱిఁ దూపు లేసి కోఁతి దొరలఁ గలఁచి కనుపుగొట్టుచున్నఁ గనుగొని జగముల యుసురుకందు లోన నులుకు నిగుడ | 181 |
| ఆ. | మోట మద్ది యొకటి మురిఁ బెకలించి య మ్మేటి సోఁకు జోదు మీఁద వయిచి సదమదంబు సేసి కొదుకక సింగపు రొద యొనర్చె మూఁక లొదవి పొగడ | 182 |
| క. | అంతట నప్పని యీరే న్గొంతుకల గయాళి వేల్పుగొంగ విని మదిం బంతము నిగుడఁగ నెంతయు వంత మహాకాయు ననికి వడిఁ బుచ్చుటయున్ | 183 |
| సీ. | బలుహజ్జ మెకపు దాఁటులు సిల్కు దట్టంపు టాము నీరున నేల యసలు గొనఁగఁ దత్తడి డెక్క గుద్దలి వ్రక్కలింతల నెగసిన దుమ్ము మిన్నెల్లఁ గప్ప మెండు మీఱెడు బండి కండుల యొఱపునఁ జిలువల యెకిమీఁడు దలలు ముడువఁ గాలరి పౌజు వెక్కసపు టార్పుల జంట చవువంచ కడలును జెవుడు వడఁగఁ | |
| తే. | గఱకు టడిదంపు బెడిదంపు మెఱుఁగు గములు మిగులఁ జూపఱ చూడ్కి మిర్మిట్లు గొలుపఁ బొసఁగఁ బదినూర్ల తత్తడు ల్వూనినట్టి పసిఁడి తేరెక్కి పోరికి బయలు వెడలె | 184 |
| ఆ. | వెడలి కోఁతి తుటుము దొడరిన బిఱబిఱ రెండు మొనలు బెరసి గండు మెఱయఁ బోరుచున్న యెడలఁ బొలదిండి పోటరు లడవి నెలవు బంట్లఁ గడిమి నలమి | 185 |
| చ. | ములుకులఁ జిమ్మియుం గుదెల మోఁదియు నీఁటెలఁ గ్రుమ్మి కత్తులం జెలవియు మావులం బఱపి చెండియు మోములు గాళ్ళు డొక్కలుం దలలును జేతులుం దొడ లెద ల్మెడలున్ నడుముల్ పిఱుందులు న్నలి యొనరించి క్రొమ్మెదడు నంజుడు నల్లయు నుర్ల జేసినన్ | 186 |
| ఆ. | ఇవముసూడు కొలపు టెకిమీనిబంటు ల క్కజపు మగతనంబు గడలుకొనఁగ నార్చి ఱేని కెలమిఁ గూర్చుచుఁ దూఱి యా సోఁకుమూఁక నెల్లఁ జుట్టుముట్టి | 187 |
| ఆ. | తేరితోడ తేరుఁ దేజితోఁ దేజి యే నుంగుతోడ నేన్గుఁ ద్రుంగఁ గొట్టి బంట్లఁ బల్దెఱఁగులఁ బరిమార్చివైచినఁ జూచి దొడ్డ యొడలి సోఁకు డలిగి | 188 |
| చ. | అరదము దోలి వింట గొనయంబు దవిల్చి మెఱుంగుటమ్ము ల బ్బరముగఁ బూన్చి యయ్యుఱియబంటుల నిద్దపు మేనులెల్ల వా విరి నలియంగ నేసి గొడివెల్ బెరయించిన సైఁపనోపక బ్బిరుదుమగల్ వడిం బరువు వెట్టఁ దొడంగిన నంగదుం డొగిన్ | 189 |
| క. | నిలుఁడు నిలుఁడనుచు వారలఁ బొలుపుగఁ బెనఁకువకు మగుడఁ బురికొల్పుచు న త్తులువ తొలివేల్పుఁ బైకొని బలితపు మ్రానొకటి మీఁదఁ బడవైచుటయున్ | 190 |
| క. | నొప్పివడి వాఁడు దద్దయు నుప్పర మద్రువంగ నార్చి యొక వాలుం దూ ప ప్పొలము ద్రిమ్మరి పయిన్ గప్పున నడరింప సొమ్మ గొనియుండు నెడన్ | 191 |
| సీ. | గుబ్బలి ద్రిమ్మరు ల్గొందఱు సెట్టులుఁ బడుకులుఁ బూని యగ్గడుసు నల్ల ద్రావుడు బిరుదుపైఁ బోవ నాతఁడు శత వలి నైదు ములుకులం బనసు నేఁడు తూపుల వృషభునిఁ దొమ్మిది చిల్కుల నలి గవాక్షుని నూఱు నారసములఁ గ్రోధను నీరైదు కోలలఁ బృథుని మూఁ డమ్ముల గజుఁ బదియాఱు పదుల | |
| తే. | బలుల కోరులఁ దక్కిన పొలము మనికి బంట్ల నొక్కొక్క చిలుకున బడలు వడఁగఁ చేసి యార్చిన నంత జేజేల ఱేని యనుఁగు మనుమఁడు డెప్పిఱి కినుకతోడ | 192 |
| క. | మావిడి చెట్టొక్కటి పెన్ లావడరఁగఁ బెఱికి యా చెనఁటి యరదమ్మున్ మావులు విల్లును దుమురై పోవఁగ వైచిన నతండు వొలివోని బిగిన్ | 193 |
| చ. | పుడమికి దాఁటి బల్గుదియఁ బుచ్చుక నెవ్వడిఁ దారబోదపైఁ గడగిన నాతఁడున్ గుదియఁ గైకొని పైకొనె నట్టు లిర్వురున్ జెడని కడంకతోఁ గొదమ సింగము లట్లు నెదిర్చి బోరలున్ దొడలును వీఁపులుం దలలు నొవ్వ గడిందిగ మోఁదులాడుచున్ | 194 |
| సీ. | విడుచుచుం బట్టుచుం బొడుచుచు నడఁచుచుఁ దన్నుచు గ్రుద్దుచు దాఁటుకొనుచు నెగయుచు మొగియుచు నేలఁ ద్రెళ్ళుచుఁ గ్రిందు మీఁదై పెనంగుచుఁ బాదుకొనుచు నార్చుచుఁ బేర్వాడి యదలింపుచుఁ గడంక నెఱపుచు బుజముల సఱచుకొనుచు నీసడింపుచుఁ గన్ను లెఱ్ఱఁజేయుచు బుస కొట్టుచుఁ పకపక బిట్టు నగుచు | |
| తే. | నెత్తురును దుమ్ము మేనుల హత్తుకొనఁగఁ బెక్కు తెఱఁగులఁ బోరుచో నుక్కు మెఱసి వాలి కుఱ్ఱఁడు పిడికిట వాని నెత్తి బీటలుగ గ్రుద్ది పడవైచి బిలుకు మార్చె | 195 |
| క. | అత్తఱి నీల్గక చిక్కిన నెత్తురు ద్రావుడుల వలన నెవ్వడిఁ జాల్పున్ గుత్తుకల రక్కసుఁడు విని మెత్తం బాటూని తోన మిగల నడలుచున్ | 196 |
| క. | నేస్తంబు మెఱయ నపుడె ప్ర హస్తుని రావించి బలియుఁడా! యిపు డెదలోఁ గస్తి విడఁ బుడమి కానుపు గేస్తుని గీటడఁచి రమ్మొగిని నీ వనుడున్ | 197 |
| సీ. | విను చూలి తేజీలఁ బెనయు మావులతోడ మొగిలు చెన్నొరయు నేనుఁగులతోడ గట్లతో నుద్దియై క్రాలు తేరులతోడ బలిమి సూపెడు పోటు బంట్లతోడ ముజ్జగంబు వడంక మ్రోఁగు బేరులతోడఁ కొమరారు బిరుదు టెక్కెములతోడ జొంపంపుఁ దెలి ముత్తియంపు టెల్లులతోడఁ దులకించు చికిలి కైదువులతోడ | |
| తే. | మేలి రతనంపుఁ బని పల్లకీలతోడఁ దోరమగు పైఁడి కాళెలతోడఁ దఱుల మొకపు మెకములపై హెచ్చరికల వెడలె నప్పు డిరుదెగ మూఁకలు ననికిఁ దొడరి | 198 |
| చ. | చిలుకులగట్లఁ గైదువులఁ జెట్టుల ద్రుడ్ల నొడళ్ళు నజ్జుగాఁ దలకొని మొత్తులాడి బెడిదమ్ముగ నెత్తురు లేఱులై చనం జలమునఁ బోరుచో మల హజారపు జోదులు సోఁకుమూఁకలన్ బొలుపఱఁ జేసి యా జముని ప్రోలికిఁగా నలి యన్ప నత్తఱిన్ | 199 |
| సీ. | అలుకతోడఁ బ్రహస్తుఁ డమ్ముల జడిఁ గురి యించి పౌఁజుల నెల్ల నొంచుచున్నఁ గనుగొని నీలుఁ డక్కఱకు రక్కసు విల్లు దేరును మావులఁ దేరు నడుపు వానిని నొక తాడిమ్రానునఁ జదిపినఁ బుడమికి దాఁటి యప్పొలసుదిండి తూపుల నా బిరుదు నొసలు నొప్పింపఁ గనలి యక్కోతి సింగంబుఁ బెద్ద | |
| తే. | పడుకొకటిఁ దెచ్చి నడునెత్తిఁ బగులవైచి వానిఁ బోకార్చి నెమ్మది వఱల బూచి గముల కామెత లొసఁగె నక్కస మెసంగ రావణుఁడు దద్ద యొఱలి బీరమ్ము హెచ్చ | 200 |
| క. | పడవాళ్ళఁ బిలిచి మూఁకల వడి దురమున కేఁగుదేరవలెనని నేమం బడఱ నెఱిఁగింపుఁడని పది కడ లద్రువఁగ బేరి వ్రేయఁగాఁ జేయుటయున్ | 201 |
| ఆ. | తేరు లందలములు దేజీలు నేనుఁగు ల్మొదలు గలుగువాని ముఱి యెలర్ప నెక్కి యక్కజముగ రక్కసి నెఱజోదు లెలమిఁ చేరి మ్రోల నిలిచి రంత | 202 |
| సీ. | వెలలేని రతనంపుఁ బలు దొడవులు వెట్టి తోరంపు చికిలి కైదువులు గట్టి పొసఁగ నౌదలల హొన్బొమిడికంబులఁ బూని డాకాల గండపెండెర మమర్చి తళతళ మెఱయు పుత్తడి పుట్టములు దాల్చి కేల ముమ్మొనవాలు గీలుకొలిపి కమ్మ కస్తురి సిరిగందంబు మెయిఁబూసి యెదవేల్పు మ్రాన్పూవుటెత్తులునిచి | |
| తే. | పసిడి బెత్తుల వాండ్రిరుదెసలఁ గ్రమ్మి హెచ్చరికల బరాబరు లెనసి సేయ పొడుపు గుబ్బలిపైఁ బ్రొద్దుగడఁక నెక్కు కరణి నవ్వేలుపుల గొంగ యరదమెక్కి | 203 |
| సీ. | జగముల దిగుల! నిచ్చలపు మేలిమిగట్ట! కుఱ్ఱ వేల్పుల తలగుండు గండ! ప్రావేల్పు మన్నీఁడ! బమ్మదేవర మెప్ప! నెలతాల్పు కొండఁబూనిన బలియుఁడ! జేజేలదొర పాలి చిచ్చఱ పిడుగ! వె గ్గలపు దురంబుల గెలుపుకాఁడ! కడిఁది వాల్మగఁడ! బంగరు దీవి రాయఁడ! టక్కరి యెకిమీండ్ర ముక్కుఁగొయ్య! | |
| తే. | గొనబు టచ్చర ననఁబోండ్ల ననుపుకాఁడ! కడమ యొదవని ఠీవుల నడరు ఱేఁడ! గెలువు గెలువు మటంచు నగ్గించు బిరుదు పద్దెములు బట్లు సదువుచు బలసి చనగ | 204 |
| సీ. | బేరులు డోళ్ళు తప్పెటలు కాళెలు పిల్లఁ గ్రోవులు తుడుములు ఠీవి మెఱయఁ బడగలు ముత్యాల గొడుగులు జల్లులు నాలవట్టములు సొంపారి మెఱయఁ బసిఁడి పక్కెరల బాబాలు మానికపుఁ జహో డోలీల యేనుంగు లోలిఁ జెలఁగ విచ్చుఁ గైదువులు బల్విండ్లు నీఁటియలూని యార్చుచుఁ బోటు బంట్లగ్గలింపఁ | |
| తే. | బుడమి పరియలువాఱ నల్గడలు నద్రువఁ బెను దుమారంబు మిన్నెల్ల బిట్టు గప్ప జగములడగింపఁ గడగుడు జముని మాడ్కిఁ బొంపు రాణింప వడి నాలమునకుఁ దరలె | 205 |
| తే. | తరలి రాచూలి దండుపైఁ దారసిల్లి మూఁక నొండెడ విడియించి, వీఁకఁ దానె యని యొనర్పఁగఁ దొడఁగిన నడవి గీము బంట్లు మ్రాఁకులుఁ బడుకులుఁ బట్టుకొనుచు | 206 |
| క. | దురమునకు మొనయుటయు నతఁ డరుదుగ వాల్ములుకు లేసి యందఱఁ గ్రొన్నె త్తురు జొత్తిల్లం జేయుచు నరదము వడిఁ జొన్పి తఱిమి యార్చుచు రాగన్ | 207 |
| చ. | కనుగొని ప్రొద్దుకుఱ్ఱఁ డలుకన్ మల యొక్కటి రెండు చేతులం గొని కడలన్నియుం బగులఁ గూఁకలు పెట్టుచు వానిమీఁద గు ప్పిన నది నుగ్గుగాఁ బసిఁడి పింజలమర్చిన తూపు తిట్టలం దునిమి పిసాళి రక్కసుఁడు తోడనె వేల్పులు పిచ్చలించఁగన్ | 208 |
| ఆ. | ఱొమ్ము గాఁడిపాఱ నమ్ముల నేసిన సొమ్మవోయి మేటి కొమ్మ మెకపు బిరుదు రాగిజుట్టు పిట్టతాలుపు వాలుఁ గోలఁ గొంచ గట్టువోలె వ్రాలె | 209 |
| సీ. | వ్రాలినఁ జూచి గవయుఁడు గవాక్షుడు జ్యోతిర్ముఖుఁడు సుదంష్ట్రుడు నలుండు గజుఁడు వృషభుండు గనలుచు నొక్కటఁ బెను మెట్టు లతనిపై మొనసివైవ నడుమనే వాఁడవి వెడఁదవాతి లకోరి గుంపునఁ దునిమి యేడ్గురి నొకొక్క చిలుకునవడి సొమ్మసిలఁ జేసి తోడనే మూఁకల నెల్ల జీకాకు పడఁగఁ | |
| తే. | దూఱనేసిన గాసిలి పారి వార లురవడిని వ్రాలి రాముని మఱువు సేరి బొబ్బరించిన నళుకెల్లఁ బోవఁ బలికి యపుడు రాచూలి సరగ విల్లందుకొనుడు | 210 |
| క. | అన్నకు మున్నుగ బలితపు మున్నరకన్ లక్ష్మణుండు మొగిఁ దొలి జేజే మిన్నపయి నడరుచోఁ గని విన్ను మనుమఁ డతని ద్రోచి వెసఁ దా నెదిరెన్ | 211 |
| ఆ. | ఎదిరి తేరిమీఁద కెగసి నరచేత వాఁడు వ్రేయ నొచ్చి వాఁడి సెడక మరలి వాని నడఁచి మంటికి దాఁటిన వేల్పుగొంగ సోలె వేల్పు లలర | 212 |
| తే. | సోలి మెల్లనఁ దెలిసి యా సోఁకుఱేఁడు కోఁతి రాయనిఁ బిడికిట గ్రుద్దుటయును బొలసు మేపరు లార్వ నప్పోటుకాఁడు కడఁకఁ దిగద్రోచి చయ్యనఁ బుడమి వ్రాలె | 213 |
| తే. | అంత నీలునిపైఁ బదియఱ్ల జోదు తేరు వోనిచ్చి బలువాలు నారసములు నినుప నవి యొడ్డుకొని వాని నెత్తి తొడవు మానికము లూడ నవ్వాడి మగఁడు దాఁచె | 214 |
| క. | తాఁచిన మో మెఱవారఁగఁ జూచుచు నింగలపు ములికి సోకుఁడు మన్నీఁ డా చెట్టుం ద్రిమ్మరిపై వైచిన నొడలెల్లఁ గమరిపడి సొమ్మసిలెన్ | 215 |
| తే. | అట్టు లాతఁడు పడిన బిట్టార్చుకొనుచుఁ దేరు లక్ష్మణుపైఁ దోలి దీవిరాయఁ డేడు బెడిదంపు వాల్తూపు లేయ నతఁడు మెఱుఁగుటమ్ముల నవి దోన నఱికివైచె | 216 |
| క. | తఱచగుచుఁ బింజపింజయుఁ గఱచుక మిడుగురులు సెదరఁ గడు మిడుతల చా ల్తెఱఁగున నడరెడు చిలుకులు గిరిగొనఁ బఱపుటయు వాఁడు గిజగిజపడుచున్ | 217 |
| తే. | మున్ను నెత్తమ్మిచూలి చేగొన్నయట్టి సత్తియను తూపు నిగుడింప సరగ ఱొమ్ము దూఱుటయు సొమ్మసిలి రాముతోడఁ బుట్టు వొఱగెఁ బుడమికిఁ గోఁతులు వెఱచి పఱప | 218 |
| క. | అత్తెఱఁగున సైదో డని నత్తమిలినఁ జూచి రాముఁ డలుక నిగుడఁగా నత్తొలివేలుపుఁ గలువల మిత్తురు డాకొని కడంక మీఱఁగఁ బలికెన్ | 219 |
| ఆ. | ఓరి ఠవళికాడ! యోడక మిగుల నా కెగ్గు సేసితింక నెందుఁ దూఱఁ గలవు? నలువ వచ్చి కావఁబూనిన నిన్ను జుడిఁగి పోవనీక మడఁపువాఁడ | 220 |
| తే. | అనినఁ దద్దయు నులికి యీరయిదు తలల రక్కసుఁడు రాగవుని కప్డు జక్కియైన గాలి కొమరునిపైఁ బెక్కు వాలు తూపు లేసె - నేసినఁ గినిసి యావ్వాసిఱేఁడు | 221 |
| సీ. | బలితంపు క్రొవ్వాఁడి ములుకులు సింగాణి గూరిచి యరి సెవికొనకు లాగి పొలదిండి ఱేని మావులు దేరుఁ గైదువు లరదంబు సాగింపు నతఁడు సిడము గత్తలంబును మ్రగ్గగా నేసి వెండియుఁ బిడుగుల కెనయైన వెడఁద తూపుఁ గొని ఱొమ్ము పగిలించి కొంకఁజేసి కడంక నర చందమామ వాలమ్ము వఱపి | |
| తే. | బొమిడికంబులు పదియును బుడమిఁ గూల్చి బన్న మొందింప బెగడి యప్పాలసుండు వేఱొకని తేరిపైఁ బడి పాఱి తనదు దీవి సొచ్చెను రాకాసి తెగలు నొగల | 222 |
| తే. | అంత రాముఁడు తన మొనయందు సొమ్మ సిలిన జోదుల మందులవలన మనుపు కొని చెలఁగుచుండె వేల్పుల గొంగ యటులఁ బాఱి చని దీవిఁ గొలువుండి పంతమెలయ | 223 |
| క. | మానిసి దిండులఁ గనుగొని పూనికతోఁ గడవ చెవుల పోటరి నిపుడే వే నిదుర దెలిపి పోరికి లేనెత్తుఁ డటంచు నర్మిలిం బనుచుటయున్ | 224 |
| క. | అఱిముఱి వారలు సని మే నెఱుఁగక నిదురల నూర్పుటీదలు గొఱలం గుఱువెట్టుచుఁ గొండవలెన్ వెఱఁగొప్పఁగ నున్న కుండవీనుల జోదున్ | 225 |
| క. | కనుఁగొని పలు దెఱఁగుల డా కొని లేపఁగ నతఁడు గుదురుకొని పెన్మల లా గునఁ దరలక యుండిన బో రన బూరలు బేరులును గరంబు చెలంగన్ | 226 |
| తే. | గొల్లుగాఁ గూఁకలిడుచు గగ్గోలు సేసి లేవకుండిన విసికి యా లెంక లినుప ద్రుడ్ల గుదియలఁ బిడికిళ్ళ రోకళులను మొత్త బలితంపుఁ జెట్టు పైనెత్తి మఱియు | 227 |
| క. | కఱచియుఁ జఱచియుఁ గారుల నిఱికియు గుఱ్ఱములు నాముటేనుంగులఁ బైఁ బఱపియుఁ దాఁచియు మీసలు వెఱకియు నూనియలఁ గాఁచి బిట్టు చిలికియున్ | 228 |
| ఆ. | మేలుకొలుపుచున్న మెల్లనే యించుక పొరలి చిన్న నల్లి పొడిచెనంచు లేచి కూరుచుండి లెంకలఁ జూచి మీ రేమి వచ్చినార లిచటి కనుడు | 229 |
| క. | వారందఱు దరిఁజేరి జో హారులు గావించి ఱేని యానతి యెల్లం బేరిమిని దెలిపి సంతస మారఁగ నమ్మేటి మగని కాఁకలి దీరన్ | 230 |
| తే. | మేర మీఱిన గొఱియల మేఁకగముల గొఱియ పోతుల నఱికి ప్రోగులుగ నిడ్డ వెగ్గలపుఁ బచ్చి నంజుళ్ళ వెఱ్ఱినీళ్ళు దోరహత్తుగ నిడఁ గడుపార మెసఁగి | 231 |
| ఆ. | అపుడె తరలి యాతఁ డన్న కడకు వచ్చి మ్రొక్కులిడినఁ జూచి పెక్కు చంద ములఁ బొసంగ నాడి పొలదిండి రాయఁ డ ప్పోటుగానిఁ గయ్యమునకుఁ బనిచె | 232 |
| చ. | పనిచిన జంగసాఁచి యొక పారియె కోటలు దాఁటి యేడ్తెఱం జనుటయు వానిఁ జూచి పెను సత్తియొ మిత్తియొ వచ్చెనంచు మ్రా న్మనికి వజీరు లెల్ల నిడుమ ల్బెరయ న్వడిఁ బాఱి బాగుగా విను రతనంపు వంగడపు వెన్నెలరాయని మఱ్వు సేరినన్ | 233 |
| తే. | ఓడకు డటంచు నయ్యెకిమీఁడు వారి మగుడఁ బోరికిఁ బురికొల్ప మగతనంబు మెఱయఁ గెంగేల విలుగొని వఱలుచుండె నప్పు డా రక్కసుఁడు నోల మాసగొనక | 234 |
| తే. | కొదమ బెబ్బులి వే లేఁటి కదుపు మీఁద దాడి వెడలు తెఱంగునఁ దఱుల మోర మెకపు బంటులపైఁ బేర్మిమీఱ మొనల వాలు ద్రిప్పుచు నడరిన వాండ్రు బెగడి | 235 |
| క. | బలుగాలిఁ దూలు మబ్బు తె గల చాడ్పునఁ బఱచుచున్నఁ గనుగొని యోహో! నిలుఁడు నిలుం డనుచు న్వే ల్పుల దొర మనుమండు మరలఁ బురికొల్పుటయున్ | 236 |
| మ. | అనికిం గోల్తలఁ జేయ వార్నడచుచో నక్కుంభకర్ణుండు డా కొని కై ముమ్మొన కైదువ న్మెదడులన్ గ్రొవ్వుం గళాసంబుల న్బునుకల్ నంజుడుఁ బ్రేవు లెమ్ములు నరంబు ల్గుండెలున్ బ్రోవులై తనర న్నెత్తురు లేఱులై పఱవ మ్రందంజేసి పెల్లార్చుచున్ | 237 |
| తే. | ఒక్క వ్రేటున నూర్లు వే లోలిఁ గూల వ్రేయుచును గాళ్ళఁ జమరుచు వాయిఁ దెఱచి మ్రింగుచును గౌఁగిటను బిగియంగ నొత్తి నలియఁ జేయుచునున్న బిట్టలుక తోడ | 238 |
| క. | చలినట్టు పట్టి బలు గు బ్బలి యొక్కటిఁ దెచ్చి వానిపై వ్రేయుడు న త్తులువ మొనవాలుచే న బ్బలియుని యెద పొడిచి సొమ్మపాలుగఁ జేసెన్ | 239 |
| సీ. | అది చూచి నీలుండు గొదుకక యొక పెద్ద మల వానిపై వ్రేయ నలిగి నూఱు తునియలై పడ దాని దూకొని పిడికిట నాతండు వొడిచిన నపుడె మఱి వృ షభుఁడు గవాక్షుండు శరభుండు నలుఁడును గంధమాదనుఁడును గడఁగి గొప్ప పడుకులు మ్రాకులు నెడపక వైచి నొ ప్పించినఁ దలఁక కబ్బిరుదుమగఁడు | |
| తే. | వారి నేవురి సొమ్మవోవంగఁ బొడిచి చూడ్కి కగపడ్డ కోఁతుల జుణుఁగనీక మ్రింగఁ జాగినఁ దద్దయు మిడికి పవలు సేయు వేలుపుఁ బట్టి యచ్చెనఁటిఁ బొదవి | 240 |
| క. | గుబ్బలి కొమ్మొక్కటి గడు నిబ్బరముగఁ బెఱికి యాతని న్వైచిన వాఁ డుబ్బు సెడక మలద్రిమ్మరి బెబ్బులిపయి మొనలవాలు పేర్మిన్ వైచెన్ | 241 |
| తే. | వైవ గాడుపుకుఱ్ఱఁ డవ్వాలు నడుమఁ బట్టుకొని కిన్క మ్రోఁకాలఁ బట్టి విఱిచె నందులకుఁ జాల రక్కసుఁ డలిగి తమ్మి నంటు కొమరుని సొమ్మగొనంగ నడఁచె | 242 |
| ఆ. | అడిచి యతని మూఁపునందిడుకొని దీవి కరుగుచున్న మంచి యఱ్తి కొమ్మ మెకపు మిన్న దెలిసి మెల్లన వాని వీ నులును ముక్కుఁ గొఱికి యెలమి నరిగె | 243 |
| క. | అరిగినఁ గనుగొని రక్కసుఁ డరుదందుచు మేను రోసి యప్పుడె యనికిన్ మరలి యొక యినుప ద్రుడ్డునఁ బరిగొని యక్కోన తెంకి బంట్లఁ జదుముచున్ | 244 |
| సీ. | కడకమై వే నారికెడపు బొండ్లములట్లు బెట్టిదంబుగఁ దల ల్పీలుకొనుచుఁ దులకించు నించుకోలల తెఱంగున సంత సము మీఱఁ జేతులు నమలుకొనుచుఁ దియ్యని క్రొవ్విరి తేనియ చాడ్పున గొదగొని నెత్తురుల్ గ్రోలుకొనుచు బలితంపు జున్ను బిళ్ళల చందమునఁ గ్రొవ్వు మెదడును నోరూర మ్రింగుకొనుచు | |
| తే. | మొనసి తనవారుఁ బెఱవారునని తలఁపక యబ్బురంబుగఁ దన కగ్గమైన వారి నేచి కుత్తుక బొరియలో వైచికొనుచు మాఱెచట లేని కడిమిఁ ద్రిమ్మరుచునుండె | 245 |
| తే. | అపుడు రాముఁడు వానిపై నడరి వింటి నారి మొఱయించి కఱకు వాల్నారసములు పెక్కు వఱపినఁ దలక కబ్బిరుదు గేల ద్రుడ్డు త్రిప్పుచు రాచ చందురునిఁ దొడరె | 246 |
| చ. | తొడరిన వెండియుం గినుకతో నెకిమీఁడు మెఱుంగు టమ్ముల గ్గడుసరి సోకు మిన్న మెయిగాఁడఁగ నేసిన నొచ్చియుం జలం బడరఁగ నాతఁడెత్తుకొని యార్చుచు రాఁ గని గాడ్పు తూపు నె వ్వడిఁ బఱగించి చేయిఁ దెగవైచెఁ గడిందిగ రాముఁ డత్తఱిన్ | 247 |
| సీ. | తెగవ్రేయ వాఁ డెదఁ బొగిలి రెండవ చేత నొక మ్రాను గొనివచ్చుచున్నఁ జూచి రాచూలి వేలుపు రా చిల్కు నిగిడించి యా చెయ్యి తెగవైచి యపుడె సాము నెల ముల్కి దోయి నిచ్చలముగాఁ బఱఁగించి కాళ్ళు రెండును ద్రుంచి కలువదాయ కూన తూపేసి బల్గుబ్బలి చివరతో దినుసైన యప్పొలదిండి మేలు | |
| తే. | బంతి యౌదల పుడమిపైఁ బడఁగ నేసె నేయుటయు రక్కసులు గొందరేఁగి వరుస కుత్తుకల రేయి ద్రిమ్మరి కత్తెఱంగు గదిసి వినిపింప గుండియల్ సెదరి యతఁడు | 248 |
| తే. | పలు తెఱంగుల సైదోడు బంటుతనము లెన్నుకొని నేలఁబొరలుచు నేడ్చి యేడ్చి సొమ్మసిలి కొంతవడికి దిటమ్ము మెఱయఁ దెలిసి కూర్చుండి తద్దయుఁ జల మెలర్ప | 249 |
| సీ. | దేవాంతకుండును ద్రిశిరుండు నతికాయుఁ డును నరాంతకుఁడు నాఁ దనరు కూర్మి పట్లకుఁ దగ మహాపార్శ్వు మహోదరుఁ దోడిడి యనికిఁ బోఁ ద్రోలుటయును వార లాఱుగురును మేర మీఱిన మూఁక తోఁ జని కోఁతులఁ దొడరు నెడల నిరు దెఱంగుల దండు బెరసి యుక్కున వ్రేటు లాడుచోఁ జెలరేఁగి యడవి ద్రిమ్మ | |
| తే. | రులు గడిందిగ రేద్రిమ్మరులను జుట్టి ముట్టి పలు చందములఁ బడఁగొట్టి దక్కి నంపు రాయని వీడున కంపి వైవఁ జూచి యమ్మేటి రాకాసి జోదు లలిగి | 250 |
| తే. | కైదువుల ద్రుడ్లఁ దూపుల కడఁగి నఱికి మోఁది గ్రుచ్చియుఁ బలుచందములఁ గలంగఁ జేసి మూఁకలఁ జీకాకు సేయుచున్నఁ గాంచి యత్తఱి నెనలేని కడిమితోడ | 251 |
| సీ. | తెమ్మెర కుఱ్ఱఁడు త్రిశిరు దేవాంతకు నతికాయునిని దార యనుఁగు కొమరుఁ డును మహోదరు నీలుఁడును వృషభుఁడు మహా పార్శ్వుని దొడరి గుబ్బలులుఁ జెట్లుఁ బడుకులుఁ దఱచుగాఁ బై వ్రేయ వాండ్రవి తప్పించుకొని బంటుతనము వెలయ ద్రుడ్ల నీఁటియలఁ గైదువులఁ దూపుల సురి యల జముదాడుల నక్కడింది | |
| తే. | చెట్టు ద్రిమ్మరి జోదుల బిట్టు నొప్పి వెట్టుటయు వార లా సోఁకు జెట్టి మగల దిట్టలై పట్టుకొని పడగొట్టి జముని పట్టునకుఁ బంపి రిరువాగు పజలు వొగడ | 252 |
| తే. | అప్పు డతికాయుఁ డలుకతోఁ దిప్ప ద్రిమ్మ రులఁ బటాపంచలుగఁ దోలి బలిమి మీఱ బంతి తేరుల యెకిమీని పట్టిఁ దఱియ నరద మొగిఁ జొన్పి యతని కిట్లనుచుఁ బలికె | 253 |
| ఆ. | రాచబిరుద! వేల్పురాయనికైన నన్ గదిసి పోర నలవిగాక యుండుఁ గోఁతి మూఁకఁ గూర్చుకొని వచ్చి నీ బోఁటి సన్నగాఁడు లెదురఁ జాలుటెట్లు? | 254 |
| సీ. | చివికిన ప్రాఁత విల్సీల్చుటయును బొల దిండి క్రొన్ననబోఁడిఁ జెండుటయును లేడి నేయుటయుఁ జెల్మి యొనర్పఁ జేరిన చెవి ముక్కు సెవులును జిదుముటయును, ఱాతికి నుసురులు రావించుటయు డాఁగి కోఁతి నొక్కమ్మునఁ గూల్చుటయును ముదిమిచే లావెల్లఁ గొదపడ్డ ఖరుని ద్రుం పుటయు నీళ్ళకు నడ్డువోయుటయును | |
| తే. | మగతనంబులుగాఁగ నీమదిఁ దలంచు కొని కరంబును చిక్కు మిక్కుటపు సూడు దెచ్చుకొంటివిగద! చెడు తెఱఁగు పూని యకట! నీ కింక నెందుఁ బోనగుఁ జెనంటి! | 255 |
| తే. | బలిమి భరతుఁడు మును ప్రోలు వెడలఁ ద్రోయ నడవులకుఁ జేరి యాలిఁ గోల్పడితి విందుఁ గాయ గసరులు దిని బ్రదుకక గయాళి పొలసుదిండులతోఁ బగఁ బూనఁ జనునె? | 256 |
| ఆ. | నలువకైనఁ గన్గొనఁగ రాక టక్కరి వగుచు జోగి తెగలయందె డాఁగి కొలము గొనము రూపు గలుగకయుండు నీ కిట్టి రాచచిన్నె లేల యిపుడు? | 257 |
| క. | మా తండ్రి కతన మానిసి వైతివిగా కూరుఁ బేరు నంతకుమును నీ కేతఱిఁ గలదు జగంబున? నీ తెఱఁ గెవ్వం డెఱుంగు? నిక్కము సెపుమా! | 258 |
| క. | నీ వారమనుచు నమ్మిక తో వాలెము గొలుచువారి దొసఁగుల పాలం బోవిడిచి నిరాబారులఁ గావించు చెనంటి వీవెకద పరికింపన్ | 259 |
| సీ. | కడలి సొచ్చినఁ గొండ యడుగున డాఁగిన నేలలోఁ దూఱిన నెఱియుఁ గడచి వేసమూనినఁ డక్కు వెలయఁ జే సాపినఁ బుడమి యెల్లను డిగ్గ విడిచి చనిన నడవులఁ జేరిన విడువక నాఁగలిఁ బట్టిన మ్రాని లోపల నిఱికినఁ దట్టువ నెక్కినఁ దద్దయు వీఁగిన మఱియుఁ బల్రూపుల వఱలుచున్నఁ | |
| తే. | దలఁపు నీయందె నిలిపి నిచ్చలును వెదకు చుందుఁగాక జుణింగి నిన్నెందునైనఁ బోవనిత్తునె? వినుము నా పొంతనింక సాగనేరవు సుమ్ము నీ యాగడములు | 260 |
| తే. | అనిన రాముఁడు వానిపై నలిగి యోరి! పాలసుఁడ! కాన కూరక బవరమునకుఁ దొడరుదువుగాక కడు రిత్త నుడువులేల? యనుచు విల్గొన లక్ష్మణుం డడ్డు దగిలి | 261 |
| క. | ఆ సోఁకు జోదుఁ బైకొని రోసంబున వింటినారి మ్రోయించి కడున్ వాసి లకోరులు బడిబడి నేసి కలంచుటయు వాఁడు హెచ్చగు కినుకన్ | 262 |
| తే. | పెక్కు నెఱ తూపులా రాచబిరుదు మీఁద వ్రేయ నతఁడవి యర తొగవిందు ములికి గములఁ దునుమాడి వైచిన గనలి రక్క సుండు వెండియుఁ గఱుకు తూపొండు సిమ్మె | 263 |
| సీ. | చిమ్మిన నక్కోల యిమ్ములఁ జని పెను ఱొమ్ము గాడుటయు రా తమ్మిదాయ తమ్ముఁ డొకించుక సొమ్మవోయి కరంబు నుమ్మలించుచు లేచి యమ్మెఱుంగు టమ్ము గ్రొన్నెత్తురు ల్నెమ్మెయిఁ బొరిఁబొరిఁ గ్రమ్మగఁ బెఱికి బీరమ్ము మెఱయఁ దెమ్మెర చెలి చిల్కు నెమ్మది నా రేయి ద్రిమ్మరి బొబ్బ మెకమ్ముపైఁ ది | |
| తే. | రమ్ముగా నేయ వాఁడు గన్బొమ్మలదరి ముమ్మరపు టల్కతోఁ జిల్వ సొమ్ము ములికి గ్రమ్మఱ నిగుడ్ప నత్తూపు లెమ్మె నాక సమ్మునందంటి పెనఁగె జగమ్ము బెగడ | 264 |
| తే. | అత్తెఱంగునఁ బెనఁగి యా యమ్ముదోయి బూదియై రాలుటయు సోఁకు జోదు గుదియ తాల్పు తూపేసె నేసిన దాని నపుడె రా కొమరుఁ డీఁద తూపేసి క్రమ్మఱించె | 265 |
| క. | మఱియుఁ జలంబున నిరువురు గుఱియొప్పగఁ బెక్కు వాలుగోలలు బైపై బఱపుచు నేడ్తెరఁ బోరెడు తఱి నెదలోఁ గినిసి రాము తమ్ముఁడు గడిమిన్ | 266 |
| సీ. | నలువ తూపరివోసి బలిమిమై నద్దోస కారి రక్కసు మేలిగాని మీఁద నేసిన నది మంట లెగయుచు మిడుఁగురుల్ సెదర నొక్కుమ్మడిఁ గదియవచ్చు చున్నఁ గన్గొని వాఁడు గ్రన్ననం దూలంగ ద్రుడ్డుల బటువు కైదువుల నడిద ముల మరల్చినఁ బోక మొనసి నాడెంపు బొ మిడికముతోఁ గూడఁ బుడమిఁ బడఁగ | |
| తే. | వాని తలఁ ద్రుంచెఁ ద్రుంచినఁ గోన మనికి బిరుదు లందఱు బొబ్బలు పెట్టుకొనుచుఁ జెలఁగి యాడిరి మింట జేజేలు రాచ పట్టిఁ దద్దయు నగ్గించి పల్కి రంత | 267 |
| తే. | కలనఁ బొలియక చిక్కిన పొలసుదిండి బంట్లు గొందఱు నెవ్వడిఁ బఱచి దీవి ఱేని కత్తెఱఁ గెఱిఁగింప మానరాని వ్రంతఁ గొడుకులఁ దలఁచి లో వగచుచుండె | 268 |
| ఆ. | అప్పు డింద్రజితుఁడు నబ్బ డెందములోన వగపు మాంచి యగ్గివలన బమ్మ తూపుఁ గాంచి సరగ దురమున కరుదెంచి చదలనంటి కోఁతి పదుపుఁ గూల్చి | 269 |
| క. | బలు ములుకు లేసి కాళ్ళుం దలలుం జేతులును దొడలు నడుములుఁ బెను తి ట్టలుగాఁ దున్ముచుఁ బలువురఁ బొలియించి కడింది లావు వొడమఁగ మఱియున్ | 270 |
| సీ. | క్రొవ్వాడి చికిలి ముల్కులు వింటఁ దొడిగి జ్యో తిర్ముఖు నారింట ద్వివిదు మూఁట నెలుఁగులదొరఁ బదియేనింట నలుని నీ రైదింట వేల్పురాయని మనుమనిఁ బ్రొద్దుచూలిని వృషభుని నీలు గజు ముప్ప దేసింటఁ బనసుని నెనిమిదింట మైందు నేడిట గంధమాదను రెండు తొ మ్మిదులఁ దక్కిన కొమ్మ మెకపు బంట్ల | |
| తే. | నెల్ల నొండొంట నేలపైఁ ద్రెళ్ళనేసి నలువ తూపున రాచ జాబిలులఁ దద్దఁ సొమ్మఁగొనఁ జేసి బిట్టార్చి నెమ్మితోడ లంక కరుదెంచి తండ్రి కెలమి యొనర్చె 2 | 71 |
| తే. | అప్పు డెలుఁగులరాయని యానతిఁ గొని గాడ్పు కొమరుండు మందుల గట్టు తెచ్చి కోఁతి మూకల మనిపె రాకొదమ సింగ ములును వేజాముగా సొమ్మ దెలిసిరంత | 272 |
| క. | చెయువులసాకిరి కుఱ్ఱఁడు సెయిదోయి మొగిడ్చి రాచసింగముతోడన్ దయివారు వేడ్క నిట్టుల నియె మలద్రిమ్మరి కొలంపు నెల లలరారన్ | 273 |
| చ. | ఒడయడ! నాదు విన్నపము లొప్పుగ నిప్పు డెదం దలంపుమీ! తడయక కుంభకర్ణుఁడు మొదల్గల నాడెపు జోదులందఱున్ మడియుటఁ జేసి రావణుఁడు మార్కొని యింక దురంబొనర్పఁగా వెడలఁడు లంకఁ గాల్చుటకు వే ననుపందగుఁ గోఁతి మూఁకలన్ | 274 |
| ఆ. | అనిన నట్ల సేయుమని రాముఁ డానతి యిడిన వేఁడి వేల్పు కొడుకు ప్రొద్దు క్రుంకనిచ్చి యెల్ల కొమ్మ మెకంబులఁ గడిఁది మీఱ లంకఁ గాల్పఁ బనిచె | 275 |
| ఉ. | అంచిన వార లొక్క మొగి నార్పుల నెల్ల కడ ల్వడంకఁగాఁ గొంచక చేతులం గొఱవి కోలలు పట్టుక యేఁగి వే పటా పంచలుగాఁగఁ బెన్గవని పట్టులఁ గావలియున్న వాండ్రఁ బో డంచి కలంచి ప్రో లటు గడంకఁ దలిర్పఁగఁ జొచ్చి వేడిమిన్ | 276 |
| క. | అగపడ్డ రేయి ద్రిమ్మరి తెగలం బోనీక పట్టి తెగటార్చుచు ము జ్జగములకుం దిగులొదవఁగ నొగి నెక్కుడు మెకపు గొంగ యులివు లొసగుచున్ | 277 |
| తే. | వాడవాడలఁ గ్రమ్ముక మేడలందు మోసలలయందు నుగ్రాణములను మిద్దె టిండ్లఁ జవికలయం దెల్ల నింగలంపు కొఱవు లడరించి వెస రవుల్ కొల్పుటయును | 278 |
| క. | పొగయును మంటలు సదలున కెగయఁగ మిడుఁగురులు సెదర నేడ్తెర నపుడా దుగ మొగముల వే ల్పాగు బ్బుగ దరికొని కాల్పఁ దొడఁగెఁ బ్రోలెల్లెడలన్ | 279 |
| సీ. | కొలుచులు మానికంబులు మంచిగందము ల్కోకలుఁ జమురులుఁ గుందనంబు వెండియుఁ గైదువు పిండులు పల్లకీ లందలంబులు పైఁడి చందువాలు గద్దియ లుయ్యెల ల్మిద్దియ ల్మేడలు చప్పరంబులు మొగసాల లిండ్లు తలుపులు గవని కట్టులు తెలె ల్చెంబులు పక్కెర ల్తొడవులు నక్కునెలవు | |
| తే. | లేనుఁగుల పట్లు మొదలగు నెల్లవియును మొగిసి సతనాలుకలు సాఁచి రగులఁ గొనుచు దంటమోముల దేవర దనివి దీఱ బుగులుకొని మెక్కెఁ దద్ద యబ్బురముగాఁగ | 280 |
| సీ. | అప్పుడు గడలేని యలజడిబడి తలల్ విడియాడ వడిఁ బర్వులిడెడువారుఁ గూనల ముదుసళ్ళఁ గానక నెమకుచు నగ్గి కగ్గంబయి మ్రగ్గువార లిఁక నేమి సేయుద మెక్కడ కేఁగుద మని చాల వగపుతో నడలువారు ముంగిళ్ళ సందుల మూలలఁ గొందుల నెడలేక మంటల నెనయువారు | |
| తే. | పొగలు సెగలును దమ్ము వే పొదవికొనిన దట్టమగు చిచ్చు లోపలఁ దెట్టువలుగఁ ద్రెళ్ళువారును రావణుఁ దిట్టువారు నగుచు రక్కసు లిడుముల నడలి రొకట | 281 |
| ఆ. | అట్లు ప్రోలు గాల్చి యడవి ద్రిమ్మరు లెల్లఁ గోట గవఁకులందుఁ గూడి సోఁకు మగని నెచటఁ గన్న మడియించుచున్నచో జంట పది బుజముల బంటు గినిసి | 282 |
| తే. | కుంభకర్ణుని కొడుకులఁ గుంభుఁడును ని కుంభుఁడను వాండ్ర బిలిచి యా కోఁతి పదువుఁ దునిమిరండని పనుప నత్తులువ తొంటి వేల్పుఁ గొమరులు మగఁటిమి విప్పు మీఱ | 283 |
| క. | మీసలు దువ్వుచు నుడుగని రోసంబునఁ దేరు లెక్కి ప్రోడలయిన రా కాసి వజీరుల కొందఱ బాసటగొని నల్దెఱఁగుల పౌజులు గొలువన్ | 284 |
| క. | ఓలిమెయిఁ దెల్లడాలు మె కా లిఱ్ఱులమీఁద నడరు కైవడి నపుడే యాలమునకుఁ జనుటయుఁ దొలి వేలుపు లా కోఁతి గముల వెసఁ గని కినుకన్ | 285 |
| ఆ. | ఓరి కోఁతికూళలార! కాఱడవులఁ దూఱి కాయ గసరు లేఱుక తిని బ్రదుకలేక రాచగుదియతోఁ బొత్తూని పొలసుదిండ్ల నెదిరిపోరఁ దగునె? | 286 |
| ఆ. | ఆలి నప్పగించి యంతటఁ బోక మి మ్మప్పగింపఁ దెచ్చె నఱ దలంచి రాచవాని నమ్మరాదనుమాట మీ రెఱుఁగరైతి రింక నేమి గలదు? | 287 |
| సీ. | చివచివ నెగబ్రాఁక చిఱుత మ్రాఁకులు గావు పొగరు టేనుఁగుగున్న తెగలుగాని కూడి యాడుకొనంగ లేడి కూనలు గావు వడిగల మేటి తత్తడులుగాని చెలఁగి గంతులిడంగఁ బొలము గట్టులు గావు తలరు పుత్తడి యరదములుగాని యుఱికి దాఁటులు గొన నూటవాగులు గావు కఱకు నంజుడు దిండిగములుగాని | |
| తే. | పొదలి యాలింపఁ బులుఁగు నున్రొదలు గావు కడిఁది సింగాణి బెడఁగు చప్పుడులుగాని కోఁతు లెచ్చట? జగడంపుఁ జేఁత లెచటఁ? బగ్గె లటు వెట్టి తిన్నంగఁ బాఱి చనుఁడు | 288 |
| సీ. | అని పల్కి కేవున నార్చి యొక్కుమ్మడిఁ గదలి యొండొరు మీరి పొదఁడు పొదఁడు బలిమిమైఁ బొదువుఁడు పట్టుఁడు కొట్టుఁ డం చేడ్తెఱఁ దొడరి య య్యెఱచిదిండ్లు సబిడీల సంకుల జముదాళ్ళతోఁ జేవ ద్రుడ్డుల బటువు కైదువుల నడిద ముల బల్లెముల నీఁటియల సెల గత్తుల గుదియలఁ దూపుల గొడ్డళులను | |
| తే. | జెండు బెండాడి కండలు గుండియలును గ్రొవ్వు నెత్తురు మెదడు ప్రేగులు నరమ్ము లెమ్ములును నేలఁ బొరలంగఁ గొమ్మ మెకపు పిండు నొంచిరి జేజేలు బెగడి పఱవ | 289 |
| ఉ. | అప్పుడు తిప్ప ద్రిమ్మరి గయాళులు సెట్టులు గట్లుఁ జట్టులున్ గుప్పలుగాఁగ రువ్వియును గ్రుద్దియుఁ దాఁచియు గోళ్ళ వ్రచ్చియున్ డెప్పరమైన యిక్కలఁ గడిందిగ రక్కసి బంట్ల నొక్కనిన్ దప్పి చనంగనీక గుదెతాలుపు ప్రోలికిఁ ద్రోలి రోలిగన్ | 290 |
| క. | మఱియుఁ బ్రజంఘునిఁ గ్రోధను నుఱుమాడె న్వాలి కొడుకు నూల్కొని కడిమిన్ వెఱ వొప్ప శోణితాక్షునిఁ బఱిమార్చెన్ ద్వివిదుఁ డెల్ల పౌజులు వొగడన్ | 291 |
| ఆ. | అట్టు లడరుచున్న చెట్టు ద్రిమ్మరులపైఁ గినిసి కుంభుఁ డనికి మొనసి పెద్ద కొండవంటి వింట గొనయ మెక్కించి న ల్గడలు నద్రువ బొబ్బయిడి కడంగి | 292 |
| క. | గాలి కవణంపు మేపుడు చాలుపులం బోలి తరకసంబున నొఱపూ న్మేలి యపరంజి పింజల వాలారుం దూపులుఱక వామిగ నేసెన్ | 293 |
| క. | ఏయుటయుఁ గనుఁగొని ద్వివిదుఁడు పాయని రోసమున నొక్క పడు కావేల్పుం దాయ పయిం బడవైచుట కై యెత్తిన వాఁడు దోనె యది తునుమాడెన్ | 294 |
| క. | తునుమాడి యొక్క నెఱ తూ పున నాతని బోరయుచ్చిపో నేసినఁ గ్ర న్నన నేల నొఱఁగె నటు లొర గిన తోఁబుట్టువును జూచి కినుక తలిర్పన్ | 295 |
| తే. | మైందుఁ డురువడి నొక పెద్దమ్రాఁకు వెఱికి పొలసు మేపరి నేయ నప్పోటుకాఁడు నెయ్యి సోఁకిన గాడుపు నెయ్యునట్లు మండి యొక కోల నాతనిఁ బండఁ బెట్టె | 296 |
| క. | మామల పాటు గనుంగొని తా మదిలోఁ గుంది గట్ల దాయ కొమరుఁ డెం తో మగఁటిమి నెదురుడు వాఁ డామెసఁగం బలు ములుకుల నాతని నొంచెన్ | 297 |
| తే. | అంతఁ గొందఱు కోఁతి బంట్లత్తెఱంగు రాము కడకేఁగి తెలుప నా రాచమిన్న మోర తెల్పు మెకఁపు ఱేఁడు మొదలు గల్గు బల్లిదుల నేర్చి పోరికిఁ బనుపుటయును | 298 |
| క. | మ్రాఁకులుఁ బడుకులుఁ గైకొని వీఁకం జని వారు మిగుల వెఱఁగొప్పఁ గడుం గూఁక లొసంగుచు నతనిన్ దాఁకిన నబ్బిరుదు మగఁడు దరలని కడిమిన్ | 299 |
| తే. | వారి నందఱ బెడిదంపు వాఁడి నార సముల నోనేసి తఱిమిన జగముకన్ను కొమరుఁ డా కుంభకర్ణుని కొడుకుఁ దొడరి మలలుఁ జెట్టులుఁ బడుకులుఁ జెలఁగి వైచె | 300 |
| తే. | వైచుటయు వాఁడు నడుమన వాని నెల్లఁ దునిమి వేండ్రంపు మొన వాఁడి తూపుగములు కోఁతి రాయనిపైఁ బెల్లు గురియ నతఁడు వాని సింగాణి ముఱియలుగా నొనర్ప | 301 |
| సీ. | అందుల కలిగి వాఁ డరదంబు డిగి వడిఁ బఱతెంచి సుగ్రీవుఁ బట్టుకొనిన నిరువురు నపు డాము టేనుఁగు గున్నల పోలికఁ దార్కొని పొంపుగదుర నడుగుల తాఁకునఁ బుడమి గ్రక్కదల నా ర్పులఁ దమ్మికానుపు గ్రుడ్లు వగుల గడితంపు దుమ్మునఁ గడలిపట్టు గలఁగ నూర్పుల మొగులుజా లొదిగి పఱవఁ | |
| తే. | బలు తెఱంగులఁ బోరుచోఁ గలువదాయ పట్టి యా రక్కసునిఁ జిక్కపట్టి ఱొమ్ము మట్టి పిడికిటఁ బొడిచిన నిట్టు నట్టుఁ గదల నేరక యుసురులు వదలి చనియె | 302 |
| క. | అంత నికుంభుం డెంతయుఁ బంతంబున నినుపకట్ల బల్‌గుదియ కడున్ వింతగఁ ద్రిప్పుకొనుచు హను మంతు నెదిరి యతని బోర మసలక మోఁదెన్ | 303 |
| ఆ. | మోఁదుటయును గాడ్పు గాదిలి కుఱ్ఱని యక్కుసోఁకి గుదియ ముక్కలయ్యె నపుడు సోఁకుబంటు నలమి పట్టుక నల్లఁ గ్రక్కఁ బొడిచె నడరి యుక్కు జోదు | 304 |
| చ. | పొడిచిన మొగ్గి యప్పొలసుబోనపు మేటిమగండు బీర మే ర్పడ వడి లేచి కోఁతిదొర పట్టుక బిట్టు గలంప నాతఁడ గ్గడుసరి రక్కసుం బొదివి కాలును గేలుఁ గదల్పనీక బ ల్విడిఁ బడఁద్రోచి త్రొక్కి సరవిన్ దలఁద్రుంచెఁ జలంబెలర్పగన్ | 305 |
| క. | అయ్యెడఁ గొందఱు రక్కసు లొయ్యనఁ బఱతెంచి సోఁకుటొడయని గని య క్కయ్యంపుఁ దెఱఁగుఁ జెప్పిన నయ్యెకిమీఁ డుఱక యడలి యాఱని కినుకన్ | 306 |
| తే. | ఖరుని కొడుకైన మకరాక్షుఁ గదియఁ బిలిచి నీవు నీ మూఁకతోఁ గూడి ఠీవినేఁగి నేడు రాచూలులను గోన నెలవు బంట్లఁ జెనసి వైళంబ రూపఱఁ జేసి రమ్ము | 307 |
| క. | అని పనిచిన మూఁకలతోఁ బనివిని యజ్జోదు కోఁతి పౌజులపై డా కొని కినుక నిగుడఁ దూపుల బెను జడి యొనరింప వారుఁ బెంపలరారన్ | 308 |
| తే. | కొలఁది మీఱిన మ్రాఁకులు మలలు రాలుఁ బూని యడఁచిన రక్కస పోటరులును గైదువులు విండ్లుఁ గైకొని కదిసి రట్టు లిరుతెఱంగుల మూఁకలు నెలమి బెరసి | 309 |
| క. | మేనులు నలినలి గాఁగం బీనుఁగు పెంటలుగఁ గడిమిఁ బెనఁగెడునెడ న క్కోన బిడారపు బంటులు మానక రాకాసి తెగల మడియించుటయున్ | 310 |
| సీ. | కన్నుల నిప్పుకల్ గ్రమ్ముచు మువ్వన్నె మెకమిఱ్లఁ గదియు పోలికల మొసలి కన్నుల రాకాసి మిన్న కోన మెకంపు గుంపులఁ దార్కొని యంపవానఁ గురిసి యీఁటెల గ్రుచ్చి గుదియల మోఁది య డిదముల గొడ్డండ్లఁ జదియ నఱికి సురియలఁ బొడిచి నజ్జుగ నొడళ్ళెల్లను జెండాడి చీకాకుచేసి కలఁచి | |
| తే. | బారిసమరిన నిలువక పాఱి వార లివము మేపరి కొలము జక్కవలసూడు మరువు సేరిరి సేరిన నుఱక మొఱకు రక్కసుఁడు దోనె యరిగి సీరాముఁ దొడరి | 311 |
| క. | నెఱజోదు వనుచు నినుఁ బ ల్మఱు బిరుదులు సెప్పుకొండ్రు మఱి నేఁడెందున్ బఱవక నిల్చి దురంబున గుఱుతుగ నీ లావు సూపుకొను మెకిమీఁడా! | 312 |
| క. | కుఱకుఱ దొలివేల్పులఁ గొం దఱఁ గూలిచి నిక్కెదేమొ తాటోట? నినుం బిఱుతీక పట్టుకొని రూ పఱఁ జేసెదఁ దండ్రి నాఁటి పగదీఱంగన్ | 313 |
| సీ. | టక్కరివై పొంచి నిక్కుచు నొకకోలఁ గూలవ్రేయఁగ నల్ల వాలిగాఁడు మగఁటిమి సూపి నెమ్మది గెల్పు చేకొన వేఱిఁడి ముది నేలవేల్పుగాఁడు దప్పునఁ బొడచూపి తటుకునఁ బుడమిపైఁ ద్రెళ్ళింప రాకాసి తెఱవఁగాఁడు వెఱపొకింతయు లేక తఱిమి పీఁచ మడంపఁ బోటెఱుంగని జింకపోతుగాఁడు | |
| తే. | ఖరుఁడుగాఁడు విరాధుండుగాఁడు వట్టి నోరుమాలిన యా కబంధుండుగాఁడు వీఁడు మకరాక్షుఁ డిపుడు నీ వాఁడి యెల్ల మలపి పొలుపఱఁ జేయు వాల్మగఁడు సుమ్ము | 314 |
| ఆ. | అనుచుఁ బెక్కు తూపు లడరించి వెండియుఁ గొలఁది మించు వాఁడి ములుకు లేయ రాగవుండు పులుఁగు రాయఁడు ముక్కున బాఁపగములఁ దునుము పగిదిఁ దునిమె | 315 |
| క. | తునిమిన నత్తొలివేలుపు మొనగాఁ డగ్గలపుఁ గిన్క ములుకుల పెను మం చొనరింప రాచ తామర యను గమ్ముం జేయిగముల నది విరియించెన్ | 316 |
| సీ. | విరియించి యొక దొడ్డ వెడఁద చిల్కున వాని సింగాణిఁ దునియలు చేసి యైదు తూపుల నరదంబు తోలువాని నడంచి యన్నియె ములుకుల నబ్బురముగఁ దేరును మావులఁ దెగటార్చి మఱియును నెఱిఁగీలు నోనేయ నేయి దొరయు నగ్గి చాడ్పున మండి యరదంబు డిగి వాఁడు మొక్కలంబుగ డాసి మొనలవాలు | |
| తే. | వైవ నది నేలతాల్పుఁ గల్వల యనుంగు మూఁడు నెఱ నారసముల వమ్ముగ నొనర్చె నంత రక్కసుఁ డెకిమీని నలమి పట్టి బిగి యెలర్పఁగఁ బిడికిట బిట్టు పొడిచె | 317 |
| క. | పొడిచినఁ దద్దయు గొఱకొఱ యడరఁగ రా చందమామ యగ్గి ములికి నె వ్వడిఁ బూని యేయఁ బుడమిన్ బడి యత్తొలివేల్పు మేలుబంతి యడంగెన్ | 318 |
| క. | కలన మకరాక్షుఁ డట్టుల నిలిగిన చందంబు సోఁకు టేలికతోడన్ బొలదిండులు గొందఱు సని తెలిపినఁ గడు నడలి యతఁడు దిటమున నంతన్ | 319 |
| తే. | వేల్పు రా గెల్పుకాని రావించి యిందుఁ బేరుగల జోదు లందఱుఁ బోరఁ గూలి రింక నీ వేఁగి దురమున నెల్ల కోఁతి దొరల రాచూలులను జంపి సరగ రమ్ము | 320 |
| క. | అని పలికి నెయ్యమున న క్కునఁ జేరిచి యనికి వీడుకొల్పిన నతఁ డా తనికిన్ మ్రొక్కియు మిహి కుం దనపుం దేరెక్కి యుక్కు దళుకొత్తంగన్ | 321 |
| సీ. | కేల్గల మెకముల గీపెట్టుటలును మా వుల సకిలింత లగ్గలపుఁ దేర్ల రొదలు కాలరుల యార్పులు వాయిదంబుల మ్రోఁతలు నొక్కటై ముజ్జగంబు బెగడింప నలుగుల బెడిదంపు మెఱుఁగులు విను ద్రిమ్మరుల చూడ్కి వెనుక కొత్త బలు దుమారము సంద్రముల నెల్ల నింకింపఁ బడగ గాడ్పులు మబ్బుఁ బాఱఁ దఱుమఁ | |
| తే. | దేజడర నేఁగి యొక చెంతఁ దేరు డిగ్గి పొలసు మేపరి గములు తన్బొదివి చుట్టు దట్టముగఁ గాచుకొనఁగ నెంతయుఁ గడంక నచటఁ దిగమూల లేర్పడ నరుగు సలిపి | 322 |
| సీ. | కడిఁదిగాఁ బెతరుల పుడమి నగ్గి రవుల్చి తొవరుఁ బుట్టములఁ గెంబువులఁ దాల్చి కుదురొప్పఁ బురియపైఁ గూర్చుండి మానిసి నెత్తురు నంజుడు నేయి నువ్వు లావాలు పాలు మేలగు తాఁడి పుడకలు నెలమి నాలవ తొలిపలుకు నుడువు లోలిమై గొడఁగుచు వ్రేలుచుటయు నందుఁ గల్లరి సత్తి యొకర్తు వొడమి | |
| తే. | పని గొలుపుమంచు నిలిచినఁ గని చెలంగి దానితోఁ గూడ రిక్కల దారి కేఁగి కారుమబ్బులు జడివాన గడఁగి కురియు పగిది నంపర కోఁతులపైనిఁ గురిసె | 323 |
| చ. | కురిసినఁ బ్రోవులై పుడమిఁ గూలెడువారు గొఱంత లేని పో టరితనమేది యీఱముల డాఁగెడువారు నొడళ్ళు వ్రస్సి నె త్తురుల మునుంగువా రసము దూలి పొరింబొరిఁ బాఱువారు వా విరిఁ బలవించువారునయి వేఁగిరి తద్దయుఁ గొండ ద్రిమ్మరుల్ | 324 |
| క. | మిడుతల గడితము తొలకరి పిడుగుల బెడిదంబు చిలువ పిండుల వడియున్ జడివాన పెల్లు నడరఁగఁ కడు బడలఁగఁ జేసెఁ గోఁతిగమి నత్తూపుల్ | 325 |
| తే. | అపుడు పనసుండు నీలుండు నంగదుండు గజుఁడు నలుఁడు గవాక్షుండు గాడ్పుకొడుకు గంధమాదనుఁ డెలుఁగుల గామిడియును మొదలుగల జెట్టి మగలు నెమ్మదిఁ జెలంగి | 326 |
| తే. | మలలు మ్రాఁకులుఁ బడుకులు బలిమిఁ బెఱికి నింగి యెల్లను గప్పికొనంగవైచి గారడపు రక్కసుని నెందుఁ గానకుండి రంత వాఁడవి సరగ వ్రయ్యలుగఁ జేసి | 327 |
| క. | వారల మీఁదను బెడిదపు నారసములు పెక్కు వఱపి నజ్జుగఁ జేయన్ బీరము సెడి రాచకొలపుఁ బైరుల యెకిమీని మఱువుపట్టి తలఁకుచున్ | 328 |
| తే. | అపుడు రాముఁడు సోఁకు దయ్యంబువలనఁ బొలసు మేపరి తెఱఁగెల్లఁ తెలిసి కొండ నత్తమిలు మేటి దేవర యమ్ముఁ దొడిగి యేయుటయు సత్తి రూపఱిపోయె మింట | 329 |
| ఆ. | పోవ దడవు స్రుక్కి రావణు తొలిపట్టి తేరితోడఁ బుడమిఁ ద్రెళ్ళి నిబ్బ రంబు పాదుకొల్పి రాచూలి బంటులఁ గనుపుఁగొట్టుకొనుచుఁ గడఁగి మఱియు | 330 |
| తే. | గంధమాదను మైందుని గవయు ద్వివిదు నలుని నీలుని శతవలిఁ గలఁచె రెండు తొమ్ముదులు నేఁడు పండ్రెండు బమ్మ లెక్క తొమ్మిదియు నైదు మూఁడును దూపులేసి | 331 |
| సీ. | అత్తఱి వానిపై నంగదుం డొక పెను పడుకును కేసరి కడిమి మ్రాను సంపాతి తాడియు శరభుఁడు దిన్నయు నలుఁడు మఱ్ఱియు నెలుంగుల యొడయఁడు కోఁతులదొరయు బల్ కొండలు దక్కిన బంటు లెల్లను జెట్లు పడుకుగములు తొలివేల్పు ఱేని సైదోడు ద్రుడ్డును లక్ష్మ ణుఁడు మూఁడు తూపులు నూఱు నార | |
| తే. | సములు రాముఁడు నడరింప సరగ వాని విల్లు నురుముగఁ జేయ నా బల్లిదుండు వారి నందఱఁ బెక్కు క్రొవ్వాడి ములుకి మొత్తముల చేతఁ దద్దయు మొక్క పఱచి | 332 |
| క. | మరలి నికుంభిళకుం జని తిరముగ నందంటరాని దేవర యలరన్ విరివిగ వ్రేలిమి యొక్కటి కర మరుదుగ నేమమూని కావించు తఱిన్ | 333 |
| తే. | ముజ్జగంబుల నప్పొగ ముంచుకొనినఁ గనుఁగొని విభీషణుఁడు రాచకలువఱేనిఁ జేరి దేవర! విను మింద్రజిత్తుఁ డిపుడు వ్రేల్మి నొక్కటి నెమ్మిఁ గావింపఁ దొడఁగె | 334 |
| క. | అది నిండెనేని వానిం బదపడి ముక్కంటియైన బవరంబున నె మ్మది గెలువఁ జాలకుండెడు నది గావున వ్రేల్మి సెరుప నంపుము మూఁకన్ | 335 |
| తే. | అనుచుఁ దెల్పిన రాగవుం డపుడె కూర్మి తోడఁబుట్టువుఁ బహోజులతోడఁ గూర్చి వానిఁ దెగటార్చి రమ్మని వాలుతూపు గములఁ బెక్కిడి యనిచినఁ గదలి యరిగి | 336 |
| తే. | రక్కసుఁడు వ్రేల్మి యొనరించు చక్కి దరియు నెడల నచ్చటఁ గాపున్న యెఱచిదిండి మూఁక లాకోన ద్రిమ్మరి మూఁకతోడ నెదురుకొనుటయు నిరువాగు గదిసి యపుడు | 337 |
| క. | పెల్లుగ నడఁచుచుఁ బొడుచుచుఁ గొల్లఁగఁ గూఁకలిడుకొనుచు గుదియల సురెలన్ బల్లెములఁ జెట్లఁ బడుకుల నల్ల పొరలిపాఱఁ బోరొనర్చిరి కడిమిన్ | 338 |
| క. | అత్తఱి గుబ్బలి ద్రిమ్మరి మొత్తంబులు సోఁకుమూఁక మొనలను నెల్లన్ దుత్తుమురు సేసి మగఁటిమి హత్తుకొనంగ జమువీటి కనిచెన్ వేగన్ | 339 |
| ఆ. | అనిచి సోఁకుఱేని యనుఁగు మే పుట్టువుఁ పొదివికొనిన వాడు నుదరి లేచి వ్రేల్మి పోవఁబెట్టి వ్రేల్మిడిఁ దేరెక్కి కడిఁది మగతనంబె గడలుకొనగ | 340 |
| సీ. | ప్రోళ్ళఁ గూల్పఁ గడంగు పునుక దాలుపు మాడ్కి జగమడంపఁగఁ బూను జముని కరణి నుసిరిక మ్రానుపై దొరలెడు పిడుగు ల ట్లడవిపైఁ బేర్చు కారగ్గి పగిది జింకలపై దాడిసేయు బొబ్బిలి పోల్కి ననదోఁట బెరయు పెన్‌గాడ్పు నోజఁ దమ్మికొలను సొచ్చు కొమ్ముటేనుఁగు ఠీవిఁ బాములఁ దోల్పక్కి సామి జాడఁ | |
| తే. | కోఁతి మూఁకల మీఁద దాకొని కడంకఁ గుత్తుకలు ద్రెంచి చేతులు గోసి తొడలు నఱికి చట్టలు చీరి కండలు పెకల్చి బొజ్జలు వగిల్చి మేనులు నజ్జు సేసి | 341 |
| ఆ. | పాఱఁ దఱిమి రాచపట్టిపై నరదంబు వఱపి తఱచుమీఱఁ గఱకు నార సముల ఱొమ్ముగాఁడి చన నేయుటయు నాతఁ డలుకతోడ వాని నడ్డగించి | 342 |
| తే. | వేడివేల్పున కెనయగు వాఁడి ముల్కి యొకటి సింగాణిఁ గూర్చి యేయుడుఁ గడంక మీఱ నది వాని పెన్ బోర దూఱి చనిన నల్లతోఁ దోఁగి కడు సొమ్మసిల్లి తెలిసి | 343 |
| మ. | కెరలంబారెడు కిన్కఁ గన్గవ కడున్ గెంపారఁ గెంపారు న బ్బురపుం బీరముతో వెడంద నెఱ తూపుల్ సింగిణిం గూర్చి వా విరి నార్పుల్ నిగుడంగ రాకొమరుపై వే చిమ్మి నొప్పింప న ద్దొరయున్ గ్రమ్మఱ వానినొంచె బలువాల్తూపు ల్మెయింగ్రుచ్చుచున్ | 344 |
| క. | చేవయు బీరముఁ దేజును లావును కొఱకొఱయు నిచ్చలంపుఁ జలంబున్ ఠేవయు నెనగా నిరువురుఁ గావించిరి పోరు వేల్పుగము లగ్గింపన్ | 345 |
| మ. | తొలి జేజే గమికాఁడు సిమ్ము మొన వాల్తూపు ల్వడిన్ రాచ రే వెలుఁగున్ వ్రచ్చు నతండు వ్రేయు ములుకుల్ వే వ్రచ్చు రే ద్రిమ్మరిన్ జులక న్రక్కసుఁ డేయు చిల్కు లెడ ద్రుంచున్ రాముతోఁబుట్టు వా బలియుం డేయు మెఱుంగుటమ్ము లస మొప్పం ద్రుంచు వాఁడుమ్మడిన్ | 346 |
| తే. | నిలుచుటయు వంగుటయు దొనఁ జిలుకు దివిచి తొడుగుటయు నేయుటయుఁ గనఁబడఁగ రాక చూపఱకు నెల్ల నచ్చెరువై పరగఁగ విండ్ల మ్రోఁతల నార్పుల విన్ను వగుల | 347 |
| ఆ. | కడలి యాకసంబు పుడమియుఁ దఱచుగ నంపవెల్లి పొదువఁ బొంపు మీఱి యంధకుండు కొండయల్లుఁడు దార్కొని యడరునట్లు వ్రేటులాడు నెడల | 348 |
| మ. | కదిలెన్ బంటవలంతి మిన్నదిరెఁ జుక్కల్ రాలె జేజేగముల్ సెదరెన్ సంద్రము లింకె ముజ్జగములుం బిట్టూఁగె నేనుంగు లె న్మిదియున్ మ్రొగ్గెఁ గడల్వడంకె నెలయు న్మిన్మానికంబుం గడం క దిగం ద్రావిరి పాఁపరాయఁడు దలంగంబారె నప్పోరునన్ | 349 |
| మ. | అపుడా నంజుడు దిండి రాచకొమరుం డబ్రంపు బీరంబు దే టపడన్ వేఁడి వెలుంగు వంగడపు ప్రోడ న్దాకి పెల్లార్చి వే లుపు మూఁక ల్బెగడొంది పర్వులిడ వాల్తూపు ల్మెయిన్నింప గా టపు రోసంబున నక్కడింది దొరబిడ్డం డుక్కు రాణింపఁగన్ | 350 |
| సీ. | అరచందమామ తూపడరించి విలు ద్రుంచి యొకకోల యెద నెత్తురురల నేసి తీవంచ ములుకుల మావుల నొప్పించి యైదు చిల్కుల సిడం బవయ నేసి మఱియొక్క యమ్మున గుఱిమీర నరదంబు దోల్వాని తలఁద్రుంచి తొడరి బొబ్బ యిడుటయు వాఁడు నేర్పడరారఁ దానె తే ర్నడపుకొంచుఁ గడఁగి వెడద నార | |
| తే. | సమ్ము లాతని మెయిగ్రుచ్చి సరవి నొక్క వాఁడి తూపు విభీషణు గాఁడ నేసి గాలి కొమరునిఁ బెక్కింటఁ దూల పుచ్చి నలువ గ్రుడ్డు పనఁటులు పగులఁగ నార్చె | 351 |
| క. | ఆర్చినఁ గని రాకొమరుఁడు పేర్చిన కోపమున నైదు పెనుదూపు లరిం గూర్చి తొలివేల్పు బోరయ యేర్చి నిగుడ్చుటయు నాతఁ డేపరి సోలెన్ | 352 |
| ఆ. | సోలి యపుడె తెలిసి సోఁకు జోదెంతయు నులికి గాడ్పు దిండి ములికి వైవ రాచమిన్న పుల్గు రా తూపు పఱగించి తోనఁ జెలఁగి దానిఁ దుమురుచేసె | 353 |
| క. | వేలుపుల గొంగ వలదెస యేలిక తూపేయ రాచయేనుఁగు సత తే జీల వజీర్మేపుట్టువు కోల వడిం బఱపి యా లకోరియుఁ ద్రుంచెన్ | 354 |
| తే. | అత్తెఱంగున నిరువురు హత్తి గెలుపు తలఁపు లంతంత నెక్కువై తనరి కడిమిఁ బోరుచో నేలతాలుపు బొబ్బమెకము మేటి రాకాసి యేనుఁగు మీఁదఁ గినిసి | 355 |
| సీ. | మలదాయఁ యొసగిన బలితంపు వాల్తూపు వెస దొన వెడలించి వింటఁ దొడిగి తగ నిండఁ దిగిచి యేడ్తెర నల్లద్రావుడు తలకట్టుపయిఁ జూడ్కి నిలిపి రాముఁ డెపుడును గడుఁ బున్నియపుఁ గొటారంబేని యతని దేవేరి సీతమ గడింది గరితయయేని జగంబుల కిది మేలు పనియేని నిమ్ముల్కి పఱచి చెనఁటి | |
| తే. | పొలసు మేపరి గమికానిఁ బొలియఁ జేయుఁ గాతయని వైవ నది బిట్టు గ్రాలుకొనుచు వేయు చీఁకటిగొంగల వెలుఁగు గలిగి నెమ్మిఁ జని వాని తలద్రుంచి నేలఁగూల్చె | 356 |
| తే. | అపుడు రాచూలిపయి వేల్పు లలరువాన గురిసి యగ్గించి బేరులు కరము మొరయఁ జేసి రచ్చర లాడిరి చెలఁగి మింట దెసలు పదియును దద్దయుఁ దేజు గాంచె | 357 |
| క. | ఆ లక్ష్మణుఁడును రాముని పాలికి వడి నేఁగి మ్రొక్కి బవరము చందం బోలి నెఱిఁగింప నద్దొర వేలాగుల నతని మెచ్చి వేడ్కలఁ బొదలెన్ | 358 |
| తే. | అంత నక్కడ దీవిరాయనికిఁ గొంద ఱెఱచి మేపరి పోటరు లింద్రజిత్తుఁ డీల్గి చనిన తెఱంగెల్ల నెఱుఁగఁ జేయ నాతఁ డమ్మాట విని గుండెలవిసి చెదర | 359 |
| తే. | పిడుగు వడ్డ తెఱంగునఁ బుడమిఁ ద్రెళ్ళి సొమ్మగొని కొంతవడికి లో నుమ్మలికల వెచ్చ నూర్చుచుఁ దెప్పిఱి వెల్లివిరియ వేఁడి కన్నీరు గొనగోళ్ళ దోఁడుకొనుచు | 360 |
| ఆ. | మిక్కుటంపు జాలిఁ బెక్కు తెఱంగుల వెక్కివెక్కి యేడ్చి స్రుక్కి సొక్కి పొలసు దిండి తీర్పరులు బుజ్జగింప న తండు గొంత దిట మెదం గుదిర్చి | 361 |
| క. | తేరులు చేగల మెకములు వారువములు కాలరులును వావిరి గొలువన్ బేరులు బూరలు గాళెలు బోరు కలఁగ నపుడె తరలి పోరికిఁ జనియెన్ | 362 |
| క. | చని రాయని మూఁకలఁ బై కొని మెకముల ఱేఁడు లేడిగుంపులపై డా కొని బారిసమరు తెఱఁగునఁ మునుకొని పోనీక పొదివి మోఁదఁ దొడంగెన్ | 363 |
| వ. | మఱియు నెరయ విరియుచుం గెరలి పొరలు నబ్బురంపు కొఱకొఱలం గొఱలి యొఱల వఱలు కఱకు చుఱుకుటడిదంబులు వెఱికి యుఱికి నఱికి నెఱకు లుఱక చుఱుకలరం గిఱికొల్పుచు, గెలుపు బలుపు లిగురొత్త హత్తి మొత్తంబులఁ గ్రొత్త సెలగత్తి మొత్తంబులం దుత్తుమురుగా మొత్తి నెత్తురులం జొత్తిలం జేయుచుఁ బాయని పేరమ్మున గ్రుమ్మి క్రొమ్మెఱుంగు టమ్ము లుమ్మడి ఱొమ్ము లురులం జిమ్మి యిమ్ముల సొమ్మగొన నొనర్చుచుఁ బేర్చి యార్చి బల్గోన యేర్చు కార్చిచ్చు వడువున నడరి తొడలు మెడలు నడుములుం బొడుములుగ బెడిదంపు టినుప బడియలఁ బడలువడ నడుచుచు, నిండారు గండు మెండుకొన నండగొనక దిండుకల గండ్రగొడ్డండ్ల గుండెల కండలు గొండలుగఁ జెండు బెండాడుచు, మిటారంపు కటారులం బటాలు పటాలనఁ దుటారంబడర నడిచి హుటాహుటిం బటాపంచలుగఁ దఱుముచు మేటి పోటరితనంబు వాటిల సూటిగ నీఁటియలు నాటుకొల్పి యుసురు లెడల మీటుచుఁ బట్టగు చుట్టువాల్పెట్టులం బొట్టలుఁ జట్టలు బిట్టు వగిల్చి యిట్టట్టు సేయుచు వీఁకం దోకొని బాఁకులఁ జేగ రోఁకలి తాఁకులఁ గాఁక తీఱఁ జదిపి ప్రోకలువెట్టుచు వంకుల గొంకులేని బింకంబు లింకించుచు బల్లెంబుల నుల్లంబులు జల్లని యొల్లంబోవ మొల్లంబగు పెల్లు సూసి త్రెళ్ళింపుచు సురియల గొఱియలంబలె నిఱియ నెఱియఁ బఱియలుగఁ గ్రుమ్ముచు మారి మసంగిన తెఱంగునం బారిసమరి యెక్కడం దానయై యొక్కొక్క మెఱుంగుటమ్మునఁ బెక్కండ్ర నుక్కడంచి వేఱువేఱ గంధమాదను నైదు కోలల, ద్వివిదు నాఱు నారసంబుల, వినతు నేఁడు చిలుకుల, మైందునిఁ జహోవంచ గిట్టల, గజు నెనిమిది కోలలఁ, గుముదు నైదమ్ముల, శరభు నెనిమిదేను తూపుల, నంగదు నెనిమిది బల్లెంబుల, హనుమంతు నిరువది గఱి కట్టియల, గవాక్షుం బది ములుకుల నొప్పించి ననిచిన ములుమోదుగల చందంబు నొందించె, నందుఁ గాళ్ళు తెగి త్రెళ్ళువారును, బొట్ట లురలి గిట్టు వారును, దొడలు విరిగి యడలువారును, జేతులు నలిగి బీతులుగొనువారును, జబ్బలు వడి బొబ్బరించువారును, గుత్తుకలు దెగి యత్తమిల్లువారును, ఱొమ్ములు నొచ్చి సొమ్మసిలువారును, బఱులు వ్రస్సి యొఱలువారును, నడుములు వోయి యిడుమలఁ గుడుచువారును, విఱిఁగి సురుగువారును, వ్రేఁగి లోఁగువారును, గంది కుందువారును, వ్రాలి కూలువారును, వెఱచి పఱచువారునునై పలు దొసంగుల నెసంగుచుండి రప్పుడు - | 364 |
| క. | వెలుఁగుల రాయని కొడు కొక మలఁగొని యమ్మేటి సోఁకు మన్నియపై ని మ్ములఁ జనుచో నెఱ మగఁటిమి యలర విరూపాక్షుఁ డతని కడ్డము దాఁకెన్ | 365 |
| తే. | తాఁకి బెడిదంపు ములుకులు దఱచు నింప నక్కడిఁది జోదు దా నవి లెక్కఁ గొనక వాని తేరును మావులఁ బో నడంచి యడరుటయు వాఁడు జంగునఁ బుడమి కుఱికి | 366 |
| ఆ. | కోఁతి ఱేనిఁ బొదివికొన నపు డిరువురుఁ జెనసి బిట్టు పోరు సేయుచున్న తొగలదాయ కందు దూఱి యా రక్కసు బోర యవియఁ బొడిచి పొలియఁ జేసె | 367 |
| ఆ. | వానితోడఁబుట్టు వైన యున్మత్తుఁ డ క్కొమ్మ మెగపు మిన్నఁ గ్రమ్మి పెక్కు చందముల దురంబు సలిపిన నాతఁ డ ద్దోసకారి నటులె తునిమివైచె | 368 |
| క. | వైచిన తెఱఁగు సుపార్శ్వుఁడు సూచి కడుం గినిసి కోఁతి జోదులపైఁ బెన్ బూచివలెఁ దొడర నంగదుఁ డేచిన బీరమున వాని నెదిరించి వడిన్ | 369 |
| సీ. | కొండ యొక్కటి వైచి గుఱ్ఱముల్ దేరును నుఱుముగాఁ జేసిన నుఱక వాఁడు పది తూపు లంగదుపై నేసి మూఁడింట వేఁడి వేలుపు కుఱ్ఱ వాఁడి సెఱచి మొగి గవాక్షుని నైదు ములుకుల నొప్పించి యార్చిన వేల్పురాయని మనుమఁడు గినుకతో నొక ద్రుడ్డుగొని వాని ఱొమ్ము ప గిల్చిన సోలి వేగిరమె తెలిసి | |
| తే. | వాఁడు గ్రమ్మఱ గొట్టుడు వాలి కొడుకు బోర వ్రేసిన నులికి యప్పోటుకాఁడు పొలసు మేపరిఁ బిడికిటఁ బూని పొడువ నల్లఁ గ్రక్కుచు నేలపైఁ ద్రెళ్ళి యీల్గె | 370 |
| తే. | అట్లు మొనగాండ్రు ముగురు నీఱగుటఁ జూచి యక్కజంబుగ రావణుఁ డడవి మనికి మెకపు బంటులపైఁ బగమీఱఁ దేరు పఱపి తఱిమిన వారలు వెఱచి పఱచి | 371 |
| క. | ఒడయని దరిఁ జేరిన నతఁ డడరెడు నెయ్యమున వారి యళుకుడుపుచు నె వ్వడి విలు గైకొని యా నం జుడు మేపరి కొలపు మేటిజోదు నెదిర్చెన్ | 372 |
| క. | ఎదిరించి కడలు బుడమియుఁ జదలుఁ బొదువునట్టు లంప జడి నించుటయున్ బెదరక వాఁడును వేఁడిమి గదురఁగ మొనవాఁడి తూపుగములు నిగిడ్చెన్ | 373 |
| క. | మంటలు మిణుగురు లెగయఁగ మంటంగల పజకు బీతు మాటికి నిడుచున్ మింటం బర్వెను రాముని వింటం బరగించు వాఁడి వెడఁదల కోరుల్ | 374 |
| క. | రక్కసుల ఱేని తూపులఁ జక్కాడున్ రాగవుండు సరగున మరలన్ జక్కాడు రాము తూపుల రక్కసి గమికాఁడు నబ్బురం బలరారన్ | 375 |
| మ. | విలునేర్పుల్ బవరంబు వేడ్కలు గడున్ విప్పారు బీరంబులున్ బలుము ల్గింకలు గెల్పు కోర్కులసము ల్పంతంబులుం జోకమై దలరన్ బంటవలంతి యల్లుఁడును బ్రాఁదయ్యంపు మేల్బంతియున్ బలు చందంబులఁ బోరి రచ్చెరువు దోపం బేర్మితో నత్తఱిన్ | 376 |
| క. | చేవురు కొండల పవిదిం బూవుల బూరుగుల చందమున నెత్తురు ల న్వావిరిఁ దోఁగి పెనంగిరి రావణుఁడును రాగవుఁడు దిరంబగు కడిమిన్ | 377 |
| తే. | అట్లు నెఱజోదు లిర్వురు నడరి పెక్కు కడిఁది తూపులఁ బోరాడు నెడల సోఁకు మిన్న రాకాసి ములికి యా మన్నుఱేని పై నిగిడ్చిన నది తద్ద పఱపుమీఱి | 378 |
| చ. | ఎలుఁగు మొగంబు లున్మఱియు నేనుఁగు మోములు దున్న మోములున్ జిలువ మొగంబులుం గొదమ సింగపు మోములు జాగిలంపు మో ములు పసిదిండి పెన్మెకపు మోములు పుల్గు మొగంబులు న్మొద ల్గల పలు మోము లూని పయిఁ గ్రమ్మినఁ గన్గొని నేలఱేఁ డొగిన్ | 379 |
| క. | చిచ్చఱ తూపరిఁ గూరిచి క్రచ్చఱ రక్కసుని బూటకపు ముల్కి గడున్ జెచ్చెర నడఁగఁగ నేసెన్ హెచ్చరికల జదల వేల్పు లెల్లం బొగడన్ | 380 |
| తే. | మయుఁడు దబ్బఱమీఱ నేమమునఁ జేసి యిడిన ముల్కిఁ గడఁక నీ రేను తలల తోడి వేలుపు సిమ్మినఁ దోన వేల్పు గాణ తూపేసి దొర దానిఁ గ్రమ్మఱించె | 381 |
| క. | వెండియు మిడుఁగురు లుమియుచు మండెడు వాల్తూపుగముల మానిసి ఱేఁడున్ దండి పొలదిండి రాయఁడు నండఁగొనక పోరుచుండి రక్కజమొదవన్ | 382 |
| ఆ. | అపుడు పడుకునుండి యరుదెంచు సింగపుఁ గొదమవోలెఁ జెలఁగి కొమ్మ మెకపుఁ బహోఁజు నడుమనుండి పఱతెంచి లక్ష్మణుఁ డరుదు మీఱ సోఁకు దొరను దాఁకి | 383 |
| ఆ. | తేరు గడపువాని దిగ్గన నొక కోలఁ ద్రెళ్ళ నేసి యొంట విల్లు దునిమి పడగ యొంట నేలఁబడ నేసి యైదు పె న్గోల లతని యెదను గ్రుచ్చి యార్చె | 384 |
| వ. | విభీషణుండును బెడిదంపు ద్రుడ్డున నరదపు మావుల నుఱుము చేసిన నప్పొలదిండి యొడయండు కొండపైనుండి కుప్పించు కొదమ సింగంబు తెఱంగునఁ బుడమి కుఱికి మిక్కుటంపుం గినుక నవ్విభీషణునిపై మయుండిచ్చిన సత్తి నిగుడించిన | 385 |
| తే. | అది జగంబుల నేర్చుచు నడరు నగ్గి కరణి మంటలు మిణుఁగురు ల్గడలు కొనఁగ వచ్చుచో మర్వు సేరిన వాని మనుచు కొనుటె తగవని లక్ష్మణుఁ డనువు మీఱ | 386 |
| తే. | తన వెనుక కవ్విభీషణుఁ దలఁగ దిగిచి తూఱి యా సత్తిపైఁ బెక్కుఁ దూపు లేయ సరకుగొన కది నిగిడి యబ్బిరుదు మగని ఱొమ్ము గాఁడినఁ ద్రెళ్ళి వే సొమ్మసిల్లె | 387 |
| క. | అప్పుడు రావణుఁ డెంతయు నుప్పొంగుచు ఱేని మీఁద నుఱవడి బెరయన్ నిప్పులు గ్రక్కెడు తూపులు గుప్పించి కలంప మిగులఁ గొఱకొఱ నతఁడున్ | 388 |
| తే. | వేఁడి సూపెడు కఱకు క్రొవ్వాఁడి తూపు గములు దద్దయు నెఱఁకులు గాడనేసి విరుల మోదుగు తెఱఁగు గావించుటయును విఱిగి రక్కసి దొర కురుల్వీడి చెదర | 389 |
| క. | కడలేని వెఱపు మదిలోఁ గడలుకొనం బ్రాఁత వేల్పుగములు గలంగన్ వడిఁ బాఱి లంకఁ జొచ్చెను గడు రాముని రూపుఁ దలఁచి కళవళ పడుచున్ | 390 |
| తే. | అంత నచ్చట రాచూలి వంత వెరయఁ దోడఁబుట్టువు గాఁడిన తూపుఁ బెఱికి వైచి క్రొవ్వేఁడి కన్నీరు వరదవాఱఁ బలు తెఱంగుల నిట్లని పలువరించె | 391 |
| క. | అహహ! సయిదోడ! నీ విటు రహి సెడి యాలంపుఁ బుడమి వ్రాలి కడున్ లోఁ గి హుళుక్కి నిదురఁ బోయెదు తహతహ డెందంబులోన దళమయ్యెఁగదే! | 392 |
| క. | అడవులఁ బదునాల్గేడులు గొడివెల కొడిగట్టి సాఁకు కొంటివి మమ్మా బడలిక నిపు డిజ్జగడపు పుడమిం బవళించి నిదురవోయితొ తండ్రీ! | 393 |
| తే. | అప్ప పనుపున నడవుల కరుగునప్పు డప్పగించె సుమిత్ర నెయ్యమున మాకుఁ జెల్లఁబో! యిందు నిను డించి యెల్లి యరిగి యప్పడంతుక కిఁక నేమి చెప్పువాఁడ? | 394 |
| క. | పేదఱిక ముడుపు నవలా గాదిలి సైదోడుతోడఁ గనుగొన నెపుడున్ మాదిరియగు నీ నెమ్మొగ మీ దెస సొంపెడలియుంట కెటులోర్వనగున్ | 395 |
| ఆ. | అబ్బపాటుఁ గాంచి యడవుల కరుదెంచి తెఱవఁ గోలుపోయి తిరుగుచున్న నిట్టి కీడు సెందె కట్టడి దయ్యంబు నకట! యింక నేమియనఁగఁ బోలు? | 396 |
| ఆ. | నేల యేలుకొనెడు జోలి యదేటికి? నేలచూలిమీఁద నేల యాస? మేల్గొనంబు లూని మెలఁగు ముద్దుల రాచ కూన! యింక నీవు లేని యెడల? | 397 |
| క. | అని పలికి యంతకంతకుఁ బెనఁగొను నుమ్మలికతోడ బిట్టడలుచు న వ్విను రతనపు వంగడపుం బెనురాయఁడు నేల వ్రాలి పెంపడగంగన్ | 398 |
| ఉ. | దాయను గెల్చుటింకఁ గలదా?యను రాచకొలంపు కల్వవిం దా! యను నాడెమైన బిరుదా! యను రక్కసి కార్మొగుళ్ళ యీఁ దా! యను బీరమూన వలదా! యను బిల్చిన నాలకింపరా దా! యను బన్నమొందితిగదా! యను నీకును నంగదా యనున్ | 399 |
| ఉ. | డాయ నదేల రావు బెగడా? యను నెక్కటి చివ్వ గెల్చు కాఁ డా! యను ముద్దు రాకొమరుఁడా! యను మేలి గొనంబు లూను ప్రో డా! యను సోయగంపు మరుఁడా! యను నెన్నికఁ గన్న నేల ఱేఁ డా! యను మేటి జెట్టి మగఁడా! యను బల్కుర తమ్ముఁడా! యనున్ | 400 |
| తే. | అనుచు నొఱలెడు దొరఁ గన్గొని సుషేణుఁ డిట్టులని పల్కె నక్కటా! యెపుడు నిబ్బ రంపు గుబ్బలి వనఁదగి పెంపుఁ గన్న నీకు నడలంగఁ బాడియే? నేలఱేఁడ! | 401 |
| ఆ. | ఇంత వ్రంతఁ గుందనేల? నీ తమ్ముని యొడల నిప్పు డుసురు లున్న వెన్న గాడ్పుచూలిఁ బనిచి క్రన్ననఁ దెప్పింపు మద నెఱింగి మందు లెదఁ జెలంగి | 402 |
| సీ. | అని హనుమంతుఁ గన్గొని మేల్బిరుద! నీవు గ్రన్నన నీయుప్పుకడలి దాఁటి ఱేసిన కడఁకతో ఱెల్లు దీవియు జిడ్డు కడలియుఁ గడచి రొక్కపు టొడయని కడఁ జని ద్రోణమన్ గట్టును జాబిలి గుబ్బలియును హత్తి కోర్కినందు సావర్ణ్యకరణియు సంధానకరణియు సంజీవకరణి విశల్యకరణి | |
| తే. | యనఁగఁ బరగి నల్దెఱఁగుల నలరు మందు లరసి దొరకించుకొని తమ్మియనుఁగు తూర్పు మలను బొడమక తొల్తనె మరలి వచ్చి లక్ష్మణుని మన్చి యసముఁ దెల్లముగఁ గనుము | 403 |
| తే. | అని సుషేణుఁడు తెల్పిన నలరి గాడ్పు కొమరుఁ డక్కర్జమున కియ్యకొనెడు నెడల నేలఱేఁడును నతని నెన్నెనరు మీఱ బుజ్జగించుచుఁ బయనంబుఁ బూన్చి పలికె | 404 |
| క. | రమ్మా! పయ్యరకుఱ్ఱడ! పొమ్మా! వెసఁ దూముపేరఁ బొలుపగు మలకున్ దెమ్మా! మందుల లక్ష్మణు నిమ్మా! క్రమ్మఱ జగంబు లెన్నఁగ మాకున్ | 405 |
| క. | విను మనుమఁడ వినుమనుమఁడ వనఁదనరిన నీకు నెందు నడ్డము కలదే? యని కౌఁగిట నిడుకొని దీ వెన లెన్నేనియు నొసంగి వీడ్కొలుపుటయున్ | 406 |
| తే. | ఏలికకు మ్రొక్కి గాడుపు నెదఁ దలంచి కడిమి నాతండు వడి నుప్పుకడలి దాఁటి కోన లేఱులు దీవులు గుబ్బలులును వరుసఁ గడచును వ్రేల్మిడి నరుగు నెడల | 407 |
| ఆ. | త్రోవ నొండుచోట రావణు పంపునఁ గాలనేమి యనెడు కడిఁది రక్క సుండు నుక్కుమీఁఱ జోగిరూపూని పె న్విసపుఁదోఁట యొకటి నిలిపియందు | 408 |
| తే. | జడలు రుదురుక్కపేరులుఁ జాఁల బూని బూది మెయిఁ బూసి పులితోలు మీఁదఁ గూరు చుండి ముక్కును గన్నులు నొనర మూసి కొని యుళక్కిగ నేమేమొ గొడగుచుండె | 409 |
| క. | అటులున్న ఠవళికానిన్ దటుకునఁ బొడఁగాంచి సోఁకు దయ్యము కంది చ్చట దోఁటయుఁ దపసియు నుం డుటమును గన్గొనము నేఁ డెటు ల్పొదవెనొకో? | 410 |
| ఆ. | తెరువు దప్పెనేమొ? వెరవున నిజ్జడ దారి ఱేని వలన దారిఁ దెలిసి నరుగవలయు నంచు నతని పజ్జకుఁ జని యెలమిఁ గేలుఁ దామరలు మొగిడ్చి | 411 |
| క. | తన యిరవుఁ బేరు నరిగెడు పనియును నెఱిఁగించి డప్పి వాయఁగ నీర్వేఁ డిన నా టక్కరి జోగియుఁ దన జారీలోని నీళ్ళు ద్రావుమటన్నన్ | 412 |
| తే. | అలఁతి నీళ్ళివి సాల వియ్యండ నిపుడు గొలను నిలనుండెనేనిఁ గన్గొనఁగఁ జేసి సేద దీఱిన తఱిఁ ద్రోవ సెప్పుమయ్య! పుడమివేలుప! నెయ్యంబు వొదల ననుడు | 413 |
| ఉ. | దబ్బఱ జోగి డెందమునఁ దద్దయు నుబ్బుచుఁ బల్కెఁ గోఁతి రా బొబ్బ మెకంబ! రాగవుఁడు పూనిన కర్జము మాకు వాలెము న్నిబ్బర మొప్పఁ జేయనగు నీ కిపు డిచ్చెద నెల్ల మందులుం గొబ్బునఁ గొమ్ము వేసరుచుఁ గొండల వెంబడి నేఁగ నేటికిన్ | 414 |
| క. | అదె కొలను తూర్పు దెసఁ జె న్నొదవెడు నట కేఁగి దూప యుడుగఁగఁ దెలి నీ రు దగం గ్రోలిటు రమ్మా! పదపడి కర్జంబు లెల్ల బాగగు ననుడున్ | 415 |
| తే. | సంతసంబంది యక్కోఁతి చందమామ వైళ మేతెంచి యా చెలువంపుఁ గొలను సొచ్చి నీరానుచోఁ దమి హెచ్చ నొక్క మొసలి పఱతెంచి యతనిఁ బొంపెసఁగఁ బట్టె | 416 |
| తే. | పట్టుటయు జంకు లేక యా జెట్టిమగఁడు నఱుజు రూపూని కుత్తుక బొఱియఁ జొచ్చి లోనఁ దద్దయు మెయి వెంచి దాని పొట్ట పఱియ లొనరించి దిగ్గన బయలు వెడలె | 417 |
| ఆ. | అపుడు మొసలి వేల్పుటతివయై తన తొంటి కతయు నచటనున్న కల్ల తపసి తెఱఁగు నతనితోడ నెఱిఁగించి పసిఁడి తే రెక్కి వేల్పుప్రోలి కేఁగెనంత | 418 |
| క. | కరువలి కొమరుఁడు మది న బ్బరమందుచుఁ గల్ల దపసి పజ్జకు జనినన్ గరమరుదంచుచు వాఁడున్ వెరవొప్పఁగఁ గొమ్మమెకపు నెఱ కిట్లనియెన్ | 419 |
| ఆ. | బ్రదుకు మందు లెల్లఁ గొదుకక యొసఁగెద నిప్పు డొజ్జ పూజనిమ్ము మాకుఁ గోఁతి ఱేఁడ! యనినఁ గొఱకొఱ నతఁడిదె కొమ్ము పూజ యనుచు ఱొమ్ము గ్రుద్దె | 420 |
| తే. | గ్రుద్దుటయు వాఁడు వాల్గొని తద్దఁ గినుకఁ దన్ను వ్రేసిన యక్కోఁతి మిన్న సోఁకు బిరుదుఁ బడఁ దన్ని యఱచేత బిట్టు సఱచి స్రుక్కఁ జేసిన వాఁడొక పక్కి యగుచు | 421 |
| క. | ముక్కునఁ జీరియు గోళ్ళన్ రక్కియు నొప్పింప నడవి నట్టు వజీరుం డక్కూళ గ్రద్ద గ్రుద్దియు ఱెక్కలు దునుమాడియు న్నెఱినిఁ గుందించెన్ | 422 |
| ఆ. | అంత వాఁడు సింగమై యార్చి కోఱల గ్రుచ్చి గోళ్ల వ్రచ్చి కోఁతి ఱేని బిట్టు నొంప నతఁడు పిడికిట వొడిచి పె ల్లుడుప నచ్చెనంటి యుక్కు దక్కి | 423 |
| తే. | వేఁడి వేలుపు కుఱ్ఱఁడై వేగవచ్చి గాడ్పు కొమరుఁడ! యిపుడు లక్ష్మణుఁడు బ్రదికె మందులకుఁ బోవ వలవదు మరలి రమ్ము ఱేని యానతి యిదియని పూని పలికె | 424 |
| సీ. | పలికిన విని జడల్గల కోఁతి మిన్న మే పుట్టు విచ్చటి కిప్డు ప్రొద్దు కొమరుఁ డేటికి వచ్చు? నం చెదనెంచి కాకుంటఁ దెలిసి యుక్కడర నప్పొలసుదిండి బోర బల్పిడికిటఁ బొడిచిన నెత్తురుల్ గ్రక్కుచుఁ గూలి వాఁ డక్కజంబు గా శతశృంగుఁడై కఱకుటమ్ములు పెక్కు నిగుడింపఁ దోఁక నన్నియు నడంచి | |
| తే. | కోఁతిరాయఁడు సఱచియు గ్రుద్ది కఱచి తాఁచి చీఱియుఁ బుడమిపై వైచి త్రొక్కి పొగరుటేనుఁగు నెత్తమ్మి పువ్వుఁ ద్రెంచు చందమున వాని తల ద్రుంచి సరగఁ జనియె | 425 |
| క. | చని ద్రోణము గన్గొని చ య్యన మందులు వేడుకొనిన నది యించుకయుం దను సరకు గొనక యుండినఁ గినుక నతఁడు మలయె పెల్లగించెన్ గడిమిన్ | 426 |
| ఆ. | పెల్లగించి గట్టు పెంపారఁ దెచ్చుచు నున్న యెడల నచట మున్ను గాచి యున్న వారువంపుటొడలి జేజేలు పె క్కండ్రు దాఁకుటయును వాండ్రఁ జిదిమి | 427 |
| క. | తెమ్మెర వడి నిబ్బలియుఁడు గ్రమ్మఱి వచ్చునెడ నుప్పుకడలి కడను బీ ర మ్మొదవ మాల్యవంతుఁడు నెమ్మదిఁ దార్కొనిన లావు నిగుడ నతండున్ | 428 |
| ఆ. | ఒడలు వెంచి తుంగ మడువు సొచ్చి కలంచు నాముటేన్గు పోల్కి నడరి మూఁకఁ జిదిమివైచి వానిఁ జిలువ జగంబున కనిచి కడలి దాఁటి యలవు మెఱయ | 429 |
| ఆ. | ఆకసమున వచ్చు నప్పు డమ్మందుల మల వెలుంగు ప్రొద్దు వెలుఁగటంచు నుదరి చూచి రాముఁ డొఱలుచు సింగిణిఁ దూపుఁ గూర్చి యేయఁ దొడరుటయును | 430 |
| తే. | ప్రొద్దుకొమరుఁ డెలుంగుల పెద్ద సోఁకు మిన్నయును వచ్చి ఱేఁడ! విన్విన్ను మనుమఁ డెలమిఁ గొనివచ్చు మందుల వెలుఁగు గాని యది జగము విందు వెలుఁగు గాదనుచుఁ దెలిపి | 431 |
| ఆ. | క్రమ్మరించి రంతఁ గ్రన్నన మందుల గట్టు తెచ్చి నిలిపి గాలిచూలి గేలు మోడ్చియున్న నేలతాలుపు మిన్న గారవమున నతనిఁ గౌఁగలించె | 432 |
| సీ. | అప్పుడా రాచూలి యానతిఁ గాంచి సు షేణుఁ డమ్మెట్టుపైఁ జేరి మందు లారసి కొనితెచ్చి నేరుపుతోఁ బఱ గింప లక్ష్మణుఁ డబ్బురంపుఁ దేజు గదుర గొబ్బున లేచె గాడుపుఁ బట్టియుఁ గ్రమ్మఱ నబ్బలు గట్టు మొదలి పట్టున నిడివచ్చి పంటవలంతి ఱే నికి మ్రొక్కులిడిన మన్నించి యతఁడు | |
| తే. | దమ్ముఁడును దాను నెమ్మితోఁ గొమ్మమెకపు మొత్తములఁ గూడి పోరికి మొనయుచుండె నంత నత్తెఱఁగంతయు నాలకించి దీవిరాయడు దద్దయు దిగులుపూని | 433 |
| క. | మగఁటిమి దిగఁ ద్రోచి కడున్ వగచుచు వెస నొజ్జ చేరువకుఁ జని చేతు ల్మొగిచి తన గొడవలన్నియు నగపఱచిన నాతఁడిట్టులని వాక్రుచ్చెన్ | 434 |
| తే. | రక్కసుల ఱేఁడ! నీ కిటుల్ మ్రొక్కనేల? దురములోపల మార్తురఁ దొడరి గెలుచు జాడ లెన్నేని గల వెద జంకుమాలి చెఱుపు దొరలని వ్రేలిమి సేయుమొకటి | 435 |
| క. | అది నిండెనేని? నిన్ననిఁ గదియంగా వెఱచు బేసికన్నుల దొరయుం గొదుగక నీవా వ్రేలిమిఁ బదిలముగ నొనర్చు మెల్ల పనులుం జాగున్ | 436 |
| ఆ. | అనుచు దాని చందమంతయు నెఱిఁగించి సుక్కురుండు పనుప సోఁకు ఱేఁడు మరల దీవి కరిగి మఱి మీఱి కోటలు గట్టి సేసి మూఁకఁ గాపు పెట్టె | 437 |
| సీ. | అపుడె మేటి వజీరుఁడగు మించు నాల్క ర క్కసునిఁ బిల్చి కరంబు గారవించి బలియుండ! నీవు నీ పౌఁజులఁ దరలక నగరు గావుమటంచుఁ దగులు పఱచి నీటఁ గ్రుంకులు వెట్టి నేమంబుతోఁ గావి కోకలు గందంబుఁ గ్రొవ్విరులును బూని పాఁప జగంబు బొఱియ సొచ్చి వెడంద తీనియ నలరించి దానియందు | |
| తే. | నగ్గి రవులించి యావాలు గుగ్గిలంబు జీడిపుడకలు కానుగ చిగురు లగరు నేయి తేనియఁ గల్లు పా ల్నెత్తురులును గఱికపోఁచలు పూ ల్వెండ్రుకలును మఱియు | 438 |
| క. | ఎలుఁగులు కాకులు గ్రద్దలు చిలువలు తాఁబేళ్ళు మీలు జింకలు రాపు ల్గులు గొఱియలు మొసళులు మేఁ కలు పందులు తేళ్ళు మొదలుగాఁ వేల్చునెడన్ | 439 |
| క. | అప్పొగ జగముల నెల్లం గప్పినఁ గని కడవ చెవుల గామిడి సైదో డప్పుడె రాముని క త్తెఱఁ గొప్పఁగ విన్నప మొనర్ప నొడయఁడు వేగన్ | 440 |
| క. | అక్కజపు కోఁతి జోదులఁ బెక్కండ్రం బిలిచి మీరు బిఱబిఱఁ జని యా రక్కసుని వ్రేల్మి మానిచి గ్రక్కున రండనుచు సెలవు గావించుటయున్ | 441 |
| క. | అవ్వాఁడి మగలుఁ దద్దయు నెవ్వడిఁ గొని లంకఁ జొచ్చి నెమ్మి నలరుచుం గ్రొవ్వఱ రక్కసి మూఁకల దవ్వుగఁ బోఁ దఱిమి చంపి తరలని కడిమిన్ | 442 |
| చ. | తలుపులు గీములున్ విఱుగఁ దన్ని కొటారులు నుగ్గు సేసి మే డలు పడఁద్రోచి గేస్తుల నడంచి వెలందుకల న్ముసళ్ళఁ గం దుల వెతలం గలంచి పువుఁ దోఁటలు గాళొనరించి యెంతయుం జలము దలిర్పఁ బ్రోలు పలు చందములం జెడఁ గొట్టుపట్టులన్ | 443 |
| తే. | ఎలమితోడ విభీషణు నింతియైన సరమ దొలివేల్పు ఱేఁడున్న జాడ వారి కలరఁ జేసన్న నెఱిఁగింప నంగదుండు సరగఁ బఱతెంచి వాఁడున్న యిరవు గాంచి | 444 |
| క. | తమవారిం బిలిచిన వై ళమ చని వారందఱుం బొలసు మేపరి క ల్గు మొగం దాపిన పెను ఱా యి మొగిం బడఁ దన్ని లోని కేఁగి కడంకన్ | 445 |
| తే. | వేలుపుల గొంగ యునిచిన వ్రేల్మి సరుకు లెల్ల యొకపారె యగ్గిలోఁ జల్లివైచి వానిఁ బొడిచియు నడఁచియుఁ బూని మీస లూడఁ బెఱికియుఁ గదలకయున్నఁ గినిసి | 446 |
| క. | తడయక యంగదుఁ డపుడా గడుసరి తొలివేల్పు లోనగరు దూఱి చలం బడరఁగ మందోదరి క్రొ మ్ముడి పట్టుక తెచ్చి వాని ముందఱ నిలిపెన్ | 447 |
| చ. | నిలిపిన నప్పొలంతి మగనిం దగఁ గన్గొని నాన యల్క యు మ్మలికము బీతు నుల్లమున మాటికిఁ బేర్కొనఁ బల్కె నయ్యయో! పొలకవణంపు వంగడపుఁ బున్నమ వెన్నెలఱేఁడ! నీ చెలిం బలువలు కొప్పువట్టి పలుబాములఁ బెట్టఁగఁ జూడఁ బాడియే | 448 |
| క. | ఆలమునఁ బగరఁ గెలువఁగఁ జాలక మగతనము దూలి చయ్యన నెంతో తాలిమిఁ గైకొని యహహా! వ్రేలిమిఁ గావింప నెట్టి వెర వొదవెనొకో? | 449 |
| క. | నా కొమరుఁ డింద్రజిత్తుఁడు లేకుండుటఁ జేటు వాటిలెం గాక యతం డీ కరణి చూచుచుండునె? డాకొని పగతు ల్గలంపఁ డక్కరియగుచున్ | 450 |
| తే. | అడవి నొడయనిఁ గికురించి పుడమి కాన్పుఁ దెచ్చుటకు మాఱుగాఁ గోన ద్రిమ్మరులు సె లంగి యిటు లేపుచున్నఁ దలంక వకట! సిగ్గు బీరంబుమాలిన చెనఁటి వీవు | 451 |
| తే. | కుడిచి కూర్చుండి క్రొవ్వునఁ బుడమిఁ ఱేని పడఁతిఁ దెచ్చుట నిట్టి చేడ్పాటు వొదవె నింక నీ వ్రేల్ములన్నియు నింకఁ బెట్టి యతని బెడిదంపు బలు తూపు టగ్గిఁ బడుము | 452 |
| క. | అనవుడు నానయుఁ గిన్కయుఁ బెనగొనఁగా లేచి సోఁకు పెద్ద వెసన్ వా ల్గొని యంగదు వ్రేసి నెలం తను విడిపించుకొని నగరునకుఁ బోఁబనిచెన్ | 453 |
| తే. | అప్పు డా వ్రేటుచేఁ దార యనుఁగు కొడుకు సొమ్మఁగొని నేల వ్రాలినఁ జూచి గాడ్పు నిసుఁగు రావణు తలలఁ గ్రొన్నెత్తు రురులఁ బోర బెడిదంపుఁ బిడికిలిఁ బూని పొడిచె | 454 |
| తే. | అంతలోపలఁ దెప్పిరి యంగదుండు రక్కసునిఁ గేల నడిచిన స్రుక్కి వాఁడు నిడుద ద్రుడ్డున తనను గుందించి వాఁడి యడిదమున సోఁకు దయ్యము కొడుకు నేసి | 455 |
| తే. | ఇనుపబడియను నలునిఁ జేయీఁటె ద్వివిదు సత్తి శతవలి నేసియుఁ గత్తి గజునిఁ గుఱుచ రోఁకట నీలుని మఱియుఁ బెక్కుఁ గైదువుల నెల్ల నెఱ మొనగాండ్ర నొంచె | 456 |
| తే. | వారు దాఁచియు గ్రుద్దియుఁ జీరి యడఁచి కఱచి మోఁదియు వానిఁ బొంపఱగఁ జేసి మరలి బొబ్బలు వెట్టుచు మాఱులేని బీర మొప్పారఁ దమ వీడు సేరి రపుడు | 457 |
| క. | గాలి నిసుఁ గెలమితో రా చూలిం బొడగాంచి మిగుల జోత లొసఁగి తొ ల్వేలుపు వ్రేలిమి సెఱిచిన జోలి యెఱింగించి మదినిఁ జొక్కన్ జేసెన్ | 458 |
| క. | రక్కసి ఱేఁడుం దద్దయు స్రుక్కుచు లోనగరు సొచ్చి సొలయుచు వగలన్ బొక్కెడు తన చెలిఁ గనుగొని యెక్కుడు చేడ్పాటు దోఁప నిట్లని పలికెన్ | 459 |
| తే. | మగువ! నీ కిట్టు వగలచేఁ బొగల దగునె? జమిలి నాల్కల తొడవుల సామి యిపుడు కనికరము దప్పెఁ గాఁబోలుఁ గాక కోఁతు లెఱచిదిండుల గెలుచుట యెందుఁ గలదె? | 460 |
| తే. | ఆలమున నేఁడు గట్టిగా నేల ఱేనిఁ గూల్చి పగయెల్ల నుడుపుదు గొంకులేక కాక యాతని చేఁ గీడు గలిగెనేనిఁ జిచ్చుఁ జొరు మీవు సెచ్చెర సీతఁ జంపి | 461 |
| క. | అనుటయు మందోదరి తన పెనిమిటి కిట్లనియె ఱేఁడ! పెనుకువలో రా ముని గెలుతు ననెడు తలపులు సనఁబోవిఁక నొండు మంచి జాడ వెదకుమా! | 462 |
| క. | పరికింప నట్ల జేజే దొరలం గెలిచిన కడంకతోఁ దివిరెదు హా! దురమున నీ కా రాచూ లుర తోడ న్మాఱుకొని గెలువరాదుసుమీ! | 463 |
| ఆ. | వినుము తెలియ మొదట వెన్నుఁ డిజ్జగ మెల్లఁ బ్రోచుకొఱకుఁ బెక్కు రూపులూని తిరుగుచుండు నట్టి దేవర యా రాచ మానికంబుగాఁడె? మదిఁ దలంప | 464 |
| సీ. | మీను మేనూని ప్రామిన్కు తెక్కలికానిఁ జెండిన బలియుఁ డితండె కాఁడె? తాఁబేటి మే యెత్తి తరిగొండ వీఁపునఁ దాల్చిన మేటి యీతండె కాఁడె? బలుకొమ్ము పందియై పసిఁడికన్నుల పొల దిండిఁ జీరిన వే ల్పితండె కాఁడె? మానిసి సింగమై పూని బత్తుని వెతల్ తలఁగఁ ద్రోచిన వాఁ డితండె కాఁడె? | |
| తే. | వడుగగుచు నేల మూడజ్జలడిగి బలిని దఱిమివైచిన దిట్ట యీతండె కాఁడె? గండ్రగొడ్డలి దాలిచి కడఁగి రాచ పిండు నడిచిన ప్రోడ యీతండె కాఁడె? | 465 |
| క. | విను మిపుడు నిన్నుఁ దునుమగఁ బనివడి యీరైదు తేర్ల బల్లిదునకు లా వెనయంగ రాముఁడై యే పునఁ బొడమిన వాఁడితండు పొలదిండిదొరా! | 466 |
| క. | కావునఁ గొంకక నీవా దేవర దేవేరి నొసఁగి తెలివి నడవికిన్ వే వెలువడు ముసురులతోఁ జేవ దిగంద్రోచి తపసి సింగమ వగుచున్ | 467 |
| ఆ. | మొదలిసిరియు పంటముగుద గాదిలిపట్టి యగుచుఁ బొడమె నట్టి జగము తాయిఁ దెచ్చి యింత కీడు దెచ్చితి వింక న మ్మగువ నడుగుకొనుము మనుపుమనుచు | 468 |
| ఉ. | కాలికిఁ గేలు సాఁచి యుడిగంబున మ్రొక్కుము రాచమిన్న యి ల్లాలికి నాడెమైన జవరాలికి, దోసపు నీరుదాల్పు పెన్ గాలికి, జోగికూటువ నిగారపు డెందపుఁదమ్మి జంట ము క్కాలికి మేర మీఱెడు జగంబుల మేలికి నేలచూలికిన్ | 469 |
| ఆ. | దీవిఱేఁడ! మయుడు సావును ముదిమియుఁ గలుగకుండునట్లుగా నొనర్చె నట్టు లగుటఁజేసి యకట! నీతో సొద సేరఁబోల దేమిసేయుదాన? | 470 |
| తే. | అనుడు గారాబురాణి నూరార్చుకొనుచు రావణుఁడు పల్కెఁ గటకటా! పూవుబోఁడి! తోడఁబుట్టులఁ గొడుకుల దొరల బంట్లఁ బోరిలోఁ ద్రోచి యిఁక నెమ్మిఁ గోరఁజనునె? | 471 |
| క. | మలగొంగ మొదలుగల వే ల్పుల నందఱ బాఱ దఱిమి లోఁగని కడిమిన్ దలరు కొడు కింద్రజిత్తుడు వొలిసినచో రాచఠీవి పొలుపేమిటికన్ | 472 |
| క. | విడువక తపసుల నెల్లం గడు గలచితి మున్ను చలము గదురగ నిపుడా జడదారులలో దూఱిన బడతీ! కనుగొన్నవారు పకపక నగరే? | 473 |
| సీ. | జముదాడి నుడుగక జముదాడి యుడిపించి గుదియ నేఱులఱేనిఁ గుదియఁ బెట్టి వింటగాడుపు సొంపు వింట నంటఁగఁ జేసి గండ్రగొడ్డట నగ్గి గండడంచి మొనల కైదువు బూచి మొనలవానిఁ గలంచి తులువ కత్తిని సోఁకుఁ దులువనొంచి వంకిలిబ్బిదొర లా వంకిలి నొందించి కొంగవాలునఁ గట్లగొంగ గెలిచి | |
| తే. | ఎందునెనలేని కడిమిఁ జెన్నొంది జగము లెల్ల బలితంపు ఠీవుల నేలుచుండు నట్టి యే నొక మానిసి నకట! యెట్లు గావుమని వేడుకొనువాఁడ దీవఁబోఁడి! | 474 |
| ఆ. | ఇంత చెప్పనేల? యెఱుఁగుదు రాముఁడు మొదలి వెన్నుఁ డగుట ముగుద! యెపుడుఁ జెడని మేలుఁగోరి కడఁగితి నతనితో జగడమునకు నింక వగవవలదు | 475 |
| తే. | ఇంతి! యా మీఁద మేల్చిన్నె లెడలి నీవు దమ్మి చెలికాఁడు లేని నెత్తమ్మివోలె గలువరాయనిఁ బాసిన కలువవోలె నుండుమనుటయు సిబ్బితి నూరకుండె | 476 |
| సీ. | అంతట సోఁకుఱేఁ డసమున మోసల కేతెంచి జోదుల నెల్లఁ బిలిచి పది దెస లద్రువంగ బయనంపు బేరి వ్రే యించి మేల్రవణంబు లెలమిఁ దాల్చి కరవాలు మొదలగు కైదువల్గొని పది యాఱు కుండలు జంట నూఱువేల నూఱులగంటలు నూఱుపదుల్మేలి తత్తడు లెల్గుతో ల్కత్తళమ్ము | |
| తే. | తిగ సిడంబులు గల పైడిఁతేరుఁ గడఁక నెక్కి యెల్లులు జిల్లు లెల్లెడల మెఱయ నరదము ల్మావు లేనుఁగు ల్బిరుదు మగలు గ్రమ్ముకొని రాఁగఁ బోరికిఁ గదలి చనియె | 477 |
| ఆ. | అపుడు ఖడ్గరోముఁ డగ్నివర్ణుఁడు సర్ప రోముఁడును గడింది యాముతోడ వెలుఁగుచున్నయట్టి వృశ్చికరోముండు దరలి రతనిఁ గూడి కఱకు మీఱ | 478 |
| క. | అటులేఁగిన తొలివేలుపు తుటుములఁ బొడఁగాంచి కోఁతిదొర లందఱు మి క్కుటమగు బీరముతో నొ క్కొటఁ దొడరిరి చెట్లుఁ బట్లుఁ గొండలుఁ గొనుచున్ | 479 |
| సీ. | మొదటి జేజేబంటు లుదుట మీఱఁగ వారిఁ బొదివి చే యీఁటెలఁ బొడిచి ద్రుడ్ల మోఁది వంకులఁ గ్రుమ్మి ములుకుల నొంచి బ ల్లెములఁ గూలిచి యడిదముల నఱికి గుదియల సురియల గొడ్డండ్ల సబిడీల సుడి కైదువులఁ దెంపు సడలఁజేసి మావులఁ దోలి నెమ్మది జెండుబెండాడి బలు హజ్జ మెకములఁ బఱపి తఱిమి | |
| తే. | నెత్తురుల హత్తుకొల్పిన నెరయఁ గినిసి కోన ద్రిమ్మరి బిరుదు లక్కూళరేయి ద్రిమ్మరులఁ జుట్టుముట్టి చలమ్ము మెఱయ మలలు మ్రాఁకులుఁ బడుకులుఁ జెలగి వైచి | 480 |
| క. | చఱచియు గ్రుద్దియుఁ దాచియుఁ గఱచియుఁ జీరియుఁ గడిందిగాఁ దోఁకల ను క్కఱ మోఁదియు మట్టియు నం దఱఁ బుడమిం గూల్చి రంపు దళుకొత్తంగన్ | 481 |
| సీ. | తలలు తాఁబేళ్ళు చేతులు గాడ్పు మేపరు లెముకలు మీలు గుఱ్ఱములు తరఁగ లరదము ల్కలములు నరము లెఱ్ఱలు వెంట్రు కలు నాఁచుదీవ ప్రేవులు నెగళ్ళు మొండెముల్ మొసళులు కండలు కప్పలు మెద డస లేనుంగు పదవుదీవు లెల్లులు నురువులు నల్ల నీళ్ళు గయాళి బూచుల యార్పు లబ్బురపు రొదలు | |
| తే. | గాఁగ మున్నీటి కుద్దియై కలను పుడమి దద్దఁ గన్పట్టె నపు డడిదంబు వెండ్రు కల పొలసుదిండి తలకట్టు గాలిచూలి పైఁ గడఁగిన నజ్జగబంటు గినిసి | 482 |
| తే. | వానిపైఁ బేర్మి నుఱికిన వాఁడి యలుగు వెంట్రుకలు గాఁడుటయు నల్ల వెల్లి విరియ సొమ్మగొని కొంతసేపున కుమ్మలిక ద నర్పఁ దెప్పరి యతఁడు పెన్లావు మెఱయ | 483 |
| ఆ. | కొండ యొకటి బెఱికి గొబ్బున వానిపై వ్రేయ నది కడింది వెలయ బెక్కు తునియలగుచు రాలె దులువ తొల్వేలుపు మేలు బంతి కఱకు మేను సోకి | 484 |
| క. | అమ్మల వమ్మయి చనుట ది రమ్ముగ బొడగాంచి కోతిరాయడు గడిమిం గ్రమ్మఱ నొక గట్టా రే ద్రిమ్మరి పై నేసి జముని తెంకికి బనిచెన్ | 485 |
| క. | విసదారి వెంట్రుకల ర క్ససుఁ డస మెలయంగఁ గోఁతి గములఁ దఱుమఁగా వెసగాంచి వాలి గాదిలి నిసుఁ గాతనిఁ దాఁకి కేల నెవ్వడి ననిచెన్ | 486 |
| తే. | అడచుటయు వాఁడు వెండ్రుక పడగ దాల్పు చాల్పు నెమ్మోము బొఱియ విసపు గడింది యింగలపుమంట లాకసం బెల్లఁ బొదువ నడరి కడునార్చి యతని బిట్టడల నేసె | 487 |
| క. | అది సైరింపక యంగదుఁ డెదఁ గొఱకొఱ నిగుడవాని నేచిన బలిమిన్ బొదివి నడునెత్తిఁ బిడికిట నొదుఁగక పఱియలుగఁబొడిచి యుసురులఁ బాపెన్ | 488 |
| ఆ. | నీలు డంత గఱకు తేలు వెండ్రుకల రా కాసి బంటు బొదివి కడిమి నొక్క కడిమి వెఱికివైచి మడిపె జేజేలు మి న్నున జెలంగి కనుగొనుచు బొగడగ | 489 |
| క. | అపు డగ్గి వన్నె తొలి వే లుపు దన నెమ్మేని మంటలు గడిందిగ గా డుపు తండ్రిఁ బొదువఁ గోఁతి ప దుపుపై నరదంబు నెమ్మితోఁ బఱపుటయున్ | 490 |
| తే. | కొదమ పసిదిండి మెకము గన్గొన్న బుడుత లేడి గమివోలెఁ బికపికలాడుకొనుచు విఱిగి యమ్మూఁక రాముని వెనుకఁ జేరు కొనినఁ గన్గొని యాతఁ డచ్చెనఁటి నెదిరె | 491 |
| క. | ఎదిరిన వా డరదము వడి గదియంగాఁ ద్రోలి తూపుగము లద్దొరపై గుదులుకొన నేసి వేడిమి వెదచల్లిన నల్గి రాచవెన్నెలఱేడున్ | 492 |
| మ. | ఒక క్రొవ్వాఁడి లకోరి సింగిణి నసం బొప్పారఁ గీల్కొల్పి వా ని కయిం గ్రాలెడు విల్లు ద్రుంచి కడిమిన్ వేఱ్వాలు సేకొన్న వే ఱొక బల్లెంబునఁ జెండి ద్రుడ్డుగొని పై నుంకించి యేతెంచుచో సెకలీ న్ముల్కి యొకండు వ్రేసి తల ద్రుంచె న్వేల్పు లగ్గింపఁగన్ | 493 |
| ఉ. | ఆ తఱి దీవిఱేఁడు జగమంతయుఁ గాల్పఁ గడంగుచున్న చిం బోతు హుమాయిజోదు నెనఁబోలుచుఁ గన్నుల నిప్పులొల్కఁగా వే తన తేరు రాచననవిల్తుని పజ్జకు డాయఁదోలి యా రాతి కుసు ర్లొసంగిన దొరంగని బింకమెలర్ప నిట్లనున్ | 494 |
| ఆ. | మన్నుఱేఁడ! కొంద ఱన్నువ నంజుడు దిండి బంట్లఁ బోరఁ జెండినాడ నంచు నిక్కె దిపు డొకించుక నా లావె ఱుంగ నేర వెట్టి వెంగలివొకొ? | 495 |
| చ. | కలఁచితి వేల్పుఱేని నుడిగంబులఁ బూన్చితి నగ్గి నజ్జమున్ గెలిచితి సోఁకుపెద్ద నడఁగించితి వల్లియత్రాడుఁ దాల్పుఁ జి క్కుల బెరయించితిన్ జదలు కుఱ్ఱనిఁ గొట్టితిఁ జాగకాని బూ చులదొరఁ దోలితిన్ మిగుల సొంపున నేలితి ముజ్జగంబులన్ | 496 |
| తే. | ఎల్ల జేజేలఁ గూడి జాబిల్లి తాల్పు గొలుపు కూర్చుండు నవ్వెండి కొండఁ గేలఁ బూలచెండు తెఱంగునఁ బూని చాల మెప్పులందితి నిఁక నొండు సెప్పనేల? | 497 |
| తే. | ఆలమున నేడు నిన్నుఁ జక్కాడి బూచి గముల కాఁమెత బెట్టెదఁ గాక జుడిగి పోవనిత్తునె? యనుడు నప్పొలసుదిండిఁ జూచి యసదుగ నవ్వి రాచూలి పలికె | 498 |
| ఆ. | పెక్కు నోళ్ళ నుఱక పెక్కుఁ దెఱంగుల నఱచె దిట్టి వట్టి కొఱకులేల? మగతనంబు నెరపి జగడం బొనర్పుము సోఁకుఱేడ! యెందు స్రుక్కి చనక | 499 |
| ఆ. | నీ కడింది లావు నే నెఱుంగనె వాలి తోఁకఁ జుట్టి కడలిఁ ద్రోయుటయును జెఱనుబెట్టి వేయి చేతుల యెకిమీఁడు విడుచుటయును జగము వెల్లివిరిసె | 500 |
| క. | అబ్బటువు వాలు తాల్పును గుబ్బలి విలుకాడు నంచగుఱ్ఱపు జోదున్ గొబ్బున నడ్డము వచ్చిన నిబ్బరముగఁ బోర నేఁడు నిను దెగటార్తున్ | 501 |
| ఆ. | అనుచుఁ గఱకు తూపు లదరంట నేసిన నులికి వాఁడు వాఁడి ములికి గములు మన్నుఱేని మీఁద నెన్నేనిఁ బఱపి యీ రైదు కడలు నద్రువ నార్చి మఱియు | 502 |
| శా. | జేజేగొంగ పసిండి పింజల పసన్ జెన్నొందు వాల్తూపులా రాజాబిల్లి పయి న్నిగుడ్ప నతడున్ రాకాసి మేల్బంతిపైఁ దేజారం బెడిదంపు నారసము లెంతేని న్వడిన్వైచి మే న్గాజుంబూసకు సందులేక కదియ న్గాయంబులన్ జేసినన్ | 503 |
| క. | మదిఁ గొఱగొఱ నిగుడఁగ న ప్పది మొగముల జోదుఱేనిపై మాఱ్ములుకుల్ చదలద్రువ నేసి విరి వా రిదము తెఱంగొందఁ జేసి వ్రేల్మిడినొంచెన్ | 504 |
| తే. | అందులకు నుల్కి యా రాచచందమామ నారి మొఱయించి బల్మి యొప్పార నంప వాన లా రేయిద్రిమ్మరి మేనిమీఁదఁ గురిసి నెఱకుల నొప్పించి కొంకఁ జేసె | 505 |
| క. | పొలదిండి ఱేఁడు సిమ్మెడు చిలుకులు రాగవుఁడు నడుమఁ జెండాడున్ రా నెల వఱపెడు బెడిదపుఁ దూ పుల వెంటనె రక్కసుండు పొలుపఱఁ చేయున్ | 506 |
| తే. | నల్లద్రావుడు జోదేయు నారసములు చిలువరూపుల విసపు టగ్గులు నిగిడ్చి కొనుచుఁ బఱతెంచి ఱేని మిక్కుటపుఁ బుల్గు రాచ తూపులచేఁ దూలి వ్రాలుచుండు | 507 |
| క. | బలములు గెలుపు తలంపులు నలుకలుఁ బంతములుఁ దలఁప నంతంతకు మి క్కిలిగాఁ బోరఁ దొడంగిరి తొలివేలుపు ఱేఁడు రాచతొగనెచ్చెలియున్ | 508 |
| తే. | అపుడు జన్నంపుతిండి రాయని పనుపునఁ దేరుఁ గొనివచ్చి మాతలి ఠీవి ఱేని డాయ దరి నిల్ప నాతఁడు దానిమీద ప్రొద్దు తూరుపుమల యెక్కు పోల్కి నెక్కి | 509 |
| తే. | అందు వెలుఁగొందు విల్లును బొందలంబు దరకసంబులుఁ గైదువుల్ దాల్చి యరిది తేజు వెలయంగ సోఁకు కుందేటి తాల్పు నెదురుకొనె వేల్పుమూఁకలు చదల బెగడ | 510 |
| క. | గుబ్బలి గుబ్బలియుం బలు బొబ్బమెకము బొబ్బమెకము పులియు న్బులియున్ గిబ్బయు గిబ్బయుఁ దద్దయు నబ్బురముగఁ దొడరు కరణి నడరి రిరువురున్ | 511 |
| తే. | అరదముల మ్రోఁత లదలపు టార్పు లరుల చప్పుడులు నొక్క యుమ్మడిఁ జదలఁ బొదలఁ గఱకు మొనవాఁడి చిలుకులు వఱపి నెఱఁకు లుచ్చిపో నేయుచుండిరి పెచ్చు పెరిఁగి | 512 |
| క. | గుఱిఁ దప్పక కడుదవ్వుగఁ బఱచుచుఁ జప్పుడులఁ జదలు వగిలించి మిడుం గుఱు లుమియుచుఁ బడు మిడుతల తఱచూనె న్వారి బల్లిదపు టంపగముల్ | 513 |
| తే. | దొనలఁ దూపులు గొనుటయుఁ దొడరి నారి లాగుటయు నేయుటయు గుఱు ల్నాఁటుటయును గనఁబడకయుండు నట్లుఁగాఁ బెనఁగి రెఱచి దిండి రాయఁడు నెకిమీఁడు గండెసంగ | 514 |
| క. | కుడియెడమల సింగిణు లిం పడరఁగఁ గైకొనుచు వెరవులారఁగ నసము ల్గడలుకొనఁ బోరొనర్చిరి సడలని బింకముల నక్కజం బెలయంగన్ | 515 |
| ఆ. | పదియు నూఱు వేయి పదివేలు నూఱువే ల్మొదలుగాఁగఁ బెక్కు ములుకు లేసి తొడలు మెడలు కాళ్ళు నడుములు బోరలు నలియ వ్రేటులాడి రలుకుమాలి | 516 |
| తే. | గాటముగఁ బింజ పింజయుఁ గాఁడి పాఱఁ దొడరి యిరువురు నడరించు తూపుగములు కడలు పదియును సంద్రము లెడము లేక కప్పుకొని యుండె నింకేమి సెప్పవలయు? | 517 |
| తే. | విల్లు తెఱగంటి విల్గాఁగ వింటి మ్రోఁత లుఱుములుగఁ గల్గు మెఱుఁగులు మెఱుఁగు దీవి యలుగ నెఱ రాచ తొలిమబ్బు పొలసుదిండి కొండపై నంపజడివానఁ గురియుచుండె | 518 |
| తే. | వేలుపుల సూడు వేలుపుఁగోల యేయ నడుమ పొడిపొడి యొనరించె బుడమి తాల్పు మరలఁ దొలివేల్పు మన్నీడు మావు మోము వేల్పు టమ్మేయ నదియు బో వ్రేసె ఱేడు | 519 |
| క. | రక్కసి మొనగాఁ డేపున రక్కసి చిలుకడరఁ జేయ రాముఁడు దానిన్ గ్రక్కున వెన్నుని తూపున నుక్కడఁచెన్ మింట వేల్పు లుబ్బుచు నార్వన్ | 520 |
| సీ. | తొలివేల్పు తలకట్టు చిలువ చిల్కడరింపఁ బులుఁగు రా తూపేసి మలపె ఱేఁడు పొలదిండి మిన్న యింగలపు టమ్మేయ రా ముఁడు మొగుల్ములికి నుక్కడఁచె దాని జగములగొంగ యేనుఁగు కోలఁ బఱప రా యండు సింగపు గిట్టఁ జెండి వైచె మొఱకు రక్కసుఁడు ముమ్మొనవాలు నిగుడింప దొర సత్తిచే దానిఁ దుమురు సేసె | |
| తే. | బంతి మొగముల సోఁకు మేల్బంతి పెక్కు కఱకు నారసముల ఱేని నెఱఁకు లగల నేసి టెక్కెముఁ గూల్చిన నీరసమున నేల తాలుపు నెల వానిఁ దూలనేసె | 521 |
| క. | పది కడ లద్రువగ నార్చుచుఁ బదిమోముల జోదు గలనఁ బదిలుండగుచున్ బది విండులు గైకొని య ప్పది తేరుల ఱేని కొడుకు బడలఁగ నేసెన్ | 522 |
| క. | ఒక సింగాణియె కొని కి న్క కడున్ మీఱంగఁ దూపుగము లేయుచుఁ బా యక పెనఁగి వాని మానిసి యెకిమీఁ డెంతయుఁ గలంచి యేడ్తెర సూపెన్ | 523 |
| తే. | మిడుఁగురులు తీఁగమంటలు మెఱుఁగు లడరు వెలుఁగు కోలలు పఱపి యవ్వేల్పుసూడు తేరు టెక్కెంబు మాతలి వారువములు గనఁబడక యుండునట్లుగాఁ గప్పి మఱియు | 524 |
| ఆ. | కడిఁది వాఁడి తూపు లొడయని మేనున యందు గ్రుచ్చి తద్దఁ గుందఁ జేసె నపు డగస్త్యు డచటి కరుదెంచి ఱేని దీ వించి యిట్టులనియె వెరవు మీఱ | 525 |
| క. | కడిఁది మొనగాడ! మానిసి యొడలూనుట నీకుఁ దెల్వి యొదవదు జగముల్ పొడమం జేయఁగఁ బ్రోవఁగ నుడిగింపఁగ నెపుడు నీవ యొడయఁడవు గదా! | 526 |
| క. | నీ తెఱఁగరయఁగఁ దెమ్మెర మేఁతరి వంగడపు ఱేఁడు మిను సికవాడుం దాతయు నాతని నాఁతియు నేతురె? యొక్కించుకైన నిక్కువ మొదవన్ | 527 |
| తే. | ఇపుడు నీ దొడ్డతన మీవె యెఱిఁగికొనుచు నడరి మీ వంగడంబున కొడయఁడైన వేయి చేతులసామిని వేఁడుకొనుము తలపు లీడేరునని తెల్పి తపసి చనిన | 528 |
| తే. | అంత రాచూలి దమ్మి ప్రోయాలి మగనిఁ బూజ లొనరించి యెనలేని తేజుఁ గాంచి మరలఁ బోరికి మొనసి విల్మొరయఁ జేయఁ దడవ యీరేఁడు జగములు వడఁకఁ దొడఁగె | 529 |
| ఆ. | రాచపెద్దయైన రాగవుఁ డప్పు డ మ్మేటి సోఁకుజోదు మీద మూఁడు తూపులేసి నెన్నుదురు మూఁడు ములుకుల నల్ల దొరఁగఁ జేసి పెల్లడంచె | 530 |
| క. | ఇరు నెమ్మొగముల దేవర కరణి న్ముడివడిన పది మొగమ్ముల జోద ద్దొర ఱొమ్ము వేయి ములుకులఁ గర మరుదుగ వ్రచ్చి నల్లగారఁగఁ జేసెన్ | 531 |
| మ. | విలునేర్పున్ గయి బల్మియున్ మెఱయఁగా వేండ్రంపు క్రొవ్వాఁడి ము ల్కులు నారి న్బెరయించి రాగవుఁడు సోఁకుంబెద్ద మేనెంతయున్ నలియ న్వ్రేసి కడింది బొందళము కిన్కం జించి పెక్కమ్ములం జల మొప్పారఁగ నెన్నొసళ్ళు పగిలించం దూలెఁ వాడెంతయున్ | 532 |
| ఆ. | తూలి పెద్దకొండ పోలికఁ దేరిపై సోలియున్నఁ జూచి కాలకేతుఁ డరద మపుడు సరగ దురమున కెడముగాఁ దోలుకొని కడంకతోడఁ జనియె | 533 |
| తే. | అంతఁ దెలివొంది రావణుఁ డతనిఁ జూచి యకట! పగతురు నగఁగ నిట్లరద మేల తొలఁగఁ దెచ్చితి నీవెల్ల దురములందుఁ జూడవైతివె? నా లావు చొప్పు ముందు | 534 |
| క. | అని పలికి మరల నరదం బనికిన్ దోలించి బీర మలరారఁగ రా మునిఁ దొడరి మెఱుఁగుటమ్ముల విను ద్రిమ్మరు లడలఁ బెక్కువేలు నిగుడ్చెన్ | 535 |
| క. | వేలుపుటరదముపైఁ దే జీలపయి న్మఱియు రాచసింగముపై మే ల్డాలుపయిన్ మాతలిపై వాలారుం దూపుగములు వావిరిఁ జొనిపెన్ | 536 |
| క. | పొలదిండి ఱేని బలు తూ పులు దద్దయుఁ గప్పుకొనినఁ బొల్పుగ నెకిమీఁ డలరెఁ తొలిమొగుల నడుమన్ వెలుఁగొందుచునుండు వేఁడి వేలుపు పగిదిన్ | 537 |
| క. | వలకాలు ముందటికి డా పలికాల్ సాఁచుకొని నిలిచి బలిమి నపుడ ని ప్పులు గ్రక్కు ముల్కు లా రా నెల రక్కసుమీఁదఁ బఱపి నెఱఁకులు సించెన్ | 538 |
| క. | అప్పగిది గెలుపు తలఁపులు డెప్పరమై పెనగొనం గడిందిగ సతనా ళ్ళొప్పగఁ బోరిరి నిదురయు దప్పియుఁ గానక కడుం గడంకల నంతన్ | 539 |
| చ. | వఱడులు గూసె దేరిపయి వావిరి గ్రద్దలు వ్రాలె గుఱ్ఱముల్ నెఱిసెడి గన్గొలంకులను నీళ్ళు పొరింబొరి గ్రుమ్మరించె వే మఱు బయినెత్తురుల్ గురిసె మబ్బులు రక్కసి మన్నెగానికిన్ దఱచుగ గీడ్తెఱంగులు గనంబడె నయ్యెడ వేల్పు లుబ్బగన్ | 540 |
| క. | అవి సూచియు నాతఁడు పిఱు తివియక డెందంబులోన దిటమూనుక రా గవుఁ దొడరి పెక్కులాగుల బవరం బొనరించుచుండెఁ బదిలుండగుచున్ | 541 |
| వ. | అప్పుడు, ఆ సమయమందు | 542 |
| సీ. | కప్పుకుత్తుకసామి కంటిమంటలఁ బోలు తూపులు బుజముల దూఱ్చి దూఱ్చి మిత్తికోరలతోడ మేలమాడు మెఱుంగుఁ గోలలు ఱొమ్మునఁ గ్రుచ్చిగ్రుచ్చి పిడుగులకెనయైన బెడిదంపు ములుకులు ప్రక్కల నఱిముఱిఁ బఱపి పఱపి విసము గ్రక్కిన మేటి వీనుల కంటి వా ల్చెనయు గిట్టలు మేనఁ జొనిపి జొనిపి | |
| తే. | మగతనంబుల గనియన దగిన బంతి మెడల పొలదిండి నెంతయు బడలు పఱచి వారువంబుల గుందించి తేరు గడపు ప్రోడ దూలించి మఱియు నప్పుడమిఱేడు | 543 |
| క. | అఱ క్రొన్నెల తూపొక్కటి పఱపి వెసన్ వాని తేఱి పడగలు గూల్చె న్నెఱ ఱంపపు బల్లెంబుల గుఱిమీఱఁగఁ తలలు జేయి గొమ్మలు దునిమెన్ | 544 |
| క. | తునిమిన తలలుం జేతులు మునుపున్న తెఱఁగున మఱల మొలచె, మొలచినన్ గని రెండలుగులు దాఁకక చనెనో? తాఁకియును ద్రెంపఁ జాలక చనెనో? | 545 |
| ఆ. | అనుచు సందియంబు పెనగొన నించుక దడవు నిలిచి చూచి కడక గఱకు చిలుకులేసి తలలు చేతులు ద్రుంచిన అపుడె మరల మొలిచె నబ్బురముగ | 546 |
| క. | మొలిచినఁ గడు వెఱఁగొందుచుఁ దొలుతటి చందమున మఱియుఁ దునిమెఁ దునిమినన్ దలకీలు మలచి నట్టుల వలనుగఁ జేతులును దలలు వైళమ మొలిచెన్ | 547 |
