ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
దశరథుఁడు కైకను దెగడుట
గైక నందఱుఁదిట్టఁగా రాజు వినుచు
నా కాంతదెసఁజూచియలుకతోఁబలికె:[వా.రా. సర్గ 38]
“దక్కక పాపంబు దలఁచి రామునకు
నక్కటా! వనవాస మడిగితి గాక
మేదినీసుతయు సౌమిత్రియు నార
లాదరంబునఁగట్ట నడిగితే నన్ను?
నీ మానవతి సీత యింతకుఁదగునె?
యేమి చేసితి నీకు నీతెంపు సేయ?
రాముని వినయాభిరాముఁగాంతార
భూమికిఁదపసియై పొమ్మనుకంటె
మఱియొండుపాపంబు మహిమీఁదఁగలదె?
తఱిమి229చేయుట నాకు ధర్మేతరంబె?
పాపజాతికి నీకుఁబతియైననాకుఁ
బాపంబు గడమయే పరికింప.” ననఁగ
నామాట విని రాముఁడధిపుతో ననియె:
“భూమీశ!ననుఁబాసి230పొడముశోకమున
మా తల్లి కౌసల్య మదిఁగుందకుండ
భాతిగాఁ గృప మీరు పరగ రక్షింపుఁ.”
డనుడు నా దశరథుం డా వాక్యములకుఁ
దనరారుశోకాగ్నిఁ దనచిత్త మెరియ:[వా.రా. సర్గ 39]
“నెట్టిపాపము దొల్లి యేను జేసితినొ?
పట్టి, నా కనుభవింపకపోవ దదియుఁ.
దల్లుల బిడ్డలఁ231దగఁబాపి మిమ్ము
నుల్లంబు లోలిమై నొప్పింపవలసెఁ.
గైక మాటకు నిన్నుఁగాంతారభూమిఁ
బైకొని232యిడుమలఁబఱపఁగావలసె;
హాపుత్త్ర! హా రామ!”యనుచు మూర్ఛిల్లి
భూపాలుఁడెంతయు బోధింపఁ దెలిసి
233వారక పదునాల్గు వత్సరంబులకు
నారంగఁ బరిపూర్ణమగునట్లుగాఁగ
మెచ్చైనతొడవులు మేలివస్త్రములు
నచ్చుగా జానకి కవనీ విభుండు
వలనొప్పఁదెప్పించి వరుస నిప్పింప
వలువలు గట్టి యా వరభూషణములుఁ
దనరంగ జానకి ధరియించె. నంత
ననయంబు మదిలోన హర్ష ముప్పొంగ

  1. (తఱిమి) చేసితి యింక (త)? దయలేక యకట, సేసియు నేల తతిగొనెదకట! (తఱమఁ) జేసియు నేల తండారవైతి
  2. పొదలు
  3. దయమాలిపాప- నుల్లంబులోపల నోర్వంగఁగలనె?
  4. యదయతఁబడ నేఁగుమంటి
  5. ఇటనుండి ‘వారికరంబులు వలనొప్పనూది’ అను ద్విపద పూర్వార్ధమువఱకుఁగల రచనాభాగము ముద్రితాముద్రిత గ్రంథములయందుఁదార్మారుగా నున్నది. కొన్నిట నధికముగను, గొన్నిట న్యూనముగను గూడఁగలదు…
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )