ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రాముఁడు కౌసల్య నోదార్చుట
బొగులుచుఁ గళలచేఁ బున్నమచంద్రుఁ
దెగడు, రాముని మోము దృష్టించి 149వలికె:
“నాకులభూషణ! నా ముద్దులయ్య!
నా కూర్మి150కొమరుండ! ననుఁగన్నతండ్రి!
క్రేపుఁబాసినయావుక్రియ నిన్నుఁబాసి
యీ పదునాలుగేం డ్లిందుండఁజాల.
నినుఁగూడి చనుదెంతు నిష్ఠురాటవుల.”
కని ప్రలాపించు నయ్యంబ నూరార్చి
యనున యాలాపదీనాస్యుఁడై రాముఁ
డనియె:“నోయమ్మ!యిట్లాడంగఁదగునె?
పతియె ప్రాణపదంబు; పతియె చుట్టంబు;
పతియె దైవంబును బరికింప; నట్టి
పతిఁబాసి నావెంటఁబఱతెంతు ననుట
మతిఁదలంపఁగ ధర్మమా తల్లి! నీకు?
వసుధేశునానతి వసుమతీ151భాగ
మెసగ 152నా భరతున కిచ్చుట దప్పె?
యవనీశుఁడిచ్చెదనన్న యా వరము
లవి రెండుగైకేయి యడుగుట దప్పె?
యనృతంబునకు నోడి యకట! రాజేంద్రుఁ
డొనరంగ వరములిట్లొసగుట దప్పె?
మా తండ్రి యానతి మహి నిర్వహింప
నీ తెఱంగునఁ బూను టిది నాకుఁదప్పె?
చేకొని పతిపంపు సెల్లింపకున్న
153నీకొక్కతెకుఁ దప్పు నిక్కువంబరయఁ
బూని కానల కేను బోయిన 154పిదప
దీనుఁడై పొగులుపార్థివుని నీ వెపుడు
ననునయింపుచు సపర్యల నొనర్పుచును
మనసునుమ్మలికంబు మాన్పంగవలయు.
దురితదూరుండు బంధురపుణ్యరతుఁడు
భరతుఁడు నాకంటె భక్తి నిన్నరయు;
నీవు శోకింపకు. మిఁకఁగలనైన
భావింప దశరథపతియొప్పఁడనకుఁ;
గైకేయి విడువక కలసి వర్తింపు;
నాకు సేమముఁ155గోరు; నను వీడుకొల్పు;
మేను నెమ్మదితోడ నేతెంచుకొఱకుఁ
బూని భూసురుల వేల్పుల నర్థిఁగొలువు.”
మని పల్కి మ్రొక్కిన నా రామచంద్రుఁ
గనుఁగొని కౌసల్య గౌఁగిటఁజేర్చి
క్రమ్మెడుశోకాశ్రుకణము లందంద
వెమ్ముచు రఘురాము వీపున రాల
“నడవికిఁబోయెదే యకట! నీ!”వనుచుఁ
గొడుకు మై నివిరి డుగ్గుత్తిక వెట్టి
యొక్కింత ధృతిఁబూని యుల్లంబులోనఁ
జెక్కుల కన్నీరు సేతులఁ దుడిచి
పావనజలములఁ బ్రక్షాళితాస్య
యై వచ్చి పుణ్యాహ మపుడు సేయించి[వా.రా. సర్గ 25]
“సురలును ఖేచరుల్‌ శ్రుతులును యతులుఁ
దరులును గిరులును దాంతియు శాంతి
నదులును నిధులు నర్ణవము లాకసము
నుదకంబు మారుతం బుర్వియు నగ్ని
దిక్పాలకులు దశదిశలుఁ జంద్రార్క
వాక్పతిప్రముఖులు వలనొప్ప నీకు
స్వస్తి యెల్లప్పుడొసంగుదు.” రనుచుఁ.
బ్రస్తుతి సేసి యా భామాలలామ
పొలుపొంద వేల్పులఁబూజించి రాము
వలచేత నొకరక్ష వలనొప్పఁ గట్టి:
“యలిగి వృత్రాసురు ననిఁజంపబోవు
బలభేదియగు వజ్రపాణికిఁ దొల్లి
యే మంగళములిచ్చి రెల్ల దేవతలు
నా మంగళములు నీకగు రామచంద్ర!
యరుదుగా దివినున్న యమృతంబు దేరఁ
గరమొప్ప నరిగెడు గరుడుని కెలమి
నే మంగళము లిచ్చె హితమతి వినత
యా మంగళములు నీకగు రామచంద్ర!
ఆ తారకాసురు ననిఁజంపఁబోవు
నాతత బలశాలియైన షణ్ముఖుని
కే మంగళము లిచ్చె నింపార గౌరి
యా మంగళములు నీకగు రామచంద్ర!”
అని రాము దీవించి యక్కునఁజేర్చి
కొని మస్తకంబు మూర్కొని నిండుమదిని
ననిపిన తమ తల్లియడుగుల కెఱఁగి
యనుజన్ముసహితుఁడై యచ్చోటు156గదలి
యభిషేకవిఘ్నవృత్తాంతంబు దెలిసి
సభికులు రాజులు సచివులు సకల[వా.రా. సర్గ 26]
పౌరులు శోకింపఁబాదచారమునఁ
జారుచామర సితచ్ఛత్రముల్‌ మాని

  1. చూచి, మఱియు
  2. తనయుండ
  3. భార
  4. నే
  5. నీకైనఁదప్పదు
  6. మిగుల
  7. గోరి
  8. వదలి,వాసి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )