ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
జంబుమాలి వృత్తాంతము
79నొకనాఁడు లక్ష్మణుండుదయకాలమున
నకలంక చిత్తుఁడై యన్నకు మ్రొక్కి
కందమూలఫలాదికములు దెచ్చుటకు
నందంద వనముల నరయుచు నరిగి
యున్నతంబగుచున్న యొక గిరిఁగాంచి
మిన్నక యచ్చోట మెలఁగుచున్నంత:
మహియెల్ల దేదీప్యమానమై వెలుఁగ
నహిమాంశుకల్పితంబగు ఖడ్గమొకటి
భీషణ జలదగంభీర ఘోషంబు
80ఘోషించి,యిది యేమొకోయనఁబలికె.
“నందుకొ మ్మింక దైత్యాధీశతనయ!
పొందుగా నీ తపంబునకుఁ దామెచ్చి
భానుండు వనిచె నీ పగ నీఁగ నన్ను;
81మానుగఁగొను.”మన్న మఱివాఁడువల్కె.
82“మెల్లనె తా వచ్చి మెచ్చి నా కీక
యొల్లఁబోకలు సేసె; నొల్లఁ83బో నిన్ను;
నలఘుతపంబెల్ల84నాఱడి, గలసె;
వలసినకడ కేఁగు వనజాప్తహేతి.”
యని పల్కి తొల్లింటియచలసమాధిఁ
దనరఁగనుండె.85నంతట లక్ష్మణుండు
విపులాద్భుతమునొంది వెస దానిఁజూచి
యుపమతో డగ్గఱి యొడిసి86చేపట్టి
నిపుణుఁడై పరికించి నృపకుమారుండు
“తపసుల కెల్ల నాధారమైనట్టి
ఫలవృక్షములుద్రుంపఁబాడిగా.”దనుచు
గలయఁగ్రుమ్మరుచునగ్గలిక 87నొక్కెడను
విలసిల్లునొకగొప్పవెదురుజొంపంబు
మలసి ఖండింపఁదన్మధ్యభాగమునఁ
దెగి యొక్కమౌని మేదినిఁగూలుటయును
నిగుడెడుమూర్ఛ మునింగి సౌమిత్రి
యట గొంతసేపున కల్లనఁదెలిసి:
“కటకటా! సకలలోకములు నిందింప
బ్రాహ్మణుఁజంపితిఁబరికింపలేక;
బ్రహ్మహత్యాదోషభరితుండ నైతి.
నే నేలవచ్చితి నింతదవ్వులకు?
నేనేల యీ ఖడ్గ మిట్లు గైకొంటి?
ననుపమధర్మాత్ముఁడగురామచంద్రు
ననుజుఁడ నగు నాకు నధికపాపంబు
సమకూడె; నీ మునీశ్వరుఁడెవ్వఁడొక్కొ?
సమయఁజేసితి; నింక జానకీవిభుఁడు
విని నన్ను నేమని విడనాడునొక్కొ?
పెనుపేది మునులు శపింతురో పట్టి?
చెప్పకుండఁగ రాదు; చెప్పకపోదు;
తప్పెఁగార్య!”మటంచు“దైవమా!”యనుచు
నడలుచు నల్లన నడుగులు వడఁక
సుడివడి బ్రమయుచుఁజొప్పుదప్పుచును
నడతెంచి:“దశరథునకు గురు88భక్తుఁ
బడనేసి చంపినపాపంబు వచ్చెఁ
దండ్రికివలెనె నందనునకుఁగలిగె
నండ్రు భూజనులెల్ల.”నని తల్లడిలుచుఁ
దమయన్నఁజేరి గద్గదకంఠుఁడగుచుఁ
గ్రమమేది వడఁకుచుఁగడఁగి మ్రొక్కుటయు
ననుజుని నెత్తి యొయ్యనఁగౌఁగిలించి
కనుఁగవ నీరు గ్రక్కనఁజేతఁ దుడిచి
యనుకంపమదిఁబర్వ ననియె రాఘవుఁడు
“అనఘ!నేఁగలుగ నీ కడల నేమిటికి?