| క. | ఎడపక సింగిణి తూపులు దొడిగి తలలుఁ జేయిగములు దునుమ నొడయఁ డ ప్పుడె కడు కడిఁదిగ వెండియుఁ బొడమునని జగంబు బీతుపూని వడంకన్ | 548 |
| క. | తెగు తలలు మొలుచు తలలుం దిగువంబడు తలలు మొగిలు తెరువునకు వడిన్ నెగయు తల లప్పు డబ్బుర మగుచున్ జగమంత్రగాని యాటయ పోలెన్ | 549 |
| క. | పడియెడు తలలుం జేతులు నడరించు లకోరిగములు నన్నన్న! నెఱి న్నుడువుల పొలఁతుకకైనన్ దడవుల నిడు పనికినైనఁ దరమే యెన్నన్ | 550 |
| ఆ. | తునిఁగి యెగయు తలలు దొర సిమ్ము ములుకులుఁ గేరియాడు కాకి గ్రెద్దగములుఁ జదల గప్పుకొనిన జగము చీఁకటి గ్రమ్మి పవలు రేయిఁ దెలియఁబడక యుండె | 551 |
| ఆ. | అట్టులేసి యేసి యలపును విసుకును వెఱఁగు బొడమి రాచవేల్పు ఱేఁడు సేయునది తెలియక చిన్నఁబోవుచు బిగి యుడిగి మోము వంచి యూరకుండె | 552 |
| సీ. | అపుడు విభీషణుం డద్దొరఁ జూచి యి ట్లని పల్కె నెకిమీఁడ! వినుము వీని బొడ్డున వెన్నుని బొడ్డు బిడ్డని మెప్పు వలన వేల్పుల బువ్వ గలిగియుండు నది యింకిపోవఁజేయక యున్న నిక్కూళ వొలియఁడు నాఁగ నప్పుడమి ఱేఁడు సిచ్చుఱ బల్లెంబుచే నది యింకించి మఱి నూటతొమ్మిది మార్లు తలలు | |
| తే. | చేయిగొమ్మలు దునిమివైచిన చెనంటి పొలసుమేపరి జోదొక తలను రెండు చేతులును గల్గి నిలిచె జేజేలు మింట మిగుల నలరుచు రామునిఁ బొగడిరంత | 553 |
| క. | తన గుట్టు పగతునకుఁ దె ల్పెను వీఁడని కినిసి యవ్విభీషణుపై స త్తిని నిగుడ్చె రావణుం డది తునియలుగా నొడయఁ డొక్క తూపునవైచెన్ | 554 |
| క. | తలయొండు రెండు చేతులు గలిగియు రక్కసుఁడు దొంటికంటె నసం బ గ్గలమై పెనఁగొన రాముని నెలసి పెనంగుచు లకోరు లేయుచునుండెన్ | 555 |
| తే. | అపుడు మాతలి భరతుని యన్నఁ జూచి నేలతాలుప! యింక జాగేల? వీనిఁ దునుముమని తెల్పుటయు రాచ తొగలఱేఁడు బొమ్మయమ్మేర్చి యరిఁ గూర్చి నెమ్మి నేసె | 556 |
| సీ. | ఏసిన నక్కోల యేడ్తెఱఁ బదివేల వేఁడి వెలుంగుల వెలుఁగు గలిగి జగము లుడుపుతఱి నెగడెడు నగ్గి చం దానఁ దద్దయు మంట లీనుకొనుచు సత పయ్యరలును వేగ (రేగి)తొడంగి యడరు కై వడి నబ్బురంపు నెవ్వడి నెసంగి కఱివేల్పు సుడివాలుకంటె ముక్కంటి ము మ్మొనల వాల్కంటెను ముఱువుమీఱి | |
| తే. | యెల్ల పజలకు బలితంపు టెడరు దోఁప నుద్దవిడి నేఁగి రాకాసి పెద్ద ఱొమ్ముఁ గాఁడి యుసురులు దొలఁగించి గాడ్పుదిండి ప్రోలు గన్గొని క్రమ్మఱఁ బొదినిఁ జొచ్చె | 557 |
| తే. | నెత్తురులఁ దోఁగి బవరంపు నేలఁ ద్రెళ్ళి సోఁకుదొర యొప్పె గట్టులసూడు ఱాతి వాలుచేఁ బడ్డ జేవురు వాఁగు గముల తో నెనయు మేటి గుబ్బలితో దొరయుచు | 558 |
| తే. | అపుడు జేజేలు ఱేనిపై నలరువానఁ గురిసి వేలుపు బేరులు మొరయఁ జేసి రెలమి నచ్చర లాడిరి చలువతావి తెమ్మెరలు వీఁచ జగములు తెలివి నెసఁగె | 559 |
| సీ. | అంత విభీషణుఁ డాలంపుఁ బుడమిలోఁ బడియున్న తన యన్న కడకు జేరి పలుచందముల వెతఁబడుచుఁ దద్దయు నేడ్చి పిదప మందోదరి మొదలు గలుగు నల్లద్రావుడు ఱేని నగరి పడంతుక లచటికిఁ బఱతెంచి యార్పు లెసఁగఁ దమ సామిపైఁ బడి తలగని వ్రంతల నొఱలుచుండఁగ వారి నూఱడించి | |
| తే. | మరలఁ బ్రోలికిఁ బోఁబంచి యెఱచిదిండి మిన్న రాముని యానతి నన్న కగ్గి పనులు లోనగు వెనుకటి పనులు ప్రాఁత పలుకు జాడల నొనరించి యలరు నెడల | 560 |
| ఆ. | పుడమిఱేఁడు తోడఁబుట్టువుఁ జూచి యీ ప్రాఁత వేల్పు మేలిబంతిఁ దోడు కొనుచుఁబోయి యచట గొబ్బున లంకకు నెమ్మి దొరను జేసి నిలిపి రమ్ము | 561 |
| ఆ. | అనుచు నానతిడిన నాతఁ డాతనిఁదోడు కొనుచు దీవికేఁగి కోఁతిబంట్ల నపుడె పనిచి పున్నియపు టేర్ల నీరు దె ప్పించి యొజ్జపిండుఁ బిలువఁ బంచి | 562 |
| తే. | మేలి యపరంజి పనికొల్పు మేడలోనఁ బెద్ద రతనాల సింగపుఁ బీఁట మీదఁ బొలసు మేపరి యెకిమీని నిలిపి నీరు పైనిఁ జిలికించి నొసల హొన్బట్టుఁ గట్టి | 563 |
| క. | చలివెలుఁగు ప్రొద్దు రిక్కలు చిలువల యెకిమీఁడు పంటచెలి రాము కత ల్గలయన్నినాళ్ళు దొరవై యలరుచు నిద్దీవి యేలుమని దీవించెన్ | 564 |
| తే. | అట్లు దొరయై విభీషణుఁ డపుడె మాని కంపు దొడవులు బసిడి పుట్టంపుగములు నింబుగాగొని లక్ష్మణు వెంబడి జని కడఁక రాసింగమున కుడుగర లొసంగె | 565 |
| క. | ఒసఁగిన నెకిమీఁ డవి నెన రెసఁగఁగ మాతలికి నిచ్చి యిమ్ముగ వేల్పుం బసకుం బనిచిన నాతడు వెసఁ జనె రాతొగల ఱేని వీడ్కొని యెలమిన్ | 566 |
| క. | అంతట దొర రక్కసి మే ల్బంతింగని దీవి కీవు పనివిని మా లా గంతయును దెలిపి పంట ప డంతి నిసుఁగుఁ దోడుకొని కడంకన్ రమ్మా! | 567 |
| క. | అని పనుప నతఁడు గొబ్బునఁ జని కొందఱు ప్రాఁతవేల్పు చానల నారా ముని చెలి నలరించుటకుం బనిగొల్పిన వారలేఁగి బత్తి దలిర్పన్ | 568 |
| తే. | పుడమిచూలికిఁ దలయంటి యొడలు నలిచి వలపు గొజ్జంగి పూనీట జలకమార్చి మడుఁగు పుట్టంబుఁ గట్టి బల్మానికంపు రవణములు వెట్టి యలరు సరములు వైచి | 569 |
| తే. | కుందనపు టందలంబునఁ గొమ్మ నునిచి తెచ్చుటయు నాతఁ డా రాచ మచ్చెకంటిఁ దోడుకొని తద్ద వేడుకతోడ నేఁగి నేలతాలుపు తలమిన్న మ్రోల నిలిపె | 570 |
| క. | నిలిపిన రాగవు డన్నెల తల తలమానికముఁ జూచి తలవంచి మదిన్ దలముగ వగపును నానయు నలుకయు బొడమంగ నిట్టులని వాక్రుచ్చెన్ | 571 |
| క. | సకియ! మగపాడి కొఱ కె న్నికగాఁ బగతుని నడంచి నినుఁ జెఱలోఁ జి క్కక యుండు నట్లొనర్చితి నిఁక నీ మది వచ్చుచోటి కేఁగుము నెమ్మిన్ | 572 |
| మ. | ఒరునింటన్ జెఱనున్న చేడియను లో నొక్కింతయు న్నాన లే క రహిం జేకొనువాని నొల్ల రరయంగా బల్లిదు ల్బీరముల్ నెరపం జాలెడు రాచమానిసి మది న్నేర్పేది యిచ్చేఁత కే కరణిం జొచ్చు? నటహోట నొప్పదు నినుం గైకొంట మా కుగ్మలీ! | 573 |
| ఆ. | అనినఁ దద్ద యొఱలి యుమ్ముద్దరా లిట్టు లనియె నిట్టి కఱకు లాడనేల? ఱేఁడ! నిన్నె మదిని ఱేపును మాపును దలఁచుచుందు నొండు తలఁపు మాని | 574 |
| క. | పలువ తొలివేల్పు చేబడి పలువంతలఁ గుంది కుంది బడలిన దానిన్ గలచుట పాడియె? యిపుడ గ్గలముగ నో పున్నియంపు గని! తగ నీకున్ | 575 |
| ఆ. | వేయునేల? వినుము రాయఁడ! నీ వెద నమ్మకుంటివేని నెమ్మి నగ్గి సొచ్చి వెడలుదానఁ జెచ్చెర నానతి సేయుమింక జాగు సేయవలదు | 576 |
| ఆ. | అనిన రాముఁ డట్ల యొనరింపు మనుచు ల క్ష్మణుని బలుక నతఁడు గట్టె లెన్ని యైన వామివైచి అగ్గి రవుల్కొనఁ జేయ మిన్నుముట్టి చిచ్చు పెరిఁగె | 577 |
| తే. | అప్పు డప్పంట వాల్గంటి యనుఁగుఁబట్టి దంట మోముల సామికి దండమొసఁగి ఱేని యడుగులు డెందమ్ములోన నిలిపి బెగడు పూనక సొదఁ జొచ్చె జగము లదర | 578 |
| ఆ. | చొచ్చుటయును గాడ్పు నెచ్చెలి తన వెచ్చ దనము మాని చల్లఁదనము పూనెఁ గెంపుఱాల నడుమ సొంపారు పసిఁడి స లాకపోలె సీత లలిఁ దనర్చె | 579 |
| వ. | అట్టియెడ | 580 |
| సీ. | ఏనుంగు మేఁకపో తెనుబోతు మానిసి మొస లిఱ్ఱి గుఱ్ఱము పసులఱేఁడు ఠీవియుఁ దేజుఁ బాడియు మగంటిమి తాల్మి వడి కల్మి యుడివోని కడిఁది మేలు మగఱాతివాలు సత్తి గుదియ బల్లెము త్రాడు టెక్కెము కత్తి దండి విల్లు వేల్పులు మినుకులు పెతలు రక్కసు లేర్లు తావులు జక్కులు తపసి బూచి | |
| తే. | గములు నెక్కిళ్ళు నోజలు గైదువులును గొలుపులుగ నొప్పు గట్టులగొంగ యగి జముఁడు తొలివేల్పు పడమటి సామి గాలి చాగకాఁడును నెలతాల్పు మూఁగి కొలువ | 581 |
| క. | నలుమొగముల వేల్పును గ్రొ న్నెల తాల్పును వచ్చి యచట నిలిచి పుడమిపై దలి యల్లునిఁ గనుగొని నెన రలరఁగఁ గడుఁ బొగడి యిట్టులని పల్కి రొగిన్ | 582 |
| క. | ఒడయఁడ! వేల్పుల కొఱ కి య్యొడలూని చెనంటి సోఁకుటొడయని నని ను క్కడఁచితివి నీవు వెన్నుఁడ వడరఁగ నీ యింతి సిరుల య న్నరయంగన్ | 583 |
| క. | కావున గరితల రతనం బై వెలసిన యవ్వెలంది యందఱ విందున్ గావింపఁగ గైకొని నీ ఠావునకుం జను మెదం గడంక దలిర్పన్ | 584 |
| సీ. | అని తెల్పి వేలుపు లందఱుఁ దమతమ నెలవుల కరిగిన నేలఱేఁడు గడు కూర్మి నమ్మన్ను కానుపుఁ గైకొని సోఁకురాయఁడు ప్రొద్దుచూలి గాలి కొడు కంగదుఁడు నల్వకొమరుఁడు మొదలగు దొరలును దమ్ముఁడు బెరసి కొల్వ నలరొందఁ బుష్పకం బనియెడు తేరెక్కి కొలఁకు లేఱులు పల్లియలు నడవులు | |
| తే. | పూవుఁబోడికిఁ జూపుచుఁ ద్రోవలందుఁ బొసఁగ జడదారు లొసఁగెడు పూజ లెల్లఁ గొనుచు సరగ నయోధ్యకుఁ జని తిరం బె సఁగఁ బజలఁ దన్పుచును దమ నగరు సొచ్చె | 585 |
| తే. | చొచ్చి తల్లుల మువురికి జోత లొసఁగి యొజ్జలకు మ్రొక్కి దీవన లొనరఁ గాంచి తమ్ము లిరువురు నెఱిఁగిన నెమ్మిఁ గౌఁగి లించి చుట్టలఁ జెలుల మన్నించి మిగుల | 586 |
| తే. | పుడమి బొట్టియ యత్తల కడర మ్రొక్కి తోడి కోడండ్ర సంగడి చేడియలను నెనరు దైవారఁ గౌఁగిటఁ బెనచి జన్ని కట్టు ముత్తైదువలఁ దద్ద గారవించె | 587 |
| సీ. | అంతట రాగవుఁ డెంతయు నెలమితో నొక మంచి ప్రొద్దున నొజ్జయగు వ సిష్ఠుండు ప్రెగడలుఁ జెలఁగి పసిండి ప ట్టియ నెన్నొసలఁ గిట్టి ఠీవి మెఱయఁ దెల్ల డాల్మెకపు గద్దియఁ గూరుచుండఁ బె ట్టిన నిచ్చలపు దొరతనము పూని పుడమి వేల్పుల కెల్ల దొడుకులు నేలయు రొక్కంబుఁ దొడవులు జక్కిగములుఁ | |
| తే. | బుట్టములు దెట్టెలుగ నిచ్చి చుట్టములకు బట్టులకుఁ బేదలకుఁ గోరినట్టు లొసఁగి యింపు సొంపులు వెలయంగ నెల్లఱకును బోనములు వెట్టి వేడ్కలఁ బొదలఁ జేసి | 588 |
| తే. | మఱియు సుగ్రీవుఁడును దీవి మన్నెగాఁడు గాలిచూలియు నీలుండు వాలికొడుకు వెనుకచూపుల మెకము ఱేఁడును మొదలగు బల్లిదులనెల్లఁ గూర్మి దైవారఁ బిలిచి | 589 |
| ఆ. | దొడ్డ మానికంబు దొడవులుఁ జీరలుఁ గలపములును మంచిగందపొడులుఁ దమ్ములములు నొసఁగి యిమ్ముల కనిచినఁ జనిరి వారు సంతసమున మరలి | 590 |
| తే. | అంత రాముఁడు వేడుక లలర నేల చూలితోఁ గూడి నెమ్మదిఁ జొక్కి పెక్కు జన్నములుఁ జేసి పజల నిచ్చలును బాడి యెసఁగఁ బ్రోచుచు జగమెల్ల నేలుచుండె | 591 |
| సీ. | అనిదిండి జడదారి చినుకుపూసల క్రోవ మగఱాలు వెన్నెలల్ తొగలఱేఁడు గిబ్బిడాల్దొరగుండు కబ్బంబు ప్రోయాలు లిబ్బి గుబ్బెత యబ్బ బొబ్బమెకము విన్ను కేళాకూళి వేల్పుల బోనము తడవుల నిడుపఁడు పుడుకు దొడుకు తూడుమేపుడు పుల్గు దూర్పురాయని జక్కి మొల్ల క్రొవ్విరి యెత్తు ఱెల్లుపువ్వు | |
| తే. | నురువు లద్దంబు పాలు కప్పురపు బూది సంకురిక్కలు మంచు నీరింకుమొగులు తన యసంబున కెనగాక పెనుపు డింప వెలసె నమ్మన్నుతాలుపు వేల్పుఱేఁడు | 592 |
| తే. | అనుచుఁ దెఱగంటి తపసి రామాయణంబు నీళ్ళరాయని గాదిలి నిసుఁగు తోడఁ దెలిపె నిది విన్న వ్రాసిన లలిఁ జదివిన సిరులుఁ గోర్కులుఁ బున్నెంబుఁ జెందుఁ బజల | 593 |
| తే. | తెనుఁగుఁ జదువునఁ బున్నియం బెనయ దనుచుఁ గొందరాడుదు రాడినఁ గొఱఁతయేల? మును ‘మరా’యంచు నుడివిన చెనఁటిబోయ నెఱ నిరాబారి యగుటయె గుఱుతుగాదె | 594 |
| తే. | పొత్తములఁ దొంటి పెద్దలు హత్తుకొలిపి నట్టి తెఱఁగున నుడువు లందన్నియెడల గుఱి యరసి చూచి నెమ్మదిఁ గూర్చి నాఁడ సందియం బెన్నకుఁడు నెఱజాణలెల్ల | 595 |
| తే. | పుడమి నీ పొత్త మెప్పుడు ప్రొద్దు నెలయుఁ జుక్కలును గల్గు నన్నాళ్ళు సొరిది ప్రోడ లిండ్లఁ గోరిన కోరిక లిడుచు నిడుమ లుడుగఁ జేయుచుఁ దిరమయి యుండుఁగాత | 596 |
| వ. | అని పలికి | 597 |
| సీ. | పులి కలాసము పాఁప ప్రోఁగులు క్రొన్నెల పూవు విన్క్రొమ్ముడి పునుకసరులు వెలిబూదిపూఁత ప్రాఁబలుకు టందియలు హొ న్గుబ్బలి సింగాణి గిబ్బమావు కప్పుకత్తుక వెట్టకన్ను ముమ్మొనవాలు కంకటికోడు లేజింకపిల్ల జక్కర కీల్జడ చౌవంచ మోములు పుతికబోనమ్ము బల్బూచిదిండు | |
| తే. | దచ్చి రూపులు కొండప్రోల్నిచ్చ పంట వలఁతి యరదంబు సంద్రము బత్తలికయు వన్నియగ మేన గట్టురా కన్నియయును గలుగు జగముల గండరగండ వేల్ప! | 598 |
| క. | కొక్కును నట్టువ పక్కియు నెక్కుడులుగ నమరు కొమరు లిరువురు మ్రోలన్ నిక్కుచునాడఁగ నెలమిన్ జొక్కెడు వేలుపులరాయ! సోకుడురాయా! | 599 |
| పణవవృత్తము | జేజేరాయఁడు సిరిగేస్తుండుం దేజుల్ మీఱఁగ దిటమౌ బత్తిన్ వే జోహారులు నెఱిఁ గావింపన్ బూజం జెందుచుఁ బొనరా ర్మేటీ! | 600 |
| గద్యము | ఇది శ్రీమదుమారమణ కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర పవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధజన విధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబయిన యచ్చతెలుఁగురామాయణ మహాకావ్యంబునందు యుద్ధకాండము సర్వ మేకాశ్వాసము. |