ధర్మవర్తనుఁడ;వు89దార 90శీలుఁడవు;
నిర్మలాత్మకుఁడవు; నీతిమంతుఁడవు;
దశరథక్ష్మాపాలతనయమాన్యుఁడవు;
పశుపతివిక్రమప్రకటశౌర్యుఁడవు;
నన్న! నీ మొగమేల యటు సిన్నవోయి
యున్నది;యేర్పడ నొగిఁజెప్పు.”మనిన
జయశాలియైనలక్ష్మణుఁ డిట్టులనియె.
“భయనివారణ! నీదు పంపునఁబోయి
వన91మూలఫలములు వల92యునన్నియును
గొని యేను మెలఁగుచోఁగ్రూరఖడ్గంబు
ఒక్కటి93మింటరా నొడిసి చేపట్టి
వెక్కసమగు నొక్క వెదురుజొంపంబు
నఱకితి; దాన నున్నతుఁ డొక్కమౌని
యొఱలుచు ధరఁగూలె94నుగ్రుఁడోయనగ
నా నేరమికిఁగుంది నరనాథచంద్ర!
రా నేరకుండియు రా నేరవలసె.”
ననవుడు రఘురాముఁడాశ్చర్యమంది
యొనరఁగార్యము మది నూహించుచుండె.
నంత నక్కడిమును 95లందఱుఁగూడి:
“యెంతయు నీ తెఱంగెఱిఁగింత.”మనుచుఁ
జనుదెంచి రఘురామచంద్రు దీవించి
ఘనతరమృదువాక్య గరిమ నిట్లనిరి:
“అఖిలేశ!వినుము,నీ యనుజన్ముఁడిప్పు
డఖిలలోకద్రోహియైన రావణుని
చెలియలికొడుకు నేచినజంబుఁడనెడు
తులువ నిర్జించె; నే దోషంబు లేదు;
మునులెల్ల సంతసంబునఁబొంది రధిప!’
యనవుడు రఘురాముఁడనియె మౌనులకు
“నే వేల్పుఁగొల్చి వాఁ డిట్టితపంబుఁ
గావించె; ఖడ్గమెక్కడనుండి వచ్చె?
నంతయునెఱిఁగింపుఁ.”డనిన నా భూమి
కాంతునితో మునిగ్రామణులనిరి:
“తొల్లి దశాస్యుండు దోర్బలశక్తి
నెల్లదిక్కులు గెల్వ96 నేఁగుచో మదిని
97ఒరుల నమ్మఁగలేక సోదరిమగని
నురుపరాక్రముని విద్యుజ్జిహ్వుఁబిలిచి,
మన్నించి;“లంక యేమఱకుమీ!”యనుచు
సన్నుతిఁగాపుంచి చనియె. నంతటను,
“ఏను మాయలు నేర్చి యీ దశకంఠు
రా నీక లంకాపురంబుఁగైకొందు.”
ననుచు విద్యుజ్జిహ్వుఁ98డంతఁబాతాళ
మున కేఁగి రాక్షసముఖ్యులదండ
మహితమాయోపాయమంత్రవాదములు
గ్రహవాద,ఖిలవాద,గారుడక్రియలు
విషవాద,రసవాద,కృతకృత్యములుఁ
దృషదీరఁగా నేర్చి ధీరుఁడై మఱియుఁ
బాయక వారిచే బహుళంబులైన
మాయలు నేర్చుచు మదవృత్తినుండ;
నచ్చట రావణుం డఖిలదిక్పతుల
విచ్చలవిడి గెల్చి వెస లంకఁజొచ్చి
99కనలి విద్యుజ్జిహ్వుకథలెల్లఁదెలిసి
కనుఁగవలను నిప్పుకలు నివ్వటిల్ల:
“నా యాజ్ఞ నుండక నలిరేఁగి వీఁడు
పోయి మాయలు నేర్వఁబోవుఁగాకేమి?
మాయలన్నియు నేఁడు మాయమైపోవఁ
జేయుదు.”నంచు నజేయుఁడైఁయరిగి
అస్మయనగరవాసాసురుల్‌ బెగడ
విస్మయకోపుఁడై వెస హేతిఁబెఱికి
“మఱఁది! నా చెలియలిమగఁడీతఁ.”డనక
తఱిమి విద్యుజ్జిహ్వుతలఁ ద్రెవ్వనేసి
క్రమ్మఱ వేగ లంకకు నేఁగుదెంచి
“ర.”మ్మని చెలియ శూర్పణఖ నూరార్చి
100యనియె:“నీ విచ్ఛావిహారిణి వగుచు
మనమున నీకు సమ్మతమైనపురుషుఁ
బొందుచు వెఱవక పూని లోకముల
యందుఁజరింపు,పొ.”మ్మనిన నార్నెలల
గర్భిణియై యున్న కతనఁ బైనెలలు
నిర్భరగతి నిండ నెలఁతుక గాంచెఁ
జటులోగ్రబలుఁడైన జంబుకుమారు.
నటవాఁడు వెద్దయై యా తల్లిచేతఁ
దన జనకుని చావు దప్పక తెలియ
విని తండ్రిపగ దీర్ప వెరవు చింతించి:
“బ్రహ్మనుగూర్చి తపంబు సేసినను
బ్రహ్మవరంబీఁడు; భవునిఁగొల్చినను
అతనిభక్తుఁడుగాన యలుగఁడాతనికి;
నతులితగతి విష్ణు నర్థింతునేనిఁ
జాల నాతఁడుమెచ్చి చనుదెంచి వరము
పాలించు టెపుడు! నా పగదీఱుటెప్పు!
డరయఁద్రిమూర్తులౌహరిహరబ్రహ్మ
లరవిందహితరూపమై యుందురండ్రు.
కావున, రవిఁగూర్చి ఘననిష్ఠఁదపముఁ
గావించి మెప్పించి కదనరంగమున
దనుజనాయకుఁడైన దశకంఠుఁద్రుంతు.
నని యెంచి తపము సేయఁదొడంగె.నంత;
వనరుహాప్తుఁడు మెచ్చి వరఖడ్గ మొకటి
పనిచె దానవునకుఁ బగనీఁగుటకును.
దానిఁగైకొనఁడయ్యె దర్పాంధుఁ101డగుచు
నా నిమిత్తమున నీ యనుజున కబ్బె
నా హేతి. యటుగాక యసురచేఁబడిన
సాహసంబున నేఁచు జగములన్నియును
దైవకృతంబున దైత్యుండు 102వొలిసె.
నీ విచారంబేల యినవంశతిలక!
కలన రావణుగెల్చెఁగార్తవీర్యుండు;
చలమొప్ప నాతనిఁజంపె భార్గవుఁడు;
నట్టిభార్గవరాము ననిలోనఁబట్టి
కొట్టితి బీరంబుఁగ్రొవ్వును నణఁగ.
103నట్టి నీచే రావణాదిరాక్షసులు
గట్టిగా దురమునఁగడతేఱఁగలరు.”
అనవుడు రఘురాముఁడాశ్చర్యమంది
వినతుఁడై మౌనుల వేడ్కతో ననిచె.

  1. జంబుమాలివృత్తాంతము వాల్మీకి రామాయణమున లేదు; భాస్కరరామాయణమునఁ గలదు
  2. ఘోషించుచునువచ్చి కోయని (యనఁ)బలికె
  3. మానకకొను
  4. తెల్లమిగాఁగాంచి తెచ్చి
  5. నే
  6. నవనిపైఁ
  7. నత్తఱి
  8. రాఁదిగిచి
  9. మైనచట
  10. పుత్త్రు
  11. దాన
  12. శూరుఁ
  13. ముల
  14. సి
  15. మిడిసి
  16. నుగ్రవేగమున
  17. లాతెఱంగెల్లఁ, గొంత నిరీక్షించి కూడి యందఱును
  18. నెచ్చోట
  19. సొరిది
  20. డంతఁబాతా
  21. ఘనత
  22. అనయంబు స్వేచ్చా
  23. డగుట
  24. గెడసె
  25. రావణుండాదిగా రాక్షసవరులు - కావున నీచేతఁగడతేఱఁగలరు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